ప్రేమే నేరమేనా? – అనేది ఒకనాటి మాట
ప్రేమిస్తే చంపేస్తారా? – అనేది ఈనాటి మాట.
తెలంగాణా మిర్యాలగూడెం తెలుగింటి ఆడపడుచు అమృతవర్షిణి నేడు సమాజానికి సంధిస్తూన్న ప్రశ్న ఇది.
‘కాదు. మాది ఉదాత్త విలువలు గల ఉన్నత సమాజం. ప్రేమకు, స్నేహానికి, సమానత్వానికి, మానవత్వానికి గౌరవాన్ని ఇచ్చి, గౌరవం పొందే తెలుగు సమాజం బిడ్డలం మేం’ అని నిరూపించుకోవాల్సిన దుస్థితిలో పడిపోయాం నేడు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఉన్నత వర్గానికి, వర్ణానికి సంబంధించిన అమృత, ఎస్.సి.కి చెందిన ప్రణయ్‌ల వివాహానికి ఇష్టపడని అమృత తండ్రి మారుతీరావు అతి కర్కశంగా, కుట్రపూరితంగా ప్రణయ్‌ను నడిరోడ్డుపై హత్య చేయించడాన్ని సభ్య సమాజం జీర్ణించుకోలేకపోతోంది.
పరువు హత్యలు (హానర్ కిల్లింగ్స్)గా వాటిని చెప్తున్నా.. నిజానికి ఇది యావత్ సమాజం తలదించుకునే పరువు తీస్తున్న పరువుమాలిన హత్యలుగా మనం చెప్పుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు తన కుమార్తెతో ఆప్యాయత నటిస్తూనే అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకునితో తుదముట్టించిన తీరు మనసున్న ప్రతి ఒక్కరినీ నిర్ఘాంతపరిచింది.
మనిషి ముసుగులోని మతక్రౌర్యాన్ని, రాక్షసత్వాన్ని గోరక్షణ దాడుల్లోనూ, మూకుమ్మడి వేటల్లోనూ, ఎస్.సి, ఎస్.టి., మైనార్టీల హత్యల్లోనూ, ఆడపిల్లల అత్యాచారాల్లోనూ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
అలాగే జర్నలిస్టు గౌరీ లంకేష్, దబోల్కర్, కల్బుర్గి, పన్సారి వంటి హేతువాద రచయితలను పథకం ప్రకారం వెంటాడి, వేటాడి హత్య చేస్తున్న ఫాసిస్టు దుర్మార్గాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం. అగోచరమైన రాజ్యం పాత్ర కూడా ఇందులో దాగి ఉన్నదనేది రాజకీయ పరిశీలకుల భావన.
ఇక ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో కూడా ఈ కుల రక్కసి హత్యాకాండ పడగవిప్పి బుసకొడుతూ యువతను బలిగొనడాన్ని చూసి విస్తుపోతున్నాం. అయినా యువత బెదిరిపోకుండా సాహసంతో ముందడుగు వేయడాన్ని గ్రహిస్తూ నవచైతన్యానికి అపజయం ఎందుకుంటుంది? అని సంతృప్తి పడ్తున్నాం.
‘ప్రణయ్ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్లమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు. మిర్యాలగూడెంలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలి. దానికి అందరూ సహకరించాలి. అందుకే జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో ఫేస్‌బుక్ పేజీని ఓపెన్ చేశాను. ప్రణయ్‌కు న్యాయం జరిగేవరకు నా పోరాటం ఆగదు’ అని ప్రణయ్ జీవిత భాగస్వామి అమృత ఉద్వేగంతో ఉద్ఘాటించడం కులోన్మాద హంతకులకు చెంపపెట్టు అయింది. కులాంతర, మతాంతర, భాషాంతర, ఖండాంతర ప్రణయ వివాహాలకు పూలబాట పరిచినట్లయింది.
ఇక ఇటుపక్క చూస్తే మారుతీరావుకు కన్నకూతురు ప్రేమకన్నా, జీవితం కన్నా, తనకు తన కులం, తన పరువే ముఖ్యమని అందుకే ప్రణయ్‌ని హత్య చేయించానని నిర్లజ్జగా చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది జనవరిలో ప్రణయ్, అమృతల వివాహం హైద్రాబాద్ ఆర్య సమాజ్‌లో జరిగింది. వివాహం తర్వాత కూడా తన కూతురిని తనకు అప్పగించాలని ప్రణయ్ కుటుంబంపై పదే పదే వత్తిడి తెచ్చాడు మారుతీరావు.
అయినా ఫలితం లేకపోవడంతో ప్రణయ్ హత్యకు పథకం వేశాడు. తన మిత్రుడు కరీంతో చర్చించాడు. ఓ భూ వివాదంలో పరిచయమైన మాజీ ఉగ్రవాది అబ్దుల్ బారీని సంప్రదించాడు. వారి అనుచరులు అస్గర్ ఆలీ ఇతరులు కలిసి ప్రణయ్ హత్యకు గాను కోటి రూపాయిల (సుపారీ) ఒప్పందం కుదుర్చుకున్నారు.
గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్య హత్య కేసుతో సంబంధమున్న కిరాయి హంతకుడు బీహార్ వాసి శర్మ (అలియాస్ సుభాష్‌కుమార్)ను పిలిపించారు.
ఇందుకోసం పలుమార్లు రెక్కీ నిర్వహించారు. కడకు సెప్టెంబర్ 14న మిర్యాలగూడెం జ్యోతి ఆస్పత్రి వద్ద పట్టపగలు మిట్టమధ్యాహ్నం ప్రణయ్‌ను నరికి చంపారు.
