వలసాంధ్రలో వెలువడ్డ రెండవ స్త్రీల పత్రిక ‘తెలుగు జనానా’. ఇది 1893 నుండి 1907 వరకు ప్రచురితమైంది. ప్రారంభ సంచికల్లో ఆంగ్లంలో ‘ఎ మంత్లీ జర్నల్ ఫర్ జనానా రీడిరగ్’ (మే 1902) అనీ, తర్వాత కాలంలో ‘తెలుగు దేశపు స్త్రీల కొరకును బాలికల కొరకును
ప్రచురింపబడు మాసపత్రిక (డిసెంబర్1904) అని తెలుగులోనూ ముఖపత్రంపై ఇచ్చేవారు. సాధారణంగా ‘తెలుగు జనానా’ను ప్రస్తావించగానే సంపాదకుడిగా రాయసం వెంకటశివుడి పేరు గుర్తుకొచ్చినప్పటికీ వాస్తవంగా దీనిని 1893 జూలైలో మల్లాది వెంకటరత్నం గుంటూరు నుండి ప్రారంభించారు. తర్వాత, అంటే 1894 జూన్ లేదా జూలై నుండి ఇది రాయసం వెంకటశివుడి సంపాదకత్వంలో వెలువడనారంభించింది. వెంకటశివుడికి స్వంత ముద్రణాలయం లేకపోవడంతో ‘తెలుగు జనానా’ మద్రాసు, విజయవాడ, రాజమండ్రిల నుండి వివిధ కాలాలలో ప్రచురించబడిరది.
ప్రారంభంలో ‘తెలుగు జనానా’లో 16 పుటలుండేవి. సంవత్సర చందా ఒక రూపాయి. 1900 సంవత్సరం నాటికి పుటల సంఖ్య, చందా మొత్తం రెండిరతలయ్యాయి. చందాదారుల సంఖ్య 300లకు మించలేదు. విశేషమేమిటంటే ప్రభుత్వం ద్వారా నడుపబడిన బాలికా పాఠశాలలన్నింటికీ ‘తెలుగు జనానా’ చేరేది. 1904 సెప్టెంబరులో కందుకూరి వీరేశలింగం స్త్రీల కోసం ప్రచురించిన ‘సతీహితబోధిని’ ‘తెలుగు జనానా’లో కలిసిపోయి వీరేశలింగం కూడా ‘తెలుగు జనానా’ సంపాదకుడయ్యారు. వీరేశలింగం సలహా మేరకు సంవత్సర చందాను ఒక రూపాయికి తగ్గించారు.
1904 నాటికి ‘హిందూ సుందరి’, ‘సావిత్రి’ మొదలైన స్త్రీల పత్రికలు వెలువడడంతో ‘తెలుగు జనానా’ను కొనసాగించాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు వెంకటశివుడు. వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు కొందరు స్త్రీల సంపాదకత్వంలో స్త్రీల పత్రికలు వెలువడినప్పటికీ స్త్రీల అభివృద్ధిలో పురుషుల తోడ్పాటు అవసరమనీ, కాబట్టి ‘తెలుగు జనానా’ ప్రాసంగికతను కోల్పోలేదనీ సలహా ఇవ్వడంతో పత్రికను కొనసాగించారు వెంకటశివుడు.
