తనకి క్యాన్సర్ ఉందేమో అనే అనుమానం సమతని వేధిస్తోంది. ఈ మధ్య చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అనుకుంది కానీ తనకే అర్ధంకాని అయోమయంతో ఆగిపోతోంది. ఇంతకీ అయోమయం ఏంటంటే, తనకి ఒకటి కాదు నాలుగైదు రకాల క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని, వాటిల్లో ఏదో ఒకటైనా ఖచ్చితంగా నిజమే అయ్యుంటుందని అనుకుంటోంది.
అసలు ఒక మనిషికి ఒకటికంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందా అని గూగుల్ సెర్చ్ చేసి ఉందని సమాచారం తెలుసుకుంది. కానీ ఒకటే సోర్స్‌ని నమ్మొద్దని, ఒకటికి రెండు చోట్ల చూసి నిర్ధారించుకోవాలని పదే పదే వినుండటం వల్ల రకరకాల వెబ్-సైట్లు వెతికి పోగేసిన సమాచారంతో గందరగోళంలో పడింది. ఇలా కాదని AI సహాయం తీసుకోవాలని ప్రయత్నం చేసి, కొంత సమాచారాన్ని నిర్ధారించుకున్నా, వాటి సోర్స్ మళ్ళీ తను చూసిన వెబ్-సైట్లే అవ్వడంతోనూ, అన్నింట్లోనూ ‘AI తప్పు చెప్పొచ్చు’ అని రావడంతోనూ అయోమయంలో పడింది.
అసలు తనకి ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే, ఈ మధ్య తన దగ్గరి సర్కిల్స్‌లో చాలా మంది క్యాన్సర్‌కు గురయ్యారని వినడం, వారి అనుభవాలు, లక్షణాలు తెలుసుకోవడం, అటువంటివే లక్షణాలు తనలోనూ కనిపించడంతో మొదలయ్యింది. ఈ క్రమంలో వాళ్ళ కాలనీలోని ఆయుష్ క్లినిక్‌కి వెళ్ళింది కానీ అక్కడ డాక్టర్ ‘నీకు రక్తహీనతతో ఈ సమస్యలు వస్తున్నాయి, మంచి ఆహారం తీసుకుంటూ ఈ మందులు ఒక నెలరోజులు వాడితే మామూలు అయిపోతావు’ అని చెప్తే అలాగే అని ఇంటికి వచ్చేసింది కానీ నమ్మకం కుదరలా. రెండు రోజుల తర్వాత ఏరియా హాస్పిటల్‌కి వెళ్ళి OPణలో డాక్టర్ కి తను ఎదుర్కుంటున్న లక్షణాలతో పాటు తన అనుమానం కూడా వెలిబుచ్చితే అన్నీ విని నీరసం వల్ల అవన్నీ వస్తాయని, మంచి ఆహారం, సరిపడా నిద్ర, మానసిక ప్రశాంతత ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయని చెప్తూ మల్టీ విటమిన్ టాబ్లెట్లు వేసుకోమని రాసిచ్చారు. సంతృప్తి చెందని సమత ఇంకా ఏదో ఆడగబోయేసరికి ‘ఇప్పటికే పావుగంట టైం తీసుకున్నావు, ఇంకా చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు, నీకున్న అనుమానాలన్నీ తీరాలంటే క్యాన్సర్ హాస్పటల్ కి వెళ్తే నయం, నీకు జబ్బుకంటే భయం ఎక్కువుంది, ముందు అది తగ్గించుకో’ అంటూ అసహనంగా అనేసరికి బయటికొచ్చేసింది. ‘ఈ డాక్టర్లకి కనీసం నా బాధ మొత్తం వినడానికి కూడా తీరిక లేదు, మరి అన్నీ వినకుండానే రోగాన్ని ఎలా నిర్ధారిస్తారో..’ అనుకుంది.
45 ఏళ్ళు దగ్గర పడుతున్న సమతకి ఒక్కడే కొడుకు. భర్త ఉన్నా లేనట్టే, ఉద్యోగరీత్యా పదేళ్ళకు పైగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. అప్పుడప్పడూ కొంత డబ్బు పంపిస్తాడు కానీ ఇన్నేళ్ళలో రెండుసార్లకి మించి ఇంటికి రాలేదు. ఇప్పుడైతే ఫోన్లు కూడా బాగా తగ్గిపోయాయి. మధ్యతరగతి కుటుంబం కావడంతో పెరుగుతున్న ఖర్చులు తట్టుకోడానికి టైలరింగ్ చేస్తూ తనూ ఎంతోకొంత సంపాదిస్తోంది. కొడుకు బీటెక్ పూర్తయ్యి క్యాంపస్ సెలెక్షన్స్ లో ఉద్యోగం రావడంతో చేరిపోయాడు. ప్రస్తుతం ట్రైనింగ్ కోసం పూణేలో ఉంటున్నాడు. ఇంట్లో ఒక్కర్తే ఉండడంతో ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఈ మధ్య తను ఒంటరినన్న భావం పెరిగిపోతోంది. దానికి తోడు ఈ అనుమానంతో పాటు అయోమయం ఒకటి సమతని నిలవనివ్వట్లేదు. అలా అని స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే క్యాన్సర్ నిర్ధారణ అవుతుందేమో అనే జంకుతోనూ, ఒకవేళ అదే అయితే వైద్యానికి తనదగ్గర డబ్బు లేదని కూడా వెళ్ళట్లా.
