రాజస్థాన్, థార్ ఎడారిలోని ఒక గ్రామంలో ఒక మేఘ్వాల్ కుటుంబాన్ని సందర్శించిన ఈ విలేఖరి, ఆ గ్రామ సంక్షిప్త చిత్రాన్ని మనకు అందించడమే కాకుండా, ఆ ప్రదేశంలో మారుతోన్న నీటి, వాతావరణ పరిస్థితులను కూడా చిత్రీకరించారు.
మేం అప్పుడే తిన్న అంట్ల గిన్నెల్లోని ఒక గిన్నెలోకి గుప్పెడు థార్ ఎడారి ఇసుకను చల్లారు విమల. ఆ గిన్నెను తన చేతుల్లో తిప్పుతూ, గిన్నెలో మిగిలి వున్న మెతుకులనూ, జిడ్డునూ బాగా రుద్ది వదిలించారు. “ఇసుకతో గిన్నెలు చాలా బాగా శుభ్రపడతాయి. నీళ్ళతో అంత బాగా శుభ్రం కావు,” తన గులాబీ రంగు ముసుగులోంచి చెప్పారామె.
ఎందుకలా? విమల మాట్లాడే ఆ పొడి పొడి హిందీ భాషను నేను అర్థం చేసుకోగలుగుతున్నా, కానీ ఆమె తర్కం మాత్రం నాకు బోధపడలేదు.
“ఇక్కడి నీటిలో NaCI (సోడియం క్లోరైడ్, అంటే ఉప్పు) పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది,” నా స్నేహితురాలు, 27 ఏళ్ళ పుష్ప చౌహాన్ మాట కలిపింది. ఆ రోజుకు నాకు అనువాదకురాలిగా వ్యవహరిస్తోన్న ఆమె విమలకు మరదలు. “మేం నీటిని వాడితే, పాత్రలపై మరకలు అలాగే ఉండిపోతాయి. ఇక్కడి నీరు భారీగానూ, ఖారాగానూ (భారంగా, ఉప్పగా) ఉంటుంది.”
ప్రపంచంలోని తొమ్మిదవ అతిపెద్ద ఉప ఉష్ణమండల ఎడారికి స్వాగతం! ఇక్కడి భూగర్భ జలాల ఉప్పదనానికి ఒక భౌగోళిక వివరణ ఉంది. ఇక్కడ వర్షపాతం కంటే బాష్పీకరణ (ఆవిరైపోవటం) తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉండటం వలన ఇక్కడి నేలలోనూ నీటిలోనూ లవణాలు, ఖనిజాలు నిక్షిప్తమవుతాయి. ఈ ఎడారి గుజరాత్, రాజస్థాన్‌లతో పాటు సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల వరకు విస్తరించి ఉంది.
ఈ ఎడారి నడుమ, రాజస్థాన్‌లో కొత్తగా (2023) ఏర్పడిన ఫలోదీ జిల్లాలో దయా కోర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం అంచున విమల ఇల్లు ఉంది. సరిగ్గా ఆ ఇంటి బయట, 32 ఏళ్ళ విమలా దేవి ముంగాళ్ళపై కూర్చుని, పాత్రలను శుభ్రం చేస్తున్నారు.
ఆమె రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేసిన మేఘ్వాల్ సామాజిక వర్గానికి చెందినవారు. పరంపరగా మేఘ్వాల్‌లు వ్యవసాయం చేసేవారు, పశువులను పెంచేవారు, బట్టలను, దుప్పట్లను నేసేవారు. కానీ శతాబ్దాల కులవివక్ష కారణంగా ఈ సామాజిక వర్గంలో విద్యా సాధన, అభివృద్ధి చారిత్రకంగా తక్కువ స్థాయిలోనే ఉండిపోయాయి.
విమల భర్త 36 ఏళ్ళ కన్వర్‌లాల్, అతని తమ్ముడైన 32 ఏళ్ళ భోజారామ్ కూడా బడి చదువులను మధ్యలోనే ఆపేసి, తమకంటే చిన్నవారైన తోబుట్టువులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉప్పు గనులలో కూలీగా పనిచేశారు. భూమిలేని దళిత రైతు కన్వర్‌లాల్, ప్రస్తుతం 40 బీఘాల (ఇక్కడ 4 నుండి 5 బీఘాలు ఒక ఎకరాకు సమానం) భూమిని కౌలుకు తీసుకొని అందులో సజ్జలు, గోధుమలు, మెంతులు, వేరుశనగ పంటలను సాగు చేస్తున్నారు. అతితక్కువగా, అస్తవ్యస్తంగా కురిసే వర్షాలు, తరచుగా సంభవించే కరవులు, పంట నష్టాలు, తక్కువ దిగుబడి రావటం వంటి కారణాల వల్ల ఫలోదీ ప్రాంతంలో వ్యవసాయం చేయడం ఒక పెను సవాలుగా మారింది.
