అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార

దేవల్ షివ్జీ ట్రస్టీల వద్ద వున్న దేవాలయ భూములకు సంబంధించిన పత్రాలనూ, దేవాదాయ శాఖ, మండల్ రెవెన్యూ కార్యాలయాల రికార్డులనూ సంఘం సభ్యులూ, జంగయ్యా, బాల్‌రాజ్‌లు కలసికట్టుగా పరిశీలించి అవన్నీ దేవాలయానికి చెందిన భూములే అన్న నిర్ధారణకు వచ్చారు.

ఆ తదనంతరం గ్రామస్తులు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి చెందినవాళ్లు కలసి ఆ భూమి చుట్టూ వేసిన కంచెను ధ్వంసం చేసి సాగు చేసుకోవడం ప్రారంభించారు. దాంతో పోలీసులు వచ్చి గ్రామస్తులను అరెస్టు చేసి చితకబాదారు. కొందరి మీద బెయిలు దొరక కుండా హత్యాయత్నం కేసులను బనాయించారు. పాస్టర్ బాల్‌రాజ్‌ను ఒక బావిలోకి తోసేశారు. మాదిగలు తాగునీటికి ఉపయోగించే బావిలో అశుద్ధంతో కూడిన కుండలను వేశారు. ఈ గొడవల్లో భూస్వామి విఠల్ రెడ్డి ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించేవాడు కాదు. తెరవెనుక నుంచే తన చెంచాలతో ఇలాంటి కంత్రీ పనులను చేయించేవాడు. బాల్‌రాజ్ ఒంటరిగా వెళ్తుండగా ఆయన మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్లు దళితులే, బాల్‌రాజ్ దళితుడే కాబట్టి కేసు నమోదు చేయలేదు. ఆ భూమిని కొన్న వాళ్లు గ్రామస్తులకు వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేయాలని కోరుతూ మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు.
విచిత్రం ఏమిటంటే సంఘం తరఫున మేమÖ, ఆ కొత్త యజమానులూ హైదరాబాద్‌లోని ఒకే న్యాయవాద కేంద్రంలోని రెడ్డి లాయర్ల వద్దకే వెళ్లాం. మా న్యాయవాది, వాళ్ల న్యాయవాదికి స్వయాన బావమరిది. ఒకరోజు సిపిఐకి చెందిన సుధాకర్ రెడ్డి ‘మనం ఒకసారి కలుసుకుని మాట్లాడుకోవాలి’ అంటూ కబురు పంపించాడు. దేవాలయ భూమిని కొన్నవాళ్లు సిపిఐని సంప్రదించారు. అందుకే సుధాకర్ రెడ్డి ఈ కేసు విషయంలో రాజీ కుదుర్చాలన్న ఉద్దేశంతో వున్నాడు. మేం రాజీ పడే సమస్యే లేదన్న సంగతి ఆ చర్చల సమయంలో ఆయనకు అర్థమైపోయింది. ఆ తరువాత భూమిని కొన్నవాళ్లు వెనక్కి తగ్గారు. పరిస్థితులను గమనించి వాళ్లు ఆ భూమిని సొంతం చేసుకోవాలన్న ఆశను వదులుకున్నారు. మొట్టమొదటిసారిగా మా సంఘానికి సునాయాసంగా లభించిన విజయమది. ఆ గ్రామానికి చెందినవాళ్లే ఆ భూమికి వ్యవసాయదార్లుగా గుర్తింపు పొందారు. మేము పదేపదే దరఖాస్తులు ఇవ్వడం.. ధర్నాలు చేయడంతో చివరికి 1988లో జాయింట్ కలెక్టర్ విఠల్ రెడ్డి పేరుమీద వున్న పట్టాను రద్దు చేసి ఆ రెండు వందల ఎకరాలనూ ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. మిగతా భూమి అంతా దేవాలయ భూమిగా ఆ గ్రామస్తుల నియంత్రణలో వుంటుంది.
పోలీసులు నా మీద పెట్టిన ఒక కేసులో నాకు శిక్ష పడింది కూడా ఈ గ్రామంలోనే. మీర్‌ఖాన్‌పేట్‌కు చెందిన బెగరకంచె పల్లెలో ఒక తెలగ కుటుంబం విఠల్ రెడ్డికి చాలా విధేయంగా వుండేది. అందుకే భూపోరాటంలో పాల్గొనేందుకు వాళ్లు నిరాకరించారు. దాంతో సాటి కులస్తులంతా 1987 నుంచీ వారిపై సంఘబహిష్కరణను పాటించేవారు. నా మీదా, బెగరకంచె జనం మీదా ఆ కుటుంబంవాళ్లే కేసు పెట్టారు. నేనే వారి సంఘ బహిష్కరణకు ప్రేరేపించాననేది వారి ఆరోపణ. దానిని నేను ప్రేరేపించకపోయినా ఆ జనానికి మద్దతు ఇచ్చిన మాట మాత్రం వాస్తవమే. అదొక చిల్లర కేసు అన్న భావనతో నేను ఆ కేసును సరిగా పట్టించుకోలేదు. చివరికి ఇబ్రహీంపట్నం మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టు నన్ను దోషిగా నిర్ధారించింది. నాకూ, డిల్లీ జంగయ్యకూ, మరికొందరికీ రూ.400ల చొప్పున జరిమానా విధించింది. అప్పుడు 1989లో మేము మంచి క్రిమినల్ న్యాయవాది అన్న పేరున్న చల్లా నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో అప్పీలు ఫైల్ చేశాం. కానీ అక్కడ మా అప్పీలును కొట్టివేశారు. ట్రయల్ కోర్టును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదనీ, పై కోర్టులన్నీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకుంటాయనీ నాకు ఆ కేసు మంచి గుణపాఠం నేర్పింది.
