ఆత్మగౌరవమే తత్వశాస్త్రానికి పునాదిగా! – కేశవకుమార్

ఈ రోజు అణచివేయబడిన జాతులు, దళితులు, స్త్రీలు, చిన్న ప్రజా సమూహాలు, అన్నిటికన్నా ఆత్మగౌరవమే ముఖ్యమంటూ ముందుకొచ్చాయి. ఆత్మగౌరవమంటే ఆధిపత్యాన్ని సహించలేనితనం. అణిచివేతని అడ్డుకోవటం. అమానవీయాన్ని కడిగెయ్యటం. అన్యాయాన్ని ప్రశ్నించడం. బానిసత్వం మీద బలహీనులు ఎగరేసిన జెండా. అది స్వేచ్ఛ కోసం జరిపే పోరాటం. సూటిగా చెప్పాలంటే నిండు మనిషిగా ధైర్యంగా తలెత్తుకుని నిలబడటం.

చరిత్ర నిండా అదిమిపెట్టి ఆపలేని ఈ ఆత్మగౌరవ గొంతుకలేన్నో. మనకు తెలియని ఆత్మతర్పణలింకెన్నో. గులాంగిరి (బానిసత్వం)పైన తిరుగుబాటుగా జ్యోతిభా ఫూలే, మానవీయ హోదా (మానుస్కి) కోసం అంబేద్కర్ పోరాటం, సుయం మర్యాదనే (ఆత్మగౌర్వమే) అసలైన విముక్తి రాజకీయంగా రామస్వామి పెరియార్ లాంటి అబ్రాహ్మణ తాత్విక నాయకులు ఆత్మగౌరవానికి/ స్వాభిమానానికి సైద్ధాంతిక భూమికని అందించడమే గాక, ఆ ఆలోచనని పరిపుష్టం చేయడం కోసం అనేక పోరాటాలు జరిపారు. 1925లో రామస్వామి పెరియార్ ప్రారంభించిన ఆత్మగౌరవ పోరాటం నూరేళ్ళ పండుగ జరుపుకుంటూ , మార్పును కోరుకునే రాజకీయంగా, ప్రత్యామ్నాయ తాత్విక ఆలోచనగా నేటికీ ఎంతో ప్రభావవంతంగా నిలిచింది. ఈ సందర్భంలో ఆత్మగౌరవం/స్వాభిమానం అనే ఆలోచన సామాజిక రాజనైతిక శాస్త్రంలో (సోషల్ పొలిటికల్ ఫిలాసఫీ) తాత్వీకరించిన వైనం, నేడు దాని అవసరాన్ని చెప్పటమే గాక, తత్వ శాస్త్రానికి ఆత్మగౌరవం అనే నైతిక రాజకీయ విలువ ప్రాథమిక మూలసూత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయ తాత్విక ఆలోచనల్ని ప్రజాస్వామీకరించే దిశలో ఈ మేధావులు అందించిన సైద్ధాంతిక భూమికను మననం చేసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా గమనించినట్లయితే మనిషి మనుగడ కోసం, మంచి సమాజం కోసం అనేక పోరాటాలు చేయడం చూసాం. రాజకీయ సమానత్వం కోసం ఫ్రెంచి విప్లవం, సమసమాజం కోసం బోల్షెవిక్ విప్లవం, వలసపాలనకి వ్యతిరేకంగా జాతీయ పోరాటాలు కొత్త వెలుగుని, కొత్త విలువలను ప్రకాశింపచేశాయి. ఆ తర్వాత కాలంలో వచ్చిన శ్వేత జాత్యహంకారానికి వ్యతిరేకంగా వచ్చిన నల్ల జాతీయుల పోరాటం, పితృస్వామ్యం మీద విరుచుకుపడిన ఫెమినిస్ట్ ఉద్యమాలు అటు రాజకీయ సమానత్వాన్ని చెప్పే ఉదారవాదానికి, ఇటు ఆర్థిక సమానత్వం కోసం పోరాడే మార్క్సిస్టు భావజాలానికి భిన్నమైన ఆత్మగౌరవ పోరాటాలుగా, అస్తిత్వ ఉద్యమాలుగా మన ముందుకు తీసుకొచ్చారు. మానవ మనుగడని ఎత్తిపడుతూ, ఆత్మగౌరవానికి మరింత బలమైన తాత్విక పునాదిని అందించడమే గాక, కొత్త అకడమిక్ సూత్రీకరణలు అందించాయి.
మన దేశంలో అది నుంచి బ్రాహ్మణీయ భావధారకు, హిందూ సామాజిక ఆధిపత్యానికి, కుల వ్యవస్థకి, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో ప్రత్యామ్నాయంగా ఉండే ప్రజాస్వామికమైన మానవీయ ఉద్యమాలు జరిగాయి. ఈ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పోరాటాలన్నింటా, అంతర్లీనంగా బానిసత్వాన్ని, వివక్షతను, వ్యతిరేకిస్తూ సమానత్వాన్ని, మనిషితనాన్ని ఎత్తిపట్టే భావన ప్రధానంగా ఉండటం గమనించవచ్చు.
