ఓ అనామకురాలి జీవన పోరాటం! – శాంతి శ్రీ బెనర్జీ

‘సయ్యదా – ఓ అపరిచిత భారతీయురాలి కథ’ ఢిల్లీకి చెందిన సర్వస్వతంత్య్ర జర్నలిస్టు, అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, గత 17 సంవత్సరాలుగా రాజకీయాలు, జెండరు, సామాజిక న్యాయం లాంటి విషయాల మీద రాస్తున్న నేహా దీక్షిత్ కలం నుండి వెలువడిన తప్పక చదవాల్సిన పుస్తకం.

అనేక వత్తిళ్ళ మధ్య బతుకు వెళ్ళదీస్తూ, రకరకాల పనులు చేస్తూ, అరకొరకు వేతనాలతో రాజీ పడుతూ జీవిస్తున్న ముస్లిం మహిళ సయ్యదా జీవిత చరిత్ర ఇది. పుస్తకం పేరులో సయ్యదా పెట్టడంలోని అర్థం ఎవరో ఒక సయ్యదా అని చెప్పడానికే! అంటే ఎవరికీ తెలియని, సామాన్యురాలైన, అనామకురాలైన స్త్రీ అన్నమాట!
సయ్యదాతో ముడిపడిన మనుష్యులను, సంఘటనలను, పరిస్థితులను సమగ్ర పరిశీలనా దృష్టితో, అనేకానేక వివరాల మేళవింపుతో ఒక రిపోర్ట్‌గా మన ముందుకు తెచ్చారు నేహా. దీని కోసం ఆమె తొమ్మిది సంవత్సరాలు అకుంఠిత దీక్షతో పనిచేశారు. దాదాపు 900 మందిని కలిసి మాట్లాడారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి మనకు చదివే అద్భుత అవకాశాన్ని కలిగించారు ప్రగతిశీల మహిళా సంఘం అధికార మాసపత్రిక ‘మాతృక’ వర్కింగ్ ఎడిటర్ రమా సుందరి. అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం సముచితం! ఈ అనువాదాన్ని మలుపు బుక్స్ ప్రచురించింది.
1990ల నుండి ప్రస్తుత కాలం వరకు సాగిన కథను పట్టుకుంటూ పోయారు నేహా దీక్షిత్. బెనారస్, చాందినీ చౌక్, సభాపూర్, కరవాల్ నగర్, నస్బంది కాలనీ కథకు ఆయువుపట్టుగా మారిన ప్రదేశాలు. లోతైన అవగాహనతో రాసిన ఈ పుస్తకం కులీన వర్గాల భారతీయులు ఊహించలేని ఒక కఠిన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని గురించి ప్రముఖ స్త్రీవాది, రాజనీతి శాస్త్రవేత్త నివేదిత మీనన్ అంటారు : “ఆధునిక భారతదేశ చరిత్రలో సంభవించిన విప్లవాత్మక సంఘటనల చరిత్రనే శ్రామిక ముస్లిం మహిళ జీవన చరిత్రగా చెప్పుకోవచ్చు. ఆ చరిత్ర చెబుతూ నేహా ఎవరికి తెలియని కార్మిక వర్గ ముస్లిం మహిళ జీవితాలను దహించేటంతటి సాంద్రతతో కథగా అల్లారు.”
పుస్తకంలో ప్రధాన పాత్రధారి సయ్యదా కాబట్టి అప్పటి పరిస్థితులకు ప్రతిగా సాగిన ఆమె జీవితం ఎటువంటి ఒడిదుడుకుల పాలయిందో తెల్సుకోవడం ఎంతో అవసరం. సయ్యదా తండ్రి రషీద్ మెహ్రీన్తో పెళ్ళైన ఆర్నెల్లకే బెనారస్ నుండి పారిపోయి ఒక నాటక కంపెనీలో చేరతాడు. ఒక నటిని పెళ్ళాడి కాన్పూరులో ఇంకో కాపురం పెడతాడు. ఏడాదికి ఒకసారి బెనారస్ వచ్చేవాడు. రషీద్, మెహ్రీన్లకు ఇద్దరు కొడుకులు, సయ్యదా పుడతారు. సయ్యదాకి తొమ్మిదేళ్ళపుడు రషీద్ నౌటంకీ లారీ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు.
