మహబూబ్‌నగర్ జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద మండలాల్లో భూమిక చేపట్టిన త్వరిత మరియు బాల్య వివాహాలపై ప్రాజెక్ట్‌లో భాగంగా తేది 10/2/16 రోజు మద్దూరు మండలం ఎంపిడిఒ కార్యలయంలో యుక్త వయస్సు బాలబాలికల ఫోరం మీటింగ్ నిర్వహించటం జరిగింది.
ఉద్దేశం: గ్రామాల్లో చిన్న వయస్సులోనే వివాహాలు ఎక్కువగా చేయటంవల్ల పిల్లలు రకరకాల ఇబ్బందులకు గురికావటం జరుగుతోంది. వీటి నిర్మూలనకు లేదా వీటిని తగ్గించటం కోసం పిల్లల యొక్క అభిప్రాయాలను, ఆలోచనలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, చిన్న వయస్సు వివాహాలు జరగకుండా పిల్లలకు కావల్సిన సహాయ సహకారాలను అధికారులు అందించటం.
మీటింగ్ చేసిన విధానం: ఫోరం మీటింగ్‌కి ముందు ఎంఇఒని కలిసి ఫోరం గురించిన ఆలోచన చెప్పి పరిమిషన్ తీసుకుని, గ్రామాల్లోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ హెచ్ఎంలకి సమాచారం ఇవ్వటం, మీటింగ్ స్థలం కోసం ఎంపిడిఒ గారితో మాట్లాడటం, మండలంలోని పోలీస్, ఐసిడిఎస్ మరియు ఇతర అధికారులను, ఎన్‌జిఒలను కలిసి మీటింగ్‌కు పిలవటం జరిగింది.
ఫోరం మీటింగ్‌లో చర్చించిన అంశాలు:
- భూమిక ఉమెన్స్ కలెక్టివ్ గురించి వివరించటం
- మండలంలో బాల్య వివాహాలు జరగటానికి గల కారణాలు, ఉన్నటువంటి పరిస్థితులు
- బాల్య వివాహాలు, ప్రేమ ప్రలోభాల ద్వారా పిల్లలపై పడుతున్న ప్రభావం (ఇబ్బందులు, అడ్డంకులు)
- బాల్య వివాహాలను తగ్గించటం కోసం ఎలాంటి విధానలతో పనిచేయాలన్న ప్లాన్ (గ్రామ స్థాయి కమిటీలు, బాలసంఘాల ఏర్పాటు, బలోపేతం, జండర్ డెస్క్‌ల ఏర్పాటు వంటివి)
- సంస్థలు, వ్యవస్థలతో కలిసి పనిచేయడంలో వారి సపోర్ట్, సహకారం గురించి పిల్లలతో గ్రూపు చర్చలు, ప్రజంటేషన్స్
ఫోరం మీటింగ్ జరిగిన విధానం: సమావేశాన్ని పాటతో ప్రారంభించు కోవటం జరిగింది. పిల్లల్లో బిడియాన్ని పోగొడుతూ కొంతసేపు సరదా గా మాట్లాడి తరవాత మీటింగ్ ఉద్దేశాన్ని వివరించడం జరిగింది.
భూమిక ఉమెన్స్ కలెక్టివ్ యుక్తవయస్సు అమ్మాయిలతో పని చేయడానికి గల కారణాలు వివరిస్తూ యుక్తవయస్సులో వచ్చే మార్పుల గురించి తెలియజేస్తూ, గ్రామాల్లో చిన్న వయస్సులో పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది పిల్లలతో చర్చలు చేశాం. ఇందులో –
- పిల్లలపై తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవటం,
- యుక్తవయస్సులో భావోద్వేగాల వల్ల, ఆలోచనల్లో మార్పుల కారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమ ప్రలోభాలకు గురి అవుతున్నందువల్ల,
- కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల,
- ఎక్కువ మంది ఆడపిల్లలు ఉంటే కూడా తొందరగా వివాహాలు చేస్తున్నారని పిల్లలు చెప్పారు.
ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడ్తూ – ఇలాంటివి చేయడం ద్వారా జరిగే నష్టాల గురించి, ప్రస్తుతం బాలల కోసం ఉన్న చట్టాల గురించి వివరించారు. చిన్న వయస్సు పెళ్ళిళ్ళు చేయడం వల్ల శారీరకంగా ఎదగలేరు, చదువు మధ్యలో ఆగిపోతుంది, బాల్యాన్ని కోల్పోతారు, అనారోగ్యానికి గురవటం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పారు.
బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, పిఎన్డిటి చట్టం, విద్యా హక్కు చట్టాలు ఉన్నాయి, బాలల హక్కులపైన పనిచేయడానికి ఐసిడిఎస్, పోలీస్, ఎంఆర్ఓ వంటి వివిధ వ్యవస్థలు ఉన్నాయని వివరించడం జరిగింది. ఇంకా ఇలాంటి విషయాలు మరింత చర్చించుకోవాలంటే చిన్న గ్రూపులై మాట్లాడుకుని ప్లీనరీలో ప్రెజెంట్ చేద్దాం అని చెప్పడం జరిగింది. అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరిని నాలుగు గ్రూపులుగా చేసి ప్రతి గ్రూప్‌కి కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటిపై చర్చించాల్సిందిగా తెలియజేశాం.
గ్రూపులలో ఇచ్చిన ప్రశ్నలు (అంశాలు): ఈ నాలుగు గ్రూపులు ఒక్కో గ్రూపుకు పేరు పెట్టుకొని ప్రజెంటేషన్ చేయడానికి ఒక మెంబర్‌ను ఎంపిక చేసుకున్నారు.
1వ గ్రూపు: విద్య గ్రూప్
- గత మూడు సంవత్సరాలలో తమ గ్రామాల్లో ఎన్ని బాల్య వివాహాలు జరిగాయి (అమ్మాయిలివి, అబ్బాయిలవి వేరు వేరుగా)? ఏ పరిస్థితులు ఈ వివాహాలకు దారి తీసాయి?
2వ గ్రూపు : ప్రతిభ గ్రూప్
- తమ గ్రామాల్లో ప్రేమించుకొని వెళ్లిపోయినవారు ఎంత మంది / ఎన్ని కేసులున్నాయి? వాటి ద్వారా ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి?
3వ గ్రూపు : విజేత గ్రూప్
్న బలవంతపు, పిల్లలకు ఇష్టంలేని పెళ్ళిళ్ళు ఎన్ని జరిగాయి? ఏ పరిస్థితుల్లో ఈ పెళ్ళిళ్ళు చేశారు? దాని ప్రభావం ఎలా ఉంది?
4వ గ్రూపు : భూమిక గ్రూప్
- పెళ్ళి మీద వారి అభిప్రాయం ఏమిటి? వారి అంగీకారం ఏమిటి? చిన్న వయస్సులో పెళ్ళిళ్ళు చేయకుండా లేదా బలవంతపు పెళ్ళిళ్ళు జరగకుండా ఉండాలంటే పిల్లలు ఏమి చేయాలి? వారికి ఎలాంటి సహకార వ్యవస్థలు అవసరమను కుంటున్నారు?
ఇలా నాలుగు గ్రూపుల్లోనూ చర్చించుకుని ప్లీనరీలో తమ గ్రూపులో చేసిన చర్చలను ప్రెజెంట్ చేశారు. అవి:
1వ గ్రూప్: 2013-15 మధ్యలో గ్రూపులోని వారి 7 గ్రామాల్లో 36 చిన్న వయసు పెళ్ళిళ్ళు జరిగాయి. ఇవి ఇంట్లోని పెద్దమనుషుల ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం వలన, ఆడపిల్లకి చదువు ఎక్కువ ఉండకూడదని, తల్లిదండ్రులు చనిపోవడంతో, ఇల్లరికం సంబంధం వచ్చిందని, కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటామనటంతో, తండ్రి కుటుంబాన్ని వదిలేయటం, ఆడపిల్లలు ఎక్కువమంది ఉండడం, అబ్బాయిల వేధింపుల వలన, అనుమానం వలన, తల్లిదండ్రులు పెద్దవారై తర్వాత చేతకాని పరిస్థితి వస్తుందేమో అన్న భయం కారణంగా తల్లిదండ్రులు బలవంతంగా అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసేశారు. ఒక కేసులో మాత్రం ఆమెకు చదువుపై ఇష్టం లేక పెళ్ళి చేసుకోవడం వైపే మొగ్గుచూపడంతో పెళ్ళి చేశారు. ఇంకో కేసులో అబ్బాయి మాటవినట్లేదని పెళ్ళి చేసేశారు.
