సంకి – ఒడియా మూలం : ప్రతిభా రాయ్‌ అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ

సభ్యసమాజాన్నీ ఆదివాసుల ప్రపంచాన్నీ వేరుచేస్తున్న ట్లుగా రాళ్ళమీద రాళ్ళు పేర్చిన ప్రహారీ గోడ పొడవుగా నిలిచింది – దాని పేరే ‘రునుక బోరు’ లేక ‘బొండా గోడ’.

బొండా గోడ మధ్యలో ఓ సన్నని దారి, ఎంత సన్ననిదంటే ఆ దారి గుండా ఒక్క మనిషి మాత్రమే నడవగలరు. ఆదారి కారడవిని చొచ్చుకుని సభ్యసమాజాన్ని, మల్కాన్‌గిరి సబ్‌ డివిజన్‌లోని ఖయిరిపుట్‌తో కలుస్తుంది.

బొండా గోడ లోపల బొండాల సామ్రాజ్యం. బొండా పర్వతంపైనున్న ఆదివాసులకు అరణ్యమే సంపద, అరణ్యమే సంస్కృతి. రునుక బోరును దాటి కృత్రిమత సభ్యత బొండాల గ్రామాల వరకు చేరలేదు. ప్రకృతి ఆదిమ సంస్క ృతి, కృత్రిమత సభ్యత. బొండాలు ఆదివాసులు. వారు మారలేదు. మారాలని అనుకోలేదు. కృత్రిమతలలో యిరుక్కు పోవడానికి వారు యిష్టపడలేదు. ఆదిమకాలం నుండి వచ్చిన సూర్యచంద్రులు, భూమి ఏవీ మారనప్పుడు తాము మాత్రం ఎందుకు మారాలి? అందుకే సభ్యసమాజానికి కేవలం పధ్నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ వారు ఆదిమవాసులుగానే ఉన్నారు.

రునుకబోరు నుండి ఓ పచ్చని కొమ్మను విరిచి మనస్సులోనే ప్రార్థించుకుంది సంకి ‘బుద తిరిగి రావాలి, బుద తిరిగి రావాలి’ అని. గోడ దాటి కిందకు దిగే ముందు ఓ చిన్న చెట్టుకొమ్మను విరిచి రునుకబోరుకి నైవేద్యంగా సమర్పించుకోవడం బొండాల ఆచారం. సంకి లాంటి చాలా మంది అమ్మాయిలు చెట్టుకొమ్మను నైవేద్యంగా పెట్టి ప్రార్థిస్తారు ”తిరిగి రావాలి, తిరిగి రావాలి” అని.

దుర్భేద్య పర్వతాల మధ్య కాకులు దూరని కారడవి మధ్య, లోతైన లోయల్లో మధ్యాహ్నపు యెండ అరణ్యాల్లో విస్తారంగా పరుచుకునే చోట, ముదిలిపడ, బొండాల రాజధాని ఉంది. దానికన్నా ఎత్తయిన స్థలంలో అండ్రాహాలు ఊరు ఉంది. పన్నెండు ఊళ్ళు కలిపితే ‘చార్‌జంగ్‌’ రాజ్యం. ఒక ఊరిలో ఉన్న బొండా ఇంకొక ఊరివారికి ‘సరుభాయ్‌’ అంటే దేవుడిచ్చిన సోదరుడన్నమాట. ఒకే ఊళ్ళో ఉన్న యువతీ యువకులు పెళ్ళి చేసుకోడం ఘోర పాపం బొండాలకు.

ముదిలిపడ గ్రామం పొలిమేరలో మర్రిచెట్టు మొదట్లో సింగి మహా ప్రభు (సూర్యుడు) ఖడ్గం ఉంది. మాఘ మాసంలో మొదటి సోమవారం సింగి మహాప్రభు ఖడ్గానికి మేకలు, కోళ్ళు బలి యిస్తారు. ముదిలిపడ గ్రామానికి యిరువైపులా కిచాపడ, బరగడ గ్రామాలున్నాయి. సంకి ఇల్లు కిచాపడ గ్రామంలో. బుద కిర్సని ఇల్లు బరగడ గ్రామంలో.

బొండాల మాదిరిగానే వారి గ్రామాలు కూడా ఉంటాయి. కట్టుబాట్లు ఉండవు. భేషజాలుండవు. అడవిలో చెట్లు ఎక్కడ బడితే అక్కడ మొలిచినట్లు బొండా గ్రామాలకు కూడా ఓ పద్ధతీ పాడూ లేవు. గ్రామాల్లోపల ఒక పద్ధతి లేకుండా ఉంటాయి ఇళ్ళు గుంపులుగా, ఎక్కడా రహదార్లంటూ ఉండవు. బొండాలు ఏవైపు పాదాలు మోపుతారో అదే వారి దారి.

