హిజ్రా సంస్కృతిలో నిర్వాణం మరియు జల్సా – అర్చనరావు మానుకొండ

పరిచయం: ట్రాన్స్ సముదాయంలో హిజ్రాలకు లైంగికత కంటే ఎక్కువగా వారి సంస్కృతి ఆధారంగానే గుర్తింపు ఉంటుంది. వారు మధ్యయుగ చారిత్రక కాలం నుంచే భారతదేశంలో ఉన్నారని అనేక చరిత్ర పుస్తకాలు పేర్కొంటున్నాయి. అలాగే పలువురు చారిత్రక పరిశోధకులు కూడా వీరిపై విస్తృతంగా పరిశోధనలు చేసి పుస్తకాలు రచించారు.

హిజ్రాలు ప్రత్యేకంగా మొఘల్ పరిపాలన కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందారు. వారి ప్రధాన విధులు ఏమిటంటే, రాణులు నివసించే ప్రదేశాలకు కాపలాగా ఉండటం. అదే విధంగా రాజు యొక్క అంతఃపురంలోని స్త్రీలకు కూడా భద్రత కల్పించేవారు. ఈ సేవలకు ప్రతిఫలంగా వారికి అధిక మొత్తంలో బహుమతులు, వేతనాలు అందించేవారు. అదే కాకుండా, రాజుగారికి అవసరమైన విషయాలు, ఆయన ఎవరిని కలవాలి, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి వంటి అంశాలను అర్థం చేసుకుని నిర్వహించే ప్రక్రియలో కూడా హిజ్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేవారు.
అయితే, హిజ్రాల సంస్కృతి మరియు వారి సంప్రదాయ కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
హిజ్రా కుటుంబ వ్యవస్థ: గురు-చేలా సంప్రదాయం
ట్రాన్స్ సముదాయంలో హిజ్రాలు సాధారణంగా తమ బయాలాజికల్ కుటుంబాలను విడిచిపెట్టి, ఒక హిజ్రా గురువు వద్ద చేరడం జరుగుతుంది. ఆ తరువాత హిజ్రాగా సమాజంలో తన జీవితాన్ని కొనసాగించడానికి సంబంధాలు, కుటుంబం వంటి మద్దతు వ్యవస్థలు ఎంతో అవసరమవుతాయి.
అందువల్ల ఎవరు మంచి గురువు, ఆ గురువుకు సమాజంలో ఎంత పేరు ఉంది, శిష్యులను ఎంత బాగా చూసుకుంటారు వంటి విషయాలను వారు ముందుగానే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే కొంతమంది గురువులు కఠినంగా ఉండగా, మరికొందరు ఉదారంగా ఉంటారు.
అయితే ఏ గురువు వద్ద చేరినా, “తానే తల్లి, తానే తండ్రి” అనే భావనతో జీవితాంతం ఆ గురువుతో అనుబంధాన్ని కొనసాగిస్తారు. గురువు వద్ద చేరే ముందు, ఆ గురువు శిష్యులు బస్తీలకు వెళ్తారా, భిక్షాటన చేస్తారా, బాదాయికి వెళ్తారా వంటి విషయాలను కూడా తెలుసుకుంటారు. గురువుకు ఉన్న పేరు, సమాజంలో ఉన్న గౌరవం, ఆర్థిక స్థితి, అలాగే తమ వ్యక్తిగత ఇష్టాలను బట్టి గురువును ఎంచుకుంటారు.
గురువు వద్ద చేరే ప్రక్రియను “రీత” అనే ఆచారంతో నిర్వహిస్తారు. ఈ రీత్ ద్వారా “నేను ఈ గురువు కింద శిష్యురాలిగా (చేలా) చేరుతున్నాను” అని అధికారికంగా ప్రకటించి, ఆ గురువు కుటుంబంలో సభ్యురాలవుతారు. ఆ తరువాత ఇంటి పనులు, గురువుకు అవసరమైన సేవలు చేస్తూ, అదే గురువు కింద ఉన్న ఇతర చేలాలతో కలిసి జీవనం సాగిస్తారు.
బయాలాజికల్ కుటుంబం నుండి దూరమైనప్పటికీ, ఈ వ్యవస్థ వారికి ఒక ప్రత్యామ్నాయ కుటుంబాన్ని, భద్రతను అందిస్తుంది. ఈ కుటుంబ వ్యవస్థలో గురువు, గురుబాయ్‌లు (తోటి శిష్యులు), కూతుళ్లు, తల్లులు, పిన్నులు, అత్తలు వంటి కుటుంబ సంబంధాలకు సమానమైన పాత్రలు ఉంటాయి. ఈ కుటుంబాలను “ఖాందాన” లేదా “పరివార” అని కూడా పిలుస్తారు.
అలాగే, అనేక మంది గురువులు కలిసి ఒక “ఘరానా”లో భాగంగా ఉంటారు. సమాజంలో ఒంటరిగా జీవించడం కష్టతరంగా, భద్రతలేనిదిగా ఉండటంతో, ఒక గురువు వద్ద చేరడం ద్వారా భద్రత, మద్దతు, కుటుంబ అనుబంధం లభిస్తాయని హిజ్రా సముదాయంలో బలమైన నమ్మకం ఉంది.
