వాళ్ళిద్దరూ భిన్న మార్గాలకు చెందిన వారు. ఒకరిది కళారంగం అయితే మరొకరిది ఉద్యమాల బాట. వారే రమ, శంకర్ మేల్కోటేలు. ఇద్దరూ పుస్తక, సంగీత, సినిమా ప్రియులు. వారిద్దరూ సమాజానికి ఆదర్శం. మార్గాలు వేరైనా కలిసి జీవించడంలోని ఆనందాన్ని తెలిసినవారు.
దాదాపు అరవై యేళ్ళ వారి సాహచర్యంలో హక్కుల ఉద్యమకారిణి, ప్రొఫెసర్ రమా మేల్కోటే నడిచిన, ఇంకా నడుస్తున్న మార్గం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. 86 ఏళ్ళ తన జీవన ప్రస్థానంలో తాను స్ఫూర్తి పొంది, ఆచరించిన విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసు కుందాం.
ప్ర. నమస్తే మేడం, బాగున్నారా?
జ. నమస్తే గిరిజా! బాగున్నాను. రండి, కూర్చోండి.
ప్ర. మేడం, మీ అమ్మానాన్నల గురించి చెప్పండి.
జ. అమ్మ పేరు నీల. గృహిణి. పెళ్ళి తర్వాత విశాఖపట్నం నుంచి తెలంగాణలోని బూర్గుల గ్రామానికి వచ్చింది. వంటలు బాగా చేసేది. అమ్మకు డాక్టరు చదువుకోవాలని ఉండింది. కానీ అప్పటి సామాజిక పరిస్థితుల వల్ల ఏడో తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. చాలా ధైర్యస్థురాలు. అమ్మకు రాజకీయాలన్నా సామాజిక విషయాలన్నా చదవడం, వినడం ఇష్టం. రజాకార్ ఉద్యమం, దౌర్జన్యం, పోలీస్ యాక్షన్, కమ్యూనిస్టు ఉద్యమం ఇవన్నీ ఆమెకు తెలుసు. అనుభవించినవే. నాన్న పక్షవాతం వచ్చి మంచాన పడ్డప్పుడు అమ్మకు నాన్నను చూసుకోవడం, సంసారం వెళ్ళదీయడంతో గడిచింది. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేది కాదు. తన బాధలు బయటకు చెప్పేది కాదు. నాన్న పోయాక గంపెండత మంది పిల్లలను గుండె ధైర్యంతో పెంచి పెద్ద చేసింది. నాన్న భూస్వామ్య కుటుంబానికి చెందిన వాడు. వ్యవసాయం చేసేవాడు. ఆయనకు చాలా ధైర్యం. ఎవరికీ భయపడేవాడు కాదు.
రజాకార్ల రోజుల్లో కూడా భయపడకుండా తిరిగేవారు. ఎక్కువగా బూర్గుల గ్రామంలోనే ఉండేవాడు. ఆ గ్రామంలో ఎప్పుడూ భూ పంచాయితీలుండేవి. హరిజనుల, లంబాడి వాళ్ళ భూములు వాళ్ళకు దక్కకుండా ఎవరో ఒకరు ఆక్రమించుకోవడం లేదా వాళ్ళకు నీళ్ళు రాకుండా చేయడం లాంటివి. నాన్న ఈ తగాదాలన్నీ ఏ కలెక్టరు దగ్గరికో, తహసిల్దార్ దగ్గరికో తీసుకెళ్ళి, వాటిని తీర్చి వాళ్ళకు పట్టాలిప్పించే వారు. నాన్న నాకు తెలిసిన మొదటి ఫెమినిస్టు. ఆడపిల్లలు చదువుకోవాలి. ఉద్యోగాలు చేయాలని ప్రోత్సహించేవారు. కాంగ్రెసు పార్టీ అభిమాని. జాతీయవాది.
అమ్మా నాన్నలిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి ఉన్నారు. అలా చేసి ఉండకపోతే అమ్మ డాక్టరు, నాన్న కలకత్తాలోనే విద్యను కొనసాగించి సైంటిస్టు అయ్యేవారు కాబోలు. అమ్మానాన్న మాకిచ్చిన అత్యంత విలువైన వరం. ఆలోచించడానికి, మా వ్యక్తిగత జీవితాల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి మాకు వారిచ్చిన స్వేచ్ఛ. మా వ్యక్తిత్వానికి, ఆలోచనా విధానాలకు వాళ్ళెప్పుడూ అడ్డు చెప్పలేదు.
ప్ర. మీ జననం, సహోదరుల గురించి చెప్పండి.
