“వివాహం విద్య నాశాయ” అనే నానుడిని తిరగరాస్తూ పెళ్ళి అయి, నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత తన ఉన్నత విద్యను ప్రారంభించి, చదువుతో ఆగిపోకుండా ఉద్యోగం చేసి 2011లో పదవీ విరమణ పొంది, “విశ్రాంతి తీసుకుందాం” అని ఆలోచించకుండా డెబ్భై తొమ్మిదేళ్ళ వయస్సులో నిర్విరామంగా తెలుగు సాహిత్యంలో కథను, బాలసాహిత్యంలో కథను తమ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్న మాడభూషి లలితాదేవి జీవన ప్రస్థానాన్ని భూమిక పాఠకుల కోసం .. ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ప్ర. నమస్తే లలితక్కా! బాగున్నారా?
జ. బాగున్నాను గిరిజా! రండి, కూర్చోండి.
ప్ర. భూమిక పాఠకులకు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను.
జ. భూమిక పాఠకులకొరకు నా అనుభవాలను పంచుకోవడం నాకు సంతోషమే.. ఏం చెప్పమంటారు?
ప్ర. మీ అమ్మానాన్నలు, సహోదరుల గురించి చెప్పండి.
జ. అమ్మ మాడభూషి రుక్మిణీదేవి, గృహిణి. పెద్దగా చదువుకోలేదు కానీ రామాయణ, భారత, భాగవతాలు, వార్తా పత్రికలు, వారపత్రికలు చదివేది. నాన్న పేరు తిరుమల గురుగంటి గోపాలాచార్యులు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పని చేసేవారు. నాకు ఇద్దరు
తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. ప్రస్తుతం చెల్లెలు మాత్రమే ఉంది. ఆమె మహబూబ్‌నగర్‌లో ఉంటోంది.
ప్ర. మీరు ఎక్కడ? ఎప్పుడు జన్మించారు? మీ పాఠశాల విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. తేది 18/3/1947న హైదరాబాదులో జన్మించాను. కానీ చిన్నప్పుడు నేను కొందుర్గు గ్రామంలో 1-7 తరగతి దాకా చదువుకున్నాను. అది అప్పటి పాత మహాబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. అక్కడ మా అవ్వ (నానమ్మ) తాతయ్యలు ఉండేవారు. తాత చనిపోయిన తర్వాత అవ్వ, నేను హైదరాబాదుకు వచ్చాం. ఎనిమిది నుంచి పదో తరగతి దాకా హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను.
ప్ర. మీది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చినదా?
జ. ప్రేమ వివాహమే కానీ పెద్దలు సంప్రదాయ పద్ధతిలో చేసారు. మా పెళ్లి తేది 25/2/1965లో జరిగింది. మా వారి పేరు మాడభూషి రంగాచారి. ఆయన మా అమ్మకు స్వయానా అన్న కొడుకు. అంటే నాకు మేనబావ అన్నమాట. నిజాం కాలేజీలో రాత్రి పూట డిగ్రీ చదువుతున్నప్పుడు తరచుగా మా యింటికి వచ్చేవాడు. ఆయన పగటిపూట కొన్నాళ్ళు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా ఆ తర్వాత మున్సిపాలిటీలో పని చేసేవాడు. ఆ క్రమంలో ఆయన నాకు ప్రపోజ్ చేసాడు. అంగీకరించక పోవడానికి నాకు కారణాలు ఏమీ కనిపించలేదు. డిగ్రీ పూర్తి చేసాక రైల్వే డిపార్టుమెంటులో మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉద్యోగం వచ్చింది. ఝాన్సీ నుంచి హైదరాబాదుకు బదిలీ అయ్యాక దాదాపు మూడేళ్ళ తర్వాత మేం పెళ్లి చేసుకున్నాం.
ప్ర. మీ పిల్లల గురించి చెప్పండి.
జ. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి తర్వాత ఇద్దరమ్మాయిలు ఉన్నారు. అందరూ స్థిరపడ్డారు. వాళ్ళ పిల్లలు కూడా స్థిరపడ్డారు.
ప్ర. పెళ్లి అయిన తర్వాతనే ఉన్నత విద్య అభ్యసించారని తెలిసింది. ఆ వివరాలు చెప్పండి.
