‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ

ఒక నెలలో ఏడు కథలతో సాహితీ లోకంలోకి దూసుకొచ్చిన నవకెరటం మానస ఎండ్లూరి. తాను చదివిన సాహిత్యంలో తను కనిపించకపోవడం ఆమెను కలం అందుకునేలా చేసింది. తెలుగు సాహిత్యంలో తన సమూహ జీవితానికి చోటు కల్పించింది. ఆ జీవితాల కథల సమాహారం ‘మిళింద’. తాను చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా, సూటిగా చెప్పే మానస

సాహితీ స్వరం ప్రత్యేకమైనదని, భిన్నమైనదని కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించింది. యువ పురస్కారం ప్రకటించింది. రచయితగా, సంపాదకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా, చిత్రకారిణిగా బహుముఖంగా ఎదుగుతున్న మానస ఎండ్లూరి మంచి వక్త, గాయకురాలు కూడా. మానస దృక్పథంలో సాహిత్య, సామాజిక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న మీకు హార్దిక అభినందనలు.
సాహిత్యంలోకి వెళ్ళేముందు మీ గురించి చెబుతారా?
అమ్మ సొంత ఊరైన నెల్లూరులో పుట్టాను. నాన్నది హైదరాబాద్‌. ఆయన ఉద్యోగరీత్యా రాజమండ్రిలోనే పెరిగాను. ఏలూరు సెయింట్‌ థెరెస్సా మహిళా కళాశాలలో సైకాలజీ, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో భాషాశాస్త్రంలో పీజీ చేశాను. ప్రస్తుతం విహంగ మహిళా సాహిత్య పత్రిక సంపాదకురాలిగా ఉన్నాను.
సాహిత్యంతో పరిచయం ఏ వయసులో జరిగింది, ఎలా?
నా తల్లిదండ్రులు కీ.శే. డా॥ పుట్ల హేమలత, ఎండ్లూరి సుధాకర్‌ ఇద్దరూ చిన్న వయసులోనే రచనలు చేయటం ప్రారంభించారు. దాంతో నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలతోనే పెరిగానని చెప్పవచ్చు. సాహితీకారులు ఎంతోమంది ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. అమ్మా నాన్నల రచనలు తరచూ పత్రికల్లో రావడం చూస్తూ పెరిగాను.
మీపై బాగా ప్రభావం చూపిన రచయితలు, రచనలు.
నేను రాసినవన్నీ అస్థిత్వ రచనలు కాబట్టి ఎవరి ప్రభావం లేదనే అనుకుంటున్నాను. జీవితం చూపించిన అనుభవాలే నా కథలన్నీ. డిగ్రీలో ఉన్నప్పుడు హెన్రీ డేవిడ్‌తోరో రాసిన వాల్డెన్‌ చదివి అంత సామన్యంగా బతకడం సాధ్యమేనా అని ఆశ్చర్యపోయే దాన్ని. కానీ ఒకరిలా ఉండాలని ఎప్పుడూ తపించలేదు.
మీ చిన్నప్పుడు చదివిన సాహిత్యం ఇప్పుడు మీ వ్యక్తిత్వ వికాసంలో, రచయిత్రిగా మారడంలో ఏమైనా దోహదం చేసిందా? మొదట ఏమి రాసేవారు?
చిన్నప్పుడు చిన్న చిన్న కవితలు, హైకూలు, చిన్న కథలు రాసేదాన్ని. నిజానికి నేను చిన్నప్పుడు బాల సాహిత్యం చదివింది తక్కువ. పెద్దలు రాసిన కవిత్వాన్నే చదివాను. ఇంట్లో అవే ఉండడం వల్ల కావచ్చు. కాబట్టి ఆలోచించడం, ప్రశ్నించడం అనేవి సాహిత్యం వల్ల వచ్చిందనే నా నమ్మకం. అది పెద్దయ్యే కొద్దీ బలంగా కూడా మారింది. రచనలు మొదలు పెట్టేసరికి నా ఆలోచన ఒక్కటే. నా అనుభవాలు నావి మాత్రమే కాదు, అవి ఒక జాతికి, ఒక వర్గానికి చెందినవి. అవి నేను రాస్తే ఒక సమూహం రాసినట్టే అని నమ్మాను.