గ్రామం మధ్యలో ‘సింధి బోరు’ అనే కూడలి, మర్రి చెట్టు నీడలో దాని మొదట్లో ఓ చదునైన బండ. ఉదయం, సాయంకాల వేళప్పుడూ, పండక్కీ పబ్బానికి గ్రామంలోని ఆబాల గోపాలానికీ అదే రచ్చబండ. గ్రామంలో న్యాయానికీ తీర్పులకూ, సాఫల్యాలూ, విఫలాలూ, లాభనష్టాలకూ అదే చర్చా స్థలం. సింధిబోరు నానుకుని గ్రామదేవత ‘హుండి’ గుడి. అక్కడే అందరూ పూజలు చేసుకుంటారు బలి ఇస్తారు.

గ్రామం పొలిమేరలో ‘సెలిన్‌డింగె’ అంటే ఆడపిల్లల బస, ఇంకా ‘ఇంగ్రసన్‌’ అంటే మగపిల్లల బస. ఆకాశంలో మేఘాలు లేకపోయినప్పుడు, తుఫాన్లు లేనప్పుడు బరగడ గ్రామంలోని యువకులు కిచాపడ గ్రామానికి కాగడాలు తీసుకుని వస్తారు. కిచాపడలోని యువతులు ‘సెలిన్‌డింగె’ లో పడుకుంటారు. బరగుడ గ్రామంలోని ‘ఇంగ్రసన్‌’లు అంటే యువకులు యీ విధంగా పాడతారు.

ఓ నేస్తమా ఆడదాం, పాడదాం

నువ్వే నాకు తోడు…

బర్రె బలులు చూద్దాం

నువ్వేనాకు తోడు…’

ఇలా పాటపాడి ఆ రోజు బరగుడ గ్రామంలోని బుదకిర్సని అనే యువకుడు కిచాపడ గ్రామంలోని ‘సంకి’ అనే యువతి చేతికి ఇత్తడి కంకణం తొడగడానికి అనుమతి కోరేడు. సంకి నవ్వి జవాబుగా అంది ‘నువ్వు ముందిది చెప్పు. నువ్వు దోనెలో తింటావా? గిన్నెలో తింటావా?’ పదేండ్ల బరకిర్సని పళ్ళికిలించి అన్నాడు, ‘ఇప్పుడు దోనెలో తింటున్నా గాని నిన్ను మనువాడిన తర్వాత గిన్నెలో తింటాను’. సంకి పులకించి పోయింది. అయితే ఇత్తడి కంకణం వేసుకునేముందు బుదకిర్సని మగతనం పరీక్షించింది. ఓ నిప్పు కణికను తెచ్చి బుదకిర్సని ఛాతిమీద పెట్టింది. బుద ఓడిపోలేదు. వాడు సంకిని ప్రేమిస్తున్నాడు. నిప్పు వేడికి అరిచివుంటే వాడి మగతనానికి మచ్చపడేది. సంకి ఇక ఇత్తడి కంకణం పుచ్చుకుని ఉండేది కాదు. పెళ్ళి ఆగిపోతే మాత్రం బుదకి ఏం తక్కువ కాదు. వేరే గ్రామంలో పిల్లని వెదుక్కునేవాడు – అయితే సంకి మాత్రం కన్నెగానే మిగిలిపోయేది. బొండాల్లో యిది ఒక నియమం. బుద ప్రేమ పరీక్షలో గెల్చాడు. సంకి ఇత్తడి కంకణం తీసుకుంది. అక్కడే పెళ్ళి కుదిరిపోయినట్లు. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఇరువైపులా సమ్మతం తెలిపారు. దీపావళి రోజున పదేండ్ల బుదకిర్సనికి, ఇరవైమూడేండ్ల సంకికి పెళ్ళి కుదిరింది.

మాఘమాసంలో పెళ్ళి. పెళ్ళికి ముందు బుద తన తండ్రి మంగళకిర్సని యింటి ప్రక్కనే ఇంకో యిల్లు కట్టేడు. పెళ్ళి తర్వాత సంకితో అక్కడే కాపరం పెడ్తాడు.

