తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి

పరువు, ప్రతిష్ట, మర్యాద, వంశ గౌరవం, ఇంటిగుట్టు… ఇవి ఒట్టి పదాలేనా? పితృస్వామ్య భావజాలమా? ‘పితృ’ అంటే తండ్రి, ఇంటికి యజమాని అని పితృస్వామ్యం ప్రచారంలో పెట్టిన ఓ కరకు నమూనా వల్లించే ఈ పదజాలం చుట్టూ ఎంత హింస ఉంది. ఈ హింస ఎవరిమీద ప్రయోగించబడుతోంది? పూర్వపు ఉమ్మడి కుటుంబాల్లో ఇంటి పెద్దగా చెలామణీ అయ్యే పురుషుడు పదే పదే వాడే పదాలు పరువు, కుటుంబ గౌరవం, వంశ గౌరవం… వగైరాలు. స్త్రీలని, పిల్లలని అణిచి ఉంచడానికి, వారిమీద యధేచ్ఛగా హింసని ప్రయోగించడానికి వాడుకున్న పదాలు కూడా ఇవే.. ఏ సినిమా అయినా చూడండి. ఈ డైలాగుల్లేకుండా ఉండవు. ప్రాణం కన్నా పరువు ముఖ్యమనే సంభాషణలు తక్కువేమీ ఉండవు. పరువు రక్షణ కోసం ప్రాణాలు తీసే సన్నివేశాలూ ఎక్కువే ఉంటాయి.

మనిషి ప్రాణం కన్నా ఒట్టి పదమైన ‘పరువు’ అంటే ఏమిటి? ఈ పదం చుట్టూ ఇంత హింస అల్లుకుని ఎందుకుంది? పితృస్వామ్యానికి పట్టుగొమ్మలుగా ఉన్న కుటుంబాల్లో ‘పరువు’ దేని ఆధారంగా నిర్ణయమౌతుంది. ఆర్థిక హెచ్చుతగ్గులు, భిన్నమైన కులాల కలయికలు, మతం, ప్రాంతం ఇవన్నీ కూడా కుటుంబాల పరువును నిర్ణయిస్తాయి. ఆధిపత్య కులం, అణచివేతకు గురవుతున్న కులాల మధ్య వివాహ బంధం అదీ ప్రేమ ఆధారంగా ఏర్పడితే కూడా… కులాల వారీగా విడిపోయి ఉన్న కుల సమాజంలో ఆధిపత్య కులాల వారి పరువు భగ్నమైపోయినట్టు, కులాంతర వివాహం తమ కుటుంబ ప్రతిష్టను బజారులో వేసినట్టు శివాలెత్తిపోవడం చూస్తూనే ఉన్నాం. పంజాబ్‌, హర్యానాలాంటి రాష్ట్రాల్లో కులాంతర వివాహాలను చేసుకున్న జంటలను పరువు హత్యలు, ఆనర్‌ కిల్లింగ్‌ లాంటి భయానక పేర్లతో వేటాడి, వేటాడి చంపేసిన ఉదంతాలు మన స్మృతిపథంలో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మధ్య యుగాల నాటి ‘ఖప్‌ పంచాయతీ’ తీర్మానాల పేరుతో ఎంతోమంది యువ జంటలను చంపించిన క్రూరత్వాన్ని చూశాం. అయితే ఈ దారుణాల వెనక పనిచేస్తున్నది మనువాద, పితృస్వామ్య భావజాలమే అన్న విషయం మర్చిపోకూడదు. వేలాది సంవత్సరాలుగా చాతుర్వర్ణ వ్యవస్థను పెంచి పోషిస్తున్న మనువాద సిద్ధాంతం ఇన్నివేల సంవత్సరాలు జరిగిపోయినా చెక్కు చెదరకుండా కొనసాగుతున్నదనడానికి తాజా ఉదాహరణలు మారుతీరావు, మనోహరాచారి అనేవాళ్ళు తమ స్వంత బిడ్డలమీద చేసిన దాడులు, హత్యలు. ‘పరువు’ పేరుతో హత్యలకి కూడా తెగబడ్డ వీళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్న కారణం కులం. ”కులం తక్కువ” వాడిని పెళ్ళి చేసుకోవడం. ఒక షెడ్యూల్డ్‌ కులం మనిషిని పెళ్ళి చేసుకోవడం అంటే తమ ఆధిపత్య కులం పరువుపోయినట్టని, పరువు పోయాక ప్రాణాలదేముంది గడ్డిపరక అని వీళ్ళెంత బలంగా నమ్మారో, దాన్ని ఆచరించి చూపారో ‘ప్రణయ్‌’ దారుణ హత్య తేటతెల్లం చేసింది. ఆధిపత్య కులాల వారి ”పరువు” వాళ్ళ కులంలో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కులాంతర వివాహాలను ఆమోదించమని, ప్రాణాలు తమకు లెక్క కాదని మారుతీరావు తెగేసి చెప్పాడు కూడా!

