సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి

సాహిత్య రంగంలో ఉన్నవారిని వారు ప్రధానంగా ఎన్నుకున్న ప్రక్రియననుసరించి వారిని గుర్తించడం జరుగుతుంది. కవులు, కథకులు, నవలాకారులు, విమర్శకులుగా విభజించినా, కొందరు ఒకటికంటే ఎక్కువ ప్రక్రియలలో రచనలు చేసినవారూ ఉంటారు. కానీ ఏ ప్రక్రియలో ప్రధానంగా వారి ప్రతిభ ప్రస్ఫుటమవుతుందో అదే వారిని పట్టి చూపుతుంది. తురగా జానకీరాణి గారు వృత్తి ప్రవృత్తులలో భాగంగా అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. అయితే ఆమెను తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని తెలుగువారందరూ కూడా ‘రేడియో అక్కయ్య’గానే చప్పున గుర్తుపడతారు. అందుకు ఆకాశవాణిలో పనిచేస్తున్నంత కాలం అభిరుచి ఉన్న మహిళలనూ, బాలలనూ రచనా రంగంలోకి ప్రోత్సహించడమే ప్రధాన కారణం కావచ్చును.

అయితే జానకీరాణి గారి సాహిత్య కృషిని తక్కువగా అంచనా వేయకూడదు. 1954 నుండీ జానకిరాణి గారు కథా రచన ప్రారంభించి 2007 వరకూ ఐదు దశాబ్దాలకు పైగా రచనలు చేస్తూనే ఉన్నారు. ఆమె సమకాలీనులైన రచయిత్రులు తర్వాత్తర్వాత కథా రచన నుండి నవలా ప్రభంజనంలోకి దూసుకుపోయి అలా స్థిరపడిపోయినా జానకీరాణి గారు మాత్రం ప్రధానంగా కథకురాలిగానే

ఉండడానికి ఇష్టపడ్డారు. ఆ సందర్భంలోనే క్లుప్తత అనే దానికే తాను ప్రాధాన్యమిచ్చానని, కథలు రాయడంలోనే తనకు తృప్తి ఉందని అంటారు జానకీరాణి.

జానకీరాణి గారి కథలు చిన్నవిగా ఉండి, చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా పాఠకుడికి అందేలా ఉంటాయి. తొలిరోజుల్లో 1954 నుండి 65’ వరకూ రాసిన సుమారు ఇరవై అయిదు కథల్లో గ్రామీణ జీవితం నేపథ్యంలో, సాధికారత అంటే తెలియని అమాయక గ్రామీణ స్త్రీలకు చెందిన అనుభవాల్నీ, పిల్లల పెంపకంలో వాళ్ళు చూపే అలసత్వాన్నీ, మూఢనమ్మకాల్నీ, అజ్ఞానాన్నీ చిత్రించారు. ఈ కథలన్నింటిలోనూ గ్రామీణ జీవన పరిస్థితులు దృశ్యమానమవుతాయి.

గ్రామ సంఘసేవిక దృక్కోణంలో నడిపించిన కథ ‘సొరంగం’లో గ్రామంలో డబ్బున్న ఆసామి పిల్లలు పట్నం చదువుకు పోయి చెడిపోవడం, అవమానంతో ఆత్మహత్య చేసుకోవడం చూసి పిల్లల్ని పై చదువులు చదివించమని సలహా ఇచ్చినందుకు సహాయం చేయగలిగీ చేయలేని అశక్తతను చక్కని కథా సంవిధానంతో గ్రామాలలోని అవిద్య వలన వచ్చిన మూర్ఖత్వాన్నీ, పట్నం పోకడలకు పతనమైపోతున్న అమాయకుల్నీ, అథఃపాతాళానికి ఎలా కుంగిపోతారో తెలియచేస్తారు రచయిత్రి.

ఆ ఇంట్లో పెళ్ళి జరిపితే భర్త దూరమౌతాడన్న మూఢనమ్మకం నరనరాన పట్టిపోయిన కమల ఆ విషయం కాబోయే భర్తకి ఎలా తెలియజేయలో అని మొదలుపెట్టిన ఉత్తరం సగంలో ఆగిపోతుంది. పెళ్ళయినా భయం వదలదు. భర్త ఆ విషయం తనకు తెలుసనీ, వివాహం ముందు వాకిట్లో జరిగితే దోషం ఉండదని సిద్ధాంతి చెప్పాడని నచ్చచెపుతాడు. అయితే రచయిత్రి కొసమెరుపుగా కమల రాసిన సగం ఉత్తరం చదివిన భర్త ఆమె భయం పోగొట్టడానికే అలా చెప్పాడని కమల ఊహించదని ముగించడంలో రచయిత్రి చమత్కారంగా మూఢనమ్మకాలపై ఆమెకు గల అభిప్రాయాన్నీ ‘తాను నమ్మిన దైవం’ కథలో వ్యక్తపరుస్తారు.