జ. నేను 23 ఏప్రిల్ 1940లో హైదరాబాదులో జన్మించాను. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు, ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. నాతో కలిపి మొత్తం తొమ్మిది మందిమి. మానసికంగా ఎదగని అన్నయ్య మధు తన 53 ఏళ్ళ వయసులో పోయాడు. పెద్దన్నయ్య తెలంగాణా సాయుధ పోరాటంలో, అవిభజిత కమ్యూనిష్టు పార్టీలో పనిచేసి జైలుకు పోయాడు. ఆయన కోవిడ్ సమయంలో మరణించాడు. అందరికంటే చిన్న తమ్ముడు కమ్యూనిష్టు ఎం.ఎల్ పార్టీలో పనిచేసి జైలుకు వెళ్ళాడు. గత రెండేళ్ళలో ఇద్దరు తమ్ముళ్ళు పోయారు. సుమనక్క బూర్గుల పంచాయితీలో పని చేసింది. ఆమె గత అక్టోబర్‌లో పోయింది. ఇప్పుడు నేను, చెల్లెలు, తమ్ముడు ముగ్గురమే ఉన్నాం.
ప్ర. మీ బాల్యంలో జరిగిన సంఘటనలు చెప్పండి. వాటి ప్రభావం మీ పైన ఉందా?
జ. మాది ఉమ్మడి కుటుంబం. కాచిగూడలో ఉండేవాళ్ళం. మా పెద్దనాన్న బూర్గుల రామకృష్ణారావుగారు. హైదరాబాదు స్టేట్‌కు తొలి ముఖ్యమంత్రి. మా ఇంట్లో ఒక రాజకీయ వాతావరణం ఉండేది. పెదనాన్న లాయరు. ఆయన ఆఫీసులో షోయబుల్లాఖాన్ అనే పాత్రికేయుడు ‘ఇమ్రోజ’ అనే పత్రిక నడిపించేవాడు. తర్వాత రజాకార్లు అతనిని తన ఇంటి ముందే నరికి చంపిన విషయం తెలిసిందే కదా.. రాజ్ బహదూర్, రావి నారాయణరెడ్డి, జవాద్ నాయకులతో పాటు సంగం లక్ష్మీబాయి, సీతాకుమారి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ లాంటి మహిళా నాయకులు కూడా మా యింటికి వచ్చేవారు. ఆ వాతావరణం నా మీద చాలా ప్రభావం వేసిందనే చెప్పాలి.
ప్ర. మీకు రజాకార్ల ఉద్యమం చూసిన గుర్తు వుందా?
జ. గుర్తుంది, రజాకార్ల దాడుల నుంచి మమ్మల్ని, పిల్లలను కాపాడటానికి ఇళ్ళు మార్చారు. నారాయణగూడాలో (ఇపుడు ఆప్కో భవనం), చీకోటి గార్డెన్స్‌లో కొన్ని రోజులున్నాం. ఉమ్మడి కుటుంబం కనుక పిల్లలంతా చేరి అల్లరి చేయకుండా ఒక గదిలో వుంచేవారు. ఆడవాళ్ళు కారం పొడి దగ్గర పెట్టుకొని, తలుపులు, కిటికీలు మూసి పెట్టుకొని అలర్ట్‌గా ఉండేవారు.
ప్ర. మీ పాఠశాల విద్యాభ్యాసం గురించి చెప్పండి.
జ. నా పాఠశాల విద్య ఒకచోట సాఫీగా సాగలేదు. అంచెలంచెలుగా సాగింది. మొదట స్టాన్లీ స్కూల్లో చేర్పించారు. తర్వాత బాపట్లలో చదువుకున్నాను. దానికి కారణం అప్పటి రాజకీయ పరిస్థితులు. చెప్పాను కదా! మా యింట్లో రాజకీయ వాతావరణం ఉండేది. రజాకార్ల దౌర్జన్యాన్ని అణచి వేయడానికి సర్దార్ పటేల్ మిలటరీని పంపించాడు. నిజాం హైదరాబాదు రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించకుండా స్వాతంత్య్రాన్ని ప్రకటించాడు. పోలీస్ యాక్షన్‌గా ప్రసిద్ధి పొందిన ఈ చర్య నెహ్రూ, సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మిలటరీ బలగాలవల్ల జరిగింది. అది అంతటితో ఆగక భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిష్టుల వైపు మిలటరీ బలగాలు దృష్టి సారించాయి. ఆ పోరాటంలో ఎంతో మంది ఉద్యమకారులు, పేద రైతులు, స్త్రీలు చనిపోయారు. ఆ పరిస్థితుల్లో మా కుటుంబం అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని బాపట్లకు మారింది. అందువల్ల నేను బాపట్లలో కూడా కొంతకాలం చదువుకున్నాను. అక్కడి నుంచి తిరిగి హైదరాబాదుకు వచ్చాక మాడపాటి హనుమంత రావు స్కూల్లో రెండు మూడేళ్ళు చదువుకున్నాను. తర్వాత స్టాన్లీ స్కూల్లో ఏడు నుంచి పదోతరగతి పూర్తి చేశాను.
ప్ర. మీ ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ? ఎలా జరిగింది?
