ఒక చిన్న గ్రామంలో గోపి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. చురుకైనవాడు కూడా. కానీ దానితో పాటుగా బద్ధకం అల్లరి తనమÖ కూడా ఎక్కువే.
గోపి బడికి వెళ్లడం కన్నా స్నేహితులతో ఊరికి చివరలో ఆటలు ఆడుకోవడమే ఇష్టపడేవాడు. స్కూల్‌కు పోకుండా డుమ్మా కొట్టి స్నేహితులతో బలాదూర్ తిరిగేవాడు.
గోపి వాళ్ళ అమ్మ ఎన్నో సార్లు నచ్చ చెప్పేది. గోపి నువ్వు ఎంత తెలివైన వాడివో నాకు తెలుసు. కానీ అల్లరి చేస్తూ నిన్ను నువ్వు చెడగొట్టుకుంటున్నావు. చెడు సావాసాలతో నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేది. చక్కగా బడికి వెళ్లి బాగా చదువుకో అని చెప్పేది. కానీ గోపి పట్టించుకునే వాడు కాదు. అమ్మకు తెలియకుండా చూసుకునేవాడు.
ఒకరోజు ఊరి బయట గోటీలు ఆడుతుండగా పక్క ఊరిలో టీచర్‌గా పనిచేస్తున్న గోపి వాళ్ళ దూరపు బంధువు గోపి వాళ్ళ ఊరికి పనిమీద వచ్చి అటుగా వెళుతూ గోపిని చూసి ఆగాడు. గోపి ఏంటి ఇలా స్కూల్ టైంలో గోటీలు ఆడుతున్నావు అని అడిగాడు.
గోపి కంగారుగా చూసి ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకున్నాడు. అప్పుడు ఆయన గోపితో ఇలా చెప్పాడు. నేను కూడా చిన్నప్పుడు నీలాగే అల్లరి చేసే వాడిని. కానీ మంచి భవిష్యత్తు ఉండాలంటే కష్టపడి ఆసక్తితో చదివితేనే సాధ్యమవుతుందని మా టీచర్ ద్వారా తెలుసుకొని అల్లరి పనులు మానుకోవడం వల్లనే నేను ఈరోజు టీచరు కాగలిగాను. నన్ను అందరూ గౌరవిస్తారు.
నీవు వృధా చేసుకున్న ఒక్క నిమిషం కూడా తిరిగిరాదు అన్నాడు. ఆయన మాటలు గోపి మనసులో బలంగా ముద్రపడ్డాయి. ఆ రోజు సాయంత్రం గోపి ఇంటికి వచ్చి తన అమ్మతో అన్నాడు.
అమ్మ ఇక నుండి నేను చెడు తిరుగుళ్ళు, అల్లరి పనులు మానివేసి చక్కగా చదువుకుంటాను. స్కూల్‌కి రోజు వెళ్తాను అన్నాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. కానీ గోపి కళ్ళల్లో నిజాయితీని చూసి ఎంతో సంతోషించింది.
గోపి ఆసక్తితో, క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు.
