ఆషాడమాసం అంటే తెలంగాణలో బోనాల పండుగ గుర్తుకొస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం రంగురంగుల బోనాలు, అమ్మవారి ఊరేగింపులు, సిగం, కొలుపు, నైవేద్యాలు, బలి వంటి సంప్రదాయాలతో కళకళలాడుతుంది. ఈ పండుగ కోసం వేలాది మంది భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూస్తుంటారు.
ఈ బోనాల పండుగలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే వారిలో శివశక్తులు ఒకరు. వీరిలో మహిళలు, పురుషులు ఉంటారు. పురుష శివశక్తులలో చాలామంది ట్రాన్స్ వ్యక్తులుగా తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో జోగప్పలుగా కూడా జీవనం కొనసాగిస్తున్నారు. ఈసారి వారి జీవన విధానం, ఆధ్యాత్మికత, సామాజిక స్థానం గురించి తెలుసుకుందాం.
శివశక్తులు ఎలా అవుతారు?
చాలా కుటుంబాల్లో అనారోగ్యం, ఆర్థిక నష్టం, కుటుంబ సంక్షోభాలు లేదా ఇతర కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కులు మొక్కడం ఆనవాయితీ. “నా కొడుకును నీకు జోగినిగా అంకితం చేస్తాను”, “నీ సేవకు సమర్పిస్తాను” అని మొక్కుకుంటారు. ఆ మొక్కు నెరవేర్చే సమయంలో బాలుడికి గాజులు వేయడం, జుట్టు పెంచడం, దేవతకు అంకితం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అతను శివశక్తిగా ఎదుగుతాడు.
శివశక్తుల జీవన విధానంలో వైవిధ్యం కనిపిస్తుంది. కొందరు పూర్తిగా మహిళల్లా చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి జీవిస్తారు. మరికొందరు పూజల సమయంలో మాత్రమే ఆ వేషధారణలో ఉంటారు. ఇంకొందరు బయట సాధారణ దుస్తుల్లో కనిపించినప్పటికీ, పూజల సమయంలో మాత్రమే శివశక్తి రూపాన్ని ధరించుకుంటారు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. వీరు చదువుకోవాలా వద్దా అనేది కూడా వ్యక్తిగత నిర్ణయమే. అయితే సమాజంలో ఎదురయ్యే వివక్ష, హేళన, అవకాశాల లేమి వంటి కారణాలు కూడా వారి విద్య, ఉపాధిపై ప్రభావం చూపుతాయి.
తెలంగాణలో దాదాపు ప్రతి జిల్లాలో శివశక్తులు కనిపిస్తారు. వీరిలో ఎక్కువ మంది దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారే. ఆధిపత్య కులాల నుంచి శివశక్తులు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రామదేవతల ఆరాధన చారిత్రకంగా బ్రాహ్మణీయ దేవాలయ వ్యవస్థకు వెలుపల అభివృద్ధి చెందిన జానపద మత సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఈ సంప్రదాయాలలో పూజారిత్వం, సిగం, కొలుపు, జాతరలు వంటి ఆధ్యాత్మిక బాధ్యతలు స్థానిక శ్రమజీవి, పశుపోషక, కళాకార, దళిత-బహుజన సముదాయాల చేతుల్లోనే కొనసాగాయి. అందువల్ల శివశక్తులుగా కూడా ప్రధానంగా ఈ సామాజిక వర్గాలవారే కనిపిస్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక అధికారాన్ని కుల హోదా కంటే దేవత అనుగ్రహమే నిర్ణయిస్తుందనే విశ్వాసం బలంగా ఉంటుంది. శివశక్తుల సామాజిక నేపథ్యాన్ని పరిశీలిస్తే కులం, లింగం, ఆధ్యాత్మికత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని అర్థమవుతుంది. దళిత-బహుజన సముదాయాలకు చెందినవారే అధికంగా శివశక్తులుగా కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది భారత సమాజంలో మతాచారాలు కూడా కుల సంబంధాలను ప్రతిబింబిస్తాయని సూచిస్తుంది.
శివశక్తులు ప్రధానంగా గ్రామదేవతలను ఆరాధిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, ఎర్రపోచమ్మ, నల్లపోచమ్మ, దుర్గమ్మ, మల్లన్న, నరసింహస్వామి వంటి గ్రామదేవతల సేవలో ఉంటారు. పూజల సమయంలో దేవత తమలో ఆవహిస్తుందనే విశ్వాసంతో భక్తుల సమస్యలకు పరిష్కారాలు సూచించడం, పూజలు నిర్వహించడం, కొలుపు చెప్పడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు.