జ. ఇంటర్మీడియట్, బి.ఏ, నిజాం కాలేజీ నుంచి, ఎం.ఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్శిటీ పి.జి కాలేజీ నుంచి పూర్తి చేసాను. 1963 అక్టోబర్‌లో ఫ్రాన్స్‌కు వెళ్ళాను. పారిస్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందాను. దాదాపు నాలుగేళ్ళు అక్కడే ఉన్నాను. ఆ నాలుగేళ్ళ కాలం నా జీవితంలో చాలా ప్రధానమైంది.
ప్ర. ఆ వివరాలు చెప్పండి మేడం?
జ. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న రోజులవి. 1968 ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. దాదాపు రెండు నెలలు ఫ్రాన్స్ మొత్తం స్తంభించి పోయేంత పెద్ద ఉద్యమం అది. విద్యార్థులతో మొదలై కార్మికుల వరకు వెళ్ళి ప్రభుత్వాన్నే కదిలించింది. వియత్నాం యుద్ధానికి, కెమికల్ దాడులకు, హింసకు వ్యతిరేకంగా ధర్నాలు జరిగాయి. ఫ్రాన్స్‌లో కూడా స్టాలిన్‌కు మద్దతుగా వ్యతిరేకంగా ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి సంఘాలు చర్చలు జరిపేవారు. విద్యార్థి సంఘాల చర్చలలో నేను పాల్గొనేదాన్ని. ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా అల్జీరియా స్వాతంత్య్ర ఉద్యమం, మార్టిన్ లూథర్ కింగ్ సివిల్ రైట్స్ ఉద్యమం, భారతదేశంలో కూడా నక్సల్బరీ ఉద్యమం మొదలైంది. 1969లో తొలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. సిపియం, సిపిఐ, యంఎల్ పార్టీలుగా విడిపోవడం.. చాలా మంది ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. స్త్రీలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ విధంగా ఆ కాలం చరిత్రలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సమయంలోని ఉద్యమాల ప్రభావం నా మీద చాలా పడింది. ఇవన్నీ ఏవో కొన్ని మార్పులను తెచ్చినా చాలా హింస జరిగింది. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం జరిగింది.
ప్ర. మీది ప్రేమ పెళ్ళా? పెద్దలు కుదిర్చినదా? ఆ విశేషాలు చెప్పండి.
జ. 1967 డిసెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చాను. 1967 డిశంబరు పదహారో తేదీన నా వివాహమైంది. మా పెళ్ళి మేమే కుదుర్చుకున్నాం. పెద్దలు అంగీకరించారు. 1962లో నేను ఉస్మానియా యూనివర్సిటీ పి.జి కాలేజీలో ఎం.ఏ చదువుతున్న రోజులలోనే శంకర్ నాకు పరిచయమయ్యాడు. ఆయన సైన్స్ విద్యార్థి. నా కంటే ఒక ఏడాది సీనియర్. సాంస్కృతిక కార్యక్రమాలలో తరచూ కలిసేవాళ్ళం. రంగస్థల నటుడు. కవిత్వాన్ని అద్భుతంగా చదివేవాడు. అది నన్ను చాలా ఆకట్టుకున్నది. ఆ తర్వాత నేను నా పరిశోధన కొరకు ఫ్రాన్స్ వెళ్ళి పోయాను. తను కూడా ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్ళాడు. మాకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక బిడ్డ. బాబు అమెరికాలో స్థిరపడ్డాడు. పాప బంజారాహిల్స్‌లో ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఇద్దరిద్దరు పిల్లలు. అందరూ బాగున్నారు.
ప్ర. పిల్లలు, ఉద్యోగం, ఉద్యమాలు ఈ మూడింటిని ఎలా కో ఆర్డినేట్ చేసుకున్నారు?
జ. నేను 1987లో మడగాస్కర్ ఐలాండ్‌కు ఒక ప్రాజెక్టు పని మీద రెండు నెలలు వెళ్ళాను. అది మినహా పూర్తిగా పిల్లలను విడిచిపెట్టి వెళ్లలేదు. అమ్మ ఉండేది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడలేదు. బాబు నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను బాంబేలో ఉన్నాను.
ప్ర. మీది, మేల్కోటే గారిది విభిన్నమైన రంగాలు కదా? సమన్వయం ఎలా కుదిరింది?
