నేనొక స్త్రీని…
కడుపులో ఉన్నప్పుడే వద్దనుకునే
నిషిద్ధ జీవిని…
పుట్టిన క్షణానికే
చెత్తకుప్పల్లో పడేయాలనుకునే
అనామకురాలిని…
పెరిగిన తర్వాత
“భారం తగ్గించుకోవాలి” అని
పెళ్లి పేరిట పంపించే
పరాయి దానిని…
పెళ్లయ్యాక
మెట్టింటిలో
బాధ్యతలతో బంధించబడే
ఖైదీని…
అవసరానికి అనుగుణంగా
పిల్లల కోసం మాత్రమే ఉపయోగించే
యంత్రాన్ని…
పుట్టకపోతే
అవమానాల మంటల్లో నెట్టేసి
వదిలించుకునే
గొడ్రాలిని…
ముసలితనంలో
వదిలించుకోవాలనుకునే
పరాన్నజీవిని…
అయినా…
నేను విరిగిపోను,
నిశ్శబ్దంగా నిలబడతాను…
నేను స్త్రీని..
సృష్టికి మూలాన్ని,
మనసున్న మనిషిని…
అన్నింటినీ మోయగలిగే
ఒక హృదయాన్ని…
అన్నింటికీ సర్దుకుపోయే
తల్లిని…
కానీ
సర్దుకుపోవడం నా బలహీనత కాదు,
అది నా బలం…
అందుకే
అణగదొక్కినా లేచే శక్తిని,
అవమానించినా నిలిచే గౌరవాన్ని…
నేను… స్త్రీని.
