తెలంగాణ రచయిత్రుల కథల్లో ఉద్యమ నేపథ్యం – డా. పెద్దపల్లి తేజస్వి

1. పరిచయం
“ఒక భౌగోళిక ప్రాంతంలో జీవించే ప్రజల గురించి అక్కడి నైసర్గిక స్వరూపం, మానవ సంబంధాల తీరు, భాష, సంస్కృతి, భావ వ్యక్తీకరణ, సంభాషణ తీరు, ఆలోచనల తీరు, వాటితో పాటు వాటిని నిర్దేషించే, ప్రభావితం చేసే ప్రకృతి, పంటలు, వృత్తులు, ఆధునిక అభివృద్ధి, కులాలు, మతాలు, విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు వీటన్నిటి పరిణామాలు కలిసి ఒక ప్రాంతం యొక్క ప్రాంతీయ అస్తిత్వాన్ని, ప్రత్యేకతను, నిర్దిష్టతను, సంస్కృతిని తెలుపుతాయి.

వీటన్నిటిని ఒక స్పృహతో, చైతన్యంతో చిత్రించిన సాహిత్యాన్ని, ప్రాంతీయ స్పృహను, చైతన్యాన్ని చిత్రించిన సాహిత్యమని పేర్కొనవచ్చు. ఈ నిర్వచనం ప్రకారం తెలుగు కథలో ప్రాంతీయ స్పృహ అంటే తెలుగు కథల్లో ప్రాంతీయ స్పృహ, చైతన్యం, నిర్దిష్ట జీవితం, ప్రత్యేక సంస్కృతి సమస్యలు, పరిణామాలు అని చెప్పుకోవచ్చు.” (శ్రీధర్, వెల్దండి. తెలుగు కథ-ప్రాంతీయ అస్తిత్వం. 2015 : 16).
తెలంగాణకు చారిత్రకంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రత్యేకత ఉంది. దానిని తొక్కిపెట్టి తెలుగు ప్రజలందరినీ కలుపుతూ ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఆంధ్ర పెత్తందారుల కుట్రలకు వివక్షకు తెలంగాణ ప్రజానికం బలవుతూ, తీవ్రంగా నష్టపోతూ వచ్చింది. దానిని గుర్తించిన, మదనపడిన మేధావులు, రచయితలు అనేక సాహితీ సృజన రచనలు, వ్యాసాలు రాశారు. ప్రధానంగా ఈ వ్యాసంలో తెలంగాణ రచయిత్రులు రాసిన తెలంగాణ అస్తిత్వవాద కథల్లోని ఉద్యమ నేపథ్యాన్ని చర్చించాను.
2. తెలంగాణ భాషపై ఉన్న వివక్షను వ్యతిరేకించిన కథలు
తెలంగాణ ప్రజల జీవన వెతలు ఎంతటి దుఃఖభరితమైనవో.. అదేస్థాయిలో తెలంగాణ భాష కూడా వివక్షకు, అణచివేతకు గురైంది. ముస్లింల పాలనలో ఉర్దూ, పారసీ భాషలు అధికార భాషలుగా ఉండి తెలంగాణ ప్రజలు మాట్లాడే భాష ఉపేక్షకు గురైంది. ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తమ భాష, యాసలకు గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలంగాణ వారు అనుకుంటే.. అది నిరాశే అయ్యింది. ఉమ్మడి పాలనలో మధ్యాంధ్రప్రదేశ్ వారి వెక్కిరింపులకు తెలంగాణ భాష గురైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు.
తెలంగాణ యాస, సంస్కృతి నేపథ్యంలో వచ్చి ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ‘బలగం’ సినిమా ఘనవిజయం సాధించింది. కొన్ని ప్రముఖ సినిమాల్లో బలగం ముందు వరుసలో ఉంది. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, చావు-పుట్టుకలు, కుటుంబ బంధాల నేపథ్యం ఈ చిత్రంలో ప్రముఖంగా కనిపిస్తుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన సినిమా “దసరా”. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామా భారీ వసూళ్లతో ఘనవిజయం సాధించింది. తెలంగాణ మాస్ యాసతో, కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సూపర్ హిట్ సినిమా ‘డీజే టిల్లు’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా తెలంగాణ భాషతో పెద్ద విజయం సాధించింది.
