బీజమంత్రం ఒడియా మూలం-ప్రతిభారాయ్‌ అనువాదం-Jayasri Mohanraj

అర్ధరాత్రి రాణి ఇంటి తలుపుని ఎవరో తట్టడం కొత్త కోడలి అడుగుల శబ్దంలా మెల్లగా, మెత్తగా పాద శబ్దాలు ఇంకెవరికీి వినపించక పోయినా రాణికి మాత్రం వినిపిస్తాయన్న విషయం చుట్టు పక్కల అందరికి తెలిసినదే. రాణికి ఆ రాక గురించి ముందే తెలుసో లేక ఆ రాక కోసమే చెవులు రిక్కించుకుని ఉంటుందోమరి. ఒకటి రెండు సార్లు తట్టగానే తలుపులు తెరుచుకుంటాయి. ”ఎవరది ఇంత రాత్రప్పుడు?” అన్న ప్రశ్న వినిపించదు లోపల నుంచి. కానీ రాణి తలుపు వైపు చిన్నగా నడవడం, మెల్లగా తలుపు తెరచి తలపైకి ముసుగు లాక్కుంటూ బయటకు రావడం, బయట నుంచి గొళ్లెం పెట్టడం జరిగిపోతాయి. లోగిట్లో ఆమె మేనల్లుళ్ళూ, మేనకోడళ్ళు నేల మీద నిద్రపోతున్నారు. వాళ్ళ నిద్ర చెడ కూడదు. రాణి ఒంటరిది. ఆమె భర్తా, ఉన్న ఒక్కగానొక్క కొడుకూ వేరే ఊర్లో ఉంటారు. వాళ్ళు గానీ ఇక్కడ ఉంటే ఇలా అర్ధరాత్రుల్లో రాణి బయటకు వెళ్లడాలు కుదరదు.

చీకటి రాత్రివేళ రాణి మెల్లగా ”పద” అంటుంది. చీకటిలో ముందు అడుగులో అడుగు వేసుకుంటూ ఓ మగాడూ, అతని వెంట నీడలా రాణి, పొలాల వెంబడి నడుచుకుంటూ వెళ్తారు. కొంత దూరం వెళ్లిన తరువాత మగవాడు వెనకబడతాడు, రాణి ముందర పెద్ద పెద్ద అడుగులతో ఏదో దృఢ లక్ష్యంతో నడక సాగిస్త్తుంది.

అర్ధరాత్రి వేరొకరి నిద్ర చెడపడానికి వచ్చేెవాళ్ళ చేతిలో తప్పక మిణుకు మిణుకు మంటున్న లాంతరు ఉంటుంది. లాంతరు మసిబారి ఉన్నా ఆ చిన్న వెలుగు చీకటిలో దారి చూపడానికి చాలు. మసక చీకటిలో కనీకనిపించని దారి, పొలాల్లోంచి పులులు, ఎలుగుబంట్లు వచ్చి మీద పడకపోయినా సరసర మంటూ ఏ పామో కాలు మీంచి పాకదని చెప్పలేము. కాటేస్తే ఇక అంతే సంగతులు! అందుకే కర్రా, లాంతరు చేత పట్టనిదే ఏ మగాడూ ఆ వేళప్పుడు బయటకు రాడు. కానీ రాణిని పిలుచుకుని వెళ్ళడానికి వచ్చే మగాళ్ళ చేత లాంతరు ఉండదు కర్ర మాత్రమే ఉంటుంది. లాంతరు మసక చీకటిలో కూడా ఎవరైనా వారిని గుర్తు పట్టవచ్చు కదా.

అర్ధరాత్రుల్లో రాణి ఎంత మంది ఇళ్ళకో వెనుక ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. తెల్లవారకుండానే నిమ్మళంగా ఇంటికి తిరిగి వస్తుంది. ఈ విషయం చుట్టు ప్రక్కల అందరికీ తెలుసు. రాణి మొహం బయటపడితే ఆమెకు జరిగే నష్టం ఏమీ లేదు. అమెకు పాప పుణ్యాలతో పనిలేదు.