స్త్రీ విద్యాభివృద్ధికై ‘తెలుగు జనానా’ విశేషంగా కృషి చేసింది. మొదటి సంచికలో (1893 జూలై) తన లక్ష్యాలను ఈ విధంగా ప్రకటించింది: ‘‘తెలుగు స్త్రీలలో జదువ నేర్చిన వారనేకులున్నను వారు వారి గృహములందు తీరికగా ఉన్న వేళలలో జదుపుకొనుటకు దగిన పత్రికలేమియు బ్రచురింపబడుచున్నట్లు కనబడదు. మన స్త్రీలు సాధారణముగా పది పన్నెండేళ్ల ప్రాయము వచ్చువరకు మాత్రమే బడిలో జదువుకొని, పిమ్మట బడిని విడిచి పెట్టవలసి వచ్చుచున్నది. అప్పటినుండి వారు వారి యిండ్లయందైనను చదువుకొనక తమకున్న విద్యను వృద్ధి చేసుకొనలేకపోకపోయుటయేగాక, దానిని తరచుగా మరచిపోయెదరు. స్త్రీలకు వారి గృహకృత్యములెంతగా విధాయకములైయున్నను, సావకాశమున్న సమయములందు, కొద్దియో, గొప్పయో మంచి సంగతులను నేర్చుకొనుచుండుట మంచిది. వారెంత తెలిసినవారైయుందురో అంత బాగుగా తమ గృహకృత్యములను చక్కబెట్టుకొనగలుగుదురు. వారు తమకు తీరికగానున్న వేళను వ్యర్థమైన ముచ్చటలాడుటకు బదులుగా మంచి సంగతులను నేర్చుకొనుచుండినపక్షమందు వారికెక్కువ మనోల్లాసము కలుగును. కనుక ఈ జనానా పత్రికను ప్రకటించుచున్నాము. దీనియందు స్త్రీల వృద్ధిని గూర్చియు, వారికి ఉపయుక్తములైన సమస్త విషయములను గూర్చియు ప్రచురించెదము. వారి తెలివితేటలను వృద్ధి చేయగల నీతి కథలను, ఇతరములగు మంచి సంగతులను క్రమక్రమముగా తెలుపుచుందుము. వారికి మేలు చేయగల సర్వాంశములును, శాస్త్ర విషయములును, సమాచారములు, మొదలగునవి సులభశైలిని వ్రాయబడును.’’
ప్రకటించిన లక్ష్యాలకనుగుణంగానే ‘తెలుగు జనానా’లో స్త్రీ విద్యపై వ్యాసాలూ, గణాంకాలూ, బాలికా పాఠశాలల రిపోర్టులూ, పద్యాలూ, సంభాషణలూ ప్రచురించబడ్డాయి. ఇవన్నీ స్త్రీవిద్యను ప్రోత్సహిస్తూ స్త్రీ విద్య వలన కలిగే ప్రయోజనాలను వివరించేవి. వై. గంగన్న రాసిన ‘‘ఇద్దరు బాలికల సంభాషణ’’లో (ఫిబ్రవరి 1899, పు. 250 `252) ‘‘బాలురకు విద్యవలన లాభమున్నది గాని బాలికలకేమి లాభమున్నది?’’ అని ప్రశ్నించిన కమలాంబతో రత్నాంబ ఈ విధంగా అంది: ‘‘అయ్యో! అట్లు దలంపరాదు. చెప్పెద వినుము. బాలికలు చదివిన యెడల విశేష జ్ఞానము గలిగి, నీతులను దెలిసికొని, (తల్లులైన) పిమ్మట తమ పిల్లలకత్యంతోపయుక్తులరుగా నుందురు. భర్తల యెడల బానిసలుగానుండక స్నేహితురాండ్రుగ నుందురు. పతివ్రతా ధర్మములను దెలిసికొని వినయ విధేయతలు గలవారై దమ భర్తలకు సహకారులై (ఇంటి) పనులు (చాకచక్యముగ) చేయుదురు.’’
‘‘స్త్రీ విద్య యొక్క ప్రస్తుత స్థితి’’ అనే వ్యాసంలో (జనవరి 1901, పు. 214 ` 216) ఆర్.కృష్ణమూర్తి మద్రాసు ప్రెసిడెన్సీలో నిరాశాజనకంగా ఉన్న స్త్రీ విద్య స్థితిగతులను తెలుపుతూ ‘‘మనదేశములో జరుగుచుండు అతి బాల్య వివాహములు బాలికల యసంపూర్తి విద్యకు ముఖ్య కారణము. స్త్రీ విద్య లేకుండ దేశమభివృద్ధి పొందనేరదని చెప్పుటకు సందియము లేదు. ఏలననగా, స్త్రీలు మనతో సరిగా (సమానంగా) విద్యనభ్యసించి పురుషుల యుద్దేశములకనుగుణంగా ప్రవర్తించునప్పుడు మాత్రమే సంఘ సంస్కరణార్థమై చేసెడు యేర్పాటు లన్నియు మనకు శ్రమగలిగించకయే నెరవేరును’’ అని స్త్రీ విద్య పరమ ప్రయోజనాన్ని స్పష్టం చేశారు. స్త్రీ విద్యాభివృద్ధికై పురుషులు పాటుపడాల్సిన అవసరాన్ని వివరిస్తూ ‘‘స్త్రీ విద్యనింక వృద్ధిచేయుటకు మాటలతో బనిలేదు. నిజమగు స్త్రీ విద్యాభిమానముగల పురుషులందరును అన్ని విధములను తమ పూనికను నెరవేర్పజూచుచుండవలెను. బాలికా పాఠశాలలు లేనిచోట్ల వానిని స్థాపించియు, ఉన్న పాఠశాలలను ప్రోత్సాహ పరచుచును, తమ స్త్రీలకును, బాలికలకును విద్య నేర్పుచును ఉండవలెను. ఇంత కష్టపడిను వారికది సాధ్యము కాని యెడల, దొరతనమువారు తాము బాలుర విద్యకై యేర్పరచుకొనిన సొమ్మును స్త్రీ విద్యాభివృద్ధికి మాత్రమే వ్యయపరచి స్త్రీ విద్యను వృద్ధిపరుచుట యావశ్యకము’’ అని సూచించారు. ‘హిందూ దేశములోని బాలికా పాఠశాలలలోని కొన్ని లోపములు’ (ఏప్రిల్ 1903, పు. 314`316) అనే వ్యాసంలో బాలికల విద్య పట్ల తల్లిదండ్రులు కనబరిచే నిర్లక్ష్యాన్ని విమర్శించారు.