బుద తండ్రి సంకి తండ్రికి రెండు పశువులు, ఒక పంది, కల్లు, వరి కన్యాశుల్కంగా యిచ్చుకున్నాడు. వరన్నం బర్రెమాంసం వండి బరగుడలో అందరికీ పెళ్ళి విందు చేశాడు. ఇక సంకి బుద యింటికి కాపరానికి వచ్చింది. తనతో కూరలు, ఫలమూలాలు, ఓ ‘రింగా’ (నడుంచుట్టూ కట్టుకునే గుడ్డ) తెచ్చుకుంది. ఇదే వారి ‘సిబంగు’ పెళ్ళి.

సంకి బుద యింటికి వచ్చింతర్వాత ఇద్దరూ వారి గృహదేవత ‘గుప్పసింగ్‌’ కి పూజ చేశారు, మొక్కుకున్నారు ‘మాకు మంచి పంట వచ్చేట్టు చేయి, చాలామంది పిల్లల్ని కనేట్టు చేయి’, అని.

సంకి, బుదల మధ్య పన్నెండు పదమూడేండ్ల తేడా ఉంది. సంకి మంచి ఏపుగా పెరిగింది. బుద కంటె పొడగరి. బొండాల్లో భార్యాభర్తల మధ్య యీ వయసు తేడా ఉంటుంది. పది పన్నెండేండ్లకే మగపిల్లవాడు యుక్తవయసు కొచ్చేస్తాడు. ఇక ఊళ్ళలో ఉన్న ‘సెలెన్‌ డింగ’ ల్లో తోడుకోసం వెతకడం మొదలెడ్తాడు.

సంకి నడుంచుట్టూ రంగు రంగుల దారాలతో తయారైన అరిచేతి వెడల్పున్న ‘రింగా’ కట్టుకుంటుంది. వయస్సులో ఉన్న ఆమెకు అదే వస్త్రం. మెడకు అడట, ఉచుంగ, ముదియ అనే రంగు రంగుల పూసల్తో తయారైన ఆభరణాలు వేసుకుంటుంది. మెడలోంచి ఓ ముఫ్పై నలభై పూసల మాలలు వేలాడుతూంటుంది నడుం వరకు. చెవులకు ‘ఉంచుకలు’ పెట్టుకుని ఉంటుంది. తల నున్నగా బోడించుకుని ఉంటుంది. ఆ బోడితల చుట్టు పొడవాటి గడ్డితో పేనిన పూసల్లాంటి సరాలు, తాటిరేకుల్తో చేసిన ‘రెఉరు’ చుట్టుకుని ఉంటుంది. ఆమె తలకు ఆ పూసల సరాలు బాగా నప్పేయి. ఆమె బలిష్టమైన చేతులకు ఉన్న కంకణాలు చెకుముకి రాయిలా ఎండలో మెరుస్తూంటాయి. బుద కండ్లకు సంకి బొండా పర్వత రాశకిలా కనిపిస్తుంది.

బుద పీలగా, పొట్టిగా ఉంటాడు. మీసాలు గడ్డాలు మొలిచేందుకు ఇంకా సమయముంది. బొండా మగాళ్ళం దరిలాగానే ఓ చిన్న ఘుసి (గోచి) కట్టుకుని ఉంటాడు, అంతే. కుటుంబ సభ్యులందరూ అంతే, అలానే అనాచ్ఛాదితులుగానే ఉంటారు. తప్పేముంది? అడవిలో చెట్లూ చేమలు పశుపక్ష్యాదులు బట్టలేసుకుంటాయా యేం? సూర్యుడు చంద్రుడు, మేఘాలు, భూమి ఆకాశం, నది, వనాలు ఇవన్నీ తమను తాము కప్పుకుం టాయా? శరీరాన్ని దేవుడిచ్చాడు. దాన్ని కప్పుకుని తిరగాలా? బొండాల మనస్సు ఆకాశంలా తేటతెల్లన. పర్వతంలా దృఢమైనది, కఠోరమైనది. అరణ్యంలా అతని జీవితం ఆదిమం, ప్రకృతిపరం.

బుద మెడలో ఓ పూసల సరం ఇంక ‘డంగ’ (తావీజు) వేసుకుని ఉంటాడు. తోలుతో చేసిన డబ్బా భుజానికుంటుంది. ఓ చుట్ట ముక్క చెవుల్లో దోపుకుని ఉంటాడు. చక్కని తలకట్టు. జుట్టులో ఓ ఇత్తడి క్లిప్పు, దువ్వెన చెక్కి ఉంటాయి. చిన్న చిన్న శంఖాల మాల కూడా ఉంటుంది మెడకు. సంకి వచ్చిందంటే అతనికి ఓ సరం చేసిస్తే దాన్ని కూడా వేసుకోవాలని అతని ఆశ. ఆడది సంపాదించి కూడబెట్టి మగాడికి నగలు చేయించి పెడ్తుంది. అది బొండా మగాళ్ళకు ఎంత గర్వకారణం!