రాత్రి పూట వెళ్ళిన ఇండ్లలో లోపలి గదివరకు వెళ్తుంది. కంచంలాంటి ఆమె గుండ్రటి మోహంలోకి చూసి ఎవరు ”అంత రాత్రి పూట ఎవరింటికి వెళ్ళావేంటి? ఎవరు పిలిచారు? అని అడిగే వారు కాదు. అలాగని యెవరైనా అడిగితే పరాయి యిండ్లవారి గురించి ఆరా తీసేవారి మొహంపైన తన వెండి ఉంగరం తొడిగిన బలమైన చేతితో ఒక్క గుద్దు గుద్ది ఉండేది. ఆమెకు తెలుసు వేళ్ళపై లెక్కించగలిగిన కొద్ది మందిని మినహయిస్తే అందరూ రణగొణ ధ్వని చేసే యీగల్లాంటి వారేనని.

రాణికి ఈ ప్రపంచంలో అందరి గురించి బాగా తెలుసు. పురుషులైనా, స్త్రీలైనా అందరూ గుమ్మడికాయ విత్తనాలే! అందరికి పొరుగింటి పుల్లకూర రుచి ! కానీ తమ ఇంట్లో పోపు వాసనకు తుమ్ములు వస్తాయి. పొరుగింటి గురించి రహస్యాలు అన్నీ కావాలి. ప్రతిరోజూ ఏదో వంకలు ఎంచాలి. ఆ ఎంచిన వంకలను మళ్లీ మళ్లీ ఎత్తి చూపెట్టాలి. అప్పుడే వారికి తృప్తి. తాము జల్లెడలా ఉన్నా సూదిలో ఉన్న ఒక్క కన్నం వారికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. రాణికి వీరందరి గురించి బాగా తెలుసు. పేదలైనా, ధనికులైనా అందరూ తప్పులు ఎంచేవారే కానీ తమ తప్పులు ఎరుగరు.

ఎవరికైనా సందేహం వస్తుంది. అపరాత్రి వేళ బయటకు వెళ్తుంది కదా, రాణి చేసే పని ఏమిటి, ఆమె వృత్తి ఏమిటి? అని అయితే ఆమెను అడిగేదెవరు? ఎవరైనా అడిగినా ఆమె వారిని తన ఒక్క చూపుతోనే చంపేయగలదు. ”నేను ఏం చేస్తానో తెలియదా? పెద్ద పెద్ద వారి ఇంటిలోకి దొడ్డి దోవన ఎందుకు దూరతానో తెలియదా బాగా జ్ఞాపకం చేస్తాను. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాను?”

