అనసూయ అమ్మని పలకరిద్దామని ఇంటికి వెళ్ళాను. అమ్మ కూరగాయలు సర్దుతుంది. చిన్నకోడలు రాజేశ్వరి వంటింట్లో హడావుడిగా పనిచేస్తుంది. అమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. అమ్మ లోనుంచి ఏదో విద్యుత్ నాలో ప్రవేశించింది. అది ప్రేమ ఆప్యాయత అనే ఉద్యమ విద్యుత్.
అమ్మ వెనుక గోడ మీద తెల్లటి షర్ట్‌లో నవ్వుతూ ఉన్న ఫోటో. తాజాగా రెండు ఎర్ర మందారపూలు. ఆ ఫోటోను తాకాను. నా చిన్ననాటి మిత్రుడు.
“నాచావు దోపిడీ వర్గాల కత్తిపోట్లతో కావచ్చు. పోలీస్ తుపాకీ గుండ్లతో రావచ్చు. రోడ్లమీదనో, పొలాలలోనో, కొండల్లోనో మైదానాల్లోనో ఎక్కడైనా కావచ్చు. ఏ విధంగానైనా రావచ్చు. నా శవాన్ని నా భార్యాబిడ్డలు, బంధువులు చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఉన్నా పోలీస్ ప్రభుత్వము చూడనియ్యకపోవచ్చు. అది ఎలా జరిగినా? ఎప్పుడు జరిగినా? H మరణం పీడిత ప్రజల కోసమే. నా చావు కష్టజీవులైన కార్మికుల కర్షకుల పక్షమే” అని ప్రకటించిన వాడు.
1994 సెప్టెంబర్ 29న నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పట్టుకుని, నెల్లూరు శివార్లలో పద్మక్కతో పాటు కాల్చి చంపబడిన పీపుల్స్ వార్ స్టేట్ కమిటీ మెంబర్ చింతల సూర్యశీగారు. ఫోటో కెల్లి దీక్షగా చూస్తూ పువ్వులు రోజూ పెడతావమ్మా అన్నాను. ఏసన్న చనిపోయినప్పుడు మేం కోరుకునేది ఈపూలే కదే అన్నాడు. అందుకని రోజూ పూలు పెడతాను. మందారపూలు మరీ ఇష్టంగా పేడతాను. తాజాగా ఏ పువ్వు కనిపించినా పెడతాను. ప్రేమగా ఆయన ఫోటో తాకుతూ ఆయన సహచారి 77 ఏళ్ల అనసూయమ్మ గారు.
లారీ డ్రైవర్‌గా, ఉద్యమకారుడుగా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు, అజ్ఞాత జీవితంలో ఉన్నప్పుడు, అమరుడు అయిన తర్వాత ఆయన సహచరిగా అనసూయమ్మ గారు ఎదుర్కొన్న, పడిన బాధలను వింటే మనకు కన్నీళ్లు ఆగవు. తెలంగాణ, శ్రీకాకుళ పోరాటాల నుండి కార్యకర్తలు, వారి సహచరులు చేసిన త్యాగాలు మహోన్నతమైనవి. వారు పడిన కష్టాలు రష్యా చైనా విప్లవాలను గుర్తుచేస్తాయి. మన విప్లవం కూడా విజయవంతమై ఉంటే ఇలాంటి వారి చరిత్ర రికారుడై ఉండేది. రికార్డ్ కానివారి చరిత్ర వెలికి తీయాల్సిన అవసరం ఉంది. చరిత్రకందని వారి జీవితాలను పంచుకోవాలని ఉంది.
ప్ర. అమ్మ ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది?
అమ్మ:-బాగున్నానురా. షుగర్ వచ్చి 27 ఏళ్లు. అది తప్పితే ఆరోగ్యం అంతా బానే ఉంది. మాటామంతి జరుగుతుండగానే మనవరాలు వచ్చింది. మÖడవ కొడుకు స్టాలిన్ బాబు కూతురు అని పరిచయం చేసింది.
ప్ర. ఒక్క అమ్మాయేనా?
అమ్మ:-అవున్రా. రెండో కొడుకు మల్లికి ఒక అమ్మాయి. పెద్దకొడుకు శ్రీనుకు ఓ అబ్బాయి అమ్మాయి. ముగ్గురికి కలిపి నలుగురే చిన్న బాధగా అంది. నీకేం అత్తయ్య! మీ పుట్టింటోళ్లు ఉన్నోళ్లు. కొద్దో గొప్పో సర్దుబాటు చేశారు. ఇప్పుడు ఖర్చులు అట్టా లేవు కదా అంది రాజేశ్వరి.
ప్ర.అమ్మ మీ పుట్టింటోళ్ళ గురించి చెప్పు.
అమ్మ మొహంలో ఓ మెరుపు కనిపించింది. అమ్మ:-అమ్మా నాన్నలకు మేము ఆరుగురు ఆడపిల్లలం. మగపిల్లలు లేరు. 10ఎకరాల పొలం, ఇల్లు వాకిలి కోష్టం ఎద్దులు వ్యవసాయం ఉండేది.
ప్ర.అమ్మా మీ పెళ్లి గురించి చెప్పండి.
అమ్మ:-నేను మÖడో అమ్మాయిని. మీ అన్న మా ఊరు చుట్టాలింటికి వచ్చి నన్ను చూసాడు. ఇంటికెళ్లి వాళ్ళ అమ్మతో చెప్పాడట. వాళ్ళ అమ్మా నాన్న,వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చి, బర్రెల తోలుకొని కొష్టం దగ్గరికి వెళుతుంటే ఆ చుట్టాలమే నన్ను పిలిచింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. బర్రెలు కట్టేసి కొష్టం బాగుచేసి ఇంటికి వచ్చే సరికి మా ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏవో మాట్లాడుకున్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళ చుట్టాలు కట్నకానుకలు మాట్లాడుకోవడానికి మా ఇంటికి వచ్చారు. మా నాన్న ఒక్కొక్కరికి రెండు ఎకరాల పొలం అందరి పెళ్లిళ్లు అయిన తర్వాత ఇస్తామన్నారు. వాళ్లు ఇప్పుడే ఇవ్వమన్నారు. ఇప్పుడే ఇస్తే పెద్ద పిల్లలక్కూడా ఇవ్వాలి. ఆడపిల్లలు వస్తా పోతా ఉంటారు. ఎట్లా అని మా చుట్టాలు ఒప్పుకోలేదు.
