` అనువాదం: ప్రభాకర్ మందార
పులిమామిడిలో ఒక రెడ్డి కుటుంబం వేలాది ఎకరాల భూమిని ఆక్రమించుకున్న వైనం గురించి నేను విన్నాను. పులిమామిడి లోని మాదిగలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గొల్ల, కురుమ వంటి చేతివృత్తుల కులాల వాళ్లు కలసి 1986 మొదట్లో సంఘం వద్దకు వచ్చారు. తమ భూ సమస్య గురించి చర్చించారు.
జబ్బార్‌గూడెంలో అప్పుడు విత్తనాలు నాటే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. జబ్బార్‌గూడెం పత్రాలు పరిష్కరించబడ్డ వెంటనే నేను సంక్లిష్ట మైన పులిమామిడి సమస్య మీద పనిచేయడం ప్రారంభించాను.
గ్రామంలో భూస్వాములు అంత శక్తిమంతులుగా లేనప్పుడు విచిత్రంగా ఆ ఊరి జనం కూడా స్తబ్ధుగా వుండటాన్ని నేను గమనించాను. అలాగే భూస్వాములు బాగా బలవంతులైనప్పుడు జనం కూడా వారికి దీటుగా తమ ప్రతిఘటనను, ధైర్యాన్ని, శక్తిని పెంచుకునేవారు. పులిమామిడి గ్రామం హైదరాబాద్ నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలంలో వుంటుంది. 1961 జనాభా లెక్కల నివేదిక ప్రకారం పులిమామిడి పులులు తిరిగే అడవులున్న ప్రదేశం. ఇక్కడ మామిడి తోటలు ఎక్కువ. అందుకే ఆ ఊరికి పులిమామిడి అనే పేరు వచ్చిందంటారు. మరో కథనం ప్రకారం ఇక్కడ పండే మామిడి చాలా పుల్లగా వుండేవట. అందుకే ఈ ఊరుకు పుల్ల మామిడి అని పేరు వచ్చిందని అదే ఆతరువాత పులిమామిడి అయిందని అంటారు. ఏదిఏమైనా పులిమామిడి ప్రజలు నిజంగా పులులే.
ఈ గ్రామం రంగారెడ్డి`మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో వుంటుంది. ఆ చుట్టు పక్కల ఇదే అతి పెద్ద గ్రామం. అన్ని కులాల వాళ్లు ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడి వివాదాస్పద భూమి ఏకంగా 1,800 ఎకరాలుంటుంది. మరే గ్రామంలోనూ ఇంత పెద్ద మొత్తంలో భూమి ఆక్రమణకు గురికాలేదు. 1948లో తెలంగాణాపై పోలీస్ యాక్షన్ జరిగినతరువాత అనేక గ్రామాల నుంచి కులీన ముస్లింలు పారిపోయినట్టే పులిమామిడిలో షంషద్ ఉద్దౌలా అనే జాగీర్దార్ కూడా అన్నీ వదిలేసి నగరానికి పారిపోయాడు. ఆయన వద్ద గుమాస్తాగా పనిచేసే పట్వారీ కొత్తపల్లి రామచంద్రా రెడ్డి గప్‌చుప్‌గా ఆ జాగీర్దార్ భూములనన్నింటినీ పట్టా రికార్డులలో తన పేరిట రాసేసుకున్నాడు. ఆతరువాత షంషద్
ఉద్దౌలా కుమారుడు ఆజర్ హుస్సేన్ తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పట్వారీపై అనేక సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.
రామచంద్రా రెడ్డి తండ్రి పుల్లారెడ్డి యాచారంలోని కొత్తపల్లి గ్రామం నుంచి పులిమామిడికి 1910 ప్రాంతంలో వలస వచ్చాడు. ఒక పాత కార్యకర్త మాతో ‘పుల్లారెడ్డి ఈ ఊరికి పొట్ట చేత పట్టుకొని వచ్చిండు’ అని చెప్పాడు. 1940ల నాటికి పుల్లారెడ్డి ముగ్గురు కొడుకులు పట్వారి, మాలి పటేల్, పోలీస్ పటేల్ వంటి అన్ని వతన్‌దారీ పోస్టులను చేజిక్కించుకున్నారు. వారిలో పట్వారి రామచంద్రా రెడ్డి పెద్ద కుమారుడు. ఆరోజుల్లో అన్ని లాండ్ రికార్డులను పట్వారీలే నిర్వహించేవాళ్లు. జాగీర్దార్ భూములనన్నింటినీ తన అధీనంలోకి తీసుకున్న తరువాత రామచంద్రారెడ్డి వందలాది ఎకరాలను అక్రమంగా అమ్ముకున్నాడు. ఒక 240 ఎకరాలను దేవాలయం పేరిట బదిలీ చేశాడు. రెండు వేల ఎకరాల భూమిని తన వద్ద ఉంచుకున్నాడు. తర్వాత దానిని తన కొడుకుల పేర్లమీద, అనేక బినామీ పేర్ల మీద రాశాడు. ఆ భూముల్లో ఎక్కువ భాగం ఎంతో విలువైన నల్ల పత్తి నేలలే. ఆ భూములను నిర్వహించేందుకు కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక కమ్మ కుటుంబాలను రప్పించాడు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూతురు వివాహం రామచంద్రారెడ్డి కొడుకుతో జరిగింది. అలాగే 1959 నుంచి 1962 వరకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి కూతురు వివాహం కూడా ఈ కుటుంబంలోని వ్యక్తితోనే జరిగింది. కొండా వెంకట రంగారెడ్డి పేరిfనే రంగారెడ్డి జిల్లాను ఏర్పాటుచేశారు. జస్టిస్ మాధవ రెడ్డి, కె.వి. రంగారెడ్డి కుమారుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్, మహరాష్ట హైకోర్టుల చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. కె.వి. రంగారెడ్డి మనవడు కొండా విశ్వేశ్వర రెడ్డి గతంలో చేవెళ్ల నియోజకవర్గం నుంచి తెలంగాణా రాష్ట సమితి (టిఆరఎస్) పార్టీ తరపున పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యాడు. ఆయన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి అల్లుడు కూడా. ఆరోజుల్లో పదిహేడవ లోకసభలో కొండా విశ్వేశ్వర రెడ్డే అందరికంటే అత్యంత ధనవంతుడైన పార్లమెంటు సభ్యుడు అని మీడియా పేర్కొంది. మర్రి చెన్నారెడ్డి 1978 నుంచి 1980 వరకూ, ఆతరువాత ఐటీవీసీఎస్‌కు అత్యంత కీలక కాలమైన 1989 నుంచి 1990 వరకూ కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నారు.
