రాజు సాహెబ్ బొగ్గు గనులలో మా సంఖ్య ఎక్కువగా
ఉంది. మా దగ్గర ఆధునికమైన అస్త్ర శస్త్రాలు లేకపోయినా మేం వాళ్ళని చంపగలుగుతాం. మైదానం అంతా శవాలతో నిండిపోయేది. గుండాలను తరిమికొట్టే వాళ్ళం. కాని మేం అందరం శాంతిని కాంక్షించాం. కార్మికులు వాళ్ళతో తలపడ్డారని కేసులు పెడితే తమని తాము రక్షించుకోడానికి మళ్ళీ కేసులలో ఇరుక్కోకుండా రక్షించాలన్న ఉద్దేశ్యం కూడా ఉంది. గనులని రక్షించుకోవడం కోసం వాళ్ళు ఏది చేయగలిగితే అదే చేస్తారు. కార్మికులు తక్కిన వాళ్ళకంటే నా మాటకు ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఈ కారణం వలన శ్రీబాబుకి నా ద్వారా స్ట్రైక్‌లపై యాజమాన్యం వారితో వ్యాపారం చేసే అవకాశం లభించలేదు. శ్రీబాబుకి ఇదే బాధగా ఉండేది. ఆయన ఒకసారి నన్ను సమ్మె విరమించుకోమని చెప్పారు. ఎందుకంటే కాంట్రాక్టర్ జీత్‌నాథ్ సింహ్‌తో ఆయన మాట్లాడారు. మా డిమాండ్లను స్వీకరించలేదు. అందువలన నేను ఒప్పుకోలేదు. ఆయన రెండు మూడు యూనియన్ల అధికారులను పిలిపించి నన్ను యూనియన్ సెక్రటరీ పదవి నుండి తొలగించాలని నోటీసు ఇచ్చారు. కార్య సమితి మీటింగు జరిగింది. ఆ మీటింగు జరుగుతున్నప్పుడు నేను కోర్టు నుండి స్టే – ఆర్డర్ తెచ్చాను. దీనివలన ఆయన కోపంతో ఊగిపోయారు. ఎందుకంటే ఆయన అనుకున్న పనులు చేసే అవకాశం ఉండదు. అక్కడ చేరిన గుంపుతో నా మీద దాడి చేయించారు. నన్ను కొట్టించారు. నేను జవాబు చెప్పే ప్రయత్నం చేసాను. నేను బాగా గాయపడ్డాను. అయినా నేను ఓడిపోలేదు. నాతోపాటు యూనియన్ కార్మిక కార్యకర్త సియారామ్ ఉన్నారు. ఆయన నన్ను విడిపించడానికి చాలా ప్రయత్నం చేసారు. ఆయన మూడో నంబర్ బ్లాక్‌కి మా యూనియన్‌కి సెక్రటరీగా ఉన్నారు. మొదట ఆయన అవాక్కు అయిపోయారు. ”దీనికి ప్రతీకారం ఇవాళే తీర్చుకుంటాము. మేం మిమ్మల్నందరిని తొలగిస్తాం. మీ జెండాని దించేస్తాం.” అని ఆయన అన్నారు.
ఆరోజే సియారామ్ కేదలా చౌక్‌లో సాయంత్రం ఒక జనసభకి పిలుపునిచ్చారు. సమ్మె విరమించలేదు. నాకు వ్యతిరేకంగా రచింపబడిన వ్యూహం గురించి అందరికి చెప్పారు. కార్మికులందరు కలిసి శ్రీ కృష్ణ సింహ్‌ని యూనియన్ నుండి తీసేసి, సోషలిస్టు పార్టీని వదిలి వేయాలని చెప్పి కార్యాలయంపైన తెల్ల జెండా పాతారు. యూనియన్ కోసం శ్రీకృష్ణ సింహ్‌కి వ్యతిరేకంగా కేసు వేసాము. ఇంత జరిగినా వాళ్ళు సమ్మెను విరమింప చేయలేక పోయారు. నేను మూడొంతుల పైగా కమిటీ మెంబర్లను హాజరు పరచి వాళ్ళ కమిటీ తీర్పును రద్దు చేయించాను. కోర్టు నావైపు తీర్పు ఇచ్చింది. ఈ విధంగా ఎన్నోసార్లు నన్ను యూనియన్ నుండి తీసేయాలని ప్రయత్నం చేసారు. కాని వాళ్ళకి ఓటమే దక్కింది. దీనికి కారణం కార్మికులందరు నావైపే ఉన్నారు. శ్రీకృష్ణ సింహ్ కోపంతో ఊగిపోయారు. యూనియన్ లోపల బయట ఉన్న క్షత్రియులందరు నాకు బద్ధ శత్రువులయ్యారు. బీహార్‌లోని క్షత్రియులలో టీమ్ పాలిటిక్స్ ఎక్కువ. ఈ కులం వాళ్ళల్లో ఎవరైనా పై పదవిలో ఉంటే తక్కిన వాళ్ళందరు తమే ఆ పదవులలో ఉన్నట్లుగా భావిస్తూ అందరిమీద అజమాయిషీ చేస్తారు. మండల్ ఉద్యమం తరువాత ఈ ప్రవృత్తే తక్కిన బహు సంఖ్యాకుల కులాల వాళ్ళలో కూడా మొదలయింది.