రాజుల ఇంటిలో పుట్టి వుంటే రాణి నిజంగా రాణిలాగే కనిపించి వుండేది. కానీ పాకీల ఇంట్లో పుట్టడం వలన పాకీ దానిలాగే కన్పించాలి. కానీ అలా కన్పించదు. వంద మంది ఆడవాళ్ళలో ఉన్నా ప్రత్యేకంగా కన్పిస్తుంది. మిగితా పాకీ ఆడవాళ్ళలా పెద్ద ఇండ్లకు చీపురు పుచ్చుకుని పాకీ పనులకు వెళ్ళదు. అర్ధరాత్రి పూట వారి ఇండ్లలోని పాపాలు కడిగేందుకు వెళ్తుంది. అందుకే అమె కూడా పాపిలా కన్పించాలి. కానీ ఎందుకో ఏమో రాణి పాపం చేసిన దానిలా కన్పించదు. దానికి కారణం, ఆమె వంటి రంగు, మొహం, ఏదీ పాకీ ఇంటి ఆడదానిలా వుండదు. రాజుల ఇంట్లోని స్త్రీలా వుంటుంది. దేవుడు ఆమెను, తెల్లగా , పొడవుగా పుట్టించి పాకీ వాళ్ళ ఇంట్లో పడేసాడు. అసలు ఆ చుట్టుప్రక్కల రాజులెవరూ లేరు. కేవలం నాటకాల్లోనే కన్పిస్తారు. దాన్ని బట్టి రాణి రూపురేఖల్ని రాజులతో సరితూగుతాయని చెప్పవచ్చు. నాటకాల్లో ఓ పిల్లవాడు రాణి వేషం వేస్తాడు. ఆడవాళ్ళలాగానే తిప్పుకుంటూ నడుస్తాడు. నిజం, ఆడవాళ్ళ కన్నా ఎక్కువగా కళ్లు తిప్పుతూ లోగొంతుతో మాట్లాడతాడు. రాణి వేషంలో యుద్ధానికి వెళ్లాలంటే కుడిచేత్తో కత్తి పట్టుకునే దానికి బదులు ఎడమ చేత్తో పట్టుకుంటాడు. తాళానికి సరిగా ఎడమచేత్తో కత్తిని తిప్పుతూ అడుగులు వేస్తాడు. రాజు కుడి చేత్తో కత్తి పట్టుకుంటే రాణి కూడా కుడి చేత్తోనే కత్తి పట్టుకోకుండా ఎడమ చేత్తో ఎందుకు పట్టుకుందో ఎవరూ నాటకం డైరెక్టర్‌ని అడగలేదు. కుడిచేత్తో అన్ని పనులు చేస్తారు. అవసరం వస్తే పసికందుల గొంతు పిసుకుతారు. ప్రేమికుల కోసం భర్తకి, మరిదికి విషం ఇస్తారు. కానీ యుద్ధం చేయాలంటే ఎడమ చేత్తో కత్తి ఝళిపిస్తారు. అది ఉత్తుత్తి నాటక యుద్ధం అని తెలిసిపోతుంది. ఎంతైనా రాణి ఒక స్త్రీ. కుడి చేతి కంటే ఎడమ చేయి కాస్త బలహీనమే మరి. పురుషులతో స్త్రీ జాతి ఎలా సరితూగుతుంది?

నాటకాల్లో రాజూరాణీిల్ల హావభావాలు చూసిన తరువాత అనిపిస్తుంది, ”రాణి స్త్రీ అయినా రాజులా దర్పంతో నడుస్తుందని రాణి యుద్ధం చేయాల్సి వస్తే కత్తిని ఎడమ చేత్తో పట్టుకోదు. వీరమణి సుఖదేవిలా కుడి చేత్తో కత్తి పట్టుకుని శత్రువుల సంహారం చేస్తుంది. రాణికి దయాదాక్షిణ్యాలు లేవని లోకులు చెవులు కొరుక్కుంటారు. కానీ ఆమె ముందర ఒక్క మాట అనడానికి ఎవరికీ ధైర్యం లేదు. రాణి నిజంగా పాపిష్టిదా? పాషాణ హృదయం కలిగినదా?

దేవుడు రాణిని రాజ కుటుంబంలో జన్మనివ్వకపోయినా కనీసం జమీందారు కుటుంబంలో పుట్టించి వుండవచ్చుకదా! ఛా, జమీందారు కుటుంబాల్లో ఉత్త దర్పరి తప్ప ఏం మిగిలింది కనుక. బ్రిటిష్‌ వారిని పొగిడి, వారి కాళ్ళ బూట్లు తుడిచి ఎంత మంది జమీందారుగిరి సంపాదించుకోలేదు? ఎంత మంది ఊళ్ళో వాళ్ళ నోట్లో మట్టి కొట్టి జాగీరు సంపాదించుకొని గొప్పవాళ్ళు అవ్వలేదు! స్వార్ధపరులు. స్వార్ధం, పరుల సొమ్ము మీద పాప దృష్టి, వేరే వాళ్ళ కూతుళ్లు, కోడళ్ళ మీద తప్పుడు ఆలోచనలు ఇటువంటి పాపపు పునాదుల మీద లేచింది జమీందారీ. ఇప్పుడు జమీందారీ లేకపోయినా ఆ పునాదులపైన వారి చిరుగుల జెండా ఎగురుతూంది. ఈ ఊళ్లో వున్న జమీందారు వారసులందరూ నిరుద్యోగులు, గుండాలు, దొంగలు, తాగుబోతులుగా మిగిలారు. తాత ముత్తాతలు చేసిన తప్పులకు సిగ్గు పడాల్సింది పోయి గర్విస్తారు. ఇప్పుడు కూడా జమీందారులమనే అనుకుంటారు. ఊళ్లో ప్రజలు తమ చెప్పు చేతుల్లో ఉండాలని అనుకుంటారు. జమీందార్ల మాట ఎత్తకపోతేనే మంచిది. అయితే దేవుడు రాణిని ఇంత అందంగా పుట్టించి ఏ బ్రాహ్మణ కులంలోనో, కరణం, వైశ్య, యాదవుల కులాల్లోనైనా పడేసివుంటే బాగుండేది. కానీ ఒక్క సారిగా శూద్రుల ఇంట్లో  పాకీ దాని గర్భంలో పుట్టించాడు.

