(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార
అయినప్పటికీ జబ్బార్‌గూడెం సమస్యాత్మకమే. అది అరవై ఇళ్లు మాత్రమే వుండే చిన్న పల్లె. అందులో నలభై ఇళ్లు మాదిగలవే. కాకపోతే ఆ అరవై ఇళ్లనుంచి అరవై మంది నాయకులున్నారు. వారిలోని ఈ అనైక్యత, బలమైన నాయకత్వం లేకపోవడం అనేక సందర్భాలలో బయటపడింది.
మా సంఘంలోని ప్రతి కార్యకర్తకూ, ఆ చుట్టుపక్కలి గ్రామాల వాళ్లకూ జబ్బార్‌గూడెం గురించి బాగా తెలుసు. “జబ్బార్‌గూడెం మాదిగలను అస్సలు నమ్మొద్దు” అని చాలామంది నన్ను హెచ్చరిస్తుండేవారు. “దొరల కింద పనిచేయడానికి వాళ్లు అలవాటు పడ్డారు. ఏదో ఒకరోజు మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా తన్ని తరిమేస్తారు” అనేవారు.
మా పోరాటం విజయం సాధిస్తున్న దశలో భూస్వామి మంచిరెడ్డి భూపాల్ రెడ్డి నుంచి ఆ గ్రామస్తులకు పిలుపు వచ్చింది. కొందరు నాయకులు అతనితో రాజీ పడ్డారనీ, అతణ్ని కలవడానికి వెళ్లారనీ తెలిసింది. దాంతో నాకు పట్టరాని కోపం వచ్చింది. వాళ్లని ఒకరోజు హైదరాబాద్ చిక్కడపల్లిలోని మా ఇంటికి పిలిచాను. అప్పటికే నా మిత్రుల నుంచి పాత చెప్పులను సేకరించాను. ఆ మిత్రులు ఎందుకవి అని అడగలేదు, నేను చెప్పలేదు. చెప్పులను తాళ్లతో మాలలు కట్టించి పెట్టుకున్నాను. ఆరోజు యాచారం బుడ్డజంగయ్య, యాచారం బుగ్గయ్యలతో సహా ఆరుగురు జబ్బార్‌గూడెం మాదిగ లీడర్లు మా ఇంటికి వచ్చారు. వాళ్లని గదిలో కోర్చోబెట్టి ఒక్కొక్కరి మెడలో ఒక్కో చెప్పుల దండను వేశాను. ‘మమ్మల్ని దొర పిలిచాడు. మేం వెళ్తున్నామన్న మాటను గ్రామస్తులందరికీ ముందే ఎందుకు చెప్పలేదు?’ ‘మీ తోటి గ్రామస్తుల్నీ, మీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లనీ ఎందుకు మోసం చేశారు?’ అని వాళ్లని గట్టిగా నిలదీశాను. ‘రెడ్ల మీద అంత నమ్మకం వుంటే ఎవరికి వారు వెళ్లకుండా అంతా కట్టకట్టుకుని ఎట్లా వెళ్లారు? గత ఇరవై ఏళ్లల్లో వాళ్లు మిమ్మల్ని ఎన్ని సార్లు మోసం చేయలేదు! ఆ చేదు అనుభవాలను అప్పుడే ఎట్లా మరిచిపోయారు? వాళ్లు పిలవగానే సిగ్గులేకుండా ఎట్లా వెళ్లారు ? అని మండిపడ్డాను. ‘మీ ఊరివాళ్లు ఇక ముందు ఏ నాయకులనైనా నమ్ముతారా?’ అని ప్రశ్నించాను. ‘మీ మనసులో వున్న మాటేంటో చెప్పండి. మిమ్మల్నీ మీ ఊరినీ వదిలేసి ఇప్పుడే వెళ్లిపోతాం. ఆ తర్వాత మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి. కానీ మీరు మునుగుతూ మమ్మల్ని ముంచాలని మాత్రం చూడొద్దు’ అంటూ తీవ్రంగా ఈసడించుకున్నాను.
వాళ్లు చాలా పశ్చాత్తాపపడ్డారు. నిజాయితీగా ‘తప్పైపోయింది క్షమించమ్మా’ అన్నారు. వాళ్లలో వచ్చిన మార్పును చూసి నేను ఆ చెప్పుల దండలని తీసేశాను. ఈ వార్త జబ్బార్‌గూడెం చేరింది. మోసం చేసిన నాయకులకు మంచి గుణపాఠం చెప్పారని జనమంతా సంతోషపడ్డారు. వెన్నుపోటు పొడవాలని చూసిన వాళ్లకి బాగా బుద్ధి చెప్పారని సంఘంలోని నా సహచరులు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ నేను చేసిన పనికి నేనే చాలా రోజులు లోలోపల బాధపడ్డాను. నిజానికి ఆ ఊరిలో ద్రోహం చేసిన వారికి మాదిగ పెద్దలు గతంలో ఇలాంటి శిక్షే వేసేవారు. అందుకే నేను దానిని పాటించాను. ఒకప్పుడు వాటిని గట్టిగా వ్యతిరేకించిన నేను ఇవాళ స్వయంగా అదే పద్ధతిని అనుసరించాను.
ఈ సందిగ్ధతలను పక్కన పెడితే, ఆ గ్రామస్తులంతా ఇప్పుడు ఒక్క తాటిమీదకు వచ్చారు. ఇకముందు మళ్లీ ఎవరూ ఇలా భూస్వాములతో ప్రైవేటుగా సంప్రదింపులకు పోరు. ఆ తరువాత ఎప్పటిలాగానే జబ్బార్‌గూడెం మీద మా దృష్టిని కేంద్రీకరించాం. పులిమామిడి భూస్వాములకంటే జబ్బార్‌గూడెం భూస్వామి బలమైన శత్రువు. అతనికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన మర్రి చెన్నా రెడ్డితో దగ్గరి బంధుత్వం వుంది. జబ్బార్‌గూడెం భూస్వాములు ఎలిమినేడులో నివసించేవాళ్లు. అయినా ఇక్కడి భూస్వాములందరితో వారికి మంచి సంబంధాలున్నాయి. కానీ పులిమామిడి భూస్వాములు అలాకాదు. వాళ్లు మిగతా భూస్వాములకు దూరంగా హైదరాబాద్‌లో వుంటున్నారు. అంటే దానర్థం పులిమామిడిలో గ్రామస్తులంతా చాలా సంఘటితంగా వున్నారనీ, వాళ్ల నాయకత్వం పటిష్టంగా, ఆత్మవిశ్వాసంతో వుందనీ.