అయితే జాత్యహంకారంపైన పోరాటం చేసే నల్ల జాతీయుల ఉద్యమాలు, ఫెమినిస్ట్ ఉద్యమాలు, కుల వ్యతిరేక ఉద్యమాలు స్వేచ్ఛ, సమానత్వం, సమసంజాన్ని కోరుకోవటమే కాకుండా ఆత్మగౌరవాన్ని, గుర్తింపుని అంతే ప్రత్యేకంగా కోరుకున్నాయి. అందుకు పోరాటాలు జరిపినయి. వనరుల వాటాతో బాటుగా, ఆత్మగౌరవం కూడా తమ రాజకీయ ఎజెండాలో భాగంగా చేసుకున్నాయి. హ్యూమన్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి విముక్తి రాజకీయాలకి, తాత్వికత కి మూల సూత్రాలుగా గుర్తించాయి. మిగిలిన విలువలు వీటికి అనుసంధానంగా ఉన్నాయి.
ఆత్మ గౌరవం ఒక గొప్ప మానవీయ విలువ. ఒక అర్థవంతమైన జీవనానికి, మనిషి వికాసానికి దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆత్మగౌరవం అనేది మనిషి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది సమాజ నీతికి సంబంధించిన విషయంగా తత్వవేత్తలు గుర్తించారు. ఆత్మ గౌరవాన్ని (self respect) హుందాతనం (a sense of dignity), ఉదాత్తత (magnanimity), సముచిత అభిమానం (proper pride), ఆత్మ విశ్వాసం/మన్నన (self esteem) వంటి పర్యాయ పదాలుగాను, సందర్భోచితంగా ఉదహరించడం చూస్తాం.
గౌరవం (respect), గౌరవ ప్రతిష్ట (honor), మన్నన (esteem), మరియు గౌరవ భావం (regard) — ఇవన్నీ “విలువ/యోగ్యత” (worth) అనే సామాన్య అంశంతో అనుసంధానమై ఉంటాయి. గౌరవ భావం (regard) అనేది ఒక వ్యక్తి యొక్క విలువను గుర్తించడం; మన్నన (esteem) అనేది ఆ విలువను అంచనా వేయడం; గౌరవ ప్రతిష్ట (honor) అనేది అత్యుత్తమ విలువకు ఇచ్చే ప్రతిఫలంగా చూడొచ్చు.
ప్రతి మనిషికీ విలువ/యోగ్యతా గుణం ఉన్నదనే భావం (sense of worth) ఆధునిక స్వీయ గౌరవం (self respect) గురించి జరిగే చర్చలలో ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. నిజానికి, అది స్వీయ గౌరవానికి సంపూర్ణతని, బలాన్నదించే విషయం. లాటిన్‌లో ‘వర్త’ (worth) అనే పదానికీ డిగ్నిటీ అనే అర్ధం ఉంది. దీనికి వ్యతిరేక పదాలుగా వర్త్లెస్నెస్, ఇండిగ్నిటీ, ఇగ్నోమినీ, హ్యూమిలేషన్‌గా ఉన్నాయి.
హక్కులు, న్యాయం, సమానత్వం, మానవ ప్రవర్తన, నిజాయితీ, మానవ వ్యక్తిత్వం, సుగుణ ధర్మం, నైతిక వికాసం, వ్యక్తి స్వయంప్రతిపత్తి, ఐడెంటిటీ లాంటి విషయాలకి సంబంధించిన వేర్వేరు సందర్భాల్లో సైద్ధాంతిక చర్చల్లో ఆత్మ గౌరవం/డిగ్నిటీ ప్రధాన భావనగా ఉంది. అకడమిక్ చర్చల బయట నేటి స్త్రీవాద, జాత్యహంకార వ్యతిరేక ఉద్యమాలు, కుల వ్యతిరేక దళిత ఉద్యమాల్లో ఆత్మగౌరవం అనే మాట బలంగా వినిపించడం చూస్తున్నాం. తోటి మనిషిని గౌరవించాలని అందరూ గుర్తించినా, ఏ ప్రాతిపదికన అనే దాని విషయంలో ఏకాభిప్రాయం లేదని గమనించిన రాబిన్ డిల్లాన్ అనే తత్వవేత్త తన ‘డిగ్నిటీ, కారెక్టర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట’ పుస్తకంలో ఆత్మగౌరవం అన్నది అనేక నైతిక విషయాల చర్చలతో ప్రధానంగా ముడిపడి ఉండటం వల్ల దీనిని ప్రత్యేకంగాను, నిర్ధిష్టంగానూ నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని చెబుతుంది.
ఎన్లైటెన్మెంట్ (enlightment) ఆలోచనకి, ఆధునికతకి ప్రాణం పోసిన ఇమ్మాన్యుయేల్ కాంట్ అనే తత్వవేత్త రెండున్నర శతాబ్దాల క్రితం మానవ హుందాతనాన్ని (హ్యూమన్ డిగ్నిటీని) మొదటగా నైతిక తత్వశాస్త్రంలో ప్రధానమైన అంశంగా పరిగణించిడం జరిగింది. మనిషి వివేకవంతుడు కనుక నైతిక నిబద్ధత అనేది సార్వజనిక ఆలోచనగా వుండే విధాన్ని చెబుతాడు. సమకాలీన సమాజంలో కూడా ఇతని అభిప్రాయాన్ని ఒక ముఖ్య నైతిక సూత్రంగా గుర్తించబడింది. హ్యూమన్ డిగ్నిటీ అంటే మానవ గౌరవం, మానవ మర్యాద, మానవ హుందాతనం అనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.