నిర్వాణం అంటే ఏమిటి?
హిజ్రాలలో ప్రధానంగా రెండు రకాలు ఉంటారు. ఒకటి నిర్వాణ హిజ్రాలు, రెండవది అక్వా హిజ్రాలు. ముందుగా నిర్వాణం అంటే ఏమిటో తెలుసుకుందాం. హిజ్రా సంస్కృతిలో, ముఖ్యంగా లైంగిక కోరికలకు దూరంగా ఉండటం ద్వారా మోక్షం లేదా నిర్వాణం లభిస్తుందని ఒక విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో, ఒక వ్యక్తి హిజ్రాగా మారినప్పుడు తన జననాంగాలను తొలగించుకుని, ఇకపై లైంగిక కోరికల నుండి విముక్తి పొందేందుకు చేపట్టే ప్రక్రియను నిర్వాణం అని పిలుస్తారు.
ఇది చాలా కఠినమైన మరియు శారీరకంగా, మానసికంగా సవాళ్లతో కూడిన ప్రక్రియగా భావించబడుతుంది. సాధారణంగా శిష్యులు కొంతకాలం పాటు డబ్బు కూడబెట్టి తమ గురువుకు అందజేస్తారు. అనంతరం, “నేను నిర్వాణం చేయించుకోవాలనుకుంటున్నాను, ముక్తి పొందాలనుకుంటున్నాను, ఒక సంపూర్ణ హిజ్రాగా జీవించాలనుకుంటున్నాను” అని గురువుకు తెలియజేసి నిర్వాణ ప్రక్రియకు సిద్ధమవుతారు.
నిర్వాణం పట్ల సామాజిక భావనలు: క్యాస్ట్రేషన్ లేదా నిర్వాణం చేయించుకుంటే ఒక ఉన్నత స్థాయి హిజ్రాగా గుర్తింపు లభిస్తుందనే భావన కొందరు హిజ్రా సముదాయాల్లో కనిపిస్తుంది. అందువల్ల చాలామంది నిర్వాణం చేయించుకుని, కాలక్రమేణా గురువులుగా మారి తమ కింద చేలాలను చేర్చుకుంటూ ఉంటారు.
అదే సమయంలో, నిర్వాణం చేయించుకోని హిజ్రాలను కొన్నిసార్లు తక్కువగా చూడడం కూడా జరుగుతుంది. “నువ్వు పూర్తి హిజ్రావు కాదు” అనే వ్యాఖ్యలు వినిపించే సందర్భాలు కూడా ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో, కుటుంబ సభ్యులు “పెళ్లి చేసుకుంటే అన్నీ సరిగా అవుతాయి” అని ఒత్తిడి చేయడం వల్ల, తమ లింగ గుర్తింపును అంగీకరించని కుటుంబ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొందరు నిర్వాణం చేయించుకోవాలని నిర్ణయించుకున్న ఉదాహరణలు ఉన్నాయి. మరికొందరు సమాజంలో గౌరవం, గుర్తింపు లేదా అధికారం కోసం కూడా నిర్వాణాన్ని ఎంచుకున్న సందర్భాలు కనిపిస్తాయి.
నిర్వాణ ప్రక్రియ మరియు నమ్మకాలు: గతంలో ఈ ప్రక్రియ చాలా వరకు రహస్యంగా నిర్వహించబడేది. హైదరాబాదు, విజయవాడ, ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొందరు వ్యక్తులు గోప్యంగా జననాంగాల తొలగింపు (క్యాస్ట్రేషన్) ప్రక్రియను నిర్వహించేవారు.
సాంప్రదాయంగా నిర్వాణం చేసే విధానాల గురించి హిజ్రా సముదాయాల్లో అనేక కథనాలు, నమ్మకాలు ఉన్నాయి. గతంలో గురువుకు తమ కోరికను తెలియజేసిన తర్వాత, రహస్యంగా ఈ ప్రక్రియ నిర్వహించే వ్యక్తులను సంప్రదించేవారని చెబుతారు. సంప్రదాయ పద్ధతుల్లో జననాంగాలను ఒకే దెబ్బతో తొలగించాలి అనే నమ్మకం ఉండేది. రక్తస్రావం ద్వారా శరీరం శుద్ధి చెందుతుందని, ఆ తరువాతే తాము “పవిత్రులు” లేదా “సంపూర్ణ హిజ్రాలు” అవుతామని నమ్ముతారు.
నిర్వాణం తరువాత నలభై రోజుల సంరక్షణ: అయితే క్యాస్ట్రేషన్ జరిగిన తర్వాత వెంటనే ఆ వ్యక్తిని గురువు వద్దకు తీసుకువెళ్తారు. అక్కడ గురువు పర్యవేక్షణలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా మనుషులు ఉంటారు. వారు రోజూ స్నానం చేయించడం, శరీరాన్ని శుభ్రపరచడం, శస్త్రచికిత్స జరిగిన భాగాన్ని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు.