సయ్యదా తల్లి ప్రేమకు నోచుకోలేదు. తనే ఆమెకి తల్లిగా బాధ్యత తీసుకుని మొత్తం కుటుంబానికి వండిపెట్టేది. 1987లో మెహ్రీన్ మరణం తర్వాత నాయనమ్మ పద్నాలుగేళ్ళ వయస్సులో సయ్యదాకు అక్మల్‌తో పెళ్ళి జరిపించింది. అక్మల్ కుటుంబీకులు ఖరీదైన నేతవస్త్రాల పనిలో ప్రావీణ్యం కలవారు. సయ్యదా, అక్మల్‌కు కొడుకులు షాజెబ్, సల్మాన్ల తర్వాత 1994లో కూతురు రేష్మా పుడుతుంది.
1992 డిసెంబర్ 6న వేలాదిమంది హిందూ మతోన్మాదులు సంఘ్ పరివార్ ఆదేశాలతో అయోధ్యలోని బాబ్రీమసీదును కూలగొట్టారు. ఆ తర్వాత బెనారస్‌లో హిందూ ముస్లిం ఘర్షణలు తీవ్రమయ్యాయి. పోలీసులు ముస్లిం సాలెల ఇళ్ళల్లో ఎన్నో మగ్గాలను ధ్వంసం చేశారు. అక్మల్ లాంటి యువకులను అరెస్టు చేశారు. జైల్లో ఐదు నెలల తర్వాత అక్మల్‌ని 1993 మేలో విడుదల చేశారు గాని ఇళ్ళు దహనం చేశాడని, దొంగతనం చేశాడని, మత విద్వేషం రేకెత్తించాడని అతని మీద చాలా కేసులు పెట్టారు. చాలామంది నైపుణ్యం గల ముస్లిం నేత పనివాళ్ళు తమ వృత్తిని వదిలేసి రోజువారీ కూలీలుగా, రిక్షాలాగే వారిగా, భవన నిర్మాణ కూలీలుగా మారిపోయారు. అక్మల్ చేనేత మోజులో బికారిగా మిగిలిపోయాడు.
అందుకే వాళ్ళు బతుకుతెరువు కోసం లక్నో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కానీ చివరికి అక్మల్ ఢిల్లీకి టికెట్లు తీసుకుని కుటుంబంతో 1995 జూన్‌లో ఢిల్లీ చేరతాడు. చాందినీ చౌక్లో సామాన్ల బండిలాగే కూలీగా కుదురుతాడు. అక్మల్ తాగి ఒక కానిస్టేబుల్‌ని తిట్టడంతో అతన్ని లాకప్పులో వేసి విపరీతంగా కొడతారు. అక్మల్ కోలుకోవడానికి నెల పట్టింది. అతను ఇంట్లో ఉండటంతో పిల్లల్ని తన దగ్గర వదిలి చిరుతిండి ఫ్యాక్టరీ పనికి వెళ్ళసాగింది సయ్యదా. ఆ ఫ్యాక్టరీ యజమాని ఫాక్యరీని ఈశాన్య ఢిల్లీలో ఉన్న సభాపూర్ అనే గ్రామానికి తరలించాలని నిర్ణయించుకుని, సయ్యదా అక్కడకి వచ్చి పని చేస్తే ఇల్లు ఇచ్చి, నెలకు 2500 ఇస్తానని వాగ్దానం చేస్తాడు. సయ్యదా పిల్లలతో సభాపూర్ చేరుకుంటుంది. అక్మల్ చాందినీ చౌక్లో పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. తరువాత సయ్యదా కుటుంబంతో ఈశాన్య ఢిల్లీలోనే ఉన్న కరవాల్ నగరానికి మారింది. అక్కడ అక్మల్ రిక్షాలాగే పనిలో, సయ్యదా సైకిల్ భాగాలు తయారు చేసే పనిలో కుదిరారు.
