బురద నుంచి పుట్టిన
నల్లదామెర మా అవ్వ
మట్టిగోడలతో మొలిచిన గుడిసెకు
గడ్డి కిరీటం పెట్టుకున్న రాణి మా అవ్వ
అడవిలోని ఇప్పచెట్ల కింద
కన్నీటి పూలను ఏరుకుంటూ
నా చిన్నారి దోసిట్లో పోసిన తీపి జ్ఞాపకం
ఇప్పటికీ నా కళ్లల్లో తిరుగుతూనే ఉంటది
కొమ్మలే లేని నిటారు మొర్రిచెట్లను
మా కోసం రెండు చేతులతో బతిమిలాడి
పళ్ళను గుళ్లలోకి దించిన మధురస్మృతులు
నోట్లో నీళ్ళలా గుండెలో ఊరుతూనే ఉంటయి
అవ్వ అడవి నుంచి నడిచొస్తుంటే
ఆకలి పాటలు పాడుతున్న పేగులతో
మా ముగ్గురి చూపులూ
గంప మీద గుడ్డీగలై మూగేవి
తునికాకు కోస్తున్నప్పుడు చూడాలి
మా అవ్వే
ఒక ఆకుపచ్చని అడవిలెక్క కనిపించేది
నాట్లు వేస్తూనో కలుపు తీస్తూనో
కోత కోస్తూనో మోత మోస్తూనో
నిత్యం చెమట పూలతో పరిమళించేది
ఏ ఆకారమూ లేని మట్టిని
మునివేళ్ళతో ప్రేమగా నిమిరి
సాంచ మీద అందమైన ఇటుకలుగా మలిచి
నాన్నతో పాటే ప్రాణ ప్రతిష్ట చేసేది అవ్వ
రెక్కలు ముడుచుకోని పిట్టలా అవ్వ
ఇంటా బయట
కాలాన్ని పనిగుర్రమెక్కించి తోలుతూనే ఉంటది
కూరకుండలో ఏదీ లేనప్పుడు తొక్కు నూరినా
నాన్న తెచ్చిన చేపల కూర చేసినా
మా అవ్వ చేతిలోని అదృశ్య మంత్రదండమేదో
మా కంచాల్లో అమృతం కురిసేది
నాయిన వీలు కాదన్నా వినకుండా
పట్టుబట్టి నా నెత్తిమీద
నాలుగు అక్షరాలను రాల్చింది అవ్వ
అందుకే నెలనెలా నా జేబులో రాలుతున్న
జీతం రాళ్ళమీద
చదువురాని అవ్వ వేలిముద్రలే కనిపిస్తయి నాకు
ఇన్ని చిక్కులమధ్య
ఇప్పటికీ నన్ను బతికిస్తున్నది
ఆక్సిజన్ లాంటి అవ్వ ప్రేమనే
