తన వృద్ధాప్యంలోనూ జీవనోపాధి కోసం పశువుల పాకలను శుభ్రం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా, పట్టి పట్టణానికి చెందిన ఒక దళిత మహిళ కథ.
తన తలపైకి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తోన్న తస్లా (ఇనుప బొచ్చె) కొద్ది క్షణాల పాటు కాస్త అస్థిరంగా ఉన్నట్టనిపించటంతో అమర్‌జీత్ కౌర్ మధ్యలోనే ఆగిపోతారు. ఆ తర్వాత, గేదెల కొట్టం నుండి సేకరించిన వ్యర్థాలను పారబోయడానికి ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ రూడీ (పేడ కుప్ప) వైపు నడవటం ప్రారంభిస్తారు. ఒకప్పుడు సుమారు 10-12 కిలోల బరువుతో నిండిన ఆ తస్లాను తలపై మోస్తూ ఆమె నడవగలిగేవారు; కానీ 72 ఏళ్ళ ఈ వయసులో అది కష్టమైన పనే. అయితే, ఈ రోజు ఆమె తలపై ఉన్న బొచ్చె బరువు కంటే, ఆమె గుండెల్లోని బాధే ఆమెను మరింత నెమ్మదిగా కదిలేలా చేస్తోంది.
ఆమె కుటుంబం గురించి నేను అడిగిన ఒక మామూలు ప్రశ్న, అమర్‌జీత్‌ను 24 ఏళ్ళ నాటి జ్ఞాపకాల సునామీలోకి లాగేసింది. “ఉన్‌హాఁ దసయా పట్టి మోడ్ తే తేరా ముండా మర్ గయా యాక్సిడెంట్ నాల్ (పట్టి దగ్గరున్న మలుపులో జరిగిన ప్రమాదంలో నీ కొడుకు చనిపోయాడని వాళ్ళొచ్చి చెప్పారు),” అని చెబుతూనే ఆమె మరికొంత పశువుల పేడను పోగుచేయడానికి కింద కూర్చున్నారు. నేల మీదకు ముంగాళ్ళ మీద కూర్చుంటున్నప్పుడు ఆమె మోకాళ్ళు కిరకిర చప్పుడు చేస్తున్నాయి, ఆమె చేతులు మాత్రం యాంత్రికంగా కదులుతున్నాయి. “అతను రిక్షా నడిపేవాడు. అప్పుడు వాడి వయసు కేవలం 18 ఏళ్ళు.” ఆ తర్వాత ఐదేళ్ళకు, 21 ఏళ్ళ వయసున్న తన రెండో కొడుకును కూడా ఆమె కోల్పోయారు.
36 ఏళ్ళ క్రితం, తాగుబోతు అయిన వారి తండ్రి చనిపోయినప్పుడు ఆ అబ్బాయిల వయసు కేవలం ఆరు, నాలుగు సంవత్సరాలు. అమర్‌జీత్‌కు పెళ్ళయినప్పటి నుండి ఆమె చేస్తున్న గోహా-కూడా (పశువుల పేడను ఎత్తిపోయటం) పని లేకపోయి ఉంటే, ఆమె తన కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను (ఇప్పుడు వివాహితులు) పెంచగలిగి ఉండే వారు కాదు. తిరిగి తలెత్తిన దుఃఖంతో పాటు, ఆమె ఒట్టి చేతులతోనే మరింత పేడను తీస్తూ, చేతికొచ్చినంత పేడను బొచ్చెలో పోస్తున్నారు. ఆ బొచ్చెను తల మీదకు ఎత్తుకుంటూ ఆమె దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న రూడీ వైపు తడబడుతూ అడుగులు వేస్తున్నారు. ఈ ఉదయం ఆమె శుభ్రం చేయటం మొదలుపెట్టినప్పటి నుండి ఇది 20వ సారి. ఆమె పంజాబ్‌లో షెడ్యూల్డ్ కులంగా జాబితా చేయబడిన మెహ్రే సిక్కు సమాజానికి చెందినవారు. భూమిలేని దళితురాలైన అమర్‌జీత్, జీవనోపాధి కోసం పట్టి పట్టణంలోని ఏడు ఇళ్ళలో గోహా-కూడా చేస్తారు.