బుద వయసులో చిన్నవాడే కావచ్చు. గాని బొండా పర్వతంలా అతని మగతనం యెంతో గొప్పది. భుజానికి ధనుర్బాణాలు, నడుముకి ఓ వెడల్పైన కత్తీ, యింకో చిన్న కత్తీ వేలాడుతుంటాయి. కుడిభుజానికి ఓ పదునైన గొడ్డలి ఉంటుంది ఎల్లప్పుడూ, ఈ అస్త్రాలు లేకుండా తొమ్మిది పదేళ్ళు బొండా మగపిల్లలు బయటకు కాలిడరు. సంకి బుదని పెళ్ళిచేసుకుని యింటికి వచ్చిందగ్గర్నుంచి బుద తనను తాను ఓ పెద్ద మగాడిగా భావించాడు. ఇక యింటి గురించి కాని కడుపుకి తిండి గురించి గాని ఆలోచించాల్సిన పని లేదు. అతనికన్నా సంకి పదమూడేండ్లు పెద్దది. ఆమె యింటికి పెద్ద. భార్య తనకన్నా చిన్నదైతే మగాడికి యిక ఒరిగేదేమిటి? అంతచిన్న పిల్ల వ్యవసాయం చేయగలదా? కట్టెలుకొట్టి తేగలదా? ఇంటిపని చేయగలదా? భర్తకు సుఖం అందివ్వగలదా? పెళ్ళి చేసుకుని హాయిగా జీవితం గడపలేకపోతే ఆ మగాడికి సుఖమే లేదు.

పెళ్ళయిన దగ్గర్నుంచి సంకికి ఒకే ఆలోచన, తన భర్తను ఎలా సాకాలని. అప్పుడే కదా వయసుడిగిన తర్వాత అతను తనకు ఆశ్రయమిచ్చి ఆదుకుని ఆఖరిదాకా చూసుకుంటాడు. లేకపోతే ఎవరేమయితేనేం? మగపిల్లాడు పెళ్ళి చేసుకుని వేరు కాపురం పెడ్తాడు. ఆడపిల్ల పెళ్ళి చేసుకుని వేరే ఊరికి వెళ్తుంది. తల్లిదండ్రులు చావుకి సిద్ధంగా ఉన్నా నోట ఓ గుక్కెడు నీళ్ళు పోయడానికి దిక్కుండదు, ముసలి బొండాలు కొండల్లో పంట పండించుకోడానికి ఎంత కష్టపడతారో సంకి తలిదండ్రులను, తాత అవ్వలను చూసి తెల్సుకుంది. ముసలితనంలో ఆదుకుంటాడనే బొండా అమ్మాయిలు చిన్నవారిని భర్తలుగా యెంచుకుంటారు. వారికి భర్తల అవసరం ముసలితనంలోనే ఉంటుంది. జీవించడానికన్నా చావులోనే ఆ కొండల్లో బొండాలకు ఇతరుల ఆవశ్యకత ఎక్కువ. కడుపు నింపుకోవడానికి బొండాలు ఎంత కష్టపడాలి – ఈరోజు తెచ్చింది మర్నాటికి ఉండదు తలిదండ్రులకు సేవ చేయడానికి, వారి మరణకాలంలో వేచి ఉండడానికి ఎవరి దగ్గర అంత సమయముంటుందని? చావుకంటే బతుకే ఎక్కువ ప్రీతికరమైంది. జీవనోపాధి వెతుక్కోకుండా ముసలి తలిదండ్రుల  మరణశయ్యల దగ్గర కాచుకుని ఎవరు మాత్రం ఉండగలరు? పగలు, రాత్రి అన్నవి ఎంత నిజమో బొండాల జీవితాల్లో ‘రోజు గడవడం’ అన్నది అంతే నిజం.