‘తెలుగు జనానా’లో విస్తృతంగా చర్చించబడిన అంశం ‘గృహనిర్వాహకత్వం’. ఈ అంశాన్ని గూర్చిన వ్యాసం గానీ, మరే విధమైన రచనగానీ, ప్రతి నెలా ప్రచురించబడేది. గృహనిర్వాహకత్వ విషయం వలస భారతదేశంలో/ఆంధ్రలో ఎంత ప్రాముఖ్యం కలిగి ఉండేదంటే రాయసం వెంకటశివుడు రాసిన ‘గృహనిర్వాహకత్వము’ అనే పుస్తకపు మొదటి ముద్రణ 300 కాపీలు వెంటనే అమ్ముడుపోగా దాన్ని పునర్ముద్రించారాయన. రెండవ ముద్రణ కూడా బాగా అమ్ముడుపోయింది. (‘‘ఆత్మ చరిత్రము’’,
పు. 335 మరియు 362). 1895లో ఆయన ఈ పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టి మొదట ‘తెలుగు జనానా’లో ధారావాహికగా ప్రకటించారు. (‘‘ఆత్మ చరిత్రము’’, పు. 263`264). పందొమ్మిదవ శతాబ్ది పురుష సంఘసంస్కర్తలు స్త్రీల ప్రధాన కార్యక్షేత్రం ‘గృహం’ అని బలంగా భావించి గృహకృత్య నిర్వహణలో స్త్రీలను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని ఉవ్విళ్లూరారు. తదనుగుణంగానే ‘తెలుగు జనానా’ స్త్రీల ప్రధాన కార్యరంగం ‘గృహం’ అని నొక్కిచెపుతూ, గృహనిర్వాహకత్వానికి సంబంధించిన వివిధ విషయాల్లో వాళ్లకు తర్ఫీదునిచ్చే దిశగా ప్రయత్నించింది. స్త్రీలను సద్గుణరాశులుగా మార్చాలని ఉద్దేశించింది. ఇంటిని శుచిగా, శుభ్రంగా ఉంచడం, స్వయంగా విద్యావంతులవడం, పిల్లలను క్రమశిక్షణతో పెంచడం, శాంతము, కరుణ, భూతదయ, మిత వ్యయము, ఇరుగుపొరుగులతో సఖ్యత, ఇంట్లోని మిగిలిన కుటుంబసభ్యులతో కూరిమి, ఎనలేని ఓర్పు కలిగి ఉండటం, ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండి, దుబారా ఖర్చులు చేయకుండా ఉండడం, అన్ని విషయాల్లోనూ మరీ ముఖ్యంగా కష్ట సమయాల్లో భర్తకు చేదోడువాదోడుగా ఉండడం, నగలు, చీరలు మొదలైన విలువైన వస్తువుల కోసం భర్తలను సతాయించకుండా ఉండడం, భేషజాలకు పోకుండా ఉన్నంతలోనే సంసారాన్ని గుంభనంగా నడుపుకోవడం, పాతివ్రత్యాన్ని పాటించడం, మొదలైన ఉత్తమ గుణాలను స్త్రీలు కలిగి ఉండాలని ఆధునిక పురుష సంస్కర్తలు ఆశించేవారుÑ స్త్రీలకు విపరీతంగా బోధించేవారు.
