సాయంత్రం బెటాలియన్ క్యాటర్స్ నుండి సొంత కారుతో బయలు దేరి, రెండు కిలోమీటర్ల దూరం వున్న కొడుకు కిరీటి బంగ్లాకు బయలు దేరారు నీలకంఠం, సులక్షణ దంపతులు. అప్పుడప్పుడు అలా వెళ్లి రాత్రి డిన్నర్ ముగించుకొని రావటం అలవాటు ఆ దంపతులకు. పైగా అమెరికా నుండి కీర్తి కూడ వచ్చి, వారి అత్తగారు కూడా అదే ఊరిలో ఉండడం వల్ల వారింట్లోనే ఉంది.
ఇలా మేమిద్దరూ కిరీటి ఇంటికి వెళ్తున్నాం రమ్మంటే సరేనంది. సులక్షణ ఫ్రెండ్ వేదవల్లికి అన్ని విషయాలు చెబుతుంది. వీరు వెళ్ళేటప్పటికి లోపల నుండి ఏదో వాదోపవాదాలు వినిపిస్తుంటే, తలుపు దగ్గరనే ఉండి, ఆనందంగా వింటున్నారు. వారిద్దరూ కవలలు. కిరీటి రెండు నిమిషాలు ముందుగా పుట్టి, అన్న అయి చెల్లెలు మీద అథారిటి చాలా చేస్తుంటాడు.
అన్నయ్యా, అమ్మ వాళ్ళు నా దగ్గర ఉండటానికి అమెరికా వస్తున్నారు. అదెలా కుదురుతుంది. సంప్రదాయం ఒప్పుకోదు. పున్నామ నరకం నుండి తప్పంచే నా వద్దనే ఉంటారు. బుల్ షిట్… పున్నామ నరకమా… నా బొంద అప్పుడెప్పుడో మీ మగవారే ఆచరించే ఆ విధానం కనుగొన్నారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు. అమ్మాయికి పెళ్ళి చేసి అత్తారింటికి పంపితే, అందరూ కలిసి ఒకే చోట ఉండేవారు. మరి ఇప్పుడు ‘ఎవరికి వారే యమునాతీరే’ అనేలాగ ఒంటరి కుటుంబాలు.
పోవే…. ఎప్పుడూ ఏదో ఒకటి సర్ది చెబుతుంటావు.
అది కాదురా… మనిద్దరినీ బాగా ఖర్చుచేసి హాస్టల్లో ఉంచి, చదివించారు కదా, అలాంటప్పుడు వాళ్ళ బాధ్యత మాది కూడానూ. పైగా ఆస్తిలో సగభాగం కూతుళ్ళకు సమానంగా చెందుతుందని కోర్ట్ నిర్ణయించింది,. సో… అమ్మ వాళ్ళను నేను తీసుకెళ్తాను. ఇక వీళ్ళ వాదనలకు అంతు ఉండదని ఇద్దరూ లోపలికి వెళ్ళి ఎవరి గురించిరా ఈ తర్జన భర్జనలు?
చూడు నాన్న….. అన్నయ్య నేను చెబుతుంటే వినడం లేదు. నేను ఏమి చెబుతున్నాంటే ….
ఆగు…. ఆగు…. నాన్న కూచీ, మేమంతా విన్నాము. మా ఆలోచనలు మాకుంటాయని మీరు తెలుసుకోవాలి.
అదేమిటమ్మా…. మీకు వేరే ఆలోచన లేమిటి? ధర్మం ఏం చెబుతుందంటే…..
అమ్మ కూచి అన్నయ్య…. ఆగు……. వారేం చెబుతారో విందాం…..
