ఆ పొద్దు తెల్లవారలేదు…
ముంగిలి
తనకు కల్లాపి చల్లి,
సేదతీర్చే చేతుల కోసం ఎదురు చూసింది.
వాకిలి మట్టి
తెల్లని చుక్కలతో అలంకరించబడే క్షణం కోసం
నిశ్శబ్దంగా నిరీక్షించింది.
పొయ్యిలో నిన్నటి బూడిద
కొత్త మంటగా మారాలని తపించింది.
పొగగొట్టం
తన నోటిని తాకే ఆ వెచ్చని స్పర్శ కోసం ఆశగా చూసింది.
చావిడిలోని పశువులు
తమ వీపును ప్రేమగా నిమిరే
ఆ అరచేతి కోసం గుమ్మం వైపు చూస్తున్నాయి.
చెట్టుకొమ్మలపై పక్షులు
తమకు గింజలు చల్లే
ఆ మమత కోసం వేచిచూశాయి.
పూల మొక్కలు
తమను స్పృశించే వేళ్ళ కోసం
రేకులు విప్పి నిలిచాయి.
బావిలో నీళ్లు
తమను పలకరించే బొక్కెన కోసం
నిశ్చలంగా నిలిచిపోయాయి.
గాలి కూడా
ఆ ఇంటి గుమ్మం దాటేటప్పుడు
ఎందుకో నెమ్మదించింది.
మూసిన తలుపులు
తెరుచుకోలేదు…
ఖాళీ ముంగిట
ఎదురుచూపులా పరుచుకుంది…
ఎప్పటిలాగే
ఆమె వస్తుందని…
ఆ స్పర్శ మళ్లీ తమను తాకుతుందని…
ఆ స్వరం మళ్లీ వినిపిస్తుందని…
ప్రకృతిలోని ప్రతి అణువూ ఎదురు చూసింది.
కానీ…
ఆమె రాలేదు.
ఎందుకంటే…
ఈసారి ఆమె అడుగులు ఆ గుమ్మం వైపు తిరిగి రాలేదు.
అందుకే
ముంగిలి వెలితైంది…
పొయ్యి మౌనమైంది…
పక్షుల పాట ఆగిపోయింది…
కానీ…
ఆమె ఎక్కడికీ వెళ్లిపోలేదు.
కల్లాపి చల్లిన ఆ నేలలో…
ముగ్గులు దిద్దిన ఆ వాకిలిలో
పశువులను నిమిరిన ఆ మమతలో ఇప్పటికి దాగి ఉంది.
అందుకే ఆ రోజు ఒక మనిషి వెళ్ళిపోలేదు..
ఒక ఋతువు ముగిసిపోయింది.