భూపోరాటాలను నిర్వహించడమనేది ఒక కఠినమైన అభ్యాసం. భూస్వాముల కబ్జాలో వున్న ప్రభుత్వ భూములను తిరిగి పేదలకు దక్కేలా చేయాలంటే వారికి మద్దతిస్తే చాలు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు రక్షిత కౌలుదార్లు కూడా తమకు జరిగిన అన్యాయం గురించి మా దగ్గరకు రావడం మొదలుపెట్టారు. వారి విషయంలో ఏం చేయాలి? అవన్నీ వ్యక్తిగత కేసులు. అందులోనూ చాలావరకు వెనుకబడ్డ కులాల వారికి చెందిన కేసులు. ఎక్కడో ఒకటీ అరా తప్ప మాదిగలకు సంబంధించినవి వుండేవి కావు. ఆ కేసులను చేపట్టి మొత్తం గ్రామంలోని పేదలను ఎలా సంఘటితపరచగలం? మాది వ్యవసాయ కూలీల సంఘం. వామపక్ష పార్టీలు చేసిన తప్పును మేం ఎక్కడ చేస్తామోనన్న భయం నాలో వుండేది. వాళ్లు చిన్న, మధ్యతరహా రైతులను కూడా తమ యÖనియన్‌లో చేర్చుకుని వారి డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నించేవారు. చివరికి ఆ మధ్య తరగతి రైతులే తమ డిమాండ్లతో మొత్తం యÖనియన్‌పై ఆధిపత్యం వహించేవారు. నేను వెనకాముందు అవడానికి మరో కారణం నాకూ, మాదిగలకూ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం. దానివల్ల ఇతర కులాల వారికి పాక్షికంగా నాకు నేనుగా దూరంగా వున్నాను. మాదిగలలో రక్షిత కౌలుదార్లు చాలా అరుదు. కౌలుదార్ల సమస్యను చేపడితే మా ప్రాథమిక మాదిగల భూపోరాటానికి ఎక్కడ దూరం కావలసి వస్తుందోనని ఆందోళనగా వుండేది. అప్పుడు రక్షిత కౌలుదార్ల సమస్యల విషయంలో మనం ఏం చేయాలో.. ఏం చేయకూడదో నజ్దికసింగారం గ్రామానికి చెందిన సత్యమ్మ పలు సూచనలు చేసింది. భూస్వాములకు వ్యతిరేకంగా బీసీలు చేసే పోరాటానికి మాదిగలు కూడా నిస్సంకోచంగా మద్దతిచ్చారు.
రక్షిత కౌలుదార్లకు సంబంధించిన చాలా కేసులు మా దగ్గరకు వచ్చాయి. ఎక్కడైతే కౌలుదార్లు వుండేవారో అక్కడ వారికి తిరిగి ఆ భూములు ఇవ్వాలని 1950 ప్రొటెక్టెడ్ టెనెన్సీ (పిటి) ఆక్ట్ లోని సెక్షన్ 32 చెబుతోంది. ఆ మేరకు చర్యలు తీసుకునే అధికారాన్ని ఎంఆరఓకు ఇచ్చారు. సివిల్ కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు వీలులేదు. నిజానికి కౌలుదార్లకు భద్రత కల్పించేందుకు ఇంజంక్షన్ ఆర్డర్స్ జారీచేసే అధికారం ఎంఆరఓకు వుంది. కానీ, ఎంఆరఓలు ఎప్పుడూ ఈ అధికారాన్ని ఉపయోగించలేదు. పట్టాదార్లు మాత్రం స్టే తెచ్చుకునేందుకు అబద్ధపు వాదనలతో సివిల్ కోర్టులకు వెళ్లేవారు. ప్రతి గ్రామంలో మాకు న్యాయం చేయండి అంటూ ఎంతోమంది కౌలుదార్లు బాగా నలిగిన, చిరిగిపోయిన రక్షిత కౌలుదారీ సర్టిఫికెట్లను పట్టుకుని మా వద్దకు వచ్చేవారు. రక్షిత కౌలుదార్ల హక్కుల పరిరక్షణ కోసం పిటిషన్లు వేయడానికి మేం సిద్ధపడుతూనే వారికి ఇతర గ్రామీణుల మద్దతును సమీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం.
రక్షిత కౌలుదారీ (పి.టి.) చట్టం కింద మేము ఎన్నో కేసుల్లో పోరాడి విజయం సాధించాం. వాటిలో ఎలిమినేడు ముత్యాలు కేసొకటి. 1954లో అతను ఇరవై ఏళ్ల యువకుడిగా వున్నప్పుడు మల్లారెడ్డికి చెందిన పదహారు ఎకరాల భూమిని కౌలుదారుగా సాగుచేసుకునేవాడు. ఆంధ్ర ప్రదేశ్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం, 1950 కింద అతను 1956లో రక్షిత కౌలుదారుగా గుర్తించబడ్డాడు. ఆ వెంటనే మల్లారెడ్డి అతడిని తన భూమిలోంచి వెళ్లగొట్టాడు. ముత్యాలు వద్ద వున్న పిటి గుర్తింపు పత్రం అతనికి తన భూమిపై హక్కును కల్పిస్తుందని ఆ భూస్వామి ముందుగానే పసిగట్టాడు. అయితే సరిగ్గా అదేసమయంలో ఎలిమినేడు ముత్యాలు తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ అతనిమీద పడ్డాయి. సరైన బతుకుదెరువు లేకపోవడం వల్ల ముత్యాలు యాభై రూపాయల అప్పు కోసం వెట్టి చాకిరీ కూలీగా మారిపోయాడు. అతనికొచ్చే చాలీ చాలని జీతం అప్పు తీర్చేందుకు ఏమాత్రం పనికొచ్చేది కాదు. ఆరోజుల్లో చాలామంది వెట్టి కూలీలు ఒక యజమానిని వదిలి మరో యజమాని వద్దకు వెళ్లిపోతుండేవారు. కానీ ముత్యాలు ఏకంగా ముఫ్పై సంవత్సరాల పాటు అదే మల్లా రెడ్డి వద్ద వెట్టి చాకిరీ కూలీగా పడివున్నాడు. 1987లో కూడా ఎలాంటి పొలం లేకుండా అదే పూరిగుడిసెలో బతుకుతుండేవాడు. అతని కొడుకు కూడా మలా ్లరెడ్డి దగ్గరే పశువులను కాస్తుండేవాడు. తీరని అప్పు, వెట్టి చాకిరీతో విసిగిపోయిన ఆ ఊరి కూలీలంతా ఒక్కటై తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వాళ్లందరి తరఫునా మాట్లాడగలిగే నాయకుడిగా ముత్యాలు ముందుకొచ్చాడు.