కథతో ప్రేమలో ఎప్పుడు పడ్డారు? ఎందుకు రాయాలనిపించింది? మీ కథలకు స్ఫూర్తి? మీ మొదటి కథ, బాగా పేరు తెచ్చిన కథ?
తెలుగు కథలు పత్రికల్లో, సంపుటాల్లో అప్పుడప్పుడూ చదువుతూ ఉండేదాన్ని. ఎక్కడా విరివిగా నేనంటూ కనబడలేదు, వినబడలేదు. బహుశా ఆ అసంతృప్తే నన్ను రచనలైపు నడిపింది. నా కథలకు స్ఫూర్తి నా చుట్టూ ఉన్న జీవితమే. 2015లో మొదటి కథ ‘గౌతమి’ రాశాను. తెలంగాణా, ఆంధ్ర విడిపోతున్న సమయంలో ఎంతో మానసిక వత్తిడికి లోనై రాసిన కథ. నాకు బాగా పేరు తెచ్చిన కథ ‘అమ్మకో లేఖ’. ఈ కథ 2016లో ‘చినుకు’ మాసపత్రికలో వచ్చింది. ఈ కథను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ‘నవలేఖన’ అనే కథా సంకలనంలో వేశారు. ఆ కథలన్నీ ఇంగ్లీషుతో సహా పద్దెనిమిది భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి.
మీ కథల్లో బొట్టు కథలు ఎక్కువగా కనిపిస్తాయి. బొట్టు లేని మొహాలు మనకి మన సమాజంలో చాలానే కనిపిస్తాయి. అవి ముస్లింలవి కావచ్చు, క్రిస్టియన్స్‌వి కావచ్చు. అంతే కాకుండా ఈ రోజుల్లో చాలామంది పెట్టుకోవడం లేదు. కానీ దళిత క్రిస్టియన్‌ మహిళల కథలే కనిపిస్తాయి. ఎందుకలా?
బొట్టులేని స్త్రీలంతా ఒకటి కాదు. మన సమాజం ఒక ముస్లింని యాక్సెప్ట్‌ చేసినంత దళిత క్రైస్తవులను యాక్సెప్ట్‌ చేయదు. తెలుగు సినిమాల్లో అడపాదడపా ముస్లిం హీరోయిన్‌ పాత్రలు కనిపిస్తాయి. కానీ క్రైస్తవ వాతావరణం కానీ, క్రైస్తవ పాత్రలు కానీ కనిపించవు. ఉన్నా వాళ్ళు రౌడీలుగా, దొంగలుగా, తప్పు చేస్తున్న వారి పాత్రల్లోనే ఉంటారు. ఇక పీడక కులాల వారి కట్టూ బొట్టూ ఎవరూ ప్రశ్నించరు. అవి ఎలా ఉన్నా వారు వివక్షకు గురికారు. ఎంతోమంది క్రైస్తవులు సమాజంలో పోరాడలేక, మర్యాద కోసం బొట్టు పెట్టుకునేవారు కోకొల్లలు. వీరిని వ్యక్తులుగా ఎవరూ బలవంతపెట్టరు. ఈ వ్యవస్థే ఆ పని చేస్తుంది.
కులం సామాజిక ఆస్తిగా, అంతస్తుగా… ఉన్న సమాజం మనది. అందులో జెండర్‌, దళిత అస్తిత్వాలు. దళిత అస్తిత్వంలో కూడా క్రిస్టియన్‌ మైనారిటీల జీవిత పార్వ్శాలపైనే మీ దృష్టి ఎందుకని?
