ఎస్సైఆర్ పేరుతో పౌరసత్వ జాబితా – ఎ. సునీత

2025 జూన్‌లో సరిగ్గా బీహార్ ఎన్నికల ముందు జాతీయ ఎన్నికల సంఘం ఎస్సైఆర్ మొదలు పెట్టినప్పుడు ప్రతి ఎన్నికల ముందూ సాధారణంగా జరిగే ఓటర్ల జాబితా ప్రక్షాళన అని అందరూ అనుకున్నారు. అయితే ఇది స్వభావరీత్యా చాలా భిన్నమైన కార్యక్రమం అని త్వరలోనే స్పష్టమయింది.

అందరినీ ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతని ఏడు దశాబ్దాలు నెరవేర్చిన ఎన్నికల సంఘం ఇప్పుడు తమని తాము ఓటర్లుగా నిరూపించుకుని, రిజిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యతని వోటర్ల పైకి నెట్టింది. ప్రాతినిధ్య చట్టాల్లో తనకి లేని అధికారాన్ని స్వంతం చేసుకుని ఓటర్లు సమర్పించిన సాక్ష్యాధారాలని – భారత ప్రభుత్వం పౌరులకు ఇచ్చే వివిధ వ్యక్తిగత గుర్తింపు పత్రాలని – పరిశీలించి వారిని జాబితాలో చేర్చుకోవటమే కాక, ఈ జాబితా తయారీలో విదేశీయులని గుర్తించి, తీసేస్తామని చెప్పి, పౌరసత్వ పరీక్షలలో పాల్గొనే అధికారం కూడా ఉందని దబాయిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమాన్ని గమనించిన వాళ్ళు, 2019లో జాతీయ పౌరసత్వ జాబితాని ప్రకటించినప్పుడు వచ్చిన ప్రజల ప్రతిఘటనని చవిచూసిన ప్రభుత్వం, ఈసారి దొడ్డి దారిన ఈ పని చేస్తోందని విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు జాబితాలో పేరుని నమోదు చేసుకోవటం ఓటర్ల బాధ్యత
ఇప్పటి ప్రక్రియ ప్రకారం 2002 ఓటర్ల సమగ్ర జాబితా (అది ప్రత్యేకంగా చేశామని ఎన్నికల సంఘం అంటోంది)లో పేర్లు లేని వారందరూ తమ పేర్లని అప్పుడున్న జాబితాతో – తమ తల్లి తండ్రుల పేర్లతో – ముడి పెట్టుకోవాలి. లేని పక్షంలో తాము ఆ వ్యక్తులమేనని చెప్పుకోవటానికి ఒక 11 పత్రాల ద్వారా నిరూపించుకోవాలి. ఈ పాత్రల్లో 10వ తరగతి సర్టిఫికెట్, ఆ ప్రాంత నివాసి అని అధికారులు ఇచ్చే పత్రం, పాస్పోర్ట్, కుల ధ్రువీకరణ పత్రం వంటివి వున్నాయి. ఇవన్నీ ఒక స్థిరమైన ఇల్లు, కుటుంబం, చదువు, ప్రాంతం ఉన్న వారికి అనుగుణంగా తయారు చేసిన నియమాలు. భారతదేశంలో 10 కోట్ల మంది తాత్కాలిక అంతర్గత వలసదారులు ఉన్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో పెళ్లి తర్వాత పుట్టిన వూరు, ఇల్లు విడిచి వేరే ఇళ్లకు, ఊళ్లకు వెళ్లే వివాహిత స్త్రీలు వుంటారు. సంచార జాతుల వాళ్ళున్నారు. స్కూలు కెళ్లని వాళ్ళు, స్థిర ఆదాయం లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళతో పాటు వుద్యోగం కోసం ఇతర ప్రాంతాల్లో వుండే వాళ్ళు అందరూ చాలా పెద్ద సంఖ్యలో వుండే దేశం ఇది. అస్థిర జీవితం వుండే వీరందరినీ స్థిరత్వంపై ఆధారపడిన అప్లికేషన్ ఫారంలో ఇరకమని అడిగే పరీక్షే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
