– రాధ మండువ
కొత్తచీర కట్టి కులుకుతూ వచ్చింది పనికి నీల.
కొత్తచీర కొనిందంటే ఆ తర్వాత రోజే దానిని కడుతుంది.
”అదేమిటి మొన్ననేగా ఒక కొత్తచీర కట్టావు. మళ్ళీ ఇంకోటా ఎన్ని కొంటావే.” అన్నాను.
”వాడు ఇచ్చాడు లేక్కా” అంది.
నాకు నవ్వొచ్చింది. ”ఎవడు వాడు” అన్నాను.
”డ్రైవర్ సురేష్ లేడూ వాడు. నిన్న కార్లో కూర్చోబెట్టుకుని బయటకు తీసికెళ్ళి ఇది కొనిచ్చాడు” అంది పక పకా నవ్వుతూ.
మా కాలనీలో అందరికీ కార్లు ఉన్నాయి. ఎవరికైనా అర్జెంటుగా డ్రైవర్ కావాలంటే ఈ సురేష్‌ని పిలుస్తుంటారు.
”ఓసినీ మళ్ళీ కొత్త స్నేహమా! ఛీ బుద్ధిలేని పిల్లా! నీ మొగుడికి తెలిస్తే తంతాడే” అన్నాను.
”వాడికేం తెలుస్తుందిలేక్కా! తాగుబోతు ఎదవ. కల్లంగడిలో దూరడం తప్పితే.” అంది.
దానిమాటల్లో మొగుడిని గురించి ఇసుమంత బాధ కూడా లేదు. ఏదో ఇది మామూలే అన్నట్లుగా నవ్వుకుంటూ మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నా మా నీల నవ్వుకుంటూ, కులుక్కుంటూ ఉంటుంది. పని చేసుకుంటూ మధ్య మధ్యలో నా గదికి వచ్చి నిలువుటద్దంలో వయ్యారంగా శరీరాన్ని అటూ ఇటూ తిప్పి చూసుకుంటూ, మైమరుపుతో పాటలు పాడుతూ ఉంటుంది.
”అయినా నీలా! ఈ రకంగా ఇష్టమొచ్చినట్లు ఎవరితో పడితే వారితో తిరగడం ఏమిటి? ఏమైనా రోగాలు తగులుకుంటే నీ బిడ్డల్ని ఎవరు చూస్తారు చెప్పు. నీ మొగుడిని మార్చుకోవడానికి చూడాలి కాని” అన్నాను హీతవు చెప్తూ.
నా మాటలేం పట్టించుకోకుండా చీపురు, పాత గుడ్డ పట్టుకుని వచ్చి పాటలు పాడుకుంటూ గది తుడవసాగింది. నేనూ పేపర్ చదవడంలో పడిపోయాను. పని అంతా చేసేసినట్లుంది. ఉదయం 11 అవుతుండగా నా దగ్గరగా వచ్చి కూర్చుంది. చేతిలో పళ్ళెం, దారపు ఉండ ఉన్నాయి. ఒళ్ళో నుండి తోటలో నుండి తెచ్చిన మల్లెపూలు పళ్ళెంలో పోసి కడుతూ –
”అక్కా! రేపు సినిమాకి పోతా – పనికి రాను” అంది.
”సినిమా మధ్యాహ్నం రెండు గంటలకి కదే. పొద్దున్నే రావడానికి ఏమిటట” అన్నాను.
”అబ్బ! నీకు అబద్ధం చెప్పలేమక్కా. సినిమాకి కాదులే. పిక్నిక్కి వెళుతున్నాం.” అంది కులుక్కుంటూ.
”ఆ సురేష్ తీసికెళ్తానన్నాడా” అన్నాను.
”ఊ” అందది.
”మరి పిల్లలు” అన్నాను.
”అమ్మోళ్ళింట్లో ఉంటార్లే” అంది.
ప్రియుడి మీద ప్రేమ, వాడితో జరిపే రాసక్రీడల తాలూకు మైమరుపు, కారులో తిరగాలనీ, బయట ప్రపంచం చూడాలనే కాంక్ష దాని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలా కాదనేది?
”సరే చావు. నిన్ను మార్చడం నా వల్ల కాదు గాని” అన్నాను ఏదో బింకానికి.
