జానకీ అమ్మాళ్ – పరిశోధనాయోధ, సద్గుణాల పోగు – డా. నాగసూరి వేణుగోపాల్

భారతీయ మహిళా శాస్త్రవేత్తలు చాలా గుండె దిటువుతో పలురకాల వివక్షలనెదుర్కొంటూ పనిచేశారు. ఒకవైపు బ్రిటిష్ వారి దయాదక్షిణ్యాలతో ఉన్న అరకొరా విద్యా సౌకర్యాలు, మరొకవైపున మన సమాజంలో నెలకొనుబడ్డ పేదరికం, దానికి మించి పలు రకాల వివక్ష.

ఇటువంటి నేపథ్యంలో ప్రతి మహిళా శాస్త్రవేత్త ఒక అఖండమైన పోరాట దీపిక. తొలి దశలో వైద్యం చాలా అవసరమైన విషయంగా బ్రిటిష్ వారికి అర్థమైంది. ఆ మార్గం ద్వారా ఈ సమాజంలోకి చొచ్చుకు రావచ్చని వారు భావించారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య విద్యలో మహిళలకు ప్రవేశం లేదు. మన దేశంలో మహిళలకు ప్రవేశం కల్పించిన మొదటి మెడికల్ కళాశాల మద్రాసు మెడికల్ కళాశాల. కనుకనే జగదీశ్ చంద్రబోస్ భార్యగా కూడా ఖ్యాతి వహించడమే కాకుండా ప్రఖ్యాత సంఘసేవిక సిస్టర్ నివేదిత మిత్రురాలైన అబలాబోస్ కలకత్తా మెడికల్ కళాశాలలో ప్రవేశం లభించక మద్రాసు వచ్చారు. డఫ్రిన్ ఫండ్ తోడ్పడుతో ఆనంది భాయ్ జోషి, కాదంబరి గంగూలీ వంటి మన భారతీయ వనితలు విదేశాలలో ఆధునిక వైద్య విధానాన్ని నేర్చుకొని వచ్చారు. కనుక తొలి దశలో అంటే 1900 సంవత్సరాలకు పూర్వం జన్మించిన మహిళా శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది వైద్యశాస్త్ర పారంగతులైన వనితలే కనబడతారు. వైద్యశాస్త్ర అధ్యయనం కోసం అవసరమైన జీవశాస్త్రాలు నేర్చుకోవడం తప్పనిసరి. కనుకనే మనకు ఆధునిక భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తలలో తొలితరం పదార్థ విజ్ఞానానికి సంబంధించి కాకుండా జీవశాస్త్రోలకు సంబంధించి తారసపడతారు. భౌతిక రసాయన శాస్త్రాలు, జంతు వృక్ష శాస్త్రాలు, గణితం ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ వీటితోపాటు అనేక విభాగాలకు చెందిన ఆధునిక భారతీయ తొలి మహిళా శాస్త్రవేత్తల కృషిని వారి జీవిత విశేషాలతో పాటు తెలియజేయాలని ఈ ధారావాహిక ఉద్దేశం. అలా కనపడే తొలి ఆధునిక భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాళ్. ఈమె ఒక్కరే 1900 ముందు జన్మించిన మహిళా శాస్త్రవేత్తగా ప్రత్యేకత కలిగి ఉన్నారు.
జానకి అమ్మాళ్‌గా ప్రాచుర్యం పొందిన ఎదవలెత్ కక్కాట్ జానకి అమ్మాళ్ 1897 నవంబర్ 4న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ (ఇప్పటి కేరళ) లోని టెల్లిచేరిలో జన్మించారు. శ్రీమతి దేవకి, దివాన్ ఈ కె క్రిష్ణన్ ఆమె తల్లిదండ్రులు. వారి పన్నెండు మంది సంతానంలో జానకి ఒకరు. టెల్లిచెరిలోనూ, తర్వాత మద్రాసులో క్వీన్ మేరీ కాలేజీ, ప్రెసిడెన్సీ కాలేజీల్లో చదివారు. సైటాలజి, జోవెటెక్స్, ఫైటో బయోలజి, ఎథ్నో బాటనీ, ఔషధ మొక్కలు, క్రోమోజోముల ప్రవర్తన ఇలా పలు రకాలుగా కృషి చేసిన జానకి అమ్మాళ్ చాలా ప్రత్యేకంగా కనబడతారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ బొటానికల్ లాబొరేటరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రిల్ మెడిసిన్, కోయంబత్తూర్‌లోని షుగర్కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ … ఇలా ఎన్నో పరిశోధనా సంస్థలలో గణనీయమైన పరిశోధనలు చేశారు.
