ఇజ్రాయెల్ నరమేధ సాక్ష్యాధార సేకరణ కర్తలు: బిసాన్ అవడా, ఫ్రాన్సెస్కా ఆల్బనీస్ – ఎ. సునీత

ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమయిన ప్రచార హోరుతో తాను నడిపే ఆఖరి తెల్ల జాత్యహంకార రాజ్యాన్ని, తన తరగని వలసవాద భూ కాంక్షని, తాను తక్కువ జాతిగా భావించే అరబ్బులపై జరిపే రోజు వారీ మరణ కాండలని, చుట్టుపక్కలుండే దేశాల్లోని ఆయా ప్రాంతాల అక్రమణని సమర్ధించుకోవటమే కాకుండా, అందరినీ ఏడు దశాబ్దాల పాటు ఒప్పించిన యూదు రాజ్యం ఇజ్రాయెల్.

విపరీతమయిన డబ్బు, పరపతి, తెల్లజాతి అహంకారం రంగరించి పశ్చిమాసియాలో శాంతి లేకుండా చెయ్యటమే కాకుండా, తనకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని నయానా భయానా నోరు మూయించే ఆధిపత్యం చెలాయిస్తూ తనని తాను ఒక బాధితుడిగా చెప్పుకునే జిత్తులమారి దేశం కూడా. 1948లో జరిపిన నకబాలో ఏడున్నర లక్షల మంది పాలస్తీనాలో శతాబ్దాల తరబడి జీవించిన ముస్లింలు, క్రిస్టియన్లని వెళ్ళగొట్టటమే కాకుండా, ఏడు దశాబ్దాలుగా నిరంతర అభద్రతతో వందలాది మేధావులు, కవులు, శాస్త్రజ్ఞులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో సహా వేలాది మంది పాలస్తీనియన్, అరబ్బు, పర్షియన్ ప్రజలని పొట్టన పెట్టుకున్న దేశం ఇది. తన అహం కోసం ఒక ప్రజ, వారి సంస్కృతి, చరిత్రని నిర్మూలించి, జీవించటానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలని కూడా, అంతర్జాతీయ చట్టాలని పట్టించుకోకుండా, పధ్ధతి ప్రకారం నాశనం చేసిన దేశం. 2025లో హమాస్‌తో కాల్పుల విరామం తర్వాత కూడా, అన్నీ నాశనం అయిపోయిన ప్రాంతాన్ని వదలని గాజాలో వున్న పాలస్తీనీయుల్ని ఎల్లో లైన్ పేరుతో ఇంకా ఇంకా చిన్న ప్రాంతంలోకి కుదించి నెమ్మదిగా చంపుతూ వస్తున్న దేశం ఇది.
ఇదంతా బయటి వారికి ఎలా తెలియాలి? ఇజ్రాయెల్ 2023 నుండి విలేఖరులని గురి చూసి చంపూతూ, అన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలని బహిష్కరిస్తూ రావడంతో స్థానిక యువతీ యువకులే విలేఖరులుగా మారుతూ వచ్చారు. అటువంటి విలేఖరే బిసాన్ అవడా. 21 ఏళ్ల వయసులో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి దగ్గర జరుగుతున్న దాడులలో అతలాకుతలమయిన ప్రజల జీవితాల గురించి ఫోన్ ద్వారా బయటి ప్రపంచానికి చెప్పటం ప్రారంభించిన బిసాన్ టిక్ టాక్ ద్వారా ప్రపంచానికి పరిచయమయింది. ఇజ్రాయెల్ ఆమెతో సహా 15 లక్షల మంది ప్రజలని గాజాలో ఒక చివరి నుండి మరొక చివరికి ‘మీ రక్షణ కోసమే వెళ్లిపోండి’ అని తరుముతూ బాంబులు వేస్తున్నప్పుడు, ‘విజార్డ్ బిసాన్, ఇంకా బ్రతికే వున్నాను’ అని టాగ్ లైన్ పెట్టుకుంది. రోజు వారీ దాడుల్లో, టెంటుల్లో, బ్రతకటం ఎంత నరకమో, మౌలిక అవసరాలు లేకుండా, తిండి లేకుండా ఎట్లా తనతో సహా ఎంత మంది బ్రతుకు తున్నారో అక్కడి జీవితాలని ప్రసారం చేసింది. కొ యుద్ధంలో విరామం దొరికినప్పుడు తన అమ్మమ్మ స్థానిక ఆకులతో చేసే కూరలతో చేసే వంటల గురించి చెప్పింది. https://www.instagram.com/wizard_bisan1/?hlRen. ప్రతిరోజూ ఆమెని ఫాలో అయే వాళ్ళు ఆమె ఎప్పుడన్నా పెట్టకపోతే ఆమె బ్రతికుందా లేదా అని ఆందోళన పడే స్థితికి వచ్చారు.