జ. ఆయనకు సంగీతం, కళలు అంటే ప్రాణం. నాకూ ఆ రెండూ చాలా యిష్టం. ఇద్దరం కలిసి సంగీతం వింటాం, సినిమాలు చూస్తాం. వాటి గురించి చర్చించుకొంటాం. ఇద్దరికీ పుస్తక పఠనం ఇష్టమైన పని. పుస్తకాల గురించి కూడా మా మధ్య చర్చ జరుగుతుంది. అయితే ఇపుడు కొంచెáం తగ్గింది. నేను తోట పనికి సమయం కేటాయిస్తున్నాను. వాదనలు, చర్చలు, అభిప్రాయ భేదాలు సంసారంలో రావచ్చు. ఎదుటివాళ్ళ బలాలను, బలహీనతలను పరస్పరం గౌరవించుకోవాలి. మాది చాలా లిబరల్ ఫ్యామిలీ. ఉన్న దానితో తృప్తి పడడం వల్ల మా ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. శంకర్ చాలా లిబరల్ వ్యక్తిత్వం ఉన్నవాడు. నన్ను ఎప్పుడూ “ఇది చెయ్యి, అది చెయ్యొద్దు.” అని శాసించలేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అని పొసగనప్పుడు తప్పకుండా కలిసి ఉండాలని కూడా నేను చెప్పను.
ప. మీ ఉద్యోగ వివరాలు చెప్పండి.
జ. 1962లో ఎం.ఏ అయిపోయిన వెంటనే రెడ్డి వుమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను. అప్పుడు ప్రముఖ స్త్రీవాది వసంత కన్నభిరాన్ నా సహోద్యోగి. ఆమె ఇంగ్లీషు బోధించేది. నేను ఫ్రెంచి భాష నేర్చుకున్నాను. ఒక ఏడాది అంటే 1963 జూలై వరకు ఆ ఉద్యోగం చేసి పరిశోధన కొరకు ఫ్రాన్స్‌కు వెళ్ళపోయాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక అదే కాలేజీలో అదే ఉద్యోగంలో మళ్ళీ చేరాను. రెండేళ్ళ తర్వాత 1972లో ముంబై వెళ్ళాను. శంకర్ ఉద్యోగరీత్యా అక్కడ ఉండేవాడు. ఏడాదిన్నర తర్వాత హైదరాబాదుకు తిరిగి వచ్చి 1973 ఆగస్టులో రాజనీతిశాస్త్ర బోధకురాలిగా ఉస్మానియా యూనివర్శిటీ కోఠీ వుమెన్స్ కాలేజీలో చేరాను. ఐదేళ్ళ తర్వాత ఆర్ట్స్ కాలేజీకి వచ్చాను. 2000 ఏప్రిల్‌లో అక్కడి నుంచే పదవీ విరమణ పొందాను.
ప్ర. మీరు పాల్గొన్న ప్రజా ఉద్యమాల అనుభవాలు చెప్పండి మేడం.
జ. నా చిన్నప్పుడు అమ్మా వాళ్ళ యిల్లు లాగానే మా యిల్లు కూడా అనేక రకాల చర్చలకు నిలయంగా ఉండేది. అప్పుడు మేం హిమాయత్‌నగర్‌లో ఉండేవాళ్ళం. అది నగరం నడిబొడ్డులో ఉంది. పి.ఓ.డబ్ల్యు, పి.డి.ఎస్.యు ఎం.ఎల్ పార్టీల వాళ్ళు వచ్చేవారు. అందరికీ రావడానికి చాలా అనుకూలంగా ఉండేది. నేను మానవ హక్కులు, మహిళా సమస్యల మీద ఎక్కువగా పని చేసాను. “ఇండో చైనా ఫ్రెండ్ షిప” మీటింగులు కూడా మా యింట్లోనే జరిగేవి.
1990 ప్రాంతంలో అంతర్జాతీయ ఆమ్నెస్టీ ఇండియా యూనిట్‌కు రెండు మూడేళ్ళపాటు సెక్రటరీగా పనిచేసాను. ఈ సంస్థ ప్రధానంగా మానవ హక్కుల ఉల్లంఘన మీద పనిచేసేది. చాలా కాలం విచారణ లేకుండా జైలులో ఉన్న ఖైదీల టార్చర్, కస్టడీ మరణాలు, లైంగిక హింస, జండర్ బేస్డ్ మహిళా సమస్యలు మొదలైన పలు సమస్యల మీద ఫీల్డ్‌లోకి వెళ్ళి, రీసర్చ్ చేసి రిపోర్టులు రాసేదాన్ని.
పదవీ విరమణ తర్వాత ప్రో. కోదండరాంతో కలిసి ఆహార భద్రత అంశాల మీద ఫుడ్ కమిషన్‌కు సలహాదారుగా చాలా కాలం పని చేసాను. ఐ.సి.డి.ఎస్, (ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్) ఆహార భద్రత, మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీల పని తీరును పరీక్షించి, పరిశీలించి అవి నాణ్యతగా అందుతున్నాయా? లేదా? రిపోర్టులు రాయడం మా పని. అందులో భాగంగా నేను కోదండరాం కలిసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వెనకబడిన 30 గ్రామాలకు వెళ్ళి పరిశోధన చేశాం. అక్కడి ప్రజల దయనీయమైన జీవన విధానం మీద రిపోర్టు రాశాను. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులకు ప్రధాన కారణాలను అన్వేషించి రిపోర్టులు రాసేవాళ్ళం. బడి పిల్లలకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం వేళకు సమకూరుతుందో లేదో చూడడం, అంగన్ వాడీల పనితీరు, పౌష్టిక ఆహార సరఫరా, గర్భవతులకు, మహిళలకు పౌష్టిక ఆహారం అందే విధంగా చూసే వాళ్ళం.
