బహుముఖ ప్రతిభాశాలి మంథా భానుమతి – గిరిజ పైడిమర్రి

మశీథా భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నేటి యువతరంతో పోటీపడుతూ 80యేళ్ళ వయసులో కూడా అంతే వేగంగా రచనా వ్యాసంగంలో ఎఫ్.బి బరిలో ముందుకు దూసుకుపోతున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించి, కథలు, నవలలు, కవిత్వం, పద్యకవిత్వం, సంగీతం ఒకటేమిటి పలురంగాలలో ఆమె ప్రతిభను చాటారు.

ఆమె తలచుకుంటే పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదంటారు. ఏదైనా నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదంటారు. సాంకేతికతను సాదరంగా ఆహ్వానించి తన జీవితంలో భాగం చేసుకున్నారు. ఫేస్‌బుక్ బృందాలలో యువ రచయితలకు కథలు రాయడంలో సలహాలు ఇస్తూ పోటీలు నిర్వహిస్తూ, బహుమతులిస్తూ నిరంతరం ఉత్సాహంగా ఉంటారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సానుకూలమైన దృక్పథం చాలా అవసరమని చెప్పే భానుమతి గారి జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే భూమిక పాఠకుల కోసం….
ప్ర. నమస్తే! భానుమతి గారు.
జ. నమస్తే! గిరిజా, రండి.. కూర్చోండి
ప్ర. నేను భూమిక పత్రికకు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాండీ!
జ. అవునా! సత్యవతిగారు నాకు తెలుసు. ఆవిడ చేస్తున్న పని చాలా గొప్పది. ఇదివరకు ఆవిడ బేగపేటలోనే ఉండేవారు. తరచుగా వాకింగ్ సమయంలో కలుసుకునే వాళ్ళం.
ప్ర. మీ అమ్మానాన్నలు, సహోదరుల గురించి చెప్తారా?
జ. నాన్న పేరు వడ్లమాని సత్యనారాయణమూర్తి. పోలీసు శాఖలో ఇన్‌స్పెకర్ట్‌గా పనిచేసేవారు. అమ్మ పేరు సుభద్ర, గృహిణి. నాకు ఒక అక్క, నలుగురు అన్నయ్యలు. నేనే చివరిదాన్ని.
ప్ర. మీ బాల్యం గురించి చెప్పండి.
జ. కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం గ్రామంలో నేను 11/01/1946న పుట్టాను. చెప్పాను కదా! మా యింట్లో నేనే ఆఖరు దాన్ని. మా అక్కయ్యకు నాకు ఇరవై సంవత్సరాలు తేడా. మా చిన్న అన్నయ్యకు నాకు పదేళ్ళు అంతరం ఉండేది. అందువల్ల అందరూ నన్ను గారాబంగా పెంచారు. నా బాల్యం అంతా పచ్చని ప్రకృతిలో పంటపొలాల్లో ఆటపాటలతో సంతోషంగా గడిచింది.
ప్ర. మీ కాలంలో గ్రామాలలో ఆడపిల్లలు ఆడుకునే ఆటల గురించి చెప్పండి.
జ. తొక్కుడు బిళ్ళ, గచ్చకాయలు, నేలా బండా, చింతగింజలు, వీరీ వీరీ గుమ్మడి పండు, కుందుళ్ళులాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ఆటలన్నీ కనుమరుగైపోయాయి.
ప్ర. నిజమేనండీ! కుందుళ్ళు ఆట పేరు నేను వినలేదు, ఎలా ఆడతారు?