1987 జూన్ జులైలో వర్షాలు మొదలు కాగానే జబ్బార్‌గూడెం, పులిమామిడి, మహేశ్వరం గ్రామాల ప్రజలు తాము ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల్లో దుక్కి దున్నడం ప్రారంభించారు. ఆవెంటనే పోలీసులు వారిమీద విరుచుకుపడ్డారు. వందలాదిమందిని కందుకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి చితకబాదారు. వారిపై భూముల ఆక్రమణ, ఆస్తుల విధ్వంసం కేసులు పెట్టారు. మేం వెంటనే వారిని బెయిలు మీద బయటికి తీసుకొచ్చాం. దాంతో పోలీసులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. కోర్టులకు ఆదివారం సెలవు దినం కాబట్టి శనివారం పొద్దుపోయిన తరువాత జనాన్ని అరెస్టు చేయడం, హైదరాబాద్‌లోని ముషిరాబాద్ సెంట్రల్ జైలుకు తరలించడం మొదలుపెట్టారు. విచిత్రం ఏమిటంటే చాలా మంది గ్రామస్తులకు జైలు అనుభవం సానుకూలంగా అనిపించింది. అక్కడ వాళ్లకు హత్యలు చేసినవాళ్లూ, దోపిడీ దొంగతనాలవంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినవాళ్లూ ఎదురయ్యారు. వాళ్లు రైతుల్ని చూసి హేళనగా ‘ఇంత చిన్న కారణంతో అరెస్టయి జైలుకు వచ్చారా’ అని నవ్వేవాళ్లట. ‘వెళ్లి ఎవడ్నో ఒకడ్ని చంపేసి మళ్లీ రండి’ అనేవాళ్లట. అయితే మేం త్వరలోనే బెయిలుపై వారిని బయటికి తీసుకురాబోతున్నామన్న సంగతి మావాళ్ల్లకి తెలుసు.
మహేశ్వరం మరో ముఖ్యమైన గ్రామం. అది ఇబ్రహీంపట్నం పొరుగున వున్న మండల కేంద్రం. అక్కడ ఏ అధికారిక రికార్డులలోనూ నమోదైలేని బేదాఖలా భూములు చాలా వున్నాయి. ఉదాహరణకి ఒక గ్రామంలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి వుందనుకుంటే లెక్కల్లో జరిగిన పొరపాట్లవల్ల కేవలం 15 ఎకరాలే ప్రభుత్వ భూమిగా నమోదైతే మిగిలినవి బేదాఖలా భూములుగా మిగులుతాయి. అయితే మ్యాపులను పరిశీలించి అలాంటి భూములను నిర్ధారించి సరిదిద్దవచ్చు. మహేశ్వరంలోని అలాంటి 15 ఎకరాల భూమిని సంపన్న రైతులు అక్రమంగా సాగు చేసుకుంటున్నట్టు తేలింది. ఆ గ్రామంలోని పేదలు 1987 లో కటికెల సత్తయ్య నాయకత్వంలో సంఘటితమై ఆ పదిహేను ఎకరాల బేదాఖలా భూమిని ఆక్రమించి దున్నడం మొదలుపెట్టారు.
అదే సంవత్సరం జూన్ 21 నాడు మహేశ్వరం పోలీసులు వచ్చి వారిలో ఎనిమిది మంది మహిళలను, తొమ్మిదిమంది పురుషులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. సత్తయ్య భార్య లక్ష్మిని అందరికంటే ఎక్కువగా చితకబాదారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. కొన్నాళ్ల క్రితమే ఆమెకు కడుపు ఆపరేషన్ జరిగింది. పోలీసులకు ఆ విషయం చెప్పి నన్ను కొట్టొద్దని ఎంత ప్రాధేయపడ్డా పోలీసులు వినిపించుకోలేదు. కొత్తగా డ్యూటీలో చేరిన సబఇన్స్‌పెక్టర్ మంగిపేట్ సర్వేశ్వర్ రెడ్డి ఆమె బట్టలు విప్పి ఆపరేషన్ అయిన చోటును తనకు చూపించమని కానిస్టేబుళ్లను ఆదేశించాడు. ఆపరేషన్ అయిన మాట నిజమేనని నిర్ధారించుకున్న తరువాతే ఆమెను వదిలేశాడు. ‘ఏదో ఇప్పుడైతే వదిలేస్తున్నాను కానీ రేపు నీ బట్టలూడదీసి వీధుల్లో నగ్నంగా ఊరేగిస్తా జాగ్రత్త’ అంటూ బెదిరించాడు.
వాళ్లను చితకబాదిన తరువాత లారీలోకి ఎక్కించి పశువుల మాదిరిగా హైదరాబాద్‌కు తరలించారు. ఆ అరెస్టు గురించి తెలిసిన వెంటనే మేమంతా వారిని కలుసుకునేందుకు ప్రయత్నించాం. కానీ ఎక్కడా వారి ఆచూకీ లభించలేదు. హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. వాళ్లని ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్‌కు మారుస్తూ పోయారు. నేను అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.వి.ఎస్. ప్రసాద్‌ను కలిశాను. ఆయన వెంటనే రంగారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ని అడిగారు. మేం ఎవరినీ అరెస్టు చేయలేదని బుకాయించాడు ఎస్‌పీ. దాంతో జిల్లా కలక్టర్ ప్రసాద్ స్వయంగా మహేశ్వరం గ్రామానికి వెళ్లి నిజానిజాలు తెలుసుకునేందుకు సంసిద్ధులయ్యారు. దాంతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరినీ ఆ వెంటనే కోర్టులో హాజరు పరిచారు. ఆతరువాత వాళ్లందరినీ బెయిలుపై విడుదల చేశారు.
అదేసమయంలో తమిళనాడులో భవన నిర్మాణ కార్మిక నాయకురాలిగా పనిచేస్తున్న గీతా రామకృష్ణన్ మమ్మల్ని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. విడుదలైన మహేశ్వరం రైతులను పరామర్శించేందుకు నేనూ సిరిల్ వెళ్తుంటే తను కూడా మా వెంట బయలుదేరారు. శ్రీశైలం రహదారి నుంచి ఒక కిలోమీటర్ దూరం లోపలికి వెళ్లగానే ఊరు మొదట్లోనే పోలీస్ స్టేషన్ వుంటుంది. అక్కడ సబ్ ఇన్స్‌పెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి రివాల్వర్‌ను చేత్తో ఊపుకుంటూ బయటకు రావడం చూసి మేం ఒకక్షణం నిర్ఘాంతపోయాం. ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న ఒక ీVAటల్ వద్ద మా కారును ఆపి, టీ తాగుతూ కూర్చున్నాం. సర్వేశ్వర్ రెడ్డి దృష్టి నాపై పడింది. బాలివుడ్ సినిమా హీరోలా రివాల్వర్‌ను తిప్పుతూ నన్ను గుర్రుగా చూశాడు. ఇవాళ ఇతని చేతిలో నేను ఎన్‌కౌంటర్ అయిపోతానేమో అనిపించిందా క్షణం.