సంకి పొలం పని చేస్తుంది, గొడ్డలి పట్టుకుని చెట్లు నరుకుతుంది, గడ్డపారతో మట్టి తవ్వుతుంది, పంట అమ్మి ఇంటికి తెస్తుంది, ఇంటిపన్లు చేస్తుంది, ధాన్యం దంచుతుంది, వంట చేస్తుంది, అడవిలో కరంగి చెట్ల నుండి నారలు తెచ్చి తనకోసం, బుదకోసం ‘రింగా’ లు పేనుతుంది. ఇంట్లో సాకుతున్న పశువులను, పందులను, మేకలను, కోళ్ళను చూసుకుంటుంది. వర్షాకాలానికని అడవుల్లోని ఎండు కట్టెపుల్లలను ఏరి తెస్తుంది. సంత ఉండే రోజుల్లో తలమీద మూటలెత్తుకొని వెళ్ళి అమ్మకాలు, బేరాలు చేసి తెస్తుంది, తన ఆకతాయి భర్తను అదుపులో పెడ్తుంది. అతనికి కావల్సిందంతా సమకూర్చి పెడ్తుంది. అతనికి విశ్రాంతినిస్తుంది. లేనిరోజుల్లో సావుకారు నుండి అరువు తెస్తుంది. కష్టపడ్తుంది, సంసారభారం మోస్తుంది. తన గురించి గాని, తన రూపం గురించి గాని ఆలోచించే సమయం లేదు, ఆవశ్యకత కూడా లేదు. ఉదయం నుండి సాయంకాలం దాకా కడుపు నింపుకునే ఆలోచన మాత్రమే, బతుకు వెళ్ళదీసే ఆలోచన మాత్రమే ఉండేది. క్లాంతిహీన జీవితం, చింతల్లోనే ఆమె సుఖం, ఆనందం, గర్వం, స్త్రీత్వం, భర్తకు సుఖాన్నివ్వలేకపోయిన స్త్రీ జీవితమూ జన్మేనా! పెళ్ళయిన దగ్గర్నుంచి బుదకి నిశ్చింత. ధనుర్బాణాలు, కత్తి, గొడ్డలి భుజాన్నేసుకుని అడవిలో తిరుగుతుంటాడు. వేట దొరికితే మంచిది, లేకపోయినా చింతలేదు. ఇష్టముంటే పెళ్ళానికి పొలంలో సహాయం చేస్తాడు. లేకపోతే ‘సలప కల్లు’ తాగి కళ్ళెర్ర చేసుకుని తిరుగుతుంటాడు. అరణ్యాకాశాల్లో పక్షుల్లాగా అతను చీకూ చింతా లేనివాడు. పక్షులకైనా వేటగాళ్ళ భయముంటుంది. బుదకి అది కూడా లేదు. సంత ఉన్న రోజు భార్యతో సంతకు వెళ్తాడు. భార్యను డబ్బులడిగి దువ్వెన, బీడీ, పూసలు, పట్టణంలోకెళ్ళి అంగీ, పాంటు  కొనుక్కుంటాడు. అతనికి బాధ్యతల్లేవు, సమస్యల్లేవు, హాయిగా పూచీలేని బతుకు. అయినా అతను ఓ మగాడు, భర్త, యజమాని. చీటికీ మాటికీ కోపగించుకుంటాడు. అతనికి కోపమొస్తే కన్నూ మిన్నూ కానరాదు. ఎవరితోటైనా తేడావస్తే, సామాన్యమైన తప్పు కనిపిస్తే దానికి శిక్ష మరణమే. విల్లెక్కు పెడ్తే అవతలి వాడి తల మొండెమూ వేరైనట్లే. మాట మాటకు కదంతొక్కుతుంటాడు ‘నీ తల తీస్తాను’ అంటూ మనిషిని చంపడానికి వెనుకాడడు. పాపం చేస్తున్నానని భయముండదతనికి తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు, అంతే దాన్లో పాపం పుణ్యం యేముంది అని అనుకుంటాడు.

కట్టెలు కాల్చి వ్యవసాయం చేయడం వలన అడవి నాశనమైపోవడం జరిగింది. బొండా గ్రామాల్లోకి అడవి జంతువులు జొరబడి మనుష్యుల్ని చంపడం కూడా జరుగుతూంది. అయితే మనుష్యుల్ని మనుష్యులే జంపడం పరిపాటైపోయింది. ప్రతీ ఇంట్లోనూ ఎవరో ఒకరు చంపబడడమో చంపి ఉండడమో సహజ విషయంగా మారింది. ‘సలప’ చెట్ల కోసం బొండాలు ప్రాణాలకు తెగిస్తారు. ”సలపచెట్టు మనకు తల్లితో సమానం. దాని పాలుతాగి మనం బతుకుతున్నాం” అంటారు. సలపచెట్టులోంచి కారే రసం వారికి ఆహారం, పానీయం, ఔషధం, రక్తధార. సలప కల్లు తాగితే వారికి మత్తెక్కుతుంది. అన్నీ మర్చిపోతారు. సలపకల్లు లేకపోతే బొండాలకు జీవితం నిస్సారంగా, దుఃఖమయంగా ఉంటుంది. సలపచెట్టు స్వంతం చేసుకోడానికి బొండాల గ్రామాల్లో తలలు తెగుతాయి. సలపచెట్ల మొక్కను తెచ్చి బుర్‌సుంగ్‌ దేవతకు కోడిని బలియిచ్చి గోతిలో కోడి రక్తం పోసి దాన్లో సలపమొక్కను నాటుతారు. అందుకేనేమో సలపచెట్టు బతికినంతకాలం రక్తం కోరుకుంటుంది. సలపచెట్టుకోసం, దాని కల్లుమత్తుకోసం, సలప కల్లు భాగం పంచుకోవడంలో మనుషుల తలామొండేలు రెండు ముక్కలవుతుంటాయి. మనిషి రక్తంతో మట్టి తడుస్తూ ఉంటుంది.