పులిమామిడి భూ పోరాటానికి కొంత గత చరిత్ర వుంది. ఆ భూమిని తిరిగి సాధించుకునేందుకు కె. కృష్ణమÖర్తి నాయకత్వంలో సీపీఎం పార్టీ పోరాడింది. కానీ, ఏమీ సాధించలేకపోయింది. అప్పుడు సీపీఎం పార్టీయే పోరాటాన్ని విరమించిందో లేక పులిమామిడి జనమే అలసిపోయారో తెలియదు. ఆనాటి నుంచి రామచంద్రా రెడ్డి ఆ భూమిని స్థానికులకు కౌలుకు ఇవ్వడానికీ, అమ్మడానికీ నిరాకరిస్తూ వస్తున్నాడు. ఆ పనిగనక చేస్తే స్థానికులు బాగుపడిపోయి, తనకు వ్యతిరేకంగా బలమైన ప్రత్యర్థులుగా తయారవుతారన్నది అతని ఉద్దేశమైవుంటుంది. గ్రామస్తులు ఎంత పేదరికంలో వుంటే వాళ్లు అంత ఎక్కువగా తన చెప్పుచేతల్లో వుంటారు. అతని పతనానికి ఇదొక కారణం. గ్రామస్తులు అతడిని తీవ్రంగా అసహ్యించుకునే వారు. వాళ్లు ఆ భూమిని అమ్మమనో లేక కౌలుకైనా ఇవ్వమనో అడిగినప్పుడు “ఊరికి చేసే సేవ`పీనుగకు చేసే సింగారం రెండూ ఒక్కటే” అనేవాడట. తన భూమిలో స్థానికులు ఎన్నడూ అడుగుపెట్టడానికి వీల్లేకుండా అతను కోస్తా ఆంధ్ర ప్రాంతం నుంచి కమ్మ కులస్తులనూ, ఉత్తర తెలంగాణా నుంచి లంబాడాలనూ రప్పించి వాళ్లు 600 ఎకరాల్లో స్థిరపడేలా చేశాడు.
తమను ఆ కుటుంబం ఎలా అణిచివేసిందో స్థానికులు ఇప్పటికీ మరచిపోలేదు. అప్పు తీసుకున్న కూలీల వీపుల మీద రామచంద్రా రెడ్డి తండ్రి పెద్దపెద్ద బండరాళ్లను పెట్టి మండు టెండలో గంటల తరబడి నిలబెట్టేవాడు. ఆ కూలీలు తమ కొద్దిపాటి ఆస్తుల్ని సైతం బాకీ కింద జమకట్టేదాకా వదిలేవాడు కాదు. పంట కోతల సమయంలో పేదలు తమ అరకొర పొలాలను గాలికి వదిలేసి వచ్చి ఆయన పొలాల్లో పనిచేయాలని వేధించేవాడని కొందరు వృద్ధ మహిళలు చెప్పారు. “మా కూలి డబ్బుల్ని తెల్లవారు జామున జొన్నల రూపంలో కిటికీలోంచి మా మొహాన విసిరికొట్టేవాడు” అన్నారొకరు. కుటుంబానికి ఒక్కరు చొప్పున ఆయనకు వెట్టి చాకిరీ చేయాలి. గొర్రెల కాపర్లు తమ పిల్లల్ని కూలి పైసలు లేకుండా వెట్టి పనులకు పంపాలి. కూలీలు కట్టెలు కొట్టి తీసుకురావాలి. ఇట్లా ప్రతి కుటుంబం ఏదో ఒక వెట్టి పని చేయాలి.
రామచంద్రా రెడ్డి వందలాది ఎకరాల భూమిని ఆక్రమించుకున్నందువల్ల 1961నాటి తొలి ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం నుంచి తన అక్రమాలను చాలా తెలివిగా దాచిపెట్టాడు. ఆ తరువాత 1973లో భూ సంస్కరణల (వ్యవసాయ భూముల సీలింగ్) చట్టం వచ్చింది. దాని ప్రకారం ఒక వయోజన పురుషుడి పేరిట 55 ఎకరాలకు మించి భూమి వుండకూడదు. 1964 నాటి లాండ్ సీలింగ్ చట్టంలో 50బి అనే ఒక ముఖ్యమైన సెక్షన్ వుంది. దాని ప్రకారం 1961`69 మధ్య తెల్లకాగితాలపై రాసుకున్న సేల్ డీడ్ లను అనుమతిస్తారు. సెక్షన్ 50బి ఉద్దేశం భూస్వాములను పరిమితికి మించి వున్న సీలింగ్ భూములను బేÉనామీదార్లకు అమ్మినట్టు చూపించలేకుండా చేయడం. ఒక భూస్వామి ఏ భూమినైనా కొనేటప్పుడు, అలాగే గతంలో కొన్న భూమి విషయంలో కూడా తహశీల్దారుకు దరఖాస్తు చేసుకోవలసి వుంటుంది. తహశీల్దారు వాటిని విచారించిన తరువాత 50బి సెక్షన్ కింద ఒక సర్టిఫికెట్ ద్వారా వాటిని ధృవీకరిస్తారు. తద్వారా ఆ కొనుగోలుదారుని వద్ద లాండ్ సీలింగ్‌కి మించిన ఆస్తి లేదని స్పష్టమవుతుంది.