తన కౌలు హక్కును పునరుద్ధరించాలంటూ ముత్యాలు భూస్వామి మల్లా రెడ్డికి వ్యతిరేకంగా ఎంఆరఓ వద్ద ఒక కేసు వేశాడు. ఆ వెంటనే అప్పును ఇక చెల్లించేది లేదంటూ మల్లా రెడ్డి వద్ద వెట్టి చాకిరీని మానివేశాడు. దాంతో భూస్వామి మల్లా రెడ్డి మండిపడుతూ ముత్యాలు పూరిగుడిసెకు వచ్చి ఒకప్పుడు తను అతనికి ఇచ్చిన చిరిగిపోయిన గొంగడినీ, అరిగిపోయిన చెప్పులనూ తీసుకెళ్లిపోయాడు. ఆ చర్య ముత్యాలుకు మరింత ఏవగింపును కలిగించాయి. ఇకనుంచి మల్లా రెడ్డికి మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాడు. ఆ భూస్వామి తనకు చేసిన అన్యాయం గురించి ఎంఆరఒ ఆఫీసులో, టీ షాపులో, బస్‌స్టాప్‌లో గొంతుచించుకుని అందరికీ టాంటాం చేస్తూ అతని పరువు పోయేలా చేశాడు. భూస్వాముల భార్యలు ‘మాదిగోళ్ల నోరంత చెడ్డ నోరు ఇంకోటి వుండదు’ అని తమ అక్కసును వెళ్లగక్కేవారు. అప్పుడు ముత్యాలు నోటినుంచి వెలువడే బూతు మాటల్ని స్థానికులు నాకు చెప్పడానికి కూడా ఇష్టపడేవారు కాదు. తన కౌలు హక్కును పునరుద్ధరించాలంటూ యాచారం bంఆరఓకు ముత్యాలు పిటిషన్‌ను సమర్పించాడు. మా సంఘం సహాయంతో ఎలిమినేడు ముత్యాలు ఆ కేసులో విజయం సాధించి దాదాపు నలభై సంవత్సరాల తర్వాత పదహారు ఎకరాల మీద తన కౌలు హక్కును తిరిగి పొందగలిగాడు. లండన్‌లో వుండే ఆ భూస్వామి మల్లా రెడ్డి కొడుకు యాచారాని వచ్చినప్పుడు కేసు పూర్వాపరాలు తెలుసుకుని.. రక్షిత కౌలు పత్రాలను పరిశీలించి.. వాస్తవాలు గ్రహించి ఇంక ఆ కేసును సాగదీయకుండా అంతటితో వదిలేయమని తన తండ్రికి సలహాయిచ్చి వెళ్లాడు.
ఆకుల మైలారం గ్రామానికి చెందిన రావుల రాములు పట్టుదల, మాటకారితనం వున్న ఒక రక్షిత కౌలుదారు. పదిహేను ఎకరాల విలువైన భూమికి సంబంధించిన తన సొంత కౌలుదారీ కేసు కోసం అతనే స్వయంగా పోరాడాడు. మండల రెవెన్యూ కోర్టు నుంచి హైకోర్టు వరకూ వెళ్లాడు. ఆఖరుకు విజయం సాధించాడు. రాములు ఇప్పుడు పచ్చగా కళకళలాడే రైతు.
ఇక తాటిపర్తికి చెందిన సత్యమ్మది చాలా వివరంగా చెప్పుకోవాల్సిన కేసు. నజిదిక్‌సింగారం గ్రామంలోని ఒక గొల్ల కుటుంబంలో ఇద్దరు కూతుళ్లలో ఆమె ఒకరు. సత్యమ్మ తండ్రికి మగ సంతానం లేదు. యాచారంకు ఆరు కిలోమీటర్ల దూరంలో వుంటుందా వూరు. అక్కడ ఆమె తండ్రికి నాలుగు ఎకరాల కౌలు భూమి వుంది. అది పప్పు సుబ్బయ్యకు చెందింది. సాధారణంగా భూస్వాములు తమ కౌలుదార్లలలో ఎవరికైనా రక్షిత కౌలుదారు (పిటి) సర్టిఫికెట్ లభిస్తే వారు ఆ కౌలుదార్లను తమ భూముల్లోంచి వెళ్లగొట్టేవారు. ఎందుకంటే ఆ పత్రం వల్ల కౌలుదార్లకు ఆ భూమిపై రక్షణతో పాటు కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. ఆ భూమిని లేదా అందులో కొంత భాగాన్ని సముచిత ధరకు వాళ్లు కొనుగోలు చేసే హక్కును కూడా ఆ పత్రం కల్పిస్తుంది. అందువల్లనే పిటి సర్టిఫికెట్ పొందిన కౌలుదార్లను భూస్వాములు తమ భూముల్లోంచి వెళ్లగొట్టేవారు. అయితే పప్పు సుబ్బయ్య సత్యమ్మ తండ్రిని అట్లా వెళ్లగొట్టకుండా ఆ భూమిని స్థానిక దేవాలయానికి విరాళంగా ఇచ్చేశాడు.
తండ్రి చనిపోయిన తరువాత సత్యమ్మ తన సోదరి ఆమోదంతో ఆ భూమిపై తమ కౌలు హక్కును పునరుద్ధరించుకోవాలని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఆమెకు తాటిపత్రి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లయింది. ఆమె పుట్టింటికి ఆ ఊరు ఐదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇక తమ తండ్రి కౌలు భూమి కూడా ఆమె అత్తగారింటికి దగ్గరగా వుంటుంది. ఎప్పుడైతే ఆమె ఆ భూమిపై కౌలు హక్కుకోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడే పప్పు సుబ్బయ్య ముందుజాగ్రత్తతో సివిల్ కోర్టులో కేసు వేశాడు. సత్యమ్మ ఆ కేసునే కొనసాగిస్తే తప్పకుండా ఓడిపోయి వుండేది. కానీ, చాలా తెలివిగా, దానికి సమాంతరంగా ఎంఆరఓ కోర్టులో కేసు వేసింది. అక్కడ ఆమే గెలిచింది.