మనిషి అంటేనే ఒక మౌలికం, ప్రత్యేకమైన, అంతర్లీనంగా మనిషిగా వుండటంవల్ల ఉండే విలువ. అది ఇచ్చిపుచ్చుకునే విలువ కాదు. మనిషే ఒక లక్ష్యం, మనిషిని ఒక సాధనంగానో, లక్ష్యాన్ని చేరుకొనే మార్గంగా చూడకూడదు. మనిషి వివేకవంతమైన జీవి (rational being) కనుక, అది సర్వజనీయమైన విలువ కనుక హ్యూమన్ డిగ్నిటీ కూడా సర్వజనీయ విలువగా చూడాలని కాంట్ భావన. కాంట్ ఆలోచనలతో ప్రభావితుడైన నేటితరం ఉదారవాద సిద్దాంత కర్త జాన్ రాల్స్ తన ‘థియరీ ఆఫ్ జస్టిస’ అనే గ్రంథంలో ఆత్మ గౌరవ దృష్టి నుంచి న్యాయ పరంగా సామాజిక వ్యవస్థలను నిర్ధారించే క్రమంలో సామాజికంగా ఉన్న అసమానతలు, అణిచివేతలు ఆత్మగౌరవానికి అడ్డంకిగా వున్న విధానాన్ని విశదీకరిస్తూ, సామాజిక న్యాయం అవసరాన్ని చెబుతాడు.
హ్యూమన్ డిగ్నిటీ/ సెల్ఫ్ రెస్పెక్ట్ మానవ సమానత్వం కోరుకున్నదే గాక, ప్రతి మనిషిని కులం, మతం, లింగం, సంస్కృతి, దేశం లాంటి భేదం లేకుండా అందర్నీ గౌరవించాలనే నైతిక ధర్మం కూడా. అన్ని మానవ హక్కులకీ హ్యూమన్ డిగ్నిటీ ప్రాథమికమైన నైతిక రాజకీయ విలువ కూడా.
ఆత్మ గౌరవం అనేది వ్యక్తికి పరిమితమైంది కాదు. అది తన చుట్టూ ఉండే ఇతరులతో ముడిపడి వుంటుంది. అలా ఆత్మగౌరవం పూర్తిగా సామాజికమైనది. సామాజిక వ్యవస్థలతో పెనవేసుకుపోయినది. మానవీయ సంబంధాల్లో, సామాజిక వ్యవస్థల్లో ఉన్న అసమానతలను, వివక్షని, అన్యాయాన్ని, అమానవీయాన్ని ప్రశ్నించే రాజకీయం కూడా. ఆత్మగౌరవం బానిస వ్యవస్థ మీద, భిన్న రూపాల్లో ఉండే అణిచివేతని ప్రతిఘటిస్తూ విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం చేసే పోరాటం కూడా.
థామస్ హిల్స్ జూనియర్ జాతి వివక్షతకు సంబంచిన సందర్భంలో, బానిసత్వానికి ఆత్మ గౌరవానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఉదాహరణలతో విశ్లేషిస్తాడు.
కొందరు తన పుట్టుక, తన బతుకు, తన లేనితనం కారణం అనుకుంటూ, తనని కించపరుస్తూ, అవమినించే వాళ్ళని తప్పు పట్టకపోగా, తనని ఇతరులు గుర్తించే స్థాయికి ఎదగాలి అని సర్ది చెప్పుకుపోతాడు. ఇతరుల నుండి సానుభూతి కోసం ప్రయత్నిస్తాడు తప్ప, సెల్ఫ్ రెస్పెక్ట్ డిమాండ్ చేయడు. మరి కొన్నిసార్లు ఇతరుల ఇష్టాలను తమ ఇష్టాలుగా చేసుకుని ప్రేమతోనో, యజమానికో, భర్తకో లొంగివుండటం. తమ ఇష్టాలను అంతగా ప్రాధాన్యత లేని విషయాలుగా భావించడం. ఈ రెండిట్లోనూ ఒక రకమైన బానిసత్వం ఉండనే వుంటుంది అంటాడు. ఇతరులు తనపట్ల తప్పుగా ప్రవర్తించినా ఏమీ మాట్లాడకుండా కూర్చోవటం, మాట్లాడినా తన మాటకి పెద్ద విలువుండదు అనుకోవటం. ఇక్కడ సమస్య అమానవీయ వ్యవస్థీకృత సమాజం కన్నా, వ్యక్తిగా తను ఏమీ చేయలేనని అనుకోవడం. బానిసత్వంలో బతకటమంటే కొన్ని ప్రాపంచిక సామాజిక కట్టుబాట్లకు, నమ్మకాలకి తలొగ్గి బతకటం. మనిషితనాన్ని చంపుకుని అచేతనులుగా మిగిలిపోవడం. మనిషి లొంగుబాటు తనం ఇతరులు మరింతగా దోపిడీ చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. చివరికి అతని/ఆమె బతుకే దుర్భరంగా తయారవుతుంది. బానిసగా ఉన్న మనిషి తన నైతిక స్థితిని మరిచి, బానిసత్వంలో కూడా ఏదో సుఖాన్ని వెతుక్కోవడం నైతికంగా సరైనది కాదు. నైతిక సమాజం మనిషిగా హుందాగా, గౌరవంగా బతకాలనే ఊహని రాజేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా మానవ చరిత్రలో ఆత్మగౌవరం కోసం, మంచి జీవితం కోసం, స్వేచ్ఛ, సమానత్వం కోసం అనేక రూపాల్లో పోరాటాలు చూసాం. అందుకు అనేక మంది ఆత్మతర్పరణలను కూడా చూసాం. కులం, వర్గం, జెండర్ పరంగా బానిసత్వంలో బతుకులీడ్చిన భారతీయ సమాజంలో అధిత్యానికీ, వివక్షతకి, అసమానతకి, అణిచివేతకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా కుల వివక్షతకు, దోపిడీకి వ్యతిరేకంగా చరిత్ర పొడుగునా మేధోపరంగా, సామాజిక, రాజకీయ పరంగా అనేక ఉద్యమాలు జరిగాయి. వలస కాలంలో జ్యోతిబాఫూలే, అయితీతాస్, అంబేద్కర్, పెరియార్ బ్రాహ్మణీయ కులాధిపత్యానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించడమే గాక, తమదైన సైద్ధాంతిక భూమికని అందించారు.