ఇంక రెండు నెలల్లో నేను రిటైర్ అవుతున్నాను. నా సర్వీసు అంతా క్వారటర్స్‌లోనే గడిచింది. ఇప్పుడు ఒక ఇల్లు అద్దెకు తీసుకొని చిలుకా గోరింకలు లాగ ఉండాలనుకొంటున్నాము ఈ హైదరాబాదులోనే…
నో….నో….అని ఇద్దరూ బిగ్గరుగా అరిచారు. మీ జీవితమంతా మా చదువుల కోసం తాపత్రయపడి, డబ్బు ఖర్చు చేసి, మమ్ములను చదివించారు. మేమిద్దరం చక్కగా పెద్ద చదువులు చదువుకొని, పెద్ద ఉద్యోగాలలో ఉండి, పెద్ద ఇళ్ళు కట్టుకున్నాం. మీరు మీ మనవడితో ఆడుకుంటూ నిశ్చింతగా మాతో ఉండండి.
మా నాయనే అన్నాయ్…. ఈ హైదరాబాద్ లో ఏముంది. దుమ్ము, దూళి, శబ్దాలు, పవర్ కట్, వాటర్ ప్రాబ్లమ్ … ఆగాగు.. దానికి ప్రత్యామ్నాయం కనుగొన్నాం కదా! అదేం లేదు. నాన్నకు మా కవలలు సుమ, ప్రియ అంటే చాలా ఇష్టం. వాళ్ళతో కాలం శాంతిగా వెళ్ళ బుచ్చుతారు.
ఔను. నాకు అమెరికాలో ఆ ప్రజల జీవన విధానం పరిశీలించే అవకాశం ఉంటుంది.
మేము అమ్మాయి వద్దనే ఉంటాము.
చూడు మమ్మీ… నేను కొడుకునని, పెద్ద వాడిననీ కూడా చూడలేదు నాన్న.
అబ్బో… చాలా పెద్ద వాడివిరా అన్నాయ్…. రెండు నిమిషాలు…. అంతేకదా… పోజు కొట్టకు…
అబ్బా… ఆగవే… చూడు కిరీటి! సంవత్సరంలో రెండు నెలలు ఇండియా వచ్చి, మీ దగ్గరనే ఉంటాం.
సరేలే అమ్మా…. గుడ్డిలో మెల్ల.
కావలసిన డాకుమెంట్స్ అన్నీ ముందుగానే తయారు చేసుకొంది కీర్తి. తన వాళ్ళను ఒప్పించగలననే దైర్యంతో. ఈ రెండు నెలల్లో మిగతావి కూడ పూర్తి చేసి, అమ్మ నాన్నలను తన వద్దకు, అమెరికాకు తీసికెళ్ళింది. భర్త విష్ణు కూడ మొదటి నుండి తనకు సపోర్టు చేస్తూ వస్తున్నాడు. పైగా ఈ సలహా కూడ అతను ఇచ్చినదే. అమెరికాలో వీరు అప్ టౌన్లో అంటే ఊళ్ళోకాక, సబార్చులో ఉంటారు. మనుషులు ఎక్కువగా కనబడరు. కార్లే… రకరకాలవి కనిపిస్తాయి ఎక్కువగా.