ఎందుకంటే నేను ఆ వర్గం నుంచి వచ్చినదాన్ని కాబట్టి. దళిత సాహిత్యం, దళిత చరిత్ర ఎంతో అందుబాటులో
ఉన్నా, దళిత క్రైస్తవ జీవితాల గురించి పెద్దగా రాలేదు. ఆ ఖాళీని నా వంతుగా కొంత పూరించాలన్న తాపత్రయమే నాది.
ఈ మధ్య వచ్చిన ‘‘ఊరికి దక్షిణాన’’, మీ అనువాద నవల. అనువాద క్రమంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి చెప్తారా?
మరాఠీ నవల శీర్షిక ‘ఓ’. అంటే ఒక ఉద్యమానికి పిలిచే పిలుపు. ఇంగ్లీషులో ‘The tale of untouchables’. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేశాను. ఈ నవల ఊరికీ, వాడకీ మధ్య జరుగుతూ ఉంటుంది. పల్లెటూళ్ళలో దక్షిణ దిశగా దళితుల వాడలు
ఉంటాయి. తూర్పులో బ్రాహ్మణులు. అలా వచ్చిన శీర్షిక ఇది. భాషా సవాళ్ళు బాగానే ఎదుర్కొన్నాను. ముఖ్యంగా వారి పేర్లు, ఇంటి పేర్లు మనకు ఏ మాత్రం అలవాటు లేనివి. ఎలా పలుకుతారో అని నా మరాఠీ మిత్రులను అడిగి తెలుసుకునేదాన్ని.
సృజనాత్మక రచనల నుండి అనువాదాల్లోకి ఎలా వచ్చారు? ఇక ముందు కూడా అనువాదం కొనసాగించే ఉద్దేశంలో ఉన్నారా?
నిజానికి నేను అనువాదాలు చేయాలని అమ్మ చాలా కోరుకుంది. ఆమె ఉన్నప్పుడు రెండు, మూడు పుస్తకాలను ప్రయత్నించింది కానీ కుదరలేదు. ఆ తర్వాత శరణ్‌ కుమార్‌ లింబాలే ఈ నవల అనువదించగలరా అని అడిగినపుడు వెంటనే ఒప్పుకున్నాను.
సాహితీ ప్రపంచంలోకి వచ్చాక బాధపడిన సందర్భాలు?
ప్రత్యేకంగా అంటూ ఏమీ లేవు. ఇక్కడ ఉన్నవారంతా నేను చిన్నప్పటి నుంచీ చూసినవారే, మా కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్నవారే. అయితే వివక్షపై రాసిన కథలను పత్రికల వారు తృణీకరించినపుడు కాస్త నిరుత్సాహం కలిగింది. ఆ లోటును కొన్ని అంతర్జాల పత్రికలు తీర్చుతున్నందుకు చాలా సంతోషం.
మీరు రచయితగా తొలి అడుగులు వేసినప్పుడు ఉన్నంత కసి ఇప్పుడు లేదనిపిస్తోంది. తగ్గిన మీ కథలు ఆ విషయం చెబుతున్నాయి. మీ కామెంట్‌.
అవును. అయితే కసితో కథలు రాయలేదు, కాబట్టి కసి తగ్గడం అనేదేం లేదు. మొదట్లో చాలా దూకుడుతో
ఉన్నాను. తెలిసినవి, చెప్పాలనుకున్నవి చకచకా రాసేయాలి అనే ఉత్సాహం ఉండేది. దాంతో కొన్ని కథలు అనుకున్నంత లోతుగా రాయలేకపోయాను. మిళింద పుస్తకం వేశాక నిదానంగా రాయాలని నిర్ణయించుకున్నాను.
హ్యారీపోర్టర్‌ 7 వాల్యూంలు చదివే మన యువత తెలుగు సాహిత్యం పట్ల ఎందుకు ఆసక్తి చూపడం లేదంటారు? యువతను ఆకట్టుకోవాలంటే తెలుగు సాహిత్యం ఎలా ఉండాలి? ఏం చేయొచ్చు?