మేం ఒక ప్రైవేటు ఫిర్యాదు ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నాం. నేరుగా ఇబ్రహీంపట్నం మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టులో ఆ ఎసఐ మీద ఫిర్యాదు ఫైల్ చేశాం. అప్పటికే అతడి చర్యలను పై అధికారులు చూసీ చూడనట్టుగా వదిలేశారు. ఆ సంఘటనపై హైదరాబాద్ దినపత్రికలలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. లాఠీదెబ్బల వల్ల కూలీలకు అయిన గాయాలు మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో సవివరంగా రికార్డయ్యాయి. మెజిస్టేట్ కార్యాలయంలో మా ప్రైవేటు ఫిర్యాదును వింటున్నప్పుడు జనం పోలీసు దెబ్బల వల్ల తమ చేతుల మీదా కాళ్ల మీద అయిన గాయాలను, వాతలను, వాపులను చూపించారు. వాటిని చూడలేక జడ్జి, న్యాయవాదులు ఆవేదనతో మొహాలు తిప్పేసుకున్నారు. ఆ తరువాత కేసును రికార్డు చేసున్నారు. కోర్టు ఆ ఫిర్యాదును విచారణకు స్వీకరించింది.
ఎసఐ సర్వేశ్వర్ రెడ్డికి కోర్టు సమన్లు జారీచేసింది. జులై నుంచి అక్టోబర్ మాసాల మధ్య ఆరు సార్లు కోర్టు నుంచి రిజిష్టర్డ్ పోస్టులో సమన్లు వెళ్లినప్పటికీ అతను వాటిని స్వీకరించలేదు. తీసుకునేందుకు అతను నిరాకరించాడని నివేదించేందుకు పోస్టుమాన్ సాహసించలేక అతను ‘ఇంట్లో లేడు’ అని రాస్తూ వచ్చాడు. ‘సలహా’ న్యాయవాదులను ఇదేమీ నిరుత్సాహపరచలేదు. చివరికి ఆ సమన్లను అందజేసేపనిని ఒక కోర్టు కమిషనర్‌కు అప్పగించారు. ఆ కమిషనర్ మరో రెండు సార్లు ప్రయత్నించినా ఎసఐ జాడను కనుక్కోలేకపోయారు. దాంతో 1987 నవంబర్‌లో ఇదంతా రంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు వివరిస్తూ ఆ ఎసఐ ఉనికిని తెలియజేయాలని కోరుతూ దరఖాస్తు ఇస్తే అది ముట్టినట్టు రశీదు వచ్చింది. కానీ ఎసఐ జాడ అప్పటికీ తెలియరాలేదు. ఫిర్యాదుదార్లు మాత్రం ప్రతీ కోర్టు వాయిదాకూ హాజరవుతూనే వచ్చారు. ఎందుకంటే ఆ ఎసఐకి లాగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం వారికి లేదు కదా.
నేను ఈ విషయంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆంజనేయరెడ్డిని వారి ఇంటికి వెళ్లి కలిశాను. ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు చాలా మంచి పేరుంది. ఆ తదనంతరం 1991లో ఆయన బౌద్ధ మతం స్వీకరించారు. ఆనంద బుద్ధ విహార సమితిని పునరుద్ధరించారు. సికింద్రాబాద్ మహేంద్రా హిల్స్‌లోని మహాబోధి బుద్ధిస్ట్ విహారను ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్‌లో కృష్ణానది ఒడ్డున బుద్ధవనం సాంస్కృతిక, పర్యాటక క్షేత్రాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన సి.కె. నారాయణ రెడ్డికి ఆయన సుపరిచితులు. అందుకని సీకేనే నన్ను ఆంజనేయ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. మహేశ్వరంలో ఏం జరిగిందో వివరించాను. అంతా విన్న తరువాత “అయితే మేం మీకు భారత రత్న ఇవ్వాలని అనుకుంటున్నారా? ఇప్పుడున్న శాంతి భద్రతలకు మీరు ఇలాగే భంగం కలిగిస్తే చివరికి అదే జరుగుతుంది.” అన్నారాయన. ఆ మాటలు వినగానే నాకు ఒక్కసారిగా దుఖం ముంచుకొచ్చింది. ఒక పోలీసు అధికారి ముందు నేను భోరున ఏడ్వడం అదే మొదటిసారి. దారుణంగా మోసగించబడ్డాననిపించింది. ఆయన న్యాయబద్ధుడైన అధికారి అనుకున్నాను. కానీ అందరిలాంటి అధికారే అని తేలిపోయింది. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి దానిగురించి ఆలోచిస్తే జరిగిందంతా నిజం కాదేమో అనిపిస్తుంది. ఇలాగే జరగబోతుందని ఆయన నన్ను హెచ్చరించాడేమో. రెడ్లను ఎదుర్కొన్నందుకు ఏవో అవార్డులు వస్తాయని నేనెన్నడూ అనుకోలేదు.