కాంపేయినింగ్ (ప్రచారం) వల్లనే జీవించే హక్కు, ఆహారపు హక్కు, విద్యా హక్కు లాంటివి వచ్చాయి. జీవించడం అంటే కేవలం ఊపిరి పీల్చడం కాదు. గౌరవప్రదంగా జీవించడం, పౌష్టిక ఆహారం, చేయడానికి పని ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించాలి. అరెస్ట్ చేయడం, నిర్బంధించడం కేవలం చట్టప్రకారమే జరగాలి. ఆహారపు హక్కు అంటే పౌష్టికాహారం ప్రతి ఒక్కరికీ అందాలి. విద్యాహక్కు చట్టం కింద పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. చట్టాలైతే వచ్చాయి కానీ ఈనాటికీ ఇవేవీ మనదేశంలో అమలు జరగడం లేదు. అందుకొరకు ఇంకా ఇంకా పని చేయాల్సి వుంది.
సెంటర్ ఫర్ ఏరియా స్టడీస్‌కు కొంతకాలం డైరెక్టర్‌గా ఉన్నాను. సెమినార్లు, వర్క్‌షాప్స్, కాన్ఫరెన్సులు నిర్వహించడం, పరిశోధన చేయించడం ఈ సంస్థ చేసే పనులు. ఏదైనా ఒక ప్రాంతాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక, చారిత్రక కోణాలలో పరిశోధించడం ముఖ్య ఉద్దేశం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆఫ్రికాలాంటి దేశాలలో కూడా పరిశోధన చేయించాం.
దాదాపు పదిహేనేళ్ల క్రితం “కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ” (CCC) పేరుతో రైతుల ఆత్మ హత్యలకు వ్యతిరేకంగా సజయ, ఆశ, నేను, హక్కుల కొరకు పనిచేసే మరికొంత మందితో కలిపి CCC గ్రూప్ ఏర్పడింది. నేను దానికి ప్రెసిడెంట్‌ను. ఇది సిద్దిపేట ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం, వాళ్ళ పిల్లల చదువులు ఆగిపోకుండా ఉండడం కొరకు ప్రధానంగా పనిచేసింది. దాదాపు వందల మంది పిల్లలకు బడికి వెళ్ళడానికి, కాలేజీలో అడ్మిషన్లు ఇప్పించడం, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వవలసి వస్తుందని అధికార కమిటీ ఆత్మహత్యగా గుర్తించకుండా ఇతర కారణాలతో రిపోర్టులు రాసినప్పుడు మేం మళ్ళీ ఎంక్వయిరీ వేయించి, దానిని ఆత్మహత్యగా నిరూపించి నష్టపరిహారం ఆ బాధిత రైతు కుటుంబాలకు అందేలాగా చూసేవాళ్ళం. ఆ క్రమంలో వందలాది పిల్లలు చదువుకున్నారు. ఆ కుటుంబాలు స్థిరపడ్డాయి. దానికి కొనసాగింపుగా “నేలమ్మ పరస్పర సహకార సంఘం” ఏర్పడింది. దాని ద్వారా సుస్థిర వ్యవసాయం వైపుగా అవగాహన కలిగించడానికి మహిళా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించేవారు. నీళ్ళు తక్కువగా ఉన్నా కూడా పండే పంటలు, సేంద్రీయ వ్యవసాయం లాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు చూపించింది. వ్యవసాయం రంగం మీద ఆధారపడ్డ కుటుంబాలకు బాసటగా నిలబడ్డది. ప్రస్తుతం CCC, నేలమ్మ రెండూ మనుగడలో వున్నాయి.
ప్ర. ‘స్త్రీ శక్తి సంఘటన’ ఏర్పాటు నేపథ్యం చెప్పండి.
జ. నేను పారిస్‌లో ఉన్నప్పుడు ‘వార్ క్రిమినల్స’ అని ఒక పెద్ద మీటింగ్ జరిగింది. సుమారు ఇరవై వేల మందిదాకా వచ్చారు. నేను నా స్నేహితురాలు కుర్షిద్ ఆ మీటింగ్‌లోకి చొచ్చుకొని పోయాం. వేదిక మీద సిమోన్‌డి బోవర్ ఉన్నారు. వియత్నాం కెమికల్ వార్ ఎలా జరిగిందో చర్చిస్తున్నారు. అప్పుడు కలిసాను ఆమెను. ‘సెకండ్ సెక్స’ అనే పుస్తకాన్ని రాసి సంచలనం సృష్టించిన రచయిత్రి ఆమె. అది నా మనసులో గాఢంగా ముద్రపడింది.
