ఆ గంటన్నర్రలో రమణికి ప్రకృతిలోని రంగులన్నీ కలిసిన ఒక భావచిత్రం తన ముందు ఆవిష్కృతం అయినట్లు అనిపించింది. పనిప్రదేశం సురక్షితమైనదైతే మహిళలందరూ ఉద్యోగాలకు సిద్ధమే అనుకున్న తను ఆ ఆలోచన తప్పని, అంతకన్నా ఎక్కువగా సురక్షితమైన వాతావరణం ఇంటి నుండే కోరుకుంటారని కొంచెం కొంచెంగా అర్ధం అవుతోంది.
అత్యంత పదిలమైన ప్రదేశం అని సమాజమంతా ఎలుగెత్తి చాటడానికి ప్రయత్నించే ఆ “ఇల్లు” తనకు మాత్రం ఏరకంగానూ సురక్షితంగా లేదని చెప్పకనే చెప్పిన సరిత ప్రతి మాటా ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఎన్నో ఉదాహరణాలతో ఎన్నెన్నో ఉద్వేగాలతో ఎంతో ఓపెన్‌గా తను పంచుకున్న సంఘటనలు, అనుభవాలు ఒకపక్క కాదనలేనివిగా ఉన్నా, ఇంకో పక్క నమ్మడానికి ఏదో అడ్డం పడుతోంది. బహుశా తను కూడా కొన్ని విలువలనే నమ్ముతోందేమో… తను కూడా కుత్సితంగా ఆలోచిస్తోందా… ‘నన్ను, నా మాటల్ని నమ్మలేనప్పుడు మీరు స్త్రీవాదులు ఎలా అవుతారు’ అన్న సరిత ప్రశ్న గట్టిగానే తగిలింది. నిజమే కదా మరి..
సరిత ప్రస్తుతం ఒక ప్రభుత్వ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఎప్పుడూ సెలవులు పెట్టదు, పనిలో వేలెత్తి చూపించే అవకాశం ఎవరికీ వదలదు. అందరితో మాట్లాడుతుంది కానీ ముభావంగా, అంటీముట్టనట్లుగా, కొంత తలబిరుసుగా అనిపించే సరిత తోటి ఉద్యోగులకి ఎప్పుడూ కొరకరాని కొయ్యగానే ఉంది.
ఇంటర్ పూర్తవ్వగానే మంచి సంబంధం, కోరి మరీ వచ్చారు, కట్నం వద్దంట, ఏదున్నా పిల్లకి పెట్టుకోమన్నారు, నేనేమి ఇవ్వగలను, ఇటువంటి సంబంధం వదులుకుంటే మళ్ళీ రాదు, పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చన్నారు… అంటూ ఆతృత పడుతున్న తండ్రిని చూసి, ఆయన మాటకి కట్టుబడి, నలుగురు అమ్మాయిల్లో పెద్దదైన సరిత పెళ్ళికి ఒప్పుకుంది. ఇంట్లో మొదటి పెళ్ళని అయినవాళ్ళందరినీ పిలిచి ఉన్నంతలో బానే జరిపించారు. పెళ్ళైనప్పటి నుండి భర్త తనపై చూపిస్తున్న శ్రద్ధ, ఆప్యాయత కొత్తగా అనిపించాయి. అత్త, మామలు బిడ్డలా చూసుకోవడం అమ్మా నాన్నలని మరిపించింది. తనకంటే రెండేళ్ళు పెద్దవాడైన మరిది ‘వదినా’ అంటున్నా అది అన్న ప్రేమలా అనిపించేది. అన్నలు లేని సరితకి అది ఎంతో బాగుండేది. ఎటొచ్చీ చెల్లెళ్ళ స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు లేక వాళ్ళని బాగా మిస్ అయ్యేది.