వచ్చినవాళ్ళు అలిగి అన్నాలు తినకుండా వెళ్ళిపోయారు. డ్యూటీ నుండి వచ్చిన ఈయనకు వాళ్ళమ్మ విషయం చెప్పింది. మా ఊరు వచ్చి నాకేమీవద్దు. నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీకు పిల్లను ఇవ్వనే ఇవ్వను అని ఎరువు బండి తోలుకెళ్తా ఉంటే ఈయన కూడా ఆ ఎరువు బండితో వెళ్ళాడు. నాన్నతో పాటు ఇంటికి వచ్చాడు. అంతసేపు బ్రతిమలాడుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు చేసుకునేవాడే వచ్చి బ్రతిమలాడుతున్నాడు కదా ఇవ్వు అన్నారు. మా అమ్మ కూడా ఇవ్వమంది.
ప్ర. మీరు ఉన్నోళ్లు. సూర్యమన్నకు ఇల్లు తప్ప ఏమీలేదు. ఎలా?
అమ్మ:-అమ్మకు ఈయనంటే చాలా ఇష్టం. మా అమ్మ కూడా వాళ్ళింటికి రెండు మÖడుసార్లు వెళ్లి వచ్చింది.
ప్ర. చుట్టాలా?
అమ్మ:-కాదు కానీ, బాగా తెలిసిన వాళ్ళు. అప్పటికప్పుడే ఆయన జేబులో ఉన్న రెండు రూపాయలు ఇస్తే తమలపాకులు తెప్పించి నా చేతిలో ఒకటి తన చేతిలో ఒకటి మా అమ్మ నాన్న చేతుల్లో ఒకటి వాళ్ళ చుట్టాల చేతుల్లో ఒకటి పెట్టారు.
ప్ర. అప్పటికి మీ వయసెంత?
అమ్మ:- నావయసు 13 ఏళ్లు. ఈయనకు 15 ఏళ్లు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత కాపురానికి వచ్చాను.
ప్ర. మీ అత్తగారింట్లో ఎలా జరిగింది?
అమ్మ:- మా మామయ్యకు ముందు భార్య చనిపోతే మళ్ళీ పెళ్లిచేశారు. ఇద్దరికీ ఐదుగురు అమ్మాయిలు. ముగ్గురు అబ్బాయిలు. నేను వచ్చేటప్పటికి పెద్దామెకు పెళ్లయింది. మొత్తం 10 మందికి వండడం, పెట్టడం, బట్టలుతకడం, నీళ్లు, ఇంటి పనంతా నాదే. అందరూ పనులకు వెళ్లేవాళ్లు. ఆడపిల్లలకు,పెద్ద మరిదికి పెళ్లయిందాకా, పదేళ్లు కలిసే ఉన్నాం. పెద్దోడు పుట్టిన తర్వాత నా చాకిరి చూడలేక అన్ని బాధ్యతలు చేశానమ్మ. ఇక విడిగా వండుకుంటాము అని చెప్పాడు. మా అత్తయ్య నన్ను పట్టుకుని బోరున ఏడ్చింది.
మా మామయ్య చనిపోయినప్పుడు నన్ను పట్టుకునే ఏడిచింది. విడిపోయిన తర్వాత కూడా మొన్న మొన్నటి దాకా నేను నిర్వహించాల్సిన బాధ్యతలన్ని నిర్వహిస్తూనే ఉన్నాను. మా ఆడపడుచు, మా మరిది హైదరాబాదులో చనిపోయినప్పటికీ ఇక్కడికి, ఇంటికే తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసాను.
ప్ర. వేరుపడిన తర్వాత మీ సంసారం ఎలా సాగింది?
అమ్మ:- ఉమ్మడి కుటుంబ పని తగ్గింది. కానీ సామాజిక బాధ్యత పెంచాడు. దగ్గర్లో ఉన్న బస్సు డ్రైవరు వన్నీర్‌తో ఈయనకు స్నేహం ఉంది. వన్నీర్‌కు కొంచెం మతిస్థిమితం తప్పింది. భార్య కొడుకు వదిలేసి పోయారు. అన్నదమ్ములవి అంతంత మాత్రం సంసారాలే. వన్నిర్ ఎప్పుడు వచ్చినా అన్నం పెట్టిచ్చేవాడు. కొన్ని సం.ల పాటు, అన్న ఉద్యమంలోకి వెళ్ళిన తరువాత కూడా వన్నీర్‌కు అన్నం పెట్టాను నాకున్నంతలో. మతి బాగుంటే వదిన అన్నం పెట్టు అనేవాడు. బాగా లేకపోతే ఏమమ్మో అన్నం పెట్టు అనేవాడు.
గోరంట్లకు పోయే దారిలో నాలుగేళ్ళు చలివేంద్రాలు పెట్టించాడు. ఆ దారిలో నీళ్లు కూడా ఉండేవి కాదు అప్పట్లో. రెండేళ్లపాటు ఆ చలివేంద్రంలో నేనే నీళ్లు పోస్తూ ఉండేదాన్ని. పెద్దోడు పక్కనే ఉండేవాడు. రెండోవాడు పొట్టలో ఉన్నాడు. జనాలు నీళ్లు తాగి అమ్మ! మళ్లీ నీకు కొడుకే పుడతాడు అనే వాళ్లు. నాకు చాలా సిగ్గుగా అనిపించేది. మÖడో ఏడూ నేను పోను అన్నాను.