ప్రతి రాష్ట్రంలో ఓటు వున్న వారందరినీ 2002 జాబితాతో సరి చూసి ఎన్నికల అధికారులు ‘ప్రి మ్యాపింగ’ చేస్తారు. ఇప్పటికే ఓటర్ల లిస్టులో వున్న వారి కోసం పత్రాలు వాళ్ళే ప్రింటు చేసి బ్లాక్ లెవెల్ ఆఫీసర్ (బి ఎల్ ఓ) ద్వారా వోటర్లకి ఇంట్లో అందచెయ్యాలి. లేని పక్షంలో ఇల్లు మారారు, చనిపోయారు, ఇక్కడ లేరు అని రాయాలి. ఓటర్లు వాటిని నింపి, మారిన తమ వివరాలు, వాటికవసరమయిన పత్రాలతో సహా ఆ పత్రాలని మూడు వారాల్లోగా తిరిగి అందచెయ్యాలి. 1987-2004 మధ్యలో పుట్టిన వారు తమ తల్లి తండ్రుల్లో ఒకరి బర్త్ సర్టిఫికెట్‌ని ఇవ్వాలి. 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఇద్దరి బర్త్ సర్టిఫికెట్ ని ఇవ్వాలి. బి ఎల్ ఓ లు ఎన్నికల సంఘం సైట్‌లో వాటిని అప్‌లోడ్ చెయ్యాలి. అప్పుడే మన వివరాలని సమర్పించినట్లు అర్ధం. ఈ ప్రక్రియలో ఏది తప్పినా మన వివరాలు అందించనట్లే. తెలంగాణతో సహా, చాల రాష్ట్రాల్లో, ఎన్నికల సంఘం ఈ ప్రక్రియ కోసం చాలా తక్కువ సమయం ఇస్తోంది. మన రాష్ట్రంలో ఫారం ఇవ్వటం నుండి మూడు వారాల పాటే నింపి ఇవ్వటం కోసం సమయం ఇచ్చింది. ఆ తర్వాత డ్రాఫ్ట్ రోల్ వస్తుంది. తర్వాత దానిలో పేర్లు లేని వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి. వాటిని పరీక్షించిన తర్వాత, తుది డ్రాఫ్ట్ రోల్ వచ్చే వరకూ మొత్తం మూడు నెలల సమయమే ఉంటుంది.
ఆస్తి, సంపద, చదువు లేని అణగారిన, పేద వర్గాల వారిలో చాలా మందికి తప్పనిసరిగా వుండే ఆధార్ ని దీనిలో చేర్చలేదు. ఈ 11 పత్రాలలో ఎక్కువ భాగం కొద్దిమంది దగ్గరే ఉంటాయని పౌర హక్కుల సంఘాలన్నీ వున్నత న్యాయస్థానంలో నెలల పాటు కొట్లాడితే, ఆధార్ కూడా గుర్తింపు పరంగా వాడొచ్చని ఈ ప్రక్రియ చివర్లో న్యాయమూర్తులు సుతారంగా చెప్పారు. ఎన్నికల సంఘం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని, బలవంతాన్ని, ప్రజలని పెట్టె తీవ్ర ఇబ్బందులని ఎన్నిసార్లు ఎత్తి చూపినా ఆధార్ కార్డు కేసు విషయంలో అవలంబించిన వ్యూహాన్నే వున్నత న్యాయస్థానం ఇప్పుడు కూడా అవలంబిస్తోంది. తయారుచేసినప్పుడు ఇదొక యూనిక్ నంబర్ అని అందర్నీ, ఊదరకొట్టి దానితో ఇతర అన్ని సేవల కార్డుని అందరూ ముడి పెట్టుకునేలా ప్రభుత్వం బలవంతం చేస్తే పదేళ్లు చూస్తూ ఊరుకుని అందరూ వాడేటట్లు చేసిన తర్వాత, ‘అశ్వర్దమా కుంజరః” అన్నట్లు ‘ఆధార్ నిర్బధం కాదు’ అని చెప్పిన వున్నత న్యాయస్థానం ఇది. ఆధార్ కూడా గుర్తింపు కోసం ఇవ్వొచ్చు అని వీళ్ళు వుద్ఘాటించేటప్పటికి బీహార్ ఓటర్లలో ఓటు హక్కును కోల్పోయిన లక్షలాది మందిలో ప్రధానంగా అణగారిన కులాలు, వర్గాల వారే ఎక్కువ.