లగ్గం: తెలంగాణ సంప్రదాయ వివాహ వ్యవస్థ నేపథ్యంలో రమేశ్ చెప్పాల దర్శకత్వంలో వచ్చిన ‘లగ్గం’ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. వీటితోపాటు ‘జాతిరత్నాలు’, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ’, ఎన్టీఆర్ ‘ఆరఆరఆర’ (కొమురం భీమ్ పాత్ర) వంటి పెద్ద సినిమాలు కూడా తెలంగాణ యాసను స్పష్టంగా ఉపయోగించి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మన్ననలు పొందాయి.
నా బంగారు తల్లి: ఈ కథను ఆయాచితం అరుణకుమారి రాశారు. అపర్ణది చక్కని జిజ్ఞాస, స్వచ్ఛమైన మనసు. స్కూటీ నడిపేటప్పుడు ఎగిరే జుట్టు తన స్వేచ్ఛను చాటుతుంది. చదువులో బొమ్మల గీయడంలో, కమ్మని గొంతుతో పాడటంలో చక్కని ప్రతిభ గల అమ్మాయి.
పెళ్లి ప్రయత్నాలు మొదలైన క్రమంలో అబ్రాడ్ సంబంధాలకు ప్రాముఖ్యత ఇస్తే! అమ్మానాన్నలను ఎవరు చూసుకుంటారని, విదేశాల పెళ్ళి సంబంధాలు వద్దని చెప్తుంది. కానీ ఒక్కోసారి పరిస్థితులు తారుమారు అవుతాయి.
హైదరాబాదులో ఒక సభకు అపర్ణ కుటుంబం వెళ్తుంది. అక్కడ కాకినాడకు చెందిన వాళ్ళు అపర్ణను చూసి పెళ్లి సంబంధం గురించి అడగుతారు. వారిది ఉన్నత కుటుంబం అవడంతో… ప్రాంతీయ బేధాలు లేవని, కట్నకానుకలు అవసరం లేదంటారు. అన్ని బాగున్నాయని అపర్ణకు వారి కుటుంబంతో పెళ్లి చేస్తారు. అపర్ణ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళుతుంది. ఆరు నెలల తర్వాత అపర్ణ తిరిగి ఇండియాకు వస్తుంది. బిడ్డను చూడడం కోసం అపర్ణ తల్లి వెళ్తుంది. అత్తవారి కుటుంబానికి ప్రాంతీయ భేదాలు లేవన్నవారే ఎదుటి వారిపట్ల వెటకారం చూపించే స్వభావం వారికి
ఉంటుంది. ఈ విధానం అపర్ణ కుటుంబానికి బాధను కలిగిస్తాయి.
తెలంగాణ భాషపట్ల అపర్ణ అత్తింటివారు చేసిన ఎగతాళి:- ఇంట్లో వాడుకునే వంట గదిలోని వస్తువుల విషయానికి సంబంధించిన చర్చ ఈ విదంగా ఉంటుంది. బోళ్ళు అని అపర్ణ అత్త అంటుంది. దానికి అపర్ణ సమాధానం బోళ్ళు అనే పదానికి నిత్య బహువచనం అంటుంది. అపర్ణ అమ్మ ఈ విధంగా సర్ధి చెప్తుంది. – అది కాదు వదినా! బోలు అంటే ఖాళీగా ఉన్నదని అర్థం! అందుకనే ఖాళీగా ఉన్న వంట పాత్రను బోళ్ళని అనడం వాడుక అయి ఉండవచ్చు. మీరైతే ఏమంటారు అత్తయ్య అనే మాటకు, అపర్ణ అత్త “మేం గిన్నెలు అంటాం అంటుంది బింకంగా. దానికి అపర్ణ నవ్వుతూ అన్నిటినీ అంటే గ్లాసులు, చెంబులు మొదలైన వాటిని కలిపి బోలు బాసన్లు అంటే మాకు ప్రత్యేకంగా చెప్పగలిగే పదాలున్నట్లే కదా అంటూ నవ్వుతూ ఉంటుంది అపర్ణ.