మేం సంయుక్త సోషలిస్టు పార్టీతో సంబంధం తెంపేసు కున్నాము. కర్పూర్ ఠాకూర్, జార్జ్‌ఫర్నాండిస్, మధులిమిమ్ అందరు వచ్చారు. నాతో మాట్లాడారు. వాళ్ళందరిని నేను ఒక ప్రశ్న వేసాను. ”మనం కార్మికుల కోసం పోట్లాడుదామా! లేకపోతే నేతల హితం కోసమా? మీరు శ్రీ కృష్ణ సింహ్‌ని పార్టీ నుండి తొలగిస్తేనే మేము ఈ పార్టీలో ఉంటాము. లేకపోతే ఏదో మార్గం వెతుక్కోవాలి. నేను శ్రామికులకు మాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయను. వాళ్ళని అమ్మనివ్వను.”
నేతల దగ్గర ఎటువంటి జవాబు లేదు. బీహారులో కులప్రధానమైన రాజనీతిలో క్షత్రియులదే పైచెయ్యి. వాళ్ళు ముంగేరు ఇంకా వేరే ప్రాంతాలలోని (ఇక్కడ ఎప్పుడూ సోషలిస్టు పార్టీయే గెలుస్తుంది) క్షత్రియులకు కోపం రాకుండా చూసుకుంటారు. ముంగేరుకి నేత అయిన శ్రీకృష్ణసింహ క్షత్రియుడు. ఝార్‌ఖండ్‌లో ఇంతకుముందు లేరు. నేను ఇక్కడికి వచ్చి సోషలిస్టు పార్టీని జనంలోకి తీసుకువచ్చాను. ఈ కులాహంకారం నన్నేకాదు, కర్పూరీ ఠాకూర్, జార్జ్ ఫర్నాండిస్‌లను కూడా దెబ్బతీసింది. ఈ పై కులాల నేతలు వాళ్ళు గెలిచినప్పుడు చాలా గొడవ చేసారు. కర్పూర్ గారిని, ముంషీలాల్‌దామ్, కొయిరీ కులానికి చెందిన ఎమ్.పి. చాలా ఏడిపించేవాడు. మధ్యలో జాలిక్ సాహెబ్ కూడా వారిని విరోధించడం మొదలుపెట్టాడు. తరువాత జార్జిని కూడా పైకి వస్తున్న యాదవుల పార్టీ నడిపించడం మొదలుపెట్టింది. ఆయనని బయట వ్యక్తి అని అంటూ మహారాష్ట్ర వెళ్ళమని చెబుతూ ఉండేవాళ్ళు. సరే ఏదైతే ఏం మేము పార్టీ నుండి బయటికి వచ్చేసాం. నేను ఎప్పుడూ శ్రామికవర్గం సుఖదుఃఖాలన్నింటిని నావే అని అనుకునేదాన్ని. అందువలన
వాళ్ళు బాధపడితే నాలో కోపం కట్టలు తెంచుకునేది. ఒక్కొక్కసారి ఆ కోపంలో ఏడ్చేసేదాన్ని. కాని తరువాత నన్ను నేను సంభాళించుకుని నడుంబిగించి రణరంగంలోకి దూకేదాన్ని.