జ. కుందుళ్ళు ఆట ఆడాలనుకునే పిల్లలందరూ రెండు బృందాలుగా విడిపోవాలి. ఒక బృందంలోని ఒక అమ్మాయి ఒంటికాలి మీద కుంటుతూ వెళ్ళి అవతలి బృందంలో ఎవరినైనా ఒకరిని ముట్టుకోవాలి. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ఒంటికాలుతో కుంటుతూ ఇవతలి బృందంలో ఒకరిని ముట్టుకోవాలి. ఇలా ఒకరి తర్వాత ఒకరిని అందరినీ ఔట్ చేయాలి. ఏ బృందంలో మొదట అందరూ ఔట్ అయితే ఆ బృందం ఓడిపోయినట్లుగా ప్రకటిస్తారు. ఇలాంటి ఆటల వల్ల శరీరానికి మంచి వ్యాయామం అయ్యేది.
ప్ర. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నాకు ఆరేళ్ళ వయసప్పుడు మా నాన్నగారు ఉద్యోగ విరమణ పొందారు. అందువల్ల మేము మా రెండో అన్నయ్య దగ్గరికి గుంటూరుకు పోయాం. అక్కడే ఫస్ట్ ఫారం నుంచి ఎస్.ఎస్.ఎల్.సి దాకా బండ్లమూడి హనుమాయమ్మ పాఠశాలలో చదువుకున్నాను. నేను పాఠ్యపుస్తకాల కంటే ఇతర పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని. మొదట్లో డిటెక్టివ్ పుస్తకాలు విరివిగా చదివాను. కొమ్మూరి సాంబశివరావు పుస్తకాలన్నీ చదివేశాను. ఐదో తరగతిలోనే విశ్వనాథ సత్యనారాయణగారి వేయి పడగలు నవల చదివాను. ఇది ఎందుకు చెపుతున్నానంటే.. ఏది నా కంటబడితే అది చదివేసేదాన్ని. అది అర్థమవుతుందా? లేదా? అన్నది తర్వాత విషయం. ఎదుగుతున్న క్రమంలో సాహిత్య పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. అలా గురజాడ, కందుకూరి, విశ్వనాథ సత్యనారాయణ, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, చాగంటి సోమయాజులు, కొడవటిగంటి కుటుంబరావు, గుడిపాటి వెంకటచలం, శ్రీపాద, తిలక్ సాహిత్యాన్ని చదివాను. ఇంగ్లీష్ సాహిత్యాన్ని కూడా చదివాను.
ప్ర. మీరు మరచిపోలేని పాఠశాల అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి.
జ. చదవడం నాకొక వ్యసనంగా మారిపోయింది. ఎంతగానంటే.. తరగతి గదిలో పాఠ్యపుస్తకం మధ్యలో డిటెక్టివ్ నవల పెట్టుకొని చదివేతంటగా… ఒకసారి మా టీచర్ చూసారు. మా నాన్నగారిని పాఠశాలకు పిలిపించి కంప్లైంట్ చేసారు. “ చూడు భానూ! నువ్వు సహజంగా తెలివైన దానివి. పెద్దగా కష్టపడకుండానే 60% మార్కులు తెచ్చుకున్నావు. ఇక శ్రద్ధపెట్టి చదివితే మంచి ఫలితాన్ని సాధిస్తావు. “అంటూ హితబోధ చేశారు. ఆ సంఘటన నేను ఎప్పుడూ మరచిపోలేదు. తత్ఫలితంగా నేను ఎస్.ఎస్.ఎల్.సిలో పాఠశాల స్థాయిలో ప్రథమస్థానం సాధించాను.
ప్ర. మీ వివాహం, పిల్లల గురించి చెప్పండి.
జ. మాది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆ రోజులలో మా కుటుంబాలలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరిగేవి. నాకు అలాగే చేయాలని ప్రయత్నించారు. కానీ ఉన్నత విద్యపట్ల నాకున్న ఆసక్తితో ఇంట్లో పోరాటమే చేశానని చెప్పాలి. అలా బి.ఎస్సీ దాకా చదువుకున్నాను. ఆ తర్వాత 17/06/1965లో మంథా రామారావు గారితో నా వివాహం జరిగింది. అప్పటికి అది చాలా ఆలస్యమనే చెప్పాలి. ఆయన హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ డిపార్టుమెంటులో ఇంజనీరుగా పనిచేసేవారు. నాకిద్దరు అబ్బాయిలు. ఇద్దరూ స్థిరపడ్డారు. పెద్దబాబు అమెరికాలో ఉంటాడు. చిన్నబాబు చాలా యేళ్ళు విదేశాలలో పనిచేసి హైదరాబాదులో స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. రచయిత కూడా.. ఇంగ్లీషులో కవిత్వం, కథలు, వ్యాసాలు రాస్తాడు.
