ట్రాన్స్ సముదాయ జీవితాలు: కుటుంబం, లైంగికత, సమాజం మధ్య సంఘర్షణ – అర్చనరావు మానుకొండ

మన సమాజంలో ఇప్పటికీ “స్త్రీ” మరియు “పురుషుడు” అనే రెండు లింగాలే సహజమైనవి, దానికి మించి మరే వ్యక్తిత్వం లేదనే ఒక గట్టి సామాజిక మూస కొనసాగుతూనే ఉంది. ఈ ద్వంద్వ లింగ వ్యవస్థలోనే సమాజం చాలా కాలంగా ఆలోచిస్తూ వచ్చింది.

అయితే వాస్తవానికి లైంగికత, జెండర్ గుర్తింపు, వ్యక్తిత్వం అనేవి ఎంతో వైవిధ్యభరితమైన అంశాలు. ట్రాన్స్ సముదాయ సభ్యుల జీవితాలను పరిశీలించినప్పుడు ఈ భిన్నత్వం ఎంత లోతైనదో, అదే సమయంలో సమాజం దానిని అర్థం చేసుకోవడంలో ఎంత వెనుకబడి ఉందో స్పష్టమవుతుంది.
ట్రాన్స్ సముదాయంలో తమ లైంగికత లేదా జెండర్ గుర్తింపు గురించి అవగాహన వ్యక్తి నుంచి వ్యక్తికి భిన్నంగా ఏర్పడుతుంది. కొంతమందికి చిన్నప్పుడే తమలో ఉన్న భిన్నత్వం తెలుసుకుంటే, మరికొందరికి వయసు పెరుగుతున్న కొద్దీ స్పష్టత వస్తుంది. అయితే ఈ అవగాహన వచ్చిన వెంటనే వారు ఒక తీవ్రమైన అంతర్మథనంలో పడతారు. “దీన్ని ఎలా చెప్పాలి?”, “ఇంట్లో వాళ్లు ఎలా స్పందిస్తారు?”, “బయట సమాజం ఎలా చూస్తుంది?” అనే భయాలు వారిని వెంటాడుతుంటాయి.
తమ లైంగికత లేదా జెండర్ గుర్తింపు గురించి తెలుసుకున్న క్షణం నుంచే చాలామందిలో భయం, దాపరికం, అపరాధ భావన, మరియు ఆందోళన పెరుగుతాయి. ఇంట్లో తెలిస్తే ఎలా స్పందిస్తారు, బయట వాళ్లు వెక్కిరిస్తారా, అవమానిస్తారా అనే భయం నిరంతరం ఉంటుంది. కొన్నిసార్లు తమ గురించి తెలిసినవారు బెదిరిస్తారేమో అనే ఆందోళన కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితులను “స్వీయ ముద్రాభాసం” అని చెప్పవచ్చు. అంటే సమాజం తిరస్కరిస్తుందనే భయాన్ని వ్యక్తి తనలోనే మోస్తూ ఉండటం.
సాధారణంగా ట్రాన్స్ వ్యక్తులు మొదట తమ కుటుంబ సభ్యుల స్పందనను అంచనా వేసేందుకు మెల్లగా సంకేతాలు ఇస్తూ ఉంటారు. తమ ప్రవర్తన, అభిరుచులు లేదా మాటల ద్వారా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో గమనిస్తారు. అయితే చాలా సందర్భాల్లో కుటుంబాల నుంచి అనుకూల స్పందనలు రావడం అరుదుగా కనిపిస్తుంది.
వారి ప్రవర్తన కొనసాగుతూనే ఉంటే కుటుంబ సభ్యులు వారిని ఆపేందుకు ఒత్తిడి చేయడం, తిట్టడం, హింసించడం, కొట్టడం, అవమానించడం వంటి చర్యలకు దిగుతారు. కొందరిని మంత్రగాళ్ల దగ్గరకు తీసుకెళ్లడం, వైద్యుల వద్దకు తీసుకెళ్లడం, బలవంతపు సలహా చికిత్స చేయించడం, కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉంచడం వంటి చర్యలు కూడా సాధారణంగానే కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు బెదిరింపులకు కూడా పాల్పడతారు.
