“దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ” అని గురజాడ వారు అన్నారు. అలాగే సమాజం అంటే అది ఎక్కడో లేదు మనుషుల సమÖహం వారి యొక్క ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సుఖ దు:ఖాలు, కష్ట నష్టాలు, దైనందిన సమస్యలు, ఆర్థిక స్థితిగతులు, కట్టుబాట్లు, పండగలు, వినోదాలు, ఆటలు పాటలు, చుట్టూ ఉండే పరిసరాలు, పెంపుడు జంతువులు, రవాణా సాధనాలు, పంటలు పనిముట్లు.
వీటన్నింటితో సమాజం సమాహారంగా సమతుల్యంతో ఉంటూ తన ఉనికిని బహిర్గత పరుస్తుంది. మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కటి ఈ సమాజంలో అంతర్భాగమే. సమాజంలో ఆయా కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఎందరో కవులు తమ కలాలకు పదునెక్కించి చక్కనైన కవిత్వాన్ని అందించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి తెలుగు నేలను పునీతం చేసి చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. సమాజ శ్రేయస్సును కోరి ప్రతి ఒక్కరూ రచనలు చేసారు. ఈ సŸŸమాజంలో ఉన్న సమస్యలు, లోటుపాట్లు, అవగాహనా రాహిత్యాలపై తనదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి నడుం బిగించి స్వయంగా పాటలు వ్రాస్తూ తన స్వగాత్రంతో ఆలపిస్తూ ఉన్న ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ. పూర్తి పేరు మజ్జి శ్రీనివాసరావు ఇతని తల్లిదండ్రులు మజ్జి సీతారామమ్మ, దుర్గారావునాయుడులకు 04.05.1981 తేదీన జన్మించారు. సొంతూరు పెద్దింపేట గ్రామం, బలిజపేట మండలం, ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు.
గేయం, గీతం, పాట అనేవి సమానార్ధకాలుగానే పరిగణిస్తున్నారు. గాన యోగ్యమైనది గేయమని, గీతమని, పాడటానికి అనువైనది పాట అని (అమరకోశం పుట:140), ఇవి మాత్రాచందస్సుతో కూడుకున్నవని, ఛáందస్సుకు నిత్యంగా ఉండవలసిన ధర్మం శ్రావ్యత అని అన్ని ధర్మాల కంటే ఇది గొప్పదని క్షేమేంద్రుడు వక్కాణించాడు. ఆది మానవుడు వేసిన తొలి కేక మొట్టమొదటి పాట. పాట చరిత్ర చాలా గొప్పది, మాటలు నేర్చిన మానవ పరిణామ క్రమం నుంచి ఉన్నది. ప్రజలు తమ జీవిత క్రమంలో శ్రమతో కలసి ఆశువుగా నోటితో పాడుకునే పాటలే ప్రజల పాటలు (గద్దర్`తరగని గని`పుట.1)పాటలో మొదటి భాగం పల్లవి ఇది ప్రతి చరణం తరువాత మళ్ళీ పాడవలసి ఉంటుంది. పల్లవి తరువాత పాడే మొదటి చరణం అనుపల్లవి. పల్లవి, అనుపల్లవి తరువాత పాడే పాటలోని మిగతా భాగంగా చరణాలు ఉంటాయి.
ఈ సమాజంలో తల్లిదండ్రులు లేని, పట్టించుకునే నాథుడు లేని, ఏ దిక్కూ లేని, నిర్లక్ష్యంనకు గురైన అనాథ చిన్నారుల గురించి ఈ కవి రాసి పాడిన పాట కంటతడి పెట్టిస్తుంది. అనాథ బాలల ఆక్రందన ప్రతి పలుకులో ధ్వనిస్తుంది. వారి జీవితాలు ఏవిధంగా సాగుతున్నాయో దగ్గరగా గమనించిన కవి కన్నీటి పాటను రాసారు.
పల్లవి : అనాథులం అభాగ్యులం,
తరతరాల యమయాతనలోన,
నలిగిన బాలలము,
మేం అనాథ పిల్లలము
ఇక్కడ రచయిత తను ఒక అనాథ అయితే ఏ విధంగా ఆవేధన చెందుతాడో అలా లీనమై ఉత్తమ పురుష కథనంలో తెలియజేసెను. యమయాతన, నరకయాతన ఇలాంటి పదాలు చాలా కష్టాలు, భరించలేని కష్టాలను వర్ణించేటప్పుడు ఎక్కువగా వాడతారు. తరతరాల అనే శబ్ధం యమయాతన అనే దాన్ని తీవ్రతరం చేస్తుంది. అంటే ఆ కష్టాలు తీరేవి కావు, ఎప్పటి నుండో వస్తూ ఉన్నవి అని చెబుతూ సమాజ స్థితిని తెలియజేస్తున్నారు.