దేవుడ్ని తప్పు పట్టి లాభంలేదు. దేవుడెప్పుడూ అనాలోచితంగా ఏ పనీ చేయడు. దేవుడికి రాజు, ప్రజలు, జమీందారు, జాగీరుదారు, మార్వాడీ, పసివాళ్ళు, బ్రాహ్మణులు, కరణం, కంసాలులు, శూద్రులు అన్న భేదభావం ఉండదు. అవన్నీ మనుషులకే. దేవుడు కేవలం రాణికి మనుషులలో జన్మనిచ్చాడు. మనుషులలో రెండే శాఖలు – ఆడ, మగ. ఆడ, మగ పూలు వికసించి వాటి కలయిక ఫలమే ఈ మనుషులనబడే ఉద్యానం పచ్చగా కళకళడుతూ వుండటం. రాణికి బీజమంత్రం తెలుసు. మనుషుల్లో, పశుపక్ష్యాదుల్లో, చెట్టు పుట్టల్లో అన్నింటిలో రాణికి సృష్టికర్త కన్పిస్తాడు. అన్నింటికి మూలం బీజం. బీజమే జన్మదాత. ఈ మంత్రం రాణి కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? కానీ ఈ మనుషులనబడే చెట్టుకు పవిత్రమైన బీజంతో పాటు పాప ఫలం కుడా సంక్రమించవచ్చు. కారణం ఆ సంపర్కం అనుమతి లేనిది అన్న అభిప్రాయంతో రాణి ఏకీభవించదు.

ఈ సృష్టిలో ఎన్నో విషయాలు రాణిని ఆశ్యర్యచకితురాలిని చేస్తాయి. చెత్తకుప్ప మీద మొలకెత్తిన మొక్క పూలు దేవుడికి పెడతారు, పళ్లు పూజకు యోగ్యం. చెత్త కుప్ప మీద మొలిచిందని మొక్కకు పాపం  అంటదు, పూలకు, పళ్లకు కూడా కానీ మనిషి సంపర్కం అనుమతి లేనిదని తెలిసి మనసుని అదుపులో ఉంచుకోకపోతే ఆ సంపర్క ఫలాన్ని ”అక్రమ సంతానం” అని, పాప ఫలమని అనడం ఎంతవరకూ న్యాయం?