వి. నారాయణ మూర్తి తన వ్యాసం ‘గృహనిర్వాహకత్వము’ (డిసెంబరు 1902, పు. 161-164)లో ‘‘గృహమును జక్కబెట్టు పని స్త్రీది కాని పురుషునిది కాదు’’ అని స్పష్టం చేస్తూ ‘‘బాలికలందరూ తాము అత్తవారి యింటికి బోకమునుపే తమ పుట్టినింట దమ తల్లుల వలన గృహ నిర్వాహకమందలి మెలకువలను గ్రహించవలెను’’ అని బోధించారు. గృహనిర్వాహకములోని మెలకువలను గ్రహించిన స్త్రీల కుటుంబ జీవితం ‘‘భూతల స్వర్గం’’ వలె ఉంటుందని తెలియజేశారు. గృహకార్యనిర్వహణకు స్త్రీలు మాత్రమే తగినవారనీ, దానికి కారణం వారికి పురుషులకన్నా ఎక్కువ ఓపిక ఉండడమేనని స్పష్టం చేశారు. సహజంగానే ‘ఓపిక’ తక్కువైన పురుషులు గృహకార్యనిర్వహణకు పూనుకుంటే ఇల్లు ‘‘కోళ్ల గుడిసె వలె’’ తయారవుతాయనీ, కాబట్టి ‘‘గృహనిర్వాహకమునకు స్త్రీ మాత్రమే అర్హురాలని తేలుతున్నది’’ అనీ తీర్మానించారు. ‘సీత`సావిత్రి: గృహనిర్వాహకత్వమును గురించిన యొక పాఠము’ (ఏప్రిల్ మరియు మే 1905, పు. 318`322)లో గృహకార్యనిర్వహణలో ప్రవీణురాలైన ఒక స్త్రీ జీవితాన్ని ఆ విషయంలో అజ్ఞానురాలైన ఇంకో స్త్రీ జీవితంతో పోల్చిచూపడం జరిగింది. మొదటామె కుటుంబ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటే, రెండో ఆమె కుటుంబ జీవితం ఎంతో అరాచకంగాను, దు:ఖభాజనంగానూ ఉన్నట్లు చూపారు. ఒక ‘స్త్రీహితాభిలాషి’ రాసిన ‘రాముడు`సీత: గృహనిర్వాహకమును బోధించునొక కథ’లో (జనవరి 1903, పు. 217`223) ‘‘గృహనిర్వాహకమనగా వంట మొదలగు ఇంటి పనులు చేయుటయే గాదు. ఆదాయవ్యయములు మొదలగు వానిని గుఱించిన లెక్కలను సరిగా వ్రాయుచుండుట కూడాననీ, ఈ విషయాలు ‘‘స్త్రీల కంటె పురుషులే బాగుగ నెరవేర్చగలరనియు, ఈ పనులు పురుషుల నుండి స్త్రీలు నేర్చుకొనవలసియున్నదని’’ సూచించారు. ఆర్థిక విషయాల్లో స్త్రీలు అజాగ్రత్తగా ఉండి, దుబారా ఖర్చులు చేస్తారని తెలపడానికి ఒక కథ కూడా చెప్పడం ద్వారా స్త్రీలను దుబారాపరులుగా చూపించారు.
