రాత్రి కురిసిన వానకు నేలంతా పచ్చిగా ఉంది. తెల్లవారుజామున ఐదు గంటలకే యశోద లేచింది. కాసేపు పడుకుందామని చూసింది. నిద్ర రాలేదు. రాత్రి కూడా నిద్ర సరిగా పట్టలేదు. ఇక నిద్ర రాదు అని తేల్చుకుని మంచం నుండి లేచింది. లైటు వేసి ఇంటి వెనక వైపు నడిచింది. మొహం మీద నీళ్లు చల్లుకొని బాత్రూంలోని బ్రష్ తీసుకుని మొహం కడుక్కుంది.
కాళ్లు చేతులు సబ్బుతో కడుక్కుని రిఫ్రెష్ అయి నొసట బిళ్ల బొట్టు పెట్టుకుంది. పాచి నోట పాలు పిండడం యశోదకు ఇష్టం ఉండదు. పాలను ఎంతో పవిత్రంగా అన్నిటికి వాడుతారు. పాచి మొహంతో పాలు పిండి పోస్తే తనకు పాపం తగులుతుంది అని యశోద సెంటిమెంటు.
బర్రెను లేపి పొదుగు కడిగి ఇత్తడి సర్వలో పాలు పిండి దూడను తల్లి పాలకు వదిలింది. ఇత్తడి సర్వ అత్త తనకు వారసత్వంగా ఇచ్చి పోయింది. బంగాారం మెరుస్తున్న ఇత్తడి సర్వ. ఎన్నో జ్ఞాపకాలు.
“ఏమండీ! లేస్తారా? ఆరున్నర ్నవుతున్నది. ఇవాళ చాలా పనులున్నయి కద! లెవ్వండి” అంటూ ప్రేమగా పిలిచింది యశోద.
శివారెడ్డికి యశోద పిలుస్తుంటే మరోసారి పిలిపించుకోవాలనిపిస్తుంది. యశోద శివారెడ్డి అన్నోన్య దంపతులు. ఇద్దరూ కష్ట జీవులు. యశోద వరి, కంది, పసుపు, ఉల్లి పంటలతో పాటు కూరగాయలు కూడా పండిస్తుంది. రాత్రి కూర గాయలు తెంపి పెడుతుంది. పొద్దున్నే మారుతి వ్యాన్‌లో టౌనుకు తీసుకుపోతాడు శివారెడ్డి. వారానికి రెండు సార్లు కూరగాయలు తీసుకపోవడం శివారెడ్డి డ్యూటీ. పాలు మిల్క్ సెంటర్లో యశోదే పోసి వస్తుంది. ఇంటి వద్ద చిల్లర అమ్మితే పైసలు చేతికి రావు అని పాల కేంద్రంకే పోస్తారు.
స్నానం చేసి మారుతి వ్యాన్‌లో రెండు గంపుల కూరగాయలు వేసుకొని బయలు దేరాడు శివారెడ్డి.
“ఇయాల తొందరగ రండి. అక్కలు బావలు వస్తమని ఫోన్ చేసిన్రు కద!” అంటూ యాది చేసింది యశోద. వ్యాన్ స్లోగా నడుపుతూ ఆలోచిస్తున్నాడు శివారెడ్డి. శివారెడ్డికి ఇద్దరు అన్నలు. ఒక అక్క. అక్క సుజాత అందరి కన్నా పద్దది. బావ బ్యాంకులో మేనేజర్. సుజాతక్క కొడుకు న్యూజెర్సీలో సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన కొడుకు గోపాల్‌రెడ్డి ఇంటర్. హైదరాబాద్‌లో మంచి ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. బిడ్డ వాగ్దేవికి చిన్నపుడే పెళ్లి చేసాడు. శివారెడ్డి ఆలోచిస్తున్నాడు. అపుడే పశువులు రోడ్డెక్కుతున్నాయి. వ్యాన్ స్లో చేసాడు. రోడ్డు మీద పెండ కడులు. గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టుకోవాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాడు తాను. ఎపుడు ఏదో ఖర్చులు. పంట పైసలు బాగా వచ్చినపుడు ఫీజులు కట్టాల్సి వస్తున్నది. అందరికి ఏడు వారాల నగలున్నవి. తనకు శుభ కార్యాలకు పోవాలంటే చిన్న తనంగా వుంటున్నది అని యశోద గులుగుతుంది. గుర్తు చేస్తుంది.
