1. కుంతి కాని కుంతి!
‘కుంతీ పుత్రిక’
తెలుగు నవలను ప్రవర్ధమానం చేస్తున్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి శారదా అశోకవర్ధన్ సంఘసంస్కరణాభిలాషి కావడం వల్ల, ఆమె ఏ రచన చేసినా దానికి ఎంతో విలువ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల అభ్యుదయానికి దోహదం చేసేటట్లుగా ఉంటాయి ఆమె రచనలు. ఆదర్శభావాలూ, ధైర్యసాహసాలూ, తనకు నచ్చిన మార్గాన్ని అవలంభించడం, తను నమ్మిన నిజాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేయడం మొదలైన లక్షణాలను రచయిత్రి నుంచి పుణికి పుచ్చుకుంటారు ఆమె కథానాయికలు సాధారణంగా!
అటువంటి బలమైన వ్యక్తిత్వం కలిగినదే ఈ కొత్తనవలలోని కథానాయిక నీలిమ. ఆమె చేసే పనులకు స్వయంగా బాధ్యత వహించడం ఆమె ప్రత్యేకత.
ఆడపిల్లలు యౌవనదశలో పురుషులు ఆకర్షణకి లోబడటం, వారి వలలో చిక్కుకుని, దుష్పరిణామాలను ఎదుర్కోలేక ఆత్మహత్యకి పాల్పడటం, లేకపోతే, సమాజంలో హీనంగా బతకటం సామాన్యంగా జరుగుతుంది. నీలిమ అటువంటి బలహీనురాలు కాదు. నీలిమ వ్యక్తిత్వం ఆమె మాటల్లోనే – నవల ఆరంభ వాక్యంలోనే సుస్పష్టమవుతుంది – ”జీవితంలో ఒక్కటే నిజమైన విజయం. మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించగలగటం” అంటుంది నీలిమ.
కుంతి సూర్యదేవుణ్ణి ఆహ్వానించినట్లు నీలిమ శ్రీధర్‌ని ప్రోత్సహించింది. అంతవరకే సామ్యం. కుంతి కుతూహలంతో చేస్తే, నీలిమ నిశ్చయంగా త్వరలో వివాహం చేసుకోబోతున్న యువకుడికి తన్నుతాను సమర్పించుకుంది. పుత్రుని కన్న మరుక్షణం కుంతిని అధైర్యం ఆవహించింది. సంప్రదాయాలను గౌరవించే సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యంలేక, దేవదత్తమైన పుత్రుడే అయినా, తన పరువుని కాపాడుకోవడానికి కర్ణుణ్ణి గంగపాలు చేసింది. నీలిమ విషయం వేరు. అనూహ్య పరిస్థితులు ఏర్పడి, శ్రీధర్ నీలిమని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించాడు. నీలిమ కుంతిలాగ అధైర్యపడలేదు. సమాజానికి తలవంచలేదు. తొమ్మిది నెలలూ మోసి కన్నకూతుర్ని సగర్వంగా చూసుకుంది. ఆ పాపని ఎవరైనా ”కుంతీ పుత్రిక” అని అంటే సహించలేదు. కూతురు శ్రీలక్ష్మి పెద్దదయ్యాక తన్ను తాను ”కుంతీ పుత్రిక” అనుకున్నా నీలిమ అడ్డుకుంటుంది.
”నువ్వు కుంతీ పుత్రికవి ఎలా అవుతావమ్మా!… నిన్ను కర్ణుడితో పోల్చి కుంతీపుత్రిక అనడం సమంజసం కాదు. నిన్ను శ్రీకృష్ణుడితో పోల్చాలి. నువ్వు ఇద్దరి తండ్రుల ముద్దుల కూతురివి” అంటుంది తన అసలు తండ్రి శ్రీధర్ అని తెలుసుకున్న శ్రీ లక్ష్మితో. శ్రీలక్ష్మిని కన్నకూతురిలా ప్రేమగా పెంచినవాడు పవన్. అన్నీ తెలిసి, నీలిమ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుని పెళ్లి చేసుకున్నవాడు.
విధి ఎంత వక్రమైనదైనా దానికీ ఒక వలయం ఉంటుందనీ, ఇది విడిపోయిన వారిని మరో విధంగా కలుపుతుందనీ ఈ కథ చెబుతుంది. శ్రీధర్ అక్క కొడుకు సుజిత్, శ్రీలక్ష్మీ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సందర్భంగా నీలిమ సుజిత్ ఇంటికి వెళ్లినప్పుడు అతని మేనమామ ఆయిన శ్రీధర్‌ని చూస్తుంది. ఇద్దరూ నిర్ఘాంతపోతారు. అపార్థాలూ, పరస్పర నిందారోపణలూ మొదలవుతాయి.
”అక్కా, తెలుగు సినిమా కథలా ఉందే నీ జీవిత కథ…..” అంటుంది. శోభ తన అక్క శ్రీలక్ష్మితో.
తెలుగు సినిమాల్లో ఉండే అనూహ్యమైన మలుపులూ, అక్కడక్కడ దుండగులతో కథానాయకుడి ముష్టియుద్ధాలూ, శోభనం లాంటి సన్నివేశం, అపార్థం చేసుకోవడం మొదలైనవి ఉన్నప్పటికీ, ”కుంతీ పుత్రిక” నవల చాలా ప్రయోజనాత్మకమైనదని చెప్పక తప్పదు.
ఈ నవలలో స్త్రీ పురుష సంబంధాలను చిత్రించడమే కాకుండా, కాలేజీలో చదివే ఈ నాటి కొందరు యువకుల నడవడిని – పోలీసు ఎస్.ఐ. మాటల్లోనూ, కాలేజీ ప్రిన్సిపాల్ మాటల్లోనూ – విమర్శనాత్మకంగా విశ్లేషించడం, చదువుకున్న వాళ్లలో కూడా మూఢ విశ్వాసాలూ, సెంటిమెంట్లతో నిండు జీవితాలను నాశనం చేసే మనస్తత్వాలూ” ఉండటాన్ని – కొన్ని పాత్రల ద్వారా నిరసించడం చేశారు రచయిత్రి. పిల్లల్ని నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రుల్ని తీవ్రంగా విమర్శిస్తూ, పిల్లల పెంపకం ఎలా ఉండాలో చెబుతారు నీలిమ మాటల్లో.
కథానాయిక నీలిమని ఒక ”యాంగ్రీ యంగ్ లేడీ”గా తీర్చిదిద్దారు, ఆమె బాస్ కూడా ఆమెని మెచ్చుకుని ప్రోత్సహించే విధంగా. ”నీలిమ నిప్పులాంటి ఆడది మాత్రమే కాదు, ముక్కు సూటిగా మాట్లాడే తత్వం కలదని” ఆమె కొలీగ్స్ అర్థం చేసుకొంటారు. ఈ నాటి యువకులు పైకి ధైర్య సాహసాలు కనపరిచినా, సమయానికి చేతకానితననాన్ని ప్రదర్శిస్తారనీ, తల్లిదండ్రుల మూఢ విశ్వాసాలనీ విమర్శిస్తుంది. నీలిమ. ”ఒక చదువుకున్న మూర్ఖుడికి భార్య అయి బాధపడే పరిస్థితి నుంచి తప్పించుకున్నందుకు ఆనందపడుతున్నాను” అంటుంది – శ్రీధర్ తనని మూఢ విశ్వాసాల ఆధారంగా నిరాకరించినట్లు విన్నప్పుడు.
కానీ ”తండ్రెవరో చెప్పుకోలేని పరిస్థితిలో నా బిడ్డను పెంచి పెద్ద చేయటంలో నేనెన్ని కష్టాలు ఎదుర్కొన్నానో మీకేం తెలుసు. గమ్యం తెలియని ఒంటరిపోరాటం సాగించాను. కష్టాల కత్తుల వంతెన మీద నిర్విరామ ప్రయాణం సాగించాను….” అనీ, ”పురుషజాతినే ద్వేషించే స్థితికి దిగజారిపోయాను” అనీ నీలిమ శ్రీధర్‌తో తరువాత చెప్పడానికి బట్టి, పెళ్ళికాని తల్లికి ఈ సమాజంలో స్థానం ఎలాంటిదో, జీవితం ఏ విధంగా గడుస్తుందో గ్రహించవచ్చు. ఆత్మహత్యకి పురికొల్పే పరిస్థితుల్ని కల్పిస్తుంది సమాజం. పెళ్లి కాని తల్లి కావాలని ఎవరూ కోరుకోనక్కర్లేదు. కాని, నీలిమ వంటి ధైర్యస్థులు పెరిగితే గాని సమాజంలో మార్పురాదు – అని తెలియజేస్తారు రచయిత్రి ఈ నవల ద్వారా.
”సమాజంకంటే కూడా వ్యక్తిత్వం గొప్పది”, ”మనిషి లేనిదే సమాజం ఎక్కడిది” అంటారామె.
సుదీర్ఘమైనవైనా, పదునైన సంభాషణలు రాయడం, సంభాషణల ద్వారానే సన్నివేశాలను రూపొందిస్తూ నవలని నడిపించడం, సంభాషణల ద్వారానే పాత్ర చిత్రణ చేయడం శారదా అశోకవర్థన్ నవలలోని శిల్ప, శైలీ లక్షణాలు, ప్రకృతి వర్ణనలూ, పరిసరాల వివరాలూ, పాత్రల వస్త్రధారణ, అలంకరణల వివరాలూ, విరివిగా లేకుండా, సంభాషణలతోనే నవలని రూపొందించడం వల్ల నవలని చకచకా చదివింపజేయడమే కాకుండా, ఆయా పాత్రల్ని పాఠకులు ఊహించుకోనవసరం లేకుండా, మన కళ్లముందు నిలిచేటట్లు చేస్తారు రచయిత్రి. శ్రీధర్ పాత్ర చిత్రణలో మాత్రం ముఖ్యంగా పొడుపుకథలూ పజిల్సూ చెప్పి ఎదుటి వారిని ఆకట్టుకోవడంలో ఈ నాటి కొందరు ప్రముఖ రచయితలు అనుసరించే పద్ధతి కనిపిస్తుంది.
మన నిత్య సంభాషణల్లో మనం అనాలోచితంగానే పురుషాధిక్యతని సూచించే పదాల్ని వాడుతూ ఉంటాం. చొరవచూపించే ఆడవాళ్ళని ”మగరాయుడిలాగ…” అనడం మనకి అలవాటయిపోయింది. ఈ నవలలోని స్త్రీ పాత్రలు కూడా అటువంటి ప్రయోగాలు చెయ్యడాన్ని బట్టి స్త్రీలు కూడా పురుషాధిక్యతని ఎంతగా జీర్ణించుకున్నారో, దాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఇటువంటి పదాల్ని వాడకుండా జాగ్రత్తపడటం, స్త్రీలని కించపరిచే పదాలతో ఆడవాళ్లని గాని మగవాళ్లని గాని నిందించకుండా ఉండటం మన ఆధునిక జీవన చైతన్యంలో భాగం కావాలి – సమాజంలో స్త్రీకి గౌరవం పెరగాలంటే.
పురాణ కాలం నుంచి నేటిదాకా పోషింపబడుతూ వస్తున్న మనస్తత్వాల్లో మార్పు తెచ్చేందుకూ, స్త్రీలలో ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం, స్త్రీ పురుషుల మధ్య సదవగాహనా పెంచేందుకూ నిరంతరం కృషి చేస్తున్న ఈ రచయిత్రి ఎంతగానో అభినందనీయులు.
”సంచనల రచయిత్రి”గా సత్కారాన్నీ, ఖ్యాతినీ పొందిన శ్రీమతి శారదా అశోక వర్థన్ తన మంచి నవలకి ముందు మాట రాసే గౌరవాన్ని నాకు కలుగజేయడం ఆమె సహృదయతకి నిదర్శనం.
(కుంతీపుత్రిక. శారదా అశోకవర్ధన్. 1996)
2. మహార్ణవ మథనం
‘మహార్ణవం’
”మెచ్చుకునే హృదయం వుండాలి. కాని ప్రతి వారిలోనూ ఏదో ఒక గొప్పతనం వుంటుంది” అని నమ్మే హృదయం, మేధ ఉన్న యువ రచయిత్రి శ్రీమతి శ్రీవల్లీ రాధిక. తన హృదయాన్ని స్పందింపజేసిన వ్యక్తుల్నీ, సంఘటనలనీ చిత్రించిన ఈమె కథలు సున్నితంగా, అనాయాసంగా చదివించేలా, ఆలోచనాత్మకంగా ఉంటాయి.