అయితే ట్రాన్స్ సముదాయ సభ్యులతో జరిగిన చర్చలు, పరిశోధనల్లో ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఎక్కువ కుటుంబాల్లో తల్లి కొంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందని, సహజంగానే కొంత అంగీకార వైఖరి చూపుతుందని చాలా మంది తెలిపారు. కానీ తండ్రి మాత్రం ఎక్కువగా కఠిన వైఖరి ప్రదర్శిస్తూ, ఒత్తిడి ద్వారా ఆ ప్రవర్తనను మార్చాలని ప్రయత్నించే అవకాశం అధికంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.
కొందరు ట్రాన్స్ సముదాయ సభ్యులను కుటుంబం స్వీకరించకపోయినా, వారు బయటకు వెళ్లినప్పుడు తమ లైంగికత లేదా జెండర్ వ్యక్తీకరణను తమకు నచ్చిన విధంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. తమకు సహజంగా అనిపించే ప్రవర్తనను, అభిరుచులను, శరీర భాషను బయటపెడతారు. కొందరు స్త్రీల మాదిరిగా తయారవడం, మహిళల దుస్తులు ధరించడం, ఆడపిల్లల తరహాలో మాట్లాడటం, నడవడికలో స్త్రీత్వాన్ని వ్యక్తీకరించడం వంటి మార్పులను స్వేచ్ఛగా అనుభవించాలనుకుంటారు.
ఇలాంటి వ్యక్తీకరణ కారణంగా బయట సమాజం నుంచి వెక్కిరింపులు, అవమానాలు ఎదురైనా కూడా చాలామంది తమకు నచ్చినట్టే జీవించేందుకు ప్రయత్నిస్తారు. అయితే అదే సమయంలో “ఈ విషయం ఇంట్లో వాళ్లకు ఎవరైనా చెబుతారేమో” అనే భయం వారిలో నిరంతరం ఉంటుంది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు తమ వ్యక్తిత్వాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తారు. మహిళల దుస్తులు ధరించడం, అలంకరణ చేసుకోవడం, పూలు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా తమకు నచ్చిన రూపాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే అది వారికి సహజంగా అనిపించే జీవితం. ఆ స్వరూపంలోనే వారు నిజమైన స్వేచ్ఛను అనుభూతి చెందుతారు. ఇప్పుడు కూడా చాలామంది తమకు నచ్చిన ఆ వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పూజకు చిన్నప్పటి నుంచే తన లైంగికత మరియు జెండర్ గుర్తింపు గురించి ఒక స్పష్టత ఉండేది. ఆధిపత్య కులానికి చెందిన కుటుంబంలో అబ్బాయిగా జన్మించిన పూజకు చిన్ననాటి నుంచే అమ్మలాగా తయారవడం, బొట్టు పెట్టుకోవడం, గోళ్లకు రంగు వేసుకోవడం, పెదవులకు రంగు అద్దుకోవడం, అమ్మాయిల మాదిరిగా వంటలు చేయడం, పూజలు చేయడం వంటి విషయాలపై ఆసక్తి ఉండేది. కుటుంబ సభ్యులు మొదట్లో దీనిని పెద్దగా గమనించలేదు.
తరువాత పూజ తనకు సహజంగా అనిపించిన విధంగానే బయట ప్రపంచంలో కూడా ప్రవర్తించడం ప్రారంభించింది. అయితే పాఠశాలలో ఆమె తీవ్ర వివక్ష, వెక్కిరింపులు, హేళనలు ఎదుర్కొంది. ఆ అవమానాలను భరించలేక చివరకు చదువు కూడా మానేసి బయట తిరగడం మొదలుపెట్టింది.
యుక్తవయసుకు వచ్చిన తరువాత పూజ హిజ్రా సముదాయంతో దగ్గరైంది. అక్కడి వారితో కలిసి భిక్షాటన చేయడం, అనంతరం లైంగిక వృత్తిలోకి ప్రవేశించడం ప్రారంభించింది. ఇదే సమయంలో ఇంట్లో మాత్రం ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. “నీకు పెళ్లి జరిగితేనే నీ తమ్ముడికి పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఈ ఆస్తిలో నీకు భాగం ఉండదు” అంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. ఆస్తి కోల్పోతాననే భయం, కుటుంబం నుంచి పూర్తిగా దూరమైపోతాననే ఆందోళనతో పూజ చివరకు ఒక అమ్మాయిని వివాహం చేసుకుంది.
