అమ్మ చేసిన తప్పే తానూ చేయకూడదు. అలాగని అమ్మలాగే జీవితాంతం ఏ తోడూ లేకుండా ఉండిపోవాలంటే… అమ్మకి తానుంది. మరి తనకెవరుంటారు? అలాగని అమ్మ చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు. ప్రేమించిన వాళ్ళందరూ తాము ప్రేమించిన వాళ్ళు మంచివాళ్ళనే అనుకుంటారు. అమ్మ కూడా అలాగనుకునే గడప దాటింది.
తాను పుట్టాక, అమ్మని ప్రేమించానన్నవాడు వదిలి వెళ్ళిపోతే, కాదని వచ్చిన కన్నవారి దగ్గరికెళ్లలేక, ఎన్ని కష్టాలు పడిందో తనని పెంచడానికి?
అమ్మనుకుంటున్నట్టు ప్రేమించామన్న వాళ్ళందరూ మోసగాళ్లూ కాదు. ప్రేమపెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కష్టాలూ పడలేదు. మరి అమ్మకెందుకలా జరిగింది. ప్రేమించిన వాడు ఎటువంటివాడో అంచనా వెయ్యలేకపోవడమా? లేక డిగ్రీ మధ్యలోనే వదిలి, పెద్దలను కాదని ఇల్లు విడిచి వచ్చెయ్యడమా? తాను పుట్టాక అమ్మ మీద మోజు తీరిపోయి ప్రేమించానన్నవాడు అమ్మనొదిలి వెళ్లిపోయాడు. ప్రేమించినవాడు ఎటువంటి వాడన్న సంగతి పక్కన పెడితే, చదువు పూర్తి కాకుండా, తన కాళ్ళమీద తాను నిలబడలేని స్థితిలో, పెద్దలను కాదనుకోవడం అమ్మ తప్పే! లోకంలో అమ్మలాంటి వాళ్ళు ఇంకెంతమందో! చేసిన తప్పును తెలుసుకొని, పడి లేచి, ఎన్నో కష్టాలకోర్చి తనను పెంచిందమ్మ. అది చెయ్యలేని వాళ్ళెంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారో! అమ్మను చూసి, తాను నేర్చుకున్నదేమిటంటే, చదువు పూర్తి కాకుండా, ఉద్యోగం లేకుండా ప్రేమించకూడదని. చదువు పూర్తయింది. ఉద్యోగమొచ్చింది.
చదువుకుంటున్నప్పుడే తన క్లాస్మేట్, సత్యం తనని ప్రేమించానన్నాడు. నో చెప్పింది. ఇప్పుడు తన ఆఫీసులోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వొప్పుకుంటే మీ అమ్మగారిని అడుగుతానన్నాడు. ఆ మాట చెప్పగానే, తన అనుభవాన్ని మర్చిపోని అమ్మ ససేమిరా అంది. ప్రేమించామన్న వాళ్లను నమ్మకూడదు. మనకు తగిన సంబంధం రాకపోదు. అంతవరకు ఓపికపట్టు అంటుంది. తెలిసిన వాళ్ళందరికీ సంబంధాలు చూడమని చెప్తుంది. ముందూ వెనుకా ఎవరూ లేని, ఆస్తేమీ లేని తమతో సంబంధం కలుపుకోవడానికి ఎవరొస్తారు? దానికి తోడు అత్తగారి బాధ్యత కూడా మొయ్యాలని ఎవరనుకుంటారు? అందుకని తనకొచ్చిన సంబంధాలన్నీ తన మీద ఆధారపడి గడిపెయ్యాలనుకున్నవే. అలాగైనా పరవాలేదు, మనతో కలిసుంటే చాలంటుంది. జీవితంలో మగతోడుంటే చాలు, కష్టాలుండవని అమ్మ భావం. మగతోడు లేక తామెన్ని కష్టాలు పడ్డారో తనకూ తెలుసు. గాని, ఒక్క మగతోడుంటే సరిపోతుందా? బాధ్యతలు పంచుకునే తోడుండవద్దా?