బిసాన్ తన వీడియోలతో బయట ఇజ్రాయెల్ జరిపే ప్రచారానికి చిల్లులు పొడిచింది. తాము ప్రజలకి వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇచ్చిన తర్వాతే బాంబులు వేస్తున్నామని చెప్పిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రచారం ఎంత అసహ్యమయిందో అలా సామానంతా బండి మీద వేసుకుని వెళ్తున్న – చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు, ప్రజలని చూపిస్తూ – చెప్పింది. ఆస్పత్రుల్లో గాయపడిన తమ దగ్గరి వాళ్ళ కోసం తిండీ, తిప్పలు లేకుండా బాంబుల భయంతో వేచి వున్న వాళ్ళని చూపించింది. గాజాలోకి తిండి, మందులు, సామాన్లు రాకుండా ఇజ్రాయెల్ ఆపినప్పుడు తిండి లేకుండా ఆ రోజు ఒక బిస్కట్ మాత్రమే దొరికిందని, అరుదుగా తన కిష్టమయినవి దొరికినపుడు చిన్న పిల్లలా దాని మీద ఫోకస్ చేసి అది ఎంత విలువయిందో చెప్పింది. ఎన్నోసార్లు చావు అంచుల్లో ఉన్నట్లు ఆమె వీడియోలు చూసినప్పుడు అర్ధమయ్యేది. ఏం జరిగినా సరే తానూ గాజాని వదిలి వెళ్లనని, తన ప్రజలతోనే ఉంటానని ప్రకటించింది.
అంతర్లీన తెల్ల జాత్యహంకార భావజాలంతో పనిచేసే పాశ్చాత్య మీడియా ఇజ్రాయెల్‌లో వలస సెటిలర్ల ప్రాణాలకి ఇచ్చిన విలువలో లక్షో వంతయినా పాలస్తీనా ప్రజలకి, వారి జీవితాలకి, వారి మీద జరిగిన మారణహోమాలు, నరమేధాలకు ఇవ్వలేదు. దాడుల్లో చనిపోయిన వారి లెఖ్ఖలు, ఇజ్రాయెల్ బాంబుల్లో నాశనం అయిన ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, స్కూళ్ళు, ఇల్లు అన్నింటి గురించీ ఇజ్రాయెల్ ఏం రాయమంటే అదే రాసింది. ఈ నేపథ్యంలో బిసాన్ వంటి పాలస్తీనా విలేఖరులు పోషించిన పాత్ర విలువ కట్టలేనిది. తామేం ఎదుర్కుంటున్నామో ఆ పరిస్థితుల గురించి తమ గొంతులోనే బిసాన్ చెప్పటమే కాక, ఆ క్రమంలో బిసాన్ పాలస్తీనా స్త్రీల గురించి ప్రచారంలో వున్న అనేక మూస ఆలోచనల్ని – చదువు లేకుండా, హమాస్ అధీనంలో, మత పరమైన అణచివేతలో ఆయా స్త్రీలు మగ్గుతూ వుంటారనే – కూడా చెదరగొడుతోంది. బయటి దేశాల్లో కాకుండా, గాజా అనే కాన్సంట్రేషన్ క్యాంపులో పెరిగి, చదువుకుని, తన జాతి సంఘర్షణ గురించి, నరమేధం మధ్యలో, ప్రపంచం కనీవినీ ఎరుగని జయానిస్ట్ ప్రచారం ఎదుర్కుంటూ, పాడి, మాట్లాడి, కవిత్వం రాసి, సిద్ధాంతీకరిస్తున్న పాలస్తీనా స్త్రీలకి ఒక ప్రతినిధి బిసాన్.