పెద్ద బంగళా బేస్మెంట్ అనటంకన్నా లోయర్ లెవల్ అనాలి. ఎందుకంటే అక్కడ తలుపు తీసి బయటికి అంటే బ్యాక్ సైడ్ వెళ్ళవచ్చు, ఇల్లంతా పెద్దదిగా, ఫర్నిష్ చేయబడి ఉంది. బారు, పెద్దహాలు, జిమ్…. అంతా అందమైన, మ్యాచింగ్ ఫర్నిచర్, కార్పెట్లతో 50 మందిని భోజనానికి పిలిచినా సరిపోతుంది. క్రింద ఒక ఫ్రిజ్, కిచెన్ కూడ ఉన్నాయి. నూనె పదార్దాలు వండటానికి బయట పొయ్యి, బార్బీక్యు…. లాంటివి ఉన్నాయి. గ్రౌండ్ ప్లోర్లో హాలు, ఫార్మల్ డైనింగ్ రూమ్, పెద్ద ఫ్యామిలి రూమ్, విశాలమైన కిచెన్, బ్రేక్ ఫాస్ట్ టేబుల్, దేవుడు గది, ఫ్రిజ్… అబ్బో చాలా సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడి తలుపు ఉండి, గజీబోకు వెళ్ళటానికి దారి, బ్యాక్ యార్ట్ పెద్దగా ఉండి, వెనక గాల్ఫోకోర్స్ ఉంది. డోర్ దగ్గర వరండాలో చిన్న పొయ్యి, బార్బీక్యు ఉంది. మాస్టరు బెడ్ రూము కూడ ఇక్కడే ఉంది. లైబ్రరి కమ్ ఆఫీసు రూము అందంగా ఇద్దరూ కంప్యూటర్లు పెట్టుకోటానికి టేబుల్స్, కాఫీ మిషన్… ఇలా చాలానే ఉన్నాయి. మేము రావటం ఇదే మొదటిమారు. భర్త ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎక్కడికీ వెళ్ళటానికి వీలు కాలేదు. సరె… మొదటి అంత్తస్తులో 4 పెద్ద గదులు, విత్ బాత్రూమ్స్…. ఒకటి మాది. పెద్ద గది… వాకిన్ క్లాసెట్, టివిలో మన చానల్స్… మరొక రూము కవలలది. మిగతా రెండు గెస్ట్ రూములన్న మాట. అందరూ కలవటానికి పెద్దహాలు, పెద్ద టి.వి. అన్నీ గాజుగోడలే. ఎక్కడ నుంచి చూసినా, పచ్చదనమే కదా.
మా రొటీన్ చెబుతాను వేదవల్లి! మావారు మామూలుగా తెల్లవారు ఝామున 4 గంటలకు లేచి, మెడిటేషన్, యోగ, జిమ్ ముగించి, టీ బ్యాగ్ పెట్టుకొని టీ త్రాగి, స్నానం, పూజ ముగించి 7:30గం.కు క్రిందికి వస్తారు. నేనేమో 5 గంటలకు లేచి, స్నానం, పూజ ముగిస్తాను. మేడపైన ఒక చిన్న పూజ గది ఉంది. నేను 8 గంటల కంతా టిఫెన్ చేసి, క్యారియర్‌లో లంచ్ సర్దుతాను. ఇంటి భోజనమే ఇష్టపడతారు. రాత్రి అన్నం తింటారన్న మాట. 8:30 కంతా కూతురు, అల్లుడు వెళ్ళిపోతారు. 6 ఏళ్ళ కవలలు 9 గంటలకు వచ్చే స్కూలు బస్సులో వెళ్తారు. మొదట్లో మేము బస్సు దాకా వెళ్ళి దింపేవారం. తాతయ్య మీరు రాకండి, మా స్కూలు పిల్లలు బస్సులో మమ్ములను ‘బేబీస’ అని ఎగతాళి చేస్తూ ఏడ్పిస్తారు. అంటే వరండాలో కూచుని, బస్సు వెళ్ళాక, మేము టిఫిన్ చేస్తాం. నేను వంట గదిలో అన్నీ సర్ది పై కెళ్ళిపోతాను. మా వారు సోఫాలో కూచుని పేపరు చదువుతారు క్రిందనే.
వాట్సాప్ పుణ్యమా అంటూ ఇండియాలోని ఫ్రెండ్సకు ఫ్రీగా ఫోన్ చేసుకోని కాస్సేపు అలా నడుం వాల్చి టివి చూస్తాను. 12 గంటలకు క్రిందికి వచ్చి వేడిగా కుక్కర్‌లో అన్నం చేసుకొని, భోజనం చేస్తాం. భోజనం చేస్తూ, గాజు గోడల నుండి కనిపించే కమనీయ దృశ్యాలు చూస్తూ, పేపరులోని వార్తల గురించి, మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటాం.