“నువ్వు కూడ ఉద్యోగం చేస్తే అక్కా బావల తీరు మనం కూడా హాయిగా ఉండచ్చు అని అలిష్టతో అంటుంది యశోద.
అందరు ఉద్యోగాలు చేస్తే వ్యవసాయం ఎవరు చెయ్యాలె. ఉద్యోగంలో ఉంటే ఊరి రాజకీయాలు చేయడం కురది. తానిపుడు జెడ్ పీటీసీ. అది ఎంత పరువు ప్రతిష్టలకు అవసరమో యశోదకు తెలువది. డబ్బు ఒక్కటే ప్రమాణం కాదు. సుఖ మొకటే ప్రమాణం కాదు. అన్నలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఊర్లో వాల్లను ఎవరు దేకుతరు? డబ్బు, సుఖం కన్నా పది మందిలో పవర్ ముఖ్యం. ఈ ఆడోల్లకు ఎంత చెప్పినా అర్థం కాదు అనుకున్నాడు శివారెడ్డి. తరతరాల పటేలు పెత్తనం నిలబెట్టుకోవాలె. రాజకీయాల్లో చక్రం తిప్పితే ఆ కిక్కే వేరు అనుకున్నాడు శివారెడ్డి. హోల్‌సేల్ షాపులో కూరగాయలు ఇచ్చేసి లెక్క రాసుకుని ఇంటికి బయలు దేరాడు శివారెడ్డి.
ఏదో గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. అంతే అలాగే జరగాలి. అందరికి ఒకటే సాలు. తనకు కూడా అదే వర్తించాలి.
పోయిన సంవత్సరం కరోనాతో రాజిరెడ్డి చనిపోయాడు. గవర్నమెంటు టీచర్. కారుణ్య నియామకం కింద తానే వెంటబడి ప్రవీణ్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించాడు. తండ్రికి రావలసిన పైసలు అన్ని అమ్మ పేరిట జమ చేసారు. పెన్షన్ కూడా అమ్మకే. ఎవరూ ఆశ పడేది లేదు అని ఊరి పెద్దలు తీర్మానించారు. ఇల్లు పొలం అన్నీ తమ్మునికే ఇస్తే ఎట్ల? నేను పనిచేస్తేనే కద జీతం వచ్చేది అని ప్రవీణ్ వాదన.
అందరం ఆలోచించి రెండు పాల్లు చేసినం. ఉద్యోగం ఒకరికి. ఇల్లు పొలం ఒకరికి. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు. పెద్దోనివి కనుక నీకే ఛాయిస్.” అన్నారు పెద్దలు. వాదోపవాదాలు అయ్యాక ప్రవీణ్ సరేన్నాడు. స్వంత ఊరన్న కాడ కనీసం ఇల్లు కట్టుకోవటానికి ఖాళీ జాగ అయినా ఇవ్వండి అని పెద్ద మనుషలును కోరాడు. సొంత ఊరులో ఇల్లుండాలనే సెంటిమెంట్‌ని పెద్ద మనుషులు కరిగి పోయారు. ఊరు పక్కన ఉన్న జాగలో రెండు గుంటలు కేటాయించారు.
ఆలోచనలతో ఇల్లు చేరాడు శివారెడ్డి. గంటలో చేరుకుంటాం అని అన్నలు ఫోన్ చేసారు. యశోద ఇల్లు వాకిలి అన్ని అందరు కూర్చోవడానికి అనువుగా కుర్చీలు బల్లలు మంచాలు సర్దింది. అన్నలు వదినెలు టిఫిన్లు చేసే సరికి ఊరి పెద్దలు పక్కూరి సర్పంచులిద్దరు కొలువు దీరారు. తోడి కోడళ్ల మెడలో బంగారు నగలు చూసి యశోద చిన్నబోయి మెడ కనపడకుండా నిండా కొంగు కప్పుకుంది.