మర్నాడు వంట చేసి వెంకమ్మే అన్ని పనులూ చేసేసింది. ఆయన కోసం కంపెనీకి క్యారియర్ తీసుకెళ్ళే అబ్బాయికి క్యారియర్ కట్టిచ్చి ”భోంచెయ్యండమ్మా” అంది వెంకమ్మ నా గదిలోకి వచ్చి.
ఏదో రాసుకుంటున్న నేను ”నాకు ఆకలిగా లేదు వెంకమ్మా! నువ్వు తినేసెయ్. నేను తర్వాత తింటాలే” అన్నాను.
”నేనూ నీతోనే తింటాలేమ్మా” అంది అక్కడే కూలబడుతూ.
నాతో ఏదో చెప్పాలనుకుంటేనే వెంకమ్మ నా గదిలో అలా కూర్చుంటుందని నాకు తెలుసు కాబట్టి పుస్తకం, పెన్ను మూసి ఆమె వైపు చూశాను.
”ఈ నీలకి కాస్త భయం పెట్టమ్మా! ఈ మధ్య ఈ సురేష్‌తో ఎక్కడకి పడితే అక్కడకి వెళుతుంది. మా పేటోళ్ళంతా తెగ చెవులు కొరుక్కుంటున్నారు. మొగుడికి తెలిస్తే తాగుబోతు వెధవ దీన్ని బతకనివ్వడు. పిల్లలు అన్యాయం అయిపోతారు” అంది.
ఆమె ఆంతరంగం అర్థమైన నేను ”అది వినదులే వెంకమ్మా! మొగుళ్ళు ఎప్పుడు చూసినా కల్లు అంగళ్ళలో పడి ఉంటే పెళ్ళాలు తిరక్క ఏం చేస్తారు చెప్పు? అదీగాక ఇప్పుడు వీడెవడో దీన్ని కార్లో తిప్పుతున్నాడాయె. ఇక మన మాట వింటుందా. చెప్పి చెప్పీ నాకు విసుగు కలుగుతుంది” అన్నాను.
పైకి అలా అన్నాను కాని నాకు నీల గురించి దిగులుగా ఉంది. ఇతడి మీద ప్రేమ కూడా పెంచుకుంటున్నట్లు దాని వాలకం చెబుతుంది. దాని ఆనందం చూస్తుంటే ఏమీ చెప్పాలనిపించడం లేదు. ఎందుకో దిగులుగా అనిపించింది. ఇద్దరం భోంచేశాక సామాన్లు కొనుక్కు రావడానికి వెంకమ్మ బజారుకి వెళ్ళింది. నేను మళ్ళీ నా రాత పనిలో పడ్డాను.
మధ్యాహ్నం రెండు అవుతుండగా ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తాను. ”నేను మేడమ్ ఎస్సై నాగేంద్రని. ఎవరో నీలట – మీ పేరు చెప్తుంది. వీళ్ళిద్దరూ పొలాల్లో తిరుగుతుంటే అనుమానంతో స్టేషన్‌కి తీసుకొచ్చాం. ఇద్దరూ మొగుడూ పెళ్ళాలమని చెప్తున్నారు” అన్నాడు నాగేంద్ర.
”ఫోన్ నీలకి ఇవ్వండి” అన్నాను.
”హల్లో అక్కా! నేను నీలని” అంది. దాని గొంతు భయంతో వణికిపోతుంది.
”ఇన్స్పెక్టర్కి ఇవ్వు ఫోన్” అన్నాను.
”నాగేంద్ర గారూ! మా పనమ్మాయే. ఇద్దర్నీ ఇంటికి పంపండి ప్లీజ్” అన్నాను.
”సారీ! మేడం. ఇప్పుడే పంపిస్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ” అన్నాడు.
”పర్వాలేదు నాగేంద్ర గారూ. నా మీద గౌరవంతో మీరు నాకు ఫోన్ చేసినందుకు థాంక్స్ టు యు” అన్నాను.
సాయంత్రం అవుతుండగా ఇంటికి వచ్చింది నీల.
”సురేష్ ఏడీ” అన్నాను.
”బయట కారులో ఉన్నాడు. భయపడుతున్నాడు మిమ్మల్ని చూడటానికి” అంది.