తనకొచ్చిన సంబంధాలతో పోలిస్తే, సత్యం ఎన్నో రెట్లు పైనున్నాడు. చదువుంది, ఉద్యోగముంది. తనకూ ఇష్టమే. గాని, అమ్మే ఒప్పుకోవడం లేదు. నా మీద ఏమాత్రం గౌరవమున్నా ఈ ప్రేమపెళ్లి వద్దని వాదిస్తుంది. సత్యం కూడా కొన్నాళ్లకు తాను ప్రేమించిన వాడిలా మారిపోతాడని అమ్మ భయమా? లేక తాను పెళ్లి చేసుకుని అమ్మని విడిచిపెడతానన్న భయమా? తానే సర్వస్వం అనుకుని పెంచింది గాని, తన ఆలోచనలను కూడా అర్థం చేసుకోవాలి కదా! మÖర్ఖంగా, అమ్మ జీవితానుభవాన్ని బట్టి, ప్రేమ పెళ్లి చేసుకోవద్దంటే ఎలా?
అలాగని, తనకోసం ఎన్నో కష్టాలు పడిన అమ్మని కాదని, సత్యాన్ని పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్లయ్యాక అతను కూడా అమ్మ భయపడుతున్నట్టు, తననొదిలేస్తే? అడగడానికి తనకెవరున్నారు? అలాగని సత్యం కన్నా మంచి భాగస్వామి తన జీవితంలో వస్తాడన్న నమ్మకమైతే అస్సలు లేదు. ఇప్పుడు తానేమి చెయ్యాలి? అమ్మమాట విని వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవాలా లేక తానే సర్వస్వంగా బ్రతుకుతున్న అమ్మ మాటను కాదనాలా? ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు. ఫ్రెండ్ సుజాతను సలహా అడిగింది. “పెళ్లైనా మీ అమ్మ బాధ్యత నీదేనని, నీతోనే ఉంటుందని ప్రీనప్షల్ అగ్రిమెంట్ చేసుకోమంది”. బాగా ఆస్తున్న వాళ్ళకి గాని, తమలాంటి వాళ్లకీ అగ్రిమెంటేమిటని నవ్వొచ్చి, ఇంకో ఫ్రెండ్ రవళిని సలహా అడిగితే, “సుజాత చెప్పింది బాగానే ఉంది. ఇంట్లో పనులు అందరూ కలిసి చేసుకోవాలనే కండిషన్ పెట్టమంది”. ఇంట్లో పనులన్నీ ఒంటి చేత్తో చేసినా, పనిలో సాయం చెయ్యకపోగా, రవళి అత్త ఆడపడుచులు వంకలు పెడతారు.
“ఇంటా బయటా అన్ని పనులూ నువ్వే చెయ్యాలంటే కుదరదని చెప్పు” వైష్ణవి సలహా. వాళ్ళాయన ఏ పనీ చెయ్యడు మరి. “ఇంటి ఖర్చులకిద్దరూ, జీతంలో చెరోసగం ఖర్చుపెట్టి మిగిలింది సేవ్ చెయ్యాలన్న క్లాజ్ పెట్టమంది” వల్లి. రెండు జీతాలున్నా ఇంకా అప్పులపాలై పోతున్నామన్న బాధ తనది. “మగవాళ్లతో మాట్లాడకూడదు, చూడకూడదు అనంటే మాత్రం, నా మీద ప్రేమతోనే అలా అంటున్నాడు. సర్దుకుపోతే సరిపోతుంది, అనుకుంటే మాత్రం, నాకు పట్టిన పరిస్థితే పడుతుంది. జాగ్రత్తంది” పావని. ఆరేళ్ల ప్రేమ పెళ్లిలో ఎన్నో అవమానాలు… ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వాళ్ళాయనకు అనుమానం. ఎంత ఒదిగి ఉన్నా మాటలతో హింసించేవాడు. భరించి, భరించి ఈ మధ్యనే విడాకులు తీసుకుందది. పెత్తనం చేస్తే ఒప్పుకోవద్దంటూ ఒకరు, పిల్లలు పుడితే వాళ్ల పనులు ఇద్దరూ కలిసి పంచుకోవాలంటూ ఒకరు… రకరకాల కండిషన్లు చెప్తున్నారు. ఎవరినడిగినా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇన్ని సలహాలు వింటుంటే మతిపోతుంది..
