మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే

ఎనభయ్యవ దశకపు మహిళా ఉద్యమం పుట్టుక నుండి, ఇంకా మాట్లాడితే పుట్టకముందు నుండి స్త్రీలకు ఎదురయ్యే వివక్ష, హింస వారిని అభివృద్ధి అంచులలోనే మిగులుస్తున్నాయని ఘోషించింది. గర్భస్థశిశువు ఆడపిల్ల అయితే పిండదశలోనే అంతం చేయటం, పుడితే పురిట్లోనే చంపెయ్యటం, అమ్మెయ్యటం బాల్యంలోనే పెళ్ళిళ్ళు చేయటం వంటి సామాజిక దుర్మార్గాలను గురించిన అవగాహన కలిగించే విధంగా చర్చలను అభివృద్ధి చేసింది. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. లింగనిర్ధారణ పరీక్షలను నివారించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఇది 1988లో లింగనిర్ధారణ పరీక్షల నివారణ చట్టం రావటానికి ఉపయోగపడింది.

లైంగిక సుఖసంపాదన సాధనంగా స్త్రీని భావించే భూస్వామ్య పెత్తందారీ సంస్కృతిలో స్త్రీల మీద అత్యాచారాలు సర్వసాధారణమే అయినా ఆంధ్రదేశంలో మహిళా ఉద్యమం వీటికి గట్టి ప్రతిఘటననే ఇచ్చింది. 1989లో టంగుటూరులో పొగాకు గ్రేడింగ్‌ కంపెనీలో పనిచేసే ఇందిర అనే దళిత స్త్రీని అత్యాచారం చేసి పెట్రోలు పోసి తగలబెట్టిన కుందేటి సత్యాన్ని శిక్షించాలని మహిళా సంఘాలు పౌరహక్కుల సంఘాలతో ప్రజాసంఘాలతో కలిసి ‘ఇందిర హత్య వ్యతిరేక పోరాట కమిటీ’ని ఏర్పరచి పనిచేసిన తీరు ఇందుకు నిదర్శనం. అత్యాచారాలకు, వీధి వేధింపులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఉద్యమాలు నడిచినకాలం ఇది.

1970వ దశకం నుండి మహిళా ఉద్యమానికి వరకట్నం సమస్య పెద్ద సవాల్‌ అయింది. 1961లో వరకట్ననిషేధం చట్టం చేయబడినా 1984లో ఒకసారి 1986లో మరొకసారి సవరణలు చేయబడినా ఆ చట్టం ఆశించింది ఆచరణవాస్తవం కాలేదు. వరకట్నం లేని పెళ్ళి జీవిత సంస్కారంలో భాగం కాలేదు. వరకట్నం కోసం వేధింపులు, సాధింపులు, అదనపు కట్నం కోసం ఒత్తిళ్ళు, పుట్టింటికి పంపటం ఇలాంటివి ఎన్నో స్త్రీల జీవితాన్ని తీవ్ర వేదనకు గురిచేశాయి. ఆర్థిక స్వతంత్రం లేకపోవటం, వున్నా బయటకు వచ్చి ఒంటరిగా జీవించగల సామాజిక చైతన్యం లేకపోవటం వంటి కారణాలతో చస్తే పీడా పోతుందని ఆత్మహత్యలకు ఒడిగట్టినవాళ్ళు ఎందరో. కాకపోతే కోరిన కట్నం, అదనపు కట్నం తేలేని భార్యను వదిలించుకొంటే మళ్ళీ పెళ్ళి చేసుకొని మళ్ళీ కట్నం సంపాదించుకొందామన్న దురుద్దేశంతో స్వయంగానో, తల్లి తదితర కుటుంబసభ్యుల సహాయంతోనో కిరోసిన్‌ పోసి కాల్చి చంపి ఆత్మహత్యలని చెప్పి వదిలించుకొనటమో ఆంధ్రదేశమంతా ఈ దశకంలో కనిపిస్తుంది. 1983 నాటికి వరకట్న మరణాలు 386 కాగా, 1987 నాటికి వాటి సంఖ్య 1128కి చేరటం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. మహిళా ఉద్యమం వలన కోర్టు వరకు వెళ్ళిన కేసులలో కూడా నేరస్థులు నిర్దోషులుగా విడుదలయిన సందర్భాలే అనేకం. న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులకు వున్న పితృస్వామిక స్వభావం హిందూ కుటుంబ వ్యవస్థలోని అధికార ఆధిపత్యాల గురించిన అలవాటైన ఆమోదం, కట్నాలు, కానుకలు, మర్యాదలు మొదలైనవాటిని సహజ సంప్రదాయాలుగా చూచే సంస్కృతి వీటికి కారణం. మహిళా సంఘాలు ఐక్యంగా ఒక సార్వజనీన సార్వత్రిక ఉద్యమాన్ని నిర్మించకపోయినప్పటికీ చాలాచోట్ల ఈ నేరాల గురించి ప్రచారం చేసి, నిరసనలు ప్రకటించి, స్త్రీల మౌలిక జీవన హక్కుల మీద ఒక క్రమపద్ధతిలో జరుగుతున్న దాడిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావటంతోపాటు స్త్రీల చైతన్యాన్ని మెరుగెక్కించే కృషి చేశాయి.