బిసాన్ గాజా లోపలి నుండి పాలస్తీనీయుల బాధల గురించి ప్రపంచానికి తెలియ చేస్తుంటే, ఆక్రమిత పాలస్తీనాకి ఐక్యరాజ్య సమితి తరఫున మానవ హక్కుల ప్రతినిధిగా వున్న ఫ్రాన్సెస్కా అల్బానీసీ ఇజ్రాయెల్ చేస్తున్న ఏకపక్ష దాడులు అంతర్జాతీయ చట్టాలని పధ్ధతి ప్రకారం ఉల్లంఘిస్తున్నాయని 2023 నుండి మూడు రిపోర్టులు బయటకి తెచ్చారు. ఇటలీకి చెందిన ప్రాసెస్కే అల్బానీసిని ఇజ్రాయెల్ గాజాలోకి రానియ్యలేదు. ఆమెని యూదు వ్యతిరేకిగా తీవ్రమైన ప్రచారం చేసింది. తన పలుకుబడితో ఆమెని దేశదేశాల్లో వెంబడించి కొన్ని చోట్లకి రానియ్యలేదు. దేశాధినేతలు మాట్లాడటానికి భయపడుతున్న సందర్భంలో అల్బానీసి తన కున్న వనరులన్నీ వుపయోగించి నరమేధం గురించి ప్రపంచానికి నిరంతరంగా చెప్తూ వస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా అమెరికా దేశం ఈవిడని ప్రపంచ ఆర్ధికం నుండి వెలివేసి ఆమె కదలికల్ని నియంత్రించే ప్రయత్నం చేసింది.
1967లో పాలస్తీనీయుల పరిస్థితిని తట్టుకోలేని అరబ్బు దేశాలన్నీ యుద్ధానికి దిగినప్పుడు ఆ యుద్ధంలో గెలిచిన ఇజ్రాయెల్ పాలస్తీనా వాసులు నివసించే ప్రాంతాల్లోంచి తరిమేసి వారందరినీ ఒక మూల గాజాలో, రెండో ప్రాంతం వెస్ట్ బ్యాంకుకి పరిమితం చేసి వారిద్దరూ కలవకుండా ఉండేటట్లు చేసింది. గాజా చుట్టూ గోడలు కట్టి, సెక్యూరిటీ విపరీతం చేసి ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్లాలన్నా, పోవాలన్నా తన నియంత్రణలో జరిగేటట్లు చేసింది. వెస్ట్ బ్యాంకులో అరబ్బులు వుండే ప్రాంతాన్ని, ఇతరుల నుండి వేరు చేసి వేరు రోడ్లు, గోడలు, చెక్ పాయింట్లు పెట్టింది. ఈ చెక్ పాయింట్లు వుండే ప్రాంతం నుండే మన దేశం నుండి పవిత్ర స్థల తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణీకులు చూసేది. వీరెవ్వరూ చెక్ పాయింట్ల బయట ప్రాంతాన్ని సందర్శించలేరు.