బేÉనామీదార్లను కనుక్కుని వారికి జారీచేసిన 50బి సర్టిఫికెట్లను రద్దుచేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్లను సమర్పించే పని మాది. ఇక్కడ రికార్డులను వెలికి తీయడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఎందుకంటే మొత్తం అక్రమాలన్నీ ఒకే చోట, ఒకేవ్యక్తిచేత, ఒకే కాలంలో జరిగాయి. తప్పుడు 50బి సర్టిఫికెట్ల ద్వారా రామచంద్రా రెడ్డికి ఒకేరోజు 800 ఎకరాల భూమి బదిలీచేయబడింది. అవన్నీ ఒకే చేతిరాతతో వున్నాయి. అప్పటి తూర్పు ఇబ్రహీంపట్నం సబ్‌కలెక్టర్ ఆ ఫైళ్లను మÖసేశారు. ఆ తరువాత రామచంద్రా రెడ్డి జానకీ రామారావు అనే ఆయన్ని ఇహ్రీంపట్నం తహశీల్దారుగా నియమింపజేసుకున్నాడు. అతను అంతకుముందు ఎక్కడో మహబూబాబాద్‌లో తహశీల్దారుగా వుండేవాడు. లాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించేలా పత్రాలను తారుమారు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. దాంతో ఆయన రావడం రావడంతోనే అంతకు ముందు సబ్ కలెక్టర్ మÖసేసిన ఫైళ్లన్నింటినీ మళ్లీ తెరిచి 6 ఫిబ్రవరి 1975న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 600 ఎకరాలకు 50బి సర్టిఫికెట్లను జారీ చేసేశాడు.
రామచంద్రా రెడ్డి 240 ఎకరాల భూమిని ఆ ఊళ్లోని చీకటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బదిలీ చేశాడు. కానీ ఆ భూమి దేవాలయానికి చెందినదని ఏ ఒక్క గ్రామస్తుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఆ భూములను రామచంద్రా రెడ్డే కౌలుకు ఇస్తుండేవాడు. ఆ దేవాలయానికి పూజారిగా హైదరాబాద్‌లో నివసించే ఆంజనేయశర్మ అనే అతడిని రామచంద్రా రెడ్డే నియమించాడు. శిథిలావస్థలో వున్న ఆ గుడిలో ఇంతవరకూ అసలు ఎలాంటి ఉత్సవాలూ ధూప దీప నైవేద్యాలూ లేవు. అప్పుడు రాష్ట ప్రభుత్వ దేవాదాయ శాఖలో రామచంద్రా రెడ్డి మేనల్లుడు బాలకృష్ణా రెడ్డి డిప్యూటీ కమిషనర్‌గా వుండేవాడు. మేం దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లేంత వరకూ ఆ గుడి పేరిట 240 ఎకరాల స్థలం వుందన్న విషయం వారికే తెలియదు.
ముఖ్యంగా కందుకూరు ఎంఆరఒ ప్రేమ్‌సాగర్ రావు నాకు చాలా సహాయం చేశాడు. ఆయన ఎస్‌సి నేపథ్యం వున్న క్రైస్తవుడు. బహుశ అందువల్లనే దళితుల పట్ల సానుభూతిగా వుండేవాడు. బేనామీదార్లను ఒకరి తర్వాత మరొకరిని బయటకు లాగుతుంటే మాకు ఎంతో ఉత్సాహంగా అనిపించేది. ముక్కూ మొహం లేని బెనామీదార్లను కనుక్కోవడం మొదలుపెట్టిన తరువాత చచ్చిపోయిన రికార్డులకు, పత్రాలకు మళ్లీ ప్రాణం వచ్చింది. ఆ పత్రాలలో బేÉనామీదార్ల చిరునామాలు వున్నాయి. అయితే చాలామంది చిరునామాలు ఆతరువాత మారిపోయాయి. అయినప్పటికీ నేను ఒక్కొక్కరినీ వెతికి వెతికి పట్టుకున్నాను. వారిలో ఒకరు గోవిందరాజ్. రాంనగర్‌లో బాగా పేరున్న డాక్టర్. అయితే అప్పటికే ఆయన చనిపోయారు. ఆయన ఇద్దరు కొడుకులను కలుసుకుని అడిగితే ‘ఆ విషయం మాకేమీ తెలియదు, రామచంద్రా రెడ్డినే అడగండి’ అన్నారు. ఆ సోదరుల్లో ఒకరు దామోదర్ రాజు చిక్కడపల్లిలోని మా ఇంటికి సమీపంలోనే వుండేవాడు. ఆయన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండేవారు. అందులోనే డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసే పుల్లారెడ్డి రామచంద్రారెడ్డి సొంత కొడుకుల్లో ఒకరు. ఇతర బేనామీదార్లలో సయ్యద్ సిరాజుద్దీన్, గులాం ఉమర్, మహ్మద్ షర్మిల్ అన్సారీలు తమ పేరిట పులిమామిడిలో భూమి వున్నట్టే తెలియదన్నారు. మరి మీ పేర్లు పట్టాదార్లుగా ఎందుకు నమోదై వున్నాయని ప్రశ్నిస్తే సరిగా జవాబు చెప్పలేకపోయారు. మొత్తం బేనామీదార్లు హైదరాబాద్‌కు చెందినవాళ్లే కావడం వల్ల నేను ఒక్కదాన్నే వారిని వెతికి పట్టుకోగలిగాను.