ఇద్దరం పైకెళ్ళి రెస్టు తీసుకొని, 3 గంటల కంతా క్రిందికి వస్తాము, కవలలు 3:30కు వస్తారు. వారికి తినటానికి రెడి చేస్తాను. వారు వచ్చి, పైకి వెళ్ళి, డ్రెస్ మార్చుకొని, ఫ్రెష్ అయి వచ్చి, తమకు నచ్చినది చేశానవి సంతోషంగా తింటూ, మా ఇద్దరితో స్కూలు ఫ్రెండ్స్, టీచర్స్ గురించి కబుర్లు చెబుతారు. వీరు కవలలు అయినా రెండు నిమిషాలు ముందు పుట్టిన సుమ చాలా నెమ్మదస్తురాలు, ఇక ప్రియ సంగతి చెప్పనవసరంలేదు. అల్లరిపిల్ల. సందడే సందడి. అందరినీ కంట్రోల్ చేస్తుంది. కాసేపు తాతతో ఆడుకొని, కంప్యూటర్లో ఏదో హోమ్‌వర్క్ చేసుకొంటారు. అసలు హోమ్ వర్క్ అంటూ ఎక్కువగా ఏమీ ఉండదు. స్కూలులోనే అంతా చేయిస్తారు, అసలు వీరిద్దరూ ఎప్పుడు పోట్లాడుకోరు. వింతగా అనిపించింది. 6 గంటలకు కూతురు, అల్లుడు వచ్చి కాఫీ త్రాగుతు మాతో పది నిమిషాలు గడిపి, స్నానం చేసి, క్రింది గదిలోని పూజ గదిలో పూజ చేస్తారు. ప్రొద్దుట టైము ఉండదని, సాయంత్రం చేస్తారు పూజ. కాని, అందరూ ప్రొద్దుట బయటికి వెళ్ళేటప్పుడు, పూజ గదిలోకి వెళ్ళి, దేవుడికి దండం పెట్టుకొనే అలవాటుకు ముగ్దులైయ్యారు పెద్దవారు. తమ కూతురు తన కవలలకు అన్నీ మంచి అలవాట్లు నేర్పించింది.
ఏడున్నరకు అందరూ కలిసి నేను చేసిన వేడివేడి భోజనాన్ని, కబుర్లు చెప్పుకొంటూ తింటారు. అందరూ కలిసి, అన్నీ సర్దాక కూతురూ, అల్లుడు తమ స్టడీ కమ్ లైబ్రరీ కమ్ ఆఫీసు రూములోకి వెళ్ళి ఆ కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. తాతగారు అంటే మా వారు మనవరాండ్లను తీసుకొని, వాళ్ళ రూములో ఉండి, వారికి మన రామాయణ, మహాభారతంలోని విషయాలు కథలుగా కొన్ని శ్లోకాలు కూడా కొద్ది కొద్దిగా నేర్పుతారు. సుమతీ, వేమన శతకాల్లోని పద్యాలు చెబుతూ, అందులోని నీతిని భోదిస్తారు. ఆ తర్వాత పిల్లలు ఓ అరగంట ఇద్దరూ టివిలో కార్టూన్ నెట్ వర్క్ చూసి, 9:30 గంటలకు పడుకొని, ప్రొద్దుట 6:30 లేచి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని టైమ్‌కు క్రింది కొస్తారు.