ఆ తర్వాత కొన్నాళ్లకే సర్వేశ్వర్ రెడ్డి అక్కడినుంచి వేరే చోటుకి బదిలీచేయబడ్డాడు. అయితే ఆ బదిలీ ఒక శిక్షగా మాత్రం కాదు, అతను ఇక్కడ ప్రైవేటు క్రిమినల్ కేసును ఎదుర్కోకుండా చేయడం కోసమే బదిలీ చేశారు. నిజానికి సర్వేశ్వర్ రెడ్డి ఒక మాజీ నక్సలైటు. రాడికల్ స్టుడెంట్స్ యÖనియన్ (ఆరఎస్‌యు)లో చురుకుగా పనిచేసిన వ్యక్తి. గతంలో తన చెల్లెలి భర్తతో వివాదం తలెత్తినప్పుడు అతను పీపుల్స్ వార్ గ్రూపును (పిడబ్ల్యుజి) సంప్రదించాడు. అందుకు గాను కొంతకాలం ఉద్యోగం లోంచి సస్పెండయ్యాడు. తన చెల్లెలి వరకట్నం విషయంలో 1980ల చివర్లో ఆ గొడవ జరిగింది. అప్పుడు పిడబ్ల్యుజి నక్సలైట్లు అతని బావను ఎత్తుకుపోయి అరగుండు కొట్టించి పంపించారు. తెలంగాణా రెడ్ల దృష్టిలో అది అత్యంత ఘోరమైన అవమానం. ఆ పరాభవాన్ని తట్టుకోలేక£ అతని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. 2011లో సర్వేశ్వర్ రెడ్డి మరోసారి ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యాడు. అప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నాడన్న కేసులో అతడిని అరెస్టు కూడా చేశారు. సర్వేశ్వర్ రెడ్డి పోలీస్ మాఫియా పద్ధతిలో వివిధ భూ ఒప్పందాలలో ఒక బ్రోకర్‌లా పనిచేసేవాడు. కొందరి చేత తమ విలువైన ఆస్తులను బలవంతంగా అతి తక్కువ ధరకు తన అనుచరులకు, బేనామీలకు అమ్మేలా బెదిరింపులకు పాల్పడేవాడు. సాధారణంగా పై అధికారులకు దండిగా ముడుపులు ముట్టచెప్పగానే అలాంటి అక్రమాస్తుల కేసులు గుట్టు చప్పుడు కాకుండా మÖసివేయబడుతుంటాయి. ఇక్కడా అదే జరిగింది. మొత్తంమీద ఎలాగైతేనేం, సర్వేశ్వర్ రెడ్డి పదవీ విరమణ చేసే నాటికి అదనపు పోలీస్ సూపరింటెండ్ స్థాయికి చేరుకున్నాడు.
మేం ప్రతి పోలీస్ స్టేషన్‌లో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. మా సంఘం వాళ్లను అరెస్టు చేసి వేధించిన ప్రతిసారీ నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఇబ్రహీంపట్నంలో పని చేస్తున్నప్పుడు పోలీసుýతో మాట్లాడటం నాకు అంత తేలికైన వ్యవహారంగా వుండేది కాదు. మేం చట్ట వ్యతిరేక పనులేమీ చేయడం లేదనీ, శాంతియుతంగా మా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామనీ, చట్టాల అమలుకోసం మాత్రమే పేదలకు సహాయం చేస్తున్నామనీ వారికి నచ్చజెప్పాల్సి వచ్చేది. పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నప్పుడల్లా ఏదో సింహం గుహలోకి వెళ్తున్నట్టనిపించేది. తిరిగి క్షేమంగా బయటికి వస్తానో రానో అనుకునేదాన్ని.
ఎందుకంటే అంతకుముందు నా సహచర కామ్రెడ్లకు పోలీసుల వల్ల ఎదురైన దారుణ అనుభవాలు అలాంటివి. అత్యవసర పరిస్థితి సమయంలో పోలీసులు పెట్టే చిత్రహింసల తీరుతెన్నులను నేను ప్రత్యక్షంగా విన్నాను. ఒక కామ్రెడ్‌ని మహరాష్టలో అరెస్టు చేసి పోలీసు విచారణ (ఇంటరాగేషన్) కోసం ఆంధ్ర ప్రదేశ్‌కు తీసుకొచ్చారు. అతడిని మేం కలిశాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నాడు. ఆయన వద్ద విజయ రామారావు నక్సలైట్ వ్యతిరేక కార్యక్రమాల ఇంఛార్జిగా పనిచేస్తున్నాడు (ఆ తర్వాత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో మంత్రి అయ్యాడు). లక్ష్మణ్ పగార్ అనే ఆ మహరాష్ట కామ్రెడ్ తన చేదు అనుభవాన్ని మాకు వివరించాడు. పగార్‌ని విజయ రామారావు వద్దకు తీసుకెళ్లినప్పుడు ఆయన “ఇందిరా గాంధీ కీ జయ” అని అనమన్నాడట. పగార్ అందుకు నిరాకరించడంతో మరో ఇద్దరు పోలీసు అధికార్లను పిలిపించాడు. వారిలో ఒకరు పగార్‌ను తలకిందులుగా పట్టుకుంటే మరొకతను పగార్ నాలుకను సగానికి తెగ్గోశాడు. లక్ష్మణ్ పగార్ మÖగగా నోరు తెరిచి మిగిలిన తన సగం నాలికను మాకు చూపించాడు. అదే కాలంలో మా ఉస్మానియా యÖనివర్సిటీ విద్యార్థి మిత్రుడు జంపాల ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలుపెట్టారు. ఇంటరాగేషన్ చేస్తున్న సమయంలో అతని చేతుల, కాళ్ల గోర్లన్నింటినీ పెరికి వేశారు. ఆ తరువాత జంపాల ప్రసాద్ “ఎన్‌కౌంటర”లో చనిపోయినట్టు ప్రకటించారు.
భూమిలేని వ్యవసాయ కూలీకి సహాయం చేసేందుకు దరఖాస్తు తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ప్రతిసారీ సబ్ ఇన్స్‌పెక్టర్ గదిలో తన కుర్చీని తప్ప మిగతా కుర్చీలనన్నింటినీ తీసేయించి తనొక్కడే కూర్చుని వుండటాన్ని నేను గమనించేదాన్ని. ఒకోసారైతే మేం లోపలికి వెళ్లాక మా కళ్లముందే ఆ కుర్చీలను తీసేయించేవాడు. ఆతరువాత ఎప్పుడైనా అతను కూర్చోమన్నా కూర్చోకుండా నిలబడే మాట్లాడటాన్ని అలవర్చుకున్నాను. ఇంకో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నేను వెళ్లినప్పుడు తన బట్టలన్నీ ఒకటి తరువాత ఒకటి విప్పుతూ అండర్‌వేర్‌ని ప్రదర్శించేవాడు. ఆ చిల్లర ప్రవర్తన నాకు పోలీసుల మీద మరింత ఏహ్యతను పెంచింది. జబ్బార్‌గూడెం గ్రామస్తులను విపరీతంగా చితకబాదిన సమయంలో అతను ఒక్కొక్కరినీ పదేపదే నా గురించి “అది మిమ్మల్నందరినీ ఫక్ చేసిందారా? అందుకే అది ఏం చెప్పినా వింటున్నరా మీరు? దానితో ఫకింగ్ ఎట్లుంటదిరా? నన్ను కూడా ఫక్ చేయనిస్తుందా?” అని అడిగేవాడట. ఇదంతా నాకు ఆ తదనంతరం తెలిసింది. నేను జబ్బార్‌గూడెం జనంతో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది మధ్యలోనే మొహం చాటుచేసుకుని వెళ్లిపోతుండేవారు. వాళ్లలా ఎందుకు వెళ్లిపోతున్నారో అర్థంకాక నాకప్పుడు అయోమయంగా అనిపించేది. గట్టిగా నిలదీస్తే ఓ యువకుడు ఆ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అన్న మాటల గురించి చెపాడు. అతను చెప్తుంటే మిగతావాళ్లు మధ్యలోనే అడ్డుపడి అతని నోరు మÖయించారు. ఆ సంఘటనని నేను చాలాకాలం జీర్ణించుకోలేకపోయాను. విన్నప్పుడు ఎంత షాక్‌కు గురయ్యానో మాటల్లో చెప్పలేను. ఒక స్తీగా నేను ఎక్కడైనా తప్పుగా ప్రవర్తించి వుంటానా అని నాలో నేనే తీవ్రంగా మథనపడ్డాను. ఆ విషయం గురించి సిరిల్‌తో సహా ఎవరితోనూ చర్చించలేదు.