‘గృహనిర్వాహకత్వము’పై ప్రచురించిన రచనల్లో భాగంగానే ప్రఖ్యాతి వహించిన తొలితరం స్త్రీవాదీ, ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ (1901) రచయిత్రీ అయిన భండారు అచ్చమాంబ తొలి రెండు కథలైన ‘ప్రేమా పరీక్షణము’ (జూలై 1898, పు.193-198), ‘ఎఱువుల సొమ్ము బఱువుల చేటు’ (సెప్టెంబర్ 1898, పు. 89`96)లను ప్రచురించిన ఘనత ‘తెలుగు జనానా’కు దక్కుతుంది. ‘ప్రేమా పరీక్షణము’లో ఎన్ని రకాల కష్టాలెదురైనప్పటికీ నీరుగారిపోకుండా భార్య భర్తకు కొండంత అండగా నిలబడాలని బోధించారు అచ్చమాంబ. ‘ఎఱువుల సొమ్ము బఱువుల చేటు’లో భర్త సంపాదనను బట్టి సంసారాన్ని గుంభనంగా నడుపుకోకుండా భేషజాలకు వెళ్తే కుటుంబం అప్పులపాలై ఎలా అవమానాల్ని భరించాల్సి వస్తుందో తెలియజేశారు. అంటే పురుష సంస్కర్తలే కాకుండా స్త్రీ సంస్కర్తలు కూడా మహిళల్లో పైన మనం వివరించిన సద్గుణరాశుల్ని పెంపొందించే దిశగా రచనలు చేసేవారన్నది స్పష్టమవుతోంది. రాయసం వెంకట్రామయ్య రాసిన ‘జానకమ్మ’ అనే కథలో (మే 1902, పు. 321`327) విద్యావతిjైు, అనేక రకాలైన సుగుణాలను కలిగి వుండడం చేత సాధారణ కుటుంబానికి చెందినదైనప్పటికీ జానకమ్మను కట్నం లేకుండానే పెళ్లి చేసుకోవడానికి ఒక భాగ్యవంతుల కుటుంబం ముందుకొస్తుంది.
‘తెలుగు జనానా’ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేసింది. ‘హిందూ దేశములోని యతి బాల్య వివాహములు’ శీర్షికన బెంగాల్ ప్రెసిడెన్సీలోని బాల్య వివాహాలూ, బాల వితంతువుల గణాంకాలను ప్రచురించింది. 1901వ సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం, ‘‘ఒక బంగాళా పరగణాలోనే ఒక సంవత్సరము లోపు వయస్సుగల వితంతువులు 538 (మంది) ఉండిరి! … ఒక బంగాళాలోనే సుమారు 55 లక్షల (మంది) వితంతువులుండిరట. ఆ పరగణాలోని స్త్రీల సంఖ్యలో సుమారు నాలుగవవంతు వితంతువులేÑ కొంచెమించుమించుగా కడమ చోట్ల గూడ నిదే విధమున వితంతు స్త్రీల సంఖ్య యున్నది. ఒక సంవత్సరము లోపు వయస్సునందే స్త్రీలు వితంతువులగుట లోకమునందు మన దేశమందొకచోటనే గానవచ్చుచున్నది. మన దేశస్థుల కతిబాల్యవివాహముల వలని (కలుగు) నష్టములెప్పుడు బాగుగ మనస్సున నాటునో తెలియకున్నది’’ అని వాపోయింది (మే 1903, పు 347`348). 1903 జూన్ సంచికలో బాల్యవివాహాలను నిరోధించడానికి స్వదేశీ సంస్థానమైన బరోడాలో ఏర్పాటుచేయబడుతుండిన ‘ద బరోడా చైల్డ్ మేరియేజ్ ప్రివెన్షన్ బిల్’కు సంబంధించిన విస్తృత సమాచారం ఇచ్చారు (పు. 365`368). శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికా పాఠశాలలో ఆరవ తరగతిలో చదువుతుండిన లింగం సుందరమ్మ అనే బాలిక సంభాషణా రూపంలో చేసిన రచనలో బాల్యవివాహాలను తీవ్రంగా విమర్శించింది. చిన్న పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నందుకు తల్లిదండ్రులను విమర్శించిన సుందరమ్మ ఆడపిల్లలకు యుక్త వయస్సు వచ్చాకే పెళ్లి చేయాలని కోరింది (‘బాల్య వివాహ సంభాషణ’, ఏప్రిల్ మరియు మే 1905, పు. 348`349). వేములూరి అమ్మిరాజు అనే ఆమె ‘తెలుగు జనానా’కు రాసిన ఉత్తరంలో తన సోదరి అయిన వేములూరి భ్రమరాంబ (వయస్సు 20 సంవత్సరాలు) బాలింత మరణాన్ని (27 మార్చి 1903న) గూర్చి వివరిస్తూ బాల్య వివాహాలను కారణంగా చెప్పింది: ‘‘… బాల్య వివాహములే మన దేశము(నకు) నిట్టి పాట్లు తెచ్చిపెట్టుచున్నవని స్ఫురించుచున్నది. దేశమునకిట్టి ఖేదమును గొని వచ్చుచున్న యీ దురాచారమును దొలగింప ప్రయత్నింపుడని పెద్దలను వేడుకొనుచున్నాను’’ అని అమ్మిరాజు ప్రార్థించింది (మే 1903, పు. 348).