పులిమామిడి జనం చాలా సంఘటితులైవుండేవాళ్లు. మాకు ఒక సుశిక్షిత సైన్యం అందుబాటులోకి వచ్చినట్టుగా అనిపించేది. వాళ్ల నాయకుడు సాలయ్య. మాదిగ కులానికి చెందినవాడు. ముఫ్పై ఏళ్ల యువకుడు. అప్పటివరకు నేను అంత చిన్న వయసు నాయకుడిని చూడలేదు. అయితే అతని తల వెంట్రుకలు నెరిసినట్టుండేవి. అతను ఎప్పుడూ మౌనంగా గంభీరంగా వుండేవాడు. మొత్తం ఊరును ఒక్కతాటిమీదకు తీసుకురాగల సమర్థుడు. సాలయ్య సంయమనాన్ని కోల్పోయి, ఆవేశపడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక మంగలి రాములు సాలయ్యకు కుడి భుజంలా వుండేవాడు. అతనికి మాత్రం ఆవేశం ఎక్కువ. అతనంటే అందరికీ భయమే. ఆ ఊరి సర్పంచ్ పేరు శ్రీనివాస్ రెడ్డి. ఒక మధ్యస్థ భూస్వామి. కానీ పేదల పక్షం వహించేవాడు. పులిమామిడిలో ఒక్కటంటే ఒక్క కుటుంబం కూడా రామచంద్రా రెడ్డి వైపు వుండేది కాదు. జబ్బార్‌గూడెంలో వున్నట్టు ఇక్కడ ప్రజల్లో ఎలాంటి ముఠాలూ లేవు. అదొక గొప్ప ఉపశమనం మాకు. మొత్తంగా ఆ ఊరు ఏ ఆర్గనైజరైనా ఆశించే రీతిలో వుండేది. జనం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా వుండేవారు. వాళ్లు ఎవరికీ భయపడేవారు కాదు. ఒక్క పోలీసుల విషయంలోనే సహాయాన్ని కోరుకునేవారు.
1986లో మేం రామచంద్రా రెడ్డి కుటుంబం మీద సాంఘిక బహిష్కరణకు పిలుపునిచ్చాం. దాని ప్రకారం రామచంద్రా రెడ్డి కుటుంబానికి ఎవరూ పాలు పోయకూడదు. వాళ్లలో ఎవరికీ క్షౌరం చేయకూడదు. గెడ్డాలు గీయ కూడదు. ఆడవాళ్లు వారి ఇంటికి వెళ్లి ఊడ్వడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంటలు చేయడం వంటి పనులేవీ చేయకూడదు. వాళ్ల పొలాల్లో ఎవరూ కూలికి వెళ్లకూడదు. ఇలా వారిపై సామాజిక బహిష్కరణ పకడ్బందీగా సాగింది. వాళ్లకు ఏడు కోళ్ల ఫారాలుండేవి. వాటిలో ఒక్కటి తప్ప మిగతావన్నీ కొద్ది రోజుల్లోనే ఒకటి తర్వాత ఒకటిగా మÖతబడ్డాయి. అతని కొడుకు లింగారెడ్డి తప్ప మిగతా వాళ్లంతా ఊరు వదిలి హైదరాబాద్‌కు పారిపోయారు. బహిష్కరణ విధించిన ఒక్క నెలలోపలే ఇవన్నీ జరిగాయి. ముఖ్యంగా వాళ్లకి తమ గడ్డాలు తామే గీసుకోవడం, పనివాళ్లు లేక లంకంత కొంపను తామే శుభ్రం చేసుకోవడం చాలా కష్టమయింది. రామచంద్రా రెడ్డి బావమరిది బుచ్చి రెడ్డి (బుచ్చయ్య) మాత్రం ఊళ్లోనే వుంటూ వాళ్ల పొలాలనూ, మిగిలిన కోళ్ల ఫారాన్నీ చూసేవాడు. గ్రామస్తులంతా అతణ్ని తీవ్రంగా ఏవగించుకునేవారు. సంఘం భూమి సమస్యను చేపట్టగానే అతను కూడా హైదరాబాద్‌కు ఉడాయించాడు. హైదరాబాద్‌లో వాళ్లకు అనేక ఆస్తిపాస్తులుండేవి.
మేం భూములు దున్నడం వంటి దూకుడు పద్ధతులను అనుసరించక ముందే అణిచివేత చర్యలను ఎదుర్కొన్నాం. ఆ అణిచివేత చర్యలన్నీ మర్రి చెన్నారెడ్డి ఆశీస్సులతో జరిగేవి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి ఇంకా రాలేదు. ప్రతిపక్షంలోనే వుండేవాడు. (ఆయన ప్రత్యర్థి ఎన్.టి. రామారావు అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నాడు). 1986 జూన్‌లో మేం పులిమామిడిలో మా మొట్టమొదటి బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధపడ్డాం. ఆ సభలో ప్రముఖ న్యాయవాదులు, కార్యకర్తలు బొజ్జా తారకం, బి.ఎస్.ఎ. స్వామి ప్రసంగించాల్సి వుంది. ఆ బహిరంగ సభ తేదీకి పదిహేను రోజుల ముందే మైకుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతి ఇవ్వలేదు. అదే లిఖిత పూర్వకంగా ఇవ్వమంటే కూడా డిఎస్‌పి నిరాకరించాడు. పైగా ‘కోర్టుకు వెళ్లడానికి నన్నేమైనా సహాయం చేయమంటారా’ అంటూ అవహేళన చేశాడు. గత్యంతరం లేక మేం హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు మా బహిరంగ సభకు అనుమతించమంటూ డిఎస్‌పికి ఆదేశాలు జారీ చేసింది. ఆ కోర్టు ఆర్డర్ కాపీని నేనే స్వయంగా డిఎస్‌పికి ఇచ్చి రశీదు తీసుకున్నాను.