మంచి పోలీసు అధికారులు లేరని కాదు. అయినా మా దృష్టిలో మంచి పోలీస్ అధికారి అంటే మా జనాన్ని కొట్టని వాడని కాదు, తన లాఠీతో సంపన్నులనూ, పేదలనూ సమానంగా, ఒకే విధంగా కొట్టేవాడే మంచి పోలీసు అధికారి. 1987`88లో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణకు మంచి పోలీసు అధికారిగా పేరుంది. (ఆ కాలంలోనే కందుకూరు, మహేశ్వరం గ్రామాల్లో మాపై ఎక్కువ పోలీసు కేసులు నమోదయ్యాయి). ఆయనకా ‘మంచి’ పేరు ఎందుకు వచ్చిందంటే కేసులోని ఇరు పక్షాలవారూ డబ్బున్నవాళ్లయితేనే ఆయన లంచం తీసుకునేవాడు. ఒక పక్షం డబ్బున్నవాళ్లు రెండో పక్షం డబ్బులేని పేదలు అయితే ఆయన లంచం తీసుకునేవాడు కాదు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా వున్నప్పుడు ఆయన మా సంఘం జోలికి వచ్చేవాడు కాదు. మా సంఘం సభ్యులు తరచూ పనిమీద పోలీస్ స్టేషన్‌కు లేదా ఆయన ఇంటికి వెళ్లి కలిసి ఆయనతో టీ తాగి వచ్చేవారు. 1989లో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు భద్రారెడ్డి అనే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వచ్చాడు. ఆయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునేవాడు. అయితే, భూస్వాములతోనూ కూలీలతోనూ ఒకే విధంగా వ్యవహరించేవాడు. అంటే ఇరువురినీ ఒకేలాగా చితక బాదేవాడు. ఇబ్రహీంపట్నం తాలూకాలో ఒక పోలీసు అధికారి రెడ్డి కులానికి చెందిన ఏ భూస్వామినైనా అరెస్టు చేశాడంటే చాలు జనం దృష్టిలో పెద్ద హీరో అయిపోయేవాడు. ఆ పోలీసు అధికారి గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. న్యాయం అనేది సాపేక్షమైనది తప్ప నిరపేక్షమైనది కాదని నేను ఈవిధంగా తెలుసుకున్నాను.
17. అన్ని సమస్యలూ మీరే పరిష్కరించాలి
1987 నాటికి మేం మిలిటెంట్ భూ పోరాటాలు మొదలుకుని పాఠశాలలు నడపడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ఎన్నికలలో ప్రచారం చేయడం వంటి విభిన్న కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. ఒకోసారి మా జీవితాలకు ఒక క్రమబద్ధత లేనట్టనిపించేది. జనం మమ్మల్ని అన్నివైపులకూ లాగుతుండేవారు. ఎలిమినేడు మాదిగలు సంఘంతో గట్టిగా నిలబడడం, ప్రభుత్వం 144వ సెక్షన్ విధించి భూపాల్ రెడ్డిని ఆ భూముల్లోంచి బయటకు పంపించడం వల్ల జబ్బార్ గూడెం పరిస్థితి నిలకడగా మారింది. ప్రజలు కలసికట్టుగా సంఘ బహిష్కరణను అమలు చేయడంతో పులిమామిడి నుంచి భూస్వాములు అన్నీ సర్దుకుని వెళ్లిపోయారు. ప్రజలు స్వయంగా ఆ పొలాలను దున్నేందుకు సిద్ధమవుతున్నారు.
1987 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం వల్ల మా కార్యక్రమాలకు కొంత అంతరాయం ఏర్పడింది. అవి జిల్లా ప్రజా పరిషత్ (జడ్‌పిపి), మండల ప్రజా పరిషత్ (ఎంపిపి) ఎన్నికలు. ఆ సంస్థలను తెలుగు దేశం ప్రభుత్వమే కొత్తగా నెలకొల్పింది. పోటీలో ప్రధానంగా వున్నవి తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలే. కొన్ని చోట్ల తెలుగు దేశంతో పొత్తు కుదుర్చుకున్న మార్క్సిస్టు పార్టీ (సిపిbం) కూడా పోటీలో వుంది. అయితే వేతనాల పెరుగుదల కోసం, భూమి కోసం ఇక్కడి రైతు కూలీలు చేస్తున్న పోరాటాలను ఆ మÖడు పార్టీలూ వ్యతిరేకించేవి. మరి ప్రజలు ఆ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలనిపించేది. మేము ఒక గ్రామం తరువాత మరో గ్రామంలో మీటింగులు పెట్టి ఇప్పుడు మనమేం చేద్దాం అని ప్రజల్ని అడిగాం. మీలో ఎంపిపి పదవికి ఎవరైనా పోటీ చేస్తారా? భూస్వాముల చెప్పు చేతుల్లో నడిచే అభ్యర్థికి మనం ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించేవాళ్లం. వాటికి మాదిగలు పెద్దగా స్పందించేవారు కాదు. వాళ్లల్లో ఎవరూ ముందుకు రాకుండా, పోటీ చేసేందుకు కాస్త డబ్బున్న వెనుకబడిన తరగతుల అభ్యర్థుల కోసం వెతికారు.
