పలమనేరు కథలు ‘ఎరుకల’ కథలు మాత్రమే కావు ‘ఎరుక’ చెప్పే కథలు కూడా! – శిరంశెట్టి కాంతారావు

పలమనేరు బాలాజి గారికిది నాలుగవ కథా సంపుటి. కథావరణంలో ఈ సంపుటి దాకా నడిచి వచ్చిన తరువాతనే తన సామాజిక నేపథ్యంతో పాటు తన ప్రాంత నైసర్గిక నేపథ్యాన్ని కూడా మొత్తం తెలుగు సమాజానికి సరికొత్తగా తెలపాలన్న ఉద్ధేశ్యంతో వ్రాసిన కథలు కూడా. పలమనేరు అనేది సముద్ర రహిత ద్వీపకల్పం అంటాన్నేను.

ఎందుకంటే అది మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిగి వున్న కౌండిన్య ఏనుగుల అభయారణ్యంతో కూడుకున్న విలక్షణమైన ప్రాంతం కాబట్టి.
వైవిధ్య పూరిత నేపథ్యం వున్న విలక్షణ కథలు చదవాలనుకునే పాఠకులు తప్పకుండా చదవదగ్గ కథాసంపుటి ఈ ‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవనగాథలు’.
ఇందులో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి. ఆ పద్దెనిమిది కథల్ని విడివిడిగా చదివితే ఇదో గిరిజన ఎరుకల కథాసంపుటి. అలా కాకుండా ఒకేసారి ఏకబిగిన చదివితే ఇదో అద్భుతమైన గిరిజనుల (ఎరుకల) జీవిత నేపథ్యంతో అలరిస్తూ, ఆలోచింపజేసే నవలగా కూడా చెప్పుకోవచ్చు. ‘ఏక క్రియ ద్వర్ధ్య కరీ!’ అనే దానికి ఇదో మచ్చుతునక.
సంపుటంలో పద్దెనిమిది కథలు వుండడంతో దీన్ని పద్దెనిమిది పర్వాల గిరిజన (ఎరుకల) మహాభారతంగా కూడా చెప్పుకోవచ్చునేమో? పైగా మహాభారతాన్ని అదే సంగడానికి చెందిన వ్యాసుడు రచిస్తే, ఈ ఎరుకల మహాభారతాన్ని అదే వర్గంలో పుట్టిన పలమనేరు బాలాజి వ్రాయడం యాదృచ్చికమేమి కానప్పటికీ, ఇట్లా వెలువడడానికి చాలాకాలం పట్టింది. ఇప్పటికైనా ఇలా ఒక కథా సంపుటాన్ని వెలువరించడం ముదావహమైన చేర్పుగా పేర్కొనవచ్చు. ఈ సంపుటాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకుపోగలిగితే పలమనేరు బాలాజి ఎరుకల సామాజిక వర్గానికి నిస్సంశయంగా ‘ఆదికవి’ అవుతాడు. మహాభారతంలో విరాటపర్వం ఎంత ప్రాధాన్యమైనదో ఈ సంపుటంలో ‘ఉడుకోడు’ కథ అంతే ప్రథానమైనది.
ఈ కథాసంపుటీ వృక్షానికి ‘ఉడుకోడు’ కథ కాండం వంటిదైతే, మిగిలిన కథలన్నీ ఆ కాండాన్ని అంటిపెట్టుకొని పెరిగిన కొమ్మల వంటివని చెప్పవచ్చు. ఇక కథల విషయానికొస్తే… సంపుటంలో మొదట కథ “పదకొండు నెలల జీతగాడి కథ”. మరియు రెండవ కథ “ఆయమ్మ అంతే! ఆమె ఒక మదర్ థెరిస్సా”. ఈ కథా శీర్షికలే ముందు పాఠకుణ్ణి ఒక ఆలోచనాస్పోరకమైన సంవేదనాశీలతకు లోను చేస్తాయి. కథల్లోని ప్రధాన పాత్ర తన నెల జీతంలో నుండి తోటి వారిని అవసరాల్లో ఆదుకోడానికి పెట్టె ఖర్చును, ఏడాదికి ఒకసారి కలిపి లెక్కిస్తే ఓ నెల జీతానికి కొంచం అటూ ఇటూగా వుంటుంది. కాబట్టి కథకుడు ఈ కథలకు తగిన శీర్షికలను ఉంచడం ఎంతైనా ఆహ్వానించదగినదే. పాఠకుడీ శీర్షికలను చదవడంతోనే కథా పఠనమనే బరువును మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి సన్నద్ధమయ్యేలా తయారు చేసుకోవడంలో కథకుడు కృతకృత్యుడయ్యాడని గట్టిగా చెప్పవచ్చు.