అయితే సామాజిక కార్యకర్తలతో, తనతో పనిచేసే స్నేహితులతో పూజ తన అంతర్మథనాన్ని పంచుకుంది. “నేను పూజకు పనికిరాని పుష్పానని నాకు చాలా కాలం నుంచే తెలుసు. కానీ కుటుంబ ఒత్తిడి వల్ల ఈ వివాహం చేసుకోవాల్సి వచ్చింది” అని ఆమె చెప్పేది.
పెద్దవాళ్లలో ఒక అపనమ్మకం కూడా బలంగా కనిపించింది. “హిజ్రా వాళ్లతో తిరగడం వల్లే ఇటువంటి అలవాట్లు వచ్చాయి. పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుపోతాయి” అనే నమ్మకంతో కుటుంబం బలవంతంగా వివాహం జరిపించింది. కానీ పూజకు తన లైంగికత గురించి ముందే స్పష్టత ఉండేది. ఒక పురుషుని పాత్రను తాను కొనసాగించలేనని, కుటుంబ వ్యవస్థలో ఆ విధంగా జీవించడం తన వల్ల కాదని ఆమెకు తెలుసు.
అందుకే పూజ తన భార్యతో చాలా నిజాయితీగా తన లైంగికత గురించి చెప్పింది. అయితే ఆ విషయం తెలుసుకున్న భార్య తీవ్ర ఆవేదనకు గురై, “నన్ను మోసం చేశావు” అంటూ ఇంటిని వదిలి వెళ్లిపోయి విడాకులు కోరింది. ఆ తరువాత పూజ ఎన్నో సంవత్సరాలు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరకు “ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు” అనే ముద్రతో పాటు, పదిలక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పూజ తన వృద్ధ తల్లిని చూసుకుంటూ జీవిస్తోంది.
జరీనా ఒక మైనారిటీ కుటుంబానికి చెందిన సాధారణ ట్రాన్స్ మహిళ. అబ్బాయిగా జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచే తన లైంగికత మరియు జెండర్ గుర్తింపు గురించి ఆమెకు స్పష్టమైన అవగాహన ఉండేది. “నేను భిన్నమైన వ్యక్తిని” అనే భావన ఆమెకు చిన్ననాటి నుంచే ఉండేది. తనలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూ, అలాంటి సముదాయ సభ్యులను కలవాలని ప్రయత్నించేది. అయితే జరీనా కుటుంబం చాలా సంప్రదాయపరమైనది కావడంతో ఆమె లైంగికతను ఎప్పుడూ స్వీకరించలేదు. కుటుంబ సభ్యులు తరచూ ఆమెను కొట్టడం, వేధించడం చేసేవారు. కొన్నిసార్లు తీవ్రంగా కొట్టడం వల్ల రక్తం వచ్చే పరిస్థితులు కూడా ఎదురయ్యేవి.
ఈ ఒత్తిడుల మధ్య కూడా జరీనా దొంగచాటుగా హిజ్రా సముదాయ సభ్యులతో కలిసేది. వారితో కలిసి భిక్షాటన చేయడం, తనకు నచ్చిన పురుషులతో భావోద్వేగ సంబంధాలు ఏర్పరుచుకోవడం, ప్రేమను అనుభవించడం, చీరలు కట్టుకోవడం, గాజులు వేసుకోవడం వంటి తనకు సహజంగా అనిపించే జీవనశైలిని ఆస్వాదించేది.