ప్ర. మీ ఉద్యోగ ప్రస్థానం గురించి చెప్పండి.
జ. నాకు డిగ్రీ అయిపోయిన వెంటనే గుంటూరు మెడికల్ కాలేజీలో డెమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో పి.పి.సి (ప్రి ప్రొఫెషనల్ కోర్సెస్) అని ఉండేది. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ చేయించడం నా పని. తర్వాత లెక్చరర్స్ ప్రాక్టికల్స్ చేయించే పద్ధతి వచ్చింది. నా ఉద్యోగం విద్యాశాఖ పరిధిలోకి వస్తుంది. వివాహం అయ్యాక రిక్వెస్ట్ మీద ఉస్మానియా మెడికల్ కాలేజ్ – హైదరాబాద్‌కు బదిలీ అయింది. 1980లో సిటీ కాలేజీకి లెక్చరర్‌గా వచ్చి, రీడర్‌గా 2000 సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను.
ప్ర. మీ వివాహానంతరమే ఉన్నత విద్యాభ్యాసం చేశారా? ఆ వివరాలు చెప్పండి.
జ. అవును, ఇద్దరు పిల్లలు పుట్టాక పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి నా ఉద్యోగంలో పైస్థాయికి వెళ్లాలని అనిపించింది. బి.ఎస్‌సీలో నా ప్రధాన సబ్జెక్ట్స్ బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావడం వల్ల నాకు ఫిజిక్స్‌లో ఎం.ఎస్.సి చేయడానికి అవకాశం లేదు. అది చేయాలంటే డిగ్రీలో మాథమేటిక్స్ తప్పనిసరి. అయితే అదే సంవత్సరం 1974లో ఉస్మానియా యూనివర్శిటీ వాళ్ళు ప్రవేశ పరీక్ష ఆధారంగా కెమిస్ట్రీలో ఎం.ఎస్సీ మొదలుపెట్టారు. ఆంధ్రా యూనివర్శిటీలో చేయాలన్నా మాథ్స్ తప్పకుండా ఉండాలి. అప్పటి వరకూ నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఫిజిక్స్ చెప్పాను. ప్రవేశ పరీక్ష రాయాలంటే డిగ్రీలో చదివిన కెమిస్ట్రీలో నేనే ఫస్ట్ వచ్చాను. కానీ ఏమీ గుర్తులేదు. ఎలాగైనా చేయాలని పట్టుదల. ఆ రోజుల్లో =aశ్ణీs Tutశీతీఱaశ్రీs ఉండేది. అక్కడ ఎం.ఎస్సీ కెమిస్ట్రీ ఎంట్రన్స్ కోచింగ్ కొరకు చేరాను. అక్కడ నేనే మొదటి విద్యార్థిని. పంత్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన కృష్ణారావుగారు ఉదాహరణలను తీసుకొని అద్భుతంగా పాఠాలు చెప్పేవారు. ఎంట్రెన్స్ రాయడం, ఎం.ఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉస్మానియా యÖనివర్సిటిలో చేరిపోవడం జరిగింది. 1974-76 వరకు నా ఎం.ఎస్సీ పూర్తయింది.
ప్ర. మీరు అమెరికా కూడా వెళ్ళారు కదా? ఆ వివరాలు చెప్పండి.