1921లో మద్రాసు యూనివర్సిటీ నుంచి బి.ఎస్సీ ఆనర్స్ డిగ్రీ పొందారు. మద్రాసులోనే ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో లెక్చరర్‌గా 1921 లోనే చేరారు. 1914లో లెవీ ఎల్ బార్బర్ (Levil L Barbour) ఇటు వైపు దేశాల మహిళలు ఆధునిక విజ్ఞానం, వైద్యం, గణితం వంటి రంగాలు అధ్యయనం చేయడానికి వీలుగా స్కాలర్షిప్ ప్రారంభించారు. ఈ స్కాలర్షిప్ తోడ్పాటుతో జానకి అమ్మాళ్ 1925లో మిచిగన్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్సీ డిగ్రీ గడించారు. ఈ డిగ్రీ పొందిన తర్వాత జానకీ అమ్మాళ్ అదే ఉమన్స్ క్రిస్టియన్ కాలేజీలో ప్రొఫెసర్ ఆఫ్ బాటనీగా చేరారు. మళ్ళీ మరలా మిచిగాన్ యూనివర్సిటీకి తొలి ఓరియంటల్ బార్బర్ రీసెర్చి ఫెలోగా వెళ్ళి 1931లో డిఎస్సీ పట్టాను (తొలి భారతీయ మహిళగా కూడా )పొందారు. తిరువనంతపురంలోని మహారాజా కాలేజీ ఆఫ్ సైన్స్‌లో 1932-35 కాలంలో బోధించారు. ఆమెకు మిచిగాన్ విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనే కళాశాలలో చేసే బోధనావృత్తి కంటే ఆకర్షణీయంగా కనిపించింది. కోయంబత్తూరులోని షుగర్ కేన్ బ్రిడింగ్ స్టేషన్ (నేటి షుగర్స్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ )లో 1934-39 మధ్య కాలంలో పూర్తిస్థాయి పరిశోధనలలో దిగారు. ఆ సంస్థ అప్పటికే అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. దీనికి కారకులు సి.ఎ. బార్బర్, టి. ఎస్. వెంకట రామన్ వంటి వారి కృషి కారణంగానే కరువునూ, రోగాలను తట్టుకునే కో-419 చెరకు రకాలు తయారయ్యాయి. ఇక్కడ రూపొందించబడిన చెరకు రకాలు మనదేశంలోనే కాక, చెరుకు పండించే ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందాయి. ఈ సమయంలోనే జానకీ అమ్మాళ్ జెనెటిస్ట్‌గా కూడా పనిచేసి చెరకు, చెరకు సంబంధమైన గడ్డి రకాల సాయంతో సంకర రకాలు సృష్టించారు.
1939 నుంచి 1950 దాకా జానకీ అమ్మాళ్ ఇంగ్లాండులోని జానఇన్స్ హార్టీకల్చర్ ఇన్స్టిట్యూషన్‌లో అసిస్టెంట్ సైటాలజిస్ట్ గానూ, పిమ్మట రాయల్ హార్టి కల్చరల్ సొసైటీలో సైటాలజిస్ట్ గానూ పని చేశారు. ఇంగ్లాండులో ఉన్నప్పుడే గార్టెన్ ప్లాంట్స్‌లోని క్రోమోజోముల గురించి చేసిన అధ్యయనం తర్వాత వాటి పరిణామాన్ని తెలుసుకోవడానికి దోహదం చేసింది. ఆమె పరిశోధనలు యూరో సైంటిస్టుల ప్రశంసలు పొందాయి.
1951లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు తిరిగి వచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థను ఆ సంస్థ డైరెక్టర్‌గా పునర్వ్యవస్థీకరించారు. రెండేళ్ళ తర్వాత సెంట్రల్ బొటానికల్ లాబొరేటరీలో డైరెక్టర్‌గా చేరి 1959లో పదవీ విరమణ చేసేదాకా పరిశోధన చేశారు. ఈ సంస్థ తొలుత లక్నోలోనూ, తర్వాత అలహాబాదు నుంచి పనిచేసింది. 1959లో జమ్ములోని రీజినల్ రీసర్చి లాబొరేటరీలో చేరారు. అక్కడ ఐదేళ్ళు చేశాక, జమ్ములోని రీజనల్ రీసర్చి లాబొరేటరీలోని సైటోజెనెటిక్స్ విభాగాన్ని ప్రారంభించారు. పిమ్మట 1964లో జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రల్ మెడిసిన్ గా నేడు పిలువబడే ఈ సంస్థలో ఎమిరిటస్ సైంటిస్ట్‌గా చేశారు. జమ్మూలో ఉన్నప్పుడే పర్వత ప్రాంతాల వృక్షజాలం గురించి ఆసక్తి పెరిగింది. చైనా, బర్మా, మలేషియాలో వృక్షజాతులు ఎలా సంకరమయ్యాయో ఆమె పరిశోధనగా చూపారు.