చలాకీగా, తెలివిగా, అందరితో కలివిడిగా ఉండే సరిత అంటే ఇంట్లో వాళ్ళకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి, చుట్టాలలో కూడా అందరికీ ఇష్టంగా ఉండేది. స్నేహితులు కూడా ఎక్కువే. కో-ఎడ్యుకేషన్ బడిలో చదువుకోవడంతో మగ స్నేహితులు కూడా ఉండేవారు. పెళ్ళయ్యాక వారంతా తన భర్తకి కూడా స్నేహితులయ్యారు. భర్త సెషన్స్ కోర్ట్‌లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఎలా అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పోటీ పరీక్షలన్నీ రాసేవాడు. ఇచ్చిన మాట ప్రకారం పెళ్ళయ్యాక చదువుకోడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టకపోవడంతో కొంచెం ఆలస్యంగా అయినా డిగ్రీ కాలేజీలో చేరిపోయింది. భర్త కోర్టుకి వెళ్తూ సరితని కాలేజీ దగ్గర దింపేవాడు. మొదటి సంవత్సరం మంచి మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరం సగంలో ఉండగా గర్భం దాల్చింది. మూడో ఏడాది మొదట్లోనే మగపిల్లవాడ్ని ప్రసవించించి. బ్రైట్ స్టూడెంట్ కాబట్టి స్పెషల్ కేస్‌గా పరిగణించి ప్రిన్సిపల్ అనుమతించడంతో కాలేజీకి వెళ్లకుండానే స్నేహితుల సహకారంతో నోట్స్ రాసుకుని, ఒకపక్క పిల్లాడ్ని చూసుకుంటూనే ఫైనల్ పరీక్షలు రాసేసింది. మంచి మార్కులే వచ్చాయి. పిల్లాడు కొంచెం పెద్దయితే తనూ మంచి ఉద్యోగం చూసుకుంటే భర్త ఎక్కువ సమయం పోటీ పరీక్షలపైన దృష్టి పెట్టొచ్చు అన్న ఆలోచనలో ఉంది.
కొడుక్కి రెండేళ్ళు నిండాయి. ఈ లోపు దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెంటర్లో చేరి సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసింది. ఏదైనా ఉద్యోగం చూసుకుంటానంటే వాడికి మూడేళ్ళు నిండనివ్వు, అంగన్వాడీలో చేర్పిస్తే నీకూ తేలికవుతుంది అన్నాడు భర్త. అదీ నిజమేలే అనుకుంది. ఇంతలో చెల్లి డెలివరీ అయితే ఒక నెలరోజులు తోడుగా ఉండడానికి కొడుకుని అత్త దగ్గర విడిచి వెళ్ళింది. సరిత అక్కడ ఉండగానే భర్తకి ఆక్సిడెంట్ అయ్యి ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. లబోదిబోమని మొత్తుకుంటూ పరుగున వచ్చింది. దినాలయ్యి నెల దాటినా కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. సరిగ్గా తిండి తినక, నిద్రపోక, ముఖం పీక్కుపోయి బక్కగా తయారయ్యింది. కొడుకుని కూడా పట్టించుకోటల్లేదు. ‘పేగుతెంచుకుని పుట్టిన చెట్టంత కొడుకు అర్ధాంతరంగా చస్తే తల్లిగా నేను ఏడ్చేదానికన్నా ఎక్కువ ఏడుస్తున్నావు, చాల్లే ఆపింక’ అంటూ ఒకరోజు అత్త గట్టిగా కోప్పడింది. అప్పటి నుంచి దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటి పనుల్లో పడింది. కనిపించిన ఉద్యోగానికల్లా అప్లై చేయడం మొదలుపెట్టింది. త్వరలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. స్నేహితురాలిని తోడు తీసుకెళ్ళి వెంటనే చేరిపోయింది. అప్పటి నుండి మొదలయ్యాయి ఒక్కొక్కటిగా తిప్పలు.
నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూసీ చూసీ రాకుండానే సచ్చిపోయాడు, అది నీకు కావాల్సి వచ్చిందా, కొడుకునొదిలేసి కాలేజీలెమ్మట తిరుగుతావా అంటూ అర్ధంలేని మాటలంది అత్త. మామ తనని చూసే తీరులో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. ఆ మధ్య ఇంటికొచ్చిన బంధువెవరో ‘పిల్లకి పాతికేళ్ళు కూడా లేవు, చదువుకుంది, చక్కగా ఉంటుంది, ఆస్తుల పంపకం పని లేకుండా నీ చిన్న కొడుక్కి చేసేస్తే మంచిదేగా’ అన్నాడు. అప్పటికి తలాడించిన మామ ఆ తర్వాత ‘వాడికి రెండో పెళ్ళిది ఎందుకు, నేను లేనూ’ అని తనకు మాత్రమే వినపడేలా అని వెకిలిగా నవ్వుతుంటే హతాశురాలైంది. అప్పటికప్పుడు చచ్చిపోవాలనిపించింది.