పీరియడ్స్ సమయంలో పదిరోజుల ముందునించి బాధే. తెల్లబట్ట అవ్వడం, గడ్డలు గడ్డలుగా రక్తస్రావం, యోనిలో మంట, మూత్రంలో ఒత్తిడి, పేగుల్లో మెలిపెడుతున్నట్టుండడం, రొమ్ముల్లో బరువుతో కూడిన నొప్పి, గట్టితనం, సలపరం, నీరసం, కళ్ళు తిరగడం, తల విసిరినట్టు ఉండడం.. ఈ వయసులో, మెనోపాజ్ సమయంలో ఇవన్నీ మామూలే అని ఒక పక్క సరిపెట్టుకుంటున్నా, ఇంకో వైపు జుట్టు రాలుతుండడం, బరువు తగ్గడం, కండరాల నొప్పి, ఎముకల్లో బలం లేనట్టు అనిపించడం ఏంటో అర్ధంకావట్లేదు. వీటితోపాటు తల్లో అప్పుడప్పుడూ చిన్న కురుపులు వచ్చి తగ్గుతుండడం, శరీరం పైన అక్కడక్కడా చిన్న చిన్న తెల్ల మచ్చలు, ఎర్రటి పుట్టుమచ్చల్లాంటివి ఏర్పడడం, గొంతులోనూ కంఠానికి రెండు పక్కలా వదలని సన్నటి నొప్పి, పళ్ళు తీపులు, చిగుర్లు వాయడం.. ఇవన్నీ ఎందుకో తెలియక, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్న క్యాన్సర్ కేసులు, తనకి తెలిసిన ఐదారుగురు క్యాన్సర్ పేషెంట్లు చెప్పిన లక్షణాలు, వెబ్-సైట్లలో వెతికి తెలుసుకున్న సమాచారం, అన్నిటినీ కలుపుకుని తన కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేకపోయినా తనకి అదే అయ్యుంటుందన్న అనుమానం బలపడిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లు సమత ఇంటికి రావడం, వాళ్ళడిగే ప్రశ్నలకి జవాబులు ఇస్తూనే తన సందేహాలని అడగడం, వాటికి సరైన సమాధానం వారివద్ద లేనందున వారు హెల్త్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్ళడంతో వారం రోజుల్లో ఆ టీం మళ్ళీ సమత ఇంటికి వచ్చారు. కొన్ని ప్రశ్నలు అడిగి తనని పెద్దాసుపత్రికి రమ్మని, ఎప్పుడు రావాలో, ఎక్కడికి రావాలో చెప్పి ఈ లోపు వాడమని కొన్ని మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయారు. తన సందేహాలని విని, కొన్నైనా సమాధానాలతో మళ్ళీ రావడమే కాక తనని పెద్ద డాక్టర్లతో మాట్లాడించడానికి పెద్దాసుపత్రికి రమ్మనడంతో సమతికి ఉత్సాహంగానూ, కొంచెం ఉద్వేగంగానూ ఉంది.
అనుకున్న రోజున సమయానికన్నా ముందే సమత ఆసుపత్రికి చేరుకుంది. అది ఒక పెద్ద సంస్థ ప్రభుత్వంతో కలిసి నడుపుతున్న ప్రత్యేక ఆసుపత్రి. అక్కడ తనలాగే వచ్చిన కొద్దిమంది తప్పించి పెద్దగా జనం లేరు. తనని కలిసిన టీం సభ్యలు, డాక్టర్లు వచ్చేలోపు అక్కడ ప్రదర్శించిన పోస్టర్లు చూస్తూ ఉంది. రకరకాల ఆరోగ్య సమస్యలకి కారణాలు, చేయాల్సిన వైద్యం, నివారణోపాయాలు, రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలు.. అన్నిటి పైనా వివరణాత్మకంగా ఉండడంతో చదువుతూ
ఉండిపోయింది. తన ప్రశ్నలు కొన్నిటికి సమాధానాలు దొరికినట్లే అనిపించి కొంచెం తెరిపినపడింది. అంతలో తనని రమ్మని పిలవడంతో ఆ హాల్లోనుండి కన్సల్టేషన్ గదిలోకి వెళ్ళింది.