తుఫాన్లు వరదలు అగ్నిప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు ఇంటి చుట్టూ తాటాకులు బొంగులు వేయించి అవసరమైన వాళ్లకు పంపిస్తూ ఉండేవాడు. ఇంటికి మనుషులు రావడం ఎక్కువైంది. అందరికీ వండి పెట్టేదాన్ని.
ప్ర. పెళ్లెప్పటికీ మీకు రాజకీయాలు తెలుసా?
అమ్మ:-నాకేకాదు మీ అన్నకు కూడా తెలియదు. కానీ పేదలపట్ల చాలా దయగా ఉండేవాడు అని మా అత్తమామలు చాలా విషయాలు చెప్పేరు.
ప్ర. రాజకీయాలు ఎలా పరిచయమయ్యాయి?
అమ్మ:-ఆయనకు ఎలా అయింది నాకు తెలియదు. నాకు ఈయన చెప్పిన మాటలే. ఈయనమీదున్న ఇష్టం, ప్రేమే అన్ని పనులు చేయించింది. గురవయ్య తాత (ప్రకాశం జిల్లా పీపుల్స్ వార్ కార్యదర్శిగా పనిచేశాడు) ఆపరేషన్ అయినప్పుడు ఇక్కడే ఉన్నాడు. మొదట చేసినది సరిగ్గా లేకపోతే రెండవసారి కూడా చేశారు. పొట్టకు తెల్లటి టవల్ కట్టుకునే వాడు. డ్యూటీ దిగివస్తు పొట్టేలు మాంసం తెచ్చేవాడు గురవయ్యతాత కోసం. తాతకు ప్రత్యేకంగా చిన్న మట్టికుండలో మజ్జిగ చేసి పెట్టేదాన్ని. అప్పటికి పెద్దోడికి ఐదేళ్ళు. చిన్నోడికి మÖడు నెలలు. పదేళ్ళపాటు గురవయ్యతాత ఇక్కడే ఉన్నాడు. ఆయన భార్యకు ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించమంటే నేనే తీసుకెళ్ళాను.
ప్ర. ఇంకెవరెవరు వచ్చేవాళ్ళు.
అమ్మ:- కొండపల్లి సీతారామయ్య, శివసాగర్, సాంబశివరావు (ఐ.వి అనుకుంటున్నాను) మల్లిక్, వెంకటసుబ్బయ్య, రాంబాబు చాలా మంది వచ్చేవాళ్లు. పేర్లు గుర్తు రావట్లేదమ్మ ఒకింత బాధగా అంది. వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టేదాన్ని.
ప్ర. కొట్టు అన్నారు. అది ఎందుకు పెట్టుకున్నారు.
అమ్మ:-పార్టీ పని ఎక్కువవుతుంది. డ్యూటీకి వెళ్లడం తగ్గించాడు. వచ్చిన డబ్బుల్లో కూడా పార్టీకి సగం, మనకు సగం అనేవాడు. జరుగుబాటు తగ్గుతుంది. గట్టిగా మాట్లాడితే పూర్తికాలం వెళ్ళిపోతాను అనేవాడు. అందుకని ఇంటి ముందు చిన్నకొట్టు పెట్టుకున్న.
ప్ర. అండర్ గ్రౌండ్ భూమిలో ఉండేదట కదా?
అమ్మ:-అవునమ్మా అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల అనుకున్నారంట. లోపలి కూర్చుని మాట్లాడుకుంటుంటే టీలు అవి నిచ్చెన మీద నుంచి కిందకి ఇచ్చేదాన్ని. కొద్దిసేపు మాట్లాడుకుని ఊపిరాడక పైకి వచ్చేవాళ్లు. అన్న పూర్తిగా ఉద్యమంలోకి వెళ్లేదాకా పదేళ్లపాటు ఇక్కడిక్కడ ఉంటూనే పార్టీ పని చేసేవాడు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్లకి అందరికీ అన్ని చేసేదాన్ని.
ప్ర.రహస్య పెళ్లిళ్లు, మామÖలు పెళ్లిళ్లు చేస్తున్నప్పుడు మీరు ఇబ్బంది పడ్డారా?
అమ్మ:-ఇబ్బంది అంటే ఆర్థికంగా ఉంది. డా. విజయకుమార్ పెళ్లి, సత్యమÖర్తి కొడుకు పెళ్లి అండర్ గ్రౌండ్‌లోనే రహస్యంగా జరిగాయి. చాలా మంది పెళ్లిళ్లు ఇంటి ముందే జరిగాయి. వీళ్ళందరికి వండటం పెట్టడం పరుగులు తీసేదాన్ని. కొట్లోకి తెచ్చిన సరుకులు కూడా అయిపోయేవి. రెండోవాడు ‘మల్లి’ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని ఏడుస్తా ఉంటే రామారావు వచ్చి వదినా! అన్న ఎన్నో పెళ్లిళ్లు చేశాడు. నువ్వు ఎందుకు ఏడుస్తావు అన్నాడు. నేను ఏడవడం టక్కున మానేశాను.
ప్ర. ఇంత మందికి భోజనాలు, టీలు డబ్బులు ఎలా?
అమ్మ:-రాజకీయాలు తెలియక ముందు డ్యూటీకి వెళ్లి వచ్చిన డబ్బులన్ని నాకే ఇచ్చేవాడు. ఏమైనవి? ఏం చేశావు? అని అడిగేవాడు కాదు. దగ్గర కూర్చో బెట్టుకుని అన్ని విషయాలు చెబుతూ ఉండేవాడు. అర్థం చేయిస్తూ ఉండేవాడు. చాలా ప్రేమగా చూసేవాడు. నేనన్న, పిల్లలన్న చాలా ఇష్టం. పార్టీలోకి ఎలా వెళ్ళాడో? ఆయనంటే నాకు చాలా ప్రేమ, ఇష్టం. ఓ రోజు హఠాత్తుగా నేను పీపుల్స్ వార్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. పార్టీ పని చేస్తాను అని చెప్పాడు. వచ్చే పోయే వాళ్లు ఎక్కువ అవ్వటంతో కొట్లోకి తెచ్చుకున్న సరుకులు కూడా ఇంట్లోకి వాడేదాన్ని.