ఒకరోజు అమ్మానాన్నల్ని చూడాలనిపించి కాలేజీలో పర్మిషన్ తీసుకుని వెళ్ళింది. ఇంటికొచ్చేసరికి ఆలస్యం అయింది. అత్తామామలు బంధువులింట్లో పెళ్ళికని మనవడిని తీసుకుని ఊరెళ్ళారు. తన గదిలోకి వెళ్ళే సరికి పూల వాసన, మంచం మీదంతా మల్లెపూలు. నిశ్చేష్టురాలయ్యింది. ఇంతలో వెనకనించి వచ్చిన మరిది ‘నీకు మల్లెపూలంటే పిచ్చి ఇష్టమని నాకు తెలుసు, అన్న లేకపోతే ఏంటి నేనున్నాగా నీకు పూలు తేడానికి’ అంటూ తనని వాటేసుకుని మంచం మీదికి తోయబోతే, పెనుగులాడి ఎలాగో అతనిని గది బయటికి నెట్టి తలుపేసుకుంది. అటు మామ, ఇటు మరిది ఇలా మారిపోయారేంటి, తను చేసిన తప్పేంటి అనుకుంటూ ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది.
ఇటువంటి చేదు అనుభవాలు మళ్ళీ మళ్ళీ ఎదురౌతుంటే తట్టుకోలేక ఒకసారి అమ్మతో చెప్తే ఆమె బాధ పడినా, ‘చదువుకున్నావు, ఉద్యోగం ఉంది, ఇంకా ఇద్దరు చెల్లిళ్ళ పెళ్ళిళ్ళవ్వాలి…’ అంటుంటే అందులో భావం అర్ధం చేసుకుని ఏమీ తోచక దిగులుగా కూర్చుంది. ఆ తర్వాత పుట్టింటికి పోవడమూ తగ్గించింది. ఓసారి ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అత్తతో చూచాయగా విషయం చెప్పబోతే అంతెత్తున లేసి ‘పరువు కోసం బతికే వాళ్ళం, నువ్వు ఇంతకి తెగిస్తావా, నా మనవడు నా దగ్గరే ఉంటాడు, నీ పుట్టింటికి పో, ఆగలేక పోతున్నాను ఇంకో పెళ్ళి చెయ్యమని నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తా మీ నాన్నతో…’ అంటూ బయటికి గెంటినంత పని చేసింది. ‘అసలు పూజలు, పునస్కారాలూ లేకనే నువ్విలా బరితెగించావు. ఒక్కరోజన్నా టీవీలో ఆ పెద్దమనిషి చెప్పే సూక్తులు వింటావా? చదువంట చదువు, డిగ్రీలు తెచ్చుకుంటే ఏం ఉపయోగం సంస్కారం లేనప్పుడు?’, ఆ ప్రవాహం ఆగట్లేదు. ‘ఇవి నన్నంటున్నావా, నీ కొడుకునంటున్నావా అత్తా? నీకు మాత్రం తెలియదు?’ అని మెత్తగా అడిగిన సరిత ప్రశ్నకి ‘తల్లిగా నేనాలాపించలేదు, లోపం నీలోనా నిన్ను పెంచినవాళ్ళలోనా…’ అంటూ మీదిమీదికొచ్చింది, కొట్టడమే తక్కువ. తను చెడిపోయిందని, అందుకే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయని ప్రచారం మొదలైపోయింది. ఇక ఆ ఇంట్లో తను పరాయి అయిపోయింది. అయినా తప్పదు, భరించాలి…
మొదట్లో కాలేజీలో అంతా బాగున్నా, తను బొట్టు తియ్యకపోవడంతో, ఎక్కువగా చుడీదార్లు వేసుకోవడం, ఒక చేతికి ఒకటే బంగారు గాజు మరో చేతికి వాచీ పెట్టుకోడంతో చాలామంది ‘సరిత చాలా సింపుల్ లేడీ’ అని పొగుడుతూనే తనపై ఆసక్తి చూపించేవారు, ఏదో ఒక మిషతో తనతో మాటలు కలపాలని చూసేవారు, అది సరితని ఇబ్బంది పెట్టేది. స్కూటీ నడుపుతుంది, నిబద్ధతతో పనిచేస్తుంది, సాంప్రదాయంగా ఉంటుంది, రిజర్వ్ మనిషి, ఇండిపెండెంట్ అండ్ డీసెంట్, ఈ కాలం పిల్లల్లా కాదు, ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఉండాలి, ఎవరిదో ఆ అదృష్టం… ఇలా ఎవరికి వారే ఓపీనియన్లు పాస్ చేసేవారు. తర్వాత మెల్లగా తను భర్తని కోల్పోయిన స్త్రీ అని తెలిసి కొంతమంది సానుభూతి చూపించినా, ఇంకొందరు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నించి దెబ్బతిన్నారు. ఇక దొంగ చూపులు, ఓరచూపులు, వెకిలి చూపులు, అసభ్యంగా తాకే ప్రయత్నాలు, రెండర్ధాల వంకర మాటలు, అభ్యంతరకర చేష్టలు.. ఇవన్నీ కాలేజీలోనూ మొదలయ్యాయి. ఇండిపెండెంట్ అన్నవారే ఫ్రీ బర్డ్ అంటూ వెకిలి కామెంట్లు. ఎప్పుడన్నా ఒకసారి తనతో కొడుకుని తీసుకెళ్తే వాడిని మచ్చిక చేసుకోవాలని, ఆ వంకతో తనతో వ్యక్తిగతంగా మాట్లాడాలని చూసేవారు. తను నవ్వుకునేది. ఇవన్నీ తమాషాగా కూడా అనిపించేవి. అప్పుడప్పుడూ అవి బాధపెట్టినా ఎక్కువగా పట్టించుకునేది కాదు. ఎందుకంటే ఇంట్లో కన్నా కాలేజీలోనే నయం. ఒకరు కాకపోతే ఇంకొకరు తనకు సపోర్ట్ అవుతారు. మితిమీరితే ఆసరాగా చట్టాలు ఉండనే ఉన్నాయి. ఇంట్లో అలా కాదు, కుదరదు కూడా. ఆ సంబంధాలు తనకి కాకపోయినా తన కొడుకు భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి.
