అనాదిగా మహిళలు స్వంత వారితో, సమాజంతో ఎదుర్కొంటున్న సవాళ్ళని, పరిష్కరించిన తీరుకి అద్దం పట్టే పుస్తకమే ఈ “సహజాత”. ఇందులో కధలు కధలు కావు నిత్యం మన చుట్టూ జరిగే జీవితాలనే కధలుగా మలిచారు.
సహజాత
మానసికానుభూతి (ఒక ఆలోచన పట్ల ప్రతికూలత కానీ అనుకూలత గాని కలిగి ఉండటం.) ఈ కధలు చదువుతున్నప్పుడు అన్ని చోట్ల ప్రతికూలత కనిపించిన కూడా పాజిటివ్ దృక్పధాన్ని కలిగి ఉండటాన్ని గమనిస్తాము. మార్గదర్శకత్వం (గైడెన్స్) ఇక్కడ సమస్యలు వాటి పరిష్కారాలని అనుభవాలే గైడ్ చేస్తాయి. మొదటి కధలో వినోదిని అమ్మ ఎలా సమస్యల నుంచి గట్టెక్కింది దాని అనుసారమే కదా వెళ్ళింది.
ఆవేశంలో భర్త భార్యని వద్దు అనుకుంటే అలానే ఒంటరిగా మిగిలిపోవాలా?.,. అమ్మ/అక్కల చెప్పుడు మాటలకి, ఇగోకి పోయి అనిల్ తన భార్యకి ఇడుపు కాయితం ఇవ్వబోతే దోస్తుగాడు చెప్పిన మాటతో మళ్ళీ కలిసిపోతాడు అదే “పరిష్కృత“… ఇగ కంటేనే కన్నా తల్లినా … పెంచిన తల్లికి కూడా మమకారం ఉండకకుండా ఎటుపోతుంది .. జీవితంలో ఢక్కా ముక్కీలు తిన్న దేవుడమ్మకి ముత్యాలు ఇచ్చిన ఆసరా … అనాధలని పెంచుకున్న తీరు నిజంగా హర్షణీయం .. చదువు లేకపోవచ్చు కానీ మమత, సహానుభూతి అయితే ఉంది కదా అది చాలు.
జీవితం అంటే ఏమిటి … కష్టం సుఖం కదా… కానీ అన్నీ కష్టాలే అది కూడా భర్త నుంచి ఎదురు అయితే, రచయత ముసుగులో శాంతి భర్త పెట్టిన హింసకి చివరి వరకు పోరాటం చేసింది. ఆ హింసకి ఆమె abbration (మాములు మానసిక స్థితి కోల్పోవడం) తన స్థితి అస్థిరంగా ఉన్నా కోలుకుంటుంది. శాంతి లాంటి మహిళలు ఎందరో… ముసుగు వేసుకున్న పురుష అహంకారం ఎప్పటికి చావదు (జీవితం అంటే).
ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడు ఆడపిల్ల పుట్టింది అని హింసకి గురిచేస్తే పిల్లల కోసం అయినా ఎటు పోవాలో తెలియక మహి సతమతం అవుతుంటే వంశీ వాళ్ల్లు తీసుకున్న నిర్ణయం ఇప్పటి తరానికి కావాల్సింది. చేజారిన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టేందుకు పడిన కృషికి హ్యాట్సఫ్ (చేజారిన జీవితం).
చదువుకునే వయసులో, ప్రేమలో తొందరపడి కాలు జారితే…? అతను ఆమె వైపు నిలబడకుండా గర్భాన్ని తీసేయమంటాడు… అయినా అతుల్య ఒప్పుకోదు… ఎందుకు తీసేయాలి అంటే పరువు, చదువు కెరీర్ అంటుంది అయినా బిడ్డని హత్య చేసే హక్కు నాకు లేదు అంటూ బిడ్డకి జన్మనిచ్చి సత్యని చక్కగా పెంచుతుంది. ఇప్పటి తరానికి తొందరపాటుని కూడా అవకాశంగా నిలిచి గర్వంగా బిడ్డని నిలబెట్టడం తెలుసు. They do not care about society… ఇది మారుతున్న ఆలోచనకి అద్దం పడుతుంది (My choice)
కొడుకులు కోడళ్ళు అమెరికా నుంచి వచ్చిన ప్రతీసారి తన గదిని ఇవ్వడం… ఆ నాలుగు రోజులు కరుణ వరండాలో పడుకోవడం… కన్న ప్రేమ కదా… అన్నీ చేసినా కూడా వాళ్ళకి అమ్మకి ఒక గది ప్రత్యేకంగా ఇవ్వాలి అనిపించదు… ఇంటిని అమ్మి రంగారావు తన భార్యకి ప్రత్యేకంగా రూమ్ కట్టించడం… గొప్ప విషయము… (అమ్మ గది).