ఎన్నికల సంఘం బ్లాక్ లెవెల్ ఆఫిసర్లుగా సమయం, జ్ఞానం, ఇంగ్లీషు పరిజ్ఞానం, ఇంటర్నెట్ వసతి అన్నీ పరిమితంగా వుండే ఆషా వర్కర్లని, క్లాస్ 4 ఉద్యోగుల్ని, అంగన్వాడీ టీచర్లని నియమిస్తోంది. పైగా వారి రోజువారీ పనితో పాటు ఈ పనిని కూడా చెయ్యక తప్పని పరిస్థితి. ఏ రోజు ఫార్మ్స్ ఆ రోజు అప్‌లోడ్ చెయ్యకపోతే శిక్షలు వేస్తామని బెదిరింపులు. ఈ బెదిరింపుల క్రింద పని చెయ్యలేక అనేక మంది అనేక రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉన్నత న్యాయ స్థానం ఇక్కడా కలిగించుకోలేదు. ఎన్నో రకాలుగా ఓటర్లు జాబితా నుండి తప్పి పోయే అవకాశం వుంది. ముందుగా, చాలా మంది బి ఎల్ ఓ లకి ఇంగ్లీషులో వున్న లిస్టుల నుండి వోటర్లని వెతికి పట్టుకోవటం పెద్ద సమస్య. వోటర్లకి విషయం తెలియక పోవటంతో, ప్రతి సారీ వచ్చినట్లే ఓటర్ స్లిప్ వస్తుందిలే, వోటర్లని ఎవరూ వదులుకోరులే అని సీరియస్‌గా తీసుకోక ఈ ఫారంలని పట్టించుకోవట్లేదు. అద్దె ఇంట్లో వున్న వారికి అడ్రెస్స్ ప్రూఫ్ కావాలంటే సమస్య. ఇతర గుర్తింపు పత్రాలలో పేర్లలో తప్పులు, తల్లి తండ్రల పేర్లలో తప్పులు సర్వ సాధారణం. ఇవన్నీ కాకుండా వోటర్లని కావాలని తీసేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నికల సంఘం దగ్గర ఉండనే వుంది.
స్త్రీలకి ఇంకా ముప్పు
స్త్రీలకి ప్రత్యేకంగా ఈ ఎస్సైఆర్ పెద్ద ప్రమాదంగా పరిణమించింది. దేశంలో అనేక చోట్ల పెళ్ళవగానే ఆడవాళ్ళ పేరు మార్చేయ్యటం అలవాటు. అంతకి ముందు స్కూలు కెళ్లిన వాళ్లకి కూడా, ఆ పేరుకి, పెళ్లయిన తర్వాత పేరుకి తేడా ఉంటుంది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణ పెళ్లి వయసు 16 లేక 17 గానే వుంది. వాళ్ళ తల్లి తండ్రులకి కూడా అంత కన్నా చిన్న వయసులో పెళ్ళయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు కూడా 2002 జాబితాలో వుండవు. పెళ్లయిన తర్వాత ఆడవాళ్లు వలస వస్తారనే సామాజిక, సాంస్కృతిక జ్ఞానం ఇప్పటికీ అధికారిక పత్రాల్లో ప్రతిబింబించదు. అందువల్ల వాటిలో ఎక్కడా కూడా ‘కోడలు’ అనే క్యాటగిరి లేదు. దాంతో అనేక మంది పుట్టినిళ్ల కెళ్ళి కావాల్సిన పత్రాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది.