చారిత్రకంగా భారతీయ కుల సమాజంలో కులాలకి, మతాలకి అతీతంగా మనిషిని మనిషిగా గుర్తించాలని తాత్వికంగా, క్రింది కులాల భక్తి ప్రబోధనలలో మేధోపరమైన సంఘర్షణ జరిగింది. మనిషిని కించపరిచే బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. వలసవాద కాలంలో మరింత నిర్ధిష్ట రూపం తీసుకున్నాయి. మనిషిగా, పౌరుడిగా గుర్తింపు కోరుతూ, చదువు, ఉపాధి, బతికేందుకు మౌలిక వనరుల కోసం, అటు ప్రభుత్వంతోనూ, ఇటు ఆధిపత్య సమాజంతోనూ తలపడటం జరిగింది. సూక్ష్మంగా ఇది అంటారనితనానికి, సామాజిక బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగింది. దేశంలో మెజారిటీగా ఉన్న శూద్రులు, అతిశూద్రులు, స్త్రీలు బానిసత్వంలో మగ్గటానికి బ్రాహ్మణీయ ఆధిపత్యం ప్రధాన కారణమని జోతిభాఫూలే తన గులాంగిరి రచనలో చెబుతారు. అమెరికాలో నల్లజాతీయులు శ్వేత జాత్యహంకారానికి వ్యతిరేకంగా పౌరహక్కుల కోసం జరిగిన స్ఫూర్తితో, థామస్ పైన్ ‘రైట్స్ ఆఫ్ మ్యాన’ రచన ప్రేరణతో ఇక్కడ కులాధిపత్యానికి వ్యతిరేకంగా మానవహక్కుల కోసం సామాజిక విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించేడు. సామాజికంగానూ, ఆర్థికంగానూ, విద్యారంగంలోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ బలీయమైన శక్తిగా ఉండి తమ ఆధిపత్యాన్ని చెలాయించడం, అందుకుతోడు బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తూ తమని ఇతరులు ప్రశ్నించలేని అధికారాన్ని ఏర్పరుచుకున్నారు. ఫూలే అప్పటి సమాజంలో పాతుకుపోయిన బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, భావజాల మూలాల్ని ప్రశ్నిస్తాడు. కట్టు కథలు, పురాణాలు ద్వారా ఏర్పరుచుకున్న మతాధిపత్యాన్ని చీల్చి చెండాడుతాడు. ధర్మాన్ని నిలబెట్టేందుకు విష్ణువు అనేక అవతారాల్లో దర్శనమిచ్చాడు అనే పురాణ కట్టు కథ ఈ దేశంలో ఉన్న మూలవాసులను అసురులుగా, రాక్షసులుగా ముద్రవేసి వాళ్ల మీద వేర్వేరు సందర్భాల్లో జరిగిన దాడుల కొనసాగింపుగా ఈ అవతారాలు ప్రతీకాత్మకంగా ఉన్నాయని వివరిస్తాడు. చారిత్రక దృక్పథంతో వ్యాఖ్యానిస్తూ, ఈ అవతార రాజకీయాల్ని, మిథ్స్‌ని బాధిత దేశీయుల దృక్కోణం నుంచి విశ్లేషిస్తాడు.