మీటింగ్ నాడు బహిరంగ సభ వేదిక మీద ఉపన్యాసకులు కూర్చుని వుండగా మైకులను ఏర్పాటు చేస్తుంటే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గణేష్ రావు వచ్చి వాటిని లాగేసుకున్నాడు. గతంలో కూడా ఆయన నాతో ఇలాగే మొరటుగా వ్యవహరించేవాడు. మా అడ్వొకేట్లు ఇద్దరు పత్రికా విలేఖర్ల ముందర అతనికి హైకోర్టు ఉత్తర్వులను చూపిస్తే ‘ఏంటి పోలీసుల్నే ఎదిరిస్తున్నారా? లాఠీచార్జికి ఆర్డర్ ఇవ్వమంటారా? మీ మీటింగ్‌ను చెల్లాచెదరు చేయమంటారా? పొండి, ఏడ్చుకుంట మొత్తుకుంట మీ నాలుగు వేల జనాన్ని హైకోర్టుకు వెంటబెట్టుకుని పొండి!’ అన్నాడు. మేం మైకులు లేకుండానే మా మీటింగ్‌ను నిర్వహించాం.
మా అడ్వొకేట్లు సిఐ ప్రవర్తనను చూసి షాకైపోయారు. ‘ఈ సిఐలూ, డిఎస్‌పీలూ హైకోర్టు ఉత్తర్వులను ఎలా బేఖాతరు చేస్తారు? మేం కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం’ అన్నారు. అయితే ఆ కేసు వాయిదాల మీద వాయిదాలతో అనేక రోజులు సాగింది. ప్రతి వాయిదాకూ నేను హాజరయ్యాను. డిఎస్‌పి కేవలం రెండు సార్లు మాత్రమే కోర్టుకు వచ్చాడు. ఆరోజు తన టోపీని తీసి చేతుల్లో పట్టుకుని జడ్జి ముందు వినయంగా నిలబడి ‘నేను కోర్టు ఉత్తర్వులను చూడలేదండీ. మా గుమస్తా వాటిని నా ముందు పెట్టలేదు. లేకపోతే హైకోర్టు ఆదేశాలను నేను బేఖాతరు చేస్తానా. అది కలలో కూడా జరగదు’ అన్నాడు. జడ్జి అతడికి నాలుగు చివాట్లు పెట్టి వదిలేశారు.
ఇలాంటి bదురు దెబ్బలు bన్ని తగిలినా పులిమామిడి జనం మాత్రం తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కృతనిశ్చయులై వున్నారు. సంఘం పిటిషన్లను తయారుచేసే పనిలో పడింది. మోసపూరితంగా జారీ చేయబడ్డ 50బి సర్టిఫికెట్లను రద్దు చేయమని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కూ, ఆ దేవాలయానికి ట్రస్టీలను నియమించాలనీ, దేవాలయ ఆదాయం పెరిగేలా దేవాలయ భూములను గ్రామస్తులకు కౌలుకు ఇవ్వాలనీ కోరుతూ దేవాదాయ శాఖకూ దరఖాస్తులను సమర్పించాం. రామచంద్రారెడ్డి కౌలుదార్లుగా ఈ భూములకు తీసుకొచ్చిన లంబాడాలను కూడా సంఘం సంఘటితపరిచింది. అయితే కౌలుకింద వాళ్లు చెల్లించిన డబ్బుకు రామచంద్రా రెడ్డి రశీదులివ్వలేదు. వాళ్ల పేర్లను భూమి హక్కుల రిజిష్టరులోనూ నమోదూ చేయలేదు.
16. చిరిగిన పత్రాలూ పగిలిన అద్దాలూ
జబ్బార్‌గూడెం, పులిమామిడి భూ పోరాటాలు ఊపందుకోవడంతో సంఘం పనిచేస్తున్న గ్రామాలన్నిట్లో బాగా ఉత్సుకత పెరిగింది. చాలామంది తమ పత్రాలనూ, దస్తావేజులనూ పట్టుకుని మా దగ్గరకు రావడం మొదలుపెట్టారు. వాటిలో పహాణీలు (ఒక భూమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏయే యజమానుల పేర్ల మీద వుంటూ వచ్చింది వంటి వివరాలున్న పత్రాలు), అలాగే లావనీలు (ప్రభుత్వ భూమిని నిరుపేదలు ఉపయోగించుకునేలా జారీ చేసిన పత్రాలు. అయితే సాంకేతికంగా వీటివల్ల ఆ భూమి వారి పేరుమీదకు బదిలీ అయ్యే అవకాశం వుండదు), ఇంకా కోర్టు తీర్పులు వంటివి వుండేవి.