వీకెండ్స్‌లో మాత్రం అందరూ కలిసి బయటికి వెళ్ళి, గేమ్స్ చూస్తాం. బ్యాస్కెట్ బాల్ అన్నా, టెన్నిస్ అన్నా, ఫుట్ బాల్ అన్నా చాలా ఇష్టం అమెరికన్లకు… పిల్లలను తీసుకొని, ఆగేమ్స్‌కు వెళ్ళటమో, తెలుగు అసోషియేషన్ కార్యక్రమాలకు వెళ్ళటమో, ఫ్రెండ్స్ ఇళ్ళల్లోని ఫంక్షన్స్ వెళ్ళటమో చేస్తాం. అన్నింటికి మమ్ములను తీసికెళ్తే, అందరూ ఎంతో మర్యాదగా, గౌరవంగా చూస్తారు. హిందు టెంపుల్స్‌ల్లో జరిగే అన్ని పూజలకు వెళ్తాం. నిజమే తల్లిదండ్రులు ఎలా పెంచితే అలా పిల్లలు. మా ఇద్దరికీ వాళ్ళ సంసారం ఎంతగానో నచ్చింది. ఎనిమిది రోజులకోమారు హౌస్ కీపింగ్‌కు గాను ముగ్గురు వచ్చి, మూడు గంటలలో ఇల్లు, బాత్ రూమ్స్, కిచెన్ అంతా శుభ్రం చేస్తారు. ఎక్కడా దుమ్ము ఉండదు. రోజూ మనకులాగా ఊడ్వనవసరం లేదు. ప్రతి రూములోను కార్పెట్లు ఉంటాయి. మన తెలుగు వారు ఇక్కడ బాగా సంపాదించి, లగ్జరీయస్‌గా బ్రతుకుతారు చాలా మంది. నేను, మా వారు ప్రతి రోజూ కాసేపు గజీబోలో కూచొని గాల్ఫ్ ఆడే వారిని చూస్తుంటాము, ఇక స్నో పడ్డప్పుడు ఆ ఆనందం చెప్పనలవికాదు. ఇలా మేము సుఖంగా, నిశ్చింతగా ఉండటం ఆ దేవుడికే కన్ను కుట్టినట్టుంది. మూడేళ్ళు కూడ మేము ఇలా సుఖంగా ఉండటం చూడలేక, మా వారిని చిన్న జబ్బుకే కొడుకు ఇంటిలో ఉండగా తీసుకొనిపోయాడు. నన్ను వదిలి ఆయన వెళ్ళటం నేను జీర్ణించుకోలేకపోయాను. కొడుకు నన్ను హైదరాబాద్‌లోనే ఉంచుకొంటానన్నాడు. నేను త్వరగా తేరుకుంటానని. కాని నేను ఒప్పుకోలేదు. ఆయన జ్ణాపకాలు అక్కడ చాలా ఉన్నాయి. ఆ జ్ణాపకాలతో జీవిస్తానని నిరాకరించాను. దేనిమీద నాకు మనసు పోవడం లేదు. ఏదో నిర్లిప్తత. ఒంటరి పక్షినైపోయాను. పిల్లలు ఎంతగానో ప్రయత్నించారు. కవలలు ఇంట్లో ఉన్నంత సేపూ నాతోనే గడిపేవారు, నన్ను మాటలలో దింపి, వారితో ఆడుకోమనే వారు. నేను ఒంటరిగా ఉండటానికి ఎక్కవ ఇష్టపడే దానను వేదవల్లి! అది సహజమే సులక్షణ.
ఆయన జ్ఞాపకాలతో ఒక సంవత్సరం గడిచి పోయింది. నాలో ఏదో గుబులు. ఒక రకమైన, చెప్పలేని భయం. నేను ఎక్కువ రోజులు ఉండలేనని అనిపించింది. అందుకే ఆ మరణం ఏదో కొడుకు చేతులలోనే పోవాలనే యోచన కలిగింది ఎందుకో. ఆడ, మగ ఇద్దరూ సమానమని భావించే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో నాకే తెలియదు. అందుకే అమ్మాయిని ఒప్పంచి, ఇక్కడి కొచ్చాను. మరి, ఆభయం, నిర్లిప్తిత పోయిందా? ఎలా పోతుంది వేదవల్లి? అదలాగే ఉంది. కొడుకు వద్దకు పోతున్నాననే తృప్తి ఉంది. సంవత్సరాల తరబడీ మన సంప్రదాయాలంటూ మనసులో పాతుకుపోయాయి. ఎన్నయినా మాట్లాడుతాం. కాని మనదాకా వచ్చాక గాని తెలవదు, ఆ భావంలోని ఆచరణ ఎంత కష్టమో?