చెట్టు కాయ కన్న మనిషి కడుపులో కాసిన కాయ తక్కువా? ఈ వూళ్లో ఎంతమంది ఏ పాపం ఎరుగని పిల్లలు అక్రమ సంతానం అనిపించుకుంటున్నారు? వాళ్లను నవమాసాలూ గర్భంలో ధరించి జన్మనిచ్చిన తల్లులు చెడిపోయినవారు. ఇకపోతే ఆ పాప ఫలాల తండ్రుల సంగతేంటి? ఎవరు తండ్రులో ఎవరికి తెలుసు? వారు తమ కామ కాలుష్యాన్ని తల్లుల కొంగులో దులిపేసి అచ్చోసిన ఆంబోతుల్లా తిరగొచ్చును. వారి కాలుష్యం ఎవరి కంటకీి కనబడదు. ఎలా కన్పిస్తుంది? వారికిచ్చిన కాలుష్యం తల్లి గర్భంలో  పాప ఫలంగా పెరుగుతుంది మరి! వారి తల్లులను చెడిపోయిన వారని ముద్ర వేస్తారు. పురుషుడు తండ్రి అవుతూనే గర్వంతో ఛాతి విరుచుకుని తిరుగుతాడు. కానీ తల్లులే ప్రతీసారి అందరికి తెలియజేస్తూ తల్లులు కాలేరు. ఒక్కొక్కప్పుడు సమాజానికి తెలియకుండా ”చెడిపోయిన” తల్లులు పిల్లల్ని కనాల్సి వస్తుంది. మగవాడికి ”పాపగర్భం” అనేది వుండదు. మగవాడికి యెప్పుడూ గర్భంస్రావం చేసుకోవాల్సిన పనిలేదు. మగవాడికి భ్రూణహత్య చేయాల్సిన అవసరం లేదు. కారణం, భ్రూణం తల్లి గర్భంలో పెరుగుతుంది. దేవుడు గాని స్త్రీ గర్భంలో శిశువు జన్మించే అరను అమర్చి వుండకపోతే ఆమె కూడ కాలుష్యాన్ని కప్పిపుచ్చుకుని తలెత్తుకుని తిరిగేది. ”తలెత్తుకు తిరగడ”మనేది ఈ ప్రపంచంలో అన్నికంటే పెద్ద విషయం. మనస్సు దిటవు చేసుకోవడం చాలా వరకు దానిపై ఆధారపడి వుంటుంది. మనస్సు దిటవు చేసుకోవడమే లేకుంటే ఇంత మంది తల్లులు గర్భస్రావం చేసుకోరు, కనిన సంతానాన్ని పొదల్లో విడిచిపెట్టరు. గొంతు నులిమి నదుల్లో కొలనుల్లో పడవేయరు. ఇప్పుడే కాదు, పురాణ కాలం నుండి తల్లుల మనస్సులపై, గుండెలపై బరువు మోపడం అనేది జరుగుతూనే ఉంది. లేకపోతే రాజనందిని కుంతి కర్ణుడు లాంటి పుత్రుడిని బుట్టలో పెట్టి నదిలో వదిలివేసి జీవితమంతా ” హే కర్ణా హే కర్ణా” అంటూ విలపిస్తూ ఉండేదా? ఊళ్లో నాటకంలో కర్ణవధ జరిగినప్పుడు కుంతి వేషం వేసినా ఆడంగి పిల్లవాడు ఎంత రోదించాడో అంతకంటే ఎక్కువగా నాటకం చూడవచ్చిన ఆడవాళ్ళు యేడ్చేవారు. అందరికన్నా రాణి ఎక్కువగా ఏడ్చేది. కారణం ఆ ప్రదేశంలో ఉన్న వందల సంఖ్యలో ఉన్న కుంతిల గురించి రాణి కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? ఆడంగి పిల్లవాడు ఉత్తుత్తి ఏడ్పు ఏడుస్తాడు కానీ అక్కడి ఆడవారు నిజంగానే కన్నీరు కారుస్తారు. కుంతీ పుత్రుడి కష్టాలు చూసి ఎవరికి మాత్రం కన్నీరు ఆగగలదు. అయినా మనిషి జీవితంలో శాంతి లేదు. దేవుడు పాప భారాన్ని ఎవరికి ఎక్కువగా ఇస్తాడో వారికి కన్నీరు ఎక్కువగా ఇచ్చాడు. ఆ కన్నీరే లేకపోతే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకలేరు. పిచ్చిపట్టి తిరిగేవారు. లేక గుండెలు పగిలి చచ్చిపోయేవాళ్ళు. దేవుడు మగవారి కడుపుని ”పాపానికి” పుణ్య భూమిగా చేయలేదు కాబట్టి హృదయాన్ని రాతి గుండె చేశాడు. కానీ మగవాడిది ఏం తప్పు? దేవుడి సృష్టిని మనిషి మార్చలేడు కదా!

అయితే మానవుడి సృష్టి రాణిని ఆశ్యర్యంలో ముంచెత్తుతుంది. మనిషి జాతి విభేదాల్ని సృషించాడు. ఒక పద్ధతిని సృష్టించాడు. అయితే వాంఛ తీర్చుకోవాలని అనుకున్నపుడు, జాతి మత విభేదాలేవి అడ్డురావు. కానీ ఆ వాంఛా ఫలాన్ని మాత్రం స్వీకరించేందుకు సిద్ధంగా లేడు. అటువంటి సమయం వచ్చినపుడు పిరికితనం చూపెడ్తాడు. మగవాడు పిరికిపంద. అటువంటి పిరికి కాముకుల ముఖం మీద నడి బజారులో ఖాండ్రించి ఉమ్మాలని అనిపిస్తుంది రాణికి.