ఈ సంపుటిలో ఎక్కువగా స్త్రీ పురుష సంబంధాల గురించీ, స్త్రీ వ్యక్తిత్వం గురించీ, నేటి విద్యావిధానం గురించీ, యువత గురించీ, దేవుడి అస్తిత్వాన్ని గురించీ ఆలోచనాత్మకంగా రాసిన కథలు ఉన్నాయి. స్త్రీ పురుష సంబంధాల్లో – దాంపత్య ప్రేమనీ, భార్యా భర్తల మధ్య సంఘర్షణల్నీ, వయో భేదం ఎక్కువగా ఉన్న స్త్రీ పురుషుల మధ్య విలక్షణ అనుబంధాల్నీ చిత్రించిన కథలున్నాయి. మూఢాచారాలను ప్రశ్నించే కథలున్నాయి. మొత్తం మీద వైవిధ్యంతో కూడిన కథలున్నాయి ఈ సంపుటిలో.
రెండు కథల్లోని పురుషులు అమ్మాయిలకన్నా బాగా పెద్ద వాళ్ళు. ” నా స్నేహితుడు” అనే కథలో – ” నా స్నేహితుడు దేవుడు” అనీ, ”మీరంటే నాకు చాలా ఆరాధన, దేవుడేననుకునేటంత ఆరాధన” అంటుంది పక్కింటి ”అంకుల్”తో సంధ్య అనే అమ్మాయి. ఆ అమ్మయి చేత దేవుడు అనేవాడు లేడని నమ్మించడానికి, దేవుడిపైన ఉన్న మూఢభక్తిని తొలగించడానికీ ఆమెని ఒంటరిస్థలానికి తీసికెళ్ళి ఒక పరీక్ష పెడతాడు. ఆ అమ్మాయి ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా, తిరిగి వచ్చేటప్పుడు దారిలో అతనంతట అతనే ”గుడికి వెడదాం” అనేటట్లు చేస్తుంది. సంభాషణలూ, కథనం ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.
మరొరకం జంట గురించి రాసిన కథ ”మహార్ణవం”. ఇందులోని కథానాయకుడు కూడా కథానాయిక కన్న వయస్సులో పెద్దవాడే. చిన్నపిల్లగా పరిచయమై అతన్ని ఒక మేధావిగా స్నేహపూర్వకంగా అభిమానించి ఆరాధించిన అమ్మాయి సరిత, తర్వాత పెళ్ళి చేసుకుని, బిడ్డనికని కొన్నాళ్ళకి ఆ పసిపిల్లవాడ్ని తీసుకుని అతన్ని చూడటానికి వచ్చినప్పుడు అతను పసిపిల్లవాడి పట్ల చూపిన నిర్లక్ష్యం, అమానుష వైఖరి ఆమె ”మహార్ణవ” వ్యక్తిత్వాన్ని జాగృతం చేస్తుంది. సంభాషణల్లోనూ, కథనంలోనూ రచయిత్రి పరిణతి ప్రస్ఫుటమవుతుంది.
పురుషుడు చెపుతున్నట్లు సహజంగా రాసిన మరో కథ, ”యుగళగీతం”. పురుషుడు కథ చెపుతున్నట్లు రాయడం ఒక ”టెక్నిక్” గానే కాకుండా, ఒక ”వ్యూహం”గా ప్రయోగించినట్లనిపిస్తుంది. పురుషులు తమ్ము తాము అర్థం చేసుకుని స్వయంగా మారేటట్లు చేయడానికి ఉద్దేశించినట్లనిపిస్తుంది. పురుషుడు కోరుకునే ఆధిపత్యాన్నీ, స్త్రీ కోరుకునే స్వేచ్ఛనీ అందంగా, మృదువుగా, గెలుపు – ఓటమిల ప్రసక్తి తెస్తూ పురుష కంఠంతో చెప్పిన చక్కని స్త్రీవాద కథ – ”యుగళగీతం”. సంసారం యుగళగీతంలా సాగాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ కథలో చూపించినంత సులభంగా పురుషుడిలో ఆశించిన మార్పువస్తే అంతకన్న కావల్సిందేముంది!
వివాహం కాగానే స్త్రీకి భర్తే సర్వస్తం అనిపిస్తుంది సాధారణంగా తన ఆనందానికి భర్త మీదే ఆధారపడుతుంది. పురుషుడికి అలా కాదు – అతని జీవితంలో స్త్రీ ఒక భాగం మాత్రమే. పురుషుడి మీద పూర్తిగా ఆధారపడకుండా స్వీయ శక్తి మీద ఆధారపడినప్పుడు ఆమె కూడా వివాహానికి పూర్వం తాను అనుభవించిన ఆనందాన్నీ స్వేచ్ఛనీ అనుభవించగలుగుతుందనీ, నిరాశా నిస్పృహలకు చోటుందనీ చెప్పిన కథ ”స్వార్జితం”. ఆడపిల్లలందరూ నేర్చుకోవాలసిన పాఠం ఇది.
భార్యాభర్తలు పరస్పరం ప్రేమించుకోవడం సహజం. కానీ యిద్దరిలో తానే గొప్పగా ప్రేమిస్తాననే అహంభావాన్ని ప్రదర్శించడం, తను చూపే ప్రేమని ఇతరులు గుర్తించాలని తాపత్రయపడటం – అదంతా నాటకం అని తెలియజెప్పే కథ ”ప్రెజెంటేషన్”. ఇటువంటి బలహీనత చాలామందిలో ఉంటుంది. దాన్ని రచయిత్రి పరిశీలించడం, విశ్లేషించి చూపడం మెచ్చుకోదగిన విషయం.
స్త్రీలు పురుషులతో సమానత్వం కావాలంటారు – స్త్రీ పురుష సమానత్వానికి పడికట్టురాళ్ళు ఏమిటి పురుషుల దృష్టిలో, సమానత్వానికి స్త్రీలు ఇచ్చే నిర్వచనం ఏమిటి – అని నిత్య జీవితంలో ఎదురయే చిన్న చిన్న సంఘటనల ద్వారా తెలిపిన కథ ”పడికట్టురాళ్ళు”.
”మొగోడు కొట్టేదానికి కారణమెందుకు మేడమ్! అడికి బలముంది. కొడ్తడు. అంతే అంటుంది రిక్షా అతని భార్య సీతాలక్ష్మి – ”ఆస్తి” కథలో. రిక్షా అయితే తన సంపాదనతో ”కొనుకున్న” ఆస్తి కాబట్టి దాన్ని ”అపురూపం”గా చూసుకుంటాడు. అటువంటి మనిషే భార్యని మొరటుగా ”కొట్టడానికి కారణం సున్నితత్వం లేకపోవడం కాదు. ఆమె విలువ తెలియక పోవడం. భార్య అంటే అప్పనంగా వచ్చిన ఆస్తి అనే అభిప్రాయం నరనరంలోనూ జీర్ణించుకు పోవడం” అని కథకురాలు గ్రహించేటట్లు చేస్తుంది అనుభవజ్ఞురాలైన సీతాలక్ష్మి. అలాగే సారా ఉద్యమంలో పాల్గొన్న ఒక బడుగువర్గపు స్త్రీ గురించి వాస్తవికంగా రాసిన కథ ”ఉద్యమం”. ఇందులో ఆ స్త్రీ ఆత్మ విశ్వాసం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చేట్లుగా ఉంది.
ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ ఇంట్లో నియంతలా ప్రవర్తించిన వ్యక్తి వృద్ధాప్యంలో భార్యకి ఇంటి పనుల్లో సహాయపడుతూ ఆమెతో అన్యోన్యంగా ఉండటం చూసి మనవరాలు ఆశ్చర్యపోతుంది. చదువు నేర్పేది వేరు జీవితానుభవం నేర్పేది వేరు అనీ, ఎవరు నమ్మిన సిద్ధాంతాలు వారికి ఆనందాన్ని స్తాయనీ గ్రహిస్తుంది ”చదువు” అనే కథలో ఆ మనవరాలు.
ఒక మొగుడనేవాడు ఉంటేనే స్త్రీకి గౌరవం, పెళ్ళి కాని స్త్రీని లోకం బతకనివ్వదు, శవానికి అంత్యక్రియలు సక్రమంగా జరపకపోతే ఆ శవం దయ్యమవుతుంది వంటి మూఢ విశ్వాసాల గురించి ”తీర్మానం”, ”శవయాత్ర”, సంప్రదాయాలనైనా వేటినైనా వాటిలోని మంచిని అనుసరించడం, చెడుని ప్రశ్నించడం ఎంతవరకు చెయ్యాలి అని ఆలోచింపజేసే ”తిరుగుబాటు”, జీవితమంతా స్వేచ్ఛకి దూరమయిన స్త్రీని చిత్రించిన ”జీవితానికి దూరంగా…”, పరీక్షల్లో విద్యార్థులని అదుపు చేయలేని అధ్యాపకులను చిత్రించిన ”బలహీనత” మొదలైన కథలు వైవిధ్యపూరితంగా ఉన్నాయి.
ఆలోచనల్లో పరిణతి, అభివ్యక్తిలో భావుకత, చలాకీతనం వున్న రచయిత్రి శ్రీవల్లీ రాధిక అన్ని తరాల పాఠకుల్నీ ఆకట్టుకోగలదు. ఈమెకి నా అభినందనలూ, శుభాకాంక్షలూ!!
(మహార్ణవం. శ్రీవల్లీ రాధిక. 2000)
3. వాద సమ్మేళనం
‘కాబా కాశీకా మిలన్ : కథలు’
సంఘ సంస్కరణాభిలాషతో, ఆదర్శ భావాలతో కథారచయిత్రిగా ముందుకొచ్చిన తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి కనుపర్తి విజయబక్ష్ అభినందనీయురాలు.
నాతో ముఖ పరిచయం లేకపోయినా, తన కథల గురించి నన్ను పరిచయ వాక్యాలు రాయమనడం ఆమె ఉదారహృదయానికి నిదర్శనం.
కుటుంబాల్లోనూ, సమాజంలోనూ మానవసంబందాల్ని విమర్శనాత్మక దృష్టితో గమనించి, తన స్పందనల్ని స్పష్టంగా కథల ద్వారా తెలియజెప్పిన అభ్యుదయ రచయిత్రి విజయబక్ష్.
ఈ సంపుటంలోని 24 కథల్లో పది కథలు ఇంతకు ముందు ఏ పత్రికల్లోనూ ప్రచురితం కాని (?) కథలు. వాటిలో ‘కాబా కాశీకా మిలన్’ ఒకటి. ఇది ఈ సంపుటంలోని ఆఖరికథ. హిందూ ముస్లిమ్ మత సామరస్యాన్ని పరోక్షంగా ప్రబోధించే కథ. మతంపైన పెంచుకునే మమతకన్న మానవత్వం మిన్న అని తెలిపే కథ. ఈ రచయిత్రి వైవాహిక జీవితమే అందుకు ఒక ఉదాహరణ అనిపిస్తుంది.
హేతువాద దృక్పథం, మానవతా దృష్టీ ఉన్న రచయిత్రి కనుక, ఆమె కథలు కొన్ని ‘రాడికల్ హ్యూమనిస్ట్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. ప్రఖ్యాత రాజకీయ తత్త్వవేత్త, మానవతావాది ఎం.ఎన్. రాయ్ ప్రతిపాదించిన ‘రాడికల్ హ్యూమనిజమ్’ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ, ప్రచారం కొనసాగిస్తున్న పత్రిక ‘రాడికల్ హ్యూమనిస్ట్’. ఇందులో ప్రచురితమైన కథల్లో ఒకటి – ‘దీనికి పరిష్కారమేమిటి?’ గుడిసెల్లో కొట్టుకుంటున్న వాళ్ళు రక్తపాతం సృష్టిస్తే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం, వారిపై న్యాయవిచారణ చేయడం, నేరం చేసిన వారికి శిక్షవిధించడం జరుగుతుంది. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో కొందరు భర్తలు భార్యల్ని కొట్టి హింసించినా, ఆ భార్యలు కుటుంబ మర్యాదకోసం ఎవరితోనూ చెప్పుకోకుండా సర్దుకుపోవాల్సివస్తుంది. ఆ భర్తలకి శిక్ష ఎలాపడుతుందన్న ప్రశ్నకి పాఠకులు సమాధానం ఆలోచించాలి.