ఈ బొగ్గు గనులలో కేవలం స్త్రీలకే కాదు పురుషులకి కూడా నిరంతరం సంఘర్షణ చేయాల్సి వస్తుంది. పురుషులు యూనియన్ లోపల తమతమ పెత్తనాల కోసం యుద్ధాలు చేస్తారు. స్త్రీలను ఒక్క క్షణంలో అణచిపారేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ గొప్పలకి పోతారు. అహంకారం చూపిస్తారు. కాని స్త్రీలు అనుకుంటే పురుషులను చిటికెలో ఓడించవచ్చు. అయినా జమీందారీతనాన్ని, గొప్పతనాన్ని చూపించడంకోసం నేను ఎప్పుడూ యుద్ధం చేయలేదు. ఆదర్శం కోసం చేసాను. శ్రామికులు డిమాండ్లను పూర్తి చేయడానికి ఒప్పందం చేయాలా? నేతలు, వాళ్ళ కులాహంకారం గల కాంట్రాక్టర్ల సుఖాల కోసమా? ఎప్పుడూ ఎదురుకుండా ఈ ప్రశ్నలు ఉండేవి.
పి.డి.అగ్రవాల్ దగ్గర బాబూ జోత్‌నాథ్ సింహ్, అఖిలేశ్వరసింహ్ (ముమాబాబు)లతోపాటు దాదాపు ఏభై అరవై మంది కాంట్రాక్టర్లు ఉండేవారు. ఝార్‌ఖండ్‌లో కేవలం ఐదుగురు కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు. తక్కినవాళ్ళంతా గుండాలు. ముఖ్యమైన ఇన్‌ఛార్జీలు కె.డి.సింహ, కే.పి.సింహ్, గోపాల్ ప్రసాద్ దగ్గర ఐదారుగురు కాంట్రాక్టర్లు ఉన్నారు. కాని మేం అందరం ఎంతో పోరాటం జరిపి గనులని సమభాగంగా చేయించగలిగాము. సమ్మె చేసి నంబరు 34 గనిని కూడా ఇదే ప్రకారంగా చేయించడంలో విజేతలయ్యాం. 1969-70 మధ్యలో సమ్మెలు జరిగాయి. ఆ సమయంలో రేజింగ్ కమ్ సైవింగ్, ప్రిన్సిపల్ కాంట్రాక్టర్లు, పెటీ కాంట్రాక్టర్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. కార్మికుల వేజ్‌బోర్డు ప్రకారం వేతనం అడిగారు. పెటీఠేకేదార్ (కాంట్రాక్టర్) ప్రిన్సిపల్ ఠేకేదార్లను రాయల్టీ ప్రతీ టన్‌కి 11 రూ||లకన్నా తక్కువ చేయాలని అడిగారు. ప్రారంభంలో మేము పెటీఠేక్‌దార్‌ల అసంతోషాన్ని కార్మికుల పోరాటంతో కలిపి వాళ్ళ ట్రక్కులలోనే శ్రామికులు ఊరేగింపుని తీసుకుని హజారీబాగ్ డెప్యూటీ కమీషనర్ సమక్షంలో పెద్ద ప్రదర్శనని ఇచ్చాము. మా నినాదం – ”కూలీ రేటు పెంచండి, ఠేకేదారుల రాయల్టీ తగ్గించండి”. ఈ విషయంలో ఎందరో ఠేకేదారులు, ముంషీలు సహాయం చేసారు. తరువాత ఈ పెటీ ఠేకేదారులతోటే పోరాడాలి అన్న సంగతి తెలుసు. అందువలన ప్రిన్సిపల్ ఠేకేదార్, పెటీ ఠేకేదారులను తొలగించి రోల్డ్ ఫీల్డ్స్‌ని విభాగీయం చేస్తే కార్మికుల కూలీ కూడా పెరుగుతుంది. అంటే పెట్టుబడిదారులకు – సర్వహరా వర్గానికి మధ్య ఈ దళారులు
ఉండకూడదు. ఆ లాభం శ్రామికులకి దక్కాలి. కార్మికుల కూలీరేటు 50 పైసలు పెరిగింది. అయినా ఇంకా పోరాటం చేయాలి. మా ప్రదర్శన తరువాత రాయల్టీ తగ్గిపోయింది. కాని పెటీ-ఠేకేదారులు శ్రామికుల వేతనం ఎక్కువ పెంచలేదు. మేము మా పోరాటాన్ని మరోవైపు తిప్పాం. దీనివలన పి.డి.అగ్రవాల్ అంటే ప్రిన్సిపల్ ఠేకేదార్లు శ్రామికులకు కొంత రాయితీలు ఇచ్చారు. కాని పెటీ-ఠేకేదార్లు తమ తెలివితేటలను ప్రదర్శించారు. వాళ్ళు ఠేకేదార్ల కోఆపరేటివ్ తయారుచేసారు. దానికి పేరు జ్యోడెక్ కంపెనీ. ఆయన ఈ కంపెనీ పేరు మీద రిసీవర్ నుండి సరాసరి కాంట్రాక్టు తీసుకున్నారు. అసలే మాకు ఒక యజమానితో పోరాటం సలపాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే కంపెనీలో వందమంది యజమానులతో, దీని ఫలితం మేం చాలా పోరాటం సలపాల్సి వచ్చింది. ఇది చాలా కష్టతరం.
