భారతదేశంలో ఎస్సీ కులాలకు ఆస్తులుండవు. ఆస్తుల్లేని సమూహాలు అంటరాని కులాలు. ఆ సమూహాల్నించి వచ్చిన మాకు స్వంతాస్తుల మీద ధ్యాస, మోజు లేదు. అందులో కమ్యూనిస్టు నేపధ్యాలు వున్నందున స్వంతానికి కూర్చుకునే శ్రద్ధ పూర్తిగా ఎండిపోయింది. అందుకే ఉద్యోగం చేయబట్టి దాదాపు ముప్పయ్యేండ్లవుతున్నా సొంత యిల్లు లేదు. మా ఆఫీసుల సొంతిల్లు లేని ఉద్యోగులు లేరు. చిన్న చిన్న ఉద్యోగులక్కూడా రెండు మూడిండ్లున్నయి. మా దోస్తులు, చుట్టాలు ‘యిన్నేండ్ల నుంచి ఉద్యోగం జేస్తున్నవు, సొంత యిల్లు వుంచుకోవా!’ అని అంటుంటరు. కొందరు ‘సొంతిల్లు’ లేదా నిజమా అని ఆశ్చర్యపోతుంటరు. కాని బైట సొంతిండ్లు వున్న వాల్లకన్నా లేని వాల్ల జాబితా జనాభే ఎక్కువ. వాల్లల్లో నేనుండడం నాకు సంతోషమే. నిజానికి నా అంతరంగంలో లేకపోవడమే సుఖమని అనుకుంటాను. సొంతిల్లు లేదని ఎద్దేవా చేసినా పట్టించుకోలేదు. అట్లాంటి ఆలోచనలతో, స్వంతాస్తులకు వ్యతిరేకంగా వున్న మాకు మా యింటిపక్క జరిగిన సంఘటనతో సొంతిల్లు వుండాల్సిందే, వారానికి ఒక పూట తిన్నా సొంతిల్లు ఏర్పాటు చేస్కోవాలని ఒక నిర్ణయాని కొచ్చాము.
యింతకి మాకు సొంతిల్లు కావాలనే యీ సంఘటనేంటంటే మా యింటి పక్క యింట్ల భార్య భర్త యిద్దరు పిల్లలుంటున్నరు కిరాయికి. దాదాపు పదిహేనేండ్ల నుంచి వుంటుండ్రు కిరాయికి. అయితే ఆ భర్తకు గుండె సమస్యతో ఆస్పత్రిలో చనిపోయిండు (50 సం||లుంట యేమో). ఇంటి ఓనర్లు శవాన్ని ఇంటికి తీసుకొని రావద్దు అని గొడవ బెట్టిండ్రు. అంబులెన్స్‌లో ఒక పూటంత రోడ్డు మీద వుంచితే తెల్సిన వాల్లమందరము పొయి చూసొచ్చినము. ఆ కుటుంబము విజయవాడ నుంచి వచ్చి యిక్కడ వుంటున్నరు. వేరే వాల్లు ఓనర్లకు చెప్పే ధైర్యమే చేయలే… గట్టిగ మాట్లాడనీకి వాల్ల సొంతిల్లుగాదు. బిచ్చానికిబొయి ఆమిల్లు కర్సినట్టే వుంటది. ఆ భార్యకు భర్త చనిపోయిన దుక్కంకంటే యింటి ఓనర్లు తన భర్త శవాన్ని యింటి ముందటికి రానివ్వని దుక్కమే ఎక్కువైంది.- విజయవాడ వాల్ల సొంత వూరు. అక్కడ కూడా వాల్లకు సొంతిల్లు లేదట. అసలు వాల్లకు సొంతిల్లు ఎక్కడ లేదట. వాల్ల కుటుంబాలు కూడా శవాన్ని తీస్కరావడానికి అభ్యంతర పెట్టిండ్రాట. సొంత అన్న దమ్ములు, అక్క చెల్లెండ్లు కూడా నసిగిం డ్రట.- చివరికి ఆమె విజయవాడలో వున్న సత్రంలో పెట్టి దహన సంస్కారాలు చేసి పదిహేను రోజులుండి కర్మకాండలు చేసి వచ్చినంక వాల్లను ఓనర్లు ఖాళి చేయించారు యింటిని.
యీ సంఘటన చుట్టు పక్కల వున్న కిరాయికుండేవాల్లు చాలా బాధప డిండ్రు. మాకు ఆ సంఘటన నిద్రబట్టనీ యలే. సొంతిల్లు లేకుంటె యింత కష్టం, దుక్కం వుంటది, అవమానముంటది మనిషికి సొంతిల్లు, సొంతగూడు ఆస్తి కిందకు రాదు ఆత్మగౌరవంగా చూడాలి. డబ్బులిస్తున్నం యింట్ల వున్నందుకు అనడానికి లేదు. యింటి ఓనరు దయాదాక్షిణ్యాల మీద వుండాలి. వాల్లక్కోప మొచ్చినా, నచ్చకున్నా వెళ్లిపొమ్మంటరు. వూర్కూర్కే యిండ్లు ఖాళి చేసుడు మాటలు గాదు. అందులో ఆడవాల్లకు చెప్పనలవిగాని కష్టం. ఏడిండ్ల పిల్లి కూనలు తిరిగినట్లు తిరగాలె. ప్రతిసారి ‘ఓనర్లు ఎట్లాంటోల్లో ఏమో’ అనుకుంటా… అనుమాన బెంగలతో దిగాలె. యిక మాదిగలు చిన్న కులాలోల్లంటే యింకా లోకువ, చిన్న చూపు, యిండ్లియ్యరు. ఎద్దు కూర తింటరు, అని కిందకి మీదికి చూస్తరు. వీల్ల కనిపించని యీ మానసిక హింసలు అణచివేతలతో మా తిండి మేందినుడు గూడ దొంగతనమే. ఎద్దుకూర, పందికూర వండుకొని ‘ఏమొండిండ్రంటే… ‘మటన్’ అని చెప్తాం గానీ ‘బీఫ్’ అనీ, ‘పోర్క్’ అని ఎందుకు చెప్పనివ్వని అసహనాల్ని మేము నిత్యం ఎదుర్కొనడం అవమానపడ్డం జరుగుతుంటది. యివన్ని ఎందుకని యిష్టమైన బీఫ్‌ని తినడమే మానేసినం. అదే సొంతింట్ల అయితే యీ బాదలుండయి గదా! సొంతిల్లు ముఖ్యంగా మాలాంటోల్ల కుండాల్సిందే…