ట్రాన్స్ శివశక్తుల ప్రత్యేకత
హిజ్రా సమాజంలో నిర్వాణం లేదా జననాంగాల తొలగింపును ఒక ముఖ్యమైన సంప్రదాయంగా భావిస్తారు. అయితే శివశక్తులలో అలాంటి ఆచారం ఉండదు. ఎలా పుట్టారో, అలాగే దేవతకు అంకితమైన శరీరంతోనే జీవితాన్ని ముగించాలనే విశ్వాసం వీరిలో బలంగా ఉంటుంది. లైంగికత, కుటుంబ జీవితం విషయంలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. కొందరు పూర్తిగా ట్రాన్స్ మహిళల్లా జీవిస్తారు. మరికొందరు వివాహం చేసుకుని భార్య, పిల్లలతో జీవనం కొనసాగిస్తారు. అయితే భార్య కూడా శివశక్తి జీవన విధానాన్ని అంగీకరించడం ఈ వివాహాల్లో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. వీరు కూడా శివశక్తులుగా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు గురువు ద్వారా వాళ్లు మంగళసూత్రం ధరించడం, లేక పసుపు కొమ్ము ధరించడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి కళ్యాణం చేయించినప్పుడు వాళ్లు కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. శివశక్తుల జీవితం లింగం అనేది కేవలం శరీరంతో నిర్ణయించబడేది కాదని, అది సంస్కృతి, ఆధ్యాత్మికత, సామాజిక అంగీకారాలతో కూడా నిర్మితమవుతుందని చూపిస్తుంది. ఒక వ్యక్తి పురుషుడిగా పుట్టినా, దేవతకు అంకితమై స్త్రీలింగ వ్యక్తీకరణతో జీవించగలడనే అంశం లింగాన్ని అర్థం చేసుకునే సాంప్రదాయ దృక్పథాలను ప్రశ్నిస్తుంది.
శివశక్తిగా మారడానికి శిక్షణ
శివశక్తి కావడం కేవలం దేవతకు అంకితం కావడంతో పూర్తికాదు. ఒక గురువు వద్ద శిక్షణ తీసుకోవడం కూడా అవసరం. పూజా విధానాలు, ఉపవాసాలు, సమస్యలకు అనుగుణంగా పూజలు నిర్వహించడం, భక్తులకు సూచనలు ఇవ్వడం వంటి విషయాలను గురువు దగ్గర నేర్చుకుంటారు. సిగం ఎలా ఊగాలి, ఏ దేవతకు ఏ పాట పాడాలి, ఆ పాటలను ఏ శైలిలో ఆలపించాలి అనే విషయాల్లో కూడా శిక్షణ పొందుతారు. బోనం ఎత్తడం కూడా దశల వారీగా నేర్పబడుతుంది. చిన్న పాత్రతో ప్రారంభించి, పెద్ద బిందెలు, కుండలు మోస్తూ ఊరేగింపుల్లో పాల్గొనే స్థాయికి ఎదుగుతారు. బోనాన్ని నెత్తిపై పెట్టుకుని నాట్యం చేస్తూ గుడికి తీసుకెళ్లి సమర్పించడం వారి సాధనలో భాగంగా ఉంటుంది.
జీవనోపాధి
వీరిలో కొందరు చదువుకుని ఇతర ఉద్యోగాలు చేసినప్పటికీ, ఎక్కువ మంది ప్రధానంగా తమ ఆధ్యాత్మిక సేవల ద్వారానే జీవనం కొనసాగిస్తారు. బోనాల సమయంలో భక్తులు తమ ఇళ్లకు శివశక్తులను ఆహ్వానించి బోనం ఎత్తించడం, పూజలు చేయించడం, కొలుపు చెప్పించుకోవడం చేస్తారు. ఆషాడం, శ్రావణం నెలల్లో జరిగే బోనాలే వీరి సంవత్సర ఆదాయంలో ప్రధాన భాగం. మిగతా కాలాల్లో వారంలో వివిధ రోజులలో పూజలు నిర్వహించడం, సమస్యలతో వచ్చిన భక్తులకు పరిష్కారాలు సూచించడం, జాతరల్లో పాల్గొనడం, ఎల్లమ్మ లేదా మల్లన్న లగ్నాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తారు.
