కమలాసోహానీ సైన్స్ ఉన్నత విద్యలో వివక్షనెదిరించిన తొలి పి.హెచ్.డి.శాస్త్రవేత్త – డా. నాగసూరి వేణుగోపాల్

ఇప్పుడు మనకు చాలా విషయాలు ఎంతో సహజంగా అనిపిస్తాయి, కానీ అటువంటి పరిస్థితి రావడానికి జరిగిన కృషి ఎంతో అధ్యయనం చేస్తే గానీ అవగతం కాదు. కేవలం తొమ్మిది దశాబ్దాల క్రితం విజ్ఞాన శాస్త్రంలో ఎం ఎస్సీ చేయాలని ఒక యువతి చిన్నపాటి ఉద్యమం చేశారు.

ఆవిడ పోరాడింది చిన్న వ్యక్తితో కాదు, పెద్ద శాస్త్రవేత్త మీద… ఆయన ఎవరో కాదు నోబెల్ గ్రహీత సి.వి. రామన్. ఆ యువతి కమలా సోహానీ (Kamala Sohonie). ఈవిడే సైన్సు విభాగంలో పి.హెచ్.డి. పొందిన తొలి భారతీయ మహిళ!
ముంబైగా నేడు పిలువబడే బొంబాయిలో బాగా ఉన్న కుటుంబంలో 1911 జూన్ 18న జన్మించారు కమలాభగవత్. మేధావిగా, రచయితగా, సంఘ సేవకురాలుగా ప్రఖ్యాతులైన దుర్గా నారాయణ భగవత్ వీరి సోదరి. కమల తండ్రి నారాయణ భగవత్, చిన్నాన్న మాధవరావు భగవత్ – ఇద్దరూ బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాలలో తొలి రోజుల్లో రసాయన శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ పొందిన వారు. ఈ నేపథ్యంలో కమల ఒక శాస్త్రవేత్త కావాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఆవిడ కూడా ఆమె తండ్రి చదివిన కళాశాల నుంచే రసాయన శాస్త్రంలో బి.ఎస్సీ. పట్టా పొందారు. ఆ రోజుల్లో పరిశోధన అన్నా, సి.వి. రామన్ అన్నా చాలా గౌరవం ఉండేది. ఎంతోమంది ఆయన పనిచేస్తున్న టాటా సైన్స్ ఇన్స్టిట్యూట్ (నేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు)లో పరిశోధన చేయాలని ఉవ్విళ్ళూరే వారు. వారందరిలాగే కమల కూడా సి.వి. రామన్ సంస్థలో పై చదువులు సాగించాలని ఆశించారు. అక్కడకు వెళ్ళాక తెల్సింది- అది అంత సులువు కాదని, మంచి మార్కులు వచ్చినా ప్రవేశం తేలిక కాదని బోధపడింది. కేవలం మహిళ కావడమే ఆ ఆటంకం. ఆ రోజుల్లో ఉన్నత చదువుకు మహిళలు అర్హులు కాదనే సామాజిక విధానం ఛలామణిలో ఉండేది. ఫలితంగా టాటా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా సి. వి. రామన్ ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. అయితే ఆ నిర్ణయాన్ని స్వీకరించక, గాంధీజీ ఆదర్శాలను బలంగా నమ్మిన కమలా భగవత్ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత సి.వి. రామన్ మహాశయుడు కమలా భగవత్ పట్టుదలను గమనించ లేకపోయారు. కమల మౌనంగా రోజుల తరబడి నిరసన తెలపడంతో సి.వి. రామన్ దిగిరాక తప్పలేదు, చివరకు ప్రవేశమిచ్చారు. అయితే కొన్ని నిబంధనలతో కూడా రెగ్యులర్ విద్యార్థిగా తీసుకోలేదు. ఒక సంవత్సరం పాటు ప్రొబాషనరీగా చేరవలసి వచ్చింది. అవసరమైతేనే రాత్రింబవళ్ళు కష్టపడాలి. ప్రయోగశాల వాతావరణాన్ని పాడు చేయకూడరు – ఇలాంటివి ఆ అధ్వాన్నపు నిబంధనలు!
