తొలి మహిళా మానవ శాస్త్రవేత్త, మరాఠీ సాహితీవేత్త – ఐరావతీ కార్వే – డా. నాగసూరి వేణుగోపాల్

ఐరావతి .. ఈ పేరే చాలా విభిన్నం, అది బర్మాలో ప్రవహించే ఓ నది ‘ఐరావడి’ ఆధారంగా పెట్టిన పేరు. ఐరావతి కార్వే (Iravati Karve) భారతదేశపు తొలి మహిళా సామాజిక శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త. ఆ పేరు లాగానే ఆమె జీవితం కూడా చాలా వైవిధ్యమైంది.

ఆరు దశాబ్దాల క్రితం మహాభారతం ఆధారంగా చేసిన మరాఠీ రచన ‘యుగాంత’తో సంచలనం రేపిన రచయిత్రి కూడా ఆమె. సోషియాలజీ, యాంత్రోపాలజీ, ఆంథ్రోపోమెట్రీ, సెరాలజీ, ఇండోలజీ, పాలియోంటాలజీ వంటి విభిన్న శాస్త్రశాఖలలోనే కాకుండా; జానపద గీతాలను సేకరించడం, స్త్రీవాద కవిత్వాన్ని అనువదించడం అంతకుమించి పలు ఆలోచనలను అందిపుచ్చుకొని వ్యాప్తి చేసే చోదక శక్తిగా పనిచేయడం .. ఇలా చాలా విలక్షణంగా కనబడతారు. అంతేకాదు నచ్చిన మగవాడిని పెళ్లి చేసుకుని, అతను నాస్తికుడిగా ఉన్నా తను విభిన్నమైన ఆలోచనాధోరణితో జీవితాన్ని సాగించిన ఈ ధీర తన జీవితంలో ఎంతోమందితో విభేదించి సాగారు.
బర్మా కాటన్ కంపెనీలో పనిచేసే మరాఠీ సంపన్న బ్రాహ్మణులు గణేష్ హరి కర్మార్కర్ దంపతులకున్న ఆరు మంది సంతానంలో ఐరావతి ఒక్కర్తే కుమార్తె. 1905 డిసెంబర్ 15న జన్మించిన ఐరావతి తన ఏడవ ఏట చదువు కోసం పూణెలోని బాలికల తొలి పాఠశాలల్లో ఒకటైన హుజూర్ పాగాలో చేరారు. అక్కడ తన క్లాస్మేట్ అయిన శకుంతల పరంజపే ద్వారా ఆమె తల్లి పరిచయమయ్యారు. పరంజపే కుటుంబం ఉన్నత విద్యతో పాటు కళాత్మక అభిరుచి ఉన్నది. ఐరావతిని ఆ కుటుంబం దాదాపు దత్తత తీసుకున్నట్టు పెంచి పోషించింది. ఆ ఇంట్లోనే న్యాయమూర్తి బాలక్‌రామ్ పరిచయం కావడమే కాకుండా, ఆయన ఐరావతిలో యాంత్రోపాలజీ పట్ల ఆసక్తి రేకెత్తించారు. పూణెలోని ఫెర్గుసన్ కాలేజీలో ఆమె ఫిలాసఫీలో డిగ్రీ సాధించారు. పెర్గ్యూసన్ కాలేజీలో కెమిస్ట్రీ బోధించే దినకర్ కార్వేని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. స్త్రీవిద్యకు సంబంధించి ఎంతో కృషి చేసి ఎస్.ఎన్.డి.టి. విద్యాసంస్థలు ప్రారంభించి, విజయవంతంగా నిర్వహించిన మహర్షి ధొండో కేశవ్ కార్వే రెండవ కుమారుడే ఈ దినకర్. అప్పటికి కార్వే ఎంతో ప్రతిష్ట గల వ్యక్తయినా, ఆ వివాహాన్ని ఆమె తండ్రి ఆమోదించక, ఏదైనా సంస్థానాన్ని పాలించే కుటుంబంలోని వ్యక్తికివ్వాలని ఆలోచన చేస్తున్నారు. పుట్టింటివారి సమ్మతి లేకుండానే పెళ్లి చేసుకున్న ఐరావతి స్కూటర్ నడిపిన తొలి భారతీయ మహిళలలో ఒకరు. మరో తమాషా ఏమిటంటే ఐరావతి పీహెచ్‌డి కోసం బెర్లిన్ వెళ్ళినప్పుడు మహర్షి కార్వే విభేదించడం.