తక్కిన ఖాళీగా పడి ఉన్న భూములన్నింటినీ ఠేకేదార్ల కోసం వదిలేసారు. సౌత్‌కేదలాలో చాలామంది ఠేకేదారులు వచ్చారు. వీళ్ళందరు గుండాలే. వెస్ట్ బొకారో కోల్ ఫీల్డ్‌ల కార్మికులు, కార్మికుల నేతలు ఝరనాలో రిసీవర్ నుండి ప్లాట్లు తీసుకున్నారు లేకపోతే ఎవరో ఒక ఠేకేదార్ల దగ్గర పెటీ-ఠేకేదారీ చేసారు.
ఒకసారి కేదలాలో ఠేకేదార్లందరు తమతమ గుండాలను తీసుకుని వచ్చారు. సమ్మెను విరమింపచేయడానికి ప్రయత్నించారు. వాళ్ళల్లో ఈనాడు కొందరు మేనేజర్లు అయ్యారు. కొందరు కోల్ ఇండియా ఆఫీసర్ల యూనియన్లకి లీడర్లు కూడా అయ్యారు. లయియో కోల్‌ఫీల్డ్‌లో ఇట్లాగే ఠేకేదార్లకు నేత అయిన సి.పి.ఐ. నేత శర్మగారు కూడా ఉండేవారు. ఆయనే తరువాత నక్సలైట్ల చేతుల్లో చచ్చిపోయారు. వీరిని కార్మికులు సాహెబ్ అని పిలిచేవాళ్ళు. వీళ్ళు కార్మికులను కొట్టేవాళ్ళు. లైయియో శర్మగారు, ఎస్.సి.సింహ్‌గారు (మేనేజర్ మైనింగ్ ఇంజనీర్, రాజ్‌పుత్ కులం) తక్కిన మైనింగ్ ఇంజనీర్లతో కలిసి వేరే కంపెనీని ఏర్పాటు చేసారు. రిసీవర్ నుండి డైరెక్ట్‌గా కాంట్రాక్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళందరు మైనింగ్ సురక్షను ఏమాత్రం చూడకుండా ఏ చట్టాన్ని చూడకుండా కేవలం లాభాల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు. నంబరు 34 గనిని వాళ్ళు తీసుకోవాలనుకున్నారు. అక్కడ మాకు బలమైన యూనియన్
ఉంది. పునీరామ్ మామగారు అందరినీ ఎదిరించి ఈ యూనియన్‌ని తయారుచేసారు. ఎస్.పి.సింహ్ శర్మ, శ్రీకృష్ణసింహ్‌తో చేతులు కలిపారు.