శివరాత్రి నాడు ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందో రాదో కాని, అడుక్కుతినడానికి వచ్చే వికలాంగులకు భోజనం పెడితే నిజంగా పుణ్యం వస్తుందని తెలియజెప్పే కథ ‘పుణ్యమంటే ఏది?’
ప్రేమించడానికి అడ్డుకాని కులమత భేదాలు పెళ్ళికి అడ్డువస్తాయని నమ్మి, తల్లి దండ్రులకి భయపడే పిరికి ప్రేమికుడిని అతని తండ్రి ఎదుట నిలబెట్టి ధైర్యంగా న్యాయంకోసం చాకచక్యంగా పోరాడిన ధీరవనిత కథ ‘పిరికి ప్రేమికుడి పెళ్లి.’
పురుషాధిక్య ‘సభ్య’ సమాజం అంగీకరించకపోవచ్చు. శీలం లేనిదని స్త్రీని మాత్రమే అగౌరవపరచడం, భాగస్వామి అయిన పురుషుణ్ణి పట్టించుకోకపోవడం అనే పక్షపాత ధోరణిని పోగొట్టడానికి ఉద్దేశించిన కథ ‘అర్హత’. వర్ణాంతర వివాహం చేసుకున్న స్త్రీని ఆదరించడం కన్న ‘శీలం చెడిన’ స్త్రీని ఆదరించడం ఎక్కు హర్షణీయమని సూచించే కథ ఇది.
అటువంటిదే, మరోరకం ఇతివృత్తం ద్వారా చెప్పినది ‘ఆచారమా అపచారమా?’ అనే కథ. ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికలో వచ్చిన కథ ఇది.
తండ్రి మరో స్త్రీతో కలిసినా కొంపలు మునిగిపోలేదు. సర్దుకుపొమ్మని తల్లికి సలహా ఇస్తారు పిల్లలు. ఈ వయస్సులో కోపంతో విడిపోతే తమకు చిక్కులు ఏర్పడతాయనీ, తమకి సంఘంలో గౌరవ మర్యాదలు పోతాయనీ చెబుతూ తల్లిని త్యాగం చెయ్యమని నిర్దేశించే పిల్లల్ని చూసి అవాక్కయిన తల్లి, చివరికి ఏం నిర్ణయం తీసుకుందో చెప్పేకథ ‘పాతకథే.’ ఇది ఈ సంపుటంలోని మొదటి కథ.
భార్యలపట్ల హింసాత్మకంగా, శత్రువుల్లాగ ప్రవర్తించే భర్తల గురించి రాసే స్త్రీవాద రచయిత్రుల్ని ‘పురుషద్వేషుల’ని చాలామంది విమర్శిస్తున్నారు. విజయబక్ష్ రాసిన ‘మగపశువు’ కథ చదివిన పాఠకులు ఏమంటారో మరి?!
అణిగి మణగి ఉన్న స్త్రీని పెద్దవాళ్ళూ కూడా ‘సర్దుకుపోవాల’ని శాసిస్తారనీ, జీవితం ప్రశాంతంగా గడవాలంటే జీవితాంతం సర్దుకుపోవడం తప్పదని వాస్తవంగా తెలుసుకున్న ఒక స్త్రీ కథ ‘సర్దుకుపో’.
పెళ్ళి అంటేనే స్త్రీకి అసహ్యం, భయం, రోతా కలిగించే అనుభవాలు ఎలా ఉంటాయో చూపించే కథ ‘పెళ్ళి’ కథ. ‘మగపిల్లల్ని పాలకులుగా, ఆడపిల్లల్ని బానిసలుగా చేసిన’ వ్యవస్థని విమర్శిస్తూ రాసిన కథ ‘పెళ్ళి తర్వాత మారేది ఇంటి పేరేనా?…’ మొత్తం స్త్రీ జీవిత స్వభావమే మారిపోవలసివస్తోందని చెప్పిన కథ.
ఈ రచయిత్రి కేవలం స్త్రీ పక్షపాతి కాదు. ప్రేమకో, త్యాగానికో మారుపేరు అమ్మ అన్న నమ్మకానికి విరుద్ధంగా, ‘అమ్మ అంటే క్రౌర్యం… అమ్మంటే నయవంచన’ అని ఆమె చెప్పిన కథ ‘అమ్మంటే’.
మొత్త మీద కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, స్త్రీ పురుష సంబంధాల్లోనూ రావల్సిన పరివర్తన గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, తన ఆలోచనల్ని పాఠకులతో పంచుకోవాలనే తపనతో, ఆర్తితో రాసిన కథలు ఇవి. కథా శిల్పంపట్ల మరింత శ్రద్ధ వహిస్తే ఈమె కథలు ఎంతో రాణిస్తాయి. హేతువాద, స్త్రీవాద, మానవతావాదాల్ని జీర్ణించుకున్న శ్రీమతి విజయబక్ష్ గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
(కాబా కాశికా మిలన్ కథలు. కనుపర్తి విజయ బక్ష్. 2002)
4. ప్రయోజనాత్మక కథలు
‘పేషెంట్ చెప్పే కథలు’
వైద్య వృత్తిలో వృత్తిధర్మం అడుగంటిపోతూ, వ్యాపారధోరణి అంతకంతకు పెరిగిపోతున్న ఈ కాలంలో ఆదర్శప్రాయురాలైన డా|| ఆలూరి విజయలక్ష్మి వంటి ఒక వైద్యురాలు ఇంకా మానవత్వానికి ప్రతీకగా నిలిచి ఉన్నారంటే అందరూ ప్రశంసించదగిన విషయం. దానికి తోడు డా|| విజయలక్ష్మిగారు భావుకురాలూ, సున్నిత మనస్కురాలూ అయిన కథా రచయిత్రి కావడం విశేషం.
రోగులు తమ శారీరక బాధల్ని వివరంగా చెప్పుకుంటుంటే పూర్తిగా వినడానికి తగిన సమయం, సహనం ఉండవు కొంతమంది వైద్యులకు. ఆ రోగుల శారీరక బాధల వెనక ఎటువంటి కౌటుంబిక, సామాజిక, రాజకీయ సమస్యలుంటాయో తెలుసుకోవలసిన అవసరం ఉందనుకోరు చాలామంది వైద్యులు. అటువంటి బాధల్ని చెప్పబోతే, మానసిక మైనవిగానూ, రోగులు ఊహించుకుంటున్నవి గానూ, వైద్యానికి సంబంధించని సమస్యలు గానూ కొట్టిపారేస్తారు.
డా|| ఆలూరి విజయలక్ష్మి కథల్లో ఆమెకి ప్రతిరూపంగా సృష్టించిన డా|| శ్రుతి, తన దగ్గరికి వచ్చే పేషంట్స్ పట్ల శ్రద్ధా, ఆప్యాయతా చూపించగల మానవి. ఆ రోగులకు కావల్సిన మనోధైర్యాన్ని ఇవ్వగల కరుణామయి. వారికి సంబంధించిన కుటుంబ సమస్యల్ని గాని, ఆర్థిక సమస్యల్ని గాని పరిష్కరించడంలోనూ, ఆ సమస్యల్ని సృష్టించే సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని సంస్కరించడంలోనూ వైద్యురాలిగా ఆమె రోగులకు పూర్తిగా సహాయపడలేకపోయినా, వారి సమస్యల్ని శ్రద్ధగా వినడమే ముందుగా వారికి కావల్సిన ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆమెకి తెలుసు. ఆమె ఇచ్చే సలహాలూ, సూచనలూ రోగులకు కావల్సిన మనోధైర్యాన్ని అందిస్తాయి.
వివిధ సామాజిక స్థాయిలకు చెందిన రకరకాల రోగులు డా|| విజయలక్ష్మి గారితో మనసు విప్పి చెప్పుకున్న బాధల్నీ, కష్టాల్నీ చిన్న చిన్న కథలుగా రాసి, పాఠకులకు అందించమని ప్రముఖ పత్రికా సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు దాదాపు రెండు దశాబ్దాల క్రితం డా|| విజయలక్ష్మిగారిని ప్రోత్సహించడం వల్ల తెలుగు పాఠకులకు ఎంతో మంచి జరిగింది. ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ‘పేషెంట్ చెప్పే కథలు’ శీర్షికతో అచ్చయిన వాటిని 1987లో అదే శీర్షికతో గ్రంథంగా ప్రచురించడం జరిగింది. అందులో 28 కథలున్నాయి. ఆ తరవాత రాసిన మరికొన్ని కథల్ని జతచేసి ఇప్పుడు మరొక సంపుటంగా ప్రచురించడం ప్రయోజనకరమైన, అభినందించదగిన కృషి.
వైద్యులు రోగి నాడి పట్టుకు చూడటం, స్టెతస్కోప్ పెట్టి ఛాతీ పరీక్షించడం, నోరు తెరిపించి నాలుకని పరీక్షించడం వంటివి పాతకాలపు పద్ధతులయిపోయాయి. రోగ పరీక్షలూ, రోగ నిర్ణయాలూ యాత్రికంగా (స్కానింగ్ ద్వారా) జరుగుతున్న ఈ రోజుల్లో, రోగుల్ని స్వయంగా పరీక్షించి, వారి కష్టసుఖాల్ని వినిపించుకుని, వారి గురించి ఆలోచించే డా|| శ్రుతి వంటి వైద్యురాలి చేతి చలవ ఎంతగా ఉంటుందో మనం ఊహించవచ్చు.
పేషంటు చెప్పేకథల్ని తాము విన్నవి విన్నట్లుగా అంటే డా|| శ్రుతి విన్నట్లుగా యథాతథంగా రాయలేదు డా|| విజయలక్ష్మిగారు. ఒక కథకురాలిగా శ్రుతి వైపునుంచీ, రోగుల వైపునుంచీ వారి వారి ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ, వారు ఎదుర్కొంటున్న సమస్యల్నీ, వారి చుట్టూ ఉన్న పరిసరాల్నీ, పరిస్థితుల్నీ సంక్షిప్తంగా, ఆసక్తికరంగా చిత్రిస్తూ ‘క్యాప్సూల్స్’ లాంటి చిన్న కథలు మూడు నాలుగు పేజీల చొప్పున రాశారు. ఈ కథల్లోని ముఖ్యలక్షణం సమస్యల్ని చిత్రించడమే – పరిష్కారాలు చూపడం కాదు. రోగుల శారీరక బాధలకు వైద్యం చేస్తూ, వారి బాధలకు కారణమైన సమస్యల్ని రోగులూ, పాఠకులూ అవగాహన చేసుకునేట్లు చేశారు డా|| విజయలక్ష్మిగారు. రోగులు చెప్పే కథల్ని డాక్టర్ శ్రద్ధగా వినడం వల్ల వారి సమస్యలకి పరిష్కారాలేమిటో కొన్ని సందర్భాల్లో వారికే స్ఫురించేటట్లు చేయగలిగారు.
ఈ కథలు చెప్పుకున్న పేషంట్స్ చాలామంది స్త్రీలే. మధ్యతరగతికీ, బడుగువర్గానికీ చెందిన స్త్రీలు, రోగులు చెప్పే కథలు వింటూ డా|| శ్రుతి స్పందించిన తీరులో రచయిత్రి డా|| ఆలూరి విజయలక్ష్మిగారి అభిప్రాయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆమె మొదటినుంచీ సమాజంలోని పురుషాధిపత్యాన్నీ, స్త్రీల అణచివేతనీ నిరసిస్తూనే ఉన్నారు. స్త్రీలు పురుషాధిపత్యాన్ని సహిస్తూ, కష్టాలు అనుభవిస్తూ నిస్సహాయంగా బలహీనులుగా ఉండ కూడదనీ, సంయమనాన్నీ, సామరస్య ధోరణినీ వదులుకోకుండానే, ఉన్న పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోమని స్నేహపూర్వకంగా ఉద్బోధిస్తూనే ఉన్నారు. స్త్రీలను హింసించే నీచధోరణిని మానుకుని, పురుషులు తమ మనస్తత్వాన్నీ, ప్రవర్తననీ మార్చుకోవలసిన అగత్యాన్ని సూచిస్తూనే ఉన్నారు.