“కాకా! కొత్తగ చెప్పేదేముందే! పొలాలు, ఇల్లు మూడు పాల్లు చేయిన్రి. తమ్ముడు తీసుకున్న తర్వాత మిగిలినవే మేం తీసుకుంటం” అన్నాడు పెద్ద మనసుతో రాంరెడ్డి. శివారెడ్డి మాట్లాడలేదు. యశోద మనసు చిన్నబోయింది. ఏదో చెప్ప బోయింది యశోద. పెద్ద మనుషులు కాస్త ఆగుమని సైగ చేశారు.
“బావలకు నగరంలో లక్షల్లో జీతాలు. అపార్టుమెంట్లు కట్టుకున్నారు. ఈ పొలం ఆదాయంతో లక్షలు పెట్టి చదువుకున్నారు. వాళ్లకు రావలసింది వాల్ల చదువులకే ఖర్చయిపోయింది. వచ్చినపుడల్లా బియ్యం పప్పులు అన్నీ పట్టుకపోతారు. ఎరువులకు మందులకు సీడ్సుకు ఒక్క పైసా ఇవ్వరు. పంటలో భాగం మాత్రం కావాలె. పొద్దంత కష్టాలు మావి.” యశోదకు కోపం దుఃఖం ఒక్క సారిగా కమ్ము కొచ్చింది. కొంగు అడ్డం పెట్టుకొని లోలోపల ఏడుస్తున్నది.
“అప్పుడే ఏమైందే యశోదా! ఓపిక పట్టు. పెద్ద మనుషులం మేం ఉన్నం గద.” అంటూ సముదాయించాడు పెద్ద మనిషి. దుఃఖం తట్టుకోలేక యశోద ఇంట్లోకి వెళ్లిపోయింది. తోడి కోడల్లెవరూ ఊకుంచుటానికి పోలేదు. యశోదకు అది కూడ మరింత బాధ పెడుతున్నది.
నా మెడ బోసిగా వుంటే శుభకార్యాలకు పోవుటానికి చిన్నతనంగా ఉందని యశోద గులుగుతున్నది. జీతాలు సంపాదిస్తూ ఏసీ గదుల్లో సెటిల్ అయ్యారు. కానీ, ప్రతి ఏటా కార్తీకమాసంలో పంట చేతికి రాగానే, తమవంతు సన్న బియ్యం బస్తాలు, గానుగ పట్టించిన వేరుశెనగ నూనె, తోటలో కాసిన కూరగాయలను కారు డిక్కీల్లో నింపుకోవడానికి మాత్రం ఊరికి వచ్చేవారు. లక్ష్మణ్ కూడా ఎప్పుడూ ఏమీ అనుకోలేదు. అన్నల చదువులకు, పెళ్లిళ్లకు ఈ భూమి అమ్మకుండా తానే అప్పులు చేసి చదివించాడు. ఊర్లో పండగ పబ్బాలకు విరాళాలు, చుట్టాల మర్యాదలు అన్నీ తనే భరిస్తూ వచ్చాడు.
“మా పాలుకు వచ్చింది కూడ తమ్ముడే దున్నుకోని. మాకు ఇన్ని ఇత్తులు పెడితే చాలు”: అన్నాడు పెద్ద మనసుతో రాంరెడ్డి..