(1) నవమాసాలు మోసిన అమ్మ కంటికి కనబడకున్నది…
ప్రాణం పోసి సృష్టించిన బ్రహ్మ కలలో అగుపడకున్నడే…. ॥అనాథులం॥
(2) పంచభూతాలు సాక్షిగా ఒక ప్రశ్న అడుగుతున్నా…
నవమాసాలు మోసిన అమ్మ యాడ ఉన్నదనీ… ॥అనాథులం॥
ఆనాథ అనాథ అనగా వాళ్ళను పట్టించుకునే నాథుడు లేడని అర్థం. అంటే వారి పోషణ పాలన చూసుకునే వారు లేరని తెలియజేస్తుంది. నవమాసాలు తన గర్భంలో మోసి తన రక్తమాంసాలు దారపోసి ఈ భూమికి ఒక కొత్త జీవాన్ని పరిచయం చేసిన తల్లి, బిడ్డ కనులు తెరిచి చూసేసరికి కళ్ళ ముందు కనిపించకపోతే ఆ బాధ ఏమని వర్ణించగలం… కారణం ఏదైనా కావచ్చు. పెళ్ళి కాని మహిళలు సమాజ కట్టుబాట్లుకు భయపడి బిడ్డను చెత్త కుండీలో పారవేయవచ్చు, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులిరువురు మరణించడం లేదా ఏదైనా కారణాల వలన తన వారందరూ ఆత్మహత్య చేసుకోవడం లేదా తన వారందరూ హత్యలకు గురి కావడం వలన, జన సంద్రంలో తప్పిపోయి తిరిగి తన తల్లిదండ్రులను చేరని నిస్సహాయులు కావచ్చు, ప్రకృతి విపత్తుల వలన తన వారి నుండి వేరు చేయబడి కావచ్చు, మానవ తప్పిదాలు వలన, పిల్లల అక్రమ రవాణ వలన కావచ్చు ఇలా కారణాలు అనేకం ఉంటాయి. కాని అనాథలకు మిగిలేది కన్నీటి అగాథమే, బాధా తప్త హృదయమే. ఏ దిక్కూలేని వారికి దైవమే దిక్కని అంటారు, మనల్ని సృష్టించేది బ్రహ్మదేవుడని అంటారు, వారు ప్రత్యక్షంగా కనపడడం లేదు కదా కలలో కూడా కనిపించడం లేదని విమర్శనాత్మక ధోరణిలో కవి తెలియజేసారు. ఎవరూ లేని వారికి ప్రకృతి ఒడి అమ్మఒడి. పంచభూతాలు అయిన భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, ఇవి అందరినీ ఒకేలా చూస్తాయి. వీటికి తన మన అనే బేధాలు లేవు. ఆకలేస్తే అన్నం పెడతాయి. ఎండకి నీడ అవుతాయి. వర్షానికి గొడుగౌతాయి. అనాథకు ముఖ్యమైన జీవనాధారాలు ఇవి. అటువంటి వాటి సాక్షిగా అమ్మ ఎక్కడ ఉంది అని కవి సమాజాన్ని ఒక అనాథలా ప్రశ్నిస్తున్నాడు.
(3) ఎవరో చేసిన తప్ప్పుకు బాల్యం బలైపోయిందే, కామక్రోదాలు తీర్చుకుని నను అనాద చేసిందే..
“ఓ అమ్మ నాన్న మీకు దండం పెడుతున్నా… చెత్త కాల్వలో మమ్మల్ని ఇసరొద్దంటున్నా.”
అనాథగా మారడానికి ఇది కూడా ఒక కారణం. కాని ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది సామాజిక తప్పిదం, అవగాహన రాహిత్యం. సమాజానికి భయపడి చేస్తున్న పొరపాటు. తప్పు ఎవరు చేసినా ఆ చిన్నారి పొన్నారి బాల్యం బాధలకు గురవౌతున్నది. కళ్ళు కూడా తెరవని పసికందులు చెత్తకుప్పల్లో దొరకడం మనం నిత్యం చూస్తున్నాం. నిర్మానుష్య వంతెన క్రింద, పొదలలో ఆ చిన్నారుల ఆక్రందనలు ఇంకా వినిపిస్తున్నాయి. వారి శరీరాలను కుక్కలు, పందులు తిన్న సంఘటనలు కోకొల్లలు. ఈ సమాజం ఎటువైపు పోతున్నది, ఇదేనా ఆధునికత అంటే, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏమీ తెలియని అనాగరికులలా ప్రవర్తిస్తున్నారు. రచయిత సూటిగా ప్రశ్నిస్తూ ..
“ఓ అమ్మ నాన్న మీకు దండం పెడుతున్నా… చెత్త కాల్వలో వాళ్లను విసరొద్దంటున్నా” అని వేడుకుంటున్నారు.