చివరికి ఒక ఇద్దరు మాత్రం ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో ఒకరు నేరెపల్లి గ్రామంలో గౌడ కులానికి చెందిన ఎర్ర నరసింహ గౌడ్. అతను ఇబ్రహీంపట్నం మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నాడు. మరొకరు నందివనపర్తి గ్రామంలో మాల కులానికి చెందిన మాజీ సైనికుడు బండి శ్రీరాములు. అతను యాచారం ఎంపిటిసికి పోటీ చేస్తానన్నాడు. బండి శ్రీరాములు చాలా అద్భుతంగా ప్రచారం చేశాడు. కొద్దిమందిని వెంటబెట్టుకుని ఒక ఊరి తరువాత ఒక ఊరు సైకిళ్ల మీద తిరుగుతూ “నేను మీలో ఒకణ్ని. మీ మనిషిని. వాళ్ల లెక్క నేను మీకు మందు బాటిళ్లు, డబ్బు ఏమీ ఇవ్వలేను. కానీ నేను గెలిస్తే మాత్రం మీరు గెలిచినట్టే. ఇప్పటి లెక్క మీరు ఆఫీసు బయట చేతులు కట్టుకుని నిలబడాల్సిన పనిలేదు. నన్ను ‘పటేలా’ అని పిలవాల్సిన అవసరం లేదు. మీరు బాజాప్త నా ఆఫీసులోపలికి రావచ్చు. నేను మిమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి మాట్లాడత. ఒకవేళ నేను ఓడిపోయినా కూడా మన ఐకమత్యాన్ని నిలబెట్టుకోవాలే… మనమంతా ఒక్కటే” అంటూ ప్రసంగాలు చేసేవాడు. రెండు వందల మందికి పైగా స్తీలు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఊరూరూ లారీలో వెళ్లి అపూర్వంగా ప్రచారం చేశారు. ఇరుగు పొరుగు గ్రామాల నుంచి నందివనపర్తికి కోడరికం వచ్చిన ఆడవాళ్లు తమ తమ పుట్టిండ్లకు వెళ్లి తల్లి దండ్రులతో, అన్నదమ్ములతో ‘బండి శ్రీరాములు మన మనిషి. మీరందరూ ఆయనకే ఓటెయ్యాలి. లేకపోతే నేను మీ గడప కూడ తొక్క’ అని గట్టిగా చెప్పి వచ్చేవాళ్లు.
మా వద్ద పోలింగ్ బూత్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు లేకపోయినా ఆయా గ్రామాల్లో మా సంఘం సభ్యులు కొంతమంది సర్పంచ్ అభ్యర్థులకు మద్దతిచ్చారు. మేం ప్రచారం చేస్తున్నప్పుడు ఓట్లకు నోట్లిచ్చే సంస్కృతికి వ్యతిరేకంగా జనాన్ని చైతన్యపరచాలని కూడా నిర్ణయించుకున్నాం. ఓటుకు నోటిచ్చే సంస్కృతికి విరుద్ధంగా ఓటర్లనే విరాళాలు అడగాలని నిర్ణయించుకున్నాం. ‘మాకు ఒక ఓటూ, ఒక రూపాsTÖ ఇవ్వండి’ అంటూ ప్రచారం మొదలుపెట్టాం. జనం నుంచి మంచి స్పందనే వచ్చింది. చెప్పుకో తగినంత డబ్బే వచ్చింది. కానీ సంఘం సభ్యులెవరూ గెలవలేదు. వారిలో ఇండిపెండెంట్లుగా పోటీచేసిన కొందరికి డిపాజిట్లు కూడా రాలేదు. ఎన్నికలైపోయిన తర్వాత ఆ గ్రామాల్లో నేను కనిపిస్తే చాలు ‘నీకు ఓటేసిన… ఒక రూపాయి ఇచ్చిన. మరి నా పెన్షెన్ ఎప్పుడిప్పిస్తవు?’ అని నన్ను కొందరు వృద్ధ మహిళలు నిలదీసేవారు.
ఎన్నికల ద్వారా, ఎలెక్టోరల్ ప్రజాస్వామిక పద్ధతిలో ఎవరైనా సమస్యలను పరిష్కరించుకోవచ్చన్న కాల్పనిక భావనలు గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు పటాపంచలైపోయాయి. నేను అక్కడ అప్పటివరకూ చేసిన పనులతో పోలిస్తే ఈ ఎన్నికలనేవి నిరర్థకమైనవి. వాటిలో లంచాలూ, మోసాలూ, బేరసారాలూ అన్నీ బహిరంగంగా సాగుతుంటాయి. ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థీ విపరీతంగా డబ్బు ఖర్చు పెడతాడనీ… కుల పెద్దలకు భారీ మొత్తాలను పంచుతాడనీ అందరికీ తెలుసు. ఆ డబ్బు గురించి జనం కొట్లాడుకోవడం వంటివన్నీ తెలుసు. డబ్బుతో పాటు మందు కూడా వుంటుంది. జనానికి చిట్టీలు ఇస్తారు. వాటిని తీసుకెళ్లి మందుల షాపులో ఇస్తే అక్కడ మందు బాటిళ్లు లభిస్తాయి. వాటి కోసం చాలా చోట్ల జనం బాహాటంగా పోట్లాడుకునేవారు. ‘నీకు ఆయన అంత డబ్బు ఇస్తె నువ్వు మాకు ఇంత తక్కువ పంచుతవా?, ‘నీకు ఐదువందల రూపాయలిస్తే నువ్వు నాకు రెండు వందý రూపాయలే ఇచ్చినవు, గిదేం అన్యాయం… ?’ ఎన్నికల సమయంలో ఇట్లా ఎక్కడ చూసినా ఇవే గొడవలు. అట్లాంటి ఎన్నికల్లో మేం ఎప్పటికీ గెలవలేమన్న సంగతి మాకు అర్థమయింది. జనానికి పంచే డబ్బు ఎలాంటిదో.. ప్రజల ఓట్లను వాళ్లు ఎట్లా కొంటారో బాగా తెలిసివచ్చింది. ఓట్లను అమ్ముకోవడం ద్వారా డబ్బు రాబట్టుకోవాలని కొంతమంది జనం కూడా ఆశిస్తున్నారు. అభ్యర్థిని ప్రశ్నించడానికదే తగిన సమయం. అయితే, 1987 ఎన్నికలలో మాకు ఎదురైన అపజయాలు ఆ తరువాత మా పోరాటాలకు మేలే చేశాయి.