ఎవరికెన్ని సలప చెట్లుంటే అంత గౌరవం. అంత ఉన్నవాడని లెక్కన్నమాట. పెళ్ళయిన తర్వాత సంకి కొన్ని సలప మొక్కల్ని తెచ్చి నాటింది. అప్పుడప్పుడూ కోళ్ళను బలి యిచ్చింది. చెట్టునుండి ఎంత రసం కారితే సంకి అదృష్టం అంత బాగుంటుందన్నమాట. తమ సలప చెట్లోంచి కల్లు కారే వరకు బుద ‘జిగిరియా’ దగ్గర కల్లు కొనేవాడు. మత్తులోకి జారేవాడు, సంతోషంగా ఉండేవాడు. సంకిని అడిగేవాడు, ‘మన సలపచెట్ల నుండి ఎప్పుడు కల్లు వస్తుంది?’ అని. సంకి ఎదిగే సలప చెట్ల వైపు ఆనందంగా చూస్తూ అనేది, ”నువ్వు వయసుకి వచ్చేసరికి, మగాడిగా ఎదిగేసరికి. ఇప్పుడు నీకింకా మీసాలూ, గడ్డాలు మొలవలేదు కదా. సంకి బుద చింపిరి తలను ప్రేమతో నిమిరేది.

బుద సలప చెట్టుపైనే దృష్టి పెట్టేవాడు – ఎప్పుడు దానికి వయసొచ్చి రసం కారుతుందా, అని. సంకి బుదపై ఓ కన్నేసి ఉంచేది. ఎప్పుడతను యుక్తవయసుకి వస్తాడా, అని బొండా కొండల్లో కాలం గడుస్తూంది, ఎవరికీ దాని ధ్యాస లేదు. అయినా అనంతమైన కాలాన్ని గణించడంలో అర్థమేముంది? అలా చేస్తే జననమరణాలు మారిపోతాయా యేం? సంకి నాటిన సలపచెట్టు నుండి కుండనిండా కల్లు వచ్చింది. కుండ కింద పడి విరిగింది. అది శుభసూచకం. బుద స్వయంగా చెట్టెక్కి ఇంకొక కుండ కట్టి వచ్చాడు. కుండ నిండితే చెట్టు మొదట్లో కోడిని బలి ఇస్తాడు. సలప కల్లుని వేడిచేసి పితృవుల పేర కొంత చెట్టు మొదట్లో వేస్తాడు. తాను కూడా తాగి మత్తులో మునుగుతాడు.

బుద కంటికి కునుకులేదు. సంకి కూడా నిద్రపోలేదు. బుదకి యుక్తవయసు వచ్చింది. ఇప్పుడు వాడొక మగవాడు. సంకి చేతులమీద పెరిగిన సలపచెట్టూ, ప్రేమతో తీర్చిదిద్దిన బుద ఎంత బాగున్నారో! దేవుడికి సంకి అంటే ఎంత దయ! ఇక సంకి తల్లి అవుతుంది. ఇల్లు పిల్లాజెల్లలతో నిండిపోతుంది! తన వంశం పెరుగుతుంది. మర్నాడు సలప కల్లుతో కుండ నిండిపోయింది. కోడిని బలి యిచ్చిన వెనువెంటనే సలపచెట్టు మొదట్లో బుద మనిషి ప్రాణాన్నే తీసకున్నాడు. కొడుకు సలప కల్లు దొంగిలిద్దామని బుద తండ్రి మంగళ కిర్యాని చెట్టెక్కాడు. ముసిలాడు సలప కల్లు కోసం కొండల్లోకి దూరం వెళ్ళలేడు. అతని పెరట్లోకి సలపచెట్టు ముసలిదైపోయింది. ఇక రసం కారట్లేదు. కొడుకు పెరట్లో వయసులో ఉన్న సలప చెట్టుకి కుండనిండా కల్లు! ఇంత కల్లుని ఒక్కడే కొడుకు యేం చేసుకుంటాడు? ఓ దోసెడు కల్లు తీసుకుంటే తప్పేంటి? కింద నిల్చొని బుద తండ్రిపై బాణం ఎక్కుపెట్టాడు. తండ్రి కింద పడ్డాడు. రక్తం కారింది. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బుద మనసులో పశ్చాత్తాపం లేదు. తండ్రేగాని, దొంగ కదా! శిక్ష పడాల్సిందే కదా? బొండాల రాజ్యంలో ఒకటే శిక్ష, మరణం!