ఈ రెంటినీ ఐక్యరాజ్య సమితి ‘ఆక్రమిత ప్రాంతాల’ క్రింద ప్రకటించి వాటిని చూసుకునేటందుకు UNWRA (యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్) స్థాపించింది. దీని ద్వారానే గాజాలోకి ప్రజలకి కావాల్సిన – మందులు, మెషీన్లు, ఆహారం – అన్ని సామాన్లు, వనరులూ వెళతాయి. అనేక స్కూళ్ళు, ఆస్పత్రులు ఈ వున్రా కిందే నడుస్తాయి. ఉపాధి కూడా దీని ద్వారానే లభిస్తుంది. 2007లో ఎన్నికల్లో హమాస్ గెలిచిన తర్వాత నీళ్లు, కరెంటు, డ్రైనేజి, ఫయిర్ సర్వీస్, ఆరోగ్యం వంటివి, అంతర్గత పోలీసింగ్ చూసుకుంటూ వచ్చింది కానీ ఇజ్రాయెల్ ఆర్ధిక నిర్బంధం వున్రా బయట ఏ ఆర్ధికం లేకుండా పోయింది. 98% చదువుకున్న వాళ్ళు, అనేక యూనివర్సిటీలు స్థాపించుకున్నా, ఉద్యోగాలకి మాత్రం వేరే దేశాలకి వెళ్లాల్సిందే. గోతికాడ నక్కలా, ఎంత మంది పాలస్తీనా వాసులు బయటికెళితే, వాళ్ళని రాకుండా చెయ్యటానికి ఇజ్రాయెల్ పెట్టె నిబంధనల వలన బయటికి వెళితే తిరిగి రావటానికి అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నిర్బంధ శిబిరంగా మారిన గాజా నుండే హమాస్ ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా అక్టోబర్ 7న గెరిల్లా దాడులు చేసింది.
దీని తర్వాత ఇజ్రాయెల్ చేసిన ప్రచార హోరులో అందరూ సాగుతున్న నిర్బంధాన్ని, ఇజ్రాయెల్ చేస్తూ వచ్చిన టెర్రరిజాన్ని మర్చిపోయి హమాస్ని, పాలస్తీనీయుల్ని తిడుతున్న సమయంలో, 2022లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితి తరఫున ఆక్రమిత పాలస్తీనా మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన ఫ్రాన్సెస్కా ఆల్బనీస్. సంయమనం కోల్పోకుండా, హమాస్ జరిపిన దాడుల్ని ఖండిస్తూ, ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతి దాడులని ఆపాలని కోరారు. జరుగుతోంది యుద్ధం కాదని, నరమేధం అని వర్ణించిన వారిలో ఆవిడ ఒకరు. 2024 నుండి 2026 మధ్య మూడు అత్యంత కీలకమైన నివేదికలు తీసుకువచ్చారు.
వీటిలో మొదటిది వలస ప్రజలని తుడిచిపెడుతున్న నరమేధం https://docs.un.org/en/A/79/384 (2024) ఈ నివేదిక ఆత్మ రక్షణ కోసం, యూదు ప్రజల్ని నరమేధం నుండి కాపాడటానికి తాము క్రూరులయిన పాలెస్తీనీయుల మీద దాడులు చేస్తున్నాం అనే ఇజ్రాయెల్ వాదనని పూర్వపక్షం చేస్తూ దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ని ఒక వలస రాజ్యంగా చూపెడుతుంది. తన విధానాలతో తమ అధీనంలో వుండే పాలిత పాలెస్తీనియన్లని వ్యవస్తీకృతంగా విస్థాపన చేసి, వాళ్ళుండే చోటుని, ఇళ్ళని, సాగు భూముల్ని, ఆలివ్ తోటల్ని బలవంతంగా లాక్కుని, దానిపై యూదు నివాసాలు ఏర్పర్చుకుంటూ వచ్చారని సాక్ష్యాలతో సహా చెప్తుంది. గాజాలో మాత్రమే కాక, హమాస్ ఊసే లేని వెస్ట్ బ్యాంకులో కూడా ఇది జరుగుతూనే ఉందనీ, ఇది ఒక వలస సెటిలర్ రాజ్యమని వాదిస్తుంది. శతాబ్దాల తరబడి ఐరోపా రాజ్యాల వ్యక్తులు వివిధ ఖండాలకి వలస వెళ్లి అక్కడ బంగారం, వెండి, అనేక ఇతర ఖనిజాలు, వనరుల కోసం మారణ హోమాలు చేసినట్లే పశ్చిమాసియాలో సెటిల్ అయిన తెల్లజాతి యూదుల రాజ్యమయిన ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా అరబ్బు ప్రజలపై 75 ఏళ్లుగా హింస జరుపుతోందని చెప్పింది.