తెలంగాణ పండగలకు సంబంధించిన పలికే పదాల పట్ల చులకన చేసి మాట్లాడుతుంది అపర్ణ అత్తయ్య. పోచమ్మ తల్లి బోనాలకు సంబంధించిన ఫోటో చూసి అనాగరికలు చేసే పండుగలు మనం చేయడం ఏంటని అంటుంది అపర్ణ అత్త. “పోచమ్మ అంటే బ్రోచే అంటే రక్షించే తల్లని, ఊరి పొలిమేరలలో ఉండే పోలేరమ్మ పోచమ్మ ఆ గ్రామాన్ని రక్షిస్తుందని ఆమె అనుగ్రహంతోనే పెళ్లిలాంటి పెద్ద పండుగలు జరుగుతాయని చెప్తుంది అపర్ణ తల్లి.
మరికొన్ని పదాలపై చర్చ ఈ కింది విధంగా ఉంటుంది. తోచడం లేదు – మనసున పడతలేదు, పచ్చడి- తొక్కు, బల్బు- బుగ్గ. ఇలా అవకాశం దొరికినప్పుడు వివరిస్తూ వస్తుంది అపర్ణ తల్లి. అత్త మామలు తన తల్లిదండ్రులను తెలంగాణ భాష పట్ల, సంస్కృతి పట్ల తక్కువ చేసి మాట్లాడతారు. అత్తింటివారి వ్యక్తిత్వం అపర్ణకు బాధను కలిగిస్తుంది. వారికి సరైన సమాధానాలు చెప్పి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది.
ప్రాంతీయ బేధాలు, ఆచార పట్టింపులు వల్ల బాధతో నిలబడ్డ అపర్ణ తల్లిదండ్రులకు వారి బిడ్డ మూర్తిభవించిన దగాపడ్డ తెలంగాణ పాదానివలె కనిపిస్తుంది. తర్వాతి సంవత్సరం ఇండియాకి వచ్చిన అపర్ణను దసరాకు తీసుకెళ్లడానికి వస్తాడు అపర్ణ తండ్రి. ‘బావగారు మా అమ్మాయిని దసరాకు తోలుకుపోతం పంపించండని’, అదేంటి బావగారు! పశువులను తోలుకెళ్ళినట్లు అమ్మాయిని తోలుకేల్లడమేంటి అంటారు అపర్ణ మామయ్య. ‘మా తెలంగాణలో తీసుకెళ్లడం అంటే ప్రాణం లేని దాన్నే తీసుకెళ్లడం’ అంటాడు తండ్రి. అపర్ణకు సపోర్టుగా మాట్లాడతాడు ఆమె భర్త. చూడండి మామగారు మా భాషను అగౌరవంగా మాట్లాడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ కుటుంబం అంతా ఆలోచించి మాట్లాడితే మంచిది. నాన్న నన్ను పండుగకు తప్పకుండా తోలుకుపొండి అంటూ గట్టిగా అపర్ణ అంటుంది. ఆత్మగౌరవం కోసం పోరాడే కథ ఇది. “నా బంగోరుతల్లి కథలో అపర్ణ వివాహం ఆంధ్రాపిల్లనాడితో అవుతుంది. విదేశాల్లో వుంటాడు. ఇండియా వచ్చినప్పుడల్లా అత్తగారు అపర్ణ, ఆమె తలిదండ్రుల మాటలను తప్పుపడ్తుంది. గేళి చేస్తుంటుంది. అపర్ణ ఆత్మగౌరవం కోసం పారాడే యోధ కాబట్టి భాషాభేదాన్ని ఎత్తిచూపి ఆలోచించి మాట్లాడటం మంచిది అని హెచ్చరిస్తుంది.