సన్మాన సభల తీరుతెన్నులూ, డబ్బున్న మహిళా సంస్థలు ధనాన్నీ, దర్పాన్నీ ప్రదర్శించేందుకు చేసే కార్యక్రమాలూ, సన్మానాలూ ఎలా ఉంటాయో కాస్త హాస్యస్పోరకంగా, వ్యంగ్యంగా, వాడిగా ‘కీర్తి తెరల మాటున’ కథలో చెప్తారు రచయిత్రి.

ట్రైనులో తాగి పేకాడుతూ ఇబ్బంది పెడుతోన్న రౌడీల్లాంటి ఉత్తరాది మగాళ్ళను చూసి పోలీసులకు ఫిర్యాదు ఇస్తుంది అందులో ప్రయాణిస్తున్న సంఘ సేవిక అర్చన. ఒక స్టేషనులో మంచినీళ్ళకు దిగి తిరిగి ఎక్కబోతున్న ఆమె చెయ్యిని తెగ్గొడతారు ఆ మగాళ్ళు. రైలు ప్రయాణంలోని విభిన్న మనస్తత్వ చిత్రణలతో జీవన ప్రయాణంలాంటి కథ ‘ప్రస్థానం’. ఒక మహిళపై జరిగే మగవారి దౌర్జన్యానికి ప్రతీక ఈ కథ.

‘జగన్మాత’ కథలో ముప్ఫై ఏళ్ళు దాటినా పెళ్ళికాని రుక్మిణి అక్రమ సంబంధంతో కొడుకును కంటుంది. ఆమె తన దురదృష్టానికి కుములుతూ ఉంటుందని భావించిన స్నేహితురాళ్ళు ఆమెను ఓదార్చేందుకు వెళ్తారు. పిల్లాడిని చూసి మురిసిపోతున్న రుక్మిణిని చూసి అవాక్కవుతారు మిత్రులు. ఇందులో మానవ నైజాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరిస్తారు రచయిత్రి.

చెప్పదలచుకున్న విషయం ఉన్నప్పుడు అతి చిన్న దృశ్యాల్నీ, సంఘటనల్నీ ఒడిసి పట్టుకోగలిగే జానకీరాణి గారి చేతిలో కథలుగా ఒదిగిపోతాయి. అంతేకాదు ముగింపు కూడా చాలా కథలకు అసంపూర్తిగా ఉన్నట్లనిపించినా జానకీరాణి గారు కథ ముగింపును పూర్తిగా విప్పిచెప్పాలనుకోరు. కథ పూర్తిగా చదివిన పాఠకుడి ఆలోచనకి, విశ్లేషణకి అవకాశాన్ని ఇవ్వడం రచయిత్రి ఉద్దేశ్యంగా తోస్తుంది.

వితంతు వివాహం చేసుకున్న మాధవ తన భార్య రాధ తనని దైవంగా భావిస్తూ పూజించాలని ఆశిస్తాడు. మొదట్లో భర్త కోరుకున్నట్లే మెలిగిన రాధ రానురానూ తనను ఉద్ధరించాననే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ గత జీవితాన్ని భర్తకు గుర్తుచేయటాన్ని భరించలేకపోయి మౌనం వహిస్తుంది. ఒకసారి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన మాధవకు అక్కడ అందరూ రాధ గురించి ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడగడం మింగుడుపడదు. చివరికి తన తప్పు గ్రహించటం ఈ ‘వెలుగునీడలు’ (1958)లోని కథ. కథలో ఆసాంతం రాధ మానసిక సంఘర్షణని మౌనంగానే వ్యక్తమయ్యేలా కథలో ఆసాంతం దృశ్యం వెనక దృశ్యంగా చిత్రించడంలో రచయిత్రి రచనా వైచిత్రికి మచ్చుతునక. రాధా మాధవుల మానసిక విశ్లేషణ ప్రధానంగా, మాధవుని పురుషాధిక్యత వెలిబుచ్చే తీరు సునిశితంగా చెపుతూ కథ నడపటంలో రచనా సమర్ధత వ్యక్తమౌతుంది.