అయితే డా|| విజయలక్ష్మిగారు ఏకపక్షంగా ఆలోచించలేదు. కొందరు స్త్రీలలోని చెడులక్షణాల్నీ, కొందరు పురుషుల మంచితనాన్నీ కూడా తమకథల్లోని కొన్ని పాత్రల ద్వారా చూపించారు. ఉదాహరణకి, ఈ కథా సంపుటంలో మొదటి కథే – ‘వీరనారి’ – ఒక ‘గయ్యాళి’ భార్య గురించి. ”మా ఆవిడ కొట్టింది అని సిగ్గుపడుతూ చెప్పాడు గోపాలం” అనే వ్యాకంతో మొదలవుతుంది కథ. ”నా భార్య ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. సినిమాల్లోలా చెట్టాపట్టాలేసుకుని చెట్లూ, గుట్టలూ పట్టుకుని తిరిగితే ఐదువేళ్ళూ నోట్లోకెళ్ళేదెలా?” అని ఆ భర్త చెప్పినదాన్ని బట్టి అసలు వ్యాధికి మూలం ఎక్కడుందో అర్థమవుతుంది. సినిమాల్లో ‘ప్రేమ’ పేరుతో చూపిస్తున్న యువతీ యువకుల వెర్రి చేష్టలూ, అనేక సందర్భాల్లో పురుషులు అనుసరించే హింసాత్మక ధోరణులూ సమాజంలో స్త్రీ పురుషుల్నీ, పిల్లల్నీ ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో చాలాకాలంగా చూస్తున్నాం. ఈ నాడు టి.వి.లో బూతు సినిమాలు చూసి యువతీ యువకులు ప్రభావితమై కొందరు పెడదార్లు తొక్కడం, మనోవైకల్యానికి గురికావడం చూస్తున్నాం. ఆ విధంగా ప్రభావితుడైన ఒక భర్త అమాయకురాలైన భార్యని హింసించడంతో భయ విహ్వలురాలైన ఆ అమ్మాయి చెప్పిన కథని ‘పొగచూరిన సంస్క ృతి’ అనే కథగా కొత్తగా రాశారు డా|| విజయలక్ష్మి గారు.
ఆధిపత్య ప్రదర్శన, ఆత్మన్యూనతాభావం, వైద్య విధానం పట్ల అజ్ఞానం, కుల వివక్ష, లింగ వివక్ష, ధనకాంక్ష, బాలికలపై అత్యాచారాలు, భర్తల్లో పరస్త్రీ వ్యామోహం, డబ్బుకోసం బలవంతంగా వ్యభిచారం చేయడం, పిల్లల్ని పెంచి పోషించలేని గర్భదారిద్య్రం, పెళ్ళిళ్ళు కావేమోనని ఉన్న జబ్బుని కప్పెట్టి సరియైన వైద్యం చేయించకపోవడం, యువకులు నీతి నియమాలను లెక్క చెయ్యకుండా, కష్టపడి పని చెయ్యకుండా సోమరితనాన్ని అలవరచుకోవడం, యువతులు చదువుసంధ్యల విూద శ్రద్ధ చూపించకుండా దైవభక్తిని పట్టుకుని భవిష్యత్తు అంటే భయపడటం, ఆడప్లిల సంపాదన విూద ఆధారపడుతూ కుటుంబ సభ్యులు ఆమెని దోపిడీ చెయ్యడం, ఒకవైపు డబ్బుకోసం రక్తాన్ని అమ్ముకుంటూ, అయినవారికి రక్తం ఇప్పించుకోలేని దారిద్య్రం, వస్తు వ్యామోహానికి లోబడి, స్త్రీలు అవినీతి మార్గాన్ని అవలంబించి డబ్బు సంపాదించడం మొదలైన అనేక సమస్యల్ని చిత్రిస్తూ, అవి స్త్రీ పురుషుల్లోనూ పిల్లల్లోనూ ఎటువంటి శారీరక, మానసిక వ్యాధులకు దారి తీస్తున్నాయో, సమాజం ఎటువంటి దుస్థితికి దిగజారుతోందో తెలుపుతూ, వాటి గురించి అందరూ సంస్కరణాత్మకంగా ఆలోచించాలనే పెద్ద ప్రయోజనంతో రాసిన చిన్న కథలు ”ఈ పెషంట్ చెప్పే కథలు”.
రోగుల బాధలకు కారణాలు చూపిస్తూ, ఈ అసాధారణమైన, సామాజిక ప్రయోజనంతో కూడిన కథలు ఆలోచనాత్మకంగా రాసిన డా|| ఆలూరి విజయలక్ష్మి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.a
(పేషెంట్ చెప్పే కథలు. డా. ఆలూరి విజయలక్ష్మి. 2వ ముద్రణ. 2003)
5. ఆహ్లాదకరం, ఆలోచనాత్మకం
‘ఎ. జయలక్ష్మీ రాజు కథలు’
కథావస్తువులోనూ, అభివ్యక్తిలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించిన శ్రీమతి ఎ.జయలక్ష్మిరాజు కథల సంపుటి కరివేపాకు వేసిన ‘మిక్చర్’లా ఉంది! వ్యంగ్యం, హాస్యం, గాంభీర్యం కలగలిసిన ఈ కథా సంపుటి ఆహ్లాదకరంగానూ, ఆలోచనాత్మకంగానూ ఉంటుంది పాఠకులకు. కుటుంబ జీవితంలోని, సామాజిక జీవితంలోని అనేక అంశాలకు దర్పణం ఈ సంపుటి. ఒక సామాన్య గృహిణి అయిన జయలక్ష్మిరాజుకి ఉన్న విస్తృత పరిశీలనా శక్తీ, నిశిత అవగాహనా శక్తీ అభినందనీయం.
ఈ సంపుటిలో బాగా చదివించే కథానికలతోపాటు, హాస్యం, ప్రయోజనం జోడించి రాసిన మరి కొన్ని మినీ కథలు కూడా ఉన్నాయి. అన్నీ మానవ సంబంధాల తీరుతెన్నుల గురించి రాసినవే. చేదుమాత్రలకు ‘షుగర్ కోటింగ్’ ఇచ్చినట్లుగా, పురుషాధిపత్యం గురించీ, స్వార్థపరత్వం గురించీ చెప్పే కథల్ని కూడా ఆహ్లాదకరంగా చిత్రించి పాఠకులు అనాయాసంగా స్వీకరించేటట్లు చేశారీ రచయిత్రి. ఉదాహరణకి, ‘మా ఆవిడ’ కథలో- తను చేసిన ప్రతిపనినీ గడుసుగా సమర్థించుకోగల భార్యని లోంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్న భర్త ఓ రోజున, ”జీవితమంతా పెళ్ళాన్ని కనీసం కసురుకోకుండానే గడిచి పోతుందేమోనని భయపడ్డాను, ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు. మగపుట్టుక పుట్టి పెళ్ళాన్ని ఓసారైనా తిట్టకుండానే వెళ్ళ మారిపోకుండా…” అనుకుంటాడు. ఇలాంటిదే మరో కథ ‘ఉల్లిపాయ కన్నీరు’. ఇందులోని కథానాయకుడికి చిన్నప్పటి నుంచీ ఆడప్లిల్ని ఏడిపించి ఆనందించడం సరదా. అటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నాడు. అందుకని, పెళ్ళి చేసుకుంటే హాయిగా జీవితాంతం భార్యన్ని ఏడిపించుకు తినొచ్చు కదా అనుకుంటాడు. తీరా చూస్తే, ఆ పిల్ల గడసరి. అతను ఎంత ఏడిపించాలని ప్రయత్పించినా నవ్వుతూ ఎదురు జవాబులు చెప్పి తప్పించుకునేది. ”పెళ్ళానికి రెండు కన్నీటి బొట్లు తెప్పించని తనదీ ఒక మగ బ్రతుకేనా? ఈ జీవితం ఇలా తెల్లారి పోవల్సిందేనా…” అని నిరాశా నిస్పృహలకు లోనవుతాడు. చివరికి వృద్ధాప్యంలో ఓ రోజున భార్య ఉల్లిపాయలు తరుగుతూంటే చూసి, ఆమెని ఏదో వంక పెట్టి తీవ్రంగా అవమానించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె నవ్వుతూ చేసిన వ్యాఖ్యలకి అతనికే కళ్ళనీళ్ళ పర్యంతమవుతుంది – చిత్తుగా ఓడిపోయినందుకు.
పురుషాధిపత్య సంప్రదాయాల్నీ, వరకట్న దురాచారాన్నీ, వాటి దుష్ఫలితాల్నీ ఖండిస్తూ తీవ్ర ధోరణిలో రాసిన ‘అరుంధతి’ అనే కథ కూడా ఉంది ఈ సంపుటంలో. ఈ కథ ముగింపు మరింత ఆవేశపూరితంగా ఉంది.
అడుగడుగునా అనుమానిస్తూ వేధించే భర్తకి కోర్డులో బుద్ధి చెప్పిన యువతి కథ ‘పుకారు’. భార్యాభర్తల సంఘర్షణల విషయంలో సామరస్య పూరితంగా రాసిన కథలు కూడా ఉన్నాయి. ‘ఇంటగెలిచి…’ అనే కథలో – భర్త తాగుబోతైనా, ఎటువంటి వాడైనా, అతన్ని మార్చడానికి ప్రయత్నించి అతనితోటే ఉండటం నయం – ఎటువంటి మగవాడైనా – మళ్ళీ ఇంకెవర్ని తోడు కోసం చేసుకున్నా జీవితంలో సుఖం ఉండదనీ, నచ్చనివాణ్ణి విడిచిపెట్టి ఒంటరిగా ఉండిపోవడంలో వివేకం లేదనీ ఒక పనిమనిషి కాపురాన్ని చూసి కథానాయిక గుణపాఠం నేర్చుకుంటుంది.
సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్న ఆడవాళ్ళకైనా చదువు అవసరమనీ, తన కాళ్ళమీద తను నిలబడగలిగే ఉద్యోగం అవసరమనీ చెప్పే కథ ‘చదువు’. ఇతరుల సహాయం మీద (పుట్టింటి వారిదైనా సరే) ”బతకడం అలవాటు చేసుకుంటే జీవితాంతం అలా ఆధార పడటమే జీవితంగా మారిపోయే ప్రమాదముంది” అని అబలల్ని హెచ్చరించే కథ ఇది.
ఈనాటి తరం వారిలో సినిమా ప్రభావానికి లోనైన ఒక అమాయకపు ఆడపిల్లకి వాస్తవికంగా మగవాడి మోసాన్ని నిరూపించి ‘ప్రేమ’ మత్తులోంచి మేల్కొల్పిన ఒక గృహిణి చెప్పిన కథ ‘నేటి తరం తీరు’.
మానవ సంబంధాలు మెరుగు పడాలని సూచించే కథల్లో ‘కరివేప’ చెప్పుకోదగిన కథ. తమ పనులు జరగడానికి ఇతరులను ఉపయోగించుకోవడం, ఇతరులు సహాయ పడటం మామూలే. కానీ అలా ఉపయోగపడిన వారినీ, సహాయపడిన వారినీ గుర్తు పెట్టుకోకపోవడం, అగౌరవించడం సభ్యత కాదు. కూరల్లో కరివేపాకుని కావాలని వేసి, తరవాత తినేటప్పుడు పక్కకి తోసి పారేసినట్లు మనుషుల్ని చెయ్యకూడదని చెప్పేకథ ‘కరివేప’.
పెరట్లో పెంచిన పెద్ద చెట్లను స్వార్థంతో నరికి పారెయ్యకూడదని రెండు కోణాల నుంచి చెప్పిన కథలు ‘తల్లి’, ‘చివరి మాట’. మధ్య తరగతి జీవితాల్లో ఎదురయ్యే కష్టాల గురించి కథలే కాదు. ‘కరువు’ వంటి దుస్థితిలో కూడా ధనవంతులు కొందరు నిస్సహాయులైన నిరుపేదలతో, ముఖ్యంగా స్త్రీలతో ఎంత నీచంగా ప్రవర్తిస్తారో చెప్పే కథ – ‘ఇది కథకాదు’ కూడా రాశారు.