జ. ఇక్కడ ఎం ఎస్సీ అయిపోయిన వెంటనే నాకు అమెరికాలో ఎం.ఎస్ చేయాలనే కోరిక కలిగింది. ఉద్యోగానికి సెలవుపెట్టి 1977-79 వరకు యూనివర్శిటీ ఆఫ్ డెన్వర్, కొలరాడోలో పూర్తిచేసాను. పిల్లలకు, నా జీవననేస్తానికి వీసా రానందువల్ల ఇండియాకు తిరిగి వచ్చి ఉద్యోగంలో జాయినయ్యాను. ఆ తర్వాత ఎఫఐపి (ఫ్యాకల్టీ ఇంప్రుమెంట్ ప్రోగ్రాం) సెలవు మీద 1981-84 దాకా ఉస్మానియా యూనివర్శిటీలో ఫోటో కెమిస్ట్రీలో పరిశోధనచేసి పి.హెచ్.డి పూర్తి చేసాను.
ప్ర. ఇద్దరు పిల్లలతో, ఉద్యోగంలో ఇదంతా ఎలా సాధ్యమైంది?
జ. నేను ఉస్మానియా యÖనివర్సిటిలో చదువుకునేటప్పుడు, ఆ వెనువెంటనే అమెరికా వెళ్ళినప్పుడు నా పిల్లలు చాలా చిన్నవారు. నా జీవననేస్తం రామారావు గారి సహకారం లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఇంటి పనుల్లో, పిల్లల పెంపకంలో, నా ఎదుగుదలలో ఆయన సపోర్టు చాలా వుంది. రచయిత్రిగా పరిశోధన కొరకు ఫీల్డ్‌కు వెళ్ళినప్పుడు ఆయన కూడా నాకు తోడుగా వచ్చేవారు. ఆ రోజులలో సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబాలలో అలాంటి పురుషులుండడం చాలా అరుదు. లేరనే చెప్పాలి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఆయన సదా నా విజయాల వెనక ఉండి, “ఒక పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుంది” అనే నానుడిని తిరగరాసారు.
ప్ర. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు మొదలైంది?
జ. ‘చేపా! చేపా! ఎందుకు ఎండలేదు?’ అనే కథ 1993లో ఆంధ్రప్రభలో ముద్రించబడింది. అదే నా మొదటి కథ. అదే క్రమంలో మరో రెండు కథలు ఆంధ్రప్రభలో వచ్చాయి. సైన్సుకు సంబంధించిన చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేదాన్ని. అలా మూడేళ్ళపాటు అంటే 96దాకా కొనసాగింది. ఆ తర్వాత ఉద్యోగంలో పని ఒత్తిడితో రాయలేకపోయాను.
ప్ర. మీరు ఎప్పుడు ఉద్యోగ విరమణ పొందారు?
జ. పిల్లలు స్థిరపడ్డారు. నాకు పుల్ పెన్షన్‌కు అర్హత ఉంది. నేను స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తప్పుకుంటే యువతకు అవకాశం ఇచ్చినట్లు కూడా ఉంటుందనే ఉద్దేశంతో నేను 2000 సంవత్సరంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాను. అప్పుడు నా వయసు 54 యేళ్ళు. 34 సంవత్సరాల ఉద్యోగ అనుభవం ఉంది.
ప్ర. మీకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది కదా? ఆ విషయాలు చెప్పండి.
జ. నాకు సంగీతం, సాహిత్యం రెండు కళ్ళలాంటివి. ఏదైనా నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే వయసు ఆటంకం కాదని నమ్ముతాను. చిన్నప్పుడు గుంటూరులో కొన్నాళ్ళు నేర్చుకొని వదిలిపెట్టిన సంగీతాన్ని 94-95లో మళ్ళీ మొదలుపెట్టాను. బండి సుబ్బలక్ష్మి నా గురువు గారు. 1999లో సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసాను. 2002లో 56 యేళ్ళ వయసులో మళ్ళీ నేర్చుకున్నాను. డిప్లొమా పొందాను. కచేరీలు కూడా చేసాను. సంగీతం, సాహిత్యం రెండూ మనసును చాలా ఉత్సాహంగా ఉంచుతాయి.