2వ గ్రూప్: గత మూడేళ్ళలో అన్ని గ్రామాల్లో కలిసి 5 కేసులున్నాయి. యుక్తవయసు ఆకర్షణ వల్ల, కలిసి తిరగడంతో పెళ్ళికి ముందే గర్భం దాల్చడం వల్ల, స్నేహితుల ఒత్తిడి వల్ల, ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకున్నపుడు తల్లిదండ్రులతో చెప్పలేక వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు. దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడ్డారు. చిన్నప్పుడే పిల్లల్ని కని వారిని సరిగ్గా చూసుకోలేక, ఇద్దరి మధ్య గొడవలై అమ్మాయిలు మోసపోతున్నారు. వీటిని తట్టుకోలేక కొన్నిసార్లు అమ్మాయిలు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు.
3వ గ్రూప్ : ఇతరులు చెప్పిన మాటలు విని, అబ్బాయికి ఆస్తి ఎక్కువగా ఉందని, ఆర్థిక ఇబ్బందులు కారణంగా చూపించి, అబ్బాయి వాళ్ళింట్లో ఆడపిల్లలు లేకపోవడంవల్ల, అమ్మాయి ఎవర్నైనా ప్రేమిస్తోందని తెల్సినపుడు, కట్నం తక్కువ అడిగారని, అమ్మాయికి తండ్రిలేడని కారణాలు చూపించి పిల్లలకు ఇష్టం లేకున్నా బలవం తంగా పెళ్ళిళ్ళు చేసారు. బలవంతపు పెళ్ళిళ్ళ వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. వారి మధ్య ప్రేమానురాగాలు ఉండవు. హింసకు గురై అమ్మాయి ఆత్మహత్య చేసుకోవచ్చు. భర్త భార్యను చంపేయవచ్చు. వివాహేతర సంబంధాలు ఎక్కువవుతాయి.
4వ గ్రూప్: చిన్నవయసులో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఏదైనా
ఉద్యోగం దొరికి ఆర్థికంగా స్థిరపడే వరకు పెళ్ళి చేసుకోకూడదు. సంబంధం అమ్మాయికి అబ్బాయికి అంగీకారం అయితేనే పెళ్ళి చేయాలి. ప్రేమపెళ్ళి చేసుకోవాలనుకున్నా పెద్దవారిని ఒప్పించి చేసుకోవాలి. గ్రామాలలో అంగన్వాడి టీచర్, సర్పంచ్, మండలం లోని తహసీల్దార్, పోలీస్, జిల్లాలోని కలెక్టర్, చైల్డ్‌లైన్, భూమిక
ఉమెన్స్ కలెక్టివ్ సహకార వ్యవస్థలుగా ఉండాలి.
గ్రూపు చర్చలు చాలా ఉత్తేజంగా జరిగాయి. విషయాలను స్పష్టంగా చర్చించగలిగారు. అలాగే ప్లీనరీలో వివరంగా ప్రెజంట్ చేయగలిగారు. దీని తరవాత అధికారులు పిల్లలు లేవనెత్తిన అంశాలపై మాట్లాడారు.
ఎంపిడిఒ మాట్లాడుతూ – ప్రస్తుతం బాల్య వివాహాలు జరగడానికి అనేక కారణాలున్నాయి – అవి ఆర్థిక ఇబ్బందులు, మీడియా, సమాజం. కుటుంబ సభ్యులకు పిల్లలు బాగా చదువుకుంటారు అనే నమ్మకాన్ని కల్పించాలి. ఆత్మవిశ్వాసం లోపించకుండా అమ్మాయిలు, అబ్బాయిలు చదువు స్థాయిని పెంచుకోవాలి. ప్రేమ ప్రలోభాలపై విషయాలను పిల్లలు తెలుసుకొని తల్లిదండ్రులకు నమ్మకం కల్గించాలి. ప్రతి గ్రామంలో బాల్య వివాహాలు జరగకుండా ఉండాలంటే ప్రతి స్త్రీకి స్వావలంబన
ఉండాలి. ఎందుకంటే – పెళ్ళయ్యాక భర్తతో రకరకాల ఇబ్బంది పడుతుంది. కావున స్త్రీలు ధైర్యంగా వీటిని ఎదిరించాలి అని చెప్పారు.