మన ఉపఖండంలో అమలయిన వలస వాదం దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో కంటే భిన్నమైంది. వలసవాదం మొదలయిన దక్షిణ అమెరికాలో ఐరోపా రాజ్యాలు (పోర్చుగల్, స్పెయిన్ రాచరిక వ్యవస్థలోని వ్యాపారులు) ఇంకా, అజ్టెక్, మాయ, మాపూచె, వారి, తివాన్కు వంటి వర్ధిల్లుతున్న నాగరికతలని తమ దాడులు, ఆక్రమణలో ఓడించి వెట్టి చాకిరీ, బానిసత్వం, బలవంతపు శ్రమ వంటి అనేక పద్ధతుల ద్వారా తుడిచిపెట్టేసారు. బంగారం, వెండి గనుల్లో, వ్యవసాయం, ఇతర శ్రమల్లో వీళ్ళ కర్కశత్వం వల్ల 200 ఏళ్ళల్లో దాదాపు 6 కోట్ల ప్రజలు మరణించారు. అప్పటి వరకూ శతాబ్దాల పాటు వర్ధిల్లిన నాగరికతలు, వాటి సంస్కృతి, శాస్త్రీయ జ్ఞానం, సమాజ పద్ధతులు అన్నీ మట్టికొట్టుకు పోయి, మిగిలిన స్థానిక అమెరికన్ ప్రజలు కేవలం వ్యవసాయ శ్రమ చేసుకునే ప్రజలుగా మిగిలిపోయారు. ఇదే పధ్ధతి ఇజ్రాయెల్ కూడా అమలు చేస్తోందని అల్బానీస్ చూపిస్తారు. 3500 ఏళ్లకు పైగా ఆ ప్రాంతంలో జీవించి, ఎన్నో సామ్రాజ్యాలని ఎదుర్కొని, ఎన్నో మతాలకి పుట్టినిల్లుగా వుంది, ఎన్నో విలువయిన రచనలకి అలవంగా వుంది, అక్కడి వాతావరణ పరిస్థితులకి, నీళ్ల సదుపాయాలకు, ఎండలకు, చలికి అనుకూలంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆలివ్ తోటలు, ఆకుకూరలు, ఇతర పంటలు పండించుకున్న ప్రజలు వీళ్ళు. గ్రీకు క్లాస్సిసిస్ట్ మేరీ బియర్డ్ ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా గాజాని గ్రీకు, లాటిన్ రచనలకి ఒక ప్రధాన కేంద్రంగా చెప్తారు. ఇటువంటి సంస్కృతి వున్న ప్రజలని ‘చదువు సంధ్యల్లేని అరబ్బులుగా’ చిత్రించటమే కాకుండా వాళ్ళని ఆ స్థాయికి నిరంతరంగా దిగజార్చటానికి వారి జీవన సదుపాయాలని, సామాజిక వ్యవస్థల్ని సర్వ నాశనం చేసింది ఇజ్రాయెల్ చర్యలే. ఆ జీవన విధానం చోటులో తమకి ఐరోపాలో అలవాటయిన చెట్లని – అక్కడి వాతావరణంలో పెరగని పైన్ చెట్ల వంటివి – వేసుకుని ఐరోపా తెల్ల జాతి వాళ్ళు దక్షిణ అమెరికాలో స్థానికులని నిర్మూలించి నాట్లు గానే, ఇజ్రాయెల్ స్థానిక పాలెస్తీనీయులని కూడా నిర్మూలిస్తోంది.