హిజ్రా సంప్రదాయ నమ్మకాల ప్రకారం, రక్తస్రావం ద్వారా పురుషుడిలో ఉన్న పురుష లక్షణాలు పూర్తిగా తొలగిపోతాయని ఒక విశ్వాసం ఉంది. అనంతరం ఆ వ్యక్తిని నలభై రోజుల పాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచుతారు. ఈ నలభై రోజుల కాలంలో ప్రతిరోజూ స్నానం చేయించడం, డ్రెస్సింగ్ చేయించడం, శుభ్రత పాటించడం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ కాలం ఎంతో బాధాకరమైన అనుభవంగా ఉంటుంది. అయినప్పటికీ, తాము ఇప్పుడు ఒక నిర్వాణ హిజ్రాగా సమాజంలో గుర్తింపు పొందుతున్నామనే భావన వారికి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది.
పదకొండవ రోజు, ఇరవై ఒకటవ రోజు, ముప్పై ఒకటవ రోజు మరియు నలభైవ రోజు స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ సందర్భాల్లో నలుగురు పెద్ద హిజ్రాలు ముత్తైదువుల మాదిరిగా వచ్చి నిర్వాణం పొందిన హిజ్రాకు స్నానం చేయించి, అక్షింతలు వేసి, ఆశీర్వాదాలు అందిస్తూ సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
నలభై రోజుల తరువాత: జల్సా: నలభై రోజుల కాలం పూర్తైన తరువాత, తెల్లవారు జామున నిర్వాణం పొందిన హిజ్రాను నది దగ్గరికి లేదా సముద్ర తీరానికి లేదా ఏదైనా జలాశయం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమెకు పచ్చటి గాజులు, పచ్చటి చీర కట్టించి, తలపై ఒక నీటి బిందె మరియు ఒక పాల బిందె ఉంచుతారు. ఈ ఆచారం ద్వారా ఆమె గతంలోని బాధలు, కష్టాలు, అలాగే తనలో మిగిలి ఉన్న పురుషత్వానికి సంబంధించిన గుర్తులు అన్నీ తొలగిపోయి, ఇకపై తాను సంపూర్ణ స్త్రీగా జీవితం ప్రారంభిస్తున్నాననే భావనను వ్యక్తపరుస్తారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల నుండి హిజ్రా గురువులను ఆహ్వానించి ఒక పెద్ద వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకను జల్సా అని పిలుస్తారు. ఈ సందర్భంగా నిర్వాణం పొందిన హిజ్రాకు, అలాగే ఆమె గురువుకు గౌరవ సూచకంగా కానుకలు అందజేస్తారు. ఈ సంప్రదాయాన్ని పాంపడ్తీ అని పిలుస్తారు.
ముర్గీ మాత మరియు ఆధ్యాత్మిక ఆచారాలు: కొన్ని హిజ్రా కుటుంబాలు హిందూ సంప్రదాయాలను అనుసరిస్తూ ముర్గీ మాత అనే దేవతను పూజిస్తారు. ఈ దేవతను సాధారణంగా కోడిపుంజుపై కూర్చున్న రూపంలో చిత్రిస్తారు. “అమ్మవారి ఆశీర్వాదంతో జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి” అని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లిస్తారు. అదే సమయంలో, ఇస్లామిక్ సంప్రదాయాలను అనుసరించే హిజ్రా కుటుంబాలు కూడా స్నాన కార్యక్రమాలు, పథ్యం, జల్సా వంటి ఆచారాలను నిర్వహిస్తారు. అయితే వారి సంప్రదాయాలలో హిందూ పద్ధతిలో ఉండే దేవతారాధనలు లేదా పూజా కార్యక్రమాలు సాధారణంగా ఉండవు.
నిర్వాణం: ఒక పునర్జన్మ: నిర్వాణం అనేది ఒక హిజ్రా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతుంది. నిర్వాణం జరిగిన తరువాత తాను ఒక సంపూర్ణ మహిళగా జీవిస్తున్నాననే భావన బలపడుతుంది.
చాలా మంది హిజ్రాలు నిర్వాణం అనంతరం, అది ఎంత బాధాకరమైన అనుభవమైనప్పటికీ, తమ జీవితంలో ఒక ముఖ్యమైన కోరిక నెరవేరిందనే సంతృప్తిని వ్యక్తం చేస్తారు. “చిన్నప్పటి నుంచే నేను ఒక ఆడపిల్లనని భావించాను; ఇప్పుడు నేను కోరుకున్న గుర్తింపును పొందాను” అనే ఆనందాన్ని వారు అనుభవిస్తారు. అందువల్లే హిజ్రా సంస్కృతిలో నిర్వాణాన్ని కేవలం ఒక శారీరక ప్రక్రియగా కాకుండా, ఒక సామాజిక, సాంస్కృతిక మరియు వ్యక్తిగత పునర్జన్మగా భావిస్తారు. హిజ్రాల జీవితంలో ఇది అత్యంత ప్రాధాన్యమైన, గౌరవనీయమైన ఘట్టంగా పరిగణించబడుతుంది.

Share
This entry was posted in ప్రతిబింబం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.