ఇటువంటిదే మరో కథ పరిష్కారం (1962). జానకీరాణి గారి కథలన్నింటిలో ఇది పెద్ద కథ. పద్దెనిమిదేళ్ళ క్రితం ప్రసవ వేదనతో భార్య చనిపోతే ఒంటరి జీవితం గడుపుతోన్న రామకృష్ణయ్య ఇంటికి ఒక వర్షపు రాత్రి నిండు గర్భిణిని తీసుకుని ఒక స్త్రీ వచ్చి ఆశ్రయం కోరుతుంది. ఒక రాత్రి బిడ్డని ప్రసవించి, పసికందును వదిలి ఆ స్త్రీలిద్దరూ వెళ్ళిపోతారు. అనుకోని బాధ్యత నెత్తినేసుకుని పాపని పెంచుతాడు. పదేళ్ళ తర్వాత తన బిడ్డని తీసుకుపోతానని పాప తల్లి భర్తతో కలిసి వస్తుంది. పాప భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పంపటానికి సిద్ధపడిన రామకృష్ణయ్య ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకుని పాపని దగ్గరకు తీసుకుంటాడు. కథాంశంలో కొంత నాటకీయత ఉంది. కానీ కథన శైలిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంఘటనలకు తగిన వాతావరణాన్ని కల్పించడం, గోదావరీ తీర పరిసరాల వర్ణనలూ, ఎప్పటికప్పుడు సంభాషణలతో కన్నా పాత్రల మానసిక విశ్లేషణ నేపథ్యంతో కళ్ళముందు ఒక చక్కటి చలనచిత్రం కదిలే విధంగా దృశ్యమానం చేయడంలో రచయిత్రి సిద్ధహస్తురాలిగా తోస్తుంది.

రచయిత్రుల రచనలు వంటింటి కథలుగా వ్యంగ్యంగా ఆ రోజుల్లో విమర్శించేవారు. జానకీరాణి కథల్లో సంఘటనలూ, దృశ్యాలూ, సంభాషణలూ వాటిని పలికించి ప్రదర్శించే పాత్రలూ అన్నీ వాస్తవ చిత్రాలుగా రూపొందించడం ఒక ప్రత్యేకత. ఎక్కడా అసహజత, అవాస్తవికత కనిపించవు. కొన్నింటిలో వస్తుపరంగా అనుభూతుల్లో తేడా ఎక్కువగా లేకపోవచ్చు. కానీ కథన శిల్పపరంగా మాత్రం ఎన్నదగినవి.

పల్లెటూరి పిల్ల పుష్పమ్మకు అకస్మాత్తుగా మాట పడిపోయింది. ఎన్ని పరీక్షలు చేయించినా అంతు పట్టదు. దళిత కోటాలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పుష్పమ్మని ఎంపిక చేస్తారు గ్రామ పెద్దలు. పదవీ స్వీకార సమయంలో తాను కూర్చోవలసిన స్థానంలో భర్త కూర్చోవడంతో అతన్ని లాగేస్తుంది. అది భరించలేని భర్త ఆమెను కొడతాడు. దాంతో మరింత ఆగ్రహంతో ‘నేను సర్పంచ్‌ని. నువ్వు కాదు’ అంటూ అతన్ని గుంజుతుంది. ఆమెకు మళ్ళీ మాట వచ్చింది అని చెప్పిన రచయిత్రి ఆమెకి మాట పోవడానికి గల కారణం ఎలా చెప్పారంటే పుష్పమ్మకి పిల్లలు కలగలేదని భర్త ఆమెను వదిలి రెండో పెళ్ళికి సిద్ధపడ్డాడని ఏడ్చి ఏడ్చి గొంతు పోయిందంటారు. సర్పంచిగా సాధికారత సాధించినవేళ నోరు తిరిగి పెగిలింది అని చెప్పటంలో కొంత కల్పన ఉందనుకున్నా సాధికారత, స్త్రీలకు ధైర్యాన్నీ, అస్తిత్వాన్నీ కల్పిస్తాయనే సందేశాన్ని పరోక్షంగా ఇస్తారు రచయిత్రి.