శివశక్తులు సాధారణంగా భక్తుల వద్ద నిర్ణీత రుసుము డిమాండ్ చేయరు. భక్తులు తమ స్థోమతకు అనుగుణంగా దక్షిణ, వెండి, బంగారం, ఆభరణాలు, పట్టు చీరలు, వడిబియ్యం వంటి కానుకలు సమర్పిస్తారు. పూజా సామగ్రి ఖర్చు కూడా సమస్య తీవ్రతను బట్టి మారుతుంది. నిమ్మకాయతో చేసే సాధారణ పూజల నుంచి బోనాలు, బలి, లగ్నాల వరకు వివిధ స్థాయిల్లో పూజలు నిర్వహిస్తారు. జాతరల్లో కూడా శివశక్తులు కీలక పాత్ర పోషిస్తారు. ఒగ్గు కళాకారులతో కలిసి ఎల్లమ్మ, మల్లన్న లగ్నాలు నిర్వహించడం, భక్తుల తరఫున మొక్కులు తీర్చడం వంటి కార్యక్రమాలు వారి జీవనోపాధిలో భాగంగా ఉంటాయి. బోనాల సందర్భంగా ప్రసాదాలు, పిండి వంటలు, బలి అనంతరం చేసే సామూహిక భోజనాలు, కల్లు లేదా ఇతర నైవేద్యాల పంపిణీ, డప్పుల నృత్యాలు కలిపి ఈ ఉత్సవాన్ని ఒక గొప్ప సామూహిక సాంస్కృతిక అనుభవంగా నిలబెడతాయి. ఈ పండుగ ఎంత వైభవంగా ఉంటుందో, అంతే స్థాయిలో శివశక్తులకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా కూడా ఉంటుంది. శివశక్తులు బాగా పూజలు చేసినప్పుడు, వీరి దగ్గరకు వచ్చేవాళ్లు సర్వసాధారణంగా వ్యాపారస్తులు, ఇతర ఉద్యోగస్తులు ఉంటారు. వారిని శివశక్తులు “కాపులు” అని సంబోధిస్తూ ఉంటారు.
ప్రతి శుక్రవారం కొంతమంది కాపులు శివశక్తులను తమ ఇంటికి పిలిపించి పూజలు చేయించుకోవటం, ఏదైనా శుభకార్యాలు జరిగితే వీరితో పూజలు చేయించుకోవటం, దీపావళి, దసరా వంటి సందర్భాల్లో వీరితోనే దృష్టి తీసుకోవటం, అలాగే బోనాల పండుగ సమయంలో కూడా వీరిచేత ప్రత్యేక పూజలు చేయించుకోవటం జరుగుతూ ఉంటుంది.
సమాజంలో శివశక్తుల స్థానం
సాధారణంగా ట్రాన్స్ మహిళలు, హిజ్రాలు ఎదుర్కొనే హేళన, అవమానం, వివక్షతో పోలిస్తే శివశక్తులకు సమాజంలో ఎక్కువ గౌరవం లభిస్తుంది. దేవత ఆవహించే వ్యక్తులుగా ప్రజలు వారిని విశ్వసించడం వల్ల అన్ని కులాలకు చెందినవారు గౌరవంగా చూస్తారు. “దేవుడమ్మ” అని సంబోధిస్తూ పూజలు చేయించుకోవడం, కానుకలు సమర్పించడం సాధారణంగా కనిపిస్తుంది. ఇతర ట్రాన్స్ వ్యక్తులతో పోలిస్తే వీరు సమాజంలో మరింత గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు.
సాధారణ జీవితంలో ట్రాన్స్ వ్యక్తులు వివక్షను ఎదుర్కొన్నా, శివశక్తులుగా దేవతతో అనుసంధానమైనప్పుడు వారికి గౌరవం లభించడం సమాజంలోని వైరుధ్యాలను బయటపెడుతుంది. ఒక వ్యక్తికి గౌరవం అతని మానవ హక్కుల ఆధారంగా కాకుండా, మతపరమైన పాత్ర ఆధారంగా లభించడం కూడా ప్రశ్నించాల్సిన అంశమే.
శివశక్తుల జీవితాలను కేవలం భక్తి లేదా జానపద సంప్రదాయం కోణంలో మాత్రమే చూడడం సరిపోదు. వారి జీవితాలు కులం, లింగం, ఆధ్యాత్మికత, సామాజిక అంగీకారం పరస్పరం ఎలా ముడిపడి ఉన్నాయో చూపిస్తాయి. ఒకవైపు ట్రాన్స్ వ్యక్తులపై వివక్ష కొనసాగుతూనే ఉండగా, మరోవైపు అదే సమాజం దేవత ప్రతినిధులుగా శివశక్తులను గౌరవించడం భారత సమాజంలోని సంక్లిష్ట వైరుధ్యాలను మన ముందుంచుతుంది. ఈ వైరుధ్యాలను అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం, లింగ న్యాయం మరియు సామాజిక సమానత్వం వైపు అడుగులు వేయడం ఒక స్త్రీవాద దృష్టికోణం యొక్క ముఖ్యమైన భాగం.