ఏ భాషలోనైనా ప్రాంతీయ యాసలో వైవిధ్యం వుంటుంది. అదే తెలంగాణ భాష విలక్షణంగా వుంటుంది. తెలంగాణ భాషలో ప్రాచీన కవులు నన్నయ, తిక్కనాదులు ప్రయోగించిన భాషావదాలు, నుడికారాలు కన్పిస్తాయి. అని ఇతర ప్రాంతాల్లో వాడుక నుంచి తొలిగిపోయినా తెలంగాణా పల్లె ప్రజల భాషలో అచ్చమైన తెలుగు పదాలు నుడికారాలు ఇంకా నిలిచివున్నాయి. తిరగలి, వెళ్ళడం, సాంబారు వంటి ఎన్నో తమిళ పదాలను మద్రాసు రాష్ట్రంలో నుండి తమ వాడుక భాషలో చేర్చుకున్నారు కాబట్టి, ఆంధ్రావాళ్ళకు విసుర్రాయి, పోవటం, చారు వంటి అచ్చమైన తెలుగు పదాలు వింతగా కన్పిస్తాయి.” (అమృతలత, రజిత, అనిశెట్టి(సం.) వెతలే… కతలై. 2011 : 13) అని ముదిగంటి సుజాతారెడ్డి ‘తెలంగాణా వెతలే… కథలై’ కథా సంకలనంలో ముందుమాటలో పై విధంగా అన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందే ప్రధానంగా ముఖాముఖిగా వేష, భాష, యాసలను వెటకారం చేసి, అవహేళనకు గురి చేయడం మరో ప్రధాన విషయం. ఆంధ్రా పెత్తందార్ల వల్ల, రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ ప్రజలు నిలువునా నష్టపోయారు. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి దశలుగా ఉద్యమం సాగుతూ, పడుతూ లేస్తూ, చివరికి ఉవ్వెత్తునా ఉద్యమం సాగించి తెలంగాణ ప్రజానికం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ భాష, యాసపై ఆత్మగౌరవంతో స్త్రీ తన ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్తగారింట్లో ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది.
నిశ్చితార్థం: ఈ కథను పి. యశోదారెడ్డి రాశారు. తెలంగాణ పెళ్లి సంబంధం చూడటానికి వచ్చిన కోస్తా వారికి పెళ్ళికూతురు తరపున వాళ్లంతా అనాగరికులని, వాళ్ళ భాషా సంస్కృతిని అవమానిస్తూ మాట్లాడుతారు. అప్పుడు పెళ్ళికూతురు ప్రభ ఆ సంబంధాన్ని తిరస్కరిస్తుంది. పెద్దల ప్రవర్తనకు విసిగిపోయిన పెళ్ళి కొడుకు ప్రసాద్ సామరస్యంగా కాపురం చేసుకునేది మనమే కదా అని పెళ్లి చేసుకుంటాడు.
3. తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన కథలు:
వలస పెత్తందారుల మోసం, కుట్రలతో తెలంగాణ ఉద్యమం దశాబ్దాలుగా సాగి, 2014లో ప్రతేî్యక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ ఉద్యమానికి పెద్ద చరిత్రే ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం కలిపి అంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూ వచ్చింది. అది గమనించిన తెలంగాణ వాసులు తమ నీళ్ళు, నిధులు, నియామకాలు లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకొని అనేక ఉద్యమాలు చేశారు. వివిధ రంగాలలో ఉద్యమం పలు రకాలుగా నడిచింది. అందులో ఒకటి సాహిత్యం. వివిధ ప్రక్రియలలో తెలంగాణ ఉద్యమం కోసం రచనలు వచ్చాయి. అదేవిధంగా కథల్లో కూడా తెలంగాణ ఉద్యమ కథలు వచ్చాయి. తెలంగాణ రచయిత్రులు కూడా తమ ప్రాంత అస్తిత్వం కోసం తమ తమ కథల్లో ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అటువంటి కథలను కింద గమనించవచ్చు.