బాల్యవివాహాలను తీవ్రంగా వ్యతిరేకించిన ‘తెలుగు జనానా’, వితంతు పునర్వివాహలను బాహాటంగా సమర్థించ లేకపోయింది. వితంతు పునర్వివాహాలను ప్రత్యక్షంగా సమర్థిస్తూ చేసిన రచనలేవీ ‘తెలుగు జనానా’లో ప్రచురించబడలేదు. ప్రచురించబడిన అంశాలు వితంతువుల గణాంకాలూ (మే 1903, పు. 347`348), వివిధ ప్రాంతాల్లో జరిగిన వితంతు పునర్వివాహాల వార్తలూ (జనవరి 1903, పు. 223Ñ డిసెంబరు 1903), వితంతు శరణాలయాల స్థాపనకు సంబంధించిన సమాచారమూ (డిసెంబర్ 1904Ñ జనవరి 1905, పు. 221) మొదలైన విషయాలకే పరిమితమయ్యాయి. దీని అర్థం ‘తెలుగు జనానా’ వితంతు పునర్వివాహలను వ్యతిరేకించిందని కాదు. ‘తెలుగు జనానా’లో వితంతు పునర్వివాహాలను బాహాటంగా చర్చించలేకపోవడానికి గల కారణాలను రాయసం వెంకట శివుడు తన ‘‘ఆత్మ చరిత్రము’’లో చాలా స్పష్టంగా తెలియజేశారు. సంఘ సంస్కరణకు (వితంతు పునర్వివాహం అందులో అత్యంత ప్రముఖమైనది) సంబంధించిన అంశాలను ‘తెలుగు జనానా’లో చర్చించకూడదని బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు ఆంక్షలు విధించడం వల్లనే తాను సంఘ సంస్కరణలో
ఉత్సాహవంతుడనయినప్పటికీ ఈ విషయాన్ని ‘తెలుగు జనానా’లో చర్చించే వాడిని కానని ఎంతో నిరాశతో స్పష్టంగా రాశారు వెంకటశివుడు (‘ఆత్మ చరిత్రము’, పు. 323`24 మరియు 415`416).
వలసాంధ్రలో అప్పుడప్పుడే మొగ్గతొడుగుతున్న మహిళోద్యమానికి ‘తెలుగు జనానా’ ఇతోధికంగా తోడ్పాటు నందించింది. వివిధ మహిళా సంఘాల నివేదికల్నీ, ఆయా మహిళా సంఘాల సమావేశాల్లో స్త్రీలు చేసిన ప్రసంగ పాఠాల్నీ ప్రచురించి మహిళోద్యమ సందేశం వలసాంధ్రలో వ్యాపింపజేసింది. ఉదాహరణకు, 1904 ఫిబ్రవరి సంచికలో ‘‘అసికా స్త్రీ సమాజము’’లో బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ చేసిన ప్రసంగ పాఠాన్ని ప్రచురించింది (పు. 244`247). 1905 జనవరి సంచికలో రాజమండ్రిలోని స్త్రీ సమాజంలో కొటికలపూడి సీతమ్మ చేసిన ప్రసంగ పాఠాన్ని ప్రచురించింది (‘‘హిందూ సుందరుల విద్యాభివృద్ధి’’, పు. 213`220). పాఠకుల లేఖల్ని ప్రచురించడం ‘తెలుగు జనానా’ మరో విశేషం. ఒకరు ‘‘మిథ్యాపుర నివాసి’’ అనే పేరుతో రాసిన ‘‘స్త్రీలను హింసించుట: ఒక జాబు’’ను 1903 జూన్ సంచికలో ప్రచురించింది (పు. 353`357). అత్యంత విశిష్టమైన ఈ ఉత్తరంలో స్త్రీలపై నిరంతరం సాగుతున్న గృహ హింసను గురించి వివరించారు. 1903 జూలై సంచికలో ‘‘సీతమ్మ’’ పేరుతో ‘సధవ వైధవ్యము’ అనే ఉత్తరం ప్రచురించబడిరది (పు. 35`37). ఇందులో కారణమేమీ లేకుండానే భార్యలను వదిలేసే క్రూరమైన భర్తలను విమర్శిస్తూ రాసారు. వేములూరి అమ్మిరాజు రాసిన ‘‘ఒక ఉత్తరము’’లో బాల్య వివాహాలు బాలింత మరణాలకు ఎలా దారి తీస్తున్నాయో వాపోతూ వివరించారు (మే 1903, పు. 348). ఈ విధంగా ‘తెలుగు జనానా’ తన పాఠకులతో సజీవ సంబంధాల్ని నెలకొల్పుకుంది.