చాలా సంవత్సరాలు ఆమె కరవాల్లో పేద వలస మహిళగా పాటుపడింది. వేలాడే జీన్సు దారాలను కత్తిరించడం దగ్గర నుండి, కారం తిను బండారాలను వండడం, బాదం పప్పులను ఒలవడం, టీ ఫిల్టర్లను తయారు చేయడంలాంటి అనేక పనులుచేస్తూ కష్టపడింది. ఆమె చేసిన పనులలో 50 రకాల దాకా ఉన్నాయి. అంత శ్రమించినా ఆమెకు దొరికినవి అరకొరకు వేతనాలే. ఎప్పుడైనా పని మానేసినపుడు వెంటనే ఆమె చేసే పని వేరొక మహిళ చేతిలోకి పోయేది. ఏ పనైనా ఆమె యంత్రంలా, నిర్వికారంగా చేస్తూ పొయ్యేది. ఫ్యాక్టరీలో ఆవు మూత్రంతో అగరుబత్తీలు చేయడానికి, తలుపుపిడులు చేయడానికి ఆమెకి ఎటువంటి వ్యత్యాసము కనపడేది కాదు. ఆమె ఎంత వేగంగా ఫ్యాక్టరీలు మారేదంటే, ఫ్యాక్టరీ యజమానుల పేర్లు గుర్తు పెట్టుకోవడం అసాధ్యం. మొదటి నుంచి ఆమె అక్మల్ కంటె ఎక్కువగా కుటుంబం కోసం శ్రమపడింది.
పిల్లలు ఎదిగి వచ్చినా సయ్యదా సుఖపడలేదు. పెద్దకొడుకు షాజెన్ హిందువుల అమ్మాయి బబ్లీతో ప్రేమలో పడి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీకి 2014లో పారిపోతాడు. చిన్నకొడుకు సల్మాన్ లారీక్లీనర్ కమ్ మెకానిక్‌గా చేస్తూ ఖాళీ సమయాన్ని దర్గాలో గడపటం మొదలుపెడతాడు. ఉద్యోగం పోయిన తర్వాత దర్గాలో ఎక్కువ సేపు గడపటం, మసీదులు శుభ్రం చేయడం చేస్తుంటాడు. 2016లో ఒక రోజు మసీదు గోపురాలలో ఒకటి కూలిపోయి అతని మీద, ప్రక్కన ప్రార్థన చేస్తున్న ఇంకో ఇద్దరి మీద పడిపోయింది. సల్మాన్ ఆసుపత్రిలో చనిపోతాడు.
సయ్యదాకి తన రెండు కళ్ళని చెప్పుకునే ఇద్దరు కొడుకులు దూరం అవటంతో రేష్మా మీద ఆధారపడవల్సి వచ్చింది. అది ఆమె అహాన్ని దెబ్బతీసింది. అమ్మానాన్నల బరువు బాధ్యతలు మోయాలని రేష్మా నిర్ణయించుకుంటుంది. అయితే వాళ్ళు ఆమె షరతులకు లోబడి ఉండాలని కోరుకుంటుంది. అదే సయ్యదాకు నచ్చని విషయం కావచ్చు! అంతేకాకుండా రేష్మా పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లా నుంచి వచ్చినటువంటి, ఒకప్పుడు తన అన్న షాజెబ్ స్నేహితుడు అయిన ఘజాలితో స్నేహంగా ఉంటుంది. అతని పేరును జీజీగా కూడా మార్చింది. బెంగాలీ ముస్లింలపట్ల మూస అభిప్రాయాలున్న సయ్యదా రేష్మా జీజీతో స్నేహంగా ఉండటం ఇష్టపడదు. అతనితో సరిగ్గా మాట్లాడదు. రేష్మా అదేమీ లెక్కచెయ్యదు. ఇంటరు దాకా చదివినా మాల్లో వాష్రూముల క్లీనింగ్ పనిచేసేది. 2019లో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి ఒక డిజిటల్ సేవా కేంద్రంలో ఆపరేటర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది.