వరకట్న బాధిత మహిళలలో స్థానిక మహిళాసంఘాలు తమ సమస్యను పరిష్కరిస్తాయన్న నమ్మకం బలపడిన దశకం ఇది. మహిళా సంఘాలు కట్నం కోసం తమను వేధిస్తున్న అత్తమామలను, భర్తలను నచ్చచెప్పో, బుజ్జగించో, బుద్ధి చెప్పో, భయపెట్టో చక్కదిద్ది తమకు సుఖసంసార జీవితం ఇవ్వాలని బాధిత స్త్రీలు ఆశించారు. స్త్రీల అభ్యర్థనల మేరకు సంఘాలు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని వాళ్ళ కోరికలు ఎంత అసహజమో, అమానవీయమో, అప్రజాస్వామికమో వివరించేందుకు గంటలు గంటలు, రోజులు రోజులు వెచ్చించిన సందర్భాలు ఎన్నో వున్నాయి. కట్నం ఒక్క విషయం మీదే కాదు రకరకాల రూపాలలో కుటుంబం తన జీవితం మీద చేసే నియంత్రణను, తిండి దగ్గర నుండి పిల్లలను కనటం వరకు ఏ విషయంలోనైనా చేసే అదుపును అధికారాన్ని భరించలేని స్త్రీలు కూడా తమ భర్తలకు, కుటుంబ సభ్యులకు బుద్ధి చెప్పమని మహిళా సంఘాలను ఆశ్రయించేవాళ్ళు. ఈ రకంగా వ్యక్తి సమస్యలు సామాజిక చర్చలోకి రావటం, వ్యక్తి సమస్య పరిష్కారం కొరకు సంఘాలు సమయాన్ని పెట్టటం మహిళా ఉద్యమంలోని విలక్షణత.

స్త్రీల అకాల, అసహజ, అనుమానాస్పద మరణాలకు స్పందించి మహిళాసంఘాలు వాటి వెనుక వున్న వాస్తవాలను వెలికితీసే నిజనిర్ధారణ బృందాలుగా నిర్వహించిన పాత్ర చెప్పుకోదగింది. ఈ పని క్రమంలో అప్పటికప్పుడు స్త్రీల జీవన హక్కుల మీద క్రమబద్ధంగా జరుగుతున్న దాడిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావటంతో పాటు స్త్రీల చైతన్యాన్ని మెరుగెక్కించే పని నిత్యం నిరంతరం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ‘స్త్రీల అసహజ మరణాలన్నీ వరకట్నపు హత్యలే’నన్న అవగాహన విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చాయి. అలాగే మహిళా ఉద్యమం ‘స్త్రీల హక్కులు మానవహక్కులే’ అన్న నినాదంతో పౌరహక్కుల ఉద్యమాన్ని ప్రభావితం చేసింది. రాజ్యహింస గురించి మాట్లాడే, పనిచేసే, పౌరహక్కుల సంఘం ‘కుటుంబ హింస’ గురించి ఆలోచించక తప్పదని గుర్తుచేసింది. ఆ రకంగా కుటుంబాన్ని వ్యక్తిగత పరిధుల నుండి తప్పించి చూడవలసిన, అర్థం చేసుకోవలసిన అధికార వ్యవస్థగా నిరూపించింది. రాజ్య ప్రయోజనాలను కాపాడే యూనిట్‌గా అది నిర్వహిస్తున్న పాత్ర గురించి అర్థం చేసుకొంటే తప్ప రాజ్యాన్ని గురిచూడటం సాధ్యం కాదన్న అవగాహనను మహిళా ఉద్యమం ఇయ్యగలిగింది.