“అమ్మేయడమా? మీకు నెల తిరిగితే లక్షల జీతం బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నా పరిస్థితి ఏంటి? తెల్లవార్లు క్యూలో నిలబడితే కానీ ఒక బస్తా ఎరువు దొరకని బతుకు నాది. అయినా ఈ మట్టిని నేను నమ్ముకున్నాను, మట్టి నన్ను నమ్ముకుంది. మీరు చదువుకుని పెద్దోళ్లయింది ఈ పొలం పెట్టిన అన్నంతోనే కదా! పెద్దన్నకు నాన్న ఉద్యోగం వచ్చింది, దాన్ని చూసి రెండో అన్నకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అన్ని ఖర్చులు తీరిపోయి కార్లలో తిరుగుతున్న మీకు ఈ భూమి ఎందుకు? దీన్ని నాకే విడిచిపెట్టేయండి” అన్నాడు లక్ష్మణ్ గొంతు పూడుకుపోతుండగా. “చట్టప్రకారం తండ్రి ఆస్తిలో అందరికీ సమాన హక్కు ఉంటుంది లక్ష్మణా.. నువ్వు సెంటిమెంట్స్ మాట్లాడితే కుదరదు” అని మాధవ్ తేల్చి చెప్పాడు.
రచ్చబండ పంచాయితీ – కొత్త సామాజిక వాదం
విషయం మరుసటి రోజు ఊరి రచ్చబండ మీద పంచాయితీకి వచ్చింది. ఊరి పెద్దలతో పాటు, లీగల్ చదువుకున్న నవతరం యువకులు కూడా అక్కడ గుమికూడారు. అన్నల వాదన విన్నాక, ఊరి పెద్ద ఒకరు లేచి నిలబడి ఆధునిక సామాజిక కోణాన్ని వివరిస్తూ మాట్లాడారు:
“అట్ల కాదు బావా! పట్నంలో మీకు ఏం తక్కవైంది. పొత్తుల సంసారంల మీరు చదువుకున్నరు. మీ పెండ్లి పేరంటాలైనయి. మీకు పెన్షన్ వస్తది. ఇంకా ఈ ఇల్లు మీద భూముల మీద ఆశ ఎందుకు బావా!” యశోద అన్న జీవన్‌రెడ్డి అన్నాడు.
“అమ్మా నాన్నల ఆస్తిలో మాకేమీ వద్దా?” చిన్న కొడుకు సురేందర్ ఆవేశంగా లేచాడు.
“నేను ఇట్లా అంటున్నా అని ఎవరు తప్పు పట్టుకోవద్దు. చదువుకుని సిటీలో స్థిరపడి ఉద్యోగాల ద్వారా స్థిరమైన ఆదాయం పొందుతున్న మీకు ఈ వ్యవసాయ భూములు ఎందుకు? అటు ఉద్యోగ ఆదాయం నొక్కాలి, ఇటు వ్యవసాయ భూమిని అమ్ముకుని కోట్ల రూపాయలు దాచుకోవాలి అంటే అది సామాజిక అన్యాయం. ఉద్యోగం ఉన్నోళ్లకు వ్యవసాయ భూమితో పనేముంది? నిజంగా మట్టిని నమ్మి సాగు చేసే శివారెడ్డికే భూములు చెందాలె. నన్ను అడిగితే ఉద్యోగం వచ్చినోల్లు భూములు ఏదో ధరకు రైతులకు ఆ భూమిని వదిలేయాలి లేదా అమ్మేయాలి. ఉద్యోగులకు రెండు రకాల ఆదాయాలు ఎందుకు? పొరుగూరు సర్పంచ్, పెద్ద మనిషి యశ్వంత్‌రెడ్డి ఖరాఖండిగా చెప్పాడు. వ్యవసాయ భూములను వదులుకోవాల్సిందే!”
ఈ కొత్త వాదన రచ్చబండ చుట్టూ ఉన్న గ్రామస్థుల్లో ఆలోచన రేకెత్తించింది. యువకులంతా శివారెడ్డికి మద్దతుగా చప్పట్లు కొట్టారు.
ఊరి పెద్దలు లేవనెత్తిన ఆ ‘సామాజిక న్యాయం’. కొత్త ఆలోచనలు రేపింది.