నిజానికి ఈ నిబంధనలు అగౌరవ పరిచేలా ఉన్నాయని కమలభగవత్‌కు కూడా బోధపడింది, అయితే లక్ష్యసాధన కోసం ఓర్చుకుని కష్టపడి 1936లో ఎం.ఎస్సీ. డిగ్రీ పొందారు. పాలు, పప్పు, చిక్కుళ్ళలో ప్రొటీన్ల గురించి కమల శోధించి ఎం. ఎస్సీ. పట్టా కోసం సిద్ధాంత గ్రంథం రాశారు. ఆరోజుల్లో బహుశా మొత్తం ప్రపంచంలో పప్పు ధాన్యాలు, ప్రొటీన్ల మీద పరిశోధించిన వ్యక్తి కమల మాత్రమే కావచ్చు. శ్రీనివాసయ్య దగ్గర ఈ పరిశోధనా కృషిని కమల కృషి దిగ్విజయంగా జరగడంతో సి.వి.రామన్ మహిళాశక్తిని గుర్తించి ఆ సంవత్సరం నుంచే విద్యార్థినులకు అవకాశం కల్పించడం ప్రారంభించారు. అలా కమల విజ్ఞాన శాస్త్రాల అధ్యయనానికి సంబంధించి మహిళలకు తొలి దారి దీపమయ్యింది.
ఎం. ఎస్సీ.లో చూపిన ప్రతిభకు ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి కమలకు మంచి ఉపకారవేతనం లభించింది. అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమన్ ఫర్ రీసెర్చ్ స్టడీస్ వారి ఇంటర్నేషనల్ ఫెలోషిప్ పొందిన తొలి భారతీయ మహిళ కమలాభగవత్. పి. హెచ్.డి. కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరిన కమలకు డా॥ డెరిక్ రిచ్టర్ (Dr. Derik Richter) తనకు ప్రత్యేకమైన పరిశోధనా బల్లను ఇచ్చి పరిశోధన చేసుకోవడానికి వసతి కల్పించారు. ఇదే బల్ల మీద ఆయన రాత్రిపూట తన పరిశోధనలు చేసుకునేవారు. డెరిక్ రిచ్టర్ అక్కడ నుంచి వెళ్ళగానే డా॥ రాబిన్హాల్ (Dr. Robin Hill) ఆమె పరిశోధనకు మార్గ నిర్దేశకత్వం వహించారు. అయితే పరిశోధిస్తున్నపుడు అందులో ఎంజైమ్ సైటోక్రోమ్ సి’ (Cy-tochrome C) ఉందనీ, అన్ని మొక్కల కణాలలో జరిగే ఆక్సీకరణలో ఈ ఎంజైమ్ పాత్ర ఉందని కమలాభగవత్ నిగ్గు తేల్చారు. ఈ మెరుపులాంటి పరిశోధన, ఎంతో మంది శాస్త్రవేత్తలను ఆకర్షించింది. నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ఫెడ్రిక్ హాప్కిన్స్ (Prof. Fredrick Hopkins) సలహా మీద ఈ పరిశోధనను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి పంపితే పరిశోధక పట్టా లభించింది. ఈ పరిశోధన కేవలం 16 నెలల్లో జరిగింది. సిద్ధాంత గ్రంథం కేవలం 40 పుటల టైపు చేసిన ప్రతి. అప్పట్లో వెయ్యి పుటల సిద్దాంత గ్రంథాలు కూడా ఉండేవి. కాని కమలాభగవత్ సిద్ధాంత గ్రంథం ఎన్నో రకాలుగా విలక్షణమైంది. ఫలితంగా యూరోప్‌లోని ఎంతో మంది శాస్త్రవేత్తలతో పరిచయం అయ్యింది. విజ్ఞాన శాస్త్ర రంగంలో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళ కమలాభగవత్.