సగటున సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే ఈ మెట్ట ప్రాంతంలో నీరు ఒక అరుదైన, అమూల్యమైన వనరు. వంటపాత్రలకు గట్టిగా అతుక్కుపోయిన పదార్థాలను వదిలించడానికి విమల చల్లే ఆ కొద్దిపాటి నీటి చుక్కలు, ఇంటి పక్కనే ఉన్న టాంకా (భూగర్భ జలాశయం) నుండి సేకరించినవి.
బావురీలు (మెట్ల బావులు), తాలాబ్‌లతో (సరస్సులు) పోలిస్తే ఈమధ్య కాలంలోనే వాడుకలోకి వచ్చిన టాంకా థార్ ఎడారిలో నీటి కొరతను ఎదుర్కొనే ఒక ప్రసిద్ధ పద్ధతిగా మారింది. కేంద్ర మెట్ట ప్రాంత పరిశోధనా సంస్థ (CAZRI) ప్రచురించిన 1988 నాటి ఒక చిన్న పుస్తకం ప్రకారం, ఈ ప్రాంతంలో మొట్టమొదటి టాంకాను క్రీ.శ. 1607లో వాడి కా మేలన్ అనే గ్రామంలో రాజా శూర్‌సింగ్ నిర్మించాడు. ఆ తర్వాత జోధ్‌పూర్‌లోని మెహ్రాన్‌గఢ్ కోటలో మహారాజా ఉదయ్‌సింగ్ క్రీ.శ. 1759లో మరొకదాన్ని నిర్మించాడు. అయితే, 1895-96లో క్షామం వచ్చిన సమయంలో ఈ ప్రాంతంలో విస్తృతంగా టాంకాలను నిర్మించారు.
“ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించడానికి టాంకాలు ఉపయోగపడతాయి; ఈ నీటిని తాగునీరుగా వాడుకుంటారు. పశ్చిమ రాజస్థాన్‌లో సర్వసాధారణంగా కనిపించే వీటిని సిమెంట్, కాంక్రీటు, రాళ్ళతో నిర్మిస్తారు,” విమల మేనల్లుడు 19 ఏళ్ళ బద్రినారాయణ్ చౌహాన్ చెప్పాడు. “10 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు కలిగిన ఒక టాంకా సుమారు 56,000 నుండి 58,000 లీటర్ల నీటిని సేకరించగలదు. దీని నిర్మాణానికి దాదాపు 50,000 నుండి 80,000 రూపాయల వరకు ఖర్చవుతుంది.”
విమల కుటుంబానికి పెరట్లో రెండు టాంకాలు ఉన్నాయి. 2001లో నిర్మించిన ఒక పాత టాంకా వర్షపు నీటిని సేకరిస్తుంది. ఇక కొత్తదీ, పెద్దదీ అయిన రెండవ టాంకా వారి ఇంటి అవసరాల కోసం 60,000 లీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తుంది. ఈ రోజుల్లో ఆ కుటుంబం ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసిన నీటితో ఎక్కువ సామర్థ్యం ఉన్న టాంకాను నింపుతున్నారు. అందుకు వారికి 5,000 లీటర్ల నీటికి సుమారు 500 రూపాయలు ఖర్చవుతుంది. ఈ ట్యాంకర్లు భారతదేశంలోనే అత్యంత పొడవైన ఇందిరా గాంధీ కాలువకు సమీపంలో ఉండే వడపోత ప్లాంట్ నుండి నీటిని తెచ్చుకుంటాయి. ఆ కాలువకు సట్లెజ్, బియాస్ నదులు కలిసే పంజాబ్‌లోని హరికే ఆనకట్ట నుండి నీరు వస్తుంది.
204 కిలోమీటర్ల పొడవైన రాజస్థాన్ ఫీడర్ కాలువ ఫలోదీని చేరుకుంటుంది గానీ కన్వర్‌లాల్ పొలం వరకూ రాదు. దాంతో ఆయన ఒక బోరుబావిపై ఆధారపడతారు; కాలువ వచ్చిన తర్వాత ఆ బోరుబావిలో నీటి మట్టం తిరిగి పెరగటం మొదలైందని ఆయన చెబుతున్నారు. అయితే, భూగర్భ జలాల ఈ కృత్రిమ పునరుద్ధరణ ప్రక్రియ విమల ఎదుర్కొంటోన్న తాగునీటి సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోతోంది. తాగునీటిని తప్పనిసరిగా కొనుక్కోవాల్సిందే.