బ్రిటీష్ వలస కాలంలో విద్య, ఉద్యోగాల్లో బ్రాహ్మణీయ వర్గాలు మరింతగా ఎదిగి, ప్రభుత్వ యంత్రాంగంలో కూడా చెక్కు చెదరని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ, శూద్ర, అతిశూద్ర కులాల్ని ఎదగనీయకుండా ఉన్న స్థితికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశాడు. వాళ్ళు చదువుకునే హక్కు కోసం, గౌరవప్రదంగా జీవించే బతుకు కోసం గొంతెత్తాడు. ప్రపంచ నాగరికతల్ని చదివిన అంబేద్కర్, అంటరానితనాన్ని, వివక్షతని అడుగడుగునా అనుభవించినవాడుగా కులం యొక్క బహుముఖ కోణాల్ని తెలియపరుస్తాడు. ఈ కులానికి, సామాజిక అసమానతలకు, మతానికి, అధికారానికి, రాజకీయానికి ఉన్న సంబంధాన్ని గుర్తెరిగి అనేక రచనలతో, ఉద్యమాలతో ఎగిసిపడిన ఆత్మగౌరవ ప్రతీకగా అంబేద్కర్ అవతరించాడు. ఆత్మగౌరవం అనే భావన పరిపూర్ణ మానవుడిగా ఎదిగే వ్యక్తిత్వంతో ముడిపడి వుందని, ఈ బ్రాహ్మణీయ సమాజం బానిసత్వం కన్నా క్రూరమైన కులాధిపత్యంతో ఈ దేశ ప్రజల్ని అవ్యక్తులుగా, అంటరాని వాళ్ళుగా, అజ్ఞానులుగా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా తెలుసుకోలేనివాళ్లుగా, తెలుసుకున్నా తిరగబడలేని శక్తిహీనులుగా ఈ బ్రాహ్మణీయ చట్రంలో బంధించిందని గుర్తిస్తాడు. మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకునేందుకు సామాజిక సహజీవనంతో బాటుగా, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించాలని తెగేసి చెబుతాడు. రాజకీయ, ఆర్థిక విప్లవాలతో బాటుగా, అంతకన్నా ముందుగా కులనిర్మూలన ఎజెండాగా సాగే సామాజిక విప్లవం ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా ఉండాలని చెప్పేడు. ఆ విధంగా నీటి కోసం, ఓటు కోసం, చదువు కోసం, ఉపాధి కోసం, గౌరవ జీవితం కోసం, అధికార ప్రాతినిధ్యం కోసం విశ్రమించని సామాజిక విప్లవ పోరాటం చేసి ప్రపంచ చరిత్రలో మనిషి ఔన్నత్యాన్ని నిలిపిన పోరాట యోధుడిగా, మేధావిగా నిలబడ్డాడు. ఇటువంటి సందర్భంలోనే ఆత్మగౌరవ ఉద్యమమే ప్రధాన లక్ష్యంగా రామస్వామి పెరియార్ తన జీవితాన్ని గడిపాడు. స్వాభిమానానికి/ ఆత్మ గౌరవానికీ చిరునామాగా పెరియార్ నిలిచాడు. మనిషి ఆత్మగౌరవం అన్ని ఉద్యమాలకీ ప్రాథమికంగాను, ఆయువుపట్టుగానూ ఉంటుందని నమ్మేడు. ఆ దిశగా హేతుబద్ధతతో కూడిన సామాజిక నీతిని, ఆధునికతని కోరుకుంటూ అందుకు అడ్డుగా ఉన్న మూఢ నమ్మకాల్ని, మత భావనల్ని చీల్చి చెండాడుతాడు.
1925లో ఈ ఆత్మగౌరవ పోరాటానికి పెరియార్ నాంది పలికాడు. ఇప్పటికి వంద ఏళ్ళు నిండాయి. భారతీయ సమాజంలో దీనికి ఇప్పటికీ ప్రసంగీకత ఉండటమే గాక, మన తత్వశాస్తానికీ, రాజకీయ విముక్తి ఉద్యమాలకీ కేంద్రకంగా ఉంటూ సమాసమాజానికి దిశా నిర్దేశం చేసేదిగా ఉంది. మరో విధంగా మౌళికంగా అన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక ఉద్యమాల కన్నా ముందు ఆత్మగౌరవ పోరాటం అవసరాన్ని గుర్తు చేస్తుంది.
పెరియార్ దృష్టిలో మానవ చర్యలు హేతు నిర్దేశంగా ఉండాలని, ఆత్మ గౌరవం ఒక స్వేచ్ఛా స్థితి అని, మరో మాటలో, వివేచన ఆధారంగా మనుషుల ఆలోచనలను, చర్యలను గౌరవించడమే స్వేచ్ఛ అని భావిస్తాడు. జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని స్వాతంత్ర పోరాటం ప్రధానంగా రాజకీయ స్వేచ్ఛ మీద కేంద్రీకృతమైతే, అంబేద్కర్ లాంటి వాళ్ళు రాజకీయ స్వేచ్ఛ కన్నా ముందు సామాజిక స్వేచ్ఛ అవసరం గురించి మాట్లాడితే, ఆ ఆలోచనని మరికాస్త ముందుకు తీసుకెళ్ళిన పెరియార్ అన్నింటికన్నా ముందు వ్యక్తి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అత్యంత అవసరంగా చెబుతాడు. ఆత్మ గౌరవం అన్నది ఒకవిధంగా వ్యక్తి స్వేచ్ఛ. ఇటువంటి స్వేచ్ఛ గాంధీ కోరుకున్న హిందూ మత, సనాతన సంప్రదాయాల పునరుద్ధరణని స్వేచ్ఛగా చెప్పటానికి భిన్నమైనది.
ఆత్మగౌరవం జీవితమంత విలువైనది. తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదిస్తే, పెరియార్ సురాజ్యం గురించి నొక్కి చెబుతూ, ఆత్మగౌరవం మనిషి జన్మ హక్కు అంటాడు. పెరియార్ ఆత్మ గౌరవ సిద్ధాంతం సమానత్వం, సహజీవనంతో ముడిపడి ఉంటుంది. ప్రజల మధ్య ఎటువంటి అసమానతలు ఉండకూడదని, ఆర్థికంగా పేద, ఉన్నత భేదాలు లేకుండా, భూమి, వనరులు అందరికి చెందినదిగా ఉండాలని, స్త్రీ పురుషుల మధ్య ఎటు వంటి వివక్షత, తారతమ్యాలు లేకుండా సమానంగా చూడగలగాలని, కులం, మతం, వర్ణం, దేశం, దేవుడు లాంటి భావోద్వేగ సంబంధాల నుండి సమాజం విముక్తమై, వాటి స్థానంలో ప్రపంచంలో ప్రజల మధ్య స్నేహం, ఐక్యత వెల్లివిరియాలని, యజమాని మరియు కార్మికుడు అనే విభజన ఉండకూడదు. అందరూ సమానంగా అందరి అవసరాల కోసం పనిచేయాలి; అలాగే అందరూ సమానంగా లాభాలను పొందాలని, ప్రతి మనిషి తన ఆలోచన, అవగాహన, ఆకాంక్ష మరియు దృక్పథం ప్రకారం స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు కలిగి ఉండాలి; ఏ విధంగానైనా, ఎలాంటి రూపంలోనైనా బానిసత్వానికి లోబడి ఉండకూడదు.