పది పాసయిన కూతురికి ఉద్యోగం వస్తుందన్న ఆశతో బంగారు గుళ్ళు లంచం ఇస్తుంది తల్లి. రిజర్వేషన్లు సాధించే ఉద్యమంలో నేలకొరుగుతాడు కొడుకు. పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు వస్తాయని కడుపు కట్టుకుని చదివిస్తే

ఉద్యోగాలు రావటంలేదు. లంచాలకీ రావు, రిజర్వేషన్లకీ రావు. మరి ఉద్యోగాలన్నీ ఎవరికి దక్కుతున్నాయో తెలియని అవినీతి పరిపాలనా యంత్రాంగంలో పేదల కడుపు కొట్టేది ఏదైనా ఒకటే అనే సత్యాన్ని తెలియజేసే కథ ‘కాలం తీరిన కొలువు’. శ్రామిక జనం కథలు నాకు చేతకాదు. వారి జీవితాలను తలచుకొని మానసికంగా అలజడి పొందడమే తప్ప, వారి జీవన చిత్రణ చేయడం నాకు సాధ్యం కాదు అంటారు జానకీరాణి గారు. కానీ చెమ్మగిల్లిన కళ్ళతో మనసు తడితో ఆమెలో గూడుకట్టుకొని ఉన్న అనేక విషయాలను కూర్చుకొని కథలు రాయడంలోనే ఆమెకు గల తృప్తితో, విశ్వాసంతో, నమ్మికతో కథా రచన అవిశ్రాంతంగా చేశారు.

చదువూ, సంస్కారం ఉన్నవాళ్ళు కూడా తమ పిల్లలను ర్యాంకుల వెంట పరిగెత్తించి, తాము కూడా ఆ వెంటే పరుగెత్తే తల్లిదండ్రులకు ఈ రోజుల్లో కూడా కొదవలేదు. టీచరుకీ-విద్యార్థికీ, తల్లిదండ్రులకీ-పిల్లలకీ, టీచరుకీ-తల్లిదండ్రులకీ మధ్య పరస్పరం ఉండవలసిన బంధాల్నీ, అనుబంధాల్నీ, సమన్వయాన్నీ తెలియజేసే కథ ‘తోటమాలి’. ఈ సమన్వయం కొరవడినందుకే గత కొంతకాలంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ప్రతి టీచరూ, విద్యార్ధ్థీ, తల్లిదండ్రులు అందరూ తెలుసుకోవలసిన కథ ఇది.

కాలేజీలో చదివే అమ్మాయినీ, ఆమె పిన్నినీ, తమ్ముడినీ ఇంట్లో పనిచేసే వంటవాడు హత్య చేశాడన్న ఉదంతాన్ని వార్తాపత్రికలో చదివి స్పందించి సామాజిక దృక్కోణంతో రాసిన కథ ‘ఆమె బేల – అతను ధీరుడు అయితేనేం’. ఇందులో రచయిత్రి జరిగిన వాస్తవానికి ఊహా చిత్రాలుగా పాత్రలను, వాటికి కావలసిన సంఘటనలనీ కల్పించి సమకాలీన సమాజంలో దారుణాలకు కార్యకారణ రూపంగా సమర్ధవంతమైన కథగా అక్షరీకరించారు.

కీచక ప్రవృత్తి కలిగి కుళ్ళిన ఆలోచనలతో ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన గురువులకు కనువిప్పు కలిగించే కథ ‘అమ్ముల పొది’.

నవ యవ్వన దశలో చెడు దారులవైపు ఆకర్షితులైన యువతరం తీరు తెన్నులపై సంధించిన బాణం ‘వయసు గతి ఇంతే’ ఈ విధంగా యువతరం బాధ్యతారాహిత్యానికి ఆందోళన చెంది ఏ కథనీ కూడా పక్కదారి పట్టించకుండా కథనీ, వస్తువునీ ఒకే స్థాయిలో నడిపించే కథా నిర్మాణ పద్ధతిని చేపట్టారు జానకీరాణి. అందుకే వీరి కథలు పరిగెత్తించేవిలా ఉండవు . నిదానంగా, ఒక సన్నని ప్రవాహంలా సాగుతూ ఎంతో ఆర్తిగా మనసుని తాకుతాయి.

మానసిక వైకల్యం గల కూతురు కస్తూరికి సేవ చేయలేని రోగిష్టి తల్లీ, చెల్లెలిపై ప్రేమ ఉన్నా సంసార బాధ్యతతో ఆమె తెలియక చేసే పిచ్చి పనులు భరించలేక హోంలో చేర్చిన అన్న, సంఘంలో బతుకుతున్నందుకు ఇరుగు పొరుగులకు సమాధానం చెప్పుకోలేక నలిగిపోయే ‘సంఘజీవి’ కథ.