సమాజం ఒక వ్యక్తిని శివశక్తిగా అంగీకరించినప్పటికీ, అతనిని లేదా ఆమెను స్త్రీత్వానికి సంబంధించిన నిర్దిష్ట ప్రమాణాలకే పరిమితం చేస్తుంది. గాజులు, పసుపు, కుంకుమ, నగలు, చీర వంటి ముత్తైదువకు సంబంధించిన చిహ్నాలను ధరించడం, పవిత్రత, విధేయత, సంయమనం వంటి లక్షణాలను ప్రదర్శించడం ద్వారా మాత్రమే శివశక్తి ఆధ్యాత్మికంగా సంపూర్ణుడిగా లేదా సంపూర్ణురాలిగా గుర్తింపు పొందుతుంది. అంటే, శివశక్తుల లింగ వ్యక్తీకరణ కూడా స్వేచ్ఛాయుతమైనది కాకుండా, మతం నిర్దేశించిన స్త్రీత్వపు చట్రంలోనే అంగీకారం పొందుతుంది.
ఈ నేపథ్యంలో మతం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే కాకుండా, పితృస్వామ్య విలువలను పునరుత్పత్తి చేసే సామాజిక వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. శివశక్తులకు సమాజంలో గౌరవం లభించినప్పటికీ, ఆ గౌరవం వారి వ్యక్తిత్వానికి కాకుండా, వారు ‘ఆదర్శ స్త్రీ’గా, ‘పతివ్రత’గా లేదా ‘ముత్తైదువ’కు సంబంధించిన సంకేతాలను అనుసరించినప్పుడే లభించడం గమనించదగ్గ విషయం. ఈ విధంగా మతం ఒకవైపు వారికి ఆధ్యాత్మిక అధికారాన్ని కల్పిస్తూనే, మరోవైపు పితృస్వామ్యం నిర్దేశించిన స్త్రీ పాత్రలను, ప్రవర్తనా నియమాలను, శరీర రాజకీయాలను కూడా వారి మీద రుద్దుతుంది.
కొలుపు — ప్రజల నమ్మకాల ప్రతిబింబం
ఆషాడ మాసంలో బోనాలు పూర్తయ్యాక కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆలయాల్లో శివశక్తులు కొలుపు చెబుతారు. రాబోయే సంవత్సరంలో గ్రామానికి లేదా బస్తీకి ఏం జరగబోతోంది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మవారు ఏమి కోరుకుంటున్నారు వంటి విషయాలను ప్రకటిస్తారు. నీటి కరువు, వ్యాధులు, సామాజిక దురాచారాలు, ప్రజల ప్రవర్తన వంటి అంశాలపై కూడా సందేశాలు ఇస్తారు. ఈ కొలుపు కోసం ప్రతి సంవత్సరం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సిగం, దేవత ఆవహించడం వంటి అంశాలు పూర్తిగా ప్రజల విశ్వాసానికి సంబంధించినవి. శాస్త్రీయంగా లేదా వైద్యపరంగా వాటిని పూర్తిగా వివరించడం సాధ్యం కాకపోయినా, తెలంగాణ జానపద ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఇవి ఒక ముఖ్యమైన సాంస్కృతిక అనుభవంగా కొనసాగుతున్నాయి. శివశక్తులు కొన్ని కొన్ని క్షేత్రాలకు తమ భక్తులను తీసుకెళ్లటం, అక్కడ కూడా పూజలు చేయటం, అమ్మవారి లగ్నాలు చేయించటం, కళ్యాణాలు నిర్వహించటం జరుగుతూ ఉంటుంది. అందులో మన తెలంగాణలో బాగా ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఏంటంటే బల్కంపేట ఎల్లమ్మ మందిరం, మెదక్‌లోని ఏడుపాయల జాతర, కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు, అలాగే ప్రతి బస్తీలో, ప్రతి గ్రామంలో ఉన్న గ్రామదేవతల గుడుల్లో పూజలు చేస్తూ ఉంటారు.
ఈ విధంగా ప్రత్యేకమైన జాతరల సమయంలో ఈ గుడుల్లో ఆదాయం కూడా పెరుగుతుందని కొందరి నమ్మకం.