2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో మతదాడులు జరిగినప్పుడు సయ్యదా కుటుంబం మొరాదాబాద్లో ఉంటున్న స్నేహితురాలు రేడియోవాలీ ఆశ్రయంలో ఉంటుంది. ఈశాన్య ఢిల్లీలో చాలా సహాయ శిబిరాలు వెలిశాక వాళ్ళు అక్కడ తలదాచుకున్నారు. మార్చిలో ప్రధాన మంత్రి మోడి కరోనా లాక్డౌన్ ప్రకటించాక, శిబిరాల్లో ఉంటున్న వారికి డబ్బు, గోధుమలు, బంగాళదుంపలు ఇస్తామని వాగ్దానం చేసి, వైరస్ పెరగకుండా ఉండటానికి శిబిరాలు ఖాళీ చెయ్యమని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. వాళ్ళు కరవాల్ నగరం వెడితే హిందువులు ముస్లింలకు ఇళ్ళు ఇవ్వమని చెప్పారు. మతదాడుల్లో దెబ్బతిన్న ముస్లింలకు కరవాల్ నగరంలో అద్దె దొరకకుండా చేయడమే తమ లక్ష్యమని అల్ట్రా హిందూ ఫ్రంట్లు ప్రకటించాయి. అందుకే జీజీ నస్బంది కాలనీలో అందరి కోసం ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. తర్వాత జీజీ, రేష్మాల వివాహం జరగగా వాళ్ళు సయ్యదా ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకుంటారు. రేష్మా పెళ్ళయిన తర్వాత సయ్యదా ఎప్పటిలాగానే పనికి పోవడం మొదలుపెట్టింది. శ్రమతో ముడిపడిన ఆమె జీవితంలో మార్పు లేదు. కష్టజీవిగానే సాగిపోతున్నది.
ఈ పుస్తకం రాయడంలో నేహ ఎన్నో ప్రతిఘటలను ఎదుర్కొంది. ఆమె పుస్తకంలో తన మాటగా చెప్పిన విషయాలు గర్తుంచుకోదగ్గవి. 2020 ఢిల్లీ మత దాడుల తర్వాత ఆమె కరవాల్ నగరానికి ఎక్కవగా వెళ్లడం సాగించింది. అందుకు ఆమెను ఐదు నెలల పాటు వెంబడించడమే కాకుండా యాసిడ్ దాడలు చేస్తామనీ, గ్యాంగ్ రేపులు చేస్తామనీ బెదిరించారు. ఆమె మీద నిఘా పెట్టి, ఏమి చేస్తుందో, ఎటు వెళ్తుందో గమనించసాగారు. దాడుల గురించి, హిందూ ఆధిపత్య సంస్థల గురించి రిపోర్టింగును ఆపమని ఆమెకు వార్నింగ్ ఇచ్చాక, ఆమె ఇంట్లోకి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు. కానీ అందులో సఫలం కాలేదు. చివరకు పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండా ఆమెవన్నీ ఊహలనీ తేల్చారు.