సత్యమ్మ నా దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడల్లా నేను ‘నువ్వు కూలీవి కావు, పట్టాదారువి కదా. మా సంఘంలో కూలీలకు తప్ప పట్టాదార్లకు స్థానం లేదు. ఇంకోసారి ఇక్కడికి రావద్దు’ అనేదాన్ని. అప్పటికి మాకు రక్షిత కౌలుదార్ల గురించి పూర్తి అవగాహన లేదు. ఆమె మాత్రం ‘కానీ వాళ్లు నా భూమిలో నన్ను అడుగుపెట్టనిస్తలేరు కదమ్మా’ అనేది. ఆమె చెప్పేది అర్థం చేసుకునేందుకు మాకు ఒకటి రెండు నెలలు పట్టి వుంటుంది. ఆమెకు తన భూమి మీద తనకు హక్కు కావాలి. అందుకు సంఘం మద్దతు చాలా అవసరం. మేం మొదట్లో ఆమెను పట్టించుకోకపోయినా సహనాన్ని కోల్పోకుండా మా దగ్గరకు పదే పదే వస్తూనే వుండేది. చివరికి ఆ కేసులో సత్యమ్మ గెలిచిన తరువాత కూడా సంఘం నిర్వహించే ప్రతి సమావేశానికి హాజరయ్యేది. ఆ సమావేశాలన్నీ తనకోసమే అన్నట్టు భావించేది. 1987 మొదట్లో మగవాళ్ల గుంపులో ఆమె ఒక్కత్తే మహిళ. మీటింగ్ అవుతున్నప్పుడు భోజన విరామ సమయంలో తను వెంట తెచ్చుకున్న మÖటను విప్పి జొన్న రొట్టెలను మిరప కారంతో తినేది. తన ఇబ్బందుల గురించి ఎప్పుడూ ప్రస్తావించేది కాదు. బస్సు చార్జీలు కావాలని కూడా అడిగేది కాదు. సంఘం కార్యక్రమాలన్నింటిలో చురుకుగా పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఏదైనా ఆఫీసులో ఆమెకు సమస్య వస్తే ప్రతి ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకొచ్చేవారు.
సత్యమ్మ మంచి మాటకారి. ఏ ఉన్నతాధికారితోనైనా చొరవగా మాట్లాడగలిగేది. చౌకీదార్లు, పోలీసులు ఎవరితోనైనా చాకచక్యంగా వ్యవహరించగలిగేది. నేనామెతో చివరిసారిగా మాట్లాడింది 2002లో. అంటే ఇబ్రహీంపట్నంనుంచి వెనక్కి వచ్చేసిన పదేళ్ల తరువాత అన్నమాట. అప్పుడు ఆమె ఒక చేతి సంచీలో ముఖ్యమైన పత్రాలను, వార్తాపత్రికల కత్తిరింపులను, ఓ పత్రికలో వచ్చిన తన ఇంటర్వ్యూను, నేను ఆమె గురించి రాసిన వార్తాకథనాన్ని, ఒక వేదిక మీద ముఖ్యమంత్రితో కలసి వున్న తన ఫోటోను, సంఘంలో తన 15 సంవత్వరాల సభ్యత్వ గుర్తింపు కార్డును మరికొన్ని జ్ఞాపకాలని నాకు చూపించింది.
‘నేను పుట్టంగనె మా అమ్మ సచ్చిపోయిందమ్మా’ అంది సత్యమ్మ. ‘మా పెద్దమ్మ నన్ను వాళ్ల ఊరు సాకన్నపల్లికి తీసుకుపోయి పెంచింది. తొమ్మిదేళ్ల వయసప్పుడే వాళ్లు నాకు పెండ్లి చేసిండ్లు. నేను కట్నం కింద తీసుకపోయిన గొర్రెల్ని నా మొగుడు అమ్ముకున్నడు. ఆ గొర్రెల్ని నువ్వు సక్కగ సూసుకోవాల్సి వుండె కదనె అని మా అత్త నన్నే కొట్టింది. నా మొగుడు ఆ గొర్రెల్ని కల్వకుర్తిలోని ఒక లంబాడాయనకు అమ్మిండు. ఆ గొర్రెలు నావి.. వాటిని అమ్మిన పైసలు నా మొగుడికి ఇవ్వొద్దని చెప్తే మా ఊరి దొర అట్లనే కల్వకుర్తి దొరకు ఒక ఉత్తరం రాసిచ్చిండు. దాన్ని కొంచబోయి కల్వకుర్తి దొరకు ఇచ్చిన. ఆ రోజుల్లో బస్సులు లేకుండె. నడుచుకుంటనే ఆ ఊరుకు పోయిన. ఆ ఉత్తరం సదివినంక నా మొగుడికి గొర్రెలను అమ్మిన పైసలు ఇయ్యకుండ ఆపిండ్లు. అప్పుడు నా మొగుడు నన్ను బాగా కొట్టిండు. నా చెయ్యిని విరగ్గొట్టిండు’ అంటూ సత్యమ్మ తన చేతి గాయాలను చూపించింది.