జ. నిజమేనండి. పెళ్ళి అయ్యాక దాదాపు పన్నెండేళ్ల తర్వాత నేను మళ్ళీ నా చదువును కొనసాగించాను. అప్పటికే నలుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా బడికి వెళ్ళడం మొదలైంది. అప్పటిదాకా క్షణం తీరిక లేకుండా గడిపిన నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉండేదానిని. మా ఆయన ప్రోత్సాహంతో ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1975లో డి.ఓ.ఎల్ లో చేరాను. 1982లో ఎం. ఏ.ఎల్ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను.
ప్ర. మీ ఉద్యోగ ప్రస్థానం వివరించండి.
జ. నేను చదువుకున్నది సాయంత్రం కళాశాలలో.. కాబట్టి డిగ్రీ చేసేటప్పుడు కూడా పగటిపూట నాలుగేళ్ళు విద్యాపీఠ్ ప్రైవేటు పాఠశాలలో, ఒక ఏడాది సెయింట్ ఆంథోనీ హిమాయత్‌నగర్ కాన్వెంట్ స్కూల్లో పనిచేసాను. ఒక ఏడాది తెలుగు పండిట్ శిక్షణను కూడా పూర్తి చేసాను. కనుక పీజీ పూర్తి అనగానే 1982 జూన్‌లో “శ్రీ విద్య హయ్యర్ సెకండరీ స్కూల్ – తిలక్‌నగర్‌లో ఉద్యోగంలో చేరాను. అక్కడి నుంచే తేది 30/4/2011లో ఇరవై తొమ్మిదేళ్ళ అనుభవంతో పదవీ విరమణ పొందాను.
ప్ర. ఉద్యోగ నిర్వహణలో భాగంగా మీరు నిర్వహించిన ప్రత్యేకమైన విధులు ఏమైనా ఉన్నాయా?
జ. తరగతి గదిలో పాఠాలు చెప్పడం వరకే నా ఉద్యోగం పరిమితం కాలేదు. దానికి తోడు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ పొంది, ఆ బాధ్యతను కూడా అదనంగా నిర్వహించాను. అందులో భాగంగా విద్యార్థులకు అందులో శిక్షణ యిచ్చి ఇతర రాష్ట్రాలలో క్యాంపింగ్‌లో పాల్గొనేటట్లు చేసాను. ఆ సందర్భంలో వాళ్ళకు గైడ్ టీచర్‌గా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు మొదలైన రాష్ట్రాలకు వెళ్ళాను. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కూడా నా బాధ్యతగానే ఉండేది. పాఠశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విజ్ఞాన, వినోద యాత్రలకు కూడా విద్యార్థులను తీసుకువెళ్ళేదాన్ని. నేపాల్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ , గోవా లాంటి ప్రదేశాలకు తీసుకు వెళ్ళాను. అది కష్టమైన పని. అక్కడ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదా ప్రమాదం జరిగినా ఆ టీచర్ బాధ్యత వహించాలి. అందువల్ల ఎవరూ ఆ పని చేయడానికి అంగీకరించే వారు కాదు. పిల్లల మీద ఉండే మమకారం నా చేత ఈ పనులన్నీ చేయించింది. పాఠశాలలోని బోధనేతర సిబ్బంది బాధ్యత కూడా నాదే.. అంటే క్లర్కులు, ఆయమ్మలు, స్వీపర్లు మొదలైన వారు. వాళ్ళ బాగోగులు చూడడం, సాధకబాధకాలు తెలుసుకోవడం, వాళ్ళ చేత పని చేయించడం లాంటివి చేసేదాన్ని.
నా ఉద్యోగ జీవితంలో మేం చేసిన సమ్మె గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మా సిబియసి బోర్డు గుర్తింపు పొందిన పాఠశాల. జాతీయ ప్రభుత్వ వేతనాలు చెల్లించాలి. కానీ అలా జరుగలేదు. అందుకొరకు 1987-89 దాకా అంచెలంచెలుగా మా సమ్మె కొనసాగింది. విషయం ప్రభుత్వం దాకా వెళ్ళి పాక్షికంగా విజయం సాధించాం. కక్షసాధింపు చర్యగా యాజమాన్యం మా ప్రావిడెంట్‌ఫŸండుకు కోతపెట్టింది. దానివల్ల పెన్షన్‌లో మేం ఆర్థికంగా చాలా నష్టపోయినా మా తరువాత వచ్చిన టీచర్లకు చాలా ఉపయోగపడింది.
ప్ర. కుటుంబ పోషణ, పిల్లల పెంపకం, ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగం – వీటన్నింటినీ ఒకేసారి ఎలా సమన్వయం చేసుకున్నారు?
