స్త్రీల సమస్యలకు చర్చా వేదిక ‘భూమిక’
సమకాలీన సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, నిత్య సంఘర్షణలకు ప్రతిస్పందిస్తూ, స్త్రీల పక్షాన నిలిచిన పత్రిక భూమిక. కె.సత్యవతిగారు సంపాదకులుగా ఉండి
నడిపిస్తున్న పత్రిక భూమిక. స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షత నుండి సురక్షితకు మార్గాలు చూపుతూ చేయితిరిగిన సాహితీవేత్తలతో బలమైన వ్యాసాలను, కథలను, కవిత్వాలను, కథనాలను, సమీక్షలను, పిల్లలకు అవసరమైన అంశాలను, ధారావాహికలను ప్రచురిస్తూ ఉన్న మాసపత్రిక భూమిక. స్త్రీల హక్కులను తెలుపుతూ, మీ విధులు ఇవి అని గుర్తుచేస్తూ అస్తిత్వాన్ని కోల్పోకుండా తాను ఎంచుకున్న దారిలో పయనించమని చెప్తూ, ధైర్యాన్ని ఇస్తున్న పత్రిక.
ఉదాహరణకు స్త్రీలు పనిచేసే చోట వేధింపులకు, ప్రత్యేకంగా లైంగిక హింసకు గురవుతున్నారు. దీనిని అమలు చేయాల్సిన చట్టాలు, నియంత్రణలు, ఉపాయాలు భూమిక ద్వారా పాఠకులకు తెలిసింది. లైంగిక హింస కింద వచ్చే విషయాలు, చట్టపరిధిలోకి వచ్చే పని ప్రదేశాలు, సంఘటిత క్షేత్రాలలో యజమాని బాధ్యతలు, అసంఘటిత రంగం మరియు పదిమందికన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న సంఘటిత రంగ సంస్థల కోసం నిర్దేశించిన బాధ్యతలు అన్నీ పాఠకుల కోసం భూమిక అందించింది. స్త్రీలకు అవమానాలు, వేధింపులు జరిగిన ప్రతి సందర్భాన్ని భూమిక వేదికై పరిష్కరించింది, ప్రతిస్పందించింది.
కొండవీటి సత్యవతి గారు సంపాదకీయాల ద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ఆక్రందనలను, వేదనలను వ్యాసాల ద్వారా, కథల ద్వారా రాస్తూ, పరిష్కారాలను ఇస్తూ ఆలోచింపచేస్తున్నారు. స్త్రీల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గొంతెత్తి చాటుతున్న పత్రిక.
అనుభవజ్ఞులైన స్త్రీల ఆలోచనలు అందరికీ చేరే అవకాశం కల్పించిన పత్రిక. ఈ పత్రిక ద్వారా ఇప్పటి వరకు మూడు తరాల స్త్రీలు విమర్శకులుగా, కథకులుగా, నాటకకర్తలుగా, కవయిత్రులుగా, నవలాకారులుగా, రిపోర్టర్లుగా, పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. తమ తమ గొంతుల ద్వారా స్పందిస్తూ ఎంతోమంది స్త్రీలకు ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాలను చూపిస్తున్నారు.
ఉదాహరణ పరిశీలిద్దాం. ‘‘స్వతంత్ర జీవనం నేరమో, ఘోరమో కాదు. అది ఆమె వ్యక్తిగతం. ఆమె స్వేచ్ఛ, స్వతంత్ర జీవితంతో తృప్తిగా, హాయిగా ఉన్నదేమో… ఆనందంగా గడుపుతున్నదేమో? లేదా, తోటి మహిళలు చేసే వ్యాఖ్యానాలు ఆమె మనసును కుంచింపచేస్తాయేమో? మనుషుల ప్రేమరాహిత్యం ఒంటరి జీవితం పట్ల దిగులు కలిగిస్తాయేమో?’’ (ఆమె చాలా స్ట్రాంగ్, వి.శాంతి ప్రబోధ ` పుట: 25, జనవరి, 2023) ఇలాంటి వాక్యాలు ఆలోచింపచేస్తాయి, వెంటాడుతాయి.
స్త్రీ తనకంటూ ఒక జీవితాన్ని తయారు చేసుకోవాలని, తన వ్యక్తిత్వం నిలుపుకోవాలని, తన సామర్ధ్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలని, పురుషుల ప్రలోభాలకు లొంగకూడదని, కట్టుబాట్లు అనే సుడిగుండం నుండి బయటికి వచ్చి ఆలోచించాలని నేర్పుతున్న ఏకైక పత్రిక భూమిక.
` ఆచార్య కరిమిండ్ల లావణ్య, నిజామాబా