‘నా గొర్రెలను అప్పటికే వాళ్ల పెద్ద మందలో కలిపేసుకున్నరు. అక్కడ గొర్రెల మందకు కాపలాకాసే యెల్లగోళ్ల ముత్యాలు ‘వీటిలల్ల నీ గొర్రెలేవో గుర్తుపట్టు. అవి నిజంగ నియ్యే అయితే నీకు తెలుస్తయి కదా’ అన్నడు. నేను ఒకదాని తర్వాత ఇంకొకటి నా గొర్రెలనన్నింటిని గుర్తుపట్టి బయటకు తెచ్చిన. ఒక గొర్రె కొద్ది రోజుల కిందనే పిల్లను గన్నట్టు కనపడ్డది. దీని గొర్రె పిల్ల ఏది అని అడిగిన. ముత్యాలు అన్నడు ఈ మందలోనే వుంటయి చూడు. దొరికితె తీసుకపో. నువ్వు కనుక్కోలేక పోయినవంటే నువ్వు గొల్లోనికి కాదు మాదిగోనికి పుట్టినదానివన్నట్టె లెక్క అన్నడు. అక్కడ మొత్తం పన్నెండు గొర్రె పిల్లలున్నయి. అన్నిటిని చూసి నేను ఒక దాన్ని చేతుల్లకు తీసుకున్న. అది దాని తల్లి దగ్గరకు తోక ఊపుకుంట ఉరికింది. గట్ల నా గొర్రెల నన్నింటిని మల్ల నా ఇంటికి తెచ్చుకున్న’ అన్నది.
‘మా నాయిన నజ్దిక్‌సింగారం ఊళ్లె వుండెటోడు. సచ్చిపోయిండు. ఆయనకు మగ సంతానం లేదు. అక్కచెల్లెళ్లం ఇద్దరమే వారసులం. దహనం అయిపోయినంక ఇంటికి వస్తుంటె నజ్దిక్‌సింగారం పట్వారి నడ్డి రాములు కనిపించి నువ్వేం బాధపడకు బిడ్డా, మీ భూములను మీకు నేనిప్పిస్త అన్నడు. ఆయన మాల క్రైస్తవుడు. నేను ఆయనకు ఒక దరఖాస్తు ఇచ్చి మా నాయనకు చట్టబద్ధ వారసురాలిని అన్న సర్టిఫికెట్‌ను తీసుకున్న. పట్వారి రాములువాళ్ల అమ్మమ్మది చింతుల. మా ఊరుకు పది కిలోమీటర్ల దూరంý వుంటది. ఆ ఊర్లె తన అమ్మమ్మ భూమి చట్టబద్ధ వారసుడు అని చెప్పి గా పట్వారి రాములుకే వచ్చింది. అందుకె కూతుళ్లకు కూడ వారసత్వ ఆస్తి హక్కు వుంటుందన్న సంగతి ఆయనకు బాగ తెలుసు.’ ‘మోరయ్య రెడ్డి పటేల్ నాకు పహానీ పత్రాలు ఇప్పిస్త నని మాట ఇచ్చిండు. అందుకని నా తొమ్మిదేళ్ల బిడ్డను హైదరాబాద్‌లో వుండె మోరయ్య రెడ్డి పటేల్ ఇంట్ల పనికి పంపిన. ఆయన మా ఊళ్లె పెద్ద దొర. పైరవికారు కూడ. నేను ఇట్ల ఏ పని చేసినా నా మొగునికి తెలియకుండ చేయవలసి వచ్చేది. తెలిస్తె కొడుతడు. ‘లంజదానా, పైరవీలు చేస్తున్నవానే. ఆఫీసులల్ల బ్రోకరు పనులు చేస్తున్నవా లంజముండ.. అని తిడుతడు’.
‘నేను మా భూమికి సంబంధించిన పత్రాలు సంపాయిస్తున్ననని తెలవంగనె మా భూస్వామి పప్పు సుబ్బయ్య నాకు ఇబ్రహీంపట్నం మున్సిఫ్ కోర్టు నుంచి ఇన్‌జంక్షన్ ఆర్డర్ పంపించిండు. నేను నా తరఫున వాదించేందుకు గులామ్ హైదర్ అనే వకీలును పెట్టుకున్న. ఈలోపల మా ఊరి బడా భూస్వామి, ఊరి పెద్ద అయిన జంగా రెడ్డి పటేల్‌కు నా మీద బగ్గ కోపం వచ్చింది. ఎందుకంటె నేను ఆయనకు చెప్పకుంట గీ పనులు చేస్తున్ననని. నేను ఆయనను సలహా అడగకపోయెవరకు నీ పెండ్లాం రాజకీయాలల్లకు పోతుందిరో.. జర సూస్కో అని నా మొగుణ్ని రెచ్చగొట్టిండు. దాంతోని నా మొగుడు నన్ను ఇయ్యర మయ్యర కొట్టిండు. ఊరి పంచాయితీకి ఈడ్చుక పోయిండు. అక్కడ జంగా రెడ్డి పటేల్ ‘సత్యమ్మా, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నవట. నీ మొగుడు నీకు విడాకులిస్తనంటున్నడు’ అన్నడు.
‘ఎక్కడెక్కడ తిరుగుతున్ననట అని నేనాయన్ను అడిగిన. ఈ ఊర్లె కోడలిగ అడుగుపెట్టినప్పటి సంది నువ్వు నన్ను సూస్తున్నవు కద పటేలా.. నేను మీ ఇండ్లు కట్టిన.. మీ ఛెత్‌లు పోసిన.. మీ బావులకాడ, మీ పొలాల కాడ పనిచేసిన.. మీ ఇంట్ల పెళ్లిల్లప్పుడు సకల చాకిరీలు చేసిన.. మన ఊర్లె రోగాలొచ్చినప్పుడు ఒక నర్సు లెక్క ఊరందరికీ సేవలు చేసిన.. అయినా నాకు ఒక్క ఎకురం భూమి సుత లేదు. రేపు నేను సచ్చిపోతె పాతిపెట్టనీకి జానెడు జాగలేదు. గందుకె నా తల్లిగారి తరపు భూమి కోసం నేను బరాబరి కొట్లాడుతున్న తప్పా అన్న. గా మాటలకు జంగా రెడ్డి పటేల్‌కు బగ్గ కోపమొచ్చింది. ‘ఏహ్ గదంత గాదే.. నీకు నీ మొగుడు కావాల్నా.. లేకపోతె భూమి కావాల్నా గది చెప్పు’ అన్నడు. నాకు మొగుడొద్దు.. భూమే కావాల్నని ఖరాకండిగ చెప్పి అక్కడి నుంచి మా పుట్టినూరు నజ్దిక్‌సింగారం పోయిన’ అని చెప్పుకొచ్చింది సత్యమ్మ.