ప్ర. పార్టీ ఏమి సహాయం చేసేది కాదా?
అమ్మ:- పార్టీ ఇప్పటిలా అప్పుడు అభివృద్ధి చెందలేదమ్మ. వాళ్లకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తిరిగి తిరిగి ఆకలితో వచ్చే వాళ్ళు. వాళ్లకు అన్నం పెట్టకుండా ఎలా ఉండగలం. పార్టీ దగ్గర డబ్బులే ఉండేవి కావు. వారికే లేకుంటే మనకు ఎలా ఇస్తారు. అమ్మలో దృఢత్వం స్పష్టంగా తెలుస్తుంది.
ప్ర.అన్న వెళ్లిన తర్వాత మీ పరిస్థితులు, ఎలా బ్రతికారు చెప్పండి.
అమ్మ:- అన్న వెళ్ళిన తర్వాత అంతా అగమ్య గోచరం. పోలీస్ దాడులు. పద్నాలుగేళ్ళు కూడా నిండని పెద్దోడిని పట్టుకెళ్ళడం. స్టేషన్లలో వేయటం. వేతుకోవడం. పోలీస్ స్టేషన్ల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగడంగా ఉండేది.
ప్ర. కొంచెం వివరంగా చెప్పమ్మ అన్నాను.
మీ అన్నయ్య ఉండగానే పోలీసులు రావడంతో పూర్తిగా అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయాడు. పోలీసులు వచ్చి తిరుగుతుండే వాళ్ళు. ఏదన్నా అయితే లాయర్ వై.కె గారి దగ్గరకు వెళ్ళమని ఈయన చెప్పారు. వాళ్ళ నాన్న కోసం పది చదువుతున్నపుడే శ్రీనును పట్టుకెళ్లారు. వాడు పిల్లోడు అయ్యా 14 ఏళ్లు కూడాలేవు అంటే, బాగా పొడవుగా ఉండటంతో 17, 18 ఏళ్లు ఉంటాయని వాళ్లే కన్నట్టు పట్టుకెళ్ళారు. లాటితో కాలు బొటనవేలు గోరు మీద పొడవడంతో ఇప్పటికీ ఆ గోరు పెరగదు. అలా కాలిలోనే ఉండిపోయింది. అది అనుభవించిన వారికే తెలుసు దాని భాద ఏమిటో. తల్లిగా ఎంత ఏడ్చుమునేదాన్నో. అన్ని కష్టాలలో కూడా శ్రీను, బిక్కి రాములు కొడుకు పదవ తరగతి సెకండ్ క్లాస్‌లో పాసయ్యారు. వీళ్ళు పాస్ అయిన విషయం ఓ మీటింగులో స్టేజి మీద నుండి చెప్పారు.
ఏం జరిగినా శ్రీనును పట్టుకెళ్లేవాళ్ళు. ఏ స్టేషనో చెప్పేవాళ్ళు కాదు. తెల్లారి నేను వెళ్లి స్టేషన్లన్నీ తిరిగేదాన్ని. లాయర్ల దగ్గరకు, తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్లి అరెస్టు సంగతి చెప్పేదాన్ని. ఇలాంటప్పుడు కొట్టు తీయడానికి, పనికి వెళ్ళడానికి కుదిరేది కాదు. ఓసారి శ్రీనును పట్టికెళ్లగానే, అర్థరాత్రి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస కాలనీకి నడుచుకుంటూ వెళ్లాను.
ఇంకొకసారి శ్రీనుతోపాటు గుజ్జనగుండ్ల రామారావును కూడా పట్టుకెళ్లారు. గుంటూరులో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ కాయితాలు పట్టుకొని తిరిగాను. ఏ స్టేషన్‌లోను లేడనేవారు. నాలుగు రోజుల తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టి పంపిస్తామన్నారు. శ్రీను ఇంటికి వెళ్లి నీళ్లు కాగపెట్టు, స్నానం చేస్తా అన్నాడు. ఎంతసేపు చూసినా రాలేదు. స్టేషన్‌కి వెళ్లి అడిగితే వెళ్ళిపోయాడని చెప్పారు. లాయర్ వై.కె దగ్గరికి వెళ్లి చెప్పాను. లాయర్ గారు పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసినా, ఏ స్టేషన్‌లోను లేడు అని చెప్పారు. గుజ్జనగుండ్ల వెళ్లి రామారావుని అడిగితే వదిన! నన్ను ముందు వదిలిపెట్టారు. వచ్చాను. లాయర్ పాతూరు వెంకటేశ్వర్లుగారి దగ్గరకు వెళ్ళమన్నాడు. ఏడ్చుకుంటూనే వెళ్లాను.
లాయర్ వెంకటేశ్వర్లుగారు కలెక్టర్, ఎస్పీ, జడ్జిగార్లకు టెలిగ్రామ్ మెసేజ్లు పంపించారు. ఈ మెసేజ్లే ఇవ్వకపోతే మా శ్రీను నాకు దక్కేవాడేకాదు. ఆరోజు ఓపోలీసు వచ్చి మా అబ్బాయి చుట్టాల ఇంటికి వెళ్లి ఇంటికి వచ్చాడు అని చెప్పమన్నాడు. రాకపోతే వచ్చాడని ఎలా చెప్తాను అన్నాను. ఆ సాయంత్రానికి శ్రీను వచ్చాడు. ఎంక్వయిరీ కోసం తెల్లవారి కలెక్టర్ ఆఫీస్‌కు పిలిచారు. జీపులు మీద జీపులు పరిగెత్తుకొచ్చాయి. పెద్ద గొడవ అవుతుంది అని భయపడ్డాను. అమ్మ మీ అబ్బాయి వచ్చాడా అన్నారు. వచ్చాడయ్యా అన్నాను. నా పక్కనే ఉన్న పోలీస్ వెంటనే బయటికి పంపించాడు ఇంకా నేనేమైనా చెప్తానేమోనని. ఈ గొడవలతో శ్రీను ఫీజు కోసం ఉంచిన డబ్బులు మÖడువేలు తిరుగుళ్లకు, కోర్టు ఖర్చులకు అయిపోయాయి. శ్రీను బోరుమన్నాడు. నువ్వుంటేనే కదయ్యా కాలేజీ ఫీజులు, పరీక్షలు. తాతయ్య దగ్గరకు వెళ్లి తెచ్చుకుందామని చెప్పాను.