ప్ర. మీరు ఉచితంగా యోగా తరగతులు కూడా నిర్వహించేవారని విన్నాను. ఆ విశేషాలు చెప్పండి.
జ. అవునండీ! మేం అక్కడ దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలనీలో ఉండేవాళ్ళం. అప్పట్లో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో భారతీయ యోగ సంస్థాన్ ఉండేది. వారు యోగా శిక్షణ ఇచ్చేవారు. 1990లో నేను అక్కడ యోగా నేర్చుకున్నాను. మేం బేగంపేట ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటిపై డాబా మీద దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరుగుపొరుగు మహిళలకు యోగాసనాలు నేర్పించాను.
ప్ర. మీ మొదటి నవల ఎప్పుడు రాసారు? దాని నేపథ్యం చెప్పండి.
జ. నేను 2003లో అలస్కా టూర్ చేసాను. అప్పుడు ఆసక్తితో అక్కడి సిబ్బందితో, తోటి ప్రయాణీకులతో పరిచయాలు పెంచుకొని సమాచారం సేకరించాను. ఆ యాత్ర ముగించుకొని ఇంటికి వచ్చాక కొద్ది రోజులకు రచన మాసపత్రికలో నవలా పోటీ ప్రకటన చూసాను. ఎనిమిది నెలల సమయం ఉంది. నా దగ్గర సమాచారం ఉంది. ఎందుకు ప్రయత్నించకూడదు? అనే పట్టుదల పెరిగింది. ట్రావెలాగ్‌లాగా ఉంటుందేమోననే సందేహం.. అయితేనేం? జూల్స్ వేర్న్ నవలలు అలాగే ఉంటాయి కదా? అని నాకు నేనే సర్ది చెప్పుకొని రాయడం మొదలు పెట్టాను. క్రూజ్ నడిపేవారి సమస్యలు, కష్టాలు, ప్రయాణీకుల ఆనందాలు, స్వభావాలు.. కులు, మనాలి వెళ్ళినప్పటి అనుభవాలు.. గ్లేసియర్ ఏర్పడడం,అప్పటి వాతావరణ పరిస్థితులు, మనుషుల స్వభావాలను, పరిస్థితులను గ్లేసియర్తో పోల్చడం ఇలా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. దాని ప్రకారం రాసుకుంటూ వెళ్ళాను. ఇచ్చిన సమయం కంటే ముందే నవల రాయడం పూర్తయింది. పోటీకి పంపించాను. బహుమతి వస్తుందనుకోలేదు. సమ బహుమతి పేరుతో మరో ఇద్దరితో కలిపి నాకూ బహుమతి ప్రకటించినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను.
ప్ర. ఇంకా ఏయే నవలలకు బహుమతులు వచ్చాయి?
జ. మొదటి నవలకు బహుమతి పొందిన ఉత్సాహంతో 2005లో రెండో నవల రాసాను. దాని పేరు ‘అంతా ప్రేమమయం’ దానికీ బహుమతి వచ్చింది. అది స్వాతిలో పదహారు వారాల సీరియల్‌కు ఎన్నికైంది. రెట్టింపు ఉత్సాహంతో నా నవలా రచనా వ్యాసంగాన్ని తీవ్రతరం చేసాను. మూడో నవల ‘రామాయణం మామయ్య’ రాసాను. దానికి ఆంధ్రభూమి నవలల పోటీలో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. నాలుగో నవల ‘మౌనంగానే ఎదగమని’ దానికి ‘అనిల్ అవారు’్డ వచ్చింది. ఇలా వరుసగా నాలుగు బహుమతులు వచ్చేసరికి నా రచన అడ్డుకట్ట లేకుండా ముందుకు సాగింది.
ప్ర. మొత్తం ఎన్ని నవలలు, కథలు రాసారు?