1990-91 లో నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టబడింది. భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ మార్గం పట్టింది. ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణకు ప్రధానాంగాలు. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక (1992-97) తదనుగుణమైన లక్ష్యాలనే ప్రకటించింది. స్త్రీల విషయంలో మహిళల స్థాయిని పెంచటానికి తల్లిదండ్రుల ఆస్తిలో సమానంగా హక్కును కల్పించాలని గుర్తించటం, మిగులు భూముల పంపిణీ సందర్భంలో 40 శాతం మహిళలకు హక్కును కల్పించాలని మిగతా 60 శాతం భార్యాభర్తలకు కలిపి పట్టా చెయ్యాలని ఈ ప్రణాళికలో గుర్తించడం జరిగింది. అయితే ఆ లోపుగా చట్టపరమైన చర్యలు చేపట్టబడలేదు. అవి ఆశించినట్లు అమలులోకి రాలేదు. ఉపాధిని కల్పించటం, జనాభా వృద్ధిని తగ్గించటం, నిరక్షరాస్యతను తొలగించటం, రక్షిత మంచి నీరు, ప్రాథమిక ఆరోగ్య వసతులు అందించటం మొత్తంగా ఈ ప్రణాళిక లక్ష్యాలు. ఉపాధి కల్పన ఆరు ఏడు ప్రణాళికా కాలాలనుండి కొనసాగి వస్తున్నదే. ఉపాధి కల్పన అభివృద్ధి క్రమం వెలుపలే నన్నది ఇప్పటికే స్పష్టమైంది. రక్షిత మంచి నీరు, ప్రాథమిక ఆరోగ్య వసతులు అందించటం తొమ్మిదవ ప్రణాళిక (1997-2002) లక్ష్యాలుగా కొనసాగాయి. ఇళ్ళులేని నిరుపేదలకు ఇళ్ళు, పిల్లలకు పౌష్టికాహారం, సార్వజనీన ప్రాథమిక విద్య గ్రామాలకు రహదారులు అదనంగా చేరాయి. స్త్రీల సాధికారతను ప్రోత్సహించడం కూడా ఇందులో వుంది. ఈ కాలంలో మహిళా ఉద్యమానికి విషయమైన జీవన సమస్యలు ఏమిటి? వేటిని ఏ మేరకు అది సంబోధించ గలిగింది, పరిష్కరించగలిగిందీ చూడాలి.

90వ దశకంలో తొలిపెద్ద మహిళా ఉద్యమం సారా వ్యతిరేక ఉద్యమం. 1990 నాటికే సారాకు, సారా వ్యాపారానికి వ్యతిరేక చైతన్యం ఒకటి విప్లవోద్యమం వలన ఆంధ్రదేశమంతా విస్తరించింది. సారాకు, రాజకీయాలకు పోలీసులకు వున్న సంబంధాలపైన సారా సంపాదనపైన, అది సృష్టించిన నేరమయ ప్రపంచంపైన విశ్లేషణలు జరుగుతూనే వున్నాయి. ఆ పరిస్థితులలో నెల్లూరు జిల్లాలో దూబగుంటలో సారా వ్యతిరేక మహిళా పోరాటం 1992 ఆగస్ట్‌ 15న ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలోని మహిళా సంఘాలు స్వచ్ఛంధ సంస్థలు, జనచైతన్య వేదిక కలిసి సారా వ్యతిరేక సమన్వయ సమితిగా ఏర్పడి లక్షా డెబ్భై ఏడు వేల మంది సంతకాలతో వినతి పత్రం జిల్లా కలెక్టరుకు ఇయ్యటం దగ్గర నుండి సెప్టెంబరు 11న 25 వేల మందితో ప్రజా ప్రదర్శన జరిపి ప్రభుత్వ సారా పాటలను ఆపించటం వరకు అనేక కార్యక్రమాలతో ఈ ఉద్యమం నడిచింది. ఈ చైతన్యం కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు విస్తరించింది. సారా వేలం పాటలను ఆపటం లక్ష్యంగా ఉద్యమం కొనసాగింది. ‘సారా కాదు సాగు నీరు కావాలి’ అన్న నినాదంతో నల్లగొండలో ప్రజా ప్రదర్శన జరిగింది. ఉత్తర తెలంగాణా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలోనూ సారా వ్యతిరేక మహిళా ఉద్యమ నిర్మాణానికి మహిళా సంఘాలు చొరవ చూపాయి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికక్కడ జిల్లాల వారీగా, గ్రామాల వారీగా సారా వ్యతిరేక పోరాట కమిటీలు ఏర్పాటయినాయి. సారా త్రాగవద్దని ప్రచారం చేయుట, సారా రాజకీయాలను వివరించి కుటుంబాలపై దాని ప్రభావాన్ని చెప్పటం, మహిళలను చైతన్య పరచి ఉద్యమంలోకి సమీకరించటం, సారా నిషేధానికి ప్రభుత్వంపై వత్తిడి పెంచటానికి ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించటం, సారాను గ్రామంలోకి రాకుండా అడ్డుకోటం, సారా పాకెట్లను వినియోగంలోకి రాకుండా ధ్వంసం చేయటం, సారా వ్యాపారస్థులను, కాంట్రాక్టర్లను నిరోధించటం వంటి కార్యక్రమాలతో ఉద్యమం నడిచింది.