అమ్మ: ఈ కథను సమతా రోష్ని రాశారు. కూతురు ఉద్యోగం చేస్తున్న ఊరికి వెళ్తుంది తల్లి. తన తల్లికి లోకం గురించి తెలియని విషయాలను వివరంగా చెప్తుంది. తన తల్లిని ఒకరోజు ఆఫీసు మీటింగ్‌కి తీసుకెళ్తుంది. ఆ మీటింగ్‌లో తెలంగాణ భాష ప్రాముఖ్యత గురించి అమ్మకి చెప్పే క్రమంలో తెలంగాణ పోరాటంలో భాగంగా తన కుమారుణ్ణి కోల్పోయిన ఒక తల్లి గాథను గురించి వివరిస్తుంది. తెలంగాణ పోరాటంలో తమ పుత్రుని కోల్పోయిన ఒక తల్లి నా బిడ్డ లేకపోయినా తెలంగాణ పౌరులంతా నా బిడ్డలే. నా కొడుకు ఆశయం నెరవేరే దాకా నేను కూడా పోరాడుతా! జై తెలంగాణ అంటూ విన్న మాటలకు రాజి తల్లి మాటలు చెమరుస్తాయి. ఆ మాటలకు ప్రభావితమై ఆమె ప్రత్యేక తెలంగాణ రావాలని కోరుకుంటుంది.
ఎల్లమ్మ దస్కింది: ఈ కథను గోగు శ్యామల రాసారు. ఆంధ్ర ప్రాంతం వారు ఎల్లమ్మ ఉంటున్న ఊరికి వస్తారు. అక్కడ
ఉంటున్న అందరి భూములను డబ్బు ఆశ చూపించి అమ్ముకునేలా చేస్తారు. ఎల్లమ్మ మాత్రం అమ్మే క్రమంలో భూమి లేకపోతే మా పిల్లలు మీ దగ్గర జీతం ఉండాల్నా? మేం కూలీ చేయాల్నా? అంటూ వారిని ప్రశ్నిస్తుంది.
భూమి గొప్పతనాన్ని వివరిస్తూ నల్లెద్దు పెద్దకొడుకంత ఆసరాగా నిలిచింది. ఆంధ్ర వారితో మాట్లాడుతూ భూమి ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఆసరాగా నిలుస్తుందని తన అభిప్రాయాన్ని చెప్తుంది. ఆమె తన భూమిని అమ్మితే వచ్చే విపత్కర పరిస్థితులను కింది విధంగా తెలియజేస్తుంది.
ఎనిమిదెకరాల వ్యవసాయం చేయలేను. పన్నెండుమంది పిల్లలను సాకలేను. కొత్త పంట ఏది ఇంటికి వచ్చిన ఊరందరికీ ఎన్ని గింజలు పోయలేను. ఏడుమంది బిడ్డల పెళ్లిళ్లు, పురుళ్లు చేసాను. నా కొడుకులకు ఇరవై ఎకరాల భూమి ఉంది. పెద్ద బిడ్డ నుండి చిన్న బిడ్డ వరకు పుట్టిన బిడ్డల దాకా అందరికీ మంచి జరిగేలా చేశాను. తాను కనీసం బంగారం కూడా చేపించుకోలేదు. పట్నం పోతే పెళ్లయ్యాక దూరం ఉన్నారని రంది పడుతుంది. ఆమెది భూమంత మనసు, ఓపిక ఎక్కువ కలది.
డెబ్బై ఏళ్ళు వచ్చాక కొడుకులను, బిడ్డలను సాదేటప్పుడు దస్కని ఎల్లమ్మ ఇప్పుడు దస్కింది. నాగరికత మారింది. కులదేవతలను ఎల్లమ్మ చేనుకాడ ఈదమ్మ చెరువు కట్ట మైసమ్మను పంట రాసులప్పుడు కొల్వకుండ వాళ్ళ గుడులు పాడువుతాయని, కొడుకులు, బిడ్డలు భూమికి దూరమై ఇంటికి తాళం పడేలా చేస్తారని దస్కింది. తన భూమి అమ్మకుండా తన కాళ్ళ మీద తాను నిలబడింది. తన బిడ్డలు బాగుండాలని కోరుకుంది. డబ్బు, బంగారం మీద వ్యామోహం లేదు. తన సొంత ఊరు మీద మమకారం పోదు. సంస్కృతి సంప్రదాయాల మీద ప్రేమ, ఎదురు తిరిగే స్వభావం గలది. “గోగు శ్యామల ఎల్లమ్మ సంవేదనను చాలా వాస్తవికంగా తెలంగాణ యాస నుడికారాలను ప్రయోగించి చిత్రించారు. ఎల్లమ్మ దళిత స్త్రీ కష్టపడి ఇరవై ఎకరాల భూమిని సంపాదించింది. పన్నెండు మంది పిల్లను కన్నది. ఏడు మంది బిడ్డల పెళ్ళిండ్లు చేసింది. పురుళ్ళు పోసింది. ఐదుగురు కొడుకులకు ఇరవై ఎకరాల భూమిని అప్పు లేకుండ వుంచింది. అటువంటి ఎల్లమ్మ దగ్గరికి తెల్లబట్టల ఆంధ్రోళ్ళు ‘ఎల్లమ్మ గారూ!’ అంటూ వినయంగా సంబోధించి ‘మీ భూమి ఖరీదుకున్నదట’ అని అడిగారు. ధరల ఆశ చూపి ఆంధ్రోళ్ళు తెలంగాణ రైతుల నుంచి భూములు అగ్వసగ్వకు కొన్నారన్నది చారిత్రక సత్యం. కాని ఎల్లమ్మ వంటి వాళ్ళు తమ భూమిని అమ్మేటందుకు ముందుకు రాలేదు. గట్టిగానే ఎదిరించి నిలబడ్డారు. ఎల్లమ్మ ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని రచయిత్రి చాలా చక్కగా వివరించారు.” (అమృతలత, రజిత, అనిశెట్టి (సంపా.) వెతలే కతలై. 2011 : 15) అని ముదిగంటి సుజాతారెడ్డి కథలోని ఎల్లమ్మ పాత్ర సాహసాన్ని, రచయిత్రి కథన నైపుణ్యాన్ని పై విధంగా చెప్పారు.
నిరసన: ఈ కథను ఐ.మల్లేశ్వరి రాశారు. తెలంగాణ పోరాటంలో భాగంగా రోడ్డు మీద వంటలు వండటం, బతుకమ్మ ఆట ఆడటం మొదలైన నిరసన కార్యక్రమాల్లో గంగామణి పాల్గొంటుంది. దానికి గంగామణి తల్లి… మనము లేనోళ్ళం, అన్ని పనులు వదులుకొని పోరాటంలో పాల్గొనడం ఎందుకని తల్లి పోషవ్వ వారిస్తుంది. “నీలాగే అందరు అనుకుంటే పోరాడేది ఎవరమ్మా? నాకు నడుతదా నాకు నడుతదా అంటే మనకి ఎప్పటికీ నడకరాదు సరి కదా! కాళ్ళు చేతులు కూడా పనిచేయకుండా పోతాయి మరి”. అమ్మ ఏ పోరాటమైన ఇండ్ల కాడ ఉంటే మొదలవ్వదు. ఆడోళ్ళు లేని ఏ పోరాటమైనా బతికి బట్ట కట్టదని మీటింగ్లో చెప్పిన విషయాల గురించి తల్లితో చెప్తుంది గంగామణి.
గంగామణి తమ్ముడు… అవునక్కా! బావ కూడా ఏ పనిలేక మరో దేశానికి వలస వెళ్ళాడు. అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడే అందరికీ పనులు దొరకాలంటే ఉద్యమానికి మద్దతు పలకాలని చెప్పడంలో కుటుంబం మొత్తం గంగామణికి సపోర్టుగా నిలుస్తుంది.
ఆకాశంలో సగ భాగం అనే మహిళామణులు సైతం తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన సందర్భాలున్నాయి. నిజంగా కూడా స్త్రీలు లేకుండా ఉద్యమాలు ముందుకు సాగడం కష్టమే. పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీ గంగామణి.
జయ జయహే తెలంగాణ:
ఈ కథను ఏదునూరి రాజేశ్వరి రాశారు. ఈ కథలో నళిని టీచర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగిన పోరాటాలు, బంద్‌ల ప్రభావం వల్ల ప్రజలు ఎలాంటి సమస్యలతో సతమతమైన అంశాలున్నాయి. ప్రత్యేక తెలంగాణను సాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే ఆలోచనా దిశగా టీచర్ నళినికి ఎదురైన అనుభవాలు తెలిపే కథ ‘జయ జయహే తెలంగాణ’.