తన కేసు ఇబ్రహీంపట్నం మున్సిఫ్ కోర్టులో నడుస్తున్నప్పుడే 1987లో నా గురించి సత్యమ్మ విన్నదట. ఆ విషయం ప్రస్తావిస్తూ ‘గప్పటి సంది నీ దగ్గరకు సాయం కోసం వస్తావుంటె నువ్వేమొ కసిరిచ్చుకుంట ఎల్లగొడుతుంటివమ్మా’ అంది. ‘అటెన్క సిరిల్ రెడ్డి నా గోడు విని, నా దగ్గరున్న కాగితాలన్నీ చూసి, ఈమె కేసు జాగ్రత్తగా చూడు అని నీకు చెప్పిండు. గప్పటిసందే నువ్వు నన్ను పట్టించుకున్నవు’ అంది.
ఆతరువాత మేము ఆమె రక్షిత కౌలును (పిటి) పునరుద్ధరించాలని కోరుతూ యాచారం ఎంఆరఓ ఆఫీసులో ఒక కేసు ఫైల్ చేశాం. భూస్వామి పప్పు సుబ్బయ్య అల్లుడు సోమయ్యే ఆయన తరపు వకీలు. ఒకసారి ఎంఆరఓ ఆఫీసులో సోమయ్య ‘కొంతమంది ఆడోళ్లకు అటువంటి ధైర్యం వుంటది మరి’ అని ఎవరితోనో అంటున్నాడు. ఆయనెవరో తెలిసిన తరువాత నేను గట్టిగా ‘మా నాయన చచ్చిపోతె ఆయన భూమి మీద నాకు అధికారం వుండదా? పప్పు సుబ్బయ్యకు ఒక్కతే కూతురు కదా. రేపు ఆయన సచ్చిపోతే ఆ కూతురుకు ఆయన భూముల మీద హక్కు వుంటదా వుండదా? నేను సవాలు చేసి అడుగుతున్న. కావాలంటే పప్పు సుబ్బయ్యను ఇప్పుడే తన ఆస్తిని ప్రజలకు రాసియ్యమనండి. అప్పుడు నేను కూడ అదే పని చేస్త’ అన్న. అప్పుడు ఆయన అల్లుడు సోమయ్య ‘పప్పు సుబ్బయ్య గురించి మాట్లాడుతున్నావు. ఎవరివి నువ్వు?’ అన్నాడు.
నేను ఎవరినో, ఎంఆరఓకు పిటిషన్లు ఎందుకు పెట్టిన్నో చెప్పిన తరవాత సోమయ్య తన మామకు చట్టంలో ఏముందో వివరించి ఇంక ఈ కేసును తను వాదించనని మామకు చెప్పేశాడు. సుబ్బయ్య కేసును విరమించుకోవడంతో ఎంఆరఓ సత్యమ్మకు ఆ భూమిని దాఖలుపరిచాడు. కానీ ఆ తరువాత తను అలా విరమించుకున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కోర్టులో పప్పు సుబ్బయ్య మళ్లీ ఒక అప్పీలు ఫైల్ చేశాడు. నేను అప్పుడు పప్పు సుబ్బయ్య అల్లుడిని కలవడానికి వెళ్లాను. అతను తన మామ కేసును చేపట్టనని స్పష్టం చెప్పాడు. సుబ్బయ్య మరో లాయర్‌ని కుదుర్చుకున్నాడు. కానీ కేసు పెండింగ్‌లో వుండగానే అతను చనిపోయాడు. అట్లా ఆ కేసును సత్యమ్మ గెలిచింది.
‘ఆనాడు నాకు నువ్వు వద్దు పో అన్న మొగుడు ఇయాల తనంతటతనే నా దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు బుద్ధిమంతుడిలెక్క నా పొలంలో పనిచేస్తున్నడు. అప్పుడు నాకు అడుగడుగున అడ్డుపడోల్లే ఇప్పుడు ప్రతిదానికీ వచ్చి నా చుట్టు తిరుగుతున్నరు. సత్యమ్మ తలచుకుంటే ఏమైనా సాధిస్తది’ అంటున్నరు అంది సత్యమ్మ. ఆ కేసు నడుస్తున్నప్పుడు సత్యమ్మ అధికార్ల నుంచి, రెడ్డి వకీళ్లనుంచి అనేక అవమానాలను ఎదుర్కొన్నది. కానీ ఎన్నడూ వాళ్లంటే భయపడలేదు. ఒక అధికారి అయితే ఆమె మీద చెడుగా ప్రవర్తించబోయాడు. మరొక వకీలు కోర్టులో జాయింట్ కలెక్టర్ ముందే సత్యమ్మ మీద “రాక్షసిదానా! నీకు ఆ భూమి ఎట్లా దక్కుతుందో నేను చూస్త” అని సవాలు చేశాడు. ఆమె ఆరోజుల్లో కర్ఫ్యూలను కూడా లెక్కచేయకుండా ప్రతి వాయిదాకూ కోర్టుకు వచ్చి హాజరయ్యేది. ఒక అధికారి ఆమెను లంచం అడిగితే సత్యమ్మ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసి అతణ్ని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయించింది.