ప్ర.అమ్మ మిమ్మల్ని ఎప్పుడన్నా అరెస్ట్ చేశారా?
అమ్మ:- లేదమ్మా. ఓసారి శ్రీను ఎన్ని దెబ్బలు కొట్టిన చెప్పడం లేదని వాళ్ళమ్మని పట్టుకుని రమ్మన్నారట. ఆ స్టేషన్లో పోలీస్ పనిచేసే ఓ చుట్టాలతను డ్యూటీ దిగిపోతూ ఇట్లా అనుకుంటున్నారు ఇంట్లో ఉండొద్దని చెప్పాడు. పిల్లలిద్దరిని తీచుకొని మా అక్క కూతురు ముట్లూరులో ఉంటే వెళ్లాను. లాయర్లు, మనోళ్ళు, మా అక్క కొడుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విడిపించారు. పెద్దోడిని ఎన్నిసార్లు పట్టుకెళ్లారో!? లెక్కేలేదు. ఇంకొకసారి రెండో వాడిని కూడా పట్టుకెళ్లారు. ఈయన ఎన్కౌంటర్ హత్య తర్వాత ఆ పట్టుకెళ్లడం తగ్గింది.
ప్ర. పిల్లలు నాన్న వల్లనే ఇన్ని అని ఎప్పుడూ అనలేదా?
అమ్మ:-లేదమ్మా. నేను కానీ, పిల్లలు కానీ ఎప్పుడూ ఏమీ అనలేదు. ఇప్పటికీ కూడా ఏమీ అనరు. సూర్యంగారంటే మా అందరికీ, మా చుట్టుపక్కల వాళ్ళకి, మా చుట్టాలకి బాగా ఇష్టం. స్టాలిన్ చిన్నవాడు. స్టాలిన్‌ని ఎప్పుడు పట్టికెళ్లలేదు. పైగా అన్నదమ్ములు ముగ్గురు, ఇవాళ పలానచోట బస్సు కాల్చేశారు. “బావా”వాళ్ళు (పోలీసులు) వస్తారని నవ్వుకునేవాళ్లు. అలాంటప్పుడు బెయిల్ రావడానికి నాలుగు రోజులు పడుతుందని, మాచిపోని మందపాటి చొక్కాలు చూసి, అక్కడా ఇక్కడా వెతికి ఉన్నంత వరకు జేబులో డబ్బులు పెట్టి, వాళ్ళు వచ్చినప్పుడు ఇది వేసుకుని పొండయ్య అని చెప్పేదాన్ని.
ప్ర. ఎలా బ్రతికారు?
అమ్మ:- ఇప్పుడు చెపుతుంటే తేలిగ్గానే, ఆ ఏముందిలే అనిపిస్తుంది. కానీ అప్పుడు చాలా కష్టాలే పడ్డాం. మీ అన్న ఉన్నప్పుడే చిన్న కొట్టు పెట్టుకున్నాను కదా. అన్న వెళ్లేటప్పటికే పూరీల్లు. కొద్దిగా డాబా. కాళి స్థలం బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చాడు. పిల్లలు చిన్నోళ్ళు. తిండి, చదువులు కష్టంగా ఉండేది. మా అత్తగారి వైపు వాళ్లు భయమేసి దగ్గరకు రానివ్వలేదు. నేను నోరు తెరిసి అడిగేదాన్ని కాదు. మా అక్కవాళ్ళు, అమ్మానాన్న బాగా సహాయం చేసేవాళ్ళు. అయినా ముగ్గురు పిల్లలు నేను నలుగుర. ఎంతకాలం అట్లా ఆధారపడను. పెద్ద పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లి వాళ్ళ నాన్నకు కళ్ళు కనిపించవని చెప్పి చిలకలూరిపేట హాస్టల్లో చేర్చాను. ఓసారి కుటుంబం గురించి రాయమంటే మా నాన్న లారీ డ్రైవర్. మాకు గుంటూరులో స్వంత ఇల్లు ఉందని పెద్దోడు రాశాడు. దాంతో హాస్టల్ వాళ్ళు పెట్టెలిచ్చి ఇద్దరినీ పంపించారు. సంవత్సరం తిరగకుండానే వాళ్ళు రావడంతో ఇక్కడ హాస్టల్లో ఉన్న చిన్నోడు నేను ఫోను అన్నాడు. కలిసినప్పుడు ఈయనకు చెప్తే సరే పెద్దోళ్ళు ఇద్దరు వచ్చారు కదా. చిన్నోడు కూడా హాస్టల్లో వద్దులే అన్నాడు. నలుగురం ఎట్లా బ్రతకాలి అని ఏడిస్తే, ఓదార్చి ఇంతకన్నా కష్టాలు పడుతున్నవాళ్ళు ఉన్నారని నచ్చజెప్పాడు. మా నాన్న కూడా హాస్టలుకు పంపించవద్దు అన్నాడు. ఆ సమయంలో మా అక్క కూతురు ఐదు బస్తాల వడ్లు మర వెయించి పంపించింది. అలా ఎంతకాలం అనుకున్నాను.