తెలంగాణాలో ఇలాంటి లీగల్ పత్రాలను గ్రామస్తులు ‘అద్దాలు’ అనేవారు. అంటే ఒక వ్యక్తి గుర్తింపునూ, భద్రతనూ, బతుకు ీVAదానూ ప్రతిబింబించే పత్రాలు అని వారి ఉద్దేశం. తమ ట్రంకు పెట్టెల్లో శిథిలమైపోతున్న ఆ పాత పత్రాలను నా వద్దకు తీసుకొచ్చి ‘వీట్లల్ల ఏమన్న బలమున్నదామ్మా?’ అని అడిగేవారు. 1990ల వరకూ ఇది పెద్ద ఎత్తున కొనసాగింది. నక్సలైట్ల ప్రాబల్యం వున్న ప్రాంతాలలోని జనం కూడా అలాంటి పత్రాలను మా దగ్గరకు తీసుకొచ్చేవారు. 1990లో ఒక స్థానిక ఎంఎల్ గ్రూపుతో కలసి మొమీన్‌పేటకు వెళ్లినప్పుడు అక్కడ కూడా జనం భధ్రంగా దాచుకున్న పత్రాలను తీసుకొచ్చి చూపించి అదే ప్రశ్న అడగడం నన్ను మరింత ఆశ్చర్యపరిచింది. ఎంఎల్ గ్రూపుల ఆధిపత్యం ఎక్కువగా వున్న చోట కూడా ప్రజలు భూమిపై అధికారాలు, భూ రికార్డులు వంటి రాజ్యాంగపరమైన హక్కుల కోసం ఇంతగా పట్టుబడతారని నేను ఊహించలేదు. తమవద్ద వున్న కొద్దిపాటి అధికారాలకు సంబంధించిన శిథిల పత్రాలను పేదలు భద్రంగా దాచుకున్నారు. పాత తరం ప్రజలు ఎంఎల్ గ్రూపుల ఎన్నికల బహిష్కరణ పిలుపును పట్టించుకోకపోవడానికి ఇదొక కారణం. ఆస్తులూ అధికారాలూ వున్న సంపన్నులు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలోని వాళ్లు ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. (ఆమాటకొస్తే చట్టం పరిధిలో, ప్రజాస్వామ్యం పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నేను ఇంతవరకూ ఎన్నడూ ఓటు వేయలేదు). కానీ గ్రామీణ పేదలు ఓటును తమ విలువకూ, ఉనికికీ ప్రతీకగా భావిస్తున్నారు. నాలుగు పైసల కోసం, ఒక మందు సీసా కోసం మీరు ఓట్లు ఎందుకు వేస్తారు? అని నేను అన్నప్పుడు వాళ్లు “గదేందమ్మా, మేం ఏమన్న సచ్చిపోయినోళ్లమా ఓటు ఏయకపోయెటందుకు!” అని గట్టిగా బదులిచ్చేవాళ్లు.
భారతదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికంటే ముందు పేద ప్రజలకు ఎలాంటి సొంత భూమీ వుండేది కాదు. వారిలో అదృష్టం వున్నవాళ్లు కొందరు సొంత భూమి లేకపోయినా కౌలుకు సాగు చేసుకునేవారు. ముందుగా అందరూ తమ ప్రజాస్వామిక, వయోజన ఓటు హక్కును వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ఆ తరువాత క్రమంగా వారికి సొంత భూమి కావాలన్న ఆలోచన వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం ‘గరీబీ హఠావో!’ వంటి ప్రజాకర్షక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. 1960 దశాబ్ది చివర్లో దేశంలో వెల్లువెత్తిన నక్సలైట్ ఉద్యమం ప్రభావంతో 1973లో ప్రభుత్వం లాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ భూస్వాములు, సంపన్న రైతులు చిల్లర కారణాలను ఎత్తి చూపుతూ కోర్టుల్లో కేసులు వేసి ఆ చట్టం నుంచి తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు సంపన్న రైతులూ, భూస్వాములూ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే మున్సిఫ్ మెజిస్టేట్ స్థాయి కోర్టులు మొదలుకుని సుప్రీం కోర్టు వరకు లాండ్ సీలింగ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాదాపు 5,00,000 కేసులు వేశారు. తత్ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో 34వ రాజ్యాంగ సవరణను చేసింది. అందులో రాష్ట ప్రభుత్వాలు సవరించిన సీలింగ్ చట్టాలను కూడా పొందు పరిచింది. దాంతో కోర్టుల్లో వాటిని రాజ్యాంగ ప్రాతిపదికన సవాలు చేసేందుకు వీలులేకుండా అయింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగులు భూముల పున:పంపిణీ కార్యక్రమం సముచితమైన పద్ధతిలోనే సాగింది. 1980ల మొదట్లోనే ఇరవై లక్షల ఎకరాల వరకూ భూమిని పున:పంపిణీ చేసినట్టు ప్రభుత్వ రికార్డులు పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో అది నిజంగా జరిగిందా అన్నది సందేహాస్పదమే. ఏది ఏమైనా తెలంగాణా దళితులలో సొంతభూమి కావాలన్న ఆకాంక్ష బలంగా వుండటాన్ని నేను గమనించాను. భూమి అంటే దళితుల దృష్టిలో సాధికారతకు ఒక సాధనం. అయితే ఇందుకు చట్టపరమైన పత్రాలు కావాలి. భూహక్కు కోసం పోరాడేందుకు జనం సిద్ధంగా వున్నారు. ఇది మేము జబ్బార్‌గూడెం పోరాట సమయంలోనే గమనించాం. మా వద్దకు వచ్చిన జనం తమకు చట్టపరంగా రావలసిన వాటికోసం పట్టుదలగా వున్నారు. అయితే అందుకు తగినవిధంగా రెవెన్యూ అధికారులూ, న్యాయస్థానాలూ, పోలీసులూ చురుకుగా వ్యవహరించకుండా స్తబ్ధుగా వుండటం బాధనిపించింది. ప్రజలు మౌఖికంగా చెప్పిన వివరాలతో సరిపోల్చడమనేది సంక్లిష్టమైన పని. నిజాయితీగా, సూటిగా అడిగితే మాకు కావలసిన రెవెన్యూ రికార్డులు ఎక్కడా దొరకవని అర్థమైంది. స్నేహపూర్వకంగా వుండే ఎంఆరఓలు కూడా ‘ఇది మా గుప్పిట్లో వున్న ఒక బంగారు నిధిలాంటిది. గుప్పిట తెరిస్తే ఇంక మా చేతుల్లో ఏముంటుంది’ అనేవారు.