దండుమల్కాపురం గ్రామంలో మరో కీలకమైన భూపోరాటం జరిగింది. అది నల్గొండ జిల్లా, చౌటుప్పల్ మండలంలో వుంది. గోల్కొండను పాలించిన షియా పరిపాలకుడు మాలిక్ ఇబ్రహీం పేరిట ఆ గ్రామానికి మల్కాపురం అంటారు. మాలిక్ ఇబ్రహీం ఒకసారి తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆ గ్రామానికి వచ్చాడు. సైనిక పటాలాన్ని ఇక్కడ ‘దండు’ అంటారు. అందుకే ఆ గ్రామానికి దండుమల్కాపురం అనే పేరు వచ్చింది. అక్కడ రోడ్డుకు ఇరువైపులా వున్న భూమి వివాదంలో వుంది. ఆ భూమి మైళ్ల పొడవునా సాగి వుంటుంది. ప్రత్యేకించి కుడి వైపున వున్న భూమి దండుమల్కాపురం చేరేదాకా ఎత్తుపల్లాలతో కూడింది. వివాదంలో వున్న 4,000 ఎకరాల భూమి నిజాంకు చెందింది. రాజా వెంకట నరసింహా రావు సేవలకు మెచ్చి నిజాం ఆ భూమిని ఇనాంగా ఇచ్చాడు. భూమితో పాటు ‘ఇనాందార’ అన్న బిరుదు కూడా లభించింది. అక్కడ కొంతమంది రెడ్డి భూస్వాములు ‘కౌలుదార్లసహకార వ్యవసాయ సంఘం’ పేరిట పేద రైతులకు ఉద్దేశించింది అన్నట్టుగా ఒక రైతు సహకార సంఘాన్ని ’ ఏర్పాటు చేశారు. దాని ద్వారా 1959లో తమకు కేటాయించబడ్డ భూములను సొంతంచేసుకోగలిగారు. ఆ ఇనాందార్ ఇద్దరు కొడుకులు నాగన్న నాయుడు, వెంకటరాయలు నాయుడు రాష్టం బయట ఎక్కడో వుండేవారు. వారి చేతుల్లోంచి ఆ భూముల మీద కూడా పూర్తి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోగలిగారు. ఆ ఇనాందార్ ఇద్దరు కొడుకులూ తమకు సొంత వాటా కింద దక్కిన భూమిని శాశ్వత ప్రాతిపదికన వరకంఠం గోపాల్ రెడ్డికి కౌలుకిచ్చారు. గోపాల్ రెడ్డి రైతుల సహకార సంఘంతో గొడవకుదిగి ఆ కేసును 1954 నుంచి 1970 వరకు కొనసాగించాడు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఇక లాభం లేదనుకుని ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించేశాడు. భూస్వాముల నమ్మినబంట్లైన మధ్యతరగతి రైతులే అక్కడ కౌలుదార్లుగా కొనసాగారు. వారిని పూర్తిగా భూస్వాములే నియంత్రించేవారు. ఇనామ్‌దార్ల పక్షాన వున్న దళితులు వారి వద్ద వెట్టి కూలీలుగా పనిచేసేవారు.
కాలక్రమేణా పెరుగుతున్న ఆకాంక్షలతో పాటు భూములు లేని గ్రామీణ వర్గాల నుంచి చైతన్యవంతులైన నాయకులు పుట్టుకువచ్చారు. కానీ వారిని భూస్వాములు సులువుగా లొంగదీసుకోగలిగేవారు. ఆ సహకార సంఘం సభ్యత్వం అలా 1985 నాటికి దాదాపు మÖడు వందలకు చేరుకుంది. అక్కడి భూమిలో ఎక్కువ భాగం గుట్టలతో, సుందర ప్రకృతితో సాగుకు వీలులేకుండా వుంటుంది. సదరు భూమిలో చాలా భాగాన్ని అమ్మేందుకు ఆ సహకార సంఘం 1986లో వి.జి.పనీర్‌దాస్ అండ్ కో అనే సంస్థతో సంప్రదింపులు ప్రారంభించింది. అది మద్రాస్‌కు చెందిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ భూమిలో ఒక ఫిలిం స్టుడియోను నిర్మించాలని తలపెట్టింది. అమÖ్యజ్‌మెంట్ పార్కుల నిర్మాణంలో విజిపి కంపెనీకి మంచి పేరుంది. (మద్రాస్ బీచ్ ప్రాంతంలో చాలా పేరుగాంచిన ‘వీజీపీ గార్డెన్స’ ని ఆ కంపెనీయే 1975లో నిర్మించింది). అయితే దండుమల్కాపురంలోనిది ప్రభుత్వ భూమి కాబట్టి దానిని ఆ సహకార సంఘం అమ్మడం చట్టవిరుద్ధం.
మా సంఘం చురుకుగా పనిచేస్తున్న రంగారెడ్డి జిల్లా సరిహద్దుకు దండుమల్కాపురం పొరుగునే వుంటుంది. ఆ గ్రామానికి చెందిన దళితులు 1987 మార్చిలో మా సంఘం వద్దకు వచ్చి తమ ఊళ్లోని వెట్టి చాకిరీ కూలీల సమస్య గురించీ, అక్కడి భూముల పరిస్థితి గురించీ వివరించారు. అప్పుడు మేము ఆ కూలీలను తక్షణమే విముక్తి చేయించాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కూ, భోనగిరిలోని సబ్ కలెక్టర్‌కూ, చౌటుప్పల్ మండల రెవెన్యూ అధికారికీ పిటిషన్లు సమర్పించాం. అక్కడి భూముల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది మా ఇబ్రహీంపట్నం తాలూకా ప్రజల పరిధికి దూరంగా వున్న ఒక అతిపెద్ద గ్రామం. అక్కడి వాళ్లతో ఇక్కడి వాళ్లకు ఎలాంటి వైవాహిక సంబంధాలూ, బంధుత్వాలూ లేవు. అక్కడి జనాల గురించి ఇక్కడి జనాలకు అవగాహన కూడా లేదు. అందువల్ల అక్కడ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని దున్నడం వంటి చొరవతో కూడిన కార్యక్రమాలను మేం చేపట్టలేదు. అక్కడ ఆ తరువాత జరిగినదంతా మా జోక్యం వల్లా.. అధికార యంత్రాంగం తీసుకున్న క్రియాశీలక చర్యల కారణంగా జరిగింది.