మా ఇంటి దగ్గర కూడా చిన్నప్పటి నుంచి చాకిరి చేసిన వాళ్ళమే. వేకువ జామున లేచి పని అంతా చేసి కొట్టు తీసేదాన్ని. వీళ్ళని స్కూలుకు పంపించి, పని ఉంటే పనికి వెళ్లేదాన్ని. రాత్రి 7గం నుండి తెల్లవారి ఐదు గంటల వరకు పత్తి మిల్లులో జిన్నింగ్ చేసేదాన్ని. ఏడు రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళు. పాసుకు ఒకగంట టైం ఇచ్చేవాళ్ళు. అప్పుడు దబదబా వెళ్లొచ్చి, తోటోళ్లు బోరాల చాటున పడుకుంటే, నేను పత్తి బోరాలకు అంటుకున్న పత్తిని వేరేదాన్ని. రెండు బోరాలు వేరితే రెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు. పత్తిమిల్లు లేనప్పుడు పొలం పనులకు వెళ్లేదాన్ని. ఇంటికి వచ్చి కొట్టు తీసేదాన్ని. బ్యాంకులోను, అప్పులు, తిండి తిప్పలు బట్టలు, ఫీజులు కష్టంగానే ఉండేది. నేనే కాదు, నాతోపాటు పిల్లోళ్ళు కష్టపడ్డారు. పొలం పనికి వెళ్తా రెండోవాడు మల్లిని తీసుకెళ్లేదాన్ని “జొన్నలగడ్డ” దాకా మరో కూలి వచ్చిదని. పెద్దోడు శ్రీను పేపర్ వేయడానికి, నేను పత్తిమిల్లు నుండి రాకముందే పేపర్లు వేయడానికి వెళ్ళేవాడు. రోజు 200 పేపర్లు సైకిల్ మీద సగం గుంటూరు తిరిగి వేసాడు. అలా ఒకరోజు వెళుతున్నప్పుడు వాళ్ళ నాన్న కనిపించి ఆపి జాగ్రత్తలు చెప్పి వెళ్లారట. ఇంటికొచ్చి చెప్పగానే ఇద్దరం కన్నీళ్లు పెట్టుకున్నాం. అలా పేపర్ వేయడానికి వెళ్ళిన ఓరోజు పాము కనిపించింది అని చెప్పాడు. పెద్దోడి ఒళ్లంతా తడిమి చూసుకున్నాను.
స్కూలుకు వెళుతూనే సెలవు వస్తే మల్లి సున్నప్పనికి వెళ్లేవాడు. స్టాలిన్ ఇంకా చిన్నవాడు. ఓ రోజు స్టాలిన్ సున్నప్పనికి వెళ్లి అది లేదని వస్తూ ఉంటే తారురోడ్డుకు నీళ్లు పోస్తావా? డబ్బులు ఇస్తామన్నారట. తారురోడ్డుకు నీళ్లు పోసి సాయంత్రం మోకాళ్ళ వరకు తారుతో, ఆరో ఎడో రూ.కూలి తీసుకుని వచ్చాడు. వేడినీళ్లు పెట్టి ఏడ్చుకుంటూ రుద్ధిరుద్ది స్నానం చేయించా. అది పోయిద్దా చచ్చిదా. అన్నం తినకుండా నాలో నేను ఏడ్చుకుంటూ పడుకున్న.
ప్ర. చదువులు మానేశారా?
అమ్మ:- లేదమ్మా చదువుతూనే ఉన్నారు. చదువుకుంటూనే పనులుకెళ్లేవాళ్లు. మా పెద్దోడి కష్టం ఇంతని చెప్పలేం అంటూ నిబ్బరంగా ఉన్న ఆమె పెద్దగా ఏడ్చేసింది. (అత్తయ్య ఏడుస్తుంది అని శ్రీనుకు ఫోన్ చేసిందట. శ్రీను వచ్చి మేము మాట్లాడుకుంటుంది చూసి, విష్ చేసి వెళ్ళాడు. రాజేశ్వరి తర్వాత చెప్పింది)
పత్తి మిల్లులో కొంతకాలమే పని ఉండేది. ఇంట్లో గడియారం లేదు. అవేంటో కూడా తెలియదు. టైం తెలిసేది కాదు. టైం అవుతుందని ముందే వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి పోలీసులు ఆపి అడిగేవారు. ఎక్కడికి? ఏంటి? అని. ఈనాడు పేపర్ వేయటానికి అంటే నిజమా? టైం ఎంత అయింది అని అడిగేవాళ్లు. నాలుగు గంటలకి వెళ్లాలి అంటే, పిచ్చోడా! టైం కాలేదని వెనక్కి పంపించేవాళ్లు. నేను రాత్రిపూట పత్తి మిల్లుకు వెళితే చిన్నోళ్ళిద్దరినీ పెద్దవాడే చూసేవాడు.
ప్ర. సూర్యమన్న కోసం రాజమండ్రి జైలుకు ఎంతకాలం తిరిగారు?
అమ్మ:-ఈయన్ను ఏలూరులో అరెస్ట్ చేశారు. పది రోజుల వరకు ఏమైంది తెలియదు. బాగా భయపడిపోయాం. పదిరోజుల తర్వాత పార్టీ వాళ్లు బస్సును తగలబెట్టి కోర్టులో హాజరు పరచాలని ప్రకటన ఇచ్చారు. అప్పుడు హాజరు పరిచి, రాజమండ్రి జైలుకు పంపించారు. సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు. నెలకొకసారి రమ్మన్నా, 20 రోజులకు ఒకసారి రెండు రకాల పచ్చళ్ళు, ఆపిల్స్, నిమ్మకాయలు, నిల్వ ఉంటాయని ఎండు ఖర్జూరం 2 కేజీలు పట్టుకు వెళ్ళేదాన్ని.