మన పనులు సవ్యంగా సాగాలంటే మనకి ‘పనిమనుషుల’ అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక ఉద్యోగినిని టి.వి. ఇంటర్వ్యూలో, ఆవిడ విజయానికి కారణం ఎవరని అడిగితే, ”మా పనిమనిషి” అని సమాధానం ఇస్తుందావిడ ‘పావని – పని మనిషి’ కథలో. ఇటువంటి కొత్త ఆలోచనలతో, తనదైన శైలిలో ఇక ముందు కూడా శ్రీమతి జయలక్ష్మి రాజు ఇంకా ఎన్నో మంచి కథలు రాస్తారని ఆశిస్తున్నాను. ఆమెని అభినందిస్తున్నాను.
(పొగబండి నేస్తం : కథలు. ఎ.జయలక్ష్మీ రాజు. 2004)
6. అభినందన
‘వైవిధ్యం’
ఇంతవరకు నవలా రచయిత్రిగా, కవయిత్రిగా గుర్తింపు పొందిన శ్రీమతి రావులపల్లి సునీత ఇప్పుడు కొన్ని కథల్నీ వ్యాసాల్నీ కలిపి ‘వైవిధ్యం’ అనే సంపుటిని వెలువరించి, వివిధ ప్రక్రియల ద్వారా తన మానవీయ దృక్పథాన్ని చాటుకుంటోంది. సునీత కవితా సంపుటి ‘అన్వేషి’ని చదివిన వారికి ఆమె ఆలోచనా విధానం పరిచయమయే ఉంటుంది. స్త్రీల పట్లా, సమాజంలోని ఇతర బాధితులపట్లా చైతన్యవంతంగానూ, బాధ్యతాయుతంగానూ ఆలోచించే వ్యక్తి ఆమె. ఇతరుల సంగతి నాకెందుకు అనుకునే సంకుచిత స్వభావం కాదు సునీతది. అందులోనూ వైద్య రంగంతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిగా ఆమె స్పందనలు అభినందనీయమైనవి.
రచయిత్రిగా సమాజ శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ వివిధ రచనలు చేసిన సునీత కథల్లోని ముఖ్య పాత్రలు కూడా అదే విధంగా ఇతరుల కష్టాల గురించి పట్టించుకుని, వారి సమస్యల గురించి పరిష్కారం దిశగా, ఆచరణాత్మకంగా ఆలోచించే వ్యక్తుల పాత్రలు.
మొదటి కథ ‘సాధ్వీ దేశం’లో కాలేజీ వాతావరణం చిత్రించబడింది. ఒక అధ్యాపకుడు ఒక విద్యార్థినిని మానసికంగా లైంగిక వేధింపుకి గురి చేసిన వైనాన్నీ, ఆ లెక్చరర్ బుద్ధి తెచ్చుకునేలా ఒక లేటీ లెక్చరర్ నాయకత్వంలో అందరూ నిరసన వ్యక్తం చేసిన వైనాన్ని చిత్రించిన కథ. కథనం సూటిగా, స్పష్టంగా, నిష్కర్షగా సాగుతుంది. ”ఎన్నిసార్లు మోసపోయినా, మొగుడి బోలు మాటల్ని, మాయ మాటల్ని మళ్ళీ మళ్ళీ నమ్మే పతివ్రతా భార్యామణులు కోకొల్లలున్న సాత్విక దేశమిది” అంటారు రచయిత్రి వ్యంగ్యంగా – నేరం చేసిన భర్తని వెనకేసుకొచ్చిన భార్యని ఉద్దేశించి. నిరసన చేయమని అందరినీ రెచ్చగొట్టిన లెక్చరర్ సంధ్యపై పుకార్లు లేవదీసి, ఇలాంటి దానికి ”ఇక ఈ జన్మకి పెళ్ళి కాదు” అని కొందరు వ్యాఖ్యానిస్తే, ”పెళ్ళా? ఎవడిక్కావాలి పెళ్ళి ? నా జీవితాన్ని కాల్చుకుతినే మగాడు నాకక్కర లేదు. అంతకన్నా ఉత్తముడు దొరికినప్పుడు కదా!” అని జవాబు చెబుతుంది సంధ్య.
సారా ఉద్యమంలాంటి ఉద్యమాలు ఎన్ని బయలుదేరినా, సారా వ్యాపారం ఒకచోట కాకపోతే మరో చోట వర్థిల్లుతూనే ఉంటుందన్న నగ్న సత్యాన్ని చెప్పిన కథ ‘పాపపు డబ్బు’. సారా వ్యాపారంతో గడించిన డబ్బుతో ఓ మంచి పని చేద్దామని ఒక విద్యా సంస్థని ప్రారంభించినా, ఆ ”పాపపు డబ్బు”తో విద్యా వ్యాపారం చేసేవాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీస్తారు మరికొందరు. తత్ఫలితంగా సారా వ్యాపారమే లాభసాటి అనుకుని మరో ప్రాంతంలో ప్రారంభించిన వైనం ఈ కథ.
తుఫానుకి గురై తిండీ తిప్పలూ లేకుండా అల్లాడిపోతున్న నిరుపేదలకి కంటితుడుపు చర్యగా చేసే సేవా కార్యక్రమాన్ని పౌరుషంతో వాళ్ళు తిరస్కరించడాన్ని చిత్రించిన కథ ‘తుఫాను’.
ఇంట్లో పనిమనిషి లేనిదే మనదేశంలో ఏ గృహిణికీ గడవదు. అయితే పనిమనిషికి తగిన జీతం ఇవ్వడం, ధరలతో పాటు జీతాన్ని పెంచడం, ఇవీ అవీ ఇచ్చి ఆకట్టుకోవడం చెయ్యకపోతే, ఏ పనిమనిషీ పట్టుమని పదిరోజులు పని చెయ్యదు. మనిషిలో కనీసం జాలి అనేది ఉంటే, ఎందుటి వాళ్ళ శ్రమని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కానీ, ‘జాలి’ని తమ కనుకూలంగా మలుచుకునే అమానుష ఆర్థిక మానవ సంబంధాల గురించి చెప్పేదే ‘జాలి’ కథ!
సునీత కథల్లోని ఇతివృత్తాలు వాస్తవ జీవితాల్ని చూసి స్పందించి, సామాజిక సంస్కరణనీ, వ్యక్తుల్లో రావల్సిన మార్పునీ దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. పిల్లలుండగా, భార్యపోతే మళ్ళీ పెళ్ళి చేసుకునే భర్త రెండో భార్యపై విధించే అమానవీయ ఆంక్షల గురించి అయినా, పిల్లల్ని అనవసరంగా తీవ్రంగా తిట్టి కొట్టేలాగా అమ్మలను పురికొల్పే అసలు పరిస్థితుల గురించి అయినా, ఎదిగిన కొడుకుల స్నేహసంబంధాల విషయంలో కూడా క్రూరంగా అజమాయిషీ చేసే తండ్రులను నిరసించి, కొడుకులు తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం గురించి అయినా – మానవ సంబంధాలు మెరుగుపడాలంటే, మనుషుల్లో ఇతరుల కష్టాలపట్ల అవగాహన, కరుణ, ప్రేమ ఉండాలనే సదాశయంతో రాసిన కథలు సునీత కథలు. వీటిలో ముఖ్యంగా, ‘మారుమూల మంచుకొండ’, ‘సిల్వియా’ అనే కథల్లోని ‘యాత్రా కథనం’తో పాటు మానవత్వపు పరిమళం పాఠకులను ఆకట్టుకుంటుంది. స్నేహానికీ మానవత్వానికీ ప్రతీకగా చెప్పుకోదగిన కథ ‘సిల్వియా’. ”ఇండియాలో అన్నీ చీప్ అని విన్నాను. కానీ మనిషి శ్రమ ఇంత చీప్ అని ఊహించలేదు…” అంటుంది చేతి రిక్షాలో ”స్వారి” చెయ్యడం ఎంత దారుణ విషయమో గ్రహించిన ఒక విదేశీ వనిత. అలాగే, సెక్స్ గురించి శాస్త్రీయంగా రాసిన పుస్తకాల్ని చదవడం గురించీ, స్త్రీ పురుషుల మధ్య స్నేహ సంబంధాల గురించీ, మనకీ విదేశీయులకీ ఆలోచనల్లో ఉండే తేడాని కూడా చక్కగా చూపించింది రచయిత్రి ‘సిల్వియా’ కథలో.
ఈ సంపుటంలో కథలే కాక, కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. స్వానుభవంతో, విషయ పరిజ్ఞానంతో వైద్యరంగానికి సంబంధించిన ఇందులోని వ్యాసాలు పాఠకులకు విజ్ఞానదాయకంగానూ, ప్రయోజనకరంగానూ ఉంటాయి. సునీత, కథలనైనా, వ్యాసాలనైనా వాటి ప్రత్యేక శిల్పాన్నీ, శైలినీ శ్రద్ధగా పోషిస్తూ, మరింత దీక్షగా సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
(వైవిధ్యం : కథల సంపుటి – రావులపల్లి, సునీత. 2005)
7. కోమల రాజకీయం
‘కోమలి గాంధారం’
డాక్టర్ మృణాళిని సరికొత్త సృజన ‘కోమలి గాంధారం’ స్త్రీ వాద కథా సాహిత్యంతో ఒక విలక్షణ ప్రయోగం.
తెలుగు సాహిత్యంలో మునిమాణిక్యం నరసింహారావు గారి ‘కాంతం కథలు’, భానుమతీ రామకృష్ణ గారి ‘అత్తగారి కథలు’ తరవాత, ఆధునిక తెలుగు సంసారపు ముచ్చట్లతో పాఠకుల్ని సున్నితంగా గిలిగింతలు పెట్టిన రచన ‘కోమలి గాంధారం’. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి ‘ఇల్లాలి ముచ్చట్లు’ శిల్పరీత్యా కథాసాహిత్యం కిందికి రావు.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిలా చతుర సంభాషణలతో నడిపించిన కథలు ఇవి.
ఈ సంపుటిలోనివన్నీ వేరు వేరు కథలైనప్పటికీ, అన్నీ కోమలి అనే ఆధునిక స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే కథలే. కథలన్నిటినీ దారంలా కలిపే శీర్షికతో పాటు, ప్రతి కథకీ ఒక ప్రత్యేక శీర్షిక ఉంది. కోమలి భర్తా (కో.భ), కోమలి అత్తగారూ, మామగారూ, కోమలి తమ్ముడూ, కోమలి స్నేహితులూ, కోమలి భర్త స్నేహితులూ, తోటి ఉద్యోగులూ, వారి భార్యలూ, బాస్‌లూ మొదలైన వారు సందర్భానుసారంగా ఈ కథల్లో కనిపించే పాత్రలు. ఈ కథలన్నీ కోమలి కథలో భాగాలే అయినా, అన్నింటికీ కలిపి ఒక ఆరంభం, ముగింపు వంటివి లేవు కనుక ఇవి నవలా రూపంలో ఇమిడ్చిన కథలు కావు. ఏ సన్నివేశానికా సన్నివేశం ఒక కథలా రూపుదిద్దుకుంది. ప్రతి కథలోనూ ఒక సమస్య, దానికొక ప్రారంభం, ఒక ముగింపూ ఉండటంతో, ప్రతి సన్నివేశ చిత్రణా ఒక కథానికా రూపాన్ని సంతరించుకుంది.
‘కోమలి గాంధారం’ కథల్లో ఎన్నో రకాల సన్నివేశాలను చిత్రించారు మృణాళిని – నిత్యజీవితంలో ఎందరో స్త్రీ పురుషులు ఇళ్లలోనూ, ఉద్యోగస్థలాల్లోనూ ఎదుర్కొనే సన్నివేశాల్లాంటివే. మనోనేత్రాలతో గమనించాలే గాని, కథలకు పనికి వచ్చే అంశాలకు కొదవ ఉండదని నిరూపించారు మృణాళిని. ఇవి చాలా వరకు స్త్రీ వాద దృక్పథంలో చూసిన సందర్భాలూ, కోమలి ఉద్యోగ వ్యవహారాల్లో భర్త వ్యవహరించే విధానం మొదలైన అంశాలెన్నిటినో తీసుకున్నారు. ఉదాహరణకి ‘న్యూ ఇయర్ సంసారం’, ‘స్వర్ణోత్సవ సంసారం’, ‘ఆదర్శ దంపతులు’ సాధారణంగా మనకి కనిపించే గౌరవప్రదమైన మధ్యతరగతి సంసారాల్లోని భర్తల ప్రవర్తనపై వేసిన చురకలు!