వామ్మో! పెళ్లి చేసుకుంటే యిన్ని కష్టాలా! ఏవైనా ఫంక్షన్లలో వీళ్ళందరినీ చూస్తే, అన్యోన్య దాంపత్యానికి బ్రాండ్ అంబాసిడార్లలా కనిపిస్తారు. వెనుక ఇంతుంటుందా! పెళ్లి చేసుకొని ఇన్ని ఆటుపోట్లు భరించే బదులు సింగిల్ గా ఉంటేనే బెస్టేమో! అమ్మ కూడా సంతోషిస్తుందేమో! గాని, ఎవ్వరూ లేకుండా తామిద్దరే! ఎంత కాలమిలా? అమ్మ పోయాక తన పరిస్థితేమిటి? ఒంటరిగా… తనకేమైనా ఐతే, ప్రక్కనెవరూ లేకుండా… ఒంటరిగా ఉన్నవాళ్ళు చనిపోయినా ఇరుగుపొరుగులకి కూడా తెలియడం లేదని… పేపర్లో ఎన్నిసార్లు చదవలేదు. అమ్మో! కష్టాలు పడినా పర్లేదు గాని, తనకంటూ ఒకరుంటే చాలు… గాని అమ్మలాగో, లేదా కొంతమంది తన ఫ్రెండ్సులాగో కాకూడదంటే మాత్రం, అన్ని వివరాలూ… ఇంట్లో పనులనెలా షేర్ చేసుకోవాలో, పిల్లలు పుట్టాక వాళ్లని పెంచడంలో ఎవరి పాత్రెంత ఉండాలో, వచ్చిన జీతాన్నెలా ఖర్చు పెట్టాలో ముందే మాట్లాడుకుని ప్రీనప్షల్ అగ్రిమెంట్ చేసుకుంటే తర్వాత గొడవలేవీ ఉండవు. ముఖ్యంగా అమ్మ తనతోనే ఉంటుందనే విషయాన్ని సత్యానికే కాదు, వాళ్ల ఫ్యామిలీకి కూడా స్పష్టంగా చెప్పాలి. ఆస్తులు కొంటే ఇద్దరి పేరునా పెట్టమనాలి. అమ్మ ఉన్నట్టే, సత్యం తల్లిదండ్రులు కూడా తమతో ఉండొచ్చనే విషయాన్ని కూడా చెప్పాలి. దీనికి సత్యం ఒప్పుకుంటే, ముందుకెళ్లొచ్చు. అమ్మకి కూడా ఈ విషయాన్ని చెప్పి ఒప్పించవచ్చన్న ఆలోచనొచ్చాక, ధరణి మనసు కాస్త సావధాన పడింది. ఈ విషయం గురించి మాట్లాడడానికి, లాయర్ ఫ్రెండైన రమ దగ్గరికెళ్ళింది.
“విదేశాల్లో ఉన్నట్లు, ప్రీనప్షల్ అగ్రిమెంట్ అదే వివాహ పూర్వపు ఒడంబడికకు, భారతీయ శిక్షాస్మృతిలో గాని హిందూ వివాహచట్టంలో గాని చట్టబద్ధత లేదని” రమ చెప్పడంతో డీలా పడిపోయింది ధరణి.