జ. ముఖ్యంగా వీటన్నింటినీ సమన్వయించుకోవడంలో మావారి సహకారం చాలా ఉంది. నా పిల్లలు బడికి వెళ్ళడం మొదలు పెట్టాకనే నా ఉన్నత చదువు, ఉద్యోగం మొదలైంది. నేను చదువుకున్నది సాయంత్రం కళాశాల. అప్పటికే మా ఆయన ఆఫీసు నుంచి వచ్చి పిల్లలను చూసుకునేవాడు. అయితే ఆయన ఎక్కువగా ఉద్యోగరీత్యా క్యాంప్స్‌కు వెళ్ళవలసి వచ్చేది. ఆ సమయంలో నేను కాలేజీ నుంచి వచ్చేసరికి మా పెద్దపాప శ్రీదేవి తన తోబుట్టువులతో హోంవర్క్ చేయించడం, అన్నం తినిపించి వాళ్ళను నిద్రపుచ్చేది. అప్పుడు ఆమె వయసు పదేళ్ళు. ఇంటి పనిలో, వంట పనిలో ఆయన సహకారం అందించేవాడు. ఆయన తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయడం వల్ల నా చదువు విషయంలో కూడా చాలా సహకారం అందించాడు.
ప్ర. “మాడభూషి డా. రంగాచార్య స్మారక సంఘం” స్థాపించడం నేపథ్యం చెప్పండి.
జ. మా వారు జీవించి ఉన్నప్పుడే.. ఆయన పదవీ విరమణ పొందాక, నేను కూడా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, తెలుగు భాషా సాహిత్యాల కొరకు ఏదైనా చేయాలని చాలా సార్లు చర్చించుకునే వాళ్ళం.
ఆయన గుండె పోటుతో హఠాత్తుగా మరణించడం వల్ల ఆయన పేరుతోనే స్మారక సంఘం ఏర్పాటు చేయవలసి వచ్చింది. నేను ఆయన లేరనే విషయాన్ని తట్టుకోలేక అదే ఆవేదనలో ఉన్నప్పుడు జ్వాలాముఖి (మాకు కుటుంబ మిత్రుడు ) నేను దానిలో నుంచి బయట పడడానికి మార్గం స్మారక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటేనని పదే పదే చెప్పి ప్రోత్సహించాడు. మిగతా కుటుంబ మిత్రులు శీలా వీర్రాజు, సుధామ, డా. చంద్రశేఖర రెడ్డి, నాళేశ్వరం శంకరం, నాతో కలిపి ఐదుగురు సభ్యులతో “మాడభూషి డా. రంగాచార్య స్మారక సంఘాన్ని” 2004లో ఏర్పాటు చేసాం. రాధాకృష్ణ మంచి పాఠకుడు. ఆయన మా సంస్థకు చేసిన కృషి మరువలేనిది.
ప్ర. స్మారక సంఘం ద్వారా ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారు?
జ. మూడేళ్ళ కాలపరిమితిలో వచ్చిన కథాసంకలనాలను పరిశీలించి ఉత్తమమైన దానికి అవార్డు ఇవ్వడం. రచయితలు వ్యక్తిగతంగా మా అవార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం ఉండదు. మా కమిటీయే ఆయా రచయితల కథాసంకలనాలను సేకరించి, పరిశీలించి నిర్ణయిస్తారు. ఈ వ్యవహారమంతా మేం అవార్డు ప్రకటించేదాకా రహస్యంగా ఉంటుంది. అవార్డు మెమంటోతోపాటు పదివేల క్యాష్ అవార్డు 2013 నుంచి ఇస్తున్నాం. అంతకు మునుపు ఐదువేల క్యాష్ అవార్డు ఉండేది. అది క్రమం తప్ప కుండా జరుగుతోంది.
మా సంస్థ బాలసాహిత్యంలో కూడా కృషి చేస్తోంది. మొదట్లో విద్యార్థులను ఒక చోటుకు చేర్చి కథలు రాయించే వాళ్ళం. ఇందులో ప్రథమ బహుమతికి వెయ్యి, ద్వితీయ బహుమతికి ఏడు వందలు, తృతీయ బహుమతికి ఐదు వందలు, ప్రత్యేక బహుమతులు రెండు, ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు అందజేస్తాం. పిల్లల కథలను ఇద్దరు బాల సాహిత్య రచయితలు పరిశీలించి, న్యాయ నిర్ణేతలుగా బహుమతులకు ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం పోటీకి ముందు కథారచన కార్యశాల ఉంటుంది. పిల్లలు ఇంటి దగ్గర రాసి పంపడం కాకుండా మేం నిర్ణయించిన చోటుకు వచ్చి, మేమిచ్చిన గంట సమయంలో కథ పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మా పారదర్శకతకు నిదర్శనం.