బొంబాయి విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగాన్ని ప్రారంభించిన ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త డా.జి.ఎస్. ఘుర్వే వద్ద ‘చిత్ పవన’ బ్రాహ్మణ తెగకు సంబంధించిన అధ్యయనంతో ఎం.ఏ. పూర్తి చేశారు. అనధికారికంగా దత్తత తీసుకున్న ఆర్.పి.పరంజపే ప్రోత్సాహానికి, ఐరావతి భర్త దినకర్ తోడ్పాటు కలిసి వచ్చింది. బరోడా సంస్థానానికి మొదటి దివాన్, గుజరాత్ తొలి ముఖ్యమంత్రి, ఇంగ్లాండులో హైకమిషనర్, ఇంకా గాంధీజీ పర్సనల్ డాక్టర్‌గా ప్రఖ్యాతులైన జీవరాజ్ నారాయణ మెహతా ఇచ్చిన అప్పుతో ఐరావతి పీహెచ్‌డి పూర్తి చేశారు. 1928లో జర్మనీలోని కైసర్ విల్ హెల్మెట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ, యూజినిక్స్ అండ్ హ్యూమన్ హెరిడిటీ డైరెక్టర్ ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యుగెన్ ఫిషర్ వద్ద పరిశోధనకు చేరి రెండు సంవత్సరాల్లో పీహెచ్‌డి గడించారు. ఆమె పరిశోధన చేసిన కాలంలో హిట్లర్ అధికారంలోకి రాకపోయినా యూదుల పట్ల వ్యతిరేకత బాగా ఉండేది. బెర్లిన్‌లో తన నివాసానికి సమీపంలో జరిగిన సంఘటన ఆమెను చాలా కలచి వేసింది. ఐరావతి పరిశోధన నిమిత్తం 149 మానవ పుర్రెలను అధ్యయనం చేశారు. ఆమె పరిశోధక పర్యవేక్షకుడు ఫిషర్ తెల్లవారైన యూరోపియన్ల పుర్రెలలో కుడిభాగం పెద్దగా ఉంటుంది కనుక, వారు మరింత తర్కబద్దంగా, ప్రతిభావంతంగా ఉంటారని తేల్చడానికి తాపత్రయపడ్డారు. అయితే ఐరావతి పరిశోధన ద్వారా తేలింది ఏమిటంటే పుర్రె ఆకారానికి, ఆలోచనా తీరుకు సంబంధం లేదని. అంటే అప్పట్లో ఛలామణిలో ఉన్న వాదనలను తిరస్కరించి, ఫిషర్ అహంభావాన్ని ఐరావతి దెబ్బతీశారు. కనుకనే ఐరావతికి ఫిషర్ సాధ్యమైనంత తక్కువ గ్రేడ్ ఇచ్చాడు. ఫిషర్ ఆలోచనలను నాజీ పార్టీ తన సిద్ధాంతాలుగా మార్చుకొని ప్రచారం చేయడం, ఫిషర్ ఆ పార్టీలో చేరడమూ కూడా చరిత్ర.
1930లో భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత, ఐరావతి బొంబాయిలోని మహర్షి కార్వే సంస్థయిన ఎస్. ఎన్. డి. టి. ఉమెన్స్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా 1931 నుంచి 1936 దాకా పనిచేశారు. అయితే అది ఐరావతికి తృప్తినివ్వలేదు. దానితో 1939లో ప్రఖ్యాతి చెందిన పూణేలోని డెక్కన్ కాలేజీలో సోషియాలజీ విభాగం రీడర్‌గా చేరి, తన జీవితపర్యంతం అక్కడే బోధన, పరిశోధన చేశారు. బాలగంగాధర్ తిలక్, ద్వారకనాథ్ కోట్నీస్ వంటి ఎంతోమంది ప్రఖ్యాతులు ఈ కళాశాలలో చదువుకున్నవారే. ఆమె పూణె రాకుండా బొంబాయిలో ఉండి ఉంటే మరింత గుర్తింపు లభించి ఉండేది. అలాగే ఆమె పరిశోధనల ఫలితాలన్ని డెక్కన్ కాలేజీ ముద్రణా సంస్థ ద్వారా కాకుండా ఆక్స్ఫర్డ్ ప్రెస్ వంటి ప్రచురణ సంస్థ ద్వారా వెలుగు చూసి ఉంటే మరింత ప్రాచుర్యం కలిగి ఉండేది. భారతీయులంటే ఎవరు? మనమేమిటి? మనమెందుకు??