ఒకప్పుడు తెలుగు సాహిత్యం బాగా చదివిన తరాలకు ఇంగ్లీష్‌ అంతగా అందుబాటులో లేకపోవడం, అప్పట్లో వేరే మాధ్యమాలు లేకపోవడం కారణాలు కావచ్చు. ఇప్పటి వారికి తెలుగు చదవడం రాయడమే కాదు ఎక్కువ పదాలు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. పైగా ఇంగ్లీష్‌ బాగా డామినేట్‌ చేసే కాలం. ఇది ఖచ్చితంగా పెద్దల నిర్లక్ష్యమనే అనిపిస్తుంది. పిల్లలు కనీసం రెండు భాషలు తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు. భాష రాకపోవడం ప్రధాన సమస్య.
ఇక రెండోది భాష వచ్చిన సాహిత్యంతో, రచనలతో ఏ మాత్రం ప్రయాణించకపోవడం. సమాజంలో జరుగుతున్న వాటిని వార్తలుగానే చూస్తున్నారు తప్ప వాటిపై ప్రతిస్పందనలు, సంఫీుభావాలు పట్టడం లేదు. యువతను ఇప్పటి పుస్తకాలను గ్రంథాలయాల ద్వారా, బుక్‌ ఫెయిర్‌ల ద్వారా చేరువ చేయాలి. రచయితలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి పుస్తక పఠనంపై, రచనలపై అవగాహన కల్పించాలి.
రచనని వృత్తిగా చేసుకుని డబ్బు సంపాదించుకోవాలంటే సినిమాలే మార్గమని అటువైపు అడుగులు వేస్తున్న యువతని చూస్తున్నాం. మీకు కూడా ఆ దిశగా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా?
లేదు. తెలుగు సాహిత్యానికి, సినిమాకి అసలు వారధి అనేది చాలా చాలా బలహీనంగా ఉందనే అనుకుంటాను.
ప్రపంచ సాహిత్యంలో రచన ఒక వృత్తిగా చేసుకునేవాళ్ళు ఎక్కువ. కానీ భారతీయ భాషల్లో ఆ పోకడ చాలా తక్కువ. ఎందుకని?
ఇక్కడ రచనలకి ఆదాయం లేకపోవడమే. పుస్తకం వేసినా, పత్రికల్లో రచనలు అచ్చయినా డబ్బు అంటూ పెద్దగా ఏమీ రాదు. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో రచయితలందరూ ఏమీ ఆశించకుండా రాస్తున్నవారే.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శిగా మీ భవిష్యత్‌ కార్యాచరణ.
యువతను ఎక్కువగా సాహితీ సదస్సుల్లో భాగం చేయాలనే ఆలోచనతో ఉన్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు, స్త్రీలు రచనలు చేయాలని ప్రోత్సహించేలా చూస్తున్నాను.
స్త్రీవాదం ఇంకా ఉందనుకుంటున్నారా? అది ఈ మధ్య చాలామంది అంటున్న మాట. మీరేమంటారు?
మనిషి ఉన్నంతకాలం స్త్రీవాదం ఉంటుంది. స్త్రీలలో ఉండే పురుషాధిపత్య భావజాలం పోగొట్టుకోవడంలోనే
స్త్రీవాదాన్ని నిలబెట్టుకోవడం ఉంటుందని నమ్ముతాను.
బహుజన, దళిత, మైనారిటీ స్త్రీల సాహిత్యం బలంగా ఉందా? మరింత బలమైన భావజాలంతో రావలసిన అవసరం కనిపిస్తోందా?