(4) చిట్టి చేతులతో తట్టలు మోస్తూ పొట్టలు నింపే వాళ్ళము
రెక్కలు ముదరని బరువులు మోసి బాధను భరించేవాళ్ళము
మా అమ్మ నాన్న ఉండుంటే బడికి పోయేవాళ్ళం
అ, ఆలు నేర్చే వయసులో బాధలెన్నో పడుతున్నాము ॥అనాథులం॥
అనాథలుగా జీవిత ప్రయాణం ప్రారంబించిన ఆ పసిమొగ్గలను ఆదుకునే దయార్ద్రహృదయులు, స్వచ్చంద సంస్థలు, శరణాలయాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యాలయాలు కానరానపుడు ఆ పిల్లలకు దిక్కెవరు.. ఆకలి ఏ పనైనా చేయిస్తుంది కదా..తమ చిట్టి చేతులతో చేతనైన పని చేసుకుంటారు. పదో పరకో సంపాదించి పొట్ట నింపుకుంటురు. కష్టమంటే తెలియని వయసులో ఎన్నో కష్టాలను భరిస్తారు. తలకు మించిన భారాన్ని ఎత్తుకుంటారు. రెక్కలు ముదరకపోయిన రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. అదే వాళ్ళ అమ్మా నాన్నలు ఉంటే అలా జరగనిస్తారా. అల్లారుముద్దుగా పెంచుకుని వాళ్ళకు కావాల్సింది ఇచ్చి కష్టం అనేది దరికి రాకుండా చూసుకుంటారు. బరువు మోసే చేతులకు బలపాలిచ్చి అక్షరాలు దిద్దిస్తారు.
(5) ఆకలేస్తే ఓ చెత్త కుండి నాకమ్మలా అగుపిస్తుంది కదా…
వర్షమొస్తే ఆ చెట్టు తొర్ర నా యిల్లులా కనిపిస్తుంది కదా…
అయ్యో… బ్రహ్మ దేవుడా…॥2॥
ఎందుకు రాసావూ రాతను
ఏ తప్ప్పు చేసామని ఏమని గీసావు గీతను ॥అనాథులం॥
మనం రోజూ చూస్తున్నాం ఎంతో మంది అనాథలు చెత్తకుండీలల్లో పారబోసిన ఆహారాన్ని ఏరుకుని తినడం… అమ్మలేని వాడికి అదే అమ్మలా కనిపిస్తుంది ఎందుకంటే అది వాడికి అన్నం పెడుతుంది కాబట్టి. వర్షమొస్తే వాడికి తల దాచుకునే జాగా దొరకక ఏ చెట్టు తొర్రొ వెతుక్కుంటాడు, ఏ బస్టాఫ్‌లోనో పడుకుంటాడు. ఏ వంతెన క్రిందో సేదతీరుతాడు. ఓ బ్రహ్మ దేవుడా ఆ పసి పిల్లలు ఏం పాపం చేసారు, ఏ తప్పు చేసారని వాళ్ళకు ఈ శిక్ష విధించావు, వాళ్ళ జీవితాలు ఇక ఇంతేనా.. వాళ్ళ నుదుటి గీతలు, తల రాతను ఇలా ఎందుకు రాసావు అని నిలదీస్తారు రచయిత. ఈ విధంగా అనాథ బాలల గురించి రచయిత ఎంతో ఆర్ద్రంగా హృదయం ద్రవించేటట్లు సమాజంలో జరుగుతున్నది మన కళ్ళముందు కదులుతున్నట్లు చక్కని పాటను ఆవిష్కరించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రతి వ్యక్తి బాధ్యతాయుక్తంగా ఉండి గురజాడ వారు చెప్పినట్లు “సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ” అనే దృక్పథంతో ముందుకు సాగితే కొంత మేలు జరుగుతుంది. అనాథలంటే చిన్నచూపు లేకుండా అది ఒక సామాజిక సమస్యగా భావించి సమాజంలో ఎప్పుడూ ఉంటుందని ఎరిగి ప్రతివ్యక్తి తమ వంతు సేవా భావంతో సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి. రచయిత ఆశయం కూడా ప్రజలందరూ సామాజిక అవగాహనతో ఉండి సమాజ అంతర్భాగంగా ఉత్పన్నం అయ్యే ఎటువంటి సమస్యయైనా కలసికట్టుగా ధైర్యంగా ఎదుర్కోవాలి అని మనస్పూర్తిగా ఆశిస్తూ తన కలంతో గళంతో ఎంతో మందికి అవగాహన కల్పిస్తున్నారు.
ఆధార గ్రంథాలు: 1.డా జి. చెన్నకేశవరెడ్డి`ఆధునికాంధ్ర గేయ కవిత్వం. 2.కూర్మాచలం శంకరస్వామి`తెలుగులో సంక్షేమ చైతన్య గీతాలు`2008. 3.శాఖమÖరి శ్రీనివాసరావు`బాల సాహిత్యం పరిశీలన`2021. 4.పత్రికా కథనాలు`ఇంటర్‌నెట్ వ్యాసాలు.
