పుస్తకాలదేముంది…
అక్షరాల్ని అచ్చులుగా పేర్చి
అరచేతిలో పెట్టిన
సిద్ధమైన ముద్దలు అవి !
పేజీ తిప్పితే భావం వస్తుంది,
పదం కలిపితే అర్థం తెలుస్తుంది,
మళ్లీ మళ్లీ చదివితే
రక్తంలోకి దిగిపోతుంది.!
జీర్ణించుకోవడం,
దాచుకోవడం సులువు,
నరనరానా ఎక్కించుకోవడం కూడా
అంత కష్టమేమీ కాదు !
కానీ…
మనుషులను చదవడమే రావాలి..!
నవ్వు ఒకటైతే..
దాని వెనక నైజం ఇంకోటి,
మాట ఒకటైతే
మనసున మరోటి.!
ఉదయం విచ్చుకున్న ముఖమే
సాయంత్రానికి రంగు మార్చుతుంది
ఘడియకొక వర్ణం పులుముకునే
ఊసరవెల్లి స్వభావాలు.!
కళ్ళలో ప్రేమను చూపెట్టి
వెనుకన కత్తులు పదును పెట్టేవారు,
చేతులు కలిపి హృదయాలను కాదు
లాభనష్టాలనే కొలిచేవారు!
మనం వింటున్న ప్రేమా గీమా ఉత్త పదాల
చదరంగం
పొట్ట విచ్చితే కనబడుతుంది
అదో అక్కెర ఆకర్షణల పదబంధం
నవ్వించి నటించి
నట్టేటముంచేవారు కొందరు.!
నోటితో దీవించి
నొసటితో వెక్కిరించేది మరికొందరు.!
పోట్రాయి తగిలితేనే మనుషులను
చదువడం మొదలెడుతాం..
అందుకే ఇప్పుడు
పుస్తకాల కన్నా మనుషులనే ఎక్కువగా
చదువుతున్నా!
పై పై అక్షరాలు కాకుండా
అంతరంగ బుద్ధులను కాచి వడబోస్తున్న
మాటల మాధుర్యాలు కాకుండా
మౌనాలను వింటున్నా..!
నేనిప్పుడు..
కళ్ళతోనే స్కాన్ చేస్తున్నా
మనుషుల ముఖాలు చూస్తే చాలు
వారి అధ్యాయాలు
తెరుచుకుంటున్నాయి..
నాకు కాలం నేర్పిన
అత్యంత కఠినమైన విద్య ఇదే..
మనుషులను చదవడం..!