”సరే. అతన్ని ఇంటికి పంపించెయ్” అన్నాను. నాకు కూడా ఎందుకో అతన్ని చూడాలనిపించలేదు.
నా గదిలోకి రాకుండా వంటింట్లోకి చేరి అంట్లు తోముకుంటున్నట్లుంది శబ్దాలు వింబడుతున్నాయి. ‘వచ్చినపుడే వస్తుందిలే – రాకెక్కడికి పోతుంది?’ అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాను.
”అక్కా! కాఫీ అంటూ నీల నా గదిలోకి వచ్చింది కాఫీ కప్పుతో. నీల చేతిలో నుండి కాఫీ తీసుకుని ”నువ్వు కూడా తెచ్చుకో” అన్నాను.
సాయంత్రం 6 అయింది. వెంకమ్మ వంట చేస్తుంది. నీల కాఫీ తెచ్చుకుని నా మంచం ఎదురుగ్గా క్రింద కూర్చుంది. ”ఏం జరిగిందో చెప్పవే” అన్నాను.
నాకు కోపంగా ఉందని దానికి అర్థం అయింది. ”కారు రోడ్డు మీద ఆపి పొలాల్లోకి వెళ్ళాం అక్కా చెట్టు కింద కూర్చుందామని. ఇద్దరు పోలీసులు వచ్చారు. ఒకడేమో కారు దగ్గర నిలబడ్డాడు. ఇంకోడు మా దగ్గరకి వచ్చి ఏమిటేమిటో ప్రశ్నలు. మేము మొగుడూ పెళ్ళాలమయ్యా అని సురేష్ చెపుతుంటే వినిపించుకోకుండా స్టేషన్‌కి తీసికెళ్ళారు. మా పేటోళ్ళకి, నా మొగుడికి తెలిసిద్దేమోనని భయమేసి మీ పేరు చెప్పా” అంది నీల. దాని గొంతులో ఇందాకటి భయమేమీ లేదు. అన్నీ మర్చిపోయినట్లు మామూలుగా మాట్లాడుతోంది.
నేనేదో అనబోయే లోపు ‘మాధవీ’ అంటూ మా ఆయన లోపలికి రావడంతో మా మాటలు ఆగిపోయాయి. నీల గబుక్కున లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
ఆ రోజు రాత్రి నీలని గురించిన ఆలోచనలతో చాలా సేపు నిద్ర రాలేదు. జీవితం ఆనందంగా గడపడానికే అని తర్కించినపుడు ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే అక్కడికి వెళతారు. అది సహజం. కాని ఇలాంటి సంబంధాల వల్ల ఆనందం కలుగుతుందా? దుఃఖం కలుగుతుందా? అయినా ధర్మం, నీతి, ఉన్నతం – వీటి స్థానం ఎక్కడ ఆనందామృత గ్రోలనలో? నిజమే కాని ఆనందాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఆనందంగా, స్వేచ్ఛగా ఉండాలిగా. ఇవన్నీ నీలకి ఎలా అర్థం అవుతాయి?
తర్వాత రోజు నీల ఎందుకో దిగులుగా ఉంది. మామగారు, అత్తగారు రావడంతో దానితో మాట్లాడటానికి తీరిక లేకుండా అయిపోయింది. సాయంత్రం వాళ్ళటు వెళ్ళగానే నా గదిలోనికి గబగబా వచ్చింది. ఏమిటో చెప్పాలనే ఆత్రం దాని కళ్ళల్లో గమనించి ”ఏమయింది నీలా?” అన్నాను.
”సురేష్ గాడు నన్ను వదిలేశా డంటక్కా!” అంది. ఫక్కున నవ్వాను అది చెప్పిన తీరుకి.
ఇక వారం రోజులు ముఖం వేళ్ళాడేసుకుని తిరుగుతుంది. మళ్ళీ మామూలే. ఇంకోడితో స్నేహం చేస్తుంది. అన్నీ మర్చిపోయి పక పకా నవ్వుకుంటూ వాడితో తిరుగుతుంది. నా దగ్గర పనికి చేరాక ఇప్పటికి ఇలా జరగడం నాలుగో సారి. అప్పుడు ఎంతో తేలిగ్గా నవ్వుకుంటూ తిరిగింది. ఎప్పుడూ కూడా అది ఒక విషయంగా నాతో మాట్లాడలేదు.