… వంటి ప్రశ్నలాధారంగా ఐరావతి కార్వే పరిశోధనలు కొనసాగించారు. దీని కోసం ఆమె పరిశోధక పర్యటనలు విస్తృతంగా చేశారు, 15000 సం. క్రితం కాలపు ఎముకలను సైతం గుర్తించి పరిశోధించారు. ఇటువంటి పర్యటనలలో భాగంగా ఒక ఆదివాసి ఇచ్చిన, సగం ఉడికిన మాంసాన్ని కూడా ఆమె అతని తృప్తి కోసం భుజించిన తాదాత్మ్యం కూడా ఆమెదే. ఏకకాలంలో పాలియో ఆంత్రోపాలజీ, ఇండలాజికల్ స్టడీస్, ఎపిక్ అండ్ ఓరల్ ట్రెడిషన్స్ అధ్యయనం చేశారు. అలాగే ఒక క్రమపద్ధతిలో గుజరాత్, కర్ణాటక, ఒరిస్సా, కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ వంటి వేర్వేరు ప్రాంతాల్లో, విభిన్న భాషాప్రాంతాలలో ఫిజికల్ యాంత్రోపాలజికల్ అధ్యయనాలు కొనసాగించారు. కాకతాళీయంగా వేర్వేరు చోట్ల నమూనాలు తీసుకోకుండా, పరిమితమైన ప్రాంతంలో, లోతైన అధ్యయనం చేస్తే ఎక్కువ ఫలితముంటుందని ఐరావతి కార్వే భావించేవారు. 1953లో ప్రచురణైన ‘కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా’ భారతీయ మానవశాస్త్రంలో పునాది వంటి గ్రంథం. భారతదేశపు కులవ్యవస్థకు సంబంధించి రాసిన ‘హిందూ సొసైటీ యాన్ ఇంటర్ప్రెటేషన’ అనే పుస్తకం ఎంతో సంచలనం రేపింది. అలాగే ‘మహారాష్ట్ర ల్యాండ్ అండ్ పీపుల’ కూడా ప్రఖ్యాతమైంది.
ఐరావతి కార్వే చేసిన పరిశోధనలు ఆమెకు మన దేశంలోనే కాదు ప్రపంచమంతా మంచి గుర్తింపును కల్పించాయి. యాంత్రోపాలజీ కూడా సోషయాలజీగానే గుర్తించబడే కాలంలో తన విభాగానికి ప్రాచుర్యం తెచ్చిపెట్టి, 1947 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఆమె యాంత్రోపాలజీ విభాగానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. అలాగే లండన్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ విభాగంలో ఉపన్యాసాలిచ్చారు. వేదాలు, రామాయణం నుంచి భక్తకవుల రచనలు దాకా; అలాగే ఆలివర్ గోల్డ్ స్మిత్, జేన్ ఆస్టిన్, ఆల్బర్ట్ కాముస్, అలిస్టర్ మెర్లిన్ దాకా విస్తృతంగా అధ్యయనం చేసిన ఐరావతి సాహిత్య రచన ‘యుగాంత’ సాహిత్యఅకాడమీ బహుమతిని పొందడమే కాకుండా, పలు భాషల్లోకి అనువదించబడి మరింత గౌరవాన్ని లభింపజేసింది. విభిన్నంగా, విలక్షణంగా, తెగువగా బతికిన ఐరావతి కార్వే 65 ఏళ్ల వయసులో 1970 ఆగస్టు 11న కనుమూశారు.
ఆమె పరిశోధనా విధానం, ఆలోచనా ధోరణి నచ్చని కొందరు విమర్శలు కూడా బాగానే చేశారు. కానీ ఆమె జీవితం స్ఫూర్తివంతమైన సంచలనాత్మక వెలుగు దీవిటి. ఆమె మనవరాలు, ప్రఖ్యాత రచయిత్రి ఊర్మిళా దేశ్పాండే, థియాగో పింటో బర్బోజాతో కలసి 2025లో రాసిన ‘ఐరు: ది రిమార్కబుల్ లైఫ్ ఆఫ్ ఐరావతి కార్వే’ ఎంతోమందిని ఆకర్షించి కొత్త వెలుగులను పంచింది.
(ప్రముఖ పాపులర్ సైన్స్ రచయిత, ఆకాశవాణి పూర్వ సంచాలకులు)

Share
This entry was posted in సైన్స్ ఆకాశంలో సగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.