2025లో తెచ్చిన నివేదిక – ఆక్రమణ ఆర్ధికం నుండి నరమేధ ఆర్ధికం వరకూ – https://www.ohchr.org/en/documents/country-reports/ahrc5923-economy-occupation-economy-genocide-report-special-rapporteur – పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ జరిపే వ్యవస్థీకృత విస్థాపన, మారణకాండల్లో దానికి సహకరించి, అక్కడ వలస సెటిల్మెంట్స్‌లో, పాలస్తీనీయుల మీద ఉపయోగించే ఆయుధాల తయారీ కంపెనీల్లో మదుపు పెట్టి లాభాలు ఆర్జించే దేశాలు, లేదా తమ టెక్ కంపెనీల దగ్గర వుండే కస్టమర్ డేటాని ఇజ్రాయెల్‌కి ఇచ్చేసి టార్గెట్ చేసి చంపే అవకాశం కల్పించటం, పాలస్తీనీయుల నివాసాలని, మౌలిక సదుపాయాలని కూల్చెయ్యటానికి ఉపయోగిచే బుల్ డోజర్లు సరఫరా చేసే వివిధ రకాల అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల గురించి చర్చించి, అవి మానవ హక్కుల ఉల్లంఘనల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయని చెప్తుంది. ఆవిడ పేర్కొన్న టెక్ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం, హెచ్ పి, హుండాయ్, వోల్వోతో సహా 45 కార్పొరేట్ కంపెనీలు వున్నాయి. ఇజ్రాయెల్‌కి చమురు, గ్యాస్, వ్యవసాయ ఉత్పత్తులు సప్లై చేసే కంపెనీలు, సెటిల్‌మెంట్స్‌లో పనిచేసే రియల్ ఎస్టేట్ కంపెనీలు, పాలెస్తీనీయులని తరిమేసి భూముల్లో ఇజ్రాయెల్ పండించిన వస్తువుల్ని అమ్మి పెట్టె వ్యవసాయ బిజినెస్ కంపెనీలు, ఇవన్నింటి గురించి పబ్లిక్ కాల్ ఇచ్చి, సాక్ష్యాలతో కూడిన సమాచారం 200 మంది సమర్పించిన ద్వారా సేకరించి కూర్చిన రిపోర్టు ఇది.
రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ చేసిన నరమేధంలో నాజీ ప్రభుత్వంతో సహకరించిన కంపెనీలని ఓడిపోయిన తర్వాత విచారించటం జరిగిందని అంటూ, కొర్పోరేట్ కంపెనీలకి, ఆయా కంపెనీల్లో మదుపు పెట్టిన యూనివర్సిటీ యాజమాన్యాలకు కూడా అంతర్జాతీయ చట్టాలు వర్తిస్తాయని ఈ నివేదిక ఎత్తి చూపుతుంది. లాభాల ఆర్జనలో అంతర్జాతీయ చట్టాలని ధిక్కరించి ఇజ్రాయెల్ జరుపుతున్న వినాశనం, హత్యలు, మౌలిక సదుపాయాల ధ్వంసం చెయ్యటం, నరమేధంలో పాలు పంచుకున్నట్లేనని, వారు కూడా ఇజ్రాయెల్ చేసే అంతర్జాతీయ నేరంలో భాగం అయ్యారని, ఆయా క్రిమినల్ చట్టాల పరిధిలోకి వాళ్ళు కూడా వస్తారని నివేదిక స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ అనేక ఆయుధాల్ని, ముఖ్యంగా మనుషుల కదలికల మీద వారు వాడే ఫోన్లు, లాప్టాప్‌ల ద్వారా గూఢచర్యం చేసే టెక్ ఆయుధాల్ని అభివృద్ధి చెయ్యటంలో చాలా ముందుంది. మన దేశంలో ఉద్యమ కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, నచ్చని జర్నలిస్టుల మీద ప్రయోగించిన పెగసెస్ ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసిందే. ఈ బలమైన అంతర్జాతీయ కొర్పొరెట్ ఆర్ధిక సంబంధాలని కదిలించే బొయికాట్, డివైస్ట్, శాంక్షన్ అనే అంతర్జాతీయ అహింసా ఉద్యమం పని చేస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ చేసే హింసలో భాగం పంచుకునే అన్ని కంపెనీలని బహిస్కహరించాలని, వాటిపై ఆంక్షలు విధించాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే స్వచ్చంద వేదిక.