హంతకుడైన మారుతీరావుని సమర్ధిస్తూ అతని కులానికి చెందిన వారందరూ మిర్యాలగూడా రోడ్లమీద ర్యాలీ తీయడం చూస్తుంటే ‘కులం’ శిలాజంలా మారిపోయిన వైనం కనిపిస్తోంది. కులరక్షణ కోసం హత్యలు కూడా చేస్తామని అంతమంది రోడ్లమీద బరితెగించి చెప్పినప్పుడు కుల నిర్మూలన పోరాటాలు ఏ స్థాయిలో చెయ్యాలో అర్థమవుతుంది. హంతకుడిని సమర్దిస్తున్న వీరందరి మీదా హత్యారోపణ కేసులెందుకు పెట్టకూడదు? వారి నిస్సిగ్గుతనాన్ని సామాజికంగా ఎండగట్టాల్సిన అవసరమూ ఉంది.

ప్రణయ్‌ హత్య, సందీప్‌, మాధవిల మీద జరిగిన దాడి అనంతరం తండ్రి ప్రేమ మీద జరుగుతున్న చర్చలు… ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న వాదోపవాదాలు పరమ జుగుప్సాకరంగా ఉన్నాయి. పితృస్వామ్య కుటుంబంలోని సభ్యులందరూ ఆ ఇంటి యజమానికి దాసులుగా ఉండాలని మన సమాజం ఆశిస్తుంది. అందులో భాగంగానే ఆయన భార్యాపిల్లల్ని ప్రేమించొచ్చు లేదా హింసించొచ్చు. నా భార్య నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం… కొట్టుకుంటా, తిట్టుకుంటా, చంపుకుంటా వీలయితే ప్రేమించుకుంటా గారాబం చేస్తా, అల్లారుముద్దుగా పెంచుకుంటా… నా మాట వినకపోతే చంపేస్తా. నా మాట వింటేనే నా ఆస్తి ఇస్తా. నేను చెప్పిన వాడు / ఆమె నే నా కులం వాడినే పెళ్ళి చేసుకోవాలి లేదంటే చంపేస్తా… ఇదీ మారుతీరావులాంటి తండ్రుల పితృప్రేమ సారాంశం. మారుతీరావు లాంటి కులోన్మాదిని సమర్ధిస్తున్న వారందరి అసలు రూపాలివే.

ఈ మొత్తం వ్యవహారంలో నవమాసాలు మోసి, బిడ్డల్ని కనే తల్లి స్వరం ఎందుకు విన్పించడం లేదు? తండ్రులకు మాత్రమే ప్రేమ ఉందా? తల్లి ప్రేమలేమయ్యాయి? తల్లులెందుకు అదృశ్యమయ్యారు? నిజానికి గర్భశోకం ఆమెకు కదా! తండ్రులకు గర్భశోకాలెందుకు? వాళ్ళకుండేది పరువు, ప్రతిష్టల వెంపర్లాట కదా! తన ”పరువు” కోసం ఎవరో కన్నకొడుకును హత్యచేయించిన మారుతీరావుకి ఆ తల్లి గర్భశోకం గురించి ఎలా అర్థమౌతుంది. నిజానికి ఇక్కడ పనిచేసింది పరువు కాదు… కులం… కులాహంకారం… ఆధిపత్య కులాహంకారం. ప్రణయ్‌ని పొట్టన పెట్టుకున్నది పరువు కాదు కులం. ఈ స్పష్టత చాలా అవసరం.

ఇంకెంత కాలం? ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలవాలి? బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతే బలంగా పైకి లేస్తుంది. అణచివేతకు గురౌతున్న కులాలన్నీ ఐక్యమై కుల నిర్మూలనవైపు అడుగులేయడమే ఇప్పటి అవసరం. చాతుర్వర్ణ వ్యవస్థను, దాని కొమ్ముకాసే రామరాజ్యాన్ని స్థాపించాలనే ఎజెండాతో ముందుకొస్తున్న ఈనాటి రాజకీయ నేపథ్యంలో మరింతమంది మారుతీరావులు పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్‌ జాగ్రత్త…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి

  1. రవి పూరేటి says:

    మీరు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో నవమాసాలు మోసి, బిడ్డల్ని కనే తల్లి స్వరం విన్పించడం లేదు? ఇది దేనికి సంకేతం, తండ్రులకు మాత్రమే ప్రేమ ఉందా? తల్లి ప్రేమలేమయ్యాయి? తల్లులెందుకు అదృశ్యమయ్యారు? నిజానికి గర్భశోకం ఆమెకు కదా! దీనిపైన చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తులు,వ్యవస్ధలు,పత్రికలు ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ విషయమై ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉంది.లేక పొతే మరో సతిసహగమనాల వంటి సాంఘిక దురాచారాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.