ఎనభై, తొంభైలలో ఉన్నంత ఉధృతంగా ఇప్పుడు లేకపోయినా మెర్సీ మార్గరెట్‌, అరుణ గోగులమండ, నస్రీన్‌ఖాన్‌, పద్దమ్‌ అనసూయ వంటి వారు వారి అస్తిత్వ, ఆత్మగౌరవ రచనలు చేస్తున్నారు. అయితే సంఖ్యా పరంగా రచయిత్రులు తక్కువగా ఉన్నారు. వారి సంఖ్య ఎంత పెరిగితే ఈ బలహీన వర్గాలకి అంత బలం చేకూరుతుంది.
సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడంలో, మంచి రచనలు చేయడంలో మహిళల భాగస్వామ్యం? తెలుగు సాహిత్యంలో మహిళల చోటు ఎక్కడ?
తెలుగు సాహిత్యంలో మహిళల చోటును కూడా పురుషులే స్వాధీనం చేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది. స్త్రీ ఎలా ఆలోచిస్తుంది, ఆమె మనసు, ఆమెకు ఏం కావాలన్న విషయాలపై పురుషులు ఎక్కువగా కవితలు, కథలు రాయడం ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి ఎంతోమంది పురుష రచయితలు వారి ఆలోచనల్ని, అస్తిత్వాన్ని రాయడం మాని స్త్రీలపై రాస్తున్నారు. వేదికలు కూడా వారితోనే నిండిపోతున్నాయి. స్త్రీ మరింత బాధ్యతగా రాయాల్సిన అవసరం ఉంది.
దళిత మహిళల వ్యథలు, గాథలు రాయాల్సిన బాధ్యత దళిత మహిళలదేనా?
దళిత పురుషులది కూడా. తెలంగాణా, ఆంధ్ర, సీమాంధ్ర నుంచి దళిత రచయతలు ఎన్నో రచనలు చేశారు. ఇప్పుడున్న యువ దళిత రచయితలు కూడా రాస్తున్నారు. దళితేతర రచయితలు రాసినప్పుడు అవి సానుభూతి సాహిత్యంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది.
రిజర్వేషన్లు నిచ్చెన మెట్ల కులవ్యవస్థను పెంచి పోషించడమే అన్న వాదనకి మీ స్పందన? కుల వ్యవస్థను కూల్చే బాధ్యత ఎవరిది?
కుల వ్యవస్థ వల్ల లాభాలు పొందుతున్నవారి నుంచే ఇటువంటి వాదనలు, వ్యాఖ్యలు వస్తాయి. స్త్రీలకి కూడా ప్రైవేటు రంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉండి ఉంటే ఈపాటికి ఎంతో అభివృద్ది చెందేవారు. కులాన్ని కాలదన్నాల్సిన అవసరం ప్రతి కింది కులం వారికి ఉంటుంది, ప్రతి పై కులం వారికి ఉండదు. అదే ఈ కుల చట్రం ప్రత్యేకత. ఇటీవల ఒక రెడ్డి కులానికి చెందిన అమ్మాయి తండ్రి, వైశ్య కులానికి చెందిన అబ్బాయిని చంపేయడం భారతీయ కులవ్యవస్థను మళ్ళీ మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది.
అస్తిత్వ ఉద్యమ సాహిత్యం మనుషుల్ని, మనసుల్ని ముక్కలు ముక్కలుగా విడదీస్తున్నదని, మనసుల మధ్య దూరం పెంచుతున్నదని కొందరి వాదన. మీరేమంటారు?
అందర్నీ ఒకే గాటన కట్టేస్తే జోగినీ, ఆదివాసీ, ముస్లిం, గిరిజన, సంచార, దళిత తదితర వర్గాలకు చెందిన వారి గురించి తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఉదాహరణకి బహుజన సాహిత్యాన్నే తీసుకుంటే రకరకాల కులాలు, కుల వృత్తులు, వారిలో ఉండే విభిన్నమైన జీవన శైలులు తెలిపే రచనలన్నింటినీ కలిపే బహుజన సాహిత్యం అంటాం. అలా వద్దనుకుంటే స్త్రీవాదం ఉండేదా? మరి స్త్రీవాదం అని మనం పురుషుల నుంచి ఎందుకు వేరుబడి రచనలు చేస్తున్నట్టు?