2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక హిందూ ఆధిపత్య వాదుల ప్రభావం అధికమయింది. వారి ర్యాలీలు నలువైపులా ఎక్కువయ్యాయి. రాజకీయ హిందూయిజం అనే హిందూ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన వీర్ సావర్కర్ వాళ్ళకి ఆదర్శనీయుడు. 1936 అక్టోబర్‌లో ఆయన అన్న మాటల ప్రకారం ఒక దేశం అక్కడ జీవిస్తున్న మెజారిటీ ప్రజల ద్వారా నిర్మాణం అవుతుంది. జర్మనీలో యూదులు మైనారిటీ అవడం వలన వారిని గెంటేశారు. ఈ మాటలు హిట్లర్ అమలు చేసిన యూదు వ్యతిరేక మారణకాండనే భారతదేశంలో ముస్లింలకు వర్తింపజేయాలనే అర్థాన్ని ఇస్తాయి. అంతే కాకుండా సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో పలు సంస్థలు ఏర్పడి చురుకుగా పనిచెయ్యసాగాయి. ఉదాహరణకు ప్రేమికుల దినోత్సవాన్ని ఆపే బాధ్యతను హిందూ కన్యా రక్షణ ఫ్రంట్, ఉత్తర భారతదేశంలో గోరక్షక దళాల గౌరక్షా ఫ్రంట్ అనగా జీఆరఎఫ్, హిందూ ముస్లింల పెళ్ళి అంటే లవ్ జీహాద్ ఆపడానికి హిందూ బహెన్ బేటీ బచావో సంఘర్ష్ సమితి, సేవ్ హిందూ సిస్టర్స్ అండ్ డాటర్స్ స్ట్రగుల్ కమిటీ లాంటివి. కొంతమంది ముస్లిం యువకులు పోలీసుల బాధ తప్పించుకోవడానికి తమ పేర్లను దిల్కష్, బాబీ, సన్నీగా మార్చుకోవడం కూడా కనబడుతుంది.
పుస్తకంలో మనకు కొట్టొచ్చినట్లు కనపడేది సయ్యదాలాంటి అసంఘటిత రంగంలో పనిచేసే మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులు. సామాజిక భద్రతా చట్టం వచ్చాక కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. శ్రమదోపిడీ నిరాటంకంగా జరుగుతుంటుంది. కనీస అవసరాలు, సౌకర్యాలు కూడా వాళ్ళకి ఉండవు. సురక్షితమైన, శుభ్రమైన పని పరిస్థితులుండవు, మరుగుదొడ్డి సదుపాయాలుండవు. క్రమబద్ధంగా పని ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు వైద్య సదుపాయాలు, పరిహారాలు ఉండవు. కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే యూనియన్ ఉండదు. సయ్యదా దారాల ఫ్యాక్టరీలో ఆపరేటరుగా ఉన్నప్పుడు ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు 12 గంటలు పనిచేసేది. అంత పని చేయించుకుని నెలకు 2000 రూపాయల వేతనం మాత్రమే ఇచ్చేవాళ్లు.
పుస్తకంలో చోటుచేసుకున్న కొన్ని ప్రత్యేకతల గురించి కూడా మనం చెప్పుకోవాలి. సయ్యదా బతుకు వెతల గురించి వివరిస్తూనే దేశంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి పేర్కొనడం మొదటిది. 2016 జరిగిన నోట్ల రద్దు, బాబ్రీమసీదు స్థలంలో రామమందిరం కట్టవచ్చునని 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, 2020 కంతా దేశవ్యాప్తంగా చాలా వరకు మహిళల నాయకత్వంలో సీఏఏ, ఎన్ ఆర్ సీ వ్యతిరేక నిరసనలు, షహీన్బాగ్ నిరసనోద్యమం, రైతు చట్టాలకు వ్యతిరేకంగా దీర్ఘకాల పోరాటం కొన్ని ఉదాహరణలు. వీటి వలన రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల అవగాహన మనకు కలుగుతుంది.
బాలీవుడ్ సినిమాల ప్రభావం కుల మత వర్గ బేధాలకు అతీతంగా సమాజంలో వ్యాపించిందనడంలో సందేహం లేదు. సయ్యదా కూడా చిన్నప్పటి నుండి సినిమాలను ఇష్టంగా చూసేది. తనలాగే సినిమాలంటే ఇష్టపడే వ్యక్తి తనకు భర్తగా రావాలని ఆమె పెళ్ళికి ముందు కోరుకుంటుంది. కుటుంబ సమేతంగా సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. షాజెబ్ సినిమా చూసి వచ్చి కథను ఆసక్తికరంగా చెప్పడంలో దిట్ట! ముఖ్యమైన సినిమాల విడుదల, (ఉదాహరణకు జంజీర్, తేజాబ్, మేనే ప్యార్ కియా, ధూమ్ వరుస సినిమాలు) వాటిపై చర్చలు పుస్తకంలోని రెండవ ఆకర్షణ. సామాన్య ప్రజల్లో సినిమాల పట్ల, బాలీవుడ్ హీరోల పట్ల ఉన్న క్రేజును బట్టి దైనందిన జీవితాల్లో సినిమాలు ఎలా భాగం అయ్యాయో తెలుస్తుంది.