అత్తింటిలోంచి వెళ్లగొట్ట బడ్డ ఆడవాళ్ళూ, పుట్టిన ఇంట్లోంచి వివిధ కారణాలతో వెళ్ళిపోయిన వాళ్ళ ఊసు వీటిల్లో లేదు. ఇల్లొదిలి జీవించాల్సిన ట్రాన్స్ మహిళల సంగతి మరి? వలస వెళ్లిన స్త్రీలకూ చోటు దొరకలేదు. వరదలు, విస్థాపన, ఇంటి హింస తో పాటు పత్రాలు లేని వాళ్ళు అనేక మందయితే, మన బ్యూరోక్రసీ అసమర్ధత వల్ల అధికారిక గుర్తింపు పత్రాల్లో తప్పులు, తడకలతో తిప్పలు పడే వాళ్ళు కోకొల్లలు. వీటన్నింటి మధ్య బీహార్‌లో అణగారిన కులాల, వర్గాల, మతాల స్త్రీలు తమ ఓటు నమోదు కోసం తిరగలేక, దాని కోసం రోజు కూలీ పోగొట్టుకుని, గుర్తింపు పత్రాల కోసం డబ్బు పెట్టుకోలేక ఓటు హక్కు పోగొట్టుకున్నారు.
ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే ఈ మధ్య ఎన్నికల్లో మగవాళ్ల కన్నా ఎక్కువగా ఆడవాళ్లు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు. అయితే, ఆ స్త్రీల సంఖ్య ఈ ఎస్సైయార్ తర్వాత గణనీయంగా తగ్గింది. బీహార్‌లో 16 లక్షల మంది ఆడవాళ్లు ఓటర్ల జాబితా నుండి తొలగించబడ్డారు. రెండవ దఫా తర్వాత ఓటర్ల జాబితాలో రాజస్థాన్‌లో 1000 మందికి 920 వున్న స్త్రీల సంఖ్య 911 కి తగ్గితే, గుజరాత్ లో 945 నుండి 930 కి, మధ్య ప్రదేశ్ లో 945 నుండి 934 కి, పశ్చిమ బెంగాల్ లో 966 నుండి 956 కి తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో జాబితాలో అప్పటికి కొంచెమే వుండే ట్రాన్స్ మహిళల సంఖ్య మరింతగా తగ్గింది. వలసవాద పోరాటం లో సామూహికంగా పాల్గొని, అనేక దశాబ్దాల పాటు సంఘర్షించి వినియోగం లోకి తెచ్చుకున్న ఓటు హక్కుని ఈ ఎస్సైఆర్ ద్వారా బిజెపి పధ్ధతి ప్రకారం ధ్వంసం చేస్తోంది.
పాలక పార్టీ అమ్ముల పొదిలో ఎస్సైఆర్ కొత్త ఆయుధం
2014 తర్వాత న్నికల సంఘం మొన్నటి వరకూ నరేంద్రమోడీ అన్ని చోట్లా తిరిగి ప్రచారం చెయ్యగలిగేటట్లు ఎన్నికల షెడ్యూల్‌ని సాగదీసి పెట్టేది. 2019 నుండి ఇతర పార్టీలని చీల్చి, అనేక మందిని నయానా, భయానా కలుపుకుని, మీడియాని కొని, ఎన్నికల బాండ్లని ప్రవేశపెట్టి, అత్యంత ఎక్కువ డబ్బున్న పార్టీగా మారి, ఈవీఎంలని, విచారణ సంస్థల్ని, కోర్టులని వాడుకుని బిజెపి అతి పెద్ద పార్టీగా పెరుగుతూ వచ్చింది. అంతా బాగుంది, మాకు తిరుగు లేదు, ఇక పైన మేమే గెలుస్తాం అనే సమయంలో అనుకోకుండా 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. దానితో ఓటర్లు తమని ఎన్నుకోకుండా తమ వోటర్లని తామే ఎంచుకోవటానికి ఈ ఎస్సైఆర్ అనే కొత్త ఆయుధాన్ని తయారుచేసింది. ఎక్కడ పాలక పార్టీ గెలవాలనుకుంటోందో, అక్కడ ప్రతిపక్ష పార్టీల వోటర్లని ముఖ్యంగా ముస్లింల వోట్లని తీసెయ్యటమో, పనికి రాకుండానో చెయ్యొచ్చు. ఒక దెబ్బకి రెండు పిట్టలన్న మాట.