గర్భవతి అయిన అమృతకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రణయ్, తన తల్లితో కలిసి ఆస్పత్రికి వచ్చిన సందర్భం అది.
ఈ సమాచారాన్ని ఎస్.పి. రంగనాధ్ పత్రికా ముఖంగా వివరించారు. ఈ హత్య కేసులో ఏడుగురు నిందితులను నిర్బంధించినట్లు తెలిపారు.
ఈ మొత్తం హత్యా పథక రచనలో గానీ, అమలులో గానీ ఎక్కడా మతం, ఉగ్రవాద ప్రభావం ఇసుమంతైనా అడ్డు కాలేదు. ధనమే ప్రధానమైంది. సభ్యసమాజం అంతా ఈ దారుణాన్ని ముక్తకంఠంతో ఖండించాలని జస్టిస్ సుదర్శనరెడ్డి పిలుపునిచ్చారు.
వామపక్ష వాదులు, ప్రగతిశీలురు, ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీ నాయకులు సహజంగానే ఖండిస్తూ ఉన్నారు.
కానీ అదే సందర్భంలో రావాల్సిన పాలక వర్గాల నుండి, వర్ణాల నుండి, ఆయా వ్యక్తుల, శక్తుల నుండి ఖండన రాకపోవడం ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. గౌరీ లంకేష్ హత్య కేసులో ప్రధాని మౌనం ప్రజాస్వామ్యవాదులకు ఆగ్రహం కలిగించిన విషయం తెలిసిందే. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచాడు. ఒకరకంగా ఇది పరోక్షంగా హత్యలను సమర్ధించడమేననేది వారి నిశ్చితాభిప్రాయం.
టి.ఆర్.ఎస్. ప్రభుత్వానికి సంబంధించి (ఆపద్ధర్మమైనా) ఇప్పటికీ (సెప్టెంబరు 20) ఈ హత్యను ఖండిస్తూ ప్రకటన రాకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో యువత ఇదే విషయాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నది.
అలాగే నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాత్సారం చేయరాదని, వారు బెయిల్‌పై బయటకు రాకూడదని జనం కోరుకుంటున్నారు. నిందితుల్లో ఒకరైన అమృత చిన్నాన్న శ్రవణ్‌కు హింసా ప్రవృత్తి ఉన్నదని, బయటకు విడుదలైతే తమకు ప్రాణహాని ఉన్నదని అమృత పేర్కొన్నది కూడా.
నేరస్థులకు శిక్షలు వెంటనే అమలై, దుర్మార్గాల పట్ల సహేతుక ఖండనలు సకాలంలో రాజ్యం నుండి రాగలిగితే బాధితులకు వ్యవస్థ పట్ల, పాలన పట్ల విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం కనుక. లేని పక్షంలో హింస, నేర ప్రవృత్తి చెలరేగిపోతుంది. చట్టాలన్నీ పాలక వర్గానికి చుట్టాలైపోతాయి. పోలీసు పాత్ర నిర్వీర్యమై దోషులకు భయం లేకుండా పోతుంది. అంతిమంగా బాధితులుగా మిగిలేది స్త్రీలు, బాలలు, బడుగు జీవులనేది యదార్థం.
మిర్యాలగూడెం ఘటన మరువకముందే 19వ తేదీన హైద్రాబాద్ రాజధాని నడిబొడ్డు ఎర్రగడ్డ పరిసరాల్లో పట్టపగలు మరో దారుణం జరిగింది. ఇక్కడ మామే స్వయంగా హంతకుడిగా మారిపోయాడు.
కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ మామ (మనోహరాచారి) కొత్త దంపతులకు బట్టలు కొంటానని చెప్పి అల్లుడ్ని, కూతుర్ని పిలిపించుకుని మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అల్లుడు సందీప్ గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్నాడు. కుమార్తె మాధవి విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. అంటే కులాంతర వివాహం మన రాష్ట్రాలలో ప్రాణాంతకంగా మారుతున్నది, అదీ ముఖ్యంగా బడుగు వర్గాల వారికి.
ఈ నేపథ్యంలో రాజకీయ పరిధులు అధిగమించి సామాజిక శాంతికి పాటుపడటం ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం. రాజ్యాంగం, చట్టాలు ఉన్నప్పటికీ ప్రగతిశీల ప్రజాస్వామ్య చైతన్యంతోనే సామాజిక సమతను సాధించగలం.
ప్రపంచీకరణ ఫలితంగా ఎల్లెడలా ఆర్థిక అంతరాలు పెరుగుతున్న విషయం విదితమే. ఇందుకు ఫ్యూడల్ స్వభావం తోడై దుర్హంకారంగా తోసుకు వస్తున్నది. ఈ క్రమంలో ఉన్మాద పూరిత హత్యలు, అత్యాచారాలు శరవేగంగా పెరుగుతున్నాయి. అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ పౌర సమాజం మరింత జాగరూకతతో ప్రణాళికాయుతంగా వ్యవహరించవలసిన సమయం ఆసన్నమైంది.
అప్పుడే పాలక వర్గాలకు ప్రజాస్వామ్యం వంటబడుతుంది. లేకుంటే అవి ఫాసిజం వైపే అధికారం కోసం పరుగులిడతాయి, ప్రాకులాడతాయి అనేది చరిత్ర చెప్పిన సత్యం.