చెత్త నిండిన వాకిలి …
జిడ్డు బారిన గిన్నెలు…
మురికి బట్టలు …
వదిన కొరకు ఎదురు చూస్తున్నవి.
నా మువ్వల సడి విని
నడక నేర్చే పాపలా …
అడుగు కదపలేక పడుతూ, లేస్తూ
కుశల ప్రశ్నలతో దరి చేరుతుంటే
పెయ్యంతా చారలు నిండిన పులిలా వుంది.
భయపడకు…
మద్యపు మరకలివి…
మీ అన్న అధికారపు గుర్తులు
నేను అబలననడానికి సాక్ష్యాలివి.
ఇక్కడ అంతా నేనే…
సంపాదించేదీ …
అందరిని చూసుకునేది …
వారి కోపానికి బలయ్యేదీ…
అంతా నేనే.
నాడు సీత అగ్ని ప్రవేశం చేసింది
కానీ…
నేడు అగ్గిలో దూకకుండానే…
నిత్యం నిప్పుల కొలిమిలో
కాలుతున్న సీతలేందరో, నాలాగా.
మరణానంతర స్వర్గ, నరకలోకాల
వాస్తవికత ఎంతో గానీ….
పశువులకు కబేళాల్లా…
ఇహలోకాన గృహిణికి ఇల్లే బంధిఖానా
మన ఉసురు తీసే నరకశాల.