మొదట్లో అక్షరాస్యతా కార్యక్రమం సాధించిన విజయంగా భావించి స్త్రీల చైతన్యాన్ని చిన్నపిల్లల ముద్దుగా చూసి హర్షించినా రాను రాను అది రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా తీవ్రతరమవుతుంటే దానిని ఆమోదించటం, చూస్తూ ఊరుకొనటం సారామీదనే నడిచే ప్రభుత్వాలకు కష్టమైంది. సారా వేలం పాటలను యధాతథంగా కొనసాగించటానికే నిర్ణయించుకొని ఉద్యమకారులపై కేసులు బనాయించటం, పోలీసులు, సారా గుండాలు ఉద్యమకారులపై అఘాయిత్యాలు, దౌర్జన్యం చేయటం మొదలైంది. సారా నిషేధం వల్ల ప్రభుత్వ రెవెన్యూ తగ్గుతుందని వాదనలోకి దిగింది ప్రభుత్వం. ప్రభుత్వం సారా కాంట్రాక్టర్లు కలిసి ప్రతియేటా పేద ప్రజల నుండి సారా అమ్మకాల వల్ల పొందే 3200 కోట్ల రూపాయలకు, అదే ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చించే 400 కోట్ల రూపాయలకు మధ్య వున్న ‘ఎనిమిదింతల’ లబ్ధిని గురించి చెప్పి దీనిని బట్టి పేదవాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఏమీ లేవని, పైగా ప్రభుత్వాన్ని నడపటానికయ్యే ఖర్చు ప్రజలే భరిస్తున్నారని లెక్కలు తీసి సవాలు చేశారు ప్రజలు. చివరకు 1993 అక్టోబర్‌ 1 నుండి రాష్ట్రమంతటా సారాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయక తప్పలేదు ప్రభుత్వానికి.

సారా వ్యతిరేక మహిళా ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమంలో ఒక గుణాత్మకమైన అభివృద్ధి. సారా వినియోగం, ఆరోగ్య సమస్య గానో, నైతిక సమస్య గానో కాక స్త్రీల సమస్యగా చూడబడటం ఇందులోని ముఖ్యాంశం. పురుషుల సారా వినియోగం కుటుంబ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. స్త్రీ శ్రమను దోచుకుంటుంది. స్త్రీపై కుటుంబ భారాన్ని పెంచుతుంది. స్త్రీని శారీరక హింసకు గురిచేస్తుంది. మొత్తంగా ‘కుటుంబ హింస’ నుండి విముక్తి సారా వ్యతిరేక మహిళా ఉద్యమంలో లక్ష్యం అయింది. ఈ విధమైన కుటుంబ హింసకు రాజ్యానికి సంబంధం వుందన్న అవగాహన అభివృద్ధి కావటం సారా వ్యతిరేక మహిళా ఉద్యమంలో మరొక అభివృద్ధి కర అంశం.