ఎంతమంది బంధువులు ఉంటేÉ ఏమిటి… కొడుకులు, కోడళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా కూతురుకి ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు… వాళ్ళ కొట్లాటలో తన తల్లిని కాపాడుకోలేని వసుధలు ఎంతమందో… (అమ్మ నువ్విక వెళ్ళిపో )…
అనఘ కదా చదువుతున్నప్పుడు ఒక్కసారిగా దుఃఖం తన్నుకొస్తోంది.. కంటికి రెప్పలా కాపు కాయాల్సిన కుటుంబ సభ్యులే, చేయకూడని పనులు చేస్తే ఇంకా దిక్కు ఎవరు?… అసలు బాలికలు, యవ్వనవతులు ఎదుర్కొంటున్న లైంగిక దారుణాలు కుటుంబ వ్యవస్థనే మూలం… (అనఘ)
సహజాతా సంపుటిలో ప్రతి కథని చాలా అంటే చాలా తీరికగా చదవాలి… ఇలా పేజీలు తిరగేస్తూ హడావుడిగా ముగిస్తాను అంటే కుదరదు… ఎందుకు అంటే ప్రతి ¿థ మనసుకి హత్తుకుంటుంది. ఆలోచింపచేస్తుంది. ఇప్పటి సమాజంలో మహిళా తన స్థానం ఏమిటి, పురుషాధిక్యత ఎన్ని రూపాల్లో తనని వెంటాడుతుందో చూడవచ్చు. ఈ సంఘర్షణ ఎప్పటికి వెంటాడుతూనే ఉంటుంది.
ఈ కధల్లో మీకు సామెతలు, సూక్తులు కనిపిస్తాయి… బహుశా కధల్ని సరళత దిశలో తీసుకువెళ్తూ మరింత మందికి చేరవేయడానికి కావొచ్చు… “మనుసులు కలవని చోటు” లో మాటలతో మహిళలని హింసించడం ఎంత దూరం వెళ్తుంది చూపుతుంది… అనుమానం, అసమానతలు, మానసిక హింస వలన ఏకాకిగా మరి ఏమి చేస్తున్నారో తెలియని దిశలో అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికో వెళ్లడం భయానకంగా ఉంటుంది.
సీతామహాలక్ష్మీ కథ పుట్టుకతో తిట్లతో పెరుగుతూ వచ్చిన క్రమంలో ఎదురైనా సన్నిహితుల అత్యాచారాలు ఎలా ఎదురుకోవాల్సి వచ్చిందో స్థితి… తలచుకొంటూ పోతే చాలా దుఃఖం వస్తుంది…
అన్ని కధల కంటే నన్ను బాగా కదిలించిన కథ ఒకటి ఉంది… మనం కోరుకునే సిస్టర్ హుడ్‌కి సజీవ ఉదాహరణ… స్త్రీల మద్య సామరస్యం ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం సాధ్యమే అని చెప్పే కథ “మార్పు అనివార్యం”… శరీరంలో వచ్చే అనుకోని మార్పుల వలన, మనసులో వచ్చే భావనలు, భావోద్వేగాల వలన, ట్రాన్సఉమెన్‌గా మారే పిల్లలని కుటుంబం అర్ధం చేసుకొని కలుపుకుంటే వాళ్ళు వీధిన పడే అవసరం ఉండదు అని సమాజం, కుటుంబం ఎప్పటికి అర్ధం చేసుకుంటాయి?…
ఇంకా చెప్పాలి అంటే సిమిలర్‌గా ఇంకొక కథ కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒక అనాధని ట్రాన్స్‌విమెన్ తెచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తుంది… కానీ తన గుర్తింపుని దాచిపెడుతుంది. తన గుర్తింపు బిడ్డకి సమస్యలు తెచ్చి పెడుతుంది ఏమో అని భాధ పడుతుంది .. కానీ చివరికి భర్త అర్ధం చేసుకోవడంతో సంతోషంగా ముగింపు అవుతుంది. ఇలా అందరూ ఉంటే, దయతో ఆలోచిస్తే ఎంత బాగుంటుంది…
మహిళలు బాలికల నిత్యా జీవితాలలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు ఎంత భయానకంగా ఉంటాయో, వాటి ప్రభావం వారిపై ఎంత దారుణంగా ఉంటుందో. చదువుతున్నప్పుడు కాకుండా నిజంగా మనకి ఎదురు అయితే ఎంత భాదని తీసుకోవాలి. అయితే అంత బాధలో, అంత కష్టంలో కూడా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ పరిస్థితుల నుంచి తేరుకొని తిరిగి యధావిధిగా జీవితాన్ని కొనసాగించే స్ఫూర్తిని కలిగించడం ఈ కథŠల ప్రత్యేకత. స్థూలంగా చెప్పాలి అంటే ఇవి కధలు కావు, నిజజీవిత సంఘర్షణలు.
ప్రతి మహిళకి/బాలికకి ఏదో ఒక సందర్భంలో ఎదురు అయిన సమస్యనే… స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య. ఎవరో ఒకరు వచ్చి పరిష్కరించడం చేయడం కాకుండా, వారికి వారే దారి వెతుక్కోవడం, జీవితం పట్ల ఆశని కోల్పోలేదు అనడానికి నిదర్శనం…
విజయ భండారు గారు ఎన్నో మంచి కథా సంపుటిలని అందించారు. ఇది అందులో
ఉత్తమ సంపుటి అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఇలాంటి ఆలోచింపచేసే కథŠల్ని వెలికితీసి మరింత చైతన్యవంతం చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు.