శ్రామికులు పునీరామ్ వర్మా నేతృత్వంలో నంబరు 34 కోల్ ఫీల్డ్‌ని విభాగీయకరణ చేయడానికి ఉద్యమం మొదలుపెట్టారు. మేమందరం ఈ కోల్‌ఫీల్డ్‌ని తన అధీనంలోకి తీసుకుని విభాగీయకరణ చేయాలని రిసీవర్ పైన ఒత్తిడి తెచ్చాము. ఒకరోజు
అకస్మాత్తుగా లయియో శర్మాజీ, ఎస్.పి.సింహ్‌లు, మేనేజర్, నంబర్ 34 పోఖిరీ పైన దాడి చేసాడంటూ అతడిని చుట్టుముట్టారు. నాకు వార్త రాగానే నేను బయలుదేరి వెళ్ళిపోయాను. కార్మికులతో మాట్లాడి పోలీసులకి తెలియచేయమని నేను పునీరామ్‌కి చెప్పాను. ”పోలీసులు వచ్చారు కాని వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపారు. ఘాటో నుండి కొందరు మా సహాయానికి రావచ్చు. మేం అందరం వాళ్ళకోసమే ఎదురుచూస్తున్నాం.”
దూరంగా కొండమీద కొంతమంది ఠేÄకేదార్లు నిల్చుని
ఉన్నారు. వాళ్ళ దగ్గర లాఠీలు, బల్లాలు ఉన్నాయి. నంబరు 34 పోఖిరీ కార్మికులందరు విలాస్‌పూర్‌కి చెందినవాళ్ళు. పునీరామ్ వర్మా, ఆయనతోపాటు యువకులు నుదుటిన తిలకం దిద్దుకున్నారు. చేతులలో బల్లాలు పట్టుకుని నినాదాలు చేసారు. ఇంతలో గుండు దూసుకుపోయింది. భగవాన్ సింహ్ నన్ను వెంటనే పక్కకి తోసేసారు. గుండు నా చెవుల పక్కనుండి దూసుకువెళ్ళింది. ఒకవేళ భగవాన్‌సింహ్ నన్ను పక్కకి తోసి ఉండకపోతే బహుశ నేను ఈనాడు రాయడానికి జీవించి ఉండేదాన్ని కాదు. కొందరు కార్మికులు ఆపదను పసికట్టారు. నన్ను లాగేసి జీపులో కూర్చోపెట్టారు. ఈవిడని సరాసరి హజారీబాగ్‌కి తీసుకువెళ్ళండి. డి.సి. దగ్గరకి గాని, ఎస్.పి. దగ్గరికి కాని తీసుకు
వెళ్ళు. ఈవిడ బతికి ఉంటేనే మన ఉద్యమం బతుకుతుంది. లేకపోతే మనం అందరం అనాథలై పోతాము” అని అన్నారు.
నన్ను సరాసరి హజారీబాగ్‌కి పంపించి వేసారు. డి.సి.ఎన్.పిలు లవలేదు. ఎస్.డిలో తపేశ్వర్ ప్రసాద్‌ని కలిసాను. ”అక్కడ మెజిస్ట్రేట్ లేడు. పోలీసులు ఠేకేదారులతో చేతులు కలిపారు. వాళ్ళ ఎదురుకుండానే పిస్తోళ్ళు పేలుతున్నాయి. అయినా పట్టించుకోలేదు. అసలు ఎంతమంది చచ్చిపోయారో నాకు తెలియదు.” ఆ గుండాలు వాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు చేసారో ఏమో. మీరు వెంటనే మేజిస్ట్రేట్‌కి వైర్‌లెస్ పంపించి కార్మికులను రక్షించమని సందేశం పంపించండి” అని నేనన్నాను.
నేను వెంటనే నంబరు 34 కోల్‌ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళందరు కార్మికుల నివాసస్థానాలపై దాడిచేసి ఆడవాళ్ళని అవమానపరిచారని సామాన్లు విరగగొట్టారని తెలిసింది. మా కార్మికుల నేత పునీరామ్‌ని వాళ్ళు ఎత్తుకువెళ్ళిపోయారు. పునీరామ్ తల్లి నా కాళ్ళు పట్టుకుంది – ”నా కొడుకును రక్షించు తల్లీ” అని ఏడ్చింది.