ఎంపిడిఒని పిల్లలు అడిగిన ప్రశ్నలు
- ఇప్పటి వరకు ఎన్ని బాల్య వివాహాలు ఆపారు.
- పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు అధికారులు పట్టించుకోకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు.
- కుటుంబంలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఎలాంటి సహాయం చేస్తారు.
వీటికి సమాధానంగా- ఇప్పటివరకు మండలంలో మూడు బాల్య వివాహాలు ఆపటమైంది. గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతు న్నప్పుడు విఆర్ఒ, అంగనవాడీ టీచర్, సర్పంచ్‌కు చెప్పండి. పెళ్ళి జరిగేటప్పుడు ఆపటం కష్టం కాబట్టి పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పుడు లేదా పెళ్ళికి 15, 20 రోజుల ముందే సమాచారం ఇస్తే ఆపగలుగుతాము అని ఎంపిడిఒ పిల్లలకు చెప్పారు.
ఎస్ఐ మాట్లాడుతూ – పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్నప్పుడే పెళ్ళి చేస్తామని తల్లిదండ్రులు అంటే నేను చదువుకుంటా, ఇప్పుడే పెళ్ళి వద్దు అని ధైర్యంగా చెప్పాలి. ఇప్పటి వరకు భూమిక వారి సమాచారం ఆధారంగా నాలుగు బాల్య వివాహాలను వారితో కలిసి ఆపగలిగాం. మీ సంరక్షణ కోసమే పోలీసు ఆధికారలం
ఉన్నాము. మీకు మా తరపున ఏ సమయంలోనైనా సహకారం ఇస్తామన్నారు. అలాగే ఫోక్సో చట్టం కూడా పిల్లల కోసమే వచ్చింది. ఒక స్కూల్లో టీచర్ విద్యార్థినిని నమ్మించి మోసం చేసి ఆత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే అలా జరగకుండా టీచర్‌పై కేసు వేశాము. కాబట్టి మీకు ఏమైనా ఉంటే భయపడకుండా సమాచారం ఇవ్వండి అని చెప్పారు.
సర్పంచ్ మాట్లాడుతూ – చిన్నవయస్సు వివాహాలు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆలోచనపరంగా, సామాజికంగా ఎదగలేరు. చాలా నష్టాలు వస్తాయి. కావున 18 సంవత్సరాలు నిండిన తర్వాత అమ్మాయిలు, 21 ఏళ్ళు నిండాకే అబ్బాయిలు వివాహం చేసుకోవాలి. పిల్లల్లో కూడా తేడాలు ఉండకూడదు, అందరూ సమానంగా కలిసికట్టుగా ఉండాలి. ఒకవేళ సాయంత్రం సమయంలో మీ గ్రామాలకు ఆటోలు, బస్సు లేకపోతే, లేటయినప్పుడు మాకు ఫోన్ చేస్తే మేం సహాయం చేస్తాం అని చెప్పారు.
ఎంపిపి మాట్లాడుతూ – నాలుగు గ్రూపుల్లో చర్చలు చాలా బాగా చేశారు. మీరు విన్న, చర్చించిన, ఈ విషయాలు అన్నీ మీ తల్లిదండ్రులకు, తోటి విద్యార్ధులకు చెప్పాలి. ఒక్కొక్కరు ఇంకో నలుగురికి సమాచారం అందించాలి. మీ గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతుంటే మాకు సమాచారం ఇస్తే మేము కూడా వాటిని జరగకుండా చర్యలు తీసుకుంటాము అని తెలియజేశారు.