కొంతకాలం ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చి సెంటర్‌లో పరిశోధన చేశాక, 1970లో జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీలో హానరరీ ప్రొఫెసర్‌గా చేరి ఐదేళ్లు పరిశోధన చేశారు. ఆ కాలంలోనే లోతుగా చదవడం; విదేశాల్లో పరిశోధన చేయడం, ఢిల్లీ, లక్నో, అలహాబాదు, జమ్ము, బొంబాయి వంటి చోట్ల పరిశోధన కోసం పనిచేయడం మనకు ఆశ్చర్యం కల్గిస్తుంది. ఈ అనుభవాలను ఆవిడ పరిశోధనలుగా మార్చుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వృక్షజాలం ఎలా వ్యాప్తి చెందుతుందో పరిశోధించారు. శీతలంగా, చిత్తడిగా ఉండే ఈశాన్య హిమాలయాల వృక్షజాలం ఏ రకంగా; పొడిగా, చల్లగా ఉండే వాయవ్య హిమాలయాల వృక్షజాలానికి భిన్నమో జానకీ అమ్మాళ్ చూపారు. ఆసియా ఖండపు వృక్షజాలం సంబంధించి ఆమె చేసిన పరిశోధన కూడా విశేషమైనదే! సి.డి. డార్లింగ్టన్‌తో కలసి సిద్ధం చేసిన ‘ది క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటర్ ప్లాంట్స’ గ్రంథం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.
ఆమె తన ఇంటి చుట్టూ ఔషధ మొక్కల తోటను అద్భుతంగా పెంచుకున్నారు. 1935లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యురాలైనప్పుడు ఆవిడ ఆ హోదా పొందిన తొలి భారతీయ మహిళ. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, యూకేలోని లెన్నియన్ సొసైటీ, లండన్‌లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ, జెనెటిక్ సొసైటీ ఆఫ్ అమెరికా, లండన్ లోని రాయల్ హార్టికల్చరల్ సొసైటీ వంటి వాటిలో సభ్యత్వంతో పాటు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శి బాధ్యతలు కూడా నిర్వహించారు.
1956లో మిచిగాన్ యూనివర్సిటీ గౌరవ ఎల్ ఎల్ బి పట్టాను బహూకరించింది. 1957లో భారతప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. తన చివరి రోజు వరకు పరిశోధన చేసిన జానకీ అమ్మాళ్ 86 ఏళ్ల వయసులో 1984 ఫిబ్రవరి 7 న మరణించే కాలంలో ఆమె మద్రాస్ దగ్గర ఉన్న సెంటర్స్ ఫీల్డ్ లాబరేటరీ, మధురవోయిల్ లో పనిచేస్తున్నారు. ఆమె పరిశోధనా పత్రం తొలిసారి 1931లో ప్రచురింపబడగా, ఆఖరిది 1985లో (ఆమె మరణించిన తర్వాత) ప్రచురితమైంది. 2000 సం.లో పర్యావరణ, అటవీ శాఖ జానకి అమ్మాళ్ నేషనల్ అవార్డు ను టెక్సనోమి విభాగంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. జమ్మూ ప్రభుత్వం ఆమెకు గుర్తుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రేటివ్ మెడిసిన్‌లో జానకి అన్యువల్ హెర్బెరియంను ప్రారంభించింది. 2020 సంవత్సరంలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా ‘విజ్ఞాన శాస్త్ర రంగంలో మహిళలు’ అనే ఇతివృత్తంతో పలు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం వేర్వేరు చోట్ల జానకి అమ్మాళ్‌తో సహా 11 మంది ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తల కృషిని గుర్తు చేస్తూ పీఠాలు ఏర్పరిచింది. ఐదున్నర దశాబ్దాల పాటు సాగిన ఆమె పరిశోధన వెనుక – దృఢచిత్తం, పూర్తి స్థాయి భారతీయ అలవాట్లు, గాంధీజీ జీవనశైలి, ప్రచారానికి అర్రులు చాచకపోవడం వంటివి స్పష్టంగా కనబడతాయి. అవసరమైన చోట రాజీ పడకుండా పోరాడిన వ్యక్తిత్వం కలిగిన జానకి అమ్మాయి అవివాహితగానే
ఉండిపోయారు. అంతటి సద్గుణాల పోగు, పరిశోధనాయోధ జానకి అమ్మాళ్ !
– ప్రముఖ పాపులర్ సైన్స్ రచయిత ఆకాశవాణి పూర్వ సంచాలకులు

Share
This entry was posted in సైన్స్ ఆకాశంలో సగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.