చుక్కాని: చుక్కాని కథను తాయమ్మ కరుణ (పద్మ) రాశారు. ఓ హాస్టల్‌లో పెద్ద వయసున్న మహిళ ఉంటుంది. ఆమెకు, ఆ హాస్టల్‌లో చదువుకుంటున్న అమ్మాయిలకు వయసులో పది సంవత్సరాల వ్యత్యాసం ఉంటుంది. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న రోజులు ఏ విధంగా ఉన్నాయో తెలిపే కథే ‘చుక్కాని’. ఓరోజు న్యూస్‌లో తెలంగాణ పోరాటానికి సంబంధించిన వార్త వస్తుంది. యాదయ్య అనే విద్యార్థి యూనివర్సిటీలో నిప్పంటించుకొని కాలిపోతుండటాన్ని అన్ని న్యూస్ చానళ్ళ వాళ్ళు చూపిస్తుంటారు. ఆ వార్త చూసిన మంజుల అనే అమ్మాయి మన హిమాయత్‌నగర్‌లో కాల్చుకుంటే చూసేవాళ్ళం అంటుంది. మంజుల ఆంధ్ర ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఆ మాటలు విన్న పెద్ద వయసున్న ఆ మహిళ మనిషి తెలంగాణ కోసం కాల్చుకొని చనిపోతుంటే నీకు వినోదంగా ఉందా? అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. జరిగిన విషయాన్ని హాస్టల్‌లో చర్చిస్తుంది. హాస్టల్‌లో ఉన్న ఉష అనే అమ్మాయి తెలంగాణ ఉద్యమం గురించి సపోర్టు చేస్తూ మాట్లాడుతుంది. కొందరు అమ్మాయిలు తెలంగాణ ప్రాంతం అయినా సమైక్యాంధ్రకు సపోర్టు చేస్తారు. ఆ హాస్టల్‌లో ఓ రోజు తెలంగాణ గురించి చర్చ పెడతారు. ఆ చర్చలో ఉష అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ కంటే ముందున్న రాజధాని ఏది? అని అడుగుతుంది. కర్నూలని సమాధానం చెప్తుంది విజయ. ఆంధ్రప్రదేశ్‌కు మొదటి రాజధాని కర్నూలు ఉండేదని, కానీ కర్నూలు అన్ని ఎక్కడా చెప్పరంటుంది. హైదరాబాద్ ఉమ్మడీ రాష్ట్ర రాజధాని అయ్యిందని, పాఠ్యపుస్తకాల్లో చెప్పారంటుంది ఉష.
హైదరాబాద్‌ను డెవలప్ చేసింది మేమే అంటుంది మరో అమ్మాయి విశాల. ఏంటి? మరల కట్టించారా? నిజాం కాలంలో కట్టిన బిల్డింగులు, నిజం తెల్సుకొని మాట్లాడాలమ్మా అంటుంది మరో అమ్మాయి. తెలంగాణ ప్రాంతాలకు చెందినవారైనా తెలంగాణ భాషలో మాట్లాడితే తక్కువచేసి చూస్తారు. తెలంగాణ చర్చ మొదలైన తర్వాత తెలంగాణ యాసలో స్వేచ్ఛగా మాట్లాడుతున్న అంశాలు ఈ కథలో కనిపిస్తాయి. ఆ చర్చలో తెలంగాణ కోసం బ్రతికుండి పోరాడాలి! చనిపోయి కాదని ప్రియాంక అంటుంది.
హాస్టల్‌లో అందరూ ఉండిపోవడానికి రారు. చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, సొంత ప్రాంతాల నుండి వారి పనుల రీత్యా హాస్టల్ వాతావరణాన్ని భాగం చేసుకుంటారు. ఓరోజు పెద్ద వయసున్న మహిళ తెలంగాణకు మద్ధతుగా మాట్లాడిన ఉష కనిపిస్తుంది. పోరాటం ఎంతవరకొచ్చిందని అడుగుతుంది ఆ మహిళ.