జైల్లో ఉండగానే అన్నకు ఆపరేషన్ చేశారు. అక్కడికి వెళ్ళినదాకా నాకు తెలియదు. పోలీసుల మధ్య నినాదాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఆపరేషన్ ఎట్లా జరిగిందో అని గట్టిగా వాటేసుకుని పెద్దగా ఏడ్చాను. పోలీసులు ఆపరేషన్ బాగా జరిగిందమ్మ ఏడవకు అని ఓదార్చారు. కింద ఐదుగురు, పైన ఐదుగురు, ఆపరేషన్ థియేటర్ ముందు ఐదుగురు, మొత్తం 15 మంది పోలీసులు ఉన్నారట. ఇప్పట్లాగా అద్దాల్లో కాకుండా మామÖలుగానే కూర్చొని మాట్లాడుకొనిచ్చేవాళ్ళు.మేమున్నంతసేపు కొబ్బరినీళ్లు తాపిస్తూనే ఉన్నాం.
మళ్లీ వెళ్లినప్పుడు బెయిల్ ఇచ్చారు. షూరిటీ పెడతావా అన్నారు.వెళ్ళను అంటే పెడతాను అన్నాను. నువ్వు పెట్టకపోయినా వెళతాను. షూరిటీ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు. విడుదలై వచ్చిన తర్వాత పది రోజులకే వరంగల్లులో రైతు, కూలి సభలు మొదలయ్యాయి. నిర్వహణ కోసం ప్రధాన బాద్యుడిగా వెళ్లాడు. వస్తానే ఇద్దరిని తీసుకొని వచ్చాడు. కొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరితో వెళ్లిపోయాడు.
ప్ర. చెప్పే వెళ్లారా?
అమ్మ: విజయవాడ నుండి వస్తుంటే పోలీసులు వెనకే వస్తున్నారట. వాళ్లకు ఓ 1000 ఇచ్చి ఏదో చెప్పి వచ్చాడట. ఇక్కడ ఉంటే కష్టం వెళ్ళిపోతానని చెప్పారు. ఏడుస్తూనే ఒప్పుకున్నాను. ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వెళ్ళిపోతాడని తెలుసు.
ప్ర. అండర్ గ్రౌండ్ కు వెళ్ళిన తర్వాత అన్నను కలిసారా?
అమ్మ:-కబురు చేసినప్పుడు, అన్ని జాగ్రత్తలతో పెద్దోడిని తోడు తీసుకుని వెళ్లి కలిసేదాన్ని. ఓసారి సూర్యంగారి ఫోటోలు రైల్వే, బస్ స్టేషన్లో, గోడలమీద, వీధుల్లో వేశారు. (ఒంగోలు రైల్వే స్టేషన్లో ఈ ఫోటోలు చూసి ఆయన బ్రతికే ఉన్నాడని నాకు తెల్సింది) పెద్దోడి జుట్టు వాళ్ళ నాన్నలాగే ఉండేది. ఆ ఫోటోలు వచ్చిన తర్వాత శ్రీనును తీసుకొని వెళ్ళినప్పుడు శ్రీనును తీసుకురావద్దు అని చెప్పాడు. ఫోటోలు వచ్చిన తర్వాత రెండో వాడిని తోడు తీసుకెళ్ళేదాన్ని. ఉత్తరాలు పెద్దోడికి రాసేవాళ్లు.నాకు చదువు లేదు. పెద్దోడు చదివి వినిపించేవాడు. ఈయనకు మాంసం అంటే ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా ఫ్రై చేసుకుని, బట్టలు కూడా తీసుకెళ్లే దాన్ని. ఓసారి కొరియర్ వచ్చి తీసుకుని వెళ్ళాడు. విపరీతమైన జ్వరం. లేపి కొంచెం అన్నం తినిపించాను. బాగాలేని మనిషిని వదిలేసి బాధగా (పైకి ఏడ్చే పరిస్థితి లేదుగా)మనసులో ఏడ్చుకుంటూనే వచ్చాను. మరోసారి కలిసినప్పుడు శ్రీను పెళ్లి విషయం మాట్లాడి, వాళ్ళ చెల్లెల కూతుర్ని చేసుకోమని, ఖర్చులు వరకే తీసుకో, ఎక్కువగా అడగవద్దు అని చెప్పాడు.
ప్ర.చివరిసారిగా ఎప్పుడు కలిశారు?
అమ్మ:- శ్రీను పెళ్లి (ఆగస్టు 24,1994న) అయిన తర్వాత 16 రోజుల పండుగ రోజు సాయంత్రం వెళ్లి కలిశాను. అదే చివరిసారి అవుతుంది అని నేను అనుకోలేదు. మళ్ళీ కలుస్తాననే అనుకున్నాను. చెపుతు అమ్మ గట్టిగా ఏడ్చింది.
ప్ర.చదువురాదు కదా?అప్పులు ఇస్తే ఎలా?
అమ్మ:-సూర్యంగారు కొద్ది కొద్దిగా చెప్పాడు. కందిపప్పు అంటే క, బెల్లం అంటే బ, బియ్యం బి రాసుకునేదాన్ని. అప్పటికీ ఇప్పటికీ నన్ను ఒక్కళ్ళు కూడా ఇది మేము తీసుకెళ్లలేదు అని అనలేదు. నన్ను ఒక్కరు ఒక్క మాట అనిగాని, ఒకళ్ళను నేను అనిగాని ఎరగం. ఇప్పటికీ అందరూ చాలా గౌరవంగా చూస్తారు.
ప్ర. ముగ్గురు కొడుకులు సెటిల్ అయ్యారా?
అమ్మ:- పర్వాలేదురా. పెద్ద పెద్ద ఉద్యోగాలు కావు. పెద్దోడు ప్రైవేట్ కాలేజీలో, చిన్నోళ్ళు ఇద్దరు లాయర్‌ల్లగా చేస్తున్నారు. కోడళ్ళు ముగ్గురు కూడా కష్టం చేస్తున్నారు. అందరూ రెక్కల కష్టం మీదే బ్రతుకుతున్నా, ఒక్కరికి సొంత ఇల్లు లేదు. అన్న సంపాదించిన ఇల్లు కూడా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాతనే పోయింది. ఒక్కరి కన్నా చిన్న ఇల్లు ఉంటే బాగుండు (చిన్న దిగులుగా) అంది. వెంటనే తేరుకుని కొడుకులు కోడళ్ళు పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉంటారు. నన్ను బాగా చూస్తారు. ఇంకేం కావాలి. సంతోషం ఉట్టిపడుతూ అన్నారు.