ఈ పుస్తకం ద్వారా మర్చిపోలేని ముఖ్య పాత్రలు పరిచయం చేయడం మూడవ ప్రత్యేకత. ఉగ్రవాద దాడిలో విషాదంగా ప్రాణాలు కోల్పోయిన చాందినిచౌక్ రిక్షావాలా ప్యారేలాల్, శిశులింగ నిర్దారణ చేసిన కారణంగా అరెస్టయిన డాక్టరు మీనా, గౌరక్షకుడిగా మారిన బబ్లీ అన్న పిల్లూ, యువ ముస్లిం కుర్రాళ్ళను చావగొట్టటంలో ఆనందాన్ని పొందే పోలీస్ వీర్ బహదూర్, శ్రామిక మహిళలు తన ఇంట్లో కల్సుకునేట్లు చేసి, వాళ్ళు తమ బాధలను మరిచేలా సహాయపడిన రేడియోవాలీ అలియాస్ నిష కొన్ని ఉదాహరణలు.
పుస్తకం మొదటి పుటలలో బెనారస్ గురించి రషీద్, అబ్బాజీల మధ్య జరిగిన సంభాషణలు అబ్బురపరుస్తాయి. వాటిని చేర్చడంలో రచయిత్రిలో ఉన్న లౌకిక భావాల దృష్టి కోణం గోచరిస్తుంది. మనం సాయిబ్బులం కదా హిందూ దేవత చీరనెందుకు నేస్తున్నాం అని అబ్బాజీని అడిగితే చీరకు హిందూ ముస్లిం మతం లేదని, బెనారస్ చీరలో హిందూ, ముస్లిం సంబంధాలు చక్కని కలనేతగా కనిపిస్తాయని చెప్తాడు. బెనారస్ హిందూ నగరమా అని అడిగితే, ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తుందని నమ్మే హిందువులది బెనారస్. ఇక్కడి జనాభాలో నాలుగో వంతు ఉన్న ముస్లింలది బెనారస్. నేతవాడైన సూఫీ సాధువు కబీర్ది. హిందూ కులదొంతరను సవాలు చేసిన సాధువు రవిదాస్ది. గురుగ్రంథ్ సాహేబ్ అనే పవిత్ర గ్రంథాన్ని అనుసరించే సిక్కులది. జ్ఞానోదయం అయిన బుద్దుడు ఇక్కడ తన మొదటి ప్రసంగం చేశాడు. కాబట్టి ఈ నగరం బౌద్ధులది. ప్రఖ్యాత పార్శవనాథముని ఇక్కడ పుట్టి బోధించాడు కాబట్టి ఈ నగరం జైనులది కూడా అని జవాబిస్తాడు.
పుస్తకంలో అనేక చారిత్రక సంఘటనలను, సయ్యదా కుటుంబ పరిస్థితులను, అనేక పాత్రలను ఒక్కోసారి యాదృచ్ఛికంగా తీసుకురావడం వలన పాఠకుడు కొంత తికమకపడే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి పరిస్థితులను వివరించే ఆధారపూరితమైన పుస్తకంగా మనం దీన్ని చదవవచ్చు! దీన్ని మనకు అందించిన అనువాదకురాలి ఫొటో, కనీసం క్లుప్తంగానైనా ఆమె పరిచయం ఇస్తే బావుండేది! అది ఒక లోటుగా కనబడింది. 1990ల నుండి దాదాపు ప్రస్తుతం వరకు జరిగిన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో దోహదపడే పుస్తకాల లిస్టులో తప్పనిసరిగా జోడించవల్సిన పుస్తకం ఇది!

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.