”ఏ బార్యాభర్తల్ని గురించి రాసినా… సంకీర్ణ ప్రభుత్వం” గురించి రాసినట్లే! అన్నారు ‘మూడిన కాలం’ కథలో. ఇంటిపనులూ బయట పనులూ అన్నీ భార్యే నిర్వహించగలిగినపుడు, నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంక ‘ఆయన దేనికి?’ అని మరో కథ రాశారు. ‘భార్య బదిలీ, ‘రిపోర్టు తండ్రి’, ‘స్వేచ్ఛాపిపాస’, ‘భరించువాడు’ వంటి కథలు కుటుంబాల్లో భార్యాభర్తల అసమానత్వం ఎలా ఉంటోందో చూపిస్తాయి.
‘మాయదారి ముగ్గు’, ‘నోమిని’ వంటి కథలు – సంప్రదాయ సమాజం ఆడవాళ్లని మొదటి నుంచీ ఏవిధంగా రూపొందించిందో, ఆధునిక సమాజంలో అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూపించే కథలు.
పురుషాధిక్యత నిత్యజీవితంలోనే కాకుండా, సాహిత్యవిమర్శలో కూడా ఎలా వ్యక్తమవుతుందో చూపించారు మృణాళిని ‘స్త్రీవాద విమర్శకుడు’ కథలో. స్త్రీ వాద రచయిత్రులు ఎవరో, వాళ్లేం రాశారో చదవకుండా, అర్థం చేసుకోకుండా విమర్శించే వాళ్ల మీద విసురు ఈ కథ. ”విమర్శించడానికి పుస్తకాలు చదవాలా ఏం?’ అంటాడు భర్త ఆ కథలో. ‘ఆమె భర్త’, ‘ప్రోత్సహించే భర్త’ – రచయిత్రుల భర్తల గురించి వ్యంగ్య పూరితంగా రాసిన కథలు.
ఆడవాళ్లే సంప్రదాయాలనూ ఆచారాలనూ పాటించాలి, నిలబెట్టాలి అనే సూత్రాన్ని ఖండించే కథ ‘భారతీయ భార్య’.
భార్యాభర్తల ఆర్థిక సంబంధాలనూ, కుటుంబ బాధ్యతల్లో వారి పాత్రలనూ చిత్రించే కథలు ఇందులో ఉన్నాయి. ‘సమ్మె విలాపం’, ‘ఎన్నికల్లో అబల’ మొదలైనవి ఆఫీసుల్లో స్త్రీ పురుష వ్యత్యాసాన్నీ, వివక్షనీ చూపించే కథలు. ఇలా ఎన్నో సందర్భాలను తీసుకుని సరదాగా చదువుకునేట్లుగానూ, ఆలోచింపచేసేట్లు గానూ కూడా రాసిన కథలు ఈ ‘కోమలిగాంధారం’ కథలు.
స్త్రీ వాద రచనల్లో ‘కోమలి గాంధారం’ ఒక విశిష్ట స్థానంలో నిలుస్తుంది. స్త్రీ వాద రచయిత్రులు సాధారణంగా తమ రచనల్లో ‘పురుష ద్వేషాన్ని’ – ముఖ్యంగా భార్య భర్తపై ద్వేషాన్ని ప్రదర్శించడం జరుగుతోందనే విమర్శ ఉంది. స్త్రీ వాద రచయిత్రిగా మృణాళిని ఈ రచనలో ఒక కొత్త ‘పంథా’ని – విమర్శనాతీతమైన ‘పంథా’ని – అనుసరించారు. భర్తనీ, ఇతర పురుషుల్నీ – అంటే, వారి ఆధిపత్యాన్ని తీవ్రంగా విమర్శించకుండానే, పెద్ద పెద్ద వాదనలు లేకుండానే, క్లుప్తంగా, సూచనప్రాయంగా, వారిలోని పురుషాధిక్యతని హాస్యస్ఫోరకంగా చిత్రించడం (బయట పెట్టడం) ‘కోమలి గాంధారం’ ప్రత్యేకత.
ఈ కథలు పుస్తక రూపంలోకి వస్తూండగానే, ఆలిండియా రేడియో నుంచి ధారావాహికంగా ప్రసారం కావడం, అందులో మృణాళిని స్వయంగా కోమలి పాత్ర వహించడం ఆమె బహుముఖ ప్రజ్ఞకి నిదర్శనం.
డా. మృణాళినికి నా హృదయపూర్వక అభినందనలు !
(కోమలి గాంధారం : పురుష సమాజం పోకడలపై నేటి మహిళ
సన్నాయి నొక్కులు. డా.సి. మృణాళిని. 2005)
8. వెలుగు దారి దిశగా
‘చీకట్లో వేగుచుక్క’
జీవితం నుంచి మొలకెత్తిన కథలు ఎప్పుడూ సహజంగా, శక్తిమంతంగా ఉంటాయి. శ్రీమతి జి. విజయలక్ష్మి కథలు కూడా జీవితానుభవాల నుంచి ఉద్భవించినవే. అందుకే అవి హృదయాన్ని స్ప ృశిస్తాయి, మనస్సుని కుదుపుతాయి, సానుభూతిని కలిగిస్తాయి, ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి.
జీవితంలో ఇబ్బందుల్నీ, కష్టాల్నీ ఎదుర్కోని వాళ్ళుండరు. కానీ వాటికి లొంగిపోకుండా, వాటి భారానికి కుంగిపోకుండా, ధైర్యంగా నిలబడి, తమకి అనువైన పరిష్కారాల్ని ఎంచుకుని, జీవితాన్ని తమకి నచ్చిన బాట వైపుకి తిప్పుకోగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళు తమ అనుభవజ్ఞానంతో, సాధించిన పరిణతితో ఇతరులకి మార్గదర్శకులవుతారు. అటువంటి వ్యక్తి చేసే రచనల్లో నిజాయితీ ఉంటుంది.
స్వయంగా వికసింపజేసుకున్న వ్యక్తిత్వంతోపాటు మంచి అభివ్యక్తి ఉన్న రచయిత్రి విజయలక్ష్మి. సున్నితత్వంతోపాటు పదును కూడా ఉన్న అభివ్యక్తి ఆమెది. వచన కవిత్వంతో ప్రారంభించిన ఈమె, కథలు కూడా రాయడం తనలో ఉబికే అభివ్యక్తికి తగినంత అవకాశాన్నివ్వడానికే. కవితలో అయితే మనసులో ఉన్న దాన్ని మరీ సంక్షిప్తం చేసి లయాత్మకంగా చెప్పవలసి ఉంటుంది. మరింత స్వేచ్ఛగా, సహజంగా తన భావాలను చెప్పాలనుకోవడంతో పాటు, తను చూసిన, తనకి సంబంధించిన కొందరి మనస్తత్వాల్నీ, ప్రవర్తననీ చిత్రించి చూపాలనుకున్నప్పుడు కథా ప్రక్రియని ఎంచుకోవలసి ఉంటుంది. విజయలక్ష్మి కథలు రాయడం అందుకే. ఈమె కథలు చాలా వరకు ఆకాశవాణి శ్రోతలకోసం రాసినవి. అందుకే ఈమెకి కథ చెప్పే శైలి బాగా అలవడింది. అనవసరపు వర్ణనలకూ, వివరాలకూ పోకుండా చక్కగా, సూటిగా, పదునుగా ఆకట్టుకునేట్లుగా కథ చెప్పడం విజయలక్ష్మికి బాగా అలవడింది. ఆమె కథలు చకచకా చదివిస్తాయి. సంపుటిని చేతిలోకి తీసుకున్నాక రెండు మూడు కథలు చదివి ఊరుకోబుద్ధి కాదు. తరవాతి కథల్లో ఏముందో, ఏంచెప్పిందో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. ఈమె తీసుకున్న సమస్యలు అటువంటివి. స్త్రీలు కుటుంబంలోనూ, సమాజంలోనూ నేడు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీసుకుని, వాటి నుంచి ఏవిధంగా బయట పడాలో నిస్సంకోచంగా, నిర్భయంగా, ఆచరణాత్మకంగా చూపిస్తుందీ రచయిత్రి. సామాజిక బాధ్యతా, రాజకీయ చైతన్యం ఉన్న రచయిత్రి ఈమె. ఈమె అభిప్రాయాలు నిర్దిష్టంగా ఉంటాయి. సాటి స్త్రీలకి ధైర్యాన్ని కలిగించే కథలివి. ‘అగ్నిపుత్రిక’, ‘చీకట్లో వేగుచుక్క’ వంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణలు.
విజయలక్ష్మి చిత్రించిన సమస్యలకి చూపించిన పరిష్కారాలు కొన్ని సంస్కరణాత్మకంగానూ, కొన్ని విప్లవాత్మకంగానూ ఉన్నాయి. కొన్ని ఆదర్శప్రాయంగా అనిపించినా, అనుసరణీయంగా ఉన్నాయి.
ఈ సంపుటిలోని ఆఖరికథ పెంపుడు కుక్క ‘లిక్కు’ గురించి రాసిన పెద్ద కథ. మానవత్వం అంటే ఏమిటో ఆచరణాత్మకంగా ఈ కథలో చూపించిందీ రచయిత్రి.
చదవదగిన కథల్నీ, చదివించే కథల్నీ రాసిన శ్రీమతి విజయలక్ష్మికి అభినందనలు.
ఈమె సాహితీ ప్రస్థానం వెలుగు దారి దిశగా ఇలాగే ప్రయోజనాత్మకంగా సాగుతుందని నమ్ముతున్నాను. ఈమెకి నా శుభాకాంక్షలు.
(చీకట్లో వేగుచుక్క. జి. విజయలక్ష్మి. 2005)
9. సందేశాత్మక కథలు
‘ఇదే ధర్మమా? … కథల సంపుటి’
ఎన్నో కథలు చదువుతూంటాం. చదివిన కథలన్నీ గుర్తుండవు. బాగా పేరున్న రచయితవో రచయిత్రివో కొన్ని కథలు ప్రఖ్యాతి చెందినవి మాత్రమే గుర్తుంటాయి సాధారణంగా. కొన్ని కథలు వాటంతటవి గుర్తుండిపోతాయి – రచయిత ఎవరో గుర్తులేకపోయినా, ఆ కథల్లోని వస్తువో, కథనరీతో ఏదో గుర్తుంచుకునేలా చేస్తుంది. అలా నాకు గుర్తుండిపోయిన ఒక కథని ‘నవ్య’ వారపత్రికలో నేను ‘కాలమ్’ రాస్తున్నప్పుడు ఒక సందర్భంలో ప్రస్తావించి, రచయిత ఎవరో గుర్తులేదని రాశాను. ఆ ‘కాలమ్’ చదివిన శ్రీమతి గంటి భానుమతి నా టెలిఫోన్ నంబరు కనుక్కుని, నాకు ఫోన్‌చేసి, ఆ కథని తనే దాదాపు పదిహేనేళ్ళ క్రితం రాసినట్లు చెప్పారు! నాకు భానుమతి గారితో పరిచయం ఆ విధంగా జరిగింది. కథా రచయిత్రిగా ఆమెపేరు సుపరిచితమైనా, ఆమె కథలు కొన్నిటిని ఒకేసారి చదివే అవకాశం ఇప్పుడు కలిగింది.
ఈ సంపుటిలో 14కథలూ ఏదో ఒక సందేశంతో కూడిన కథలే. కుటుంబసంబంధాల గురించి విశ్లేషణాత్మకంగా, పిల్లల పెంపకం గురించి వివేచనాత్మకంగా రాసిన కథలున్నాయి ఇందులో. దాదాపు అన్నీ మధ్యతరగతి ఆధునిక స్త్రీల అనుభవాల ఆధారంగా రాసినవే. వీటిలో పది కథలు ఉత్తమ పురుషలో ‘నేను’ అంటూ రాసినవి. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలూ, అసమానతలూ గురించిరాసినా, ఈనాటి యువతుల ఆవేశాలూ, ఆత్మాభిమానాలూ గురించి రాసినా, కథల ముగింపులో ఒక ఆశావాద దృక్పథమో, జీవితంపట్ల ఒక అవగాహనో, ఒక సమన్వయ లక్షణమో కనిపిస్తుంది. అందులోనే రచయిత్రి తన ప్రధానపాత్రలో పరిణత మనస్తత్వాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. దాదాపు అన్నికథల్లోనూ రచయిత్రి వివేచనా శక్తి ప్రస్ఫుటమవుతుంది. వ్యక్తి స్వేచ్ఛ, కుటుంబ బాధ్యతల మధ్య ధర్మాధర్మ విచక్షణా, వివేచనా ప్రదర్శించిన కథలు – ‘ఇదే ధర్మం’, ‘జీవితాన్ని ప్రేమించు’, ‘ఇంట్లో విగ్రహాలు’, ‘కొత్తరెమ్మలు’, ‘బంధం’, ‘త్రిశంకు జీవితం’.