రిటైర్‌ అయిన తర్వాతనైనా తమ కోసం తాము బతకాలని భావించి వచ్చిన సొమ్ముతో ఇంటికి కావలసిన ఆధునిక పరికరాలనుకొని, దక్షిణ దేశయాత్రకు సిద్ధపడిన భర్త తీరుకు భార్య విస్మయం చెందుతుంది. పిల్లల అవసరాలకు కాకుండా తమకోసం సొమ్ము వెచ్చించటాన్నీ, భర్త వైఖరినీ తప్పు పడుతుంది భార్య. తీరా విహారయాత్రకు బయల్దేరే సమయానికి ఆ భర్త అనంత దూరాలకు పయనమైపోతాడు ‘యాత్ర’ కథలో. పురుషుల పక్షాన కూడా జానకీరాణి పాఠకులకు నచ్చే విధంగా మధ్యతరగతి బతుకు చిత్రాలకు నమూనాలుగా రాయగలరు అన్నదానికి ఉదాహరణలు ఇటువంటి కథలు.

భర్త మరణించిన తర్వాత ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ జీవన పోరాటం చేస్తున్న స్త్రీలు, ఉద్యోగరీత్యా గ్రామాలలో ఉంటూ, అక్కడ జనజాగృతికి తన శక్తి సామర్ధ్యాలు వినియోగించే స్త్రీలు, కుటుంబ జీవితంలో ఆర్థిక, సామాజిక ఒడిదుడుకులతో సంసార రధాన్ని ఒద్దికగా నడపడానికి ప్రయాసపడే స్త్రీలు జానకీరాణి అనేక కథలలోని పాత్రలు.

మహిళా సాధికారతనీ, వ్యక్తిత్వ నిరూపణల్నీ, ఆత్మవిశ్వాసాల్ని నిలబెట్టుకునే పాత్రలనైనా సరళ సుందర కథనంతోనే తీర్చిదిద్దడం జానకీరాణి విశిష్టత.

జానకీరాణి గారిది సున్నితమైన హృదయం కావటం వల్ల కావచ్చు ఆమె తీసుకున్న పాత్రలూ, వస్తువు పరంగా సంఘర్షణలకు లోనయ్యే సందర్భంలో కూడా మెత్తని సరళ సంభాషణలతోనే కథని జాగ్రత్తగా నడిపిస్తారు. ఆమె జీవితంలో ఎదుర్కొన్న అవాంతరాల్ని ఏ విధంగా ఎదుర్కొని జీవితంలో నిలదొక్కుకోగలిగారో అదేవిధంగా జానకీరాణి కథలలోని స్త్రీ జీవితాలలోని అనేక పార్శ్వాలను, వాటి మూలాలను ఆవిష్కరించినప్పుడు కానీ, వాటికి తగిన పరిష్కారాలు సూచించినప్పుడు కానీ చాలా సంయమనాన్ని పాటిస్తారు. పాత్రలన్నీ సౌమ్యస్వభావంతో సుతిమెత్తగా వ్యవహరిస్తూనే చిక్కుముళ్ళని విప్పుకుంటూ జీవితాలను చక్కదిద్దుకుంటాయి జానకీరాణి గారి కథలలోని స్త్రీ పాత్రలు.

జానకీరాణి రచనా విధానంలో ఒక మంచి అంశాన్ని పాఠకుని మనసులో ఇంకేలా చేయడానికో, మార్గదర్శనం చేయడానికో ఒక గైడులా వ్యవహరిస్తారు. అంతే తప్ప నీతి బోధ చేయరు. బతుకు దారి ఎలా ఉందో వివరిస్తారు.ఒక టార్చిలైటుతో నడకదారి చూపుతారు కానీ పాఠం చెప్పరు. చూపిన దారిలో వెళ్తారో, పక్కదారి పడతారో తర్వాత పాఠకుడి ఇష్టానికీ, ఆలోచనకీ వదిలేస్తారు. మరి కొన్నిచోట్ల హూంకరిస్తూ కుమ్మేయటానికో, జీవితాన్ని ఛిద్రం చేయడానికో పరిగెత్తుకొస్తున్న ఆంబోతులా అనుకోకుండా పైన పడే పెను సమస్యల్ని కొమ్మలు బట్టి నిలబెట్టే సాహసం కాకుండా దానిని దారి తప్పించి తాను కూడా భద్రంలా తప్పుకునేలాంటి పరిష్కారాన్ని వీరు కథల్లో సూచిస్తారు.