ఇంట్లో వాళ్లు ఈ విషయాలను గమనించిన తరువాత వేధింపులు మరింత పెరిగాయి. ఆ పరిస్థితులను భరించలేక ఒకరోజు జరీనా ముంబైకి పారిపోయింది. కొంతకాలం తరువాత తిరిగి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు బలవంతంగా ఆమెకు పెళ్లి చేశారు. కుటుంబ ఒత్తిడికి లోనై జరీనా భార్యతో కలిసి జీవించింది. ఆ దాంపత్యంలో ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే కాలక్రమేణా జరీనా తీవ్రమైన అంతర్మథనానికి గురైంది. “నా లైంగికత ఒకటి, నేను జీవిస్తున్న జీవితం మరోటి” అనే భావన ఆమెను మరింత కలవరపరిచింది. చివరకు మళ్లీ ముంబైకి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకొని పూర్తిగా ట్రాన్స్ మహిళగా జీవించడం ప్రారంభించింది.
తరువాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చినప్పుడు భార్యకు నష్టపరిహారం రూపంలో పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. జరీనా మాటల్లో, “నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకుని ఉండి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. నా జీవితమూ ఇలా అయ్యేది కాదు, నా భార్య జీవితమూ ఇలా దెబ్బతినేది కాదు” అనే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.
హిజ్రా సముదాయంలో ఆమె ఒక నాయకురాలిగా, గౌరవనీయ స్థాయిలో ఉన్నప్పటికీ, “ఒక అమ్మాయి జీవితాన్ని నేను పాడు చేశాను. నా పిల్లలకు అన్యాయం జరిగింది” అనే ఆవేదన ఆమె మనసులో ఎప్పటికీ మిగిలిపోయింది.
అలీ ఎంతో అందమైన యువకుడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పెరిగిన అతనికి చిన్నప్పటి నుంచే “నేను మగపిల్లవాడిని కాదు, ఆడపిల్లను” అనే గట్టి భావన ఉండేది. ఆడపిల్లల మాదిరిగా ఉండాలని, అలాగే ప్రవర్తించాలని అతనికి అనిపించేది. అయితే ఈ భావాలను బయటపడనీయకుండా చాలా జాగ్రత్తగా జీవించేవాడు. తల్లిదండ్రులకు తన లైంగికత తెలియకుండా చూసుకోవడం, స్నేహితుల దగ్గర తన వ్యక్తిత్వాన్ని దాచుకోవడం, బయట మాత్రం ఒక బాలుడిలా ప్రవర్తించడం వంటి విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండేవాడు.
ఈ జాగ్రత్తల వల్లే అలీ తన చదువును కొనసాగించగలిగాడు. పాఠశాల విద్య పూర్తి చేసి, తర్వాత కళాశాలలో కూడా చదివి మంచి అర్హతలు సంపాదించాడు. అయితే మరోవైపు అతను తనలాంటి సముదాయ సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ, వారితో కలిసి జీవన అనుభవాలు నేర్చుకుంటూ ఉండేవాడు. కొన్నిసార్లు భిక్షాటన చేయడం, లైంగిక వృత్తి చేయడం ద్వారా జీవనం సాగించేవాడు.
ఇంట్లో మాత్రం తన లైంగికత గురించి ఎవరికి తెలియనివ్వలేదు. వారి కుటుంబం చాలా సంప్రదాయపరమైనది. ట్రాన్స్ మహిళగా జీవించడం తమ మత విశ్వాసాలకు విరుద్ధమని, పాపంగా భావించే వాతావరణం ఉండటం వల్ల అలీ తన నిజమైన వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పలేకపోయాడు.
కాలక్రమేణా అతనికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే వివాహానంతరం కూడా అలీ తన సముదాయంతో సంబంధాలను కొనసాగించేవాడు. మధ్య మధ్యలో సహచరులను కలవడం, భిక్షాటన చేయడం, లైంగిక వృత్తిలో పాల్గొనడం కొనసాగుతూనే ఉండేది. అదే సమయంలో తన భార్యతో ప్రేమగా జీవించేందుకు కూడా ప్రయత్నించేవాడు. ఆమెకు అన్యాయం చేయకూడదనే భావనతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేవాడు.
తనకు నచ్చిన పురుషులతో బయట సంబంధాలు కొనసాగించడం కూడా అతని జీవితంలో భాగంగా ఉండేది. అనంతరం ఒక స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే కాలక్రమేణా అతని నడవడికలో వచ్చిన మార్పులు భార్యకు అనుమానం కలిగించాయి. మీసాలు, గడ్డం లేకపోవడం, కనుబొమ్మలు దిద్దుకోవడం, గోళ్లకు రంగు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం వంటి విషయాలు ఆమె దృష్టికి వచ్చాయి.