2026లో ఈ మధ్యనే 2026 మూడవ రిపోర్టు – చిత్రహింసలు, నరమేధం https://www.ohchr.org/en/documents/country-reports/ahrc6171-torture-and-genocide-report-special-rapporteur-situation-human – జరుగుతున్న నరమేధంలో వ్యవస్థీకృతంగా పాలెస్తీనీయులపై కస్టడీలో, బయటా కూడా చిత్రహింసలు ఎలా భాగంగా మారాయో చర్చిస్తుంది. ఈ చిత్ర హింసల్లో మగవాళ్ళు, ఆడవాళ్ళూ, పిల్లలు అనే తేడా లేకుండా కస్టడీలోకి తీసుకున్న వారి పైన తీవ్రమైన లైంగిక హింస, తిండి పెట్టక పోవటం, అవసరమైన మందులివ్వక పోవటం, బట్టలు తీసేసి రోజుల పాటు ఉంచటం, గాయపరిచి చనిపోయే వరకూ వదిలెయ్యటం, జంతువులతో రేప్ చేయించటం – ఇలా ఎన్నో రకాలు వున్నాయి. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో ఏం చేసారని ఇజ్రాయెల్ నిందించిందో (వాటిలో చాల అబద్ధాలని తేలాయి) అది ఆర్మీ కస్టడీలోకి తీసుకున్న 10000 మంది పాలస్తీనియన్లలో (ఇజ్రాయెల్ పాలస్తీనియన్లు చేసే ఏ నేరాన్నయినా రక్షణకి సంబంధించినదిగా చూసి, ఆర్మీ కోర్టులలోనే పాలస్తీనా ప్రజలకి శిక్షలు విధిస్తుంది) అనేక మంది ఈ చిత్రహింసలకు గురయ్యారు.
చిత్రహింసలని విధానంగా వాడుకోవటాన్ని పాలస్తీనా కార్యకర్తలు ఎప్పటి నుండో ఎత్తి చూపుతూనే వున్నారు. 2024లోనే పాలస్తీనా స్త్రీవాద కార్యకర్తలు అనేక మంది స్త్రీల లైంగిక హింస అనుభవాలని బయటకి తెస్తే, ఇజ్రాయెల్ ఆర్మీ సెంటర్ల నుండి బయటికొచ్చిన అనేక మంది పాలస్తీనా బందీలు తామెదుర్కొన్న చిత్రహింసల గురించి చాలా వివరంగా చెప్తూ వచ్చారు. ఈ మధ్యనే న్యూయార్క్ టైమ్స్ వంటి ఇజ్రాయెల్‌కి మద్దతు నిచ్చే వార్తా పత్రిక కూడా 22 మంది పాలెస్తీనా బందీల సాక్ష్యాల ఆధారంగా వ్యాసం ప్రచురించింది. మొన్నటికి మొన్న గాజాపై విధించిన నిర్బంధాన్ని బద్దలు కొట్టి, వారికి కొంత ఆహారం, మందులు తీసుకుని వెళుతున్న వందల మందిని అంతర్జాతీయ నీటిలో ఎత్తుకుని పోయి, కొట్టి, లైంగిక దాడులు చేసి ఆయా ఐరోపా దేశాలు గొడవ చేస్తే, తిరిగి వెనక్కి పంపించారు.
బిసాన్ ఇజ్రాయెల్ అంతం చేద్దామని చూస్తున్న అరబ్ యువతి అయితే, తమ తమ ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా జియోనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పాశ్చాత్య ప్రజానీకానికి ఫ్రాన్సెస్కా ఆల్బనీస్ ప్రతినిధి. వీరితో పాటు అనేకానేక మంది జరుపుతున్న నిరసనలు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో నడుస్తున్న కేసులు, అక్కడ పని చేసి వచ్చిన డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులు తమ దేశాలకి తిరిగొచ్చిన తర్వాత ఇస్తున్న సాక్ష్యాలు, అన్ని రకాల సమాచారాన్ని క్రోడీకరించి జరుగుతున్న నరమేధాన్ని డాక్యుమెంటు చేస్తున్న చరిత్రకారులు కూడా తమ స్థాయిలో వినదలుచుకున్న వాళ్లకి విషయాలని తెలియచేసి జయోనిస్టులకి మద్దతిచ్చే తమ ప్రభుత్వాలని ప్రభావితం చేస్తున్నారు. జయోనిస్టు భావజాలం తమ జీవిత కాలంలో అంతమవుతుందని అందరి ఆశ.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.