ఈ నేపధ్యంలోనే సరిత తనని తాను పటిష్ఠ పరుచుకునేందుకు తన తీరునే మార్చేసుకోవలసి వచ్చింది. ముఖం మీద నవ్వునే తుడిచేసుకుంది. తన నడకలో స్థిరత్వంతో పాటు నిర్లక్ష్యానికి కూడా చోటు కల్పించింది. అతి కొద్దిమంది బాగా దగ్గరి వారిని తప్ప స్నేహితుల్ని కూడా దూరం పెట్టింది. ఇక పుట్టింటి ప్రసక్తి ఎప్పుడో కానీ రాదు. కొడుకుని సైనిక్ స్కూల్లో చదివించాలని కోరిక. ఈ పుచ్చుపట్టిన భావజాలానికి దూరంగా క్రమశిక్షణతో, మంచి విలువలతో పెరగాలని ఆశ. ఆ పట్టుదలతోనే మూడో తరగతి నుంచే ప్రవేశ పరీక్షలకి శిక్షణనిచ్చే స్కూల్ హాస్టల్‌లో చేర్పించేసింది. తను మాత్రం అత్తింటిని వదిలి పెట్టలేదు, కష్టాల్ని తను ఎదుర్కుంటూనే న్యాయంగా తనకీ, కొడుక్కీ రావలసిన ఆస్తి వచ్చే వరకు తను పోరాడుతూనే ఉంటానంది.
ఇవన్నీ నిజమేనా, సరితలో ఏ సంకుచితాలూ లేవా అన్న ప్రశ్నలు తనలో మొలకెత్తడమే రమణికి నచ్చట్లేదు. కానీ బుర్రలో అది వచ్చేసింది అంటే తను నిజంగా ఇంకా పూర్తి స్థాయిలో స్త్రీవాదిగా పరిణతి చెందలేదనేనా! ఒకపక్క మత విశ్వాసాలని, ఇంకోపక్క సంస్కృతి సంప్రదాయాలని, ఇంకేదో ధర్మమని, వాటిని మహిళలే భుజానేసుకుని మోయాలని, రాబోయే తరాలకి పుట్టక ముందునుంచే నేర్పించాలని, తల్లిగా ఇది వారి ప్రధమ బాధ్యతని… ఇంకా ఎన్నో ‘శుభాషితాల’తో ఊదరకొడుతుంటే అదే నిజమని నమ్మాలని లేకపోయినా బుర్రలో దూరి తిష్ఠవేస్తున్నాయి. వీటిని తిప్పికొట్టే శాస్త్రీయత, స్త్రీవాద సిద్ధాంతాలు, కుటుంబ, సామాజిక సంబంధాలలో హితమైన మార్పుల అవసారంపై మాట్లాడడం అత్యంత అవసరమైన సందర్భం ఇప్పటి కాలం. అటువంటి ఆరోగ్యకరమైన చర్చలు లేకపోవడం, లేకుండా చేయడం ప్రమాదకరం కదా!! ఇందుకు దారితీస్తున్న పరిస్థితుల్ని, నమ్మకాలు, నియమాలు, విలువల్ని మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి తనకో మెంటర్ అవసరం అని బాగా అనిపిస్తోంది. అసలా సిద్ధాంతాలని నమ్మి అనుసరిస్తున్న మెంటర్స్ అవసరం ఇప్పటి సామాజిక-రాజకీయ నేపధ్యంలో మరింత అవసరం కదా!!