ప్ర. పొలం ఉందా?
అమ్మ:-లేదమ్మ. ఏ ఆడపిల్లకు ఇబ్బంది వచ్చినా కొద్దికొద్దిగా అమ్మేవాడు. అలా అమ్మి నాకు యాభై వేలు ఇచ్చాడు. పంపు వేయించుకున్నాను. మిగిలినవి ఈయన చనిపోయినప్పుడు అయిపోయినవి.
ప్ర. సూర్యంగారి మీద కోపంగా ఉందా?
అమ్మ:- అలాంటివి ఏమీ లేవమ్మ. ఆ ఫోటోలో ఉన్నట్లు నా మనసులో ఎప్పటికీ ఉంటాడు నేను ఉన్నంతకాలం. కానీ రెండు విషయాల్లో చిన్న బాధ అయితే ఇప్పటికీ ఉంది.
ఏమిటన్నట్లు చూశాను.
శ్రీను పెళ్లికి ఆయనకు కూడా ఫాంటు షర్టు తీసుకున్నాను. అవి చాలా బాగున్నాయి. శ్రీనుకు నచ్చాయి. అమ్మ ఇవి నేను కుట్టించుకుంటాను. నాన్నకు మళ్ళీ తీసుకుందాం అన్నాడు. సరే అన్నాను. పిలుపు రావడంతో 16వ రోజు పండగయినా వెంటనే వెళ్ళిపోయాను. బట్టలు తీసుకునే సమయం లేదు. ఆ మాట చెప్పి మళ్లీ వచ్చేటప్పుడు తీసుకొని వస్తానని చెప్పాను. ఆ బట్టలు ఎప్పటికీ ఇవ్వలేకపోయాను. అదో పెద్ద బాధ నాకు. కళ్ళు తుడుచుకుంది. ఆరోజు పెళ్లి, భోజన విషయాలు చెబుతున్నాను. ఎప్పుడు ఒక్కమాట కూడా అనని ఆయన ఇక ఆపు అని కొంచెం గట్టిగా అన్నాడు. కోపం వచ్చి నేను ఇంకేమీ మాట్లాడలేదు. ఆమాట ఎందుకు అన్నాడా అని ఇప్పటికీ ఆలోచిస్తున్నాను. నేను పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ ఆయన మీద మాకు ఎలాంటి కోపము లేదు. ప్రేమ, ఇష్టం తప్ప. గట్టిగా ఇప్పటికీ ఒక్క మాట అనలేదు.
ప్ర. చివరిగా మీ ఇద్దరి గురించి చెప్పండి.
అమ్మ:- మేమిద్దరం చాలా సరదాగా ఉండే వాళ్ళం చాలా అర్థం చేయించేవాడు. మీ వారివైపు, మా వారివైపు ఒకేసారి
పెళ్లిళ్లు జరుగుతుంటే మావారి వైపు వెళ్ళు. మావాడు ఉంటే ఇట్లా చేసేవాడా అని అంటారు. అందుకని మావారివైపు వెళ్ళు అనేవాడు. ఓసారి కలిసినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అన్నాడు. నేను నిన్ను చేసుకోవడం నా దరిద్రం అన్నాను. గట్టిగా నవ్వాడు. మా గురించి ఆలోచించావా అన్నాను. అప్పుడు ఎంతో మంది గురించి చెప్పాడు. ఇట్లా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. ఇక్కడ ఉన్నంత కాలం, ఇక్కడే ఉండి పార్టీ పని చేసిన పదేళ్లు, నాకు ఏదీ లోటు చేయలేదు. ఉన్నంతలో బాగా చూశాడు. నన్నేకాదు అన్నదమ్ముల్ని అక్కచెల్లెళ్ళల్ని కూడా. లారీలో ఎటువైపు వెళ్లినా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు. ఆయన ఇక్కడ ఉన్నంతకాలం నేను ఒక్క జాకెట్ ముక్క కూడా కొనుక్కోలేదు. నాకు పిల్లలకి అన్ని తనే తెచ్చేవాడు. ఆయన నన్ను చాలా ప్రేమించాడు. అలాంటి మనిషి ఎలా వెళ్లాడు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. నాతోపాటు పేద ప్రజలను ప్రేమించాడు. కనుకనే అమరుడైయ్యాడు. చరిత్రలో నిలిచిపోయాడు.
ప్ర. లారీడ్రైవర్‌గా అలా నిలిచిపోగలడా?
ఆయనది సహజం మరణం కాదు. కాల్చి చంపినది. హత్య. నెల్లూరు నుంచి ఆయన్ని ఎలా తెచ్చుకున్నామో కదా!? కొడుకుని చూడగానే మా అత్తగారు చనిపోయారు. ఒకవైపు మా అత్తగారి అంత్యక్రియలు. మరోవైపు హైదరాబాదుకు రెండవసారి పోస్ట్‌మార్టం కొరకు తరలించడం. శవంపై ఏడు బుల్లెట్ గాయాలు. మన లాయర్లు కోర్టులో కేసు వేశారు. ఎర్రజెండాలు. నినాదాలు. ఆయన కోరుకున్నట్లు పూలతో, గొప్ప ఊరేగింపుతో ఆయనను సాగనంపారు. అమ్మ చీర కొంగుతో కళ్ళను అద్దుకుంది. ఊరటగా నేను భుజం మీద చేయివేసి దగ్గరకు తీసుకున్నాను. చరిత్ర సృష్టించిన మనుషులు వీరు కదా!? చరిత్ర అంటే ఇదికదా? అమ్మలాంటి చరిత్రలోకి ఎక్కని, ఎర్రజెండా కోసం బాధలు పడిన మహిళలు ఎందరో? ఎందరో?