ప్ర. మీరు ఎంపిక చేసిన అవార్డులను ఎలా అందజేస్తారు?
జ. రంగాచార్య పుట్టిన రోజు, పెళ్ళి రోజును పురస్కరించుకొని 25 ఫిబ్రవరి నాడు ప్రతి ఏడాది సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దలకు, పిల్లలకు ఒకేరోజు అవార్డులు అందించే వాళ్ళం. సమయం సరిపోయేది కాదు. అనుభవంతో ఆ విషయం అర్థమయింది. అందుకని పిల్లలకు బహుమతి ప్రదానం తేదీని మార్చి పదకొండో తేదీన నిర్వహిస్తున్నాం. ఆ రోజు ఆయన వర్ధంతి. దాని కంటే ముందే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల కథారచన పోటీని నవంబర్ నెలలో నిర్వహిస్తాం.
ప్ర. మీరు బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడానికి కారణం?
జ. నేను తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేసి పదవీ విరమణ పొందాను. పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి మాతృభాషను మించిన సాధనం మరొకటి లేదు. కానీ పిల్లలకు తెలుగు చదవడం, రాయడం సరిగ్గా రావడం లేదు. దానిని నేర్పించడానికి కథ బలమైన ప్రక్రియ. మరో విషయం ఏమిటంటే.. స్త్రీ దృక్పధంతో స్త్రీలు రాసిన సాహిత్యం, దళిత స్పృహతో దళిత రచయితలు రాస్తున్న సాహిత్యం స్వానుభవంతో శక్తివంతంగా ఉంటోంది. అలాగే పిల్లలే స్వయంగా తమ అనుభవాలను కథలుగా రాస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే పిల్లలకు కథారచన కార్యశాలలు మేమే ముందుగా మొదలు పెట్టాం. ఇప్పడు తెలంగాణ సాహిత్య అకాడమీ, బాల చెలిమి లాంటి చాలా సంస్థలు బాల సాహిత్యంలో మంచి కృషి చేస్తున్నాయి. స్త్రీల గురించి పురుషులు, దళితుల గురించి అగ్రవర్ణాల వాళ్ళు, పిల్లల గురించి పెద్దలు రాయకూడదని ఏమీ లేదు. కానీ అది సానుభూతితో రాయడం అవుతుంది. స్వానుభవంతో కాదు. సహానుభూతి కంటే స్వానుభవం గొప్పది కదా! అందుకని పిల్లల కొరకు నేను కథలు రాయకుండా వాళ్ళతో రాయించడమే పనిగా పెట్టుకున్నాను.
ప్ర. మీ సంస్థ పిల్లలకు కథా రచన కార్యశాలలు కూడా నిర్వహిస్తుందని విన్నాను. ఆ వివరాలు చెప్పండి.
జ. అవును గిరిజా! మేం కథా రచన పోటీలు నిర్వహిస్తున్న క్రమంలో పిల్లలు విన్నకథలు మక్కీకి మక్కిగా రాస్తున్నారనే విషయం మాకు అవగాహన అయింది. స్వంతంగా రాయడంలో నైపుణ్యాన్ని పెంచడం కొరకు కథా కార్యశాలలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాం. బాల సాహిత్యంలో నిపుణులతో ఈ కార్యశాలను నిర్వహిస్తాం. వాటి ఫలితంగా ఈనాడు పిల్లలు తమ జీవితంలోని సంఘటనలతో కథలు రాస్తున్నారు. అందువల్ల “అనగనగా ఒక రాజు” లాంటి కథల స్థానంలో సామాజిక సమస్యల మీద పిల్లలు రాస్తున్న కథలు అద్భుతంగా వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు బాల సాహిత్యం పరిపుష్టమైంది. బాల సాహిత్యంలో అది చాలా గొప్ప పరిణామం. దీనివల్ల భాషాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయోగం కలిగింది.
ప్ర. భాషా బోధకులకు కలిగిన ఉపయోగం ఎలాంటిది?