చివరకు “నా కన్నా నన్ను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు” అనే భావనతో అలీ తన భార్యకు నిజం చెప్పేశాడు. “నీకు అన్యాయం చేయను. నేను నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా జీవిస్తాను. నీకు దక్కాల్సిన ప్రేమను, పిల్లలకు కావాల్సిన బాధ్యతలను నేను చూసుకుంటాను. నన్ను మాత్రం అర్థం చేసుకో” అని ఆమెను ఒప్పించాడు.
ఆ తరువాత అలీ బయట సమాజంలో ఒక హిజ్రాగా జీవిస్తూ, ఇంట్లో మాత్రం ఒక తండ్రిగా తన బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. వారి పిల్లలకు కూడా తన లైంగికత గురించి తెలుసు. వారు సరదాగా “మా ఇంట్లో ఇద్దరు అమ్మలు ఉన్నారు” అని నవ్వుకుంటూ చెప్పడం అలీ కుటుంబ జీవితం ఎంత విభిన్నంగా, అదే సమయంలో అనుబంధాలతో నిండిపోయిందో తెలియజేస్తుంది.
ఈ కథనాలన్నింటినీ పరిశీలించినప్పుడు మన సమాజంలో ఇప్పటికీ “స్త్రీ” మరియు “పురుషుడు” అనే రెండు లింగాలే సహజమైనవి, దానికి మించి మరే వ్యక్తిత్వం లేదనే ఒక గట్టి సామాజిక మూస కొనసాగుతుందనే విషయం స్పష్టమవుతుంది.
చారిత్రాత్మక కాలం నుంచే లైంగికత, జెండర్ వైవిధ్యం, భిన్న వ్యక్తిత్వాల గురించి ఎన్నో చర్చలు, ఉదాహరణలు, కథనాలు ఉన్నప్పటికీ, వాటిని సహజంగా అంగీకరించడానికి సమాజం ఇప్పటికీ పెద్దగా సిద్ధంగా కనిపించదు. లైంగికతపై పనిచేసే సామాజిక కార్యకర్తలను కూడా “మీ పిల్లలు ఇలా ఉంటే ఒప్పుకుంటారా?” అని ప్రశ్నించడం చాలా సాధారణంగా కనిపించే ప్రతిస్పందన.
లైంగికతను అర్థం చేసుకోవడం అనేది కేవలం వ్యక్తిగత అంశం మాత్రమే కాదు; అది సమాజం నిర్మించిన విలువలు, మత విశ్వాసాలు, కుటుంబ వ్యవస్థలు, మరియు సామాజిక అంచనాలతో ముడిపడి ఉంటుంది. చాలా కాలంగా సినిమాలు, టెలివిజన్, ప్రజామాధ్యమాలు క్వియర్ వ్యక్తులను హేళనకు గురిచేసే విధంగానో, లేదా “అసహజం”, “సమాజానికి వ్యతిరేకం” అనే కోణంలోనో చూపించాయి. ఫలితంగా సమాజంలో కూడా అదే దృక్పథం బలపడింది.
మన కుటుంబ వ్యవస్థల్లో “మగవాడి పాత్ర”ను పెళ్లి చేసుకోవడం, కుటుంబాన్ని నడపడం, పిల్లలను కనడం, వంశాన్ని కొనసాగించడం వంటి బాధ్యతలతో మాత్రమే కట్టిపడేస్తారు. అందుకే ఒక వ్యక్తి తన లైంగికత లేదా జెండర్ గుర్తింపును భిన్నంగా వ్యక్తపరిస్తే, కుటుంబాలు దాన్ని సులభంగా స్వీకరించలేకపోతున్నాయి. ఇది కేవలం చదువులేని కుటుంబాల్లోనే కాదు; చదువుకున్న కుటుంబాల్లో కూడా కనిపించే సమస్య. కారణం చాలా సందర్భాల్లో అవగాహన లోపం, సమాజం ఏమనుకుంటుందనే భయం, “మన పేరు చెడిపోతుంది” అనే ఆందోళన. “వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు?”, “నలుగురు ఏమంటారు?” అనే ప్రశ్నలు కుటుంబాల ఆలోచనల్లో ప్రధానంగా ఉంటాయి.