ఇప్పుడు మాత్రం నా నవ్వుకి నీల కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. ”వాడిని ఎట్టా నమ్ముకున్నాను? ఇప్పుడు నన్ను వదిలేసిపోయాడు. పెళ్ళానికి తెలిసిందట. ఉరి వేసుకుని చస్తాను అని ఇంట్లో బెదిరించిందట” అంది.
”పెళ్ళానికి ఎలా తెలిసిందీ” అన్నాను సందేహంగా.
”నేను ఫోన్లు చేస్తుంటా కదా! నిన్న రాత్రి చాలా సార్లు చేశాలే పోలీసులు పట్టుకున్నారని తెగ బాధ పడుతున్నాడని. పెళ్ళానికి అనుమానం వచ్చిందట. ఈరోజు పొద్దున్నే పనికొచ్చే ముందు కనపడి నన్ను మర్చిపో. నాకు ఫోన్ చెయ్యొద్దు’ అని చెప్పేసి వెళ్ళాడు” అంది.
”సరేలే. దరిద్రం వదిలింది. ఇలాంటి సంబంధాలు మంచిది కాదు అని చెప్తే వినకుండా తిరిగావు. ఇకనైనా తెలుసుకుని ప్రవర్తించు. నువ్వేమీ చిన్నపిల్లవి కాదు చెప్పడానికి” అన్నాను కఠినంగా.
”ఈమెకి ఏం చెప్పినా ఒకటే సోది” అనే టైపులో ముఖం పెట్టి బయటికి నడవబోయింది.
ఈసారి దానిని వదలకూడదు. ఇనుము కాలి ఉన్నప్పుడే వంచాలి అని అనుకున్నాను. ”నీలా! కూర్చో! నీతో మాట్లాడాలి” అన్నాను కోపంగా. నేను ఎగతాళి చేస్తే నవ్వుకుంటుంది కాని నా కోపాన్ని మాత్రం అది భరించలేదు. గమ్మున నా ఎదురుగ్గా కూర్చుంది. ”నీకు మగాళ్ళ మీద ఇంత పిచ్చేమిటే – కాస్తన్నా నీ ఆరోగ్యం గురించి, నీ పిల్లల గురించి ఆలోచించుకోవా? ఏ రోగమన్నా తగులుకుంటే నీ పిల్లల్ని ఎవరు చూస్తారు?” అన్నాను.
”నా తప్పేముందక్కా! నిన్ను ప్రేమిస్తున్నా అనేది వాళ్ళే. వదిలించుకునేదీ వాళ్ళే” అంది అమాయకంగా.
”వీళ్ళంతా ఉత్త శరీరాలని ప్రేమించే నీచులు నీలా! ఇలాంటి కాముకులికి కోరిక తీరేదాక భయం, వెగటు ఉండవు. ఒకసారి అనుభవించాక లోకోపవాదు, భయమూ, నీతీ, మర్యాదా అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఎన్ని అబద్ధాలైనా ఆడి తప్పించుకుంటారు. శరీర సంబంధమే ముఖ్యం కాదనుకునే వాళ్ళు. శారీరక సంబంధాన్ని మించి మురిపించే వాళ్ళు. ఆత్మ సౌందర్యాన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. లేదనడం లేదు. కాని అలాంటి వాళ్ళు చాలా తక్కువ నీలా!” అన్నాను. నా మాటల్లో ఒక ముక్కన్నా దానికి అర్థం కాలేదు. వెర్రి ముఖం పెట్టి నా వైపు చూడసాగింది. నైతికానైతికతలు, ధర్మాధర్మాలు తెలిసిన వారికే ఇలాంటి సంబంధాల మూలం, అంతు అర్థం కాకపోతుంటే నీలకి ఎలా అర్థం అవుతుంది?
”నా దగ్గర పనికి చేరినప్పటి నుండీ నిన్ను గమనిస్తున్నాను నీలా. దేని కోసం ఒకళ్ళు వదిలినా ఇంకోళ్ళ వెంట పడుతున్నావో నాకు అర్థం అయింది. నీవు అలాంటి సంబంధాలల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నావు. అందుకనే ప్రతి సంబంధాన్నీ తేలిగ్గా తీసుకున్నావు. వీడెవడో నీకు ఎక్కువ ఆనందాన్ని కలిగించాడు. వదిలేశాడని వగుస్తున్నావు” అన్నాను.