దీని శక్తి ప్రధానంగా దాని నిరంకుశత్వం. బీహార్‌లో చేసినట్లు గుజరాత్‌లో చెయ్యలేదు. అక్కడ చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లో, రాజస్థాన్‌లో చెయ్యలేదు. బెంగాల్‌లో అన్నింటి కన్నా భిన్నంగా, చాలా కసితో వోటర్లని తీసేసారు. బీహార్‌లో మూడు నెలల్లో అన్నీ ముగించిన ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్‌లో అనేక రాయితీలు ఇచ్చింది. బెంగాల్‌లో పేర్ల తప్పులన్నింటినీ ‘లాజికల్ డిస్క్రి పెన్సీ’ కింద పారదర్శకత లేని అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా 30 లక్షల మందిని వేరు చేస్తే, అటువంటి తప్పులు, తేడాలనే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పక్కకి పెట్టి అదే శాతం ఆయా వోటర్లని జాబితాలోకి చేర్చింది. రెండిట్లో ముస్లిం వోటర్లని మాత్రం తీసెయ్యటం మర్చి పోలేదు.
అవసరాన్ని బట్టి నిరంకుశత్వ పాలుని పెంచుకోవటమో, తగ్గించుకోవటమో చేసుకోగలిగే అవకాశం దీనిలో వుంది. దీన్ని పూర్తిగా సమర్థిస్తున్న వున్నత న్యాయస్థానం ఈ నిరంకుశత్వాన్నీ పెంచి పోషిస్తోంది. ఎన్ని విధానపరమైన లోపాలు, ఎన్ని రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలని ఎత్తి చూపినా, పర్లేదు, కొంచెం రోడ్డుకు పోవాలి అంటోంది. సాధ్యం కాని టైం టేబుల్‌తో, దశాబ్దాల అధికార అసమర్ధత వల్ల తప్పులు తడకలతో వుండే డాక్యుమెంట్లని పట్టుకుని నెట్టుకుంటూ వస్తున్న ప్రజలపై బాధ్యతని నెట్టి వారి పాతివ్రత్యాన్ని నిర్ణయించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని చెపుతున్న నిరంకుశ ఎన్నికల సంఘ ప్రవర్తనని సమర్ధిస్తోంది.
ఇది ఓటర్ల జాబితా కాదు, పౌరసత్వ పరీక్ష
ఇది వరకు కూడా మన దేశంలో అనేక ఎన్నికల్లో రిగ్గింగ్, భయ పెట్టటం ద్వారా వోటర్లని ఎన్నికల్లో పాల్గొకుండా చెయ్యటం జరిగింది. కానీ ఎన్నికల సంఘం తమ రాజ్యాంగ బాధ్యతని నిర్వహించి ఎవరినీ ఓటర్ల జాబితా నుండి తొలగించలేదు. ఎన్నికల సంఘం ద్వారానే ఓటు హక్కుని తీయించేయ్యటం అమెరికన్ నమూనా. అక్కడి రిపబ్లికన్ పార్టీ వోటర్లని తొలగించే విధానాన్ని పధ్ధతి ప్రకారం చేస్తూ వచ్చింది. ప్రతి సారీ కొత్త కొత్త నియమాలు పెట్టి వోటర్ల నమోదుని కష్ట పూరితం చేస్తూ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అనేక మంది నల్ల జాతి వోటర్లని ఓటు హక్కు వినియోగించకుండా చేస్తూ వచ్చింది. మన దేశం ఇంకొంచెం ముందుకెళ్లి, ఓటర్ల జాబితాని పౌరసత్వ పరీక్షగా మార్చింది. ముందు ఈ ప్రయోగం అస్సాంలో జాతీయ పౌరసత్వ జాబితా తయారీతో మొదలు పెట్టింది. అలా చేసిన జాబితాలో ముస్లింల కంటే, హిందువులే పౌరసత్వం లేని వారని తెలియటంతో వదిలేసింది. 2019లో పౌరసత్వ హక్కుల చట్టాన్ని మార్చి జాతీయ పౌరసత్వ జాబితా తయారీకి దిగినప్పుడు, దేశంలో ముస్లిం మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో కొంత వెనక్కి తగ్గింది.