ప్రజల్లో అంతకంతకూ పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి సంఘం కార్యకర్తలు 1987 మొదట్లో భూ రికార్డుల కోసం శోధించడం మొదలుపెట్టారు. తెలంగాణాలో 1953లో భూసర్వే బయటి వ్యక్తులచే నిర్వహించబడింది. కీలకమైన ఆ సంవత్సరం మొదలుకుని ఇప్పటివరకు వచ్చిన మార్పులను గుర్తించాలి. 1953 నుంచి మంజూరు చేయబడ్డ అనేక భూ పత్రాలు నిరాకరణకు గురయ్యాయి. వాటిలో రక్షిత కౌలుదారీ పత్రాలు కూడా వున్నాయి. ఆ తరువాత 1961, 1973 సంవత్సరాలలో ఆంధ్ర ప్రదేశ్‌లో సీలింగ్ చట్టాలు వచ్చాయి. ఇక్కడ కూడా రికార్డులు కొంతమేరకు వాస్తవికతను ప్రతిబింబిస్తాయి. 1954`1955 లాండ్ రికార్డులు (తెలంగాణాలో వాటిని ఖాస్రా పహాణీలు అంటారు), గ్రామాల మ్యాపులు, 1961,1973 సీలింగ్ కేసులు, రక్షిత కౌలుదారీ రిజిష్టర్లు, ప్రతి గ్రామంలో మంజూరైన ప్రభుత్వ భూముల జాబితా కాపీలు మొదలైన వాటన్నింటినీ సేకరించి ఉమ్మడిగా పరిశీలించాం.
ఈ సమాచారాన్ని సేకరించేందుకు మేం రకరకాల పద్ధతులను అనుసరించాం. గ్రామాల్లో పాత పైరవీకార్లను బుజ్జగించి వారి వద్ద వున్న రికార్డులను సంపాదించాం. పహాణీలను చూపించేందుకు ఒప్పుకోని పట్వారీల ఇళ్లల్లో పేదలు అన్ని పనులూ మానేసి పట్టుదలగా వ్యవహరించడంతో చివరికి వారు ఆ పత్రాలను మాకు ఇచ్చారు. ఇక మండల అధికారులనూ, రికార్డురూం నిర్వాహకులనూ పదేపదే కలుస్తూ, వాళ్లతో అనేక చెత్త చాయ్‌లు తాగుతూ వెంటబడి మరీ సమాచారాన్ని సేకరించాం. ఆ సమాచారం ఒక పరిశోధన కోసం తప్పనిసరిగా కావాలనీ, పరిశోధకులకు అందుబాటులో వుంచండి అనీ పలు విశ్వవిద్యాలయాల నుంచీ, జాతీయ సంస్థల నుంచీ లేఖలను తీసుకొచ్చి వారికి ఇచ్చాం. అలాగే భూస్వాముల మధ్య గ్రూపులుండేవి. ఆ గ్రూపులు పరస్పరం వ్యతిరేకించుకునేవి. ఒకరినొకరు దెబ్బకొట్టాలని చూస్తుండే వారు. ఆ వైరుధ్యాలను ఉపయోగించుకుని కూడా మేం వారి వద్ద నుంచి కొన్ని రికార్డులను సేకరించాం. ఇక నేను నిరంతరం ఉదయం 6 గంటలకే ఎంఆరఓల ఇళ్లకు వెళ్లడం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చాయి. నా బాధ పడలేక వాళ్లు ఆఫీసులనుంచి కొన్ని రికార్డులను తమ ఇళ్లకు తెచ్చి వాటి కాపీలను తీసి నాకు అందించారు. కీలకమైన ఈ కార్యక్రమంలో జనం పాలుపంచుకునేలా మొత్తం గ్రామాన్నే కదిలించాం. 1954`55 నాటి ఖాస్రా పహాణీలను, కౌలుదారీ రికార్డులను, ఇతర పహాణీలను కాపీ చేసే పనిని చదువుకున్న దళిత యువకులకు అప్పగించాం. మిగతా పనులకంటే మ్యాపులను సేకరించడం సులభంగా వుండేది. వాటి కోసం మేం కొంతమంది పట్టాదార్ల పేర్ల మీద దరఖాస్తులు రాసి, అవసరమైన చలాన్లను కట్టి, కుట్రలు పన్నే భూస్వాములకు దూరంగా హైదరాబాద్‌లో వున్న లాండ్ సర్వే కార్యాలయం అధికార్లకు సమర్పించి మ్యాపులను సేకరించాం.