“జదోఁ మ్ఱఁ డంగాఁ ద్రా గోహా చుక్కణ్ లయీ థల్లే బహిందీ హాఁ, తాఁ ఓ అక్సర్ మేరే శిర్ తే హీ మూత్ దిందియాఁ నే. మైఁ రోజ్ రోజ్ శిర్ నహీ ??ధో సక్దీ తే షాంపూ సాబణ్ దా ఖర్చా వీ నహీఁ చుక్క్ సక్దీ. ఎస్ లయీ ఆహ్ లిఫాఫా పా లైనీ హాఁ (నేను ఈ ప్లాస్టిక్ సంచిని నా తలకు చుట్టుకోవాలి, ఎందుకంటే నేను పేడ తీస్తున్నప్పుడు గేదెలు తరచుగా నా మీద మూత్రం పోస్తాయి. నేను ప్రతిరోజూ నా జుట్టు కడుక్కోలేను, సబ్బూ షాంపూల కోసం డబ్బు ఖర్చుపెట్టలేను).” అమర్‌జీత్ తన పిడికిలిలో పట్టుకున్న నల్లటి సంచిని నాకు చూపిస్తూ చెప్పారు. ఆమె అప్పుడే ఆ రోజుకు మొదటి ఇంట్లో పని పూర్తి చేశారు. అది 10 గేదెలున్న ఒక భూస్వామి ఇల్లు. ఇప్పుడామె ఇక్కడి నుండి మరో ఇంటికి నడిచి వెళ్తారు.
పొద్దున్నే 6 గంటలకు ఒక కప్పు టీతో ఆమె రోజు మొదలవుతుంది. ఆ తర్వాతి తొమ్మిది గంటల వ్యవధిలో, ఆమె తన ఇంటి చుట్టుపక్కల 12 నుండి 13 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు ఇళ్ళకు వెళ్తారు. ఈ సమయంలో అల్పాహారం కోసమో, మధ్యాహ్న భోజనం కోసమో ఆమెకు ఎలాంటి విరామం ఉండదు. ఆమె చేసే కఠిన శ్రమకు లభించే ప్రతిఫలం చాలా తక్కువ. “మూడు నాలుగు పశువులున్న చాలా మంది నాకు నెలకు 500 రూపాయలు ఇస్తారు. జమీన్‌దారు ఇంట్లో మాత్రం నాకు 1,000 రూపాయలు, అర లీటరు పాలు లభిస్తాయి.”
రోజు మొత్తమ్మీద ఆమె 30 నుంచి 35 పశువుల మలాన్ని ఎత్తిపోస్తారు. “అనుకూల సమయాల్లో నెలకు 3,500 నుండి 4,000 రూపాయలు సంపాదిస్తాను. చలికాలంలో పని తక్కువగా ఉంటుంది.” ఆ సమయంలో తరన్ తారన్ జిల్లాలో వాతావరణం చాలా గడ్డుగా ఉంటుంది. “చలికి పశువులు చనిపోతుంటాయి, అందుకే జనం వాటిని ఇంటి లోపలకు తీసుకువెళ్తారు, అప్పుడు నా అవసరం వారికి ఉండదు. ఆ నెలల్లో కష్టపడి పనిచేయడానికి నా ఆరోగ్యం కూడా సహకరించదు. నేను పొద్దున్నే లేవలేను, అలాగే మధ్యాహ్నం 3 గంటలకల్లా తిరిగి ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది. రోజంతా పని చేయలేను. “లోకీఁ పైస్ఱఁ ఇన్ భర్దే కమ్ భావ్ఱఁ పూరా దిన్ కరావుందే రహన్ (జనం డబ్బులివ్వడానికి ఇష్టపడరు, కానీ నేను రోజంతా పని చేయాలని ఆశిస్తారు,)” అంటారామె.
ఆమె ఆదాయంలో దాదాపు సగం, ఆమెతో పాటు అద్దె గదిలో నివసిస్తోన్న మనవరాలితో అద్దె పంచుకోవడానికే పోతుంది. మిగిలినది తన జీవనం గడపడానికి సరిపోతుంది. అమర్‌జీత్ స్వతంత్రంగా ఉండటానికి, తన అవసరాలను తానే చూసుకోవడానికి, తన భోజనాన్ని తానే వండుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో ఎక్కువ డబ్బు రేషన్, పిండి కొనడానికే ఖర్చవుతోంది. “గత ప్రభుత్వం గోధుమలు పంపిణీ చేసినప్పుడు, ఆమెకు కిలో రెండు రూపాయల రాయితీ ధరకే ఏడు బస్తాల గింజలు (భర్తను కోల్పోయిన స్త్రీకి లభించే కోటా) లభించేవి,” అని అమర్‌జీత్ కౌర్ పెద్ద కుమార్తె, 50 ఏళ్ళ బల్విందర్ కౌర్ చెప్పారు. “ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఆ ఆటా-దాల్ (పిండి-పప్పు) పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది.” అమర్‌జీత్ వద్ద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కింద జారీ చేసే నీలం కార్డ్ ఉంది. దీని ద్వారా వారు రాయితీ ధరలకు ఆహార ధాన్యాలను పొందవచ్చు. అయితే, 2022 నుండి పంజాబ్‌లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, కార్డుల పరిశీలన ప్రక్రియ పేరుతో పిడిఎస్ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. 2026లో కూడా, ఈ పథకం కింద ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు ఆమెకు లభించడం లేదు.