అక్కడ ఎత్తు, బరువు, నాడి పరీక్షతో మొదలుపెట్టి రక్త, మూత్ర పరీక్షలతో సహా కనీసం ఒక ఇరవై పరీక్షలు చేశారు. కొన్ని ఎక్స్-రేలు, స్కానింగ్‌లు కూడా చేశారు. అన్నీ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం రెండు దాటింది. కాంటీన్లో భోజనం చేసి వచ్చాక ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు స్పెషలిస్ట్‌లు దాదాపు రెండు గంటల పాటు సమతతో మాట్లాడారు.
మొత్తంమీద తనకి అర్ధం అయినదేంటంటే — తనకి క్యాన్సర్ లేదు. కానీ అలా అని రాకూడదన్నదీ లేదు. ఎందుకంటే, తను తినే తిండి, తాగే నీళ్ళు, వాడే వస్తువులు — వంట సామాన్లు, సరుకులు నిలవచేసే డబ్బాలు, వాడే ప్లేట్లు, కూరగాయలు తరిగే బోర్డు, పడుకునే పరుపు, దిండ్లు, దుప్పట్లు.. ఒకటేంటి.. సమస్తం ప్లాస్టిక్ మయం అయిన ఈ కాలంలో మన శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ చేరిపోతోంది. మనం పీల్చే గాలిలో సైతం మైక్రో ప్లాస్టిక్ కణాలు విపరీతంగా ఉంటున్నాయని, మరీ ముఖ్యంగా ఇవి ఇళ్ళల్లోని గాల్లోనే ఎక్కువ ఉంటున్నాయని, దానికి కారణం మనం వాడే సింథటిక్ వస్తువులు, పాలిస్టర్ బట్టలు, కర్టెన్లు, దుప్పట్లు, ప్లాస్టిక్ కుర్చీలు, డబ్బాలు, సామాన్లు, వాటిపై పేరుకుపోయే దుమ్ము ధూళి కణాలు, పాలిథీన్ కవర్లు, ఇన్స్టంట్ ఫుడ్, కూల్ డ్రింకులు. అన్నీ కారణం అవుతున్నాయి. కల్తీ లేని సరుకులు దొరకడమే కష్టం అయిపోయింది. ప్రతిరోజూ వాడే పాలు, నీళ్ళు, నూనె, కారం, పసుపు, పప్పులు, ఉప్పుతో సహా అన్నీ కల్తీనే. ఇక పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలైతే చెప్పే అవసరమే లేదు, విపరీతంగా మందులు కొట్టడం వల్ల ఆ విషం మన శరీరంలోకి కూడా చేరిపోతోంది. ఇవన్నీ కలిసి మన శరీరంలో వ్యాది óనిరోధక శక్తిని తగ్గించడంతో పాటు DNAని కూడా దెబ్బతీస్తున్నాయని, దీని వలన మన శరీర అంతర్భాగాలు వాపుకి గురయ్యి, నొప్పిని కలిగించడంతోపాటు, రక్తంలో ఇన్ఫెక్షన్కి దారితీస్తుందని అది అత్యంత ప్రమాదకరమని అర్ధం అయింది. ఇక అప్పటి నుండి సమతకి ఒకటే యావ, ఈ విషయాల్ని మూలమూలలకి చేరవేయడం. అప్పటి నుండి తన గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది ఇలా..
“ఇప్పుడిక నేను ఆచరించాల్సిన చికిత్స ఒక్కటే.. నా చుట్టూ ప్లాస్టిక్, సింథటిక్ లేని, కల్తీ, విషపూరిత పదార్ధాలు లేని ఒక రక్షణ కవచం ఏర్పరచుకోవడం. ఇది ఎట్టి పరిస్థితుల్లో నా ఒక్క దానివల్ల అయ్యేది కానేకాదు, మనందరం కలిసి ఒక ఉద్యమంలా, సామూహికంగా ఆచరిస్తే తప్ప మానవ మనుగడకి భరోసా లేదు. ఇది నా ఒక్క దాని సమస్య కాదు, మనందరి మూకుమ్మడి సమస్య. దీనితో పోరాడడానికి నాతో చేతులు కలిపే వారు మీలో ఎందరు? ముందుకు రండి, మన తరంతో పాటు రానున్న తరాల బాధ్యత మనమీదే ఉంది. మీరు ఆచరించడంతోపాటు వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరెయ్యడం కూడా ఈ ఉద్యమంలో భాగమే..”