ధర్మం, కర్మ లాంటి నమ్మకాల నుండి విముక్తుడై మనిషి స్వయం శక్తి మీద నమ్మకం ఉంచుకోవాలి. మనుధర్మాన్ని నిరసిస్తూ మానవ ధర్మాన్ని ఎత్తిపట్టేడు. మానవత్వాన్ని ప్రకృతితో సౌహార్ధంగా ఉండే నైతిక దృక్పథంగా భావించేడు. ఇది హేతుబద్ధత, సమత్వం, సమధర్మం (సామ్యవాదం), మరియు స్వాతంత్య్రం వంటి సూత్రాల ఇరుసు మీద నిలబడి ఉంది.
పెరియార్ ఉద్యమం ప్రధాన లక్ష్యం మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు మరియు అవివేకపూరిత ఆచారాలను తొలగించడం. కుల వ్యవస్థకి, వర్ణాశ్రమ ధర్మానికి, వ్యతిరేకంగా, గాంధీ నిర్మాణాత్మక కార్యక్రమం (constructive programme) కి భిన్నంగా గ్రామ పునర్నిర్మాణం (విలేజ్ రికన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్) చేయడం. కాంగ్రెస్ నుండి, గాంధేయ వాదం నుండి విడిపోయి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం లోనూ, జస్టిస్ పార్టీలో కీలకంగా ఉండి, ఆ తర్వాత పూర్తిగా స్వాభిమాన ఉద్యమానికి (సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్) అంకితమయ్యాడు.
పెరియార్ దృష్టిలో స్వాభిమానం అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకి పునాదిగా పనిచేస్తుంది. అర్థవంతమైన ఏ తాత్విక చర్చయినా స్వాభిమానంతోనే మొదలవ్వాలి అంటాడు. స్వాభిమానం సామాజిక, రాజకీయ ఉద్యమాలకే కాకుండా, తాత్విక ఆలోచనకూ కేంద్ర సూత్రంగా వుంటుంది. భారతీయ సామాజిక రాజకీయ నీతి శాస్త్రానికి స్వాభిమానం ప్రాథమిక ఆలోచనగా, ప్రత్యామ్నాయ ఉద్యమాలకి వెన్నుదన్నుగా పనిచేస్తుంది. స్వాభిమానం అనే భావన మనిషి ఉనికి మొదలైనప్పటి నుంచే ఉంది. కాంట్ గౌరవం గురించి విశ్వవ్యాప్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికీ, అది సూత్రప్రాయంగా, అమూర్తంగా ఉంది. అది సామాజిక అసమానతలను పూర్తిగా వివరించలేకపోతుంది. పెరియార్ స్వాభిమానాన్ని కేవలం తార్కికతపై ఆధారపడిన నైతిక కర్తవ్యంగా మాత్రమే కాకుండా, ఆధిపత్య కులవ్యవస్థ మరియు బ్రాహ్మణిజం వల్ల నిరాకరించబడిన మానవ గౌరవాన్ని తిరిగి సాధించేందుకు జరిగే సామాజిక-రాజకీయ పోరాటంగా పునర్నిర్వచిస్తాడు. స్వాభిమానం కోసం సమాజంలో వ్యవస్థీకృతంగా ఉన్న ఆధిపత్య భావాల్ని అధిగమించాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా చెబుతూ, ప్రధానంగా కుల నిర్మూలనతో స్వాభిమానం ముడిపడి ఉన్న విషయాన్ని మనకు గుర్తు చేస్తాడు. పెరియార్ స్వాభిమాన తాత్వికతకి “ఎవరూ తనకంటే తక్కువ కాదు; అలాగే ఎవరూ తనకంటే ఎక్కువ కాదు.” అనే మార్గదర్శక సూత్రంగా పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా, సమానంగా జీవించడానికి అర్హుడనే భావనను ఇది బలపరుస్తుంది.
సమానత్వం ఉన్నచోటే స్వాభిమానం ఉండగలదు. అది లేని చోట సమాజం క్రూరత్వ స్థితిలో ఉంటుంది. కాబట్టి, స్వాభిమానం కేవలం నైతిక భావం మాత్రమే కాదు. సమ న్యాయం మరియు మానవ గౌరవానికి ఎంతగా కట్టుబడి ఉందో అంచనా వేసే ప్రమాణంగా కూడా అవతరిస్తుంది. పెరియార్ స్వాభిమానం సిద్ధాంతాన్ని తార్కికత, సమానత్వం, స్వేచ్ఛ, నైతికత, సామాజిక మార్పు, విముక్తి వంటి మూల సూత్రాలపై నిర్మించాడు. ఆయన దృష్టిలో, స్వాభిమానం ఒక విముక్తికర నైతిక ప్రమాణంగా పనిచేస్తుంది. బానిసత్వం, ఆధీనత, వివక్ష, అవమానము, అణచివేత, మనిషిగా గుర్తించకపోవడం వంటి అన్ని రకాల అన్యాయాల నుండి విముక్తి చేయడం అంతిమ లక్ష్యంగా పనిచేస్తుంది.