అయితే, 2000ల ప్రారంభం వరకు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది; ఆ రోజుల్లో మహిళలు దగ్గరలోని చెరువుల నుండి, బావుల నుండి నీటిని మోసుకురావాల్సి వచ్చేది. “నీటిని తీసుకురావడం కోసం అమ్మ పొద్దుపొద్దున్నే నిద్రలేచేది. దాంతో, మేం బడికి వెళ్ళటానికి ముందు ఇంటి పనుల్లో సాయం చేయాల్సి వచ్చేది,” పుష్ప గుర్తు చేసుకున్నారు. “మా ఇంటికి సమీపంలోనో, మా ఇంట్లోనో నీటి సరఫరా ఉండి ఉంటే, మేం అంత దూరం నడవాల్సిన అవసరం ఉండేది కాదని, ఆ సమయాన్ని నేను అక్షరాలు నేర్చుకోవడానికి వినియోగించుకునేదాన్నని అనుకునేదాన్ని. ఇదంతా నేను ఒకటో తరగతి చదువుతున్నప్పుడు చేసిన ఆలోచనలు.”
ఈ రోజున ఊరిలో ఉన్న టంకాలు వర్షపు నీటిని సేకరించడాన్ని సాధ్యం చేశాయి, తద్వారా ప్రజలకు మొదటిసారిగా త్రాగునీరు సులభంగా అందుబాటులోకి వచ్చింది. గ్రామంలో దళిత, అంటరాని కులాలుగా ఉన్న మేఘ్వాల్‌లు, గ్రామంలోని బావుల నీటితో సహా మొత్తం ఉమ్మడి వనరుల నుండి ఒక క్రమపద్ధతిలో దూరం చేయబడ్డారు. రాజస్థాన్‌లోని షెడ్యూల్డ్ కులాలలో (2011 జనాభా లెక్కల ప్రకారం) వీరిదే అత్యధిక జనాభా అయినప్పటికీ, మేఘ్వాల్‌లు ఆధిపత్య కులాల వారి అణచివేతకు, హింసకు అత్యంత ఎక్కువగా గురవుతున్నారు.
2010లో నేను ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు దయా కోర్ పరిస్థితి వేరేగా ఉండేది. గది మూలల్లో ఉండే మసి పట్టిన కిరోసిన్ బుడ్డిదీపాల స్థానాన్ని అప్పటికింకా విద్యుత్ స్విచ్‌బోర్డులు ఆక్రమించలేదు. మాలో ఎవరూ తమ మొబైల్ స్క్రీన్‌లకు అతుక్కుపోయి ఉండే వారు కాదు. కానీ ఇప్పుడు, మేమందరం మా ఫోన్‌లను స్క్రోల్ చేస్తూ కూర్చుంటున్నాం, లేదంటే మా సమయాన్ని నింపివేసే అల్గారిథమ్‌లు నిర్ణయించే అంశాల గురించే చర్చించుకుంటున్నాం.
కనీసం మేఘ్వాల్ సముదాయంలోనైనా మాంసాహారం పట్ల గతంలో ఉన్న నిషేధం ఈమధ్య కాలంలో తొలగిపోయింది. నేను ఇటీవల అక్కడికి వెళ్ళినప్పుడు, మధ్యాహ్న భోజనంలో మేం మాంసం కూర, బాజ్రే కీ రోటీ (సజ్జ రొట్టెలు) తిన్నాం. కుటుంబ పెద్ద ఘేవర్‌రామ్ ఒక పళ్ళెంలోనూ, మిగిలిన మగవారమంతా మరొక పళ్ళెంలోనూ – సరిగ్గా పాత రోజుల్లో లాగే కలిసి భోజనం చేశాం. మేం తినడం పూర్తయ్యాకే విమల భోజనం చేయాల్సి ఉంది. కుటుంబంలోని మగవారందరూ తిన్న తర్వాతే స్త్రీలు భోజనం చేయాలనే ఆచారం నేటికీ కొనసాగుతోంది. కొన్ని విషయాలు ఈనాటికీ మారలేదు.
కాలువలు, టాంకాలు, ట్యాంకర్లు మహిళల పనిని కొంత సులభతరం చేసి ఉండవచ్చు, కానీ ఈనాటికీ ఇక్కడ జీవిస్తున్న వారి మనుగడ నీటి కొరతపైనా, కఠినమైన ఎడారి వాతావరణంపైనే ఆధారపడి ఉంది. థార్ ఎడారిని మరుస్థలి లేదా మృత్యుభూమి అని పిలవడానికి ఒక కారణముంది. ప్రాణాంతక ఎడారి జ్వరమైన లూ ఇక్కడ ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉంది.