అకాడమీలు ఇచ్చే బహుమతులు, పురస్కారాలు ప్రాంతీయ భాషా సాహిత్య సృజనకు దోహదం చేస్తున్నాయని అనుకుంటున్నారా? ఎలా?
కచ్చితంగా చేస్తున్నాయనే చెప్పవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీనే పెద్ద ఉదాహరణ. అలాగే, తెలంగాణా సారస్వత పరిషత్‌ వారు, ఇతర సాహితీ వేదికలు రచయితలకు పారితోషికం ఇవ్వడం ఒక ప్రోత్సాహమే. పుస్తకాలు అచ్చు వేసుకోవడానికి ఈ గుర్తింపు,
ఉత్సాహంతో మరిన్ని రచనలు చేయడానికి ఈ పురస్కారాలు ఉపయోగపడతాయి.
గతంలో మీకు వచ్చిన అవార్డులు, రివార్డులు…
కేంద్ర సాహిత్య అకాడమీ వారు 2016లో త్రిపురలో, 2018లో అస్సాంలో నిర్వహించిన అఖిల భారత యువ రచయితల సమ్మేళనం (All India Young Writers Fests) కి స్వీయ రచనా పఠనానికి తెలుగు రచయిత్రిగా ఆహ్వానం అందుకున్నాను.
2018లో నా 22 కథలతో ‘మిళింద’ అనే కథా సంపుటి తెచ్చాను.
2017లో స్మైల్‌ స్మారక పురస్కారం
2017లో వెంకట సబ్బు స్మారక పురస్కారం
2021లో మాడభూషి పురస్కారం
భవిష్యత్‌ అంతర్జాల పత్రికలదే. మీ సంపాదకత్వంలో వస్తున్న విహంగ అంతర్జాల పత్రిక భవిష్యత్‌ రూపం ఎలా ఉండబోతోంది?
‘విహంగ’ ప్రధానంగా కొత్త రచయితలు, పరిశోధకులపై దృష్టి పెడుతుంది. విహంగకు ISSN నెంబర్‌ ఉండడం వల్ల పరిశోధన వ్యాసాలకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. పత్రిక మొత్తం స్త్రీల అంశాలతోనే నడుస్తుంది. ఇక ముందు కూడా అంతే. ముఖ్యంగా కొత్త రచయిత్రులను పరిచయం చేసే ఉత్సాహంతోనే ఉంటాం.
కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీతగా నవతరం రచయితలకు మీరిచ్చే సూచనలు
మన జీవితాల గురించి మనం రాయాలి. ఊహించి రాసేవి వాస్తవాల కంటే ఎక్కువ థ్రిల్‌ ఇవ్వవు. నీ గురించి, నీ మూలాల గురించి నువ్వు నిజాయితీగా రాసినప్పుడే నువ్వు విలక్షణంగా కనిపిస్తావు.
చివరగా… మీరు మంచి పాఠకులా? రచయితా?
నేను మంచి రచయితనా కాదా అన్నది నా పాఠకులు చెప్పాలి. జీవితాన్ని సరిగ్గా చదువుతున్న మంచి పాఠకురాలినే.
విహంగ అంతర్జాల పత్రిక ముఖ చిత్రాలతో పాటు, తన అనువాద నవల ‘ఊరికి దక్షిణాన’ పస్తక ముఖచిత్రంతో చిత్రకారిణిగా కూడా పరిచయమైన మానస ఎండ్లూరి గారు భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

2 Responses to ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ

  1. Manasa says:

    శాంతి గారికి, భూమికకు నా ప్రత్యేక ధన్యవాదాలు.

  2. Aruna Gogulamanda says:

    Bombarding. Extraordinary responses. Valid interview.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.