ఊహు – ఆ మాటలూ బుర్రకెక్కలేదు. ఇక లాభం లేదని కథలోకి దిగిపోయాను.
”నీకు ఎన్నో సార్లు మా గీత గురించి చెబ్దామనుకున్నాను” అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. కౌన్స్లింగ్ చేసేటప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుంది, ముఖ్యంగా నీల స్థాయిలో ఉండే వాళ్ళకి. నా కళ్ళల్లో నీళ్ళు చూసేటప్పటికి దానికి ఆసక్తి రేగినట్లుంది. వంచుకుని కూర్చుని ఉన్నది ఒక్కసారిగా వీపుని నిటారుగా చేసి నా వైపే చూడసాగింది.
గీత మా చెల్లెలు. నీలాగే చాలా అందంగా, తీగలాగా ఉంటుంది. పెళ్ళయిన రెండేళ్ళకే గీత భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. భర్త చనిపోయాక దానికి ఫిట్స్ పట్టుకున్నాయి. ఇలాంటి ఫిట్స్ ఎందుకు వస్తాయో కనిపెట్టిన డాక్టర్ రవి దీనితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. రవితో తిరగడం గమనించిన గీత మరిది ఇంట్లో దీన్ని వేధించసాగాడు. ‘ఆ డాక్టరు కంటే బాగా లేనా, నేను నీకు పనికి రానా’ లాంటి మాటలతో దాన్ని కుళ్ళబొడవటంతో రవి దగ్గరకి వెళ్ళి తన కోసం వేరే ఇల్లు తీసుకోమని, వేరే కాపురం పెట్టమని అడిగింది. దాని శరీరం కోసం దానితో సంబంధం పెట్టుకున్న వాడు వేరే ఇల్లు తీసుకుని దీనిని ఉద్దరిస్తాడా? ఎంత పిచ్చితనం?
రవి కాదనడంతో బావిలో పడి ప్రాణాలు తీసుకుంది. మాకు ఎవరికీ తన సంగతులు చెప్పలేదు. చనిపోయే ముందు అది నాకు రాసిన లెటర్ ఎక్కడో ఉంది దాచిపెట్టా. నీకు తర్వాత చూపిస్తా. నీలా! మా గీతకి భర్త లేడు. పిల్లలు లేరు. నీకు అన్నీ ఉన్నాయి. భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి కాని ఇలాంటి వారు ‘ప్రేమిస్తున్నాము’ అంటే ఎలా నమ్ముతున్నావో అర్థం కావడం లేదు” అన్నాను. నీల ఏమీ మాట్లాడలేదు. తలవంచుకుని కూర్చుంది.
”నువ్వు మా గీతలా కాకూడదనే ఇదంతా చెప్పాను. మళ్ళీ ఎక్కడా అనకు. మా పరువు పోతుంది” అన్నాను. ‘ఎవరికీ చెప్పకు’ అనేది చెప్పిన కథకు ప్రాముఖ్యతను కలిగించి కౌన్స్లింగ్కి బలం చేకూర్చే మాట. చివుక్కున తలెత్తి ”అయ్యో! నేనెందుకు చెప్తానక్కా” అంది.
మర్నాడు వెంకమ్మని పంపి నీల మొగుడు వీరిని పిల్చుకు రమ్మన్నాను. మధ్యాహ్నం 12 అవుతోంది. నీల వంటింట్లో పని చేసుకుంటుంది. వీరి రాగానే నా గదిలోకి తీసుకొచ్చింది. ఇద్దరినీ కూర్చోబెట్టుకుని చాలా సేపు మాట్లాడాను.
ఇప్పుడు వీరి తాగడం మానలేదు కాని పనినుండి పెందలాడే ఇంటికి వస్తున్నాడట. ఒక్కొక్క రోజు ‘ఈరోజు తాగలేదక్కా’ అని కూడా చెప్తుంది నీలా.
అయితే నీలలో ఆ కులుకు, ఆనందం ఇప్పుడు లేవు. నాకు దాన్ని చూస్తే చాలా బాధగా ఉంది. నేను నీలకి మంచి చేశానా? చెడ్డ చేశానా? అని….