నేను ఇండియాకు తిరిగి వచ్చాక మా యింట్లో కొంత మంది స్నేహితులం తరచుగా కలిసే వాళ్ళం. నేను పారిస్ వెళ్ళక ముందు ఏర్పడ్డ స్నేహం వసంత కన్నభిరన్‌తో ఇప్పటికీ కొనసాగుతుంది. మిత్రులం కలుసుకున్నప్పుడు స్త్రీల సమస్యల మీదకు చర్చ వెళ్ళేది. ఆ దిశగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో స్త్రీ ‘శక్తి సంఘటన’ ఏర్పడింది. నేను, రత్నమాల, వసంత, వీణ, లలిత కొందరు మిత్రులం కలిసి దానిని మొదలుపెట్టాం. ఎలాంటి ప్రొటోకాల్ లేదు. ఎవరు చేయగలిగిన పనిని వాళ్ళు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో వరకట్న చావులు చాలా జరిగేవి. “డౌరీ డెత్ ఇన్విస్టిగేషన్ కమిటి” ఏర్పాటు చేసి వరకట్న చావులకు వ్యతిరేకంగా పనిచేశాం. పెరిగిన కూరగాయల ధరలకు వ్యతిరేకంగా పనిచేశాం.
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పురుషుల వివరాలు వెలుగులోకి వచ్చాయి, కానీ, ఒక్క మల్లు స్వరాజ్యం మినహా మిగతా స్త్రీలు ఎవరూ ప్రపంచానికి తెలియదు. ఆ దిశగా పనిచేయాలని అనుకున్నాం. దాని ఫలితమే “మనకు తెలియని మన చరిత్ర” పుస్తకం. అందుకొరకు నేను, వసంత కన్నాభిరన్, సూసీతారు, లలిత మొదలైన వాళ్ళం కలిసి పనిచేశాం. అది రెండు మూడేళ్ళ తర్వాత ఇంగ్లీషులో కూడా వచ్చింది. ఈ మధ్యనే దాని రెండో ప్రచురణ అన్వేషి సంస్థ తీసుకవచ్చింది.
ప్ర. ప్రస్తుతం మీరు అన్వేషి సంస్థకు ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా? ఆ వివరాలు చెప్పండి.
జ. స్త్రీ శక్తి సంఘటనగా పని చేసిన అనుభవంతో.. ఆక్టివిస్టుగా కాకుండా సమస్యల గురించి చారిత్రాత్మకంగా పరిశోధన చేయడం, స్త్రీలపై హింస పెరగడం, ప్రభుత్వ పాలసీలను విమర్శనాత్మకరంగా చూడడం కొరకు ఒక సంస్థ, నిధులు అవసరమని భావించి 1985లో ‘అన్వేషి’ సంస్థను స్థాపించడం జరిగింది. సాహిత్యంలో స్త్రీలు చేసిన కృషి ఎక్కడా కనిపించదు. అందుకని అన్ని భారతీయ భాషల్లో స్త్రీలు చేసిన సాహిత్యకృషిని సుదీర్ఘ పరిశోధన చేసి “వుమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా” అనే పేరుతో రెండు సంపుటాలుగా సుజితారు, కె. లలిత ఆధ్వర్యంలో ప్రచురించాం. అంతేకాకుండా స్త్రీల ఆరోగ్య వ్యవస్థ గురించి చర్చించిన అంశాలతో “సవాలక్ష సందేహాలు” అనే పుస్తకం డా. వీణా శత్రుఘ్న ఆధ్వర్యంలో వచ్చింది. దళిత స్త్రీల పరిశోధనపై గోగు శ్యామల రాసిన ‘నల్లపొద్దు’, సదాలక్ష్మి జీవిత చరిత్ర ‘నేనే బలాన్ని’ అనే పుస్తకాలు కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు దళిత, మైనారిటీ ముస్లిం మహిళల రచనలపై పరిశోధన సాగుతోంది. క్వీర్ మరియు ట్రాన్స్ జెండర్ సమస్యలపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నేను అన్వేషికి ప్రసిడెంట్‌గా ఉన్నాను.
ప్ర. ప్రస్తుతం మీరు ఇంకా ఏ సంస్థలకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు?
జ. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి, చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న రెయిన్‌బో హోమ్స్ అమన్ వేదిక సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నాను.
ప్ర. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ప్రత్యేక రాష్ట్రం పట్ల మీ స్పందన తెలియజేయండి.