దాదాపు ముప్పై గ్రామాలకు సంబంధించిన సమాచారం పూర్తిగా సమీకరించిన తరువాతనే మేం వాటిని బయటపెట్టాం. 1987లో సేకరించిన రికార్డులను, మ్యాపులను సరిచూడటం ప్రారంభించాం. అందుకోసం అనేక ప్లాట్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. మొత్తం మీద ఒకటి తర్వాత ఒక ప్లాటు హద్దు రాళ్లను గుర్తిస్తూ పోయాం. మాతో పాటు మాదిగ పెద్దలను కూడా సర్వేకు తీసుకుపోయేవాళ్లం. ప్రభుత్వ భూములు ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ వుండేవో వాళ్లకు బాగా తెలుసు. రికార్డులనూ మ్యాపులనూ సరిపోల్చిన తరువాత మేం కనుగొన్న వాటిని పరిశీలించి ధృవీకరించమంటూ ప్రభుత్వం వద్దకు వెళ్లాం. సాధారణంగా పట్టాలున్న లేదా భూమి కౌలు పత్రాలున్న వ్యక్తి తగిన చలాన్ కట్టి దరఖాస్తు చేసుకున్న తరువాత సర్వే చేసి ధృవీకరించడానికి ప్రభుత్వ సర్వేయర్ ఎప్పుడొస్తాడా అని నిరీక్షిస్తుండాలి. మేం అలా చాలా రోజులు నిరీక్షించినా కూడా సర్వేయర్ రాకపోతే వారి కార్యాలయానికి వెళ్లి పదేపదే గుర్తు చేయాల్సి వచ్చేది. చివరికి తమ పని తాము చేయడానికి కూడా సర్వేయర్లకు భారీ ముడుపులు చెల్లించాల్సి వచ్చింది. చాలా కేసుల్లో ఆ భూమికి సంబంధించిన వ్యక్తుల్ని చూపించలేకపోయాం. ఎందుకంటే పట్టాలు కానీ, ఆ భూమి మీద తమ హక్కుకు సంబంధించిన ఇతర పత్రాలు కానీ ఏవీ పేదల దగ్గర వుండేవి కావు. అలాంటి కేసుల్లో సర్వేయర్లను పిలవకుండా మేమే స్వయంగా సర్వే చేయాల్సి వచ్చేది. ఆ భూముల సరిహద్దులను సర్వే రాళ్లు నిర్ధారిస్తాయి. మ్యాపులలో కూడా సహజమైన, శాశ్వతమైన గుడ్డి గుర్తులు అంటే ఎండిపోయిన కాలువ, మర్రిచెట్టు, పెద్ద బండ, దేవుడి రాతి విగ్రహం, మసీదు వంటివి సూచించబడి వుంటాయి. వాటిని అనుసరిస్తూ సరిహద్దులను నిర్ధారించవచ్చు. కానీ వీటికి అధికారిక గుర్తింపు వుండదు. వాటి ఆధారంగా కోర్టులో సవాలు చేయడానికి వీలుండదు. అయితే ఆ భూమికీ పత్రాలకూ మధ్య వున్న సంబంధాన్ని అర్థం చేసుకునేందుకు, ఇతర పద్ధతుల ద్వారా మా వాదనను రుజువు పరచుకునేందుకు అవి కొంతమేరకు దోహదం చేస్తాయి.
1987 వేసవి కాలం కంటే ముందే రాత్రిపూట ఒక్కో ఊళ్లో ఒక్కో బహిరంగ సమావేశం నిర్వహిస్తూ ఆ రికార్డులను జనానికి చదివి వినిపించేవాళ్లం. ఊళ్లలోని వయో వృద్ధులను పిలిచి మేం చదివిన రికార్డులలోని విషయాలు వాస్తవమేనా అని ధృవీకరించేలా చేశాం. ఆ సభలకు రెండు వందల నుంచి ఐదు వందల మంది వరకు జనం హాజరయ్యేవారు. మరోలా చెప్పాలంటే ఊళ్లలోని మాదిగలందరూ వచ్చేవారు. వాటిని చదివి వినిపిస్తున్నప్పుడు జనం చాలా నిశ్శబ్దంగా వుండేవారు. కొందరైతే కొన్ని రికార్డులను మరోసారి చదవమని అడిగి నిజమే అని నిర్ధారించుకునేవారు. మా అందరికీ ఆ రోజులు ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇచ్చాయి.
సంఘం మద్దతుతో పులిమామిడి, మహేశ్వరం, మీర్‌ఖాన్‌పేట్ దళితులు భూమి పట్టాలకోసం జూన్ 1987 నాటికి ఆందోళనను మొదలుపెట్టారు. చూస్తుండగానే అది ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, మహేశ్వరం మండలాల్లోని గ్రామాలన్నింటికీ వ్యాపించింది. భూమిని డిమాండ్ చేసేందుకు అందరూ ఒక్కటయ్యారు. యాచారంలోని ఇరవై నాలుగు ఎకరాల భూమి కోసమైనా, చెర్లపటేల్‌గూడెం లోని మÖడు ఎకరాల కోసమైనా నాలుగు మండలాలల్లో ఆందోళన మిన్నంటింది.
ఈలోగా జబ్బార్‌గూడెం పోరాటం వేగం పుంజుకుంది. జిల్లా అధికార యంత్రాంగానికి పిటిషన్లు సమర్పించడం, వారి కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం కొనసాగింది. 1987లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆ భూమిపై భూపాల్ రెడ్డికి ఎలాంటి హక్కూ లేదనీ, అది ప్రభుత్వానికి చెందిన భూమి అనీ విస్పష్టంగా ప్రకటించారు. దాంతో మంచిరెడ్డి భూస్వాములు ఆ భూమిని రైతులకు పంచవద్దంటూ హై కోర్టుకు అప్పీల్ చేశారు. కానీ, హై కోర్టులో కూడా వాళ్లకు చుక్కెదురైంది. మొత్తం మీద ఆ గ్రామాల ప్రజలందరూ కష్టించి పోరాడినందుకు మంచి ఫలితం దక్కింది.
పత్రులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఫోన్ నం. 93815 59238/040-2352 1849
email:hyderabadbooktrust@gmail.com
(ఇంకా ఉంది)