పెరియార్ భావజాలం సాంస్కృతికంగా, మేధా పరంగా, సామాజికంగా, రాజకీయంగా ఇలా అనేక రూపాల్లో తన ప్రభావాన్ని చూపించింది. ఒక కొత్త ప్రాపంచిక దృక్పథాన్ని పరిచయం చేసి సమాజిక మార్పు కి పునాది వేసి, కొత్త సమాజాన్ని ప్రమాణం చేసింది. అలోసియస్ ‘పెరియార్ మరియు ఆధునిక అనే వ్యాసంలో, పెరియార్ స్వాభిమానం ఒక విప్లవాత్మకమైన, ప్రగతిశీల భావనగా తార్కికతకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త జ్ఞానదృష్టిపై ఆధారపడింది అంటాడు. ఇది ప్రజా ప్రవర్తనను పునర్నిర్మించడంలోను, సామాజిక జీవితాన్ని లౌకికీకరించడంలోను మార్పును కలిగించే శక్తిని కలిగి ఉంది. ఈ అర్థంలో, పెరియార్ స్వాభిమానం భావనను కాంట్ ఎన్‌లైటెన్‌మెంట్ భావన-మనిషి తన ఆధీనస్థితి (tutelage) నుండి బయటపడటంతో అనుసంధానిస్తూ సరికొత్త విశ్లేషణ చేస్తాడు.
అంతే కాకుండ, సెల్ఫ్-రెస్పెక్ట్ ఉద్యమం ఆధునికత యొక్క నైతిక సారాన్ని ప్రతిబింబిస్తూ, వలస పాలనలో బలపడిన మరియు జాతీయవాద వాదనల్లో న్యాయబద్ధత పొందిన బ్రాహ్మణిక ప్రతి ఆధునికతపై గట్టి విమర్శను కూడా అందిస్తుంది అంటాడు. హిందూ లేదా హిందుత్వ జాతీయవాద రూపాల్లో వ్యక్తమవుతున్న ప్రతిఆధునిక ధోరణులు మళ్లీ బలపడుతున్న ఈ సమయంలో పెరియార్ యొక్క ఆలోచనా నిర్మాణం నేటికీ అత్యంత ప్రాసంగికంగా ఉంది. పెరియార్ ఆలోచనా ధోరణి ఒక ఆరోగ్యకరమైన, హుందాతనంతో కూడిన ఆధునిక ప్రజాస్వామిక సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఒక నిర్మాణాత్మక ప్రణాళికను అందిస్తుంది.
గౌరవం అనేది గుర్తింపు, వ్యక్తిత్వం, సమానత్వం, స్వేచ్ఛతో ముడిపడి ఉంది. చార్లెస్ టేలర్ అనే తత్వవేత్త, ‘ది పాలిటిక్స్ ఆఫ్ రికగ్నిషన’ అనే వ్యాసంలో మన వ్యక్తిత్వం ఇతరుల గుర్తింపుతో నిర్మితమవుతుంది. గుర్తింపు అంటే వ్యక్తి లేక సమూహం యొక్క గౌరవాన్ని అంగీకరించడం, వారి ప్రత్యేక అనుభవాల్ని గౌరవించడం, సమాన మానవ విలువను ఒప్పుకోవడం. మనల్ని సమాజం ఎలా చూస్తున్నదో అది మన ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది అంటాడు.మనిషికి గుర్తింపు లేకపోవడం, లేక అవమానకరమైన గుర్తింపు పొందడం అవి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. సమానత్వం అంటే అందరినీ ఒకేలా చూడటం మాత్రమే కాదు, వారి భిన్నతను గౌరవించడం కూడా అంటాడు. ప్రతి సామాజిక సమూహం యొక్క ప్రత్యేకతను, సంస్కృతిని గుర్తించాలి. సాంప్రదాయ సమాజంలో గౌరవం (honour) కొంతమందికి మాత్రమే పరిమితమైతే , ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి మనిషికి సమాన గౌరవం ఉంటుంది. మానవ గౌరవం (dignity) సర్వ సామాన్య హక్కుగా పరిగణించబడుతుంది. అంతిమంగా గుర్తింపు లేమి ఒక విధమైన అణిచివేత. నేటి ఐడెంటిటీ రాజకీయాల సందర్భంలో నాన్సీ ఫ్రేజర్ అనే రాజకీయ తత్వవేత్త సమాజంలోని ప్రతి వ్యక్తి సమాన గౌరవంతో, సమాన అవకాశాలతో సామాజిక జీవితంలో పాల్గొనగలగాలి. అందుకు ఆర్థిక సమానత్వం, సాంస్కృతిక గౌరవం రెండిటి అవసరం ఎంతో ఉంది అంటుంది. అణిచివేత ఆర్థిక రూపంలోనే కాకుండా, సాంస్కృతిక రూపంలో కూడా వుంటుంది. అందుకే ఆర్థిక న్యాయంతో బాటు గుర్తింపును కలిసి చూడాల్సిన అవసరాన్ని ప్రతిపాదిస్తుంది. అలా ఆధునిక సామాజిక రాజకీయ తత్వశాస్త్రంలో గుర్తింపు (Recognition) మరియు పునర్వితరణ (redistribution) మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తూ సాంస్కృతిక అణిచివేత, ఆర్థిక అసమానతలను కలిసి కలిసిచూడలని అంటుంది. ఐడెంటిటీ రాజకీయాలుగా వచ్చిన దళిత రాజకీయాలని, ఈ తాత్విక నేపథ్యం లో సరిగా అర్ధం చేసుకోగలుగుతాం. దళిత రాజకీయాలు కేవలం ఆర్థిక సమానతనే కాకుండా, ఆత్మగౌరవం కూడా అంతే అవసరంగా చెప్పేరు. మాకు ఆకలి తీర్చుకోవడమేకాదు, ఆత్మ గౌరవం నింపుకోవడం కూడా అంతే ప్రాధాన్యమైన విషయాలుగా నినదించారు.