ఆమెకు ఏడాదికి రెండుసార్లు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 15 కిలోల గోధుమలు లభిస్తాయి. “ఇనీ కూ కణక్ నాల్ కిత్థే గుజారాఁ హుందా హై ళిఈ కొద్ది మొత్తంతో ఎవరైనా ఎలా బతకగలుగుతారురి?” అమర్‌జీత్ కౌర్ ప్రశ్నిస్తారు. ఆమెకు నెలనెలా వచ్చే 1,500 రూపాయల వృద్ధాప్య పింఛను కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ, వయసుతో పాటు క్షీణిస్తోన్న ఆమె ఆరోగ్యానికి కూడా దాని స్వంత అవసరాలు ఉన్నాయి. “ఇదిగో చూడు, ఇది నా దుఃఖపు గడ్డ,” నాకు తన పొత్తికడుపులోని గడ్డను చూపిస్తూ చెప్పారామె. ప్రభుత్వ ఆసుపత్రి ఆమె ఇంటి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ, ఆమె డాక్టరు వద్దకు వెళ్ళటంలేదు. “ప్రభుత్వ ఆసుపత్రులలో మాలాంటి కింది కులాల వారిని ఎవరు పట్టించుకుంటారు? ఒకవేళ నేను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఏ చిన్న సాకు దొరికినా డాక్టర్లు నా కడుపు కోసేస్తారు (ఎందుకంటే వారికి శస్త్రచికిత్సల ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది),” అన్నారామె
ఆ గడ్డ వల్ల ఇప్పుడామెకు నొప్పేమీ లేదు, కానీ అమర్‌జీత్ కడుపు నిండా తినలేకపోతున్నారు, దీనివల్ల ఆమె బలహీనపడుతున్నారు. ఈ మధ్య కాలంలో పనికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆమె కొన్నిసార్లు కింద పడిపోయారు. “మీరు నడిచే ఎందుకు వెళ్ళాలి?” నా ప్రశ్న ఆమెకు కాస్త అసహనం కలిగించినట్లనిపించింది. “నడవకపోతే ఇంకేం చేయాలి? రిక్షా ఖర్చుకు డబ్బెక్కడి నుంచి తేవాలి?”
“మైఁ పఢీ-లిఖీ నహీఁ నా ఇసే కర్కే గోహా-కూడా ఛుక్క్ రహీ ఆఁ. కోయీ హోర్ కమ్ కర్నా వీ నహీ ఆఉందా (నాకు చదవడం, రాయడం రాదు, వేరే ఏ పనీ చేతకాదు. ఏ కొత్త పని చేయాలన్నా అనుభవం కావాలి.) వ్యవసాయ పనుల కోసం రైతులు కేవలం యువతరాన్ని మాత్రమే నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నేను వారిని పని కోసం అడిగినప్పుడల్లా, వారిలా అంటారు: మాతా తూ ఘర్ బెహ్ (ఓ ముసలమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు). మాకు సొంత భూమి లేదు, మా అత్తమామల వైపు గానీ, మా తల్లిదండ్రుల వైపు గానీ ఎవరికీ లేదు.” పంజాబ్‌లో శామిలాత్ (గ్రామ ఉమ్మడి భూమి) కోసం జరుగుతున్న ఉద్యమం ఇంకా ఫలించలేదు, తరన్ తారన్‌లోని దళితులకు సాధికారతను కల్పించలేదు. అప్పటి వరకు అమర్‌జీత్‌కు వేరే మార్గాలు లేవు.
“మైఁ భీ బుఢాపే చ ఆరామ్ కర్నా చాహూంగీ హాఁ పెర్ జే మైఁ బెహ్ గయీ తాఁ మర్ జావూంగీ (నేను కూడా నా వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. కానీ పని మానేస్తే నేను బతకలేను),” అంటున్నారామె.
ఈ కథనాన్ని మొదట హిందీలో నివేదించారు.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/article/the-weight-on-her-heart-and-her-head-te)
జూన్ 13, 2026 లో మొదట ప్రచురితమైనది.)