అందుకే పోరంకి దక్షిణామూర్తి గారు ”జానకీరాణి ఎన్నుకొన్న వస్తువుల్లో ఏదో విశేషం కనిపిస్తుంది. ఆమె భాష, శైలీ హాయిగా, సరళంగా ఏట్లో పడవలా సాగిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని పదాలూ, పదబంధాలూ సహజ సుందరంగా నప్పినట్టుంటాయి అంటారు.

అంతేకాదు జానకీరాణి కథల్లో స్త్రీల జీవితాల్లోని అభద్రతనీ, అసహాయతనీ తెలియజేసే కథలు వాస్తవ జీవితానుతభవ శకలాలుగా అనిపించేలా రచయిత్రి సృజనాత్మక ప్రతిభని మేళవించి కథారూపంగా చెక్కుతారు. అందుకే పాఠకుడి హృదయాన్నీ స్పందింపచేస్తాయి. కొన్ని కథలు 4-5 దశాబ్దాల క్రిందటి కథలే అయినా ఇప్పటి సమాజంలో కూడా అన్వయించేలా

ఉన్నాయనిపించడాన్ని ఈ కథల ప్రాసంగితకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఆకాశవాణిలో చేరిన తర్వాత ఉద్యోగ వత్తిడీ, కుటుంబ బాధ్యతల వలన సాహిత్య జీవితం వెనకబడి కథలు తక్కువగా రాశారు. కానీ కార్యక్రమ నిర్వహణలో అనేక నాటికలు, రూపకాలు వంటివి అవసరాన్ని బట్టి స్త్రీలకు, బాలలకు ఉపయుక్తమైనవి, రాసినా వాటిని భద్రపరచుకోలేకపోయానని పలుసార్లు ప్రస్తావించేవారు. ఆయా సందర్భాలలో అనేక జాతీయ పురస్కారాలూ అందుకున్నారు.

వీరి ఇతర రచనలలో మూడు నవలలు, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ గురించి రూపకము, ఒంటరిగా ఇద్దరు పిల్లల్ని పెంచడంలోని వేదనని తెలిపే ‘చేతకాని నటి’ అనే కవిత్వ రూపకం, రేడియో నాటికల సంకలనం, ‘మా తాతయ్య చలం’ లేఖా సాహిత్యం, అయిదు అనువాద గ్రంథాలు, ముప్ఫయైదు పిల్లల పుస్తకాలు. ఈ విధంగా అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. అంతకు ముందు వచ్చిన మూడు కథల సంపుటిలోనివే కాక మరిన్ని ముద్రిత, అముద్రిత కథలతో ‘తురగా జానకీరాణి కథలు’గా 2013లో సమగ్ర సంపుటిని వెలువరించారు.

”కథలు రాసేటప్పుడు ఆ విషయాన్ని గురించి ఒక విశ్వాసంతో, నమ్మికతో రాయాలి. నాకు అంత సదవకాశం చిక్కడంలేదు. ఏ సంగతి చూసినా విస్మయం, ఆనందం, వేదన కలగడంలేదు. బహుశా సొంత జీవితం అంశాలు అన్నింటినీ తోసేస్తున్నాయేమో” అంటూ అందుకే సృజనాత్మక జీవితానికి ‘కామా’ పెట్టానన్న జానకీరాణిగారు పూర్తిగా కథా రచనకు దూరమయ్యారు. సమాజంలోని సంక్షోభాలు, సంఘర్షణలకు అక్షరరూపం ఇవ్వాలనుకుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని రాయలేకపోతున్నానని నిజాయితీగా చెప్పుకుంటారు.

బహు ముఖీన ప్రతిభ గల తురగా జానకీరాణి గారి రచనల గురించిన ప్రస్తావన సాహిత్యంలో తక్కువగానే వస్తోంది. బహుశా చాలామందికి ఆమె సాహితీ వైదుష్యం తెలియకపోవచ్చు. అందుకే మంచి కథల రచయిత్రీ, మంచి మనసున్న తురగా జానకీరాణి గారికి నివాళిగా వారి కథల్ని పరిచయం చేస్తున్నాను.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి

  1. Seela Subhadra Devi says:

    తురగా జానకీరాణీగారి కథలపై గురించి చాలా రోజులనుండి వ్యాసం రాయాలని అనుకుని అశ్రద్ధా చేస్తు ఇప్పటికి రాయగలిగాను .ఆ వ్యాసాన్ని అక్టోబర్ లో జానకీరాణీ గారి వర్ధంతి సంధర్భం లో భూమిక ప్రచురించి నందుకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.