1987లో ముగ్గురు ఉత్సాహవంతులైన ఐఎఎస్ అధికారుల బృందం ప్రతి దశలోనూ భూస్వాములను అడ్డుకుంటూ వచ్చింది. కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్టార్ మామిడిపూడి నాగార్జున భూస్వాములు స్థాపించిన సహకార సంఘంలో చనిపోయిన సభ్యుల్నీ, అర్హత లేనివాళ్ల పేర్లనీ తొలగించి అర్హులైన కొత్తవాళ్లని సభ్యులుగా చేర్చుకుంటూ ఆ సంఘాన్ని సంస్కరించేందుకు పూనుకున్నారు. భూస్వాముల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవడంతో కోఆపరేటివ్ సొసైటీల రిజిస్టార్ ఆ సహకార సంఘాన్ని సస్పెండ్ చేసి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రముఖ మాదిగ రచయిత, ఐఎఎస్ అధికారి ఎ. విద్యాసాగర్ కూడా మా సంఘానికి చేయÖతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎ.విద్యాసాగర్ అంతకు ముందు తెలుగులో తను రాసిన ఐదు కవితా సంకలనాలను వెలువరించారు. అలాగే భద్రాచలంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతం వెతల మీద ‘భద్రాచలం మన్నెం కథలు’ అనే కథల సంపుటిని కూడా ప్రచురించారు. ఆ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు. భోనగరి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలను నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టారు. వివాదాస్పద ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆర్‌డిఓకు అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 145 కింద భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. వాళ్లకు నల్గొండ జిల్లా కలెక్టర్ పి. దయాచారి మద్దతిచ్చారు. యధాప్రకారం ఇవన్నీ హైకోర్టు వరకూ వెళ్లాయి. భూస్వాములు తమ న్యాయవాది మహమÖద్ అలీతో ఫీజుకు బదులుగా భూమినిచ్చారు. అందుకే మహమÖద్ అలీ చాలా ఉత్సాహంగా హైకోర్టులో ఒక కేసు తర్వాత ఒక కేసు ఫైల్ చేస్తూ పోయాడు. నిష్పక్షపాత న్యాయమÖర్తి వచ్చినప్పుడు ఆయన కేసులో వాదించకుండా పక్కకు తప్పుకుంటున్నట్టు చేసేవాడు. ఆ భూస్వాములకు కాంగ్రెస్ మంత్రులు జానారెడ్డి, వందేమాతరం రామచంద్రరావుల మద్దతు వుండేది. రామచంద్రరావు అసలు ఇంటిపేరు వావిలాల. వందేమాతరం అనేది 1948 అతనికి వీర్ సావర్కార్ ఇచ్చిన బిరుదు. ఆనాడు నిజాం ప్రభుత్వం నిషేధించిన వందేమాతరం గీతాన్ని రామచంద్రరావు ఉస్మానియా యునివర్సిటీలో పాడి అరెస్ట్ అయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. అప్పుడే సావర్కార్ ఆయనకు ఆ బిరుదునిచ్చారు. ఆనాటి నుంచీ ఆయన వందేమాతరం రామచంద్రరావుగా ప్రసిద్ధులయ్యారు. ఆరోజుల్లో హిందూ మతవాద సంస్థగా పేరున్న ఆర్య సమాజ్‌కు అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆ తదనంతర కాలంలో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వందేమాతరం రామచంద్రరావును అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు.
భూస్వాములు 1955 నాటి తెలంగాణా ఇనాముల రద్దు చట్టం కింద ఆ భూముల్లోని మంచి భాగాల్ని తీసుకుని వాటిని ప్రైవేటుగా క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నించారు కానీ దానిని మేం అడ్డుకోగలిగాం. ఇక అక్కడి వెట్టి కూలీల విషయానికి వస్తే కొంతమంది కూలీలు వెట్టినుంచి విముక్తులయ్యారు. మరికొందరు విముక్తులు కానప్పటికీ అప్పును తిరిగి చెîల్లించడానికి నిరాకరిస్తూ వెట్టి పనులను తమకు తాముగా మానివేశారు. దాని తర్వాత దండుమల్కాపురంలో మా భూపోరాటం మరికొన్ని సంవత్సరాలపాటు కొనసాగింది.
ఆయా సమస్యలను ప్రభుత్వాధికార్ల దృష్టికి తీసుకువెళ్లే ప్రక్రియ క్రమంగా చాలా కష్టంగా మారింది. వారి నుంచి నాకు గట్టి వ్యతిరేకత ఎదురయ్యేది. “పరిశ్రమల మీద సీలింగ్ పెట్టాలని మీరు ఎందుకు అడగటం లేదు?” అనేది అధికార్ల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్న. “మీరు హింసను రెచ్చగొడుతున్నారు” అనేవారు… “పేదప్రజలు తాగుడుకు అలవాటు పడ్డారు. చివరికి ఈ భూములను వాళ్లు అమ్మేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్లు ఎలాగూ కోల్పోబోయే భూముల కోసం ఎందుకు పోరాడుతున్నారు?” అనేవారు.
గ్రామాల్లో కులం చాలా విచిత్రమైన పాత్రను పోషించేది. ఇక్కడ పాలకవర్గ కులం రెడ్డికులం. కాగా కొద్ది మంది బ్రాహ్మణులు కూడా భూ సంస్కరణల చట్టాన్ని అతిక్రమించి కొద్దిపాటి భూములను సొంతం చేసుకున్నారు. నాకు తరచూ ఆశ్చర్యమనిపించింది ఏమిటంటే అనేక గ్రామాల్లో అలా భూములను ఆక్రమించుకున్న బ్రాహ్మణులను మేము కనుగొన్నప్పుడు జనం ఆ భూముల జోలికి వెళ్లడానికి ఇష్టపడకపోవడం! “పాపం, బాపనాయన. మనకు పాపం తగుల్తది” అనేవాళ్లు. అది వాళ్లు దైవికపరమైన భయంతో అనే మాట కాదు, బ్రాహ్మణుల మీద ఒకవిధమైన జాలితో అనేమాట. మరో విషయం ఏమిటంటే ఆ బ్రాహ్మణులు నేడు గ్రామాలలో కనుమరుగైపోయారు. మాకీ గొడవలొద్దు, మమ్మల్ని వదిలేయండి అని బ్రాహ్మణులు జనాన్ని వేడుకునేవారు. చాలామంది బ్రాహ్మణులు భయంతో ఊళ్లను వదిలి వెళ్లిపోయారు. రెడ్ల మాదిరిగా వాళ్లు ఎన్నడూ గట్టిగా ప్రతిఘటించలేదు.

ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఫోన్ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com
(ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.