మనిషి తనలో పాపాన్ని దాచుకుని జీవితమంతా ఆ పాపాల భూతాన్ని తలచుకుని భయపడ్తూ ఉంటాడు. ఆఖరికి తన నీడను కూడా నమ్మడు. రాణికి భూతాలంటే నమ్మకం లేదు. మనిషి మీద నమ్మకం ఉంది. చావంటే ఆమెకు భయంలేదు జీవితం మీద నమ్మకం వుంది. ఇష్టం వచ్చినప్పుడు పరాయి వాళ్ళ చెరువు చేపలను వేటాడుతారు. తమ పాపాల నీడ చుట్టూ మచ్చికైన పశువులా తిరుగుతూ ఆ పాపాలను భూతాల మీదకు తోసేస్తారు. ఎందుకంటే భూతాలు పగటి వెలుగులో అందరి సమక్షంలో సాక్ష్యం చెప్పవు కదా! మంచి పని చేస్తే తమదనీ, అదే చెడ్డ పని చేస్తే భూతాల పని అనీ సర్దుకుంటారు. అయినా దెయ్యాలు, భూతాలు అంటే ఏమిటి? మనిషి ఇంకొక రూపమే కదా! మనిషి చస్తే భూతం అవుతాడు. అలాంటప్పుడు భూతాలంటే భయమెందుకు? మంచివాడు చచ్చినా భూతమే అవుతాడు అంటే మరి మంచివాళ్ళకూ, చెడ్డవాళ్ళకు తేడా ఏముంది. అందరిలోనూ ఏదో భూతం వుంటుంది. అప్పుడపుడు అది మనిషిపై సవారి చేస్తుంది. ప్రాణాలతో ఉన్న భూతం అంటే రాణికి భయం. చనిపోయి వచ్చిన భూతం అంటే ఆమెకు భయం లేదు. భూతాలు మాత్రమే కాదు మనిషిని దేవత కూడా ఆవహిస్తుంది. అది కూడా మనిషిని భయపెడుతుంది. ప్రతిదాన్ని చూసి మనిషి భయపడతాడు. ఎందుకంటే మనిషి మీద పుణ్యంకన్నా పాపానిదే ఎక్కువ ప్రతాపం ఉంటుంది. అర్ధరాత్రి స్మశానం దాటుకుని పక్కఊళ్ళకు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడప్పుడూ. కానీ రాణి మీద ఏనాడూ భూతం కానీ ప్రేతం గానీ పడలేదు. కానీ రాణిని ఎప్పుడైనా దేవత ఆవహిస్తుంది. ఎందుకంటే ఆమెకు దేవత మీద నమ్మకం ఉంది. భూతం అంటే ఆమెకు ఖాతరు లేదు. ఏమంటే రేపు చనిపోయిన తరువాత తానుకూడా భూతమే అవుతుంది కదా! ఇంకెందుకు భయం?