వేదవల్లీ! సులక్షణ బాధను అర్ధం చేసుకుంది. నిజమే మన ఆలోచనలు వేరు. ఆచరణలు వేరు. తను ఏదో తప్పు చేశాననే బాధతో కుమిలిపోతున్నది. కాని దానిని అధిగమించటానికి మనసు ఒప్పుకోవటం లేదు. ద్వంద్వ భావాలతో సతమతమవుతున్న తనకు నేనొక సలహా ఇచ్చాను. తనకు బాగానచ్చింది. నా చేతులను తన కళ్ళకు అద్దుకొని, నా మనసులోని వేదనకు చక్కటి మార్గం చూపావు. స్నేహితురాలవంటే నీవే వేదవల్లి. తన ముఖంలో ఏదో మెరుపు, ఆనందం, తృప్తి… అన్ని భావాలూ నాకు కనిపించాయి. మరురోజు కిరీటి నుండి ఫోను, ఏడ్పు కంఠంతో ‘ఆంటీ అమ్మ నిద్రలో పోయారు. ముందు రాత్రి ఓ విషయం చెప్పి, నాతో మాట తీసుకొన్నారు, చేస్తావు కదా‘ అని అడిగారు. నేను సరే అనగానే, ఇవాళ నా మలినమైన మనసు స్వచ్చంగా అయింది కిరీటి! ఇక నాకు నిశ్చింత. ఏ బాధా లేదు. ఇక మీ నాన్నగారిని నిర్మలమైన మనసుతో కలుస్తాను. నేను తప్పు చేశానన్న గిల్ఱీ ఇప్పుడు లేదు నాయనా అంటూ, నా రెండు చేతులను ముద్దాడింది ఆంటి.
మీ అమ్మది పెద్ద మనసురా, ఇంతకీ కీర్తీకి చెప్పావా? చెప్పాను. ఒకటే ఏడపు. అమ్మ నాన్న ఇద్దరూ, నా చేతులు మీదుగా పోయారు. ఎంత అదృష్టంరా అన్నయ్యా… నాకా ప్రాప్తం లేదు.. దాన్ని ఓదార్చడం నా చేతనవలేదు ఆంటి. తను వచ్చే వరకు ఉంచుతావా బాడీను? తను ఎల్లుండి వస్తుంది. తప్పకుండా ఉంచుతాను. లేకపోతే నేను జీవితమంతా గిల్టితో నరకం అనుభవిస్తాను. కీర్తీ వచ్చింది. తనను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. స్మశానానికి ఎవరు అడ్డుకున్నా వినలేదు. చితికి నిప్పు పెట్టే సమయంలో కీర్తీ ఇలారా నీవు కూడ అమ్మ చితికి నిప్పుపెట్టు. అమ్మ చివరి కోరిక ఇది. ఎవరు కాదన్న వినలేదు కిరీటి. సులక్షణ చితికి కొడుకు, కూతురు ఇద్దరూ కలసి తల కొరివి పెట్టారు.
నేను ఆ రోజు సులక్షణ సమస్యకు చూపిన పరిష్కారం ఇది. ఔను కూతురు మాత్రం వాళ్ళ రక్తం పంచుకొని పుట్టలేదా? తనకు మాత్రం తల్లిదండ్రుల బాధ్యత లేదా? చనిపోయే ముందురోజు రాత్రి కిరీటికి తన ఆఖరు కోరిక ఇలా నెరవేర్చమని మాట తీసుకుంది. ఈ విధంగా కూతురు, కొడుకు ఇద్దరూ సమానమని నిరూపించుకొంది సులక్షణ. పిల్లలిద్దరూ కలసి, ఆవిడను పున్నామ నరకం నుండి తప్పించారని అనవచ్చా?!