1939లో భారతదేశం తిరిగి వచ్చాక కమల న్యూఢిల్లీలోని లేడి హార్డింగే మెడికల్ కళాశాలలో అధ్యాపకులుగా చేరి, బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి అయ్యారు. అక్కడ చాలామంది బోధనా సిబ్బంది పురుషులే. సరైన వాతావరణం లేదనిపించింది. పరిశోధన చేయడానికి పిమ్మట ఊటీ దగ్గర ఉండే న్యూట్రిషన్ రీసెర్చి లాబ్ (తర్వాతి కాలంలో హైదరాబాదుకు తరలించబడిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. కొన్ని పరిశోధనా పత్రాలు వెలువరించినా ఆ ఉద్యోగం కూడా తృప్తినివ్వలేదు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఎం.వి. సోహానితో 1947లో వివాహం కుదిరి బొంబాయి వెళ్ళారు. అప్పటి నుంచి కమలా భగవత్ పేరు కమలాసోహానిగా మారింది. బొంబాయిలోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేరారు. జాతీయ వారి దృక్పథం, గాంధీజీ మీద గౌరవం గల కమలాసోహాని చేసిన పరిశోధనలు భారతీయ సమాజానికి చాలా విలువైనవి. పప్పు ధాన్యాలు చిక్కుళ్ళు, తాటి బెల్లం, నీరా లేదా ఈత కల్లు, తాటి మొలాసిస్, బియ్యప్పిండి మొదలైన వాటి పోషక విలువలకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనలు తిరుగులేనివి. నీరా గురించి పరిశోధన చేపట్టమని సూచించింది. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్. కమలాసోహానీ పరిశోధనలకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. అయితే రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో కూడా డైరెక్టర్ పదవి పొందడంలో కూడా స్త్రీ అనే కారణంగా వివక్షను ఎదుర్కొన్నారు. కమల మంచి పాపులర్ సైన్స్ రచయిత కూడా. మరాఠీలో పుస్తకాలు వెలువరించారు. వినియోగదారుల హక్కుల గురించి సైతం రచనలు చేశారు.
1966లో కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించిన తొమ్మిది మంది మహిళలలో కమల కూడా ఒకరు. 1987లో ఉత్పత్తుల జాబితాను కొలవడానికి పరికరాలు రూపొందించారు. బయో కెమికల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్, సొసైటీ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థలలో చాలా చురుకుగా పనిచేశారు. 1997లో భాభా అటామిక్ రీసర్చి సెంటర్ (బార్క్)లో ఇండియన్ ఉమన్ సైంటిస్టుల సమావేశంలో కమల సోహానీ మాట్లాడుతూ, తొలుత ప్రవేశానికి జరిగిన అవరోధం, పిమ్మట ఎదురయిన నిబంధనలు చాలా అవమానకరమని పేర్కొన్నారు. కేవలం స్త్రీ కావడం వల్లనే ఆ వివక్ష తయారైందని దానికి సి.వి. రామన్ వంటి పెద్ద శాస్త్రవేత్త అతీతులు కాకపోవడం విషాదమని ఆవిడ వ్యాఖ్యానించారు. తన యనభయ్యారేళ్ళ వయసులో కమల సోహానీని గౌరవించాలని న్యూఢిల్లీకి ఆహ్వానించారు. 1998 జూన్ 28న జరిగిన ఈ సమావేశంలో కమలాసోహాని హఠాత్తుగా మరణించడం ఆశ్చర్యకరమైన ముగింపు!
(ప్రముఖ పాపులర్ సైన్స్ రచయిత, ఆకాశవాణి పూర్వ సంచాలకులు)

Share
This entry was posted in సైన్స్ ఆకాశంలో సగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.