జ. తెలంగాణా ఉద్యమం ప్రజలది. కేసీ.ఆర్.ది కాదు, ఎవరిదీ కాదు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటరీ సిస్టం వద్దని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు. నేనున్నాను కదా? అన్నాడు. అసెంబ్లీ అటెండ్ చేయడు, ఎవరినీ కలవడు, కలిసే అవకాశం ఇవ్వలేదు. నాకు మాత్రం చాలా చికాకు, కోపం వచ్చింది. ఓకే.. పాలసీ కరెక్టుగా లేదు, కానీ ఫండమెంటల్ రూల్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టంను ఒబే చేయాలి కదా? అది చేయలేదు. తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. రెవెన్యూ లేదంటూ యాదాద్రి మీద, సెక్రటేరియట్ నిర్మాణాలకు కోట్లు ఖర్చు చేసాడు. వాటిలో పారదర్శకత లేదు. అది ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే .. పాలనలో పారదర్శకత లేని వారందరినీ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉంటారు.
ప్ర. ఇన్నేళ్ళ మీ ఉద్యమ జీవితంలో నుంచి నేటి రాజకీయ, సామాజిక పరిస్థితిని విశ్లేషించండి.
జ. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. కులవ్యవస్థ కొత్త రూపులు దిద్దుకుంటోంది. మహిళలు, దళితులు, ఆదివాసీలు దౌర్జన్యాలకు గురికావడం పరిపాటైంది. వీళ్ళందరూ కోరేది ఆర్థిక హక్కులు మాత్రమే కాదు, సామాజిక స్థానం, సమానత్వం, ఆత్మగౌరవం. వాటిని కాపాడుకోవడం కోసం ఆధిపత్య కులాలను, వర్గాలను ఎదిరించాల్సిందే… వీటిని గుర్తించనంత వరకు ‘హక్కులు’ వాటికి కావలిసిన చట్టాలు ఎన్ని వచ్చినా హిందూ సంస్కృతి మారదు. అస్తిత్వ పోరాటాలు రావడానికి ఇదొక ముఖ్య కారణం. రాజకీయ పార్టీలు కూడా విడిపోతున్నాయి. కమ్యూనిష్టు పార్టీ విడిపోతే.. పి.డి.ఎస్.యు, పీ.ఓ.డబ్ల్యూ ఎందుకు విడిపోవాలీ? కులం, మతం పేరుతో హింస పెరిగిపోయింది. హిందుత్వ పేరుతో జరుగుతున్న కుట్రను ఛేదించడానికి ఎవరి ఐడెంటిటీని వాళ్ళు కాపాడుకుంటూనే కొన్ని విషయాల్లో అన్ని సమూహాలు ఏకం కాలవలసి వుంది. ఆ ఏకం కావడం ఎట్లా? అనేదే పెద్ద ప్రశ్న. రాజ్యవ్యవస్థను, పితృస్వామ్యాన్ని మార్చాలి. లేకపోతే చివరికి హిందుత్వవాదమొక్కటే మిగులుతుంది. ఇవన్నీ చదువుతుంటే, ఆలోచిస్తుంటే నాకు చాలా కోపంగా చికాకుగా, ఆందోళనగా ఉంటుంది.
ప్ర. దేశం, రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు కదా? దానిమీద మీ స్పందన ఏమిటి?
జ. ప్రజల సొమ్మును పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యక్తి పూజలు, పాలాభిషేకాలు ఎక్కువ అయ్యాయి. నాయకులు వద్దని చెప్పొచ్చు కదా? చెప్పరు? పూజ పేరుతో గంగానదిలో పాలు పోస్తారు. పిల్లలు పాలు లేక చచ్చిపోతుంటే ఇవి అవసరమా? మన మోడీ, ప్రధానమంత్రి.. ఆయన ప్రయాణాలకు, డ్రెస్సింగ్‌కు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ లెక్కలు చదువుతుంటే షాక్ అవుతుంది. ఆయన ప్రతి ప్రయాణం ఒక ఫ్యాషన్ పరేడ్‌లాగా ఉంటది. మణిపూర్‌లో గొడవలు జరిగి జనం చచ్చిపోతుంటే విదేశాలకు వెళతాడు. కానీ అక్కడికి మాత్రం వెళ్ళడు. ఇదంతా రాయండి. మీరు రాయాలి. నాకేమి అభ్యంతరం లేదు.
ప్ర. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జ. అందుకే నేనొకటి సూచించాలని ఎప్పుడూ అనుకుంటాను. ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేసినా దానికి ఎన్ని కోట్లు కేటాయించారు? ఎంత ఖర్చు అయింది? ఎంత పని జరిగింది? అనే వివరాలు ఎప్పటికప్పుడు, ప్రతి రోజు ఆ లెక్కలు పబ్లిక్ స్థలాలలో బోర్డు పెట్టాలి. ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి, ఖర్చు పెట్టిన విధానం ప్రజలకు తెలియాలి. అలా తెలిసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అవన్నీ ప్రజలకు అర్థం కావనుకుంటారు. మనం మన ఇంట్లో సంసారంలో ఎంత ఆదాయం వచ్చింది? ఎంత ఖర్చు పెట్టాము? అని చూసుకుంటాం కదా? మరి రాష్ట్రం, దేశం, రాజ్యం ఎందుకు ఆ లెక్కలు ప్రజలకు చెప్పదు? అందుకొరకు మనం (ప్రజలు) కూడా అడగాలి. విమర్శించడం లేకపోతే ఏం ప్రజాస్వామ్యం? ఈ దేశంలో ఇంత కరప్షన్ రావడానికి కారణం ప్రజలకు ఈ లెక్కలు తెలియక పోవడం, ప్రజలు ప్రశ్నించక పోవడమే అంటాను.