నేను బాలా సింహ్‌ని తీసుకుని సరాసరి గుండాల అడ్డాదాకా వెళ్ళాను. పోలీసులు వాళ్ళతో చేతులు కలిపారు. అక్కడ అప్పటిదాకా ఏ మెజిస్ట్రేట్ రాలేదు. పునీరామ్‌ని తీసుకువచ్చారు. కాని శర్మ తన గుండాలను కూడా తెచ్చారు. పునీరామ్ భయం వలన నా కారులో కూర్చోడానికి ఇష్టపడలేదు. తను నా కారులో కూర్చుంటే బాంబుతో కారును ఎగరగొట్టేసే ప్లాను వాళ్ళు వేసారని ఆయనకి తెలుసు. ”నన్ను ఒక్కడిని మా ఇంటికి చేర్చండి. నేను యూనియన్‌ని ఏర్పాటు చేయను. నేను నా ఊరికి వెళ్ళిపోతాను” అని ఆయన అంటూనే ఉన్నారు. ఏదో అపాయం జరగబోతోందని అందుకే ఆయన అట్లా అంటున్నాడని నాకనిపించింది. ఈయనని విడిగా ఆయన ఇంటికి పంపించాలని నేను ఇన్‌స్పెక్టర్‌కి చెప్పాను. నన్ను వెనక్కి పొమ్మనమని ఆయన ఎన్నోసార్లు ప్రాధేయపడ్డారు. ఇంతలో శర్మ గుండాలు నా కారుపై లాఠీలు విసిరివేయడం మొదలుపెట్టారు. నేను తలుపు తెరిచి బయటకి దూకుదా మనుకున్నాను. బాలాసింహ్ ఆపేసాడు. శర్మ కిటికీలోంచి నాగొంతు పట్టుకున్నాడు. బాలాసింహ్ కారు గ్లాసులను మూయడం మొదలుపెట్టాడు. శర్మ చేయి మధ్యలో ఇరుక్కుపోయింది. బాలాసింహ్ డ్రైవర్‌ని ముందుకు పోనీయమని చెప్పాడు. నేను కారుని ఆపి దిగుదామని ప్రయత్నం చేస్తున్నాను. పోలీసు హవల్‌దార్ నన్ను వెళ్ళిపొమ్మనమని ప్రాధేయపడసాగాడు. వెనక నుండి కారు మీద లాఠీలు పడుతూనే ఉన్నాయి. ”పునీరామ్‌కి ఏమైనా అయిందంటే చూసుకోండి మిమ్మల్ని వదలం” అని వాళ్ళను బెదిరించాను. బాలాసింహ్ ‘కారుని పోనీయి’ అని పెద్దగా అరిచాడు. డ్రైవర్ కారుని ముందుకి పోనిచ్చాడు.
మేం మళ్ళీ నంబరు 34 కోల్‌ఫీల్డ్ దగ్గరికి వచ్చాము. నా మీద దాడి జరిగిందన్న వార్త కేదలా నలువైపులా వ్యాపించింది. నలువైపుల నుండి శ్రామికులు రావడం మొదలుపెట్టారు. వాళ్ళు దాడి చేయకుండా నేను రణనీతిని తయారుచేయాలి. దాడి జరగడం అంటే గుండాలతో శ్రామికుల పోరాటం, హత్యలు, రక్తపాతాలు. దీనివలన సమ్మె ఆగిపోతుంది. పోరాటం తీరే మారిపోతుంది. నేను వాళ్ళని ఎంతో అడ్డగించా. కాని వాళ్ళందరు ఝార్‌ఖండ్ దాకా వెళ్ళారు. ఎందుకంటే శర్మ మధ్యదారిలో కనిపిస్తే ఆయనని చంపేయవచ్చని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ రాత్రి పోలీసుల సహాయంతో శర్మ, ఆయన తోటివాళ్ళు తప్పించుకున్నారు. బి.డి.వో మాండూ అక్కడికి చేరారు. ఆయన మా మాట మన్నించి స్వయంగా వెళ్ళి పునీరామ్‌ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ రోజు పోలీసులు ఎంత ప్రయత్నించినా కార్మికుల భయం వలన అరెస్ట్ చేయలేకపోయారు. కార్మికులందరు కలిసి రాత్రికి రాత్రి కొండ దగ్గర నుండి కేదలా కోల్‌ఫీల్డ్ వరకు రోడ్డు వేసారు. వాళ్ళు నా కారుని మెయిన్ రోడ్డు నుండి తీసుకువెళ్లి కొండపైదాకా ఎక్కించారు. నేను ఠేకేదార్ల ఎదురుపడకుండా 34 నంబరు కోల్‌ఫీల్డ్ వెనక నుండి కార్మికుల ద్వారా తయారుచేయబడ్డ రోడ్డు నుండి కేదలా చేరాలని వాళ్ళ ఉద్దేశ్యం.