ఇక అంతా విశ్రాంతే అభినందనలు
అన్నారు మిత్రులు
నలభై ఏళ్ల ఉద్యోగ జీవితానికి గౌరవంగా
వీడ్కోలు పలికారు
పూలదండలు..శాలువాలు..ప్రశంసల వర్షం
ముగిసి ఇంటికి వచ్చాను.
ఎప్పటి చిప్ప యెనుగులనే..!
చింపిరి జుట్టుతో చిందర వందరైన ఇల్లు నా కోసం
అసహనంగా ఎదిరి చూస్తుంది.
పొయ్యిల పిల్లి బద్ధకంగా కళ్ళు మూసుకొని
ముడుచుకుంది..
నా రిటైర్మెంట్..
ఉద్యోగం నుంచి మాత్రమేననీ,
ఇంటిచాకిరీ వంటా నా నెత్తినేనని ఎరుక
చెరిగి పోలేదు…!
నేనిక 24/7 ఇంటిపట్టునే..
విలువా వెలా లేని గానుగెద్దు నౌకరీ..
చెమట కాలువలతో నీరసించి
రోజులు వెళ్ళదీస్తున్న
మధుమేహం రక్తపోటు
పిలవకుండానే దేహంలోకి వచ్చిన అతిథులు..
మానసిక శారీరక..
అలసటలు మహిళలకెందుకు ఉండవనుకుంటరో
మహానుభావులు..!?
వాలు కుర్చీలో కాలు మీద కాలేసుకుని,
తిప్పిన పేపరే తిప్పేస్తూ.. చాయ్ చప్పరిస్తూ
పాత మిత్రులతో నిరంతర బాతఖానీ
స్త్రీల కెందుకు లేదో ఆ యోగం..!
ఒకప్పుడు..
వందల మంది పిల్లల భవిష్యత్తును
అక్షరాలతో తీర్చిదిద్దిన చేతులు.
ఇప్పుడు గిన్నెలు తోముతూ..
ఇంటిని దిద్దుతూ అరిగిన వేళ్ళతో పొగసూరినై ..
అప్పుడు..
బస్సు ప్రయాణాల్లోనన్నా నాలోకి నేను వెళ్ళేది,
నన్ను నేను నిలబెట్టుకునేది
నా కలం లోంచి నాలుగు కవితాక్షరాలను
పూయించేది.!
ఇప్పుడు నీకేం పని !?
అంతా తీరికే అంటారు.. కానీ,
ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో ఊపిరి సలపని చాకిరీ
జీతభత్యాల మాట అంటుంచితే..
గడియ తీరిక గవ్వ గౌరవం లేని బతుకు !
రిటైర్మెంట్ అంటే..
జీతానికి మాత్రమే గానీ,
జీవితానికి కాదని తెలుసుకున్నాను..!
ఇంటిని మోసిన స్త్రీ చేతుల శ్రమకు
విశ్రాంతి దొరికే
కుటుంబ సంస్కృతి మారిన రోజే
ఉద్యోగ విరమణ పర్వదినం.!