జడ్పిహెచ్ఎస్-హెచ్ఎం(గర్ల్స్) మాట్లాడుతూ – భూమిక సంస్థ ఈ మండలంకు రాకముందు నేను కొన్ని బాల్య వివాహాలు ఆపగలిగాను. ఇంకా చాలా జరుగుతున్నా వాటిని ఆపలేకపోయాము. భూమిక వారు వచ్చాక మా స్కూల్లోనే 9 పెళ్ళిళ్ళు ఆపగలిగాం. వీరు బాల్య వివాహాలపై ఎక్కువ దృష్టిపెట్టి పనిచేస్తున్నారు. ప్రతి గ్రామంలోను బాల్య వివాహాలు జరగబోతే భూమిక వారు వాటిని ఆపారు అని తెలిసింది. మా స్కూల్ నుంచి కూడా ఈ విషయంలో మావంతు సహకారం అందజేస్తామని చెప్పారు.
స్కూల్ టీచర్స్ మాట్లాడుతూ – ఇలాంటి వేదిక ఎక్కడాలేదు. భూమిక వారు ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలకు ఈ ఫోరం ద్వారా మంచి సమాచారం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామస్థుల్లో ఇంకా వీటిపై మార్పు రావలసిన అవసరం ఉంది. కావున గ్రామాల్లో వీటిపై అవగాహన కల్పించాలి. ఈ ఫోరంకు స్కూల్స్ నుంచి కొంతమందే రావటంతో ఈ విషయాలన్నీ కొంతమందికే తెలిసాయి. మా స్కూల్స్‌లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే విద్యార్థులందరికి అవగాహన పెరుగుతుంది అన్నారు.
ఐకెపి-ఎపిఎం మాట్లాడుతూ – భూమిక సంస్థ ద్వారా పిల్లలకు మంచి విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బాల్య వివాహాలు గ్రామాల్లో జరుగుతున్నా మాకెందుకు అనే భావనతో ఉన్నారు. కావున వీటిపై ప్రతి ఒక్కర్లో మార్పు రావాలి. అలా చేయడానికి మా తరుఫున సపోర్టు ఇస్తామని చెప్పారు.
అధికారులందరూ మాట్లాడాక సమావేశాన్ని ముగిస్తూ భూమిక ఛీఫ్ ఫంక్షనరీ సత్యవతి మాట్లాడ్తూ ఈ విషయాలపై స్కూల్స్‌లో క్లబ్స్ మరియు బాలబాలికల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే పిల్లల సమస్యలు, ఆలోచనలు ఆ వేదికలో మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. గ్రామాల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ వీటిపై మా తరఫున అవగాహన కల్పిస్తాం. తల్లిదండ్రులతో సమావేశాలు చేసి చైతన్య పరుస్తాం. బాల్య వివాహాలు, బలవంతపు వివాహాలు జరగకుండా మీరందరూ సపోర్టు అందిస్తామనడం చాలా సంతోషకరమైన విషయం. మద్దూరు, దామరగిద్ద రెండు మండలాల్లో బాల్య, చిన్న వయస్సు వివాహాలు జరగకుండా చూడటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఈ రెండు మండలాలను ఆదర్శ మండలాలుగా చేయడానికి అందరం కలిసి నెట్‌వర్క్‌గా ఏర్పాటు అవుదాం అని అన్నారు.
పిల్లల వాయిసెస్ –
- ఈ ఫోరం ద్వారా మా అభిప్రాయాలను అందరికి తెలిసేలా చేయగలిగాం.
- ఇంకనించి కష్టపడి చదువుకుని క్రమశిక్షణతో ఎదుగుతూ పది మందికి ఆదర్శంగా మారుతాం.
- జన్మనిచ్చింది కన్నతల్లి అయితే, జీవితాన్ని ఇచ్చింది భూమిక.
ఈ మీటింగ్ తర్వాత మీటింగ్‌కు రాని గ్రామాలలోని స్కూల్స్‌కి వెళ్ళి ఓరియంటేషన్ చేయటం వల్ల రెనివెట్ల గ్రామంలో తొమ్మిది బాల్య వివాహాలను ఎంఆర్ఒ, ఎస్ఐ, ఐసిడిఎస్, చైల్డ్‌లైన్ వారి సహకారంతో వాయిదా వేయటం / ఆపటం జరిగింది. ఈ అన్ని కేసులలోను అమ్మాయిలు చదువుకోవటానికే ఇష్టపడటంతో వారు చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవటం జరిగింది.