నేలకొండపల్లి మండలంలోని చిన్న గ్రామం చెరువు మాదారం. కొండలు, పంటచేలు, మట్టివాసనతో నిండిన ఆ ఊరు బయటకు చూస్తే ప్రశాంతంగా కనిపించినా, ఆ ప్రశాంతత వెనుక ఎందరో ఆడవాళ్ల మౌన వేదనలు దాగి ఉండేవి. ఆ ఊర్లో పుట్టిన ఒక సాధారణ మహిళ పేరు సీతమ్మ. సీతమ్మ పుట్టినప్పుడు ఎవ్వరూ సంబరాలు చేసుకోలేదు.
“ఆడపిల్లే కదా” అన్న మాటతోనే ఆమె జీవితానికి మొదటి గీత గీసారు. చదువు అంటే దూరం, కలలు అంటే పాపం అన్నట్టుగా పెరిగింది. ఐదో తరగతి వరకే చదువుకుంది. పదేళ్ల వయసులోనే తల్లికి సహాయం చేస్తూ ఇల్లు, పొలం, పశువులు అన్నీ ఆమె బాధ్యతలయ్యాయి. పదహారేళ్లకే పెళ్లి. పెళ్లితో పాటు వచ్చినవి కలలు కాదు, అప్పులు. భర్త రాములు వ్యవసాయ కూలీ. పని దొరికితే పూట గడిచేది, లేదంటే ఆకలి. పిల్లలు ఇద్దరు. ఇంటి ఖర్చులు, పంట అప్పులు, మందుల ఖర్చులు అన్నీ కలిపి జీవితం భారంగా మారింది. సీతమ్మకు ఓ ప్రశ్న పదే పదే మనసులో మోగేది. “నేను కేవలం భారం మోసే చేతులేనా? లేక భవిష్యత్తు నిర్మించే శక్తి కూడా ఉందా?”
మార్పుకు తొలి మెట్టు: ఒకరోజు గ్రామానికి డ్వాక్రా సంఘం ప్రతినిధులు వచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, పొదుపు, బ్యాంకు రుణాల గురించి చెప్పారు. చాలామంది నవ్వారు. “మాకు డబ్బులు ఎక్కడ?” “మేమేమి వ్యాపారం చేస్తాం?” అని వెనకడుగు వేశారు. కానీ సీతమ్మ మౌనంగా విన్నది. ఆమెకు అర్థమైంది. డబ్బు లేకపోవడం కన్నా, ధైర్యం లేకపోవడమే అసలు పేదరికం. ఆ రోజు ఆమె మొదటిసారిగా ఒక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘంలో చేరింది.
పొదుపు చిన్న మొత్తం, పెద్ద మార్పు: ప్రతి వారం పది రూపాయలు. ఆ పది రూపాయలు మొదట చిన్నవిగా అనిపించాయి.
కానీ నెలలు గడిచేకొద్దీ అవి ఆశగా మారాయి. సమావేశాల్లో మాట్లాడటం మొదట భయంగా ఉండేది. కానీ ఇతర మహిళల కథలు విన్నాక ఆమెకి ధైర్యం పెరిగింది. కొందరు కుట్టుపని చేస్తున్నారు. కొందరు పశుపోషణ. కొందరు ఆహార ప్రాసెసింగ్. “మన చేతుల్లో కూడా నైపుణ్యం ఉంది” అని సీతమ్మకు మొదటిసారి అనిపించింది.
స్వయం ఉపాధి సొంత గుర్తింపు: గ్రామంలో పాలు సమృద్ధిగా ఉండేవి. కానీ సరైన వినియోగం లేదు. సీతమ్మ ఒక ప్రతిపాదన చేసింది. పాల నుంచి నెయ్యి, పెరుగు తయారీ. సంఘం బ్యాంకు రుణం తీసుకుంది. శిక్షణ పొందారు. ఒక చిన్న యÖనిట్ ప్రారంభించారు. మొదటి నెల లాభం చాలా తక్కువ. రెండో నెల కొంచెం మెరుగైంది. మÖడో నెల నుంచి ఊరిలోనే కాదు, పక్క గ్రామాల్లో కూడా డిమాండ్ పెరిగింది. సీతమ్మ చేతులు ఇక కేవలం వంట గదికే పరిమితం కాలేదు. ఆ చేతుల నుంచే ఆదాయం పుట్టింది. ఇంట్లో మార్పు ముందు సీతమ్మ మాటకు విలువ ఉండేది కాదు. ఇప్పుడు ఇంటి ఖర్చుల్లో ఆమె అభిప్రాయం కీలకమైంది. భర్త రాములు ఒకరోజు అన్నాడు. “నీ వల్లే ఇంటి పరిస్థితి మారింది.”. ఆ మాట సీతమ్మ కళ్లల్లో నీళ్లను తెచ్చింది. అవి బాధ కన్నీళ్లు కాదు. గౌరవానికి వచ్చిన కన్నీళ్లు. పిల్లలను మంచి స్కూల్లో చేర్చారు. కూతురిని చూసి సీతమ్మ నిర్ణయించుకుంది. “నా కూతురు చదువు మధ్యలో ఆగదు.”
సమాజంలో నాయకత్వం: కాలక్రమేణా సీతమ్మ సంఘానికి నాయకురాలిగా మారింది. బ్యాంకులతో మాట్లాడింది. ప్రభుత్వ పథకాల గురించి ఇతర మహిళలకు వివరించింది. గ్రామంలో బాలికల చదువుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. మహిళలకు చట్టపరమైన హక్కులపై సమావేశాలు నిర్వహించింది. ఒకరోజు మండల స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడింది. “మహిళలకు దానం కాదు, అవకాశం ఇవ్వండి. మా చేతులు సహాయం కోరేవి కాదు, సృష్టించేవి.” ఆ ప్రసంగానికి అందరూ చప్పట్లు కొట్టారు.
ఆర్థిక సాధికారత .. ఒక వ్యక్తిగత విజయం కాదు: సీతమ్మ విజయం ఆమె ఒక్కరిది కాదు. ఆమెతో పాటు ఆ గ్రామంలోని ఇరవై మంది మహిళల జీవితాలు మారాయి. ఇప్పుడా గ్రామంలో ఆడపిల్లల చదువు పెరిగింది. కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చింది. మహిళలపై గౌరవం పెరిగింది. నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగింది. ఆర్థిక సాధికారత అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు. అది ఆత్మవిశ్వాసం, స్వతంత్రత, సమానత్వానికి దారి తీసే ప్రక్రియ.
ముగింపు: ఒక రోజు సీతమ్మ తన పాత ఇంటి ముందు నిలబడి ఆలోచించింది. అప్పటి తాను భయంతో, మౌనంగా ఉన్న మహిళ. ఇప్పటి తాను నిర్ణయాలు తీసుకునే నాయకురాలు. ఆమె నవ్వింది. ఒక మహిళ ఆర్థికంగా బలపడితే, ఆమె కుటుంబం బలపడుతుంది. కుటుంబం బలపడితే, సమాజం బలపడుతుంది. సమాజం బలపడితే, దేశం ముందుకు సాగుతుంది.
సీతమ్మ కథ అక్కడితో ఆగలేదు. ఎందుకంటే అది ఒక్క కథ కాదు. భారతదేశంలోని కోట్లాది మహిళల సాధికారతకు ప్రతిబింబం.