ఎస్సైఆర్‌ని చెయ్యటానికి కారణం దేశంలో ‘విదేశీయులని’ ఏరి వెయ్యటం అని, విదేశీయులు మన దేశంలో ఎన్నికలని నిర్దేశించే స్థాయిలో వున్నారని, వారిని తీసేస్తేనే మన ప్రజాస్వామ్యం బాగు పడుతుందని కేంద్ర అంతర్గత శాఖ చెప్తూ వస్తోంది. ఇది కేవలం ఓటర్ల జాబితా కాదని ఈ జనవరిలో ఎన్నికల సంఘం వున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. వివిధ కారణాల వల్ల తీసేసిన పేర్లని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామని, వాళ్ళు పౌరసత్వ చట్టం క్రింద పరీక్ష చేస్తారని, అప్పటి వరకూ (అస్సాం లో పంపినట్లు) ఆయా వ్యక్తులని క్యాంపులకి పంపించమని, అలాగే దేశం నుండి కూడా (భారతీయులు కాకుంటే వాళ్ళు బంగ్లాదేశీయులని, రోహింగ్యాలని నిర్ధారించి వారిని అక్కడ బలవంతంగా పంపించే కార్యక్రమం) బహిష్కరించమనీ వున్నత న్యాయ స్థానానికి చెప్పింది. https://www.scobserver.in/reports/revision-of-electoral-rolls-in-bihar-day-22-exclusion-not-deportation-says-eci/.. ఎన్నికల సంఘానికి పౌరసత్వ పరీక్ష చేసే అధికారం లేదని పౌరసంఘాలు వాదించినప్పుడు ఓటు వేసే హక్కుకి, పౌరసత్వాన్ని ముడి ఉందని, దానిలో ఈ ఓటర్ల జాబితా పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసింది.
బీహార్‌లో ఎన్నికలు అవ్వగానే గెలిచిన ఎన్ డి ఏ ప్రభుత్వం ఎస్సైఆర్‌లో పేర్లు రాని 65 లక్షల మంది ప్రజలకి సంక్షేమ పథకాలివ్వమని స్పష్టం చేసింది. బెంగాల్‌లో కూడా అంతే. ప్రభుత్వమిచ్చే రేషన్, పెన్షన్, ఇతర సేవల మీద బ్రతికే పేద కుటుంబాలకి ఇది తీవ్రమైన దెబ్బ. అంతే కాదు, ఆధునిక ప్రపంచంలో పౌరులు కాని వాళ్ళు శవాలతో సమానం ఎందుకంటే మనిషిగా వచ్చే అన్ని హక్కులూ పౌరులకు మాత్రమే, పౌరులుగా ఉంటేనే లభిస్తాయి. పైగా బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో కోట్లాది మంది పౌరులు కాని వాళ్లున్నారని ఏ సాక్ష్యాధారాలు లేకుండా నమ్మిస్తూ వచ్చింది. జాబితాలో లేని ఓటర్లందరూ పౌరులు కారని బిజెపి ఓటు బ్యాంకు నమ్ముతోంది.
ముగింపు
టెలిగ్రాఫ్ పత్రిక మాజీ సంపాదకుడు ఆర్.రాజగోపాల్ పేరు ఓటర్ లిస్టులో లేదు కాబట్టి అయన పాస్పోర్ట్‌ని తిరిగి ఇష్యూ చెయ్యలేమని ఆయనకి పాస్పోర్ట్ ఆఫీసు చెప్పింది. ప్రముఖ గాంధీయన్ అయిన ఆయన తండ్రి పేరు ఎస్సైఆర్ లో లేదనే ‘కారణం’ మీద రాజగోపాల్ గారి పేరుని ఓటర్ లిస్టు నుండి తొలగించారు. పబ్లిక్‌లో నిరంతరం వుండిన ఆ తండ్రి, ప్రముఖ వార్తా పత్రికకి సంపాదకుడిగా పనిచేసిన ఈయనకె ఇలా జరిగితే సాధారణ పౌరుల సంగతేంటి అనేది పెద్ద ప్రశ్న!

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.