తెలంగాణ నాయకుల తీరు చూస్తే సమైక్యాంధ్రనే మంచిదనిపిస్తుంది అని అంటుంది ఉష. సమాధానంగా ఆమె ఆవిధంగా అన్నందుకు నిరాశ పడిపోకూడదు. జోరుగా సాగే ఉద్యమాన్ని ఇతరులు అనేక వంకలతో నీరుగారుస్తారు. స్టూడెంట్స్ తల్చుకుంటే కానిదేముందని చెప్తుంది ఆ మహిళ.
తెలంగాణ ఎందుకు కావాలి? వస్తే లాభం ఏమిటి? తెలంగాణ కోసం పోరాటం చేయటం వల్ల ఉద్యమం ఏ దిశగా సాగుతుందనే సాగుతుందనే చర్చలు పునరావృతం అయ్యే నేపథ్యానికి చెందిన కథ ‘నేటి మహిళ’. ఈ కథలో సమాజం పట్ల సాటి మహిళలలో సామాజిక స్పృహ కనిపిస్తుంది.
4. ముగింపు
తెలంగాణ రచయిత్రులు రాసిన కథల్లో తెలంగాణ అస్తిత్వం బలంగా ఉంది. తెలంగాణ ఉద్యమానికి బలమైన కారణాలుగా నిజాం పాలనలో వెట్టిచాకిరి, భూస్వాములు చేసిన అరాచకాలు, భూదోపిడీలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951) ఉపందుకుంది. ఆ సమయంలో దొడ్డి కొమురయ్య బలిదానం సాయుధ పోరాటానికి ఒక నాంది పలికింది. చాకలి అయిలమ్మ దొరల అరాచకాలను ఎదురించి తన భూమిని కాపాడుకోవడానికి తొలి భూపోరాటానికి నాంది పలికారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఏర్పాటు చేసిన గ్రామ రాజ్యాలు స్త్రీ, పురుష సమానత్వాన్ని తీసుకువచ్చాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా అనేకమంది స్త్రీలు ఆయుధాలు పట్టి పోరాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల్లో వారి కుటుంబ సభ్యుల ద్వారా వచ్చిన వారే ఎక్కువ ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాల్లో మహిళలు నిర్వహించిన పాత్ర గురించి, వారి ధైర్యం గురించి, త్యాగ నిరతి గురించి ఈనాటి మహిళలు తెలుసుకోవాలి. నేను రాసినటువంటి వ్యాసంలో ప్రత్యేక తెలంగాణను సాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు స్త్రీ పాత్ర ద్వారా కన్పిస్తాయి. హాస్టల్ లో ఉన్నటువంటి విద్యార్థినులు ఎటువంటి వివక్షను ఎదుర్కొన్నారో స్త్రీ పాత్రల ద్వారా దర్శనమిస్తాయి. తెలంగాణ ఎర్పడాలంటే సామాజికంగా చర్చలు ఏవిధంగా కొనసాగాలనే కోణం ఈ కథల్లో చర్చకు వస్తుంది.
5. ఉపయుక్త గ్రంథాలు
1. అనురాధ, బి(సంపా.). వియ్యుక్క-సంపుటం-6. (అజ్ఞాత రచయిత్రుల కథా సమయం). 2023. హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం.
2. అనూరాధ, జె. రచయితల కథానికలు-స్త్రీల సమస్యల చిత్రణ. 2011. హైదరాబాద్: శోధనా ప్రచురణలు.
3. అమృత లత, రజిత, అనిశెట్టి(సంపా.) తెలంగాణా వెతలే… కతలై-రచయిత్రుల కథా సంకలనం. 2011. నిజామాబాద్: రజిని పబ్లికేషన్స్.
4. కాత్యాయని విద్మహే. తెలంగాణ పోరాటం-తెలుగు కథ, నవల. 1986. వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం.
5. రజిత, అనిశెట్టి. తెలంగాణ రచయిత్రుల కథలు. 2017. హైదరాబాద్: నవ చేతన పబ్లిషింగ్ హౌస్.
6. శ్రీధర్, వెల్డండి. తెలంగాణ కథ ప్రాంతీయ అసిత్వం. 2015. కర్నూల్: సిల్వర్ జూబ్లి ప్రభుత్వ కళాశాల.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.