ప్ర. మన ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలను మెర్జ్ చేసి, విద్య నాణ్యతను పెంచుతాను అంటున్నాడు. ఒక విద్యావేత్తగా మన విద్యా విధానం మీద మీ అభిప్రాయం ఏమిటి?
జ. మన విద్యావిధానం .. ఉన్న వాళ్ళు, లేనివాళ్ళు, పై కులం, కింది కులం అనే తేడాలను ఒక రకంగా పెంచిందనే చెప్పాలి. ప్రైవేట్, పబ్లిక్, ప్రభుత్వ పాఠశాలలని విభజించి, ఎవరు ఎక్కడ చదువుకోవాలో విద్యావిధానమే నిర్ణయిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారు పేద కుటుంబాల పిల్లలు. వీరంతా మాతృభాషలోనే చదువుకోవాలని, ఇంగ్లీషుని ఆధిపత్య భాషగా వుంచి, అది వారికి అందకుండా చేయడం వల్ల నష్టపోతున్నది ఈ పేద కుటుంబాలే.. త్రిభాషా సూత్రాన్ని పాటిస్తున్నా అది పేరుకు మాత్రమే. ఈ భాషా రాజకీయాలు విద్యార్థులకు ఏ భాషా సరిగ్గా రాకుండా చేసాయి. ఆ రోజుల్లో ఉర్దూ మీడియంలో చదువుకున్నా పర్షియన్, అరబిక్ చదువు కున్న వాళ్ళు ఇంగ్లీషు కూడా నేర్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా పటిష్ఠంగా ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రైవేట్
పాఠశాలలు, ఉన్నత విద్య కూడా మార్కెట్లో పోటీపడగలిగేదిగా లేదు. ఇప్పుడు చెపుతున్నట్లుగా విద్యార్థులు లేరనే కారణంతో ప్రభుత్వం పాఠశాలలను మెర్జ్ చేయడం సరైంది కాదు. దానివల్ల పేదపిల్లలు విద్యకు మరింత దూరమవుతారు. ఇన్ని రకాల బడులు కాకుండా అందరికీ ఒకే బడి విధానం ఉండాలి. పేదపిల్లలు, ధనిక పిల్లలు, ఆధిపత్యకులాల పిల్లలు అందరూ ఒకే బడిలో చదువుకోవాలి. అంటే “కామన్ స్కూలు సిస్టం” రావాలన్నమాట. మాతృభాషతోపాటు ఇంగ్లీషు కూడా నేర్చుకోవడం తప్పనిసరి.
ప్ర. చివరి ప్రశ్న మేడం! ఒకే ఒక్క రాత్రితో ఎగిసిపడ్డ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జ. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటి రాజకీయాల నుంచి వచ్చిందే.. నేను దానిని వ్యతిరేకించను. కానీ నా దృష్టిలో అది రావడమనేది ఒక రకంగా మంచిదే.. ఒక్కసారిగా అంతమంది యువతను కదిలించడమనే దానిని మనం ఆహ్వానించాలి. అందరిలో ఆ కోపం ఉంది .. కాక్రోచ్ పార్టీ అందరినీ ఒక్క దగ్గరికి తేగలిగింది. దానివల్ల ఏం మార్పులు వస్తాయనేది చర్చ జరుగుతోంది కదా? మార్పులు వస్తాయా? రావా? అనేది వేచి చూడాలి. నేను కూడా అనుకుంటాను.. నేను అర్బన్ నక్సలైట్‌నని, కాక్రోచ్‌నని.. నేను ఎట్లా ఊహిస్తానో తెలుసా? ఎంతమంచి పార్టీలైనా కొన్నాళ్ళు మంచిగానే పరిపాలిస్తారు. ఆ తర్వాత అందరికి కూడా అధికారం అనేది తలకు ఎక్కుతుంది. అధికారం తలకెక్కినప్పుడు అహంకారం మొదలవుతుంది. అప్పుడు కరప్షన్ మొదలవుతుంది. అలాంటపుడు కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి ఏ పార్టీకి లొంగిపోకుండా స్వతంత్ర ప్రతిపత్తితో ఉంటూ ప్రభుత్వమే తమను సంప్రదించి పనులు చేపట్టే విధంగా ఉండాలి అనుకుంటాను.