సమకాలీన సామాజిక రాజకీయ తత్వశాస్త్రంలో మానవ గౌరవం, గుర్తింపు అనే అంశాలు ప్రధానంగా ప్రస్తావనలోకి వచ్చాయి. ఈ దృష్టిలోంచి న్యాయాన్ని పునర్నిర్వచించుకోవాల్సి వచ్చింది. ఇది తత్వశాస్త్రం యొక్క ప్రాధాన్యతాంశంగా ముందుకొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన మానవ వినాశనాన్ని కళ్ళారా చూసిన ఇమ్మాన్యూల్ లెవినాస్ అనే తత్వవేత్త అంతిమంగా ప్రశ్నార్థకమవుతున్న మన జ్ఞానం, నాగరికత, మానవ మనుగడను దృష్టిలో ఉంచుకుని, మనిషి ఇతరునితో షరతుల్లేని నైతిక సంబంధాన్ని కల్గి, శత్రువుని/తనకు తెలియని వాడిని కూడా ప్రేమతో ఆహ్వానించగలిగేలా ఉండాలని, నైతిక శాస్త్రమే తత్వశాస్త్రమని (Ethics of first philosophy) అంటాడు. ఆ విధంగా చూసినప్పుడు తత్వశాస్త్రానికి మానవ గౌరవం ప్రధాన భూమిక ఉండాల్సి వుంది. ఫెమినిస్ట్ ఉద్యమాలు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా వెల్లివిరిసిన నల్ల జాతీయుల అస్తిత్వ ఉద్యమాలు మానవ గౌరవాన్ని, స్వాభిమానాన్ని, గుర్తింపు కోరుకోవటాన్ని తమ విముక్తి రాజకీయ సిద్ధాంతాలలో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. అయితే భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షత, సామాజిక అసమానతలపైన జరిగిన మేధోపర చర్చల్లో, పోరాటాల్లో మానవ గౌరవం, ఆత్మ గౌరవం/ స్వాభిమానం అనే ఆలోచనలకి మరింత స్పష్టమైన సిద్ధాంత భూమిక లభించింది. అది ప్రత్యామ్నయ భారతీయ తత్వశాస్త్రానికి దిక్సూచిగా కూడా వుంటుంది. ఈ తాత్త్విక ధోరణి చలామణిలో ఉన్న భారతీయ తాత్వికతకి, నైతిక సూత్రాలకు భిన్నమైనది. పురుషార్ధాలు, వర్ణాశ్రమ ధర్మాలు, కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, బ్రహ్మజ్ఞానం, మోక్షం, పరలోక ఆనందాలకు భిన్నంగా మనిషిని మహోన్నతంగా, నీతివంతంగా, గౌరవ ప్రదంగా, రోజువారీ జీవితంలో, ప్రకృతిలో భాగంగా వివేచనాత్మకంగా ఆవిష్కరించింది. ఎవరూ ప్రశ్నించకూడా, ఎటువంటి మార్పు లేకుడా ఆధిపత్యాన్ని, అసమానతలను ఎప్పటిలానే కొనసాగించాలనుకునే బ్రాహ్మణీయ సామాజిక క్రమాన్ని ధిక్కరించే ప్రజాస్వామిక తాత్వికతను ప్రతిపాదించడమే గాక, అందుకు ఈ తత్వవేత్తలు అలుపెరగని పోరాటం కూడా చేశారు. ఆధునిక భారతంలో జోతిభా ఫూలే, అంబేద్కర్, పెరియార్ ఆత్మగౌరవ ఆలోచనా ఆవిష్కర్తలుగా, సిద్ధాంత కర్తలుగానే గాక బ్రాహ్మణీయ ఆధిపత్యం, అంటరానితనం, బానిసత్వం నుండి మనిషిగా నిలబడే విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ క్రమంలోనే భారతీయ తాత్వికతకి పునాదిగా ఎటువంటి ఆధిపత్యం లేకుండా (ముఖ్యంగా కులాధిపత్యం) మనిషి, హేతువు, నీతి, మానవత నిండుగా వుండే ఆత్మగౌరవం వుండాలనే సామాన్య ప్రజల తాత్వికతకి ఊపిరి వూదేరు.
(కొలిమి వెబ్ మ్యాగజైన్ సౌజన్యంతో….)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.