“మరీ అంతా నిస్పృహ పడొద్దులే. హిందూ వివాహచట్టం స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కుల్ని కల్పిస్తుంది. అవి తెలుసుకుంటే నీ హక్కుల్ని నువ్వు కాపాడుకోగలవు. ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ తెచ్చుకో. ఏ రోజైతే నీ ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందో, అప్పుడటువంటి బంధంలో ఉండలేనని మాత్రం గట్టిగా చెప్పు. పెళ్లికి ముందే, ఇద్దరూ కూర్చుని అన్ని విషయాలూ చర్చించుకోండి. తర్వాతేదైనా ప్రోబ్లమొస్తే, డిస్కస్ చేసుకుంటూ సామరస్యంగా పరిష్కరించుకోండి. అంతేగాని గొడవపడాలని మాత్రమనుకోవద్దు. అలాగే, ప్రతిదానికీ కాంప్రమైజ్ అవుతూ బ్రతకాలని కూడా అనుకోకు. హక్కులతో పాటు, బాధ్యతలు కూడా ఉంటాయని మర్చిపోకు. నీకున్నట్టే అవతలి వాళ్ళకీ హక్కులుంటాయనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకో.”
“నిజంగా చెప్పాలంటే పెళ్లి ఒక గేమే. మిగిలిన ఆటల్లా ఒకరోడిపోయి, ఇంకొకరు గెలవాలను కోకుండా, ఇద్దరూ కలిసి గెలవాలనుకోవడం వలన వివాహబంధం ఉత్కృష్టమైనదిగా పరిగణించబడుతుంది. భార్యాభర్తల తప్పొప్పులు చెప్పడానికిక్కడ రిఫరీలుండరు. మనస్సాక్షే రిఫరీ. జీవితంలో పొందే ఆనందమే బహుమతి. భార్యాభర్తలిద్దరూ, ఈ విషయాన్నర్థం చేసుకుంటే, వాళ్ల జీవితం సుఖంగా సాగిపోతుందన్న,” రమ మాటలు, ధరణికి మనోధైర్యాన్నిచ్చినా, మన చట్టాల్లో కూడా, ప్రీ నప్షల్ అగ్రిమెంటుంటే బాగున్నంది.
“పరిస్థితులకు అనుగుణంగా, ఉన్న చట్టాలలో సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన జరుగుతూనే ఉంటుంది. మరి కొన్నాళ్లకు నువ్వనుకున్న ఈ చట్టం కూడా వచ్చే అవకాశముందిలే. ఐనా, పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుంటూ, మనకేం కావాలో ఎదుటివారికి స్పష్టంగా చెప్పగలిగే ధైర్యమున్నప్పుడు జీవితం నువ్వనుకున్నంత కష్టం కాదులే”, అంటూ, “నీ పార్ట్ టైం రీసెర్చిలో, దీని గురించి కూడా వ్రాయమన్న” రమ మాటలకు, “నిజమే! ప్రీ నప్షల్ అగ్రిమెంటుకు చట్టబద్ధతుంటే, తనలాంటి వాళ్లకెంతో ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు జవాబుదారీగా ఉంటారు. విడాకుల రేటు కూడా తగ్గుతుంది. ఈ విషయంపై కూలంకుషంగా పరిశోధన చేసి, పీడిత స్త్రీలపై తాను చేస్తున్న పరిశోధనాంశంలో ఈ విషయాన్ని కూడా చేర్చాలని, నిర్ణయించుకుంది ధరణి. ప్రస్తుతం, ప్రీనప్షల్ అగ్రిమెంటుకు చట్టబద్ధత పూర్తిగా లేకపోయినా, సత్యంతో అన్ని విషయాలూ ముందే మాట్లాడుకుని, ఎగ్రిమెంట్ చేసుకుందామనుకున్నాక, భవిష్యత్తుపై ఆశ ఏర్పడింది. అలాగే అమ్మతో అన్ని విషయాలూ మాట్లాడి, అమ్మను ఒప్పించాకే పెళ్లి చేసుకుంటానని, సత్యానికి చెప్పాలని కూడా నిర్ణయించుకుంది.