ఎన్నికల్లో గెలవకపోవడం వల్ల మాకొచ్చిన నష్టమేమీ లేదు. తమ భూ సమస్యల పరిష్కారం కోసం, పట్టాల కోసం ప్రజలు మా మీదనే నమ్మకం పెట్టుకున్నారు. ఆ సంవత్సరంలోనే మరో భూమికి సంబంధించిన రెండు పెద్ద వివాదాలు తలెత్తాయి. ఒకటి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌కు చెందింది. రెండవది చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంకు చెందింది. మీర్‌ఖాన్‌పేట్ నుంచి యాచారంకు పది కిలోమీటర్ల దూరం వుంటుంది. దండుమల్కాపురం 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో వుంటుంది. నేను ఈ పుస్తకం రాస్తున్న సమయంలో అమెజాన్ అనే అంతర్జాతీయ సంస్థ రూ.11,624 కోట్ల పెట్టుబడితో మీర్‌ఖాన్‌పేట్‌లో ఒక డాటా సెంటర్‌ని ఏర్పాటు చేయబోతోందన్న వార్త ఆ ప్రాంతమంతటా పెద్ద సంచలనం సృష్టించింది. 1987కు ముందు అదొక స్తబ్ధుగా వున్న పల్లెటూరు. అప్పట్లో ఆ ఊరు మీదుగా యాచారం నుంచి కందుకూరుకు ఒకే ఒక్క బస్సు నడిచేది. మధ్యాహ్నం రెండు గంటలకు ఊళ్లోకి ఆ బస్సు వచ్చినప్పుడు ఎక్కేవాళ్లూ, దిగేవాళ్లూ పెద్దగా వుండేవారుకాదు. ఆ ఊరు పక్కన మÖడు చిన్న పల్లెలు బెగరకంచ, తిమ్మాయ్‌పల్లి, ఆకులమైలారంలు వున్నాయి. మీర్‌ఖాన్‌పేట్‌లో అన్ని కులాలవాళ్లూ వుండేవారు. బెగరకంచలో అంతా తెలగ కులంవాళ్లుంటే, ఆకులమైలారంలో ఎక్కువగా గొర్రెలను కాచుకునే కురుమ కులస్తులుండేవారు.
ఆకులమైలారం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిన గ్రామం. సాధారణంగా కురుమ కులస్తులు శాంతియుతంగా వుంటారని ఇబ్రహీంపట్నంలో మంచి పేరుంది. కానీ ఆకులమైలారంలో మాత్రం మిలిటెంట్లు. వాళ్లంతా చాలా ఉత్సాహంగా సంఘంలో చేరారు. ఆ ఊరి భూస్వామి లక్ష్మీనారాయణ్ రెడ్డి మహా క్రూరుడు. అనేకమంది ఆడవాళ్లపై అత్యాచారాలు చేసినవాడు. కానీ అతని కుమారుడు బి.సుదర్శన్ రెడ్డి మానవ హక్కుల కార్యకర్త. సోషలిస్టు. ఆతదనంతర కాలంలో ఆయన సుప్రీంకోర్టు జడ్జి కూడా అయ్యారు. 1970లలో లక్ష్మీనారాయణ్ రెడ్డి ఒక చిన్నవయసు బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లినప్పుడు కురుమ కులస్తులంతా ఒక్కటై అతని మీద తిరగబడ్డారు. ఆ బాలికను ఇంటికి పంపి అతడిని చితకబాదారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అతను చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్లి ఊరి కాలవ పక్కన తగులబెట్టారు. ఆ బూడిదను మÖటగట్టి యాచారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి జరిగిందంతా చెప్పి పోలీసులకు స్వయంగా లొంగిపోయారు. వారిలో కొందరికి పధ్నాÛలుగు సంవత్సరాల జీవిత ఖైదు శిక్ష పడింది. 1987లో జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత వాళ్లు మరింత నిర్భయస్తులయ్యారు. తాము ఎవరికన్నా తక్కువ కాదన్న ఆత్మ విశ్వాసం వారిలో పెరిగింది. హెచ్చుతగ్గుల కుల వ్యవస్థలో నైతికతకు స్థానం లేదని వాళ్లు గ్రహించారు. సంఘంలో చేరి మాతో భుజం భుజం కలిపి పోరాడతామన్నారు.
ఇబ్రహీంపట్నంలో నాకు ఇష్టమైన వ్యక్తులలో.. నాకు మార్గదర్శకుల వంటివారిలో బెగరకంచ గ్రామానికి చెందిన డిల్లీ జంగయ్య ఒకరు. తెలగ కులస్తుడు. 1987లో మీర్‌ఖాన్‌పేట్ భూపోరాటం మొదలుకాక ముందునుంచే మా సంఘం సమావేశాలకు క్రమంతప్పకుండా హాజరవుతూ, వెనకాల కూర్చుని శ్రద్ధగా వింటూ వచ్చిన వారిలో అతనొకడు. పొడుగ్గా నల్లగా వుండేవాడు. ఎప్పుడూ అతని వెంట ఇద్దరు ముగ్గురు తెలగ కులస్తులుండేవారు. 1987 నుంచి 1993 వరకు జంగయ్య నాకు సలహాలూ సూచనలూ ఇస్తూవచ్చాడు. సంఘం కొత్త కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు వాటి గురించి ముందే తగిన సూచనలు చేసేవాడు. బెగరకంచ పట్టుమని పది ఇళ్లు లేని అతిచిన్న పల్లె. అయినా అతనితో మంచీచెడూ మాట్లాడేందుకు, వివిధ విషయాలపై చర్చించి అతని సూచనలు తీసుకునేందుకు నేను తరచూ బెగరకంచకు
వెళ్తుండేదాన్ని. అతనికీ, అతని ముగ్గురు కొడుకులకూ కలిపి కేవలం మÖడెకరాల పొలం వుండేది. అందులో వాళ్లు అద్భుతమైన పంటలు పండించేవారు. సాగునీటి సౌకర్యం వుండటంవల్ల చాలా భాగంలో కూరగాయలు, కొత్తిమీర వంటివి పండించి ప్రతి రెండు రోజులకోసారి హైదరాబాద్‌లోని ీVAల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు తీసుకెళ్తుండేవారు. ఆ మార్కెట్ తీరుతెన్నులని జంగయ్య శ్రద్ధగా అధ్యయనం చేశాడు. మిగతా పొలంలో తమకు కావలసిన వరి, చిరుధాన్యాలు, పప్పులు వంటివి పండించుకునేవారు. వాళ్ల ఇంటి ఆవరణలో కోళ్లనూ, మేకలనూ పెంచేవారు. ఆ మేకలని జంగయ్య స్వయంగానో లేక ఆయన కోడలో ఎవరో ఒకరు మేతకు తీసుకెళ్తుండేవారు. మÖడు ఎకరాలతో స్వయం సమృద్ధిని సాధించిన ఆ కుటుంబాన్ని చూస్తే ముచ్చటగా అనిపించేది. ఒక కుటుంబ మనుగడకు, ఎదుగుదలకు ఎంతో కొంత భూమి, సాగునీటి సౌకర్యం ఎంతగా అవసరమో అతని కుటుంబాన్ని చూశాక అర్థమయింది.