ఆమె ఈ విద్యను ఎక్కడి నుండి నేర్చింది? ఆమెను ఈ విషయం ఎవరూ ఆడగలేదు. తల్లి గర్భంలో వుండగానే రాణి మూడు విద్యలు నేర్చినట్లు ఉంది. కడుపు మీద చెయ్యి పెట్టి గర్భధారణ అయిందో లేదో చెప్పడం, గర్భస్రావం చేయడం, పురుడు పోయడం. చుట్టు ప్రక్కల పది పదిహేను గ్రామాల్లో ఈ విషయాల్లో ఆమెకు సాటి ఎవరూ లేరు. రాణికి గర్భస్రావం చేయడం ఇష్టం వుండదు. ఈ ప్రాంతాల్లో స్త్రీలు పురుషులతో సన్నిహితంగా మెలగడం కొత్తేం కాదు. పిల్లల్ని కంటారు. సుకుమారి రాజకుమారి గాంధారి వంద మంది పుత్రులను కని చెక్కు చెదరక వుండ గలిగింది అంటే ఈ మారుమూల గ్రామంలో దారిద్య్రం, కరువు, ఆకలి దప్పులు అనుభవిస్తూ నిరక్షులైన ఆడవాళ్లు మాత్రం పది ఇరవై మంది పిల్ల్లల్ని కని జీవించి ఉండలేరా? కానీ ప్రసవంలోనే ఈ గ్రామాల్లో అనేక మంది బిడ్డలు చనిపోతారు. ఇదేం కొత్త విషయం కాదు. కానీ రాణి చేతుల్లో ఇంత వరకూ ఏ బిడ్డా పుట్టిన వెంటనే చనిపోలేదు. అలా చనిపోయినా అది కేవలం రాణిని సమయానికి పిలువకపోవడం వలన గానీ, పుట్టిన బిడ్డను కుటుంబం అనాదరణ చేయడం వలనగాని జరిగేది. ఇంకొంత మంది బిడ్డలు అనుభవం లేని మంత్రసానుల చేతుల్లో చనిపోతారు. పాము మంత్రం తెలియక పోయినా పాము పుట్టలో చెయ్యి పెట్టేవారి సంఖ్య తక్కువేం లేదు ఈ ప్రపంచంలో.

అయితే రాణి అవివాహిత తల్లుల గర్భస్రావం చేయడానికి వెనుకాడదు. తమ వాంఛలను కట్టుబాట్లో ఉంచుకోలేరు గానీ సమాజం కళ్లుగప్పాలని చూస్తారు వీరు. రాణికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తాను పెంచిన కుక్కను ”కుక్క” అని పిలువడానికి ఆమె ఇష్టపడదు గనుక దానికి ”నేతి” అని పేరు పెట్టింది. వీధుల్లో తిరిగే ఊర కుక్కలకు కూడా పేర్లున్నాయి. కాశియా, బలియా, భలువా,కసరా లాంటివి. అయితే ఏ పాపము ఎరుగక పుట్టిన పిల్లల్ని మాత్రం అనామకులుగా, నడివీధిలో పడేసే అధికారం ఎవరిచ్చారు వీరికి? మనిషి బిడ్డలు కుక్క పిల్లల కన్నా హీనమా? దానికంటే నయం నెలలు నిండక ముందే గర్భస్రావం చేసుకోవడం. మాంసం ముద్దకు జీవితం అంటే ఏమిటో తెలియక ముందే. అదీగాక మగవాడు కాలికి అంటిన బురదను కడిగేసుకుని మంచివాడిగా చలామణి అయినప్పుడు స్త్రీ మాత్రమే జీవితమంతా బురదలో కూరుకుని ఉండాల్సిన అవసరం ఏముంది? మగవారికి ”పాపం” అంటనిది ఆడవారికి మాత్రమే అంటుతుందా?

ఒక చేత్తో చప్పట్లు కొట్టడం సాధ్యమా? అయిందేదో అయింది. ఇక మీదనైనా శుభ్రమైన జీవితం గడపండి. సమాజం నిర్మించిన హద్దులను దాటవద్దు. లేకపోతే కట్టుతెగిన పశువుల్లా తిరుగుతారు. పరాయివాళ్ళ కళ్ళేల్లో దూరి దెబ్బలు తిని రక్తసిక్తం అవ్వాల్సి వస్తుంది. సమాజంలో చీడ పురుగై పరాయివాళ్ళ కూతుళ్ళనూ, కోడళ్ళనూ నాశనం చేస్తారు. తప్పు చేసిన కూతుళ్ళూ, కోడళ్ళూ ఆత్మహత్య చేసుకోవాలా? ఎంత మంది మగవాళ్ళు కడుపులు చేసేసి నుయ్యో గొయ్యో చూసుకుంటున్నారని? ఉరిపోసుకుంటున్నారని? విషం మింగుతున్నారని? మీ గర్భంలో నలుసు పెరుగుతోందని మీరు ప్రాణాలు తీసుకోవాలా?                (ఇంకావుంది….)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.