బొండాల రాజ్యంలో ఎవరినైనా చంపితే వారికి జైలుశిక్ష లేదు, ఉరిశిక్ష లేదు, జరిమానాగాని, వెలివేయడంగాని ఉండదు. నిత్యజీవితంలో జరిగే ఒక సాధారణమైన సంఘటన అది. అయితే ఖయిరిపుట్‌లో పోలీసు చౌకి ఉంది. కొండపైన ముదిలిపడలో కూడా పోలీసు చౌకి ఉంది. కాని బొండాలకు పోలీసులంటే భయం లేదు. ఈ రోజు కాకపోతే రేపు అసలు విషయం బయట పడ్తుంది. సభ్యసమాజంలో దోషిని చంపితే యినాము దొరకదు. శిక్ష పడుతుంది. బొండాల వ్యవహారమంతా ముక్కుసూటిగా ఉంటుంది. బుద తిన్నగా ఖయిరిపుట్‌ పోలీసు ఠాణాకి వెళ్ళేడు. ”నా తండ్రి మీదకు బాణం ఎక్కుపెట్టేను. చచ్చిపోయాడు. ఏ శిక్ష విధించాలో విధించండి” అన్నాడు.

బుద జైలుకెళ్ళేడు. వెళ్ళేటప్పుడు సంకితో అన్నాడు ”పులిచర్మం మీద ఒట్టేయి. నేనొచ్చేవరకు నాకోసం నా కల్లుని జాగ్రత్తగా కాపాడుతానని. నా చెట్టు మొదటి కల్లు నేను తప్ప ఇంకెవరు తాగినా వాణ్ణి వేసేస్తాను.” బుదకి పధ్నాలుగేళ్ళు జైలుశిక్ష పడింది. ఆ రోజునుండి సంకి కల్లుకుండని కాపాడుతూ వచ్చింది. కల్లు ఎంత పాతదైతే దానికి అంత వెల, అంత రుచి, అంత మంచిది. బుద తిరిగివచ్చి సంతోషిస్తాడు. కల్లు తాగి మత్తెక్కుతాడు. సంకి బుద కోసం ఎదురుచూస్తూంది. పన్లోకి వెళ్తూ వెళ్తూ బొండా గోడ సందులోంచి కిందకు సుదూరంగా సాగిపోయిన దారివైపు ఓసారిచూసి అనుకుంటుంది – బుద వస్తున్నాడా, అని.

కాలం దొర్లిపోయింది. సంకి వయస్సు ఉడిగిపోతూ ఉంది. ఒకసారి బుద గ్రామానికి చెందిన హదిధరమాజి సంకితో అన్నాడు, ”నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను. బుద కోసం ఎదురుచూస్తూ నువ్వు ముసలిదానివైపోతావు. నువ్వు ఒప్పుకోకపోతే నీ అమ్మను చంపేస్తాను.”

సంకి ఆలోచించింది. నిజమే. తర్వాత ఇలా అంది ”ఒకసారి బుదని కలిసి అడగనీ. వాడ్నడగకుండా ఇంటికెలా వెళ్ళిపోను?” జైల్లో కలుసుకున్నప్పుడు బుదకి అన్ని విషయాలు చెప్పింది సంకి. బుద అన్నాడు, ”నిజమే. నువ్వు వాడితో వెళ్ళిపో. నాకోసం ఎదురుచూసేవంటే నిజంగా ముసల్దానివైపోతావు. అదీకాక వాడు నీ అమ్మను చంపేస్తాడు.” తేలికైన మనస్సుతో తిరిగివచ్చింది సంకి. హదితో చెప్పింది, ”ఫాల్గుణమాసంలో లగ్నం చేసుకుందాం.” హది కొత్తిల్లు తయారుచేయడంలో పడ్డాడు.