క్వియర్ సముదాయానికి చెందిన అనేక మంది తమ అనుభవాలను పంచుకుంటూ చెప్పిన విషయాలు కూడా ఇదే వాస్తవాన్ని తెలియజేస్తాయి. “మీ అన్న ఎందుకు ఆడపిల్లలలా నడుస్తున్నాడు?”, “మీ తమ్ముడు ఎందుకు గోళ్లకు రంగు వేసుకున్నాడు?”, “మీ అక్క ఎందుకు మగవాళ్ల బట్టలు వేసుకుంటుంది?” వంటి వ్యాఖ్యలు, హేళనలు, అపవాదులు వారి కుటుంబాలపైనా ప్రభావం చూపిస్తాయి. ఈ భయాల కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచే “సరిచేయాలని” ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు హింస, మానసిక వేధింపులు, బలవంతపు చికిత్సలు, విద్యుత్ షాక్ చికిత్సలు వంటి తీవ్రమైన చర్యలకు కూడా దిగుతారు.
కుటుంబంలోనే అంగీకారం లేని పరిస్థితిలో, బంధువులు, స్నేహితులు, విద్యాసంస్థలు,
ఉద్యోగ సంస్థలు వంటి విస్తృత సామాజిక వర్గాలు వారిని ఎలా అర్థం చేసుకుంటాయనేది మరింత క్లిష్టమైన ప్రశ్నగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం అవగాహన లోపమే. ఎందుకంటే క్వియర్ సముదాయాలు కొత్తగా ఏర్పడినవి కావు; శతాబ్దాలుగా, వేల ఏళ్లుగా సమాజంలో భాగంగానే ఉన్నాయి. అయినప్పటికీ వారిని “అసహజం”, “అసాధారణం” అంటూ ముద్ర వేయడం, వివక్ష చూపించడం అనేక జీవితాలను తీవ్రంగా దెబ్బతీసింది.
అయితే మరోవైపు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల లైంగికతను అంగీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది వారికి ఎక్కువ అవగాహన ఉండటమా? పిల్లల పట్ల ప్రేమ, సానుభూతి కారణమా? లేక ఇంకొకరి జీవితాన్ని బలవంతపు వివాహాలతో నాశనం చేయకూడదనే పరిపక్వతా? అనేది వ్యక్తి వ్యక్తికి మారుతుంది.
ఈ కథనాలను పరిశీలిస్తే ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకు వస్తుంది – ఇందులో తప్పు ఎవరిది? తమ సహజ వ్యక్తిత్వంతో జీవించాలనుకునే వ్యక్తిదా? వారిని అర్థం చేసుకోలేని కుటుంబాలదా? లేక భిన్నత్వాన్ని అంగీకరించని సమాజ నిర్మాణాలదా?
ఇక్కడ అనేక మంది తమను తాము దాచుకుని “సర్దుకుపోతూ” జీవించాల్సి వచ్చింది. కొందరు బలవంతపు వివాహాల్లో ఇరుక్కుపోయారు. కొందరి జీవిత భాగస్వాములు మోసపోయిన భావనతో బాధపడ్డారు. మరికొందరు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని దాచుకుంటూ మానసిక వేదన అనుభవించారు. ఈ పరిస్థితుల్లో అన్యాయం ఒక్కరికే జరగలేదు; వ్యక్తులకు, వారి భాగస్వాములకు, కుటుంబాలకు అందరికీ వివిధ రూపాల్లో నష్టం జరిగింది.
అందువల్ల ఈ ప్రశ్నకు ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిగా చూపించడం సరైన సమాధానం కాదు. అసలు సమస్య వ్యక్తుల్లో కాదు; భిన్నత్వాన్ని అర్థం చేసుకోలేని సామాజిక నిర్మాణాల్లో, అవగాహన లోపంలో, మరియు “సహజం” అనే భావనను ఒకే రూపంలో పరిమితం చేసిన సామాజిక దృక్పథంలో ఉంది.

Share
This entry was posted in ప్రతిబింబం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.