జ. గత కొన్నేళ్ళుగా పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రంలో సాహిత్యంలోని వివిధ ప్రక్రియలకు సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. మా కథా కార్యశాలకు విద్యార్థులను తీసుకొని వచ్చే ఉపాధ్యాయులకు తరగతిలో ఆ అంశాన్ని కూలంకషంగా బోధించగలుగుతారు. కథలు రాసే నైపుణ్యంతోపాటు, అక్షర దోషాలు లేకుండా రాయడం పైన కూడా ఒక సెషన్ ఏర్పాటు చేస్తాం. ఇది కూడా టీచర్లకు అక్షరదోషాలు లేకుండా రాసే నైపుణ్యాన్ని తరగతి గదిలో బోధించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని ప్రైవేట్ పాఠశాల (జాన్సన్ గ్రామర్ స్కూల్ లాంటివి) యాజమాన్యాలు తమ తెలుగుశాఖ ఉపాధ్యాయులకు భాషా బోధనలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి మమ్ములను ఆహ్వానిస్తున్నాయి.
ప్ర. మీ సంస్థ ప్రచురణల గురించి చెప్పండి.
జ. బహుమతి పొందిన పిల్లల కథలను “బాలకథా మంజరి” పేరుతో ఐదు సంపుటాలుగా తీసుకువచ్చాం. సభ ఏర్పాటు చేసి అవార్డు పొందిన కథాసంకలనం పైన ఉపన్యాసం చేయిస్తాం. ఆ ప్రసంగ వ్యాసాలను “కథా సమీక్ష” పేరుతో రెండు సంకలనాలు వచ్చాయి. రెండే రావడానికి కారణం వక్తలు తమ ప్రసంగ వ్యాసాన్ని సమయానికి అందించలేకపోవడం. మా సంస్థ ఏర్పాటుకు ప్రోత్సహించిన జ్వాలాముఖి, మా సంస్థకు నిరవధిక సేవలందించిన శీలా వీర్రాజు, రంగాచార్య వాళ్ళ సాహిత్య కృషిని విశ్లేషిస్తూ “స్మరణ” పేరుతో గత ఏడాది ఒక పుస్తకాన్ని తీసుకవచ్చాం. సంస్థ ఏర్పాటు చేసిన తొలినాళ్ళలో “తెలుగు కథానిక” పేరుతో తెలుగు సాహిత్యంలో వచ్చిన కథానిక పరిణామ క్రమాన్ని తెలుపుతూ 2020వ సంవత్సరం దాకా పుస్తకాలను తీసుకువచ్చాం. అనివార్య కారణాల వల్ల దానిని ఆపేసి “నేటికాలపు మేటి కథకులు” పేరుతో ముగ్గురి రచయితల కథారచన పైన విశ్లేషణాత్మకమైన వ్యాసాలను ప్రచురిస్తున్నాం. ఇవి ఆరు సంపుటాలు వచ్చాయి.
ప్ర. మీరు అందుకున్న అవార్డుల గురించి చెప్పండి.
జ. నేను ఎప్పుడూ అవార్డుల కొరకు ఆలోచించి పనిచేయలేదు. అందుకే అవి నా దగ్గరికి రావడానికి చాలా సమయమే పట్టింది. “డా. బ్రహ్మయ్య ట్రస్టు” వారి “బాల ప్రతిభా పురస్కారం” అప్పటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా 2017లో అందుకున్నాను. వరసగా ఆ పురస్కారం మూడేళ్లు వచ్చింది. 2020లో “రంగినేని సుజాతా మోహన్ ఎడ్యుకేషన్ – చారిటబుల్ ట్రసు”్ట వారి “బాల వికాస పురస్కారం” అందుకున్నాను. సాహిత్య సంస్థ నిర్వహణకుగాను “అమృతలత – అపురూప అవార్డ” 2025లో వచ్చింది.
ప్ర. చివరగా నేటి తరానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
జ. నేటితరం చేతిలో పుస్తకాన్ని సెల్‌ఫోన్ ఆక్రమించింది. ఫలితంగా పుస్తక పఠనం తగ్గిపోయింది. అందువల్ల ఓర్పు కూడా నశించింది. రీల్స్ చూడడానికి అలవాటుపడ్డ యువత ఏదైనా తొందరగా జరిగిపోవాలని అనుకుంటున్నది. అందుకే చాలా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ తొందరపాటుతనం మంచిది కాదు. బాగా ఆలోచించి నిలకడగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అపుడే వాళ్ళ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.