“వ్యవసాయాన్ని కూడా ఉపాధి ఉద్యోగం కింద లెక్కెయ్యాలె. రైతులకు భీమా, ఉచితంగా విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలె. రైతుబంధుతో ఆదుకోవాలె. ప్రభుత్వ ఉద్యోగుల లెక్క మంచిగ బతికే ఏర్పాటు చేయాలె. అట్లా చేస్తే వ్యవసాయంలో కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు వస్తయి. ఆస్తి హక్కు చట్టం మార్చాలె…” అంటూ మల్లారెడ్డి గట్టిగానే వాదించాడు.
“యశోద కళ్లు తుడుచుకొని వాకిట్లోకి వచ్చింది.
“మేం ఎట్ల బతుకుతున్నమో మీరు ఎన్నడు అడగరు బావా! బ్యాంకులో అప్పులు ఎంతున్నయో అడగరు. ట్రాక్టర్ కొందామంటే లోన్ ఇవ్వక పోయిరి. మీరేమైనా సాయం చేసిన్రా! మరి మీరన్న తమ్ముడా ఎట్ల బతుకుతవురా! ట్రక్టర్ కొనుక్కోరా! మేం మార్దజిన్ మనీ కడ్తమని అన్నారా? ఎప్పుడు మీ గురించే! మా గురించి ఎన్నడన్న ఆలోచిండ్రా? అందరికి పంచాయితులు చెప్పే మీ తమ్ముడు అన్నల ముందు నోరు తెరువడు.” యశోద తన వాదన వినిపిస్తూనే ఉంది. అక్కల మెడలు చూడు. నా మెడ చూడు. నాకేమైనా అక్కల తీరు సొమ్ములన్నయా? నా గురించి ఎపుడన్నా ఆలోచించిన్రా బావా?” ఆస్తి పాస్తుల కోసం వస్తే అసలుకే మోసం వచ్చేటట్టున్నది అని తోడి కోడండ్లు గొణుగు తున్నారు.
రాంరెడ్డి పెద్ద మనుసు కరుగుతున్నది. వీడెవడు. నా తమ్ముడు. నా ఎంగిలి పాలు తాగి పెరిగిండు. తన చేతుల మీద పెరిగిండు. ఏ పని చెప్తే ఆ పని చేసిండు. ఊరి పండుగలకు చందాలు అన్నీ వాడే పెట్టుకుంటున్నడు. ఊరి స్కూలు కూడ వాడే పట్టించుకున్నడు”
పంచాయతీ ముచ్చట్లు రణ గొణగా మారింది.
రాంరెడ్డి అందరిని నిశ్శబ్దంగా ఉండుమని తన అభిప్రాయం చెప్పాడు.
“శివారెడ్డి ఎవరు? మా తమ్ముడు. ఆస్తి పాస్తులని ఇల్లు పట్టుకొని ఉన్న శివారెడ్డికే చెందాలె మాకు వచ్చినపుడు ఇంత బియ్యం పప్పులు మీకు చేతనైనంత పెడితే సంతోషం. పంచాయితి పరిష్కారం అయిపోయింది”
తల నేలకేసి కూర్చున్న శివారెడ్డిని లేపాడు రాంరెడ్డి. బిగ్గరగా కౌగలించున్నాడు.
తోడి కోడళ్లు నోరెళ్ల బెట్టారు.
“యశోద వరుసకు మరదాలా నా చెల్లె అసొంటిది. యశోద నా కళ్లు తెరిపింది.” అన్నాడు రాంరెడ్డి.
పెద్ద మనుషలు యవకుల చప్పట్లతో ఇల్లు ప్రతిధ్వనించింది. వంటలు చేయిస్త. అందరు తినిపోవాలె అంటూ యశోద అందరినీ ఆపింది. తలా ఒక పని అందుకున్నారు.
చాల్రోజుల నుంచి నానుతున్న మచ్చట పరిష్కారమైంది. మట్టి మనుషులకు న్యాయం జరిగింది. కొత్త సాలు పడ్డది. ఉద్యోగం ఉంటే ఆస్తి అడగొద్దు. తండ్రి ఉద్యోగం కొడుక్కు వచ్చినపుడు కూడా ఇదే పరిషారం చెప్పినం అని పెద్ద మనుషులు, యువకులు చాలా సంతోష పడ్డారు.