డిల్లీ జంగయ్య తనకు అవగాహన వున్న విషయాలపై సలహాలిచ్చేందుకు ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు. ఏదైనా మాట్లాడటానికి ముందు ఆ విషయాలను కూలంకషంగా తెలుసుకునేవాడు. అతనికి ఎంతో ఓపిక.. ఎన్ని సందేహాలు వెలిబుచ్చినా ఓపికగ్గా వివరించేవాడు. ఆ చుట్టు పక్కలి గ్రామాల సంగతులు.. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు నాకు చెప్పేవాడు. రోజూ దినపత్రిక చదివేవాడు. రేడియో వార్తలు వినేవాడు. రాజకీయాల గురించి చర్చించేవాడు. తనకు తెలియని, అందుబాటులో లేని వార్తా విశేషాల గురించి నన్ను అడిగి తెలుసుకునేవాడు. అతని ఆసక్తి, అంతర్దృష్టి గొప్పగా అనిపించేవి. నేను ఇబ్రహీంపట్నం పని ముగిసి తిరిగి వచ్చేసిన తరువాత కూడా అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వచ్చి నన్ను పలకరించినవాళ్లలో డిల్లీ జంగయ్య ఒకరు. తనకు తానుగా ముందుకొచ్చిన నా సంరక్షకుడతను.
మీర్‌ఖాన్‌పేట్ గ్రామానికీ హైదరాబాద్‌లోని దేవల్ షివ్జీ మందిర్‌కీ మధ్య అవినాభావ సంబంధం వుంది. ఆ దేవాలయానికి చెందిన 1200 ఎకరాల భూమి మీర్‌ఖాన్‌పేట్‌లో వుండేది. దురాక్రమణకు గురైన భూములు పోయినవిపోగా ఆ దేవాలయం కింద ఇప్పటికీ 928 ఎకరాల భూమి మిగిలి వుంది. సాధారణంగా దేవాలయాల భూముల సంరక్షణ, నిర్వహణ బాధ్యత రాష్ట దేవాలయ శాఖ కింద వుంటుంది. వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ శాఖదే. ఆలయ ట్రస్టీల చేతుల్లో వున్నప్పుడు ఆ భూములను సాగు చేసుకోడానికీ, పశువులను మేపుకోడానికీ మీర్‌ఖాన్‌పేట గ్రామస్తులకే అద్దెకిచ్చేవారు. మీర్‌ఖాన్‌పేట్‌లోని అతి చిన్న పల్లె అయిన బెగరకంచకు చెందిన తెలగ కులస్తులు పూర్తిగా ఆ భూమిమీదనే ఆధారపడి పంటల్ని సాగు చేసుకుంటూ, పశువులను మేపుకుంటూ జీవనం సాగించేవారు. ఆ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి అనే బడా భూస్వామి ఆ దేవాలయ భూమిలో గణనీయమైన భాగాన్ని ఆక్రమించుకున్నాడు. అతను అక్కడ ఒకప్పటి సర్పంచి, పట్వారి కూడా. దేవల్ షివ్జీ మందిర్ పూజారికి వ్యతిరేకంగా 1961లో కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. మొదట 200 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకున్న అతను ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ప్రాతిపదికáతో మరో 400 ఎకరాల దేవాలయ భూమి తనదే అని ప్రకటించుకున్నాడు. అప్పటివరకూ ఆ భూమి గ్రామంలోని పేదరైతులు, గొర్రెలకాపర్లు వాడుకునేవారు. ఇప్పుడు విఠల్ రెడ్డి వాళ్లందరి దగ్గరనుంచి అద్దె వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. తనే ఆ భూముల పట్టాదారునని రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు.
1987లో ఆ భూమిలోంచి వంద ఎకరాలను విఠల్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలకు.. కాంట్రాక్టర్లకు అమ్మేసుకున్నాడు. ఆ కొత్త యజమానులు తాము కొన్న భూమి చుట్టూ కంచెను నిర్మించి గ్రామస్తులెవ్వరూ అందులో అడుగుపెట్టకుండా చేశారు. ఆ కంచె మీర్‌ఖాన్‌పేట్‌లో పెద్ద అలజడిని సృష్టించింది. వాళ్లందరూ మా వద్దకు వచ్చారు. ఆ గ్రామానికి చెందిన వెట్టి చాకిరీ కూలీలను అంతకు ముందు సంఘమే విముక్తి చేయించింది. అందువల్ల వాళ్లందరికీ మేం సుపరిచితమే. ఆ ఊరు తరఫున ప్రతినిధులుగా ఢిల్లీ జంగయ్య, పాస్టర్ బోడ బాల్‌రాజ్ నా వద్దకు వచ్చారు. 1986లో కలిసినప్పుడు బాల్‌రాజ్ మీర్‌ఖాన్‌పేట్‌లోని మెన్నోనైట్ చర్చిలో పాస్టర్‌గా వుండేవారు. ఇతర్లమాదిరిగా కాకుండా ఆయన తాగుడుకూ, ధూమపానానికీ దూరంగా వుండేవారు. చాల నమ్రతగా, ఓపికగా మాట్లాడుతూ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించేవారు. సదా నైతిక పోరాటం గురించి ప్రస్తావించేవారు. జంగయ్య, బాల్‌రాజ్‌లు మా సంఘం చేస్తున్న కొన్ని ప్రమాదకరమైన ఆలోచనలను, చర్యలను లోతుగా విశ్లేషించి సలహాలూ సూచనలూ ఇస్తుండేవారు. ముప్పై ఐదేళ్ల క్రితం దళితులెవరూ తమ కూతుళ్లను బడికి పంపడానికి ఇష్టపడని రోజుల్లో…బోడ బాల్‌రాజ్ తన ఐదుగురు కుమార్తెలనూ పట్టుదలగా చదివించారు. వాళ్లంతా ఇప్పుడు మంచి ఉన్నత స్థానాల్లో వున్నారు.
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఫోన్ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com
(ఇంకా ఉంది)