ఆడపిల్లల్ని సంప్రదాయబద్ధంగా పెంచినా, ఆధునికంగా స్వేచ్ఛనిచ్చి పెంచినా, సమస్యలు తప్పడంలేదు తల్లిదండ్రులకీ పిల్లలకీ కూడా. ఎంత క్రమశిక్షణతో పెంచినా, ఎంత ఆదర్శప్రాయంగా పెంచినా, పరిసరాలూ పరిస్థితులూ యువతని ప్రభావితం చేసి, తల్లిదండ్రుల ఆశల్ని తలక్రిందులు చేస్తాయి. అటువంటి సంక్లిష్ట సమయాల్లో పెద్దలూ, పిల్లలూ ఎలా ప్రవర్తించాలో సూచించిన కథలు – ‘మాతృప్రేమ’, ‘తెలిసి చేస్తున్న తప్పు’. ఆధునికత, ప్రపంచీకరణ ప్రభావాల్లో పడిన ఈనాటి చాలామంది తల్లిదండ్రులకి వర్తిస్తుంది. అందరికీ ఒక గుణపాఠం నేర్పుతుంది, నేర్చుకోదలచుకుంటే. మొత్తంమీద తల్లిదండ్రుల్నీ, పిల్లలన్నీ చైతన్యవంతుల్ని చేసే ప్రయోజనాత్మకమైన కథలు.
వంటింట్లో తమ సామ్రాజ్యం, సర్వస్వంఅనుకునే గృహిణులకి కనువిప్పు కలిగించే కథ ‘కూలిపోయిన సామ్రాజ్యం’. ఏ ఆశకయినా, మమకారానికైనా హద్దు ఉండాలనీ, ఎన్ని సంపదలూ సౌకర్యాలూ సమకూర్చుకున్నా, వాటివల్ల మాత్రమే సంతోషం కలుగుతుందనుకోవడం భ్రమఅనీ తెలియజెప్పే కథ ఇది.
ఈనాటికీ మూఢవిశ్వాసాలకీ, మౌఢ్యానికీ గురవుతూనే ఉన్నారు అనేకమంది. దేవుళ్ళూ, దేవతలూ, అమ్మవార్లూ అంటూ అమాయకురాళ్ళని దోపిడీ చెయ్యడం, బలిచేయడం, ప్రజల్ని మోసం చేసిడబ్బు చేసుకోవడం జరుగుతున్న వైనాన్ని చిత్రించిన కథకూడా ఒకటి ఈ సంపుటంలో ఉంది.
ప్రేమించి పెళ్ళిచేసుకున్నవాడు ఒక దుర్ఘటనలో హఠాత్తుగా మరణిస్తే, దుఃఖంలో కూరుకుపోయే బదులు, అతని అవయవాల్ని సహృదయంతో దానంచేస్తే ఎంతోమంది ద్వారా అతను చిరంజీవిగా నిలుస్తాడని చెప్పిన కథ ‘చిరంజీవి శతాయుష్షు’.
వైవిధ్యపూరితమైన, ప్రయోజనాత్మకమైన కథలతో, వివేచనా పూరితమైన సంభాషణలతో, వ్యాఖ్యలతో సంపన్నమైన సంపుటి ఇది.
శ్రీమతి గంటి భానుమతిగారికి అభినందనలు!
(ఇదే ధర్మమా?… కథల సంపుటి. గంటి భానుమతి. 2006)
‘ఎంత సుదీర్ఘవిూ జీవితం : కథల సంపుటి’
శ్రీమతి గంటి భానుమతిగారి మరోకథాసంపుటికి కూడా ముందుమాట రాసే అవకాశం కలగడం ఆనందదాయకంగా ఉంది.
ప్రచురించదలచుకున్న కథలన్నీ తయారుగా ఉన్నప్పుడు వాటిని విడిసంపుటాలుగా ఒకేసారి ఎందుకు ప్రచురిస్తున్నారన్న నా సందేహానికి ఒక సమాధానం దొరికింది. ఇంతకుముందు సంపుటిలోని కథలు చాలా వరకు స్త్రీలపరంగా చెప్పినవి. ఎక్కువగా ఉత్తమ పురుషలో చెప్పినవి. అయితే, ఈ సంపుటిలోని కథలు – ఒక్కటితప్ప-అన్నీ పురుషులపరంగా చెప్పినవి. ఇవి కూడా చాలా వరకు ఉత్తమపురుషలో చెప్పినవే.
ముసలితనంలో ఒంటరితనం గురించి చెప్పిన కథ ‘ఎంత సుదీర్ఘమీ జీవితం!’ అలాగే, వృద్ధాప్యంలో ఒంటరితనం గురించి రాసిన ఆర్ద్రభరితమైన చిన్న కథ ‘చిరు సందర్భంలో…’ మనసుని ఆకట్టుకుంటుంది.
‘సునామి’లో కొట్టుకుపోయి ఏదో ద్వీపంలో రక్షింపబడినా, గతస్మృతులు కోల్పోయిన ఒక వ్యక్తి మనస్సుని చిత్రించిన కథ ‘ఆకిటికీలోని పూలకుండీ’.
మహాభారతంలోని దేవవ్రతుడి (భీష్ముడు) ఆజన్మ బ్రహ్మచర్య శపథం నేపథ్యాన్ని చిత్రించిన పెద్దకథ ‘అంతర్మథనం’.
కళ్ళున్నా చూడని ప్రకృతి అందాల్నీ, పరిసరాల్నీ సూక్ష్మదర్శనం చేయించి, జీవితాన్ని వర్ణమయం, అర్థవంతంచేసిన ఒక అంధుడి సహవాసం గురించి చెప్పిన కథ ‘రంగు తగ్గిన జీవితం’. దాదాపు ఇటువంటిదే ఇంకొక కథ ‘దృష్టికోణం’. ఆత్మహత్య చేసుకోబోతే, అంగవైకల్యం ప్రాప్తించిన ఒక యవకుడికి ఆసుపత్రిలో స్క్రీన్ అవతల ఉన్న ఒక వృద్ధుడు జీవితాన్ని ఆశాపూరిత దృష్టితో ఎలా చూడాలో నేర్పించిన వైనం ఈ కథ.
ఆత్మహత్య చేసుకోబోయిన ఒక యువకుడిలో నీటి ప్రవాహం జీవితం పట్ల కలిగించిన పునరుత్సాహమే ‘పునర్జన్మ’ కథ.
ఉత్తరహిందూస్థానంలో మతోన్మాదుల ఘాతుకాలకు గురై విషాదమయమైన ఒక కుటుంబకథ ‘దేశమంటే మతాలోయ్’. ఆయా ప్రదేశాలను దగ్గరనుంచి చూసిన అనుభవంతో చేసిన వాస్తవిక చిత్రణ ఉంది. ఇందులో పాఠకుల మనసుల్ని కుదిపేటట్లుగా ఉంది కథనం.
ఈనాటి అయిదు నక్షత్రాల అసుపత్రుల వ్యాపార ధోరణి పైన ఒక వ్యంగ్య కథ – ‘వైద్యోనారాయణో సిరిః!’
వైద్యరంగానికి సంబంధించిన మరోకథ ‘శిశిరంలో’. అది ఒక స్త్రీ మానవతాదృక్పథంతో కరుణతో చేసే సేవా నిరతిని చిత్రించిన కథ. వృద్ధాప్యంలో ఒంటరితనంతో కొందరు పురుషులు బాధపడినంతగా స్త్రీలు బాధపడరనీ, ఇతరుల అవసరాలను తీర్చడంలోనే వారు తమ జీవిత సాఫల్యాన్ని పొందడానికి ప్రయత్నిస్తారనీ చూపిస్తారు ఈ కథలో రచయిత్రి నర్సు శాంత పాత్రద్వారా.
ఈ సంపుటిలో రచయిత్రి శైలిలో భావుకత ఎక్కువగా కనిపిస్తుంది. ఆంగ్ల సాహిత్యంతో రచయిత్రికి ఉన్న గాఢమైన పరిచయం ఈ కథల్లో అక్కడక్కడ ప్రస్ఫుటమవుతుంది. చైతన్యస్రవంతిని కూడా కొంత ప్రవేశపెట్టడం వల్ల మనోభావాల అభివ్యక్తిలో విలక్షణత చోటుచేసుకుంది. మొత్తంమీద ఇవన్నీ మానవత్వాన్నీ, జీవితం పట్ల ఆశాభావాన్నీ స్ఫురింపజేసే కథలు. రచయిత్రికి నా అభినందనలు.
(ఎంత సుదీర్ఘ మీ జీవితం : కథల సంపుటి. గంటి భానుమతి. 2006)
11. మౌనం నుంచి శబ్దానికి
‘చెలిమ’
‘మౌన కవయిత్రి’గా పేరుపొందిన ‘మానేరు మానిని’ షహనాజ్ ఫాతిమా అధిరోహిస్తున్న కవితా సోపానంలో ఇప్పుడు మూడవ మెట్టు మీద ఉంది. ప్రతి మెట్టుపైనా తన ప్రత్యేక, సృజనాత్మక ముద్రని వేసింది. మొదటి మెట్టు మీదికి ఎక్కిన ‘కెరటాలు’ రెండవ మెట్టుమీద నడయాడిన మౌన ‘నానీ’లు ఇప్పుడు మూడవదానితో చెలిమి చేసిన ‘చెలిమ’, మొదట్లో కనిపించిన ‘పసితనం’ ఇంకా కొంతవరకు కొనసాగుతూనే ఉంది. మనిషి ఎదుగుతున్న కొద్దీ మనసులోంచి అమాయకత్వం తప్పుకుంటుంది. కానీ షహనాజ్ దాన్ని నిలుపుకోగలుగుతోంది. ఈ నాటి నాగరిక ప్రపంచలో చిన్న పిల్లల్లో కూడా అమాయకత్వం కనుమరుగవుతోంది!
కానీ ప్రకృతిని చూసి షహనాజ్ పరవశం చెందుతూనే ఉంది.
‘కోకిల గొంతులో
కుహు కుహు రవాలు
రసధుని ప్రవాహాలు’ విని సమ్మోహితురాలు కావడం.
‘ఆకు పచ్చని
కేరళలో
కరిగిపోయి
నా హృదయమూ
ఆకుపచ్చే’ అని మురిసిపోవడం
‘నేను
ఆల్చిప్పలా
అతి
కఠినంగా ఉంటాను
ముత్యపు చిప్పలోని
మృదుజీవిలా
మెత్తగా ఉంటాను’
‘వ్యధ అంతర్వాహినిగా
బ్రతుకు జలధిలో కల్సి
బాధిస్తుంది’ అనే సత్యాన్ని పాఠకులతో పంచుకుంటుంది.
మనిషి బయట ఉండే ప్రకృతికీ మనిషి ప్రకృతికీ ఉండే అవినాభావ సంబంధాన్ని శక్తిమంతంగా చిత్రీకరించింది. షహనాజ్ –
‘ప్రకృతిలోని
సౌందర్యాలన్నీ
ఈ దేహంలోనే
ప్రకృతిలోని
ఆస్వాదనలన్నీ
ఈ దేహంలోనే
ప్రకృతిలోని
వైపరీత్యాలన్నీ
ఈ దేహంలోనే
ప్రకృతిలోని
సౌందర్యాలన్నీ
ఈ దేహంలోనే
ప్రకృతిలోని
ఆస్వాదనలన్నీ
ఈ దేహంలోనే
– – –
ప్రకృతిలోని
వైపరీత్యాలన్నీ
ఆ దేహంలోనే
– – –
ఏ జలపాతాల్లో
చల్లారుతుందో
నిప్పుకణిక
ఈ దేహం
మనసు ఉధృతిని
ఎన్ని ఆనకట్టల్తో
అడ్డుకడుతుందో
నిత్య ప్రవాహం
ఈ దేహం………’ అంటూ, మరో కవితలో
‘ఆశించిన ఆశలు
నిరాశలైపోగా
ఎగిసిపోతుంది.