కుటుంబ హింస మానవ హక్కులతో ముడిపడి వున్న అంశంగా ఈ శతాబ్ధిలో గుర్తింపును పొందింది. 1993లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కుటుంబ హింసను స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన కారణంగా పేర్కొనటం, 1994లో ప్రపంచబ్యాంకు నివేదిక కుటుంబ హింస వల్ల స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు భవిష్యత్తులో ఆయా దేశాల ఆరోగ్య వ్యవస్థలకు పెద్ద బరువుగా మారబోతున్నాయని హెచ్చరించటం గమనించవచ్చు. ఈ నేపధ్యంలోనే ‘కుటుంబ హింస’ కు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తయారు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1994లో జాతీయ మహిళా కమీషన్‌ కుటుంబ హింసకై ఒక ముసాయిదా బిల్లును తయారు చేసింది. లాయర్స్‌ కలెక్టివ్‌ సంస్థ ఈ విషయంపై ఒక బిల్లును చేసి 1999లో దేశవ్యాప్తంగా చర్చకు పెట్టటం జరిగింది. సారా వ్యతిరేక మహిళా ఉద్యమం కుటుంబ హింస మూలాల మీద ప్రకటించిన యుద్ధమైతే మూలాల గురించిన చర్చే లేని చికిత్స గురించిన ఆర్భాటం ఇది. ఇదయినా ప్రజాసంస్థల, మహిళా సంఘాల నిరంతర ఒత్తిడి వల్ల ఆ తరువాత ఏడేళ్ళకు కానీ చట్టరూపాన్ని తీసుకోలేదు. (కుటుంబ హింస బాధిత మహిళల రక్షణ చట్టం 2005)

ఈ దశకంలో ఆంధ్రదేశ మహిళా ఉద్యమాన్ని ప్రభావితం చేసిన ఘటన భన్వారీ దేవిపై అత్యాచారం 1992 సెప్టెంబరులో రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి ప్రాజెక్టులో పనిచేస్తున్న భన్వారీదేవి ఉద్యోగ ధర్మంగా బాల్యవివాహాలను ఆపటానికి చేసిన ప్రయత్నం పెత్తందారీ వర్గాలకు సహించరానిదైంది, తమ మార్గానికి అడ్డువచ్చిన ఆమెకు బుద్ధిచెప్పటానికి ‘సామూహిక అత్యాచారం’ జరిపారు. కోర్టులో కేసుపెడితే ‘అగ్రకుల పురుషులు ఒక కింది కులం స్త్రీని రేప్‌ చేసి తమను తాము కించపరుచు కోరు’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. స్త్రీలకు రక్షణే కాదు న్యాయం కూడా కొరవడటం బాధిత స్త్రీ పట్ల కాక సానుభూతి బాధించిన వాళ్ళకే దక్కటం, స్త్రీ కావటం వల్ల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితులలోకి స్త్రీలు నెట్టబడటం ఒక అంశమైతే దళిత స్త్రీ విషయంలో ఆమె ఎదుర్కొనవలసిన అవమాన సామాజిక నిర్లక్ష్యం కులం వల్ల రెట్టింపు కావటం ఈ సందర్భంగా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమం అవగాహన పెరగటంలో భన్వారీ అనుభవాల గురించిన చర్చ ఉపయోగపడింది.

న్యాయం కోసం భన్వారీ చేస్తున్న పోరాట స్ఫూర్తిగా ‘విశాఖ’ అనే సంస్థ ద్వారా ఐదు స్వచ్ఛంధ సంస్థలు కలిసి పనిచేసే చోట లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యోగం చేసుకొనే చోట లైంగిక వేధింపులకు గురయ్యే స్త్రీల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్‌తో సభలు పెట్టి ఊరేగింపులు జరిపి చివరకు రాజస్థాన్‌ ప్రభుత్వంపై ప్రజావ్యాజ్యం సుప్రీం కోర్టులో వేశారు. 1997 ఆగస్టు 13న తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు పనిస్థలాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆయా సంస్థలు చర్యలు చేపట్టాలని అందుకు మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. ఈ తీర్పు పాఠాన్ని ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారంలో పెట్టటం, ప్రతి సంస్థలోనూ ఫిర్యాదుల కమిటీ ఏర్పాటుకు ఒత్తిడి తేవటం వంటి పనులను ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమం సమర్థవంతంగా చేసింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.