సలప చెట్టుని చూసి ఓ రోజు సంకి అనుకుంది, ”నేను హదితో వెళ్ళిపోతే బుద కోసం కల్లుకుండను ఎవరు కాచుకుని ఉంటారు? బుద తిరిగివచ్చి బాణాన్ని ఎక్కుపెడితే? నేను బుదకి మాటిచ్చాను కదా వాడికోసం కల్లుకుండని జాగ్రత్తగా చూసుకుంటానని. ఆ సంగతెలా మర్చిపోయాడు? వాడు మాట తప్పుతాడా? మర్నాడు హదిని పిలిచి సంకి అంది, ”పులిచర్మం, ఉప్పు, పశువు పేడ, మట్టి మీద ప్రమాణం చేసి చెప్పు నేను చెప్పింది వింటానని. నామీద కోపం తెచ్చుకోవద్దు.” హది ప్రమాణం చేశాడు. ”నువ్వు చెప్పింది వింటాను.” సంకి అంది, ”బుద కల్లుకుండను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. వాడు తిరిగివచ్చినప్పుడు దాన్ని వాడికి అప్పజెప్పకుండా నీవెంట ఎలా వచ్చేయను? వాడు తిరిగివచ్చి మనిద్దరిమీద బాణం ఎక్కుపెడ్తాడు. నువ్వు కాచుకుని ఉంటానంటే నేను వాడి కల్లుకుండని తిరిగి ఇచ్చేసి నీవెంట వచ్చేస్తాను. కోపం చేసుకోకు. నా అమ్మని చంపొద్దు. సరేనా?” హది ఒట్టు వేసుకున్నాడు. వాడు సంకి అమ్మని చంపలేదు. కాని సంకి కోసం కాచుకుని ఉండలేకపోయాడు. వేరే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాడు. సంకితో యిలా అన్నాడు, ”చూడు కల్లు పాతబడినకొద్దీ దాని వెల పెరుగుతుంది. కాని ఆడవాళ్ళు పాతబడిపోతే ముసిలైపోతారు. పనిచేయలేరు, నిస్సత్తువ వస్తుంది. మొగుడికి సేవ చేయలేరు. అలాంటి ఆడవారిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? నన్ను తప్పు పట్టకు.”

సంకి కూడా హది మీద కోపం తెచ్చుకోలేదు. హది నిజమే చెప్పేడు. కాని సంకి ఇంకేం చేస్తుంది మరి? పులిచర్మం, ఉప్పు, మట్టి, ఆవుపేడ మీద ప్రమాణం చేసి బుదకి ప్రమాణం చేసింది. వాడి చెట్టునుంచి కారిన మొదటి కల్లు కుండను వాడికోసం జాగ్రత్త చేస్తానని. ఇప్పుడు మాటెలా తప్పుతుంది? ‘రునుక్‌బోరు’ గోడ సందుల్లోంచి రోజూ ఓమాటు తొంగిచూస్తుంది. రోజూ ఓ కొమ్మ విరిచి మనసులో ప్రార్థిస్తుంది. ‘బుద త్వరగా రావాలి’ అని. ఇది ఆమెకు దినచర్యగా మారింది. ఈ మధ్య ‘రునుకబోరు’ వరకు వెళ్ళలేకపోతూంది సంకి. వయసు పెరిగిన కొద్దీ సత్తువ తగ్గుతూంది. పనిచేసుకోలేకపోతూంది. సలప చెట్టుని చూసుకుంటూ ఇంట్లోనే పడి ఉంది. కల్లు పాతదవుతూంది. దాని వెల కూడా పెరుగుతూంది. అయితే రోజురోజుకీ సంకి ముసలవుతూ వస్తూంది. రోగాలతో, ఆకలితో, ముసలితనంతో బాధపడుతూ ఉంది.

చావంటే ఆమెకు భయం లేదు. కాని కాటిదాకా చేయిపట్టుకుని తీసుకువెళ్తాడనుకున్న సహచరుడు లేకుండా చావు రూపం రోజురోజుకూ భయంకర రూపం దాల్చి కష్టతరంగా మారుతూంది. పులికి ఆహారమవడానికన్నా పులి వేటాడి లాక్కెళ్ళడం ఎక్కువ భయంకరం. బొండాల ముసలితనం ‘పులి లాక్కెళ్ళడం’ కన్నా ఎక్కువ కష్టతరం. చావు పులిలా సంకిని వేటాడుతూంది. కల్లు పాతబడుతూంది. బుద ఎప్పుడొస్తాడో యేమో? సంకికి కాలం ఎలా గడుస్తూందో తెలియడం లేదు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.