జ. దాదాపు 26 నవలలు, వందకు పైగా కథలు రాసాను. ‘కచ్చపి నాదం’ అనే నవల సంగీత ప్రధానమైన వస్తువుతో రాసాను. అది సిరికోన – జొన్నలగడ్డ రాంబొట్లు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందింది. నేను రాసిన దాదాపు అన్ని నవలలు స్వాతి, చతుర, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, కౌముదిలాంటి పలు అంతర్జాల పత్రికలలో ముద్రించబడ్డాయి. గిరిజనుల జీవన విధానం కథా వస్తువుగా ఎఫ్.బిలో కథా కడలి బృందం వారి పోటీలకు 20-25 లో ‘అనుబంధం’ అనే నవల రాశాను. ప్రథమ బహుమతి వచ్చింది.
ప్ర. మీ నవలల్లో కథా వస్తువు ఏముంటుంది?
జ. ఒకే రకమైన కథా వస్తువు నా రచనల్లో ఉండదు. విభిన్నమైన కథా వస్తువును తీసుకుని రాయడమే నా ధ్యేయం కూడా. పరిశీలన, పరిశోధన నాకు ఆసక్తికరమైన రంగాలు. కాబట్టి నా దృష్టి కోణం ఎప్పుడూ ఆ దిశగానే ఉంటుంది. ఏ వస్తువు తీసుకున్నా ఫీల్డ్ వర్క్, పరిశోధన తప్పకుండా చేస్తాను. ‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’ నవల రాయడం కొరకు ఆంధ్రప్రదేశ్ నుంచి సేలం, బనారస్ వరకు వెళ్ళాను. ఆయా నేత కార్మికులతో కలిసి మాట్లాడి విషయ సేకరణ చేసుకున్నాను. అలాగే ఇక్కడ గుర్రం పందాలు జరిగినట్లుగానే ఒంటె పందాలు జరుగుతాయని గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను. ఆ విధంగా అక్కడి పిల్లలకు బాల్యం లేదని అనుకుంటే చాలా బాధ కలిగింది. అదే వస్తువుగా ‘కలియుగ వామనుడు’ అనే నవల రాశాను. ‘మౌనంగానే ఎదగమని’ అనే నవల పిల్లల ఆసక్తుల మీద తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకూడదని చెపుతుంది. మత్స్యకారుల జీవన విధానం వస్తువుగా ‘ప్రేముడి’ నవల రాసాను. టెర్రరిజంకు వ్యతిరేకంగా ‘అరుణోదయం,’ కృత్రిమంగా పళ్ళు, కూరగాయలు పండించే విధానానికి వ్యతిరేకంగా ‘మాయపండు,’ రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకానికి వ్యతిరేకంగా ‘జనని,’ విద్యుత్ ఉత్పాదన మీద ‘మేఘం లేని మెరుపు’ నవలలు రాసాను. అన్నీ పరిశోధన చేసి రాసినవే..
ప్ర. మీ చారిత్రక నవలల గురించి చెప్పండి.
జ. కవిత్రయంలో ఒకరైన ఎర్రాప్రగడను ప్రధాన పాత్రగా ఆ కాలంలోని రాజకీయ, సాంఘిక పరిస్థితులను విశ్లేషిస్తూ “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” అనే నవల రాసాను. రెండోది “అజ్ఞాత కులంలస్య” పేరుతో రాసిన చారిత్రక నవల. దీనిలో కళింగ గజపతుల కాలంలోని చరిత్రను ఒక కల్పిత పాత్ర ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. ఇది సీరియల్‌గా వస్తున్నప్పుడు ఒక ఫంక్షన్లో ఒకావిడ నా దగ్గరగా వచ్చి, “అజ్ఞాత కులంలస్య” రాస్తున్నది మీరేకదా? నేను దాని కొరకు ప్రతివారం ఎదురు చూస్తానండీ!” అన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. ఒక రచయిత్రికి అంతకన్నా పెద్ద అవార్డు ఏముంటుంది? అలాగే ఒకసారి ప్రముఖ రచయిత్రి మైథిలీ అబ్బరాజు గారు “మీరు చారిత్రక నవలల మీదనే దృష్టి పెట్టండి.” అన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. ఈ రెండు నవలలు తెలుగువన్. కామ్‌లో ప్రచురించబడ్డాయి.