ఆవేదన
పాతాళానికి
క్రుంగిపోతుంది
మధ్యలో నేను
నిర్లిప్తంగా’ అంటూ వైరాగ్య భావాన్ని ప్రదర్శిస్తుంది.
‘నా ఊరే
కాశ్మీరం
నా ఊరే
కేరళ
– – –
చెలిమ నీటిలో
మేఘం చందమామల
సయ్యాట’ అని ఆనందాతిశయాన్ని అనుభవించిన ఈ కవయిత్రి
‘నేడదే బోసిగా
ఎడారిగా
స్మశాన వైరాగ్యం
నిశ్శబ్దం’ అని నిట్టూర్చుతుంది.
జీవితంలో ఇంకా ఎంతో అనుభవించవలసి ఉండగా తోడుకోల్పోతే నిరాశా నిస్పృహలు కలగడం సహజం.
‘ఇప్పటికీ నేను
నీవు వదిలివెళ్ళిన
మూలమలుపు వద్దే
శిలాప్రతిమూలా నిలిచి ఉన్నాను’ అనీ,
‘నువ్వు నేనై
బ్రతుకు సముద్రాన్ని
ఈదాలి’ అనీ నిస్పృహ చెందినా, షహనాజ్ స్వభావరీత్యా ఆశాజీవి కనుక,
‘మనస్సుకు పట్టిన
మబ్బు వీడాలి’ అని హెచ్చరించుకుంటుంది. తోడుకోల్పోయిన స్త్రీని సమాజం ఏ విధంగా చూస్తుందో రకరకాలుగా కవిత్వీకరించింది షహనాజ్. ఉదా :-
‘నిస్తత్తువగా ఉంటే
సానుభూతి
ఉత్సాహంగా ఉంటే
ఊరుమునిగినట్లు
నిట్టూర్పులు’
‘చేయని నేరానికి
జీవిత పర్యంతం
శిక్ష ఈ పరిస్థితి’
– – –
‘చలనాన్ని సమాజం
హర్షించదు’
‘అప్పుడప్పుడు సమాజంచెంపపై
ఈడ్చి తన్నాలనిపిస్తుంది
ఐనా సమాజంలో
నేను భాగమేగా
నీకు తగలుతుందని
ఊరుకుంటాను’
ఈ కవయిత్రి ఆత్మస్థైర్యానికీ, అవగాహనశక్తికీ ప్రతీకలు పై పంక్తులు.
మనస్సు చుట్టూ ఎన్ని బంధనాలున్నాయో వర్ణిస్తుంది ‘బందీ’ అనే కవితలో ‘మనసెప్పుడూ పిపాసే’ అంటుంది. మరో కవితలో
‘ఆలోచనలను ఎలా ముద్రించను
భాషే నేర్వని మౌని
ఈ మనస్సు’ అని ఒక చోట అంటే
మరోచోట
‘హృదయానికి
భాషేరాదు
భావాల
అనుభూతిలో
మూగవడం తప్ప’ అంటుంది.
ఊహల్లోనే
‘మనసు మోముపై
ముసి ముసి హాసాలు
వాస్తవమైతే
మనసు మౌనంగా
శూన్యమయ్యేదేమో!’ అంటూ వ్యధ చెందినా
‘శతాబ్దాల సహనం బద్దలై పైపైకి
పొంగి పారుతున్న ఆత్మ విశ్వాసం’
ప్రదర్శించే ధీరమతి షహనాజ్ ఫాతిమా. మౌనానికీ శబ్దానికీ మధ్య కవితా వారధిని కట్టగలిగిన కవనశిల్పి షహనాజ్.
‘కాలం-జీవితం’ కొండవాగులా ఎలా సాగుతాయో ప్రవాహసదృశంగా చిత్రించగల నేర్పరి షహనాజ్
‘ఆత్మగౌరవం’, ‘సునామీ’, ‘ఉన్మత్తమహత్తు’ వంటి కవితలద్వారా సమజంలోని వివిధవర్గాలవారికి ఉద్బోధించగల ఉపాధ్యాయిని షహనాజ్.
షహనాజ్ ఫాతిమా ‘మౌన కవయిత్రి’ మాత్రమే కాదు. శబ్ద విన్యాసాలు చేసే ‘మనసు కవయిత్రి’ కూడా. మనస్సు నిత్యం మథిస్తూ, అంతర్దర్శనం చేసుకుంటూ, తాత్త్వికచింతనతో మంచి కవితలు రాస్తున్న శ్రీమతి షహనాజ్ ఫాతిమాకి నా హృదయపూర్వక అభినందనలు!
ముందు ముందు మరెన్నో మంచి కవితలు రాసి కీర్తి శిఖరాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను.
(చెలిమ. షహనాజ్ ఫాతిమా. 2007)
12. ప్రేమాన్వితం
‘ప్రేమనేదే లేనినాడు’
అన్యోన్యత లేని భార్యాభర్తలు అనేకమంది ఉంటారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్నికలహాలున్నా, మనదేశంలో సాధారణంగా సర్దుకుపోతున్న కొద్దీ మరింత ఏడిపించుకు తింటారు కొందరు భర్తలు. అయినా, మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీలు అంత సులభంగా ఇల్లు వదిలి వెళ్ళిపోరు. ఆర్థిక బలం లేకపోవడంవల్లో, పిల్లల మీద మమకారంవల్లో, పరువుపోతుందన్న భయం వల్లో కాపురాన్ని తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోరు. కానీ పరిస్థితులు దుర్భరమైనప్పుడు ఈ కారణాలేవీ అడ్డురావు. పీడించుకుతినే భర్తనుంచో, తీవ్రంగా అవమానించే భర్తనుంచో విడిపోయి వెళ్ళిపోవడానికి సంశయించరు.
ఇబ్సెన్ నాటకం ‘డాల్స్ హౌస్’ (బొమ్మరిల్లు)లో కథానాయిక ‘నోరా’ తన ఇల్లూ, తన భర్తా, తన పిల్లలూ తప్ప మరొక ఆలోచన లేని గృహిణి. భర్తకి తనమీద ఎంతో ప్రేమ ఉందనుకుంటుంది. తను సదుద్దేశంతోనే ఒకసారి డబ్బు విషయంలో చేసిన పెద్ద పొరపాటు గురించి తెలుసుకుని భర్తతీవ్రంగా నిందిస్తాడు. ఆమె ఇంట్లో ఉంటే పిల్లలు పాడైపోతారని తెలిసినా, సమాజంకోసం, పరువుకోసం ఆమెని తన ఇంట్లో ఉండనిస్తానంటాడు. ఆ అవమానాన్ని భరించలేక, ఆమె ఇల్లు విడిచి వెళ్ళి పోతుంది. సంప్రదాయాలను బాగా పాటిస్తున్న ఆరోజుల్లో, యూరోపియన్ సమాజంలో ఆ నాటకం సంచలనాన్ని సృష్టించింది. ఒక గృహిణి భర్తనీ పిల్లల్నీ వదిలిపెట్టి, భర్త పరువు ప్రతిష్ఠల్ని లెక్కచెయ్యకుండా ఇంట్లోంచి వెళ్లిపోవడం తిరుగుబాటు ధోరణిగా, విప్లవాత్మక చర్యగా పరిగణించబడింది. కానీ రచయిత మాత్రం దాన్ని స్త్రీ స్వాభిమానానికి ప్రతీకగా చూపించాడు.
నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉంటే, ఒకరి లోపాల్ని ఒకరు అర్థం చేసుకుని సర్దుకుపోగలుగుతారు. కానీ ప్రేమకన్నా అహంకారం, అధికారం, పరువూ ముఖ్యమైనప్పుడు సంసారబంధం తెగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటువంటి భావాన్నే ”ప్రేమనేదే లేనినాడు” అనే నవలకి మూలఅంశంగా తీసుకున్నారు రచయిత్రి మధువాణిగారు.
భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది లేకుండా పోతే వారి సంబంధం ఎలా విషమిస్తుందో, భర్త దాస్టికాన్ని భరించలేక, భార్య తన భర్తనీ పిల్లల్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు ఎలా విషమిస్తాయో, భార్య తీసుకున్న ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా విషాదమయం చేస్తుందో చూపిస్తారు రచయిత్రి.
ఈ నవలలో పట్టణ వాతావరణాన్నీ, పల్లెటూరి వాతావరణాన్నీ, వైవిధ్యపూరితమైన అక్కడి మనుషుల స్వబావాల్నీ, ప్రవర్తననీ సమర్థవంతంగా చిత్రించారు రచయిత్రి.
ఈ నవల చదివిన పాఠకులలో ప్రేమ గురించీ, కుటుంబ బంధాల గురించీ, మానవసంబంధాల గురించీ సదవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను. ప్రేమాన్వితమైన ఆలోచనలతో ఈ నవలారచన చేసిన రచయిత్రి శ్రీమతి మధువాణిగారికి నా అభినందనలూ, శుభాకాంక్షలూ!
(ప్రేమనేదే లేని నాడు. వి. మధువాణి. 2007)
13. జీవిత ప్రతిబింబాలు
‘జీవితం అంటే కథ కాదు : అంగులూరి అంజనీ దేవి కథలు’
బాహ్య సౌందర్యంతో పాటు, వివేకంతో కూడిన ఆంతరిక సౌందర్యం కూడా ఉన్న రచయిత్రి అంగులూరి అంజనీదేవి అని, ఆమె ఫోటోలు చూసిన తరవాత, ఆమె రచనలు చదివిన తరవాత అనిపిస్తుంది.
యువ రచయిత్రిగా రెండు దశాబ్దాల క్రితమే ‘గుండెలోంచి అరుణోదయం’ అనే కవితా సంపుటితో పలువురు ప్రశంసలు అందుకుని, తరవాత నవలా రచయిత్రిగా, ‘నీకు నేనున్నా…’లో తన ప్రతిభని ప్రదర్శించాక, ఇప్పుడు ‘జీవితం అంటే కథ కాదు’ అనే శీర్షికతో ఆకర్షణీయమైన కథా సంపుటిని అందించడం అభినందనీయం.
కన్యగా కథలు రాయడం మొదలు పెట్టి, ప్రౌఢగా ఎదిగే క్రమంగా జీవితంలో ఎదురయ్యే వివిధరకాల వ్యక్తుల అనుభవాలనూ నూతన అనుభూతులనూ కథలుగా చిత్రించారు శ్రీమతి అంజనీదేవి. మనుషుల మనస్తత్వాలను చిత్రించడంలో ఆమె అధ్యయన శీలతా, విభిన్న సంఘటనలకు స్పందించడంలో విచక్షణాశీలతా ప్రస్ఫుటమవుతాయి ఆమె కథల్లో.
సంఘర్షణలతో కూడిన దాంపత్య సంబంధాల గురించీ, యువతీయువకులు ప్రేమించుకోవడంలో సాఫల్య, వైఫల్యాల గురించీ, వరకట్నం సృష్టించే సమస్యల గురించీ, వృద్ధాప్యంలో ఎదుర్కొనే సమస్యల గురించీ పరిష్కార యుతంగా రాసిన వైవిధ్య పూరితమైన కథలు – 1978 నుంచి 2009 వరకూ రాసినవి- 20 కథలు ఉన్నాయి ఈ సంపుటిలో. వీటిలో రెండు కథలు 1978-79 ప్రాంతంలో రచయిత్రి పెళ్ళి కాకమునుపు మామిడేల అంజనీదేవి పేరుతో రాసినవి, నాలుగు కథలు 1987-88 ప్రాంతంలో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైనవి కూడా ఉన్నాయి.
మొత్తం మీద వర్తమాన కుటుంబ సమస్యల్ని తీసుకుని జీవితాన్ని ప్రతిబింబించే ప్రయోజనాత్మక కథలు రాసిన శ్రీమతి అంగులూరి అంజనీదేవికి నా హృదయపూర్వక అభినందనలు ! ముందు ముందు ఇంకా ఎన్నో కథలు రాసి పాఠకుల ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటున్నాను.
(జీవితం అంటే కథ కాదు : అంగులూరి అంజనీ దేవి. 2009)