2022లో ఫలోదీలో, దేశంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అంతకుముందు, ఆ ప్రాంతంలోని గాలిమరలు మంటల్లో కాలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే, గ్రామస్తులు ప్రస్తుత పరిస్థితిని భిన్నంగా చూస్తున్నారు. 32 ఏళ్ళ భోజారామ్ పరిస్థితి పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. “గతంలో ఒక్క పూట భోజనం సంపాదించటం కోసం ఒక మనిషి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మేం మా చేతులతోనే దాదాపు ప్రతిదాన్నీ ఉత్పత్తి చేస్తున్నాం. అన్నీ ఇంట్లోనే. గోధుమలు, ధనియాలు, జీలకర్ర వంటివన్నీ పొలం నుంచి వస్తాయి. మేం తినేదానిలో అచ్చమైన స్వచ్ఛత లభిస్తుంది.”
మరి భరించరాని వేడి సంగతేమిటి?
“మేం ఈ వాతావరణానికి అలవాటుపడి పోయాం. ఇక్కడి వేడి గురించి పెద్దగా ఆలోచించటం లేదు,” అంటారాయన. “ఇది నిజంగానే చాలా బాగుంది. మంచి ప్రాంతం, శుభ్రమైన పర్యావరణం. ఇంతకుముందు చాలా ఇబ్బందులుండేవి. ఈ నీళ్ళు లేవు, ఈ మొక్కలు లేవు, పశువులను ఉంచుకోవటానికి చోటు ఉండేదికాదు. అంతటి అత్యధిక ఉష్ణోగ్రతలు ఎంత కాలమని ఉంటాయి? కేవలం 5 నుంచి 7 రోజులు. ఆ రోజులు పెద్ద తేడాగా ఏమీ ఉండవు.”
అయితే, న్యూయార్క్ టైమ్స్ ఇంటరాక్టివ్ కాల్కులేటర్ ప్రకారం, భోజారామ్ పుట్టిన సంవత్సరంలో దయా కోర్ ప్రాంతం సుమారు 240 అత్యంత వేడి రోజులను చూసింది. ఇప్పుడా గ్రామంలో ఏడాదికి 253 అత్యంత వేడి రోజులు నమోదవుతున్నాయి. అతనికి 80 ఏళ్ళు నిండే సమయానికి, ఆ గ్రామంలో ఏడాదికి సుమారు 260 నుండి 277 అత్యంత వేడి రోజులు ఉండే అవకాశం ఉంది.
మేం మాట్లాడుకుంటుండగా, విమల పిల్లలు సోను, పూజలు నా నోట్‌ప్యాడ్‌పై బొమ్మలు, అక్షరాలు గీస్తున్నారు. పెద్ద కొడుకైన ప్రదీప్, బడిలో తాను నేర్చుకున్న ఆంగ్ల వాక్యాలను రాస్తున్నాడు. “నా పేరు ప్రదీప్. నాకొక చెల్లెలుంది. నాకొక తమ్ముడున్నాడు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను దయాకోర్‌లోని న్యూ సర్వోదయ సెకండరీ స్కూల్‌లో చదువుతున్నాను. మా నాన్న రైతు. మా అమ్మ గృహిణి.”
కొంత దూరంలో, శీతాకాలపు సూర్యుడు తన తల మీదుగా ప్రకాశిస్తుండగా, విమల పొలంలో శ్రమపడి పనిచేస్తుండటం నాకు కనిపించింది.
మరో ఐదు నెలల్లో ఇక్కడి ఆకాశాన్ని అరుదైన ఆ వర్షా మేఘాలు కమ్ముకుంటాయి. ‘మేఘ్వాల’ అనే పదం మేఘ్, వాల్ అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది; దీని అర్థం మేఘాల ప్రజలు అని. వర్షపు తొలి చినుకులు తమ శరీరాన్ని తాకగానే, పిల్లలందరూ కలిసి తమ తాతయ్య ఘేవర్‌రామ్ నుండి నేర్చుకున్న వర్షపు పాటను పాడుతూ సంబరాలు జరుపుకున్న ఆ మధుర స్మృతులు నాలో పదిలంగా ఉన్నాయి.
మేయీ మేయీ ఆజా, ఘీ రోటీ ఖాజా
మేయీ మేయీ ఆజా, ఘీ రోటీ ఖాజా
(వానా వానా వచ్చిపో, నేతి రొట్టె తిని పో
వానా వానా వచ్చిపో, నేతి రొట్టె తిని పో)
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/article/washing-dishes-with-desert-sand-te) జూన్ 04, 2026 లో మొదట ప్రచురితమైనది.)