‘తెలుగు జనానా’ కొన్ని కాలమ్స్ కూడా నిర్వహించింది. ‘వృత్తాంతములు’ అనే కాలమ్ కింద ముఖ్యమైన వార్తలను ప్రచురించింది. ఈ వార్తలు ఎక్కువ శాతం సంఘ సంస్కరణకు సంబంధించినవై ఉండేవి. ఉదాహరణకు, 1903 జనవరి సంచికలో గుంటూరు, రాజమండ్రిలలో జరిగిన వితంతు పునర్వివాహాల గూర్చిన వార్తల్ని ప్రచురించింది (పు. 223). ‘గ్రంథ విమర్శనము’ అనే కాలమ్ కింద కొన్ని పుస్తక సమీక్షలను ప్రచురించింది. ఉదాహరణకు, 1903 అక్టోబర్ సంచికలో కొటికలపూడి సీతమ్మ పుస్తకం ‘ఉపన్యాసమంజరి’ని సమీక్షించారు. భండారు అచ్చమాంబ చనిపోయినప్పుడు కందుకూరి వీరేశలింగం పెద్ద నివాళి వ్యాసాన్ని ఆమె ఛాయాచిత్రం సహా ప్రచురించారు (‘శ్రీమతి భండారు అచ్చమాంబ గారు’, ఫిబ్రవరి 1905, పు. 225`229). అంతేకాకుండా ‘పతిభక్తి’ (అక్టోబర్ 1903, పు. 112`114), ‘పిల్లల తల్లులకో సలహా’ (జూన్ 1903, పు. 369- 370) మొదలైన విషయాలపై కూడా ‘తెలుగు జనానా’లో రచనలు ప్రచురితమయ్యాయి. స్త్రీలు సంగీతం నేర్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది ‘తెలుగు జనానా’. స్త్రీల సంగీత జ్ఞానం వల్ల బయట కష్టపడి పనిచేసి బడలికతో ఇల్లు చేరిన వారి భర్తలు ఎంతగా సేదదీరగలరో వివరించడమే కాకుండా, భక్తి సాధనకు కూడా సంగీత జ్ఞానం అవసరమని బోధించింది (కె.ఆర్.ఎస్., ‘సంగీతము’, డిసెంబరు 1904, పు. 161`167).
కందుకూరి వీరేశలింగం సంపాదకుడయ్యాక సుమారు ఒక సంవత్సరంపాటు నడిచిన వివాదంలో చిక్కుకుంది ‘తెలుగు జనానా’. ఈ వివాదం వీరేశలింగానికీ, మన్యం వెంకటసుబ్బమ్మ, పులుగుర్త లక్ష్మీ నరసమాంబ (‘సావిత్రి’ స్త్రీల పత్రిక సంపాదకురాలు) లాంటి ఛాందసవాదులైన స్త్రీలకూ మధ్య నడిచింది. ఈ విషయాన్ని ‘సావిత్రి’ పత్రికను గూర్చి రాసినప్పుడు విపులంగా తెలుసుకుందాం.
19వ శతాబ్దంలోనూ, 20వ శతాబ్ది ప్రథమార్థంలోనూ పురుష సంఘసంస్కర్తలు చేపట్టిన స్త్రీ ఉద్ధరణవాద సంఘ సంస్కరణోద్యమ లక్ష్యాలకూ, దాని పరిమితులకూ ‘తెలుగు జనానా’ చక్కగా అద్దం పడుతుంది. వలస పాలనా కాలంలో ఆంగ్ల విద్య, సంస్కృతులతో ప్రభావితులైన పురుషులు, వలసవాద నేపథ్యంలో, తమ కేర్పడిన అవసరాలూ, ఆకాంక్షలకనుగుణంగా స్త్రీలను తీర్చిదిద్దాలనుకున్నారు. పురుషుల ఆశయాలకు అనుగుణంగా స్త్రీలను మలచడంలో ‘తెలుగు జనానా’ తన శాయశక్తులా తోడ్పాటునందించిందన్న విషయం పైన మనం చూపిన వివరాల ద్వారా స్పష్టమౌతుంది.