ప్ర. మీరు కవిత్వం కూడా రాసారా?
జ. వచన కవిత్వం ఖండికలు కొన్ని రాశాను. కానీ ఛందోబద్ధమైన కందపద్యంతో మూడు శతకాలు రాశాను. అర్క శతకంలో అర్కా! (సూర్యుడు), అంశు శతకంలో అంశా! (చంద్రుడు), సిరి శతకంలో సిరీ! (లక్ష్మీ) అనేవి వాటిలోని మకుటాలు. పద్మప్ప, అద్వితీయడు అనే రెండు ప్రబంధాలు రాశాను.
ప్ర. ఈ రోజుల్లో ఛందోబద్ధమైన కవిత్వం రాసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందులో మహిళలు అసలు లేరనే చెప్పాలి. ఈ సందర్భంలో మీరు లక్షణయుతమైన ప్రబంధం రాశారంటే చాలా ఆశ్చర్యంగా వుంది. దయచేసి ఆ వివరాలు చెప్పండి.
జ. ఛందోబద్ధమైన కవిత్వానికి చాలా పరిధులుంటాయి. అవన్నీ అధిగమిస్తూ ఒక్కో పద్యం పూర్తయ్యాక పర్వత శిఖరాన్ని ఎక్కినంత ఆనందం కలుగుతుంది. ‘అద్వితీయుడు’ ప్రబంధాన్ని ఆదర్శం, కుటుంబం, ధ్యేయం, స్వకీయం, అద్వితీయం అనే ఆరు ఆశ్వాసాలలో రాసాను. ఇందులో మూడు వంతులు వృత్తపద్యాలు ఉన్నాయి. సీస, కంద, ఆటవెలది పద్యాలు తక్కువగా ఉన్నాయి. వస్తువు 20వ శ.చివరి కాలం. సాంఘికమైనదే.. కుటుంబ విలువలు, బంధుత్వాలు, మానవ సంబంధాలు ప్రధాన వస్తువు. ప్రజాపద్యం వాళ్ళు నిర్వహించిన పోటీలో ప్రశంస పొందింది.
ప్ర. మీకు వచ్చిన పురస్కారాల గురించి తెలియజేయండి.
జ. పాఠకుల స్పందననే నా ప్రధాన పురస్కారం. ఇతరత్రా లభించే పురస్కార గ్రహీతల మీద మరింత బాధ్యత పెరుగుతుందని భావిస్తాను. అందుకే కాబోలు.. నా ఖాతాలో పురస్కారాలు చాలా వచ్చి చేరాయి. వాటిలో కొన్ని: లేఖిని సంస్థ వారి మాతృదేవోభవ పురస్కారం, కళాసాగరం వారి జీవితకాల సాఫల్య పురస్కారం, బోయి హైమవతిగారి కొత్తూరు సుబ్బయ్య దీక్షితుల దంపతుల జీవిత పురస్కారం, గుంటూరు సాహిత్య బృందం వారిచే ఉగాది పురస్కారం, లయన్స్ క్లబ్ యల్.బి నగర్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం, వంశీ సంస్థ వారిచే వాసిరెడ్డి సీతాదేవి స్మారక పురస్కారం, ఉషావారి జీవిత సాఫల్య పురస్కారం మొదలైనవి.
ప్ర. చివరగా నేటి రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ. నేటి యువతరం పుస్తకాలు చదవడంలేదు. విస్తృతమైన పఠనం అవసరం. ఏదైనా రాయడానికి ముందు ఆ రంగంలో పరిశోధన చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధపెట్టాలి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.