మరో మంచి కథ “అమరజీవి మా కాంతమ్మత్త!” సహజంగా నిన్నటి గ్రామీణ జీవితాల్లో ప్రతి గ్రామంలోను ఒకరిద్దరు పరోపకార పరాయణులుండేరు. వారు తమ పరిధికి, శక్తికి మించి గ్రామంలో ఏ వ్యక్తికి ఎటువంటి అవసర మొచ్చినా తక్షణమే రెక్కలు కట్టుకుని అక్కడ వాలుతారు. ఎదుటివారి కష్టాన్ని తొలిగించేందుకు సామాజిక ధన్వంతరులై సమస్యలను పరిష్కరిస్తారు.
సరిగ్గా అటువంటి స్వభావమున్న మేనత్త కాంతమ్మ జీవన వ్యథే ఈ కథ. ఒక సందర్భంలో కథకుడి తల్లి అనారోగ్యంతో తిండికి దూరమై, మంచానికే పరిమితమై వున్నప్పుడు, అత్త జోరువానలో తడుస్తూ వదిన కోసం భోజనం తీసుకొచ్చి, ఆవిడ చేత బలవంతంగానైనా తినిపిస్తుంది. ‘వర్షంలో తడిసొచ్చిన మేనత్త ఒంటి నుండి వచ్చిన నీళ్ళ వాసన తనను జీవితమంతా వెన్నాడుతూనే వుంటుంది’ అంటాడు బాలాజి. ఆది ఎంతటి మధురోహమైన అనుభవమో ఆ వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఆవిధంగా పలమనేరు బాలాజి ఎంతో అద్వితీయమైన అదృష్టవంతుడని చెప్పొచ్చు.
“దేనికీ భయపడొద్దు” కథలో ‘మనిషి అమ్ముల పొదిలో బాణం మాదిరిగా వుండాలి’ అన్న ఏక వాక్య సందేశాన్ని అనేక సంఘటనల మాద్యమంగా కథను నడిపిన పలమనేరు బాలాజి కథన కౌశలం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్పిస్తుంది.
“ఉడుకోడు” కథ ఒక ఊరిలోని ఎరుకల వారికి, భూకామందులకు మధ్య భూమి కోసం జరిగిన యుద్ధంలో ఒంటరిగాడైన ‘ఉడుకోడు’ తన కులమనే సైన్యానికి, సేనాపతిగా మారి ఎంతటి వీరోచిత పోరాటాన్ని నిర్వహించి, విజయుడైనాడో ఉద్విగ్నభరితంగా మలిచిన కథ.
నిజానికి ‘ఉడుకోడు’ అన్నది ఆ వ్యక్తి పేరు కాదు. అతను తన జాతి జనులకు హాని కలిగించే ఏవ్యక్తినైనా, ఏ సమూహాన్నైనా, ఏ విషయంలో నైనా సహించలేని తత్త్వంవున్నవాడు. ఎంతటి బలవంతుడినైనా ‘ఢీ’ కొనడంలో ఒక పొట్టేలు లాంటి వాడు. కాబట్టే తన వారందరూ ముద్దుగాను, గౌరవంగాను, గర్వంగాను అతణ్ణి ‘ఉడుకోడు’ అంటూ పిల్చుకునేవారు.
“చప్పుడు” చదవడానికి చిన్న కథే అయినా, అది చేసే చప్పుడు మాత్రం ఎంతో పెద్దది. గ్రామంలోని పెద్ద రెడ్డి గారి పాలేరు శీను గాడు. అంబేడ్కర్ పుణ్యాన యస్టీ రిజర్వేషన్ కోటాలో రెడ్డి గారి దర్శకత్వంలో ఊరికి సర్పంచ్ అవుతాడు. ఫలితంగా గ్రామ పెత్తనం ఎప్పటి మాదిరిగానే రెడ్డి దొర చేతుల్లోనే వుంటుంది. సర్కార్ వారి లెక్కలోను కాగితాల మీద సంతకాల్లోనూ మాత్రం శ్రీనివాసులే సర్పంచ్. యజమాని, జీతగాడు ఇద్దరే వున్నప్పుడు శీను శీనే. కానీ అదే అధికారుల ముందు మాత్రం శీనును” అరే, ఒరే, నీయబ్బా!, నా కొడకా!” అంటూ ఉద్దేశ్యపూర్వకంగానే కించపరుస్తూ సంభోదిస్తుంటాడు. సర్పంచ్ అనే కీలుబొమ్మను ఆడించే అసలుసిసలు ఆటగాడిని నేనే నన్న దర్పాన్ని ప్రదర్శిస్తుంటాడు. వాటన్నింటినీ మౌనంగా సహిస్తుంటాడు శ్రీనివాసులు.
ఎరుకలవాడలో వేయాల్సిన బోరును అక్కడి నుంచి తప్పించి ఊర్లో బోరు వేసే విషయంలో రెడ్డి తలపెట్టిన ద్రోహాన్ని సహించలేకపోయిన శ్రీనివాసులు చేసిన సున్నితమైన తిరుగుబాటు రెడ్డి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.
“ఆకలేస్తున్నప్పుడు” అన్న కథలో ఎంత బతుకు బతికాడన్నది కాదు. ఎట్లా చచ్ఛాడన్నది ముఖ్యం అన్న ‘సింగిల్ ట్యాగ్ లైన’ లో కథని పొదిగించి కథను చెప్పిన తీరు కథకునిగా బాలాజి సామర్ధ్యం పాఠకుల కళ్ల ముందు కొత్త తెలివిడిని ప్రదర్శిస్తుంది. ఇంకా ‘కబాబ్ కపాలి’, ‘అదే ప్రశ్న’, ‘ఏనుగుల రాజ్యంలో’ మొదలైన కథలు పాఠకులను ఆకట్టుకునే తీరులో కొనసాగుతాయి.
చివరిగా కవిత, కథ, నవల, వ్యాసం. ప్రక్రియ ఏదైనా సమాన ప్రతిభా పాఠవాలతో వ్రాయగల అతికొద్ది మంది రచయితల్లో ముందు వరుసలో వుండదగ్గ వ్యక్తుల్లో పలమనేరు బాలాజి కూడా ఒకరు.
పలమనేరు గారి ఈ ప్రతిభా వ్యుత్పత్తులకు మూలకారకులైన, వారి తల్లిదండ్రుల ముందు చూపుకు, వెనుకబడిపోయిన తమ వాళ్లందరినీ కలుపుకుపోవాలనుకున్న వారి సామూహిక తాత్త్విక స్వభావానికి, పరహితైషాభిలాషా సోదరత్వానికి ఎవరైనా అంజలి ఘటించాల్సిందే.
అటువంటి తల్లిదండ్రుల అడుగుజాడల్లో సంస్కారవంతునిగా రూపుదిద్దుకున్న బాలాజి కలం నుండి ముందు ముందు మరిన్ని సంపద్వంతమైన, సమాజ అసమతౌల్యతను ఎండగట్టే రచనలను పాఠకులు ఆశిస్తున్నారు.
పబ్లిషర్స్ : పర్ స్పెక్టివ్స్, హైదరాబాద్
పేజీలు : 165, వెల: రూ.220/-
పుస్తకం కోసం సంప్రదించాల్సిన సెల్ నెం. 83329 34548
(కొలిమి వెబ్‌